top of page

జీవిత చిత్రాలు - 5

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-5-telugu-web-series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 05/03/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య.

యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు. 

భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజులు పనిమీద ఛత్తీస్ ఘడ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దార్లో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు.



ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఐదవ భాగం చదవండి.


ఒంటరిగా ఇంటికి చేతిన నన్ను చూచి.. బాబాయ్, పిన్ని ఆశ్చర్యపోయారు. ఆత్రంగా కిరణ్ భాషాలను గురించి అడిగారు.


కన్నీటితో జరిగిన సంఘటనను గురించి వారికి తెలియజేశాను.


బాబాయ్ వదనం గంభీరంగా మారిపోయింది. పిన్ని భోరున ఏడుస్తూ.. “వాళ్ళు అడిగిన డబ్బును వాళ్ళ ముఖాన కొట్టి.. నా బిడ్డను క్షేమంగా తీసుకొని రండి" అంది.


"శాంతీ!.. భయపడకు.. బాధపడకు. వాళ్ళు మన వాళ్ళను ఏమీ చేయరు. వాళ్ళకు కావలసింది డబ్బు. ఆ డబ్బును ఇచ్చేస్తే.. వారు, కిరణ్‍న్ని, భాషాను వదిలేస్తారు. వాళ్ళల్లో కూడా చదువుకొన్న వాళ్ళు వున్నారు. కలిమి లేములకున్న వ్యత్యాసం.. కలవారు లేని వారిని హింసించి హీనంగా చూచిన కారణంగా నక్సల్స్ అన్న పేరున మరో జాతి తయారైంది. మనలాగే వారూ.. ఈ దేశంలో పెద్ద కుటుంబాల్లో పుట్టినవారే. అనాదిగా సాగుతున్న కలిమి లేముల సంఘర్షణ.. కొందరిని అలా మార్చింది.


మానవత్వాన్ని విస్మరించి స్వార్థంతో అమానుషత్వంతో వ్యవహరించే కలవారు వారికి శత్రువులు. వారు.. అరణ్యవాసులు.


ప్రభుత్వ ప్రతినిధులు.. ఆ నాయకులతో చర్చలు జరిపారు. వారిని సాధారణ పౌరులుగా అడవులను వదలి అందరితో కలిసి సహాజీవనం చేయవలసిందిగా వారిని కోరారు. కొందరు ప్రభుత్వ సూచనలను గౌరవించి అడవులను వదిలారు. కొందరికి ప్రభుత్వ సూచనలు నచ్చక.. అడవులకే పరిమితమై పోయారు.


ఏది ఏమైనా.. వారూ మనలాంటి మనసున్న మనుషులే. వారిని ఆదరించడం, అభిమానించడం, వారి తత్వాల్లో మార్పును ఆశించడం.. ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారితే.. వారు తప్పక మనలో కలిసిపోగలరు" చిరునవ్వుతో చెప్పాడు బాబాయిగారు.


"నాకు కావలసింది వారి చరిత్ర కాదండీ. నాకు నా బిడ్డ కావాలి" రోదిస్తూ బొంగురు పోయిన కంఠంతో చెప్పింది పిన్ని.


"వారు చెప్పిన టైముకు నేను చిన్నా.. వారు నిర్దేశించిన ప్రాంతానికి వెళతాము. వారు కోరిన డబ్బును ఇస్తాము. మన కిరణ్, భాషాలతో తిరిగి వస్తాము. నీవు భయపడకు శాంతీ. నా మాటలను నమ్ము" అనునయంగా చెప్పాడు బాబాయ్.


వారి మాటలు పిన్నికి కొంత వూరటకు కలిగించాయి.

"అవును పిన్నీ!.. వాళ్ళ లీడర్.. ’మీ వాళ్లను మా గెస్టుల్లా చూచుకొంటాం’ అని చెప్పాడు. మీరు భయపడకండి."


"ఏమో నాయనా!.. మీరు వెళ్ళి కిరణ్‍న్ని తీసుకొని వచ్చేవరకూ నాకు స్థిమితం వుండదు" విచారంగా చెప్పింది పిన్ని.


"శాంతీ!.. నా మాట నమ్ము. వాళ్ళు మన వాళ్ళను ఏమీ చేయరు"


పిన్ని.. బాబాయి, నా మాటలను నమ్మినట్లుగా.. విచారవదనంతో తలాడించింది మౌనంగా వెళ్ళిపోయింది.

*

వారు చెప్పిన టైముకు పావుగంట ముందుగానే.. నేను బాబాయ్, మూడు లక్షల డబ్బుతో ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో చేరుకున్నాము.


కారును రోడ్డు ప్రక్కగా నిలిపి.. నేను కారు దిగి దాని ప్రక్కనే నిలబడ్డాను. బాబాయ్ వెనుక సీట్లో కూర్చున్నారు.


