#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha Chitralu Part - 6 - Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/03/2025
జీవిత చిత్రాలు - పార్ట్ - 6 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య.
యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు.
భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజులు పనిమీద ఛత్తీస్ ఘడ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దార్లో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు. బాబాయితో కలిసి వెళ్లి, డబ్బులు చెల్లించి, వారిని విడిపిస్తాడు ఆది. యువరాణికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఆరవ భాగం చదవండి.
భాస్కర్.. ఆది, మన్మధరావు గంగమ్మలను సమీపించారు. వారి వదనాల్లో ఎంతో ఆవేదన.
"మీ అమ్మాయికి స్పృహ వచ్చింది. దానికి కారణం ఈ నా మిత్రుడు ఆది.. తన రక్తాన్ని మీ అమ్మాయికి దానం చేశాడు. వెళ్ళి చూడండి" చెప్పాడు భాస్కర్.
ఆ వృద్ధులు.. ఇరువురి వదనాల్లో ఆనందం. చేతులు జోడించి ఆదికి నమస్కరించారు.
"నీవు చల్లగా నూరేళ్ళు హాయిగా వుండాలి నయనానందంతో చెప్పింది గంగమ్మ.
మన్మధరావు.. ఆదిని పరీక్షగా చూచాడు. అతని మనస్సులో ఏదో అనుమానం. ఆదిని.. సందేహంతో చూస్తూనే.. తన కూతురు వున్న గది వైపుకు వెళ్ళిపోయాడు భార్య గంగమ్మ వెనకాలే.
ఆ వూరికి క్రొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్.. యువరాణికి యాక్సిడెంట్ జరిగిందన్న విషయాన్ని విని.. స్పాట్‍కు వెళ్ళి.. ఆమెను చూచేదానికి వచ్చాడు. డాక్టర్.. భాస్కర్‍ను సమీపించాడు.
"గుడ్ ఈవెనింగ్ డాక్టర్ సార్!.. నా పేరు ఆనంద్. సర్పంచ్ యువరాణి గారికి యాక్సిడెంట్ జరిగిందని విన్నాను. స్పాట్ కెళ్ళి చూచాను. వారి కారు బ్రేక్స్ ఫెయిల్ అయినందుకు చెట్టుకు గుద్దుకొంది. మరో కారణం.. వీరి కారుకు ఎదురుగా బ్రేక్స్ ఫెయిల్ అయిన ఇసుక లారీ. బండిని స్లో చేసి డ్రైవర్ తెలివిగా కాలువలో దూకేశాడు. అతనికేం కాలేదు. ఈదుకొంటూ ఒడ్డుకు వచ్చాడు. ఇసుక లారీ బోల్తా పడింది. ఆ లారీ వీరి కారుకు ఎదురైనందున.. వీరి కారు బ్రేక్స్ ఫెయిల్ అయినందున.. యువరాణి గారికి ఈ ప్రమాదం జరిగింది. ఆ లారీ కూడా యువరాణి గారిదేనట. వారి పరిస్థితి ఇప్పుడు ఎలా వుంది. పాపం.. రెండు ఆవులు లారీ క్రింద పడి చనిపోయాయి. ఆ ఆవులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముకుందయ్యగారివట" చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆనంద్.
"ఎవరివీ!.. ముకుందయ్యగారివా!" భాస్కర్ ప్రక్కనే వున్న ఆది.. ఆతృతతో అడిగాడు.
"అవును సార్" అన్నాడు ఆనంద్.
"అరగంట క్రింద యువరాణి గారికి స్పృహ వచ్చింది. ప్రస్తుతం ఆమె వద్ద వారి తల్లిదండ్రులు వున్నారు. మీరు వారిని చూడాలంటే చూడవచ్చు. కానీ ఎలాంటి విచారణా చేసేదానికి ఇది తగిన సమయం కాదు" అన్నాడు భాస్కర్.
ఆనంద్ నవ్వుతూ.. "వారికి నేను ఎలాంటి శ్రమను కలిగించను. జస్ట్ చూచి వెళ్ళిపోతాను."
"సరే.." యువరాణి వున్న గదిని వ్రేలితో చూపించి..
"ఓకే.. ఆ గదికి వెళ్ళండి" అన్నాడూ భాస్కర్.
"థాంక్యూ సార్!.." నవ్వుతూ చెప్పి ఠీవీగా ఆ గదివైపుకు వెళ్ళాడు ఆనంద్.