పదిహేను నిమిషాల తర్వాత రెండు బైక్స్ మా కారువైపు రావడాన్ని గమనించాను.

"బాబాయ్!.. వాళ్ళు వస్తున్నారు" అన్నాను.


"రానీ చిన్నా.. భయపడకు."


బాబాయ్‍కి.. వారి పట్ల వున్న నమ్మకానికి.. వారి ధైర్యానికి.. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది.

వారు.. కారును సమీపించారు, ఆపి దిగారు. నన్ను సమీపించారు.

వచ్చింది ఆ రోజు నా కార్లో కూర్చొని కొంతదూరంలో దిగిపోయిన ఇద్దరే.

"నీవు ఒక్కడివే వచ్చావా.. నీతో వేరే ఎవరైనా వచ్చారా!" లీడర్ అడిగాడు.


"నాకు తోడుగా మా బాబాయి వచ్చారు"


ఇంతలో.. బాబాయి కారునుండి దిగారు. మమ్మల్ని సమీపించారు.

"వీరేనా మీ బాబాయ్?" లీడర్ గారి ప్రశ్న.


"అవును"


"సార్!.. ప్రతి మనిషీ తన జీవిత కాలంలో మాట మీద నిలబడి బ్రతకడం ధర్మం. మీరు కోరిన సొమ్మును మేము తెచ్చాము. మా వాళ్ళేరి?" బాబాయ్ అడిగారు.


"వాళ్ళు ముందున్నారు" లీడర్ జవాబు.


"మా వాళ్లను మాకు అప్పగించండి. డబ్బును తీసుకోండి" తన చేతిలో వున్న సూట్ కేసును వారికి చూపించాడు.


"మేము డబ్బును చూడాలి" లీడర్ చెప్పాడు.


కార్‍పై సూట్‍కేసును వుంచి తెరిచి చూపించాడు బాబాయ్.

వాళ్ళు ఆ డబ్బును చూచి ఆశ్చర్యపోయారు.

"మీ పెద్ద అబ్బాయి చాలా మంచివాడు" నవ్వుతూ చెప్పాడు లీడర్ నన్ను చూస్తూ.


"నా దృష్టిలో మీరూ మంచివారే!" బాబాయి గారి సమాధానం.


"మీరు కార్లో కూర్చోండి. మా వెనకాలే రండి" చెప్పాడు లీడర్.


నేను.. బాబాయ్ కార్లో కూర్చున్నాము. వాళ్ళిద్దరూ బైక్స్ ఎక్కి ముందుకు పోసాగారు.

నేను కారును బైక్స్ వెనకాలే నడిపాను. పదిహేను నిమిషాల తర్వాత.. బైక్స్ ను రోడ్డు ప్రక్కన ఆపి వారు దిగారు.


నేను.. కారును రోడ్డు ప్రక్కగా ఆపాను. లీడర్ చీటీ కొట్టాడు.

పది నిముషాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్యన.. కిరణ్, భాషాలు వచ్చి మమ్మల్ని సమీపించారు.

"ఈ సూట్‍కేసును తీసుకోండి" చూపిస్తూ లీడర్‍తో చెప్పాడు బాబాయి.


లీడర్ సూట్‍కేసును అందుకొన్నాడు.

"మేము మా మాటను నిలబెట్టుకొన్నాము. మీరు మీ మాటను నిలబెట్టుకొన్నారు. థాంక్యూ!" చిరునవ్వుతో చెప్పాడు బాబాయ్.


"థాంక్యూ సార్!" మెల్లగా చెప్పాడు లీడర్.


మమ్మల్ని చేరిన కిరణ్.. భాషా కళ్ళల్లో ఎంతో ఆనందం.

వారిని చూచిన బాబాయ్.. "ఇద్దరూ కార్లో కూర్చోండి" అన్నారు.


వారిరువురూ కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నారు.

"ఇక మీరు నిర్భయంగా వెళ్ళండి సార్!" చెప్పాడు లీడర్.


"మీరు ముసుగు తీస్తే.. నీ ముఖాన్ని పూర్తిగా చూచి, నీకు ఓ మంచి మాట చెప్పాలని వుంది" లీడర్‍ను చూస్తూ చెప్పాడు బాబాయ్.


అతను ఆశ్చర్యపోయాడు. ఆ భావన అతని కళ్ళల్లో నాకు గోచరించింది.

అతను బాబాయిని సందేహంగా చూచాడు.

మీరు ముసుగు తీయకపోయినా.. నేను నీకు చెప్పదలచుకొన్న మాటను చెబుతున్నాను మీ మంచికోసం. మీరు మావారి రెండు ప్రాణాలకు కట్టిన ఖరీదు.. మూడు లక్షలు. యధార్థం చెప్పాలంటే.. కొన్ని కోట్ల డబ్బు అయినా.. ఒక్క ప్రాణంతో సమానం కాదు. డబ్బు ప్రాణాన్ని ప్రసాదించలేదు. సృష్టించలేదు.