ఆది.. వెళుతున్న అతన్ని పరీక్షగా చూడసాగాడు. ఆనంద్ ఆ గదిలో ప్రవేశించాడు. ఆది చూపు చెదిరింది. భాస్కర్ ముఖంలోకి చూచాడు.
"ఏంట్రా!.. అలా చూస్తున్నావ్?" అడిగాడు భాస్కర్.
"అతను.. తన పేరు ఏమని చెప్పాడు?"
"పేరు.." కొన్ని క్షణాలు ఆలోచించి.. "ఆ.. ఆనంద్.. ఆదీ!.. నీవు ఇక్కడే కూర్చో. నేను రౌండ్స్ కి వెళ్ళి వస్తాను" చెప్పి.. భాస్కర్ వెళ్ళిపోయాడు. ఆది కూర్చున్నాడు.
ఆదిత్య మనస్సున తన తమ్ముని జ్ఞాపకం.. వాడికి ఆరు సంవత్సరాల ప్రాయంలో తాను ఇంటి నుంచి పారిపోయాడు తన తమ్ముని పేరు.. ఆనంద్. ఒకవేళ ’వాడే.. వీడా!..’ అన్న అనుమానం. హు.. ఆనంద్ అన్నపేరు తన తమ్ముడి ఒక్కడికేనా వుంటుంది? దేశంలో ఆ పేరు కలవారు ఎందరో!..
తాను.. ఆ వూరికి వచ్చి పన్నెండు గంటలైంది. తలవని తలంపుగా బాబాయిగారిని కలవడం.. వారి వలన తన కుటుంబ వివరాలు వినడం జరిగింది. తాను యువరాణిని చూచి ఆమె స్థితిగతులను తెలుసుకొని.. ఆమె వున్న స్థాయి కంటే తాను గొప్పగా ఆమె కళ్ళముందు ఆ వూర్లో ఇల్లు, భూమి, తోటలు, దొడ్లు, పశువులు పూర్వపు మాదిరే ఏర్పరచుకొని.. తన వూరంతా ఎక్కడవున్నా వారిని కలిసి ఆ వూరికి తీసుకొని వచ్చి.. ఆమె కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా.. ఆమె కళ్ళకు తనే కనిపించేలా చేసి.. ’నేను దొంగను కాదు.. దొరనే నేను’ అని.. ఆమె తెలుసుకొనేలా చేయాలన్నదే తన ఆశయం.
ఆమె పట్ల తనకు ఎలాంటి పగా లేదు. ఆమెను చూడటం అయితే జరిగింది. ఇంకా తన లక్ష్య సాధనకు తాను ఆ వూర్లో చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవి రోజుల్లో ముగిసేవి కావు. అనుకున్నట్లు అన్నీ సాధించేదానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
అన్నింటికంటే ముఖ్యం. తన అమ్మా నాన్న అక్క తమ్ముడు.. ఎక్కడ వున్నదీ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మిగతా పనులన్నీ డబ్బు పారేస్తే.. అనుకున్న కాలానికి అయిపోతాయి. కానీ.. తన వారు ఎక్కడ వున్నదీ తెలియాలంటే ఆ జగత్ రక్షకుడే సాయం చేయాలి. ’భగవాన్!.. నేను త్వరలో నా వారిని కలుసుకొనేటట్లు చెయ్యి. నా లక్ష్యం సంపూర్ణం కావాలంటే నేను నావారిని కలవాలి. దానికి మార్గం చూపించవలసిన వాడివి నీవే!..’ మనస్సులో జగత్ రక్షకునికి నమస్సుమాంజలిని సమర్పించాడు ఆదిత్య.
మౌనంగా కూర్చొని కళ్ళు మూసుకొని వున్న ఆదిత్యను రౌండ్స్ ముగించుకొని భాస్కర్ సమీపించాడు. అతని రాకను ఆది గమనించలేదు.
భాస్కర్ ఆదిత్య భుజంపై తట్టి..
"ఏరా!.. నిద్ర వస్తుందా!" నవ్వుతూ అడిగాడు.
"మనస్సు నిండా సమస్యలు వున్నప్పుడు నిద్ర ఎలా వస్తుందిరా!.. వాటిని గురించే ఆలోచిస్తున్నాను."
"యువరాణిని చూస్తావా!"
"నీవు ఆమె దగ్గరకు వెళుతున్నావా!"
"అవును"
"పద.."
ఇరువురూ యువరాణి గదికి వెళ్ళారు. ఆమె దీనంగా భాస్కర్ ముఖంలోకి చూచింది. ప్రక్కనే వున్న ఆదిని.. పరీక్షగా చూచింది. కళ్ళు మూసుకొంది. నర్స్ కు ఇన్స్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు భాస్కర్. మిత్రులిరువురూ బయటికి నడిచారు.
సమయం రాత్రి పదిగంటలు. ఆది సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది కిరణ్. భాస్కర్ ఆది గదిలో వున్నారు.
"ఏరా!.. ఈ సమయంలో ఫోన్ చేశావు!.. అమ్మా నాన్న కులాసే కదా!.." ఆత్రుతతో ఆది గదిలో వున్నారు.
"ఆ.. అంతా బాగున్నారు. అన్నా!.. నీవు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావ్?" ఆత్రంగా అడిగాడు కిరణ్.
"ఏంటిరా, ఈ పిలుపులు.." ఆశ్చర్యంతో అడిగాడు ఆది.
"అవును అన్నా!.. నీవు నాకంటే పెద్దవాడివిగా!.."
"అవును. ఇంతకీ విషయం ఏమిటి? చెప్పు.."
"అన్నా! అది ఫోన్‍లో చెప్పే విషయం కాదు. నేను నీతో నేరుగా, నీవు నా ముందున్నప్పుడు చెప్పగలను. నీవు వెంటనే బయలుదేరి రావాలి" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు కిరణ్.
"లవ్ ఎఫైరా!.." నవ్వుతూ అడిగాడు ఆది.
"అన్నా!.. నీవు వెంటనే బయలుదేరి వచ్చేసెయ్. ప్లీజ్.."
"సరే.. బయలుదేరుతాను." ఆది సెల్ కట్ చేశాడు.
"ఎవర్రా!.. ఫోన్ చేసింది?" అడిగాడు భాస్కర్.
"తమ్ముడు కిరణ్."
"ఏం చెప్పాడు?"
"వాడికి ఏదో ప్రాబ్లమట. నన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడు."
"వెళతావా!.."
"అవున్రా.. వెళ్ళాలి"
"ఎప్పుడు?"
"ఇప్పుడే.."
"ఈ రాత్రి సమయంలో.."
"భాస్కర్!.. నాకేం భయం లేదు. హైవే కదా!.. నేను బయలుదేరుతాను"
ఇరువురూ.. గది నుంచి బయటికి వచ్చారు. అందరికీ చెప్పి ఆది కార్లో బయలుదేరారు.
*
ఉదయం.. ఎనిమిది గంటలకు ఆదిత్య వైజాగ్ చేరాడు.
అప్పటికి ఎనిమిది సార్లు కిరణ్.. ఆదికి ఫోన్ చేశాడు. తాను ఏ ప్రాంతంలో వున్నదీ.. ఆది కిరణ్‍కు చెబుతూ ముందుకు సాగాడు.
ఆ క్రిందటిరోజు ఉదయాన్నే గోవిందరాజు.. శాంతమ్మ శ్రీశైలం వెళ్ళిపోయారు. కిరణ్ హాల్లో కూర్చొని పిచ్చివాడిలా ద్వారం వైపు చూస్తూ కూర్చొని రాత్రంతా.. ఆది రాక కోసం ఎదురుచూస్తూ ఎంతో దిగులుతో గడిపాడు.
ఆది.. హాల్లో ప్రవేశించాడు. తొట్రుపాటుతో లేచి కిరణ్ ఆదిని సమీపించాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు..
"ఏంట్రా.. ఏం జరిగింది?"
"నేను చాలా పెద్ద తప్పు చేశాను" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు కిరణ్.
"రా.. కూర్చో.. విషయం ఏమిటో వివరంగా చెప్పరా!.." ఆది సోఫాలో కూర్చున్నాడు.
అతని ప్రక్కన కిరణ్ కూర్చున్నాడు.
"ఏం జరిగిందో చెప్పరా!.."
"గులాబీ ఈ వూరికి నిన్న వచ్చింది."
"గు..గు..ఏ గులాబీరా!" సాలోచనగా అడిగాడు ఆది.
"మన బి.టెక్ మేట్.."
"వస్తే!!!"
"గులాబీని నేను ప్రేమిస్తున్నాను ఆదీ."
"ఏమిటీ!.." ఆశ్చర్యపోయాడు ఆది.
"ఆమె నిన్ను ప్రేమిస్తూ ఉందా!"
"అవును"
"ఈ విషయం.. నాకు నీవు చెప్పనేలేదు కదా!"
"చెప్పలేదు. ఐయాం సారీ!"
"అవునూ.. ఇప్పుడు నిన్ను ఇంతగా కలవరపరిచే సమస్య ఏమిటి?"
"నిన్న రాత్రి లాడ్జిలో వున్న గులాబీని పోలీసులు స్టేషనుకు తీసుకొని వెళ్ళారు. నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నా సెల్ మరిచిపోయాను. రాత్రి తొమ్మిదిన్నరకు ఇంటికి వచ్చాను."
"అంటే.. ఆమె లాడ్జిలో ఒంటరిగా వున్నదా!.."
"అవును.."
"నీకు విషయం ఎలా తెలిసింది"
"నేను ఇంటికి వచ్చిన తర్వాత.. గులాబీ ఫోన్ చేసి చెప్పింది."
"ఎప్పుడు?"
"ఆమెను రాత్రి పోలీసులు పట్టుకొన్న వెంటనే. ఆమె చెప్పిన మాటలు విని ఏం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను."
"గులాబీ వైజాగ్ ఎందుకు వచ్చినట్లు!"
"వాళ్ళ నాయనమ్మకి ఎనభై ఏళ్ళ వయస్సు. ఆమె మంచంలో ఉందట. గులాబీ వివాహాన్ని చూడాలని ప్రొడ్యుసర్ వినాయకాన్ని కోరిందట. సినీ ప్రొడ్యూసర్.. అమెరికాలో వుండే తన స్నేహితుని కొడుకుతో నిశ్చితార్థం.. వివాహం వారంరోజుల్లో జరిగేలా ఏర్పాటు చేశారట. నిన్న నిశ్చితార్థం జరిగి వుండవలసింది. తాను.. వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా వైజాగ్ వచ్చేసింది."
"అమ్మా నాన్నా ఇంట్లో లేరుగా. ఆమెను మన ఇంటికి తీసుకొని రాకుండా హోటల్లో ఎందుకు వుంచావురా!" ఆశ్చర్యంతో అడిగాడు ఆది.
"నేను ఎక్కడ దించానన్నయ్యా!.. నేను సెల్ మరిచి ఆఫీసుకు వెళ్ళిన కారణంగా, తన కాల్స్ ను రిసీవ్ చేసుకోలేకపోయాను."
"సరే.. పద, ముందు గులాబీని ఇంటికి తీసుకొని వద్దాం"
పనిమనిషికి చెప్పి.. ఇరువురూ పోలీస్ స్టేషనుకు వెళ్ళారు. ఇనస్పెక్టర్ దివాకర్‍ను కలిశారు.
"సార్!.. గులాబీ హైదరాబాద్ ప్రొడ్యూసర్ వినాయకం కూతురు. మావాణ్ణి ప్రేమిస్తూ ఉంది. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని వివాహాన్ని చేయబోగా.. ఇక్కడికి వచ్చింది. మావాడు సమయానికి వూరి బయట పనిమీద వుండినందువలన.. స్టేషనులో ఆమెను కలవలేకపోయాడు. ఆ కారణంగా ఆమె హోటల్లో రూం తీసుకొంది. నేనూ వూర్లో లేను. ఈ ఉదయాన్నే వచ్చాను. మేమిరువురం గోవిందరాజులు గారి పిల్లలం. ఏ.జి లారీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మాదే సార్.
ఆమెకు ఈ వూర్లో పరిచయస్తులు వేరే ఎవరూ లేరు. మీవాళ్ళు వారి డ్యూటీని చేశారు. నేను చెప్పినదంతా యదార్థం. మాయందు దయచూపి గులాబీని విడిపించండి సార్!.." ఎంతో వినయంగా చెప్పాడు ఆది.
"మీ పేరేమిటి?"
"చిన్నా.."
"ఎంతవరకు చదివారు?"
"ఎం.టెక్.. మా తమ్ముడు ఎం.టెక్ సార్!.."
"ఏం చేస్తుంటారు?"
"నాన్నగారికి వ్యాపారంలో సాయంగా ఉంటున్నాము."
"నా పేరు దివాకర్. మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంది" నవ్వాడు దివాకర్.
కానిస్టేబుల్‍ను పిలిచి గులాబీని పిలుకుని రమ్మన్నాడు. ఐదు నిముషాల్లో గులాబీ వచ్చి వారి ప్రక్కన విచారంగా తలను దించుకొని నిలబడింది.
"సారీ మేడమ్!.. మీ గురించి మీ