మీలో వున్నది ప్రాణమే.. మాలో వున్నది ప్రాణమే.. ఈ ప్రాణం వున్నంతవరకే.. మీరు కానీ.. మేము కానీ ఏదైనా చేయగలం. ప్రతి మనిషికీ ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరాలు రెండు.. జ్ఞాపకశక్తి, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం.


సాటివారి పట్ల మనం చూపించే ప్రేమ, సౌభ్రాతృత్వం.. మనలకు అందరినీ దగ్గరకు చేర్చుతాయి. ద్వేషం.. ప్రతీకారం.. ఇవి రెండూ మనలను అందరికీ దూరం చేస్తాయి.

నేరం చేసిన వాడు జైలు శిక్షను అనుభవించాలి. అనుభవిస్తాడు. సాటివారి పట్ల మీలో వున్న ద్వేషం మిమ్మల్ని జంతువుల్లా మార్చి అడవుల్లో తలదాచుకొనేలా చేసింది.


మీకు మాకు ఆకారాల్లో.. ఏ తేడా లేదు. తేడా వున్నది మీ మనసుల్లో. క్షమాగుణం అన్నింటికన్నా గొప్పది. ద్వేష చింతన అన్నింటి కన్నా హీనమైంది.


ఎవరో కొందరు మీపట్ల అనుచితంగా వర్తించారని సభ్య సమాజాన్ని వదలి అందరి పట్లా ద్వేషాన్ని పెంచుకొని.. అడవుల్లో బ్రతికే బ్రతుకు.. బ్రతుకు కాదు. మీలోని మంచితనాన్ని ఎదుటివారు అర్థం చేసుకోవాలంటే.. మీరు శాంతి సహనాలతో జన సముదాయంలో వుండాలి. సమస్యలను మంచి ఆలోచనలతో ఎదుర్కోవాలి. మీ నిజాయితీని నిరూపించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు.. మంచి మనిషిగా బ్రతకాలి. మంచిని సమాజంలో పెంచాలి.


ఏదో.. మీ విషయంలో నాకు తోచిన భావాన్ని చెప్పాలను కొన్నాను. చెప్పాను. ఆలోచించండి. నా మాటలు మీకు తప్పుగా తోస్తే.. నన్ను క్షమించండి" చేతులు జోడించి బాబాయి కార్లో కూర్చున్నాడు.


నేను డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాను. ఆ నలుగురూ.. బిక్క ముఖాలతో మమ్మల్ని చూస్తూ వుండిపోయారు.


మా బి.టెక్ కాగానే బాబాయి.. నన్ను, కిరణ్ని ఎం.టెక్ చేసేదానికి అమెరికా పంపించారు. చదవడం ముగించి అక్కడే ఇరువురం ఉద్యోగాల్లో చేరాము.

*

"అన్నయ్యా!.. గంట ఐదు. టీ తేనా!" గదిలోకి వస్తూ అడిగింది సుధ.

నా కథను వింటున్న భాస్కర్ తొట్రుపాటుతో చేతి వాచ్‍ని చూచి..

"ఆఁ.. తీసుకురామ్మా!" అన్నాడు.


సుధ.. పరీక్షగా మా ఇరువురి ముఖాలను క్షణంసేపు చూచి.. వెళ్ళిపోయింది.

ఐదు నిముషాల్లో.. టీ కప్పులతో లోనికి వచ్చి ఒకటి నాకు మరొకటి భాస్కర్‍కు అందించింది.

ఇరువురం.. టీ త్రాగాము. ఖాళీ కప్పులను తీసుకొని సుధ వెళ్ళిపోయింది.

భాస్కర్ సెల్ మ్రోగింది.

"హలో!.. హాస్పిటల్ నుంచి కాల్ రా" అని నాతో చెప్పి..

"ఆఁ.. చెప్పండి"

..

"ఏమిటీ.. యువరాణికి యాక్సిడెంటా!" ఆశ్చర్యంతో అడిగాడు భాస్కర్.

..

"సరే, నేను వస్తున్నాను" సెల్ కట్ చేసి..

"ఆది.. యువరాణికి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జంటుగా హాస్పిటల్‍కు వెళ్ళాలి" వేగంగా లేచాడు.


"నేనూ నీతో రానా!" అడిగాడు ఆది.


"నీ ఇష్టం, రావాలనుకొంటే రా!" వేగంగా తన కారును సమీపించాడు.


ఆది అతన్ని అనుసరించాడు. ఇరువురూ కార్లో.. పది నిముషాల్లో హాస్పిటల్‍కు చేరారు.

అప్పటికే.. హాస్పిటల్ స్టాఫ్ యువరాణిని స్ట్రెచ్చర్ మీద గదిలోకి చేర్చి.. ఆమె ముఖానికి, చేతికి, కాలికి తగిలిన గాయాలను క్లీన్ చేస్తున్నారు.


భాస్కర్ వేగంగా ఆ గదిలోనికి ప్రవేశించాడు. అతని అసిస్టెంట్ ప్రక్కకు జరిగాడు. ఆది కూడా ఆ గదిలో ప్రవేశించాడు.


యువరాణి కాలికి, చేతికి, ముఖం కుడివైపున గాయాలు. ఆమె స్పృహ కోల్పోయింది.

భాస్కర్ ఆమెకు ఒక ఇంజక్షన్ చేశాడు. నర్స్ అతని అసిస్టెంట్ గాయమైన ప్రాంతాల్లో వున్న రక్తాన్ని టించర్ కాటన్‍తో శుభ్రపరిచారు.


చేతిని కాలిని భాస్కర్ పరీక్షించాడు. చేతికి ఫ్యాక్చర్ అయ్యింది అన్నాడు.

అరగంట లోపల కాలికి చేతికి మందులు వేసి కట్లు కట్టాడు. ఆ గది నుంచి మరో గదికి యువరాణిని మార్పించాడు.


భాస్కర్ చేసే ప్రతి పనినీ ఆది ఏకాగ్రతతో గమనించాడు. అతను.. అసిస్టెంట్లు గడిచిన అరగంట సేపు యంత్రాల్లో పనిచేసిన తీరు ఆదికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.


అపాయంలో వున్నవారిని కాపాడే దానికి డాక్టర్లు, నర్సులు.. ఎంతగా శ్రమిస్తారన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూచాడు ఆది. ’మానవసేవే మాధవ సేవ’ అనేదానికి ఆ వృత్తి నిర్వహించే వారు ప్రత్యక్ష సాక్షులు అనుకొన్నాడు ఆది.


విషయాన్ని విన్న మన్మధరావు.. అతని భార్య గంగమ్మ హాస్పిటల్‍కు ఏడుస్తూ వచ్చారు.

భాస్కర్ చేతులు పట్టుకొని మన్మధరావు..


"బాబూ!.. నా బిడ్డని కాపాడు బాబు..నా బిడ్డని కాపాడు" భోరున ఏడుస్తూ అడిగాడు.


గంగమ్మ కన్నీరు కార్చుతూ భర్త పక్కన నిలబడి భాస్కర్ ముఖంలోకి దీనంగా చూస్తూ ఉంది.

"ఏం భయంలేదు. ట్రీట్మెంటు చేశాను. ఓ గంటలో స్పృహ వస్తుంది." అనునయంగా చెప్పాడు భాస్కర్.


అసిస్టెంట్ డాక్టర్ వచ్చి..

"సార్!.."


"చెప్పు శ్రీకాంత్!"


"చాలా రక్తం పోయింది. ఒక బాటిల్ రక్తం ఎక్కిస్తే.. త్వరగా స్పృహ వచ్చే దానికి వీలౌతుంది కదా సార్!" అన్నాడు.


"పల్స్ రేటు పెరగడం లేదా!"


లేదు అన్నట్లు శ్రీకాంత్ తలాడించాడు.

"ఆమె బ్లడ్ గ్రూప్ ఏమిటి?"


"ఓ పాజిటివ్ సార్!"


"మన దగ్గర స్టాక్ లేదు కదూ!.."


"అవును"


వీరి మాటలను విన్న ఆది..

"భాస్కర్ బ్లడ్ కావాలా!" అడిగాడు.


"ఓ పాజిటివ్ కావాలి. అది మా దగ్గర లేదు."


"నా గ్రూప్ ఓ పాజిటివ్. నేను ఇస్తాను" చిరునవ్వుతో చెప్పాడు ఆది.


"గుడ్ ఆది.. షి ఈజ్ రియల్లీ లక్కీ.. శ్రీకాంత్.. ఈయన నా మిత్రుడు ఆది. ఇతని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. వాడు రక్తదానానికి సిద్ధంగా వున్నాడు. లోనికి తీసుకెళ్ళండి" చిరునవ్వుతో చెప్పాడు భాస్కర్.


ఆది నవ్వుతూ భాస్కర్ ముఖంలోకి చూచాడు. 

"యువరాణికి నీవు రక్తాన్ని ఇవ్వాలనేది ఆ దైవ నిర్ణయం. అందుకే నీవు నాతో హాస్పిటల్‍కి వచ్చావు." సంతోషంగా ఆది భుజంపై తట్టాడు భాస్కర్.


ఆది రక్తం.. యువరాణికి ఎక్కించారు. గంట తర్వాత.. ఆమెకు స్పృహ వచ్చింది.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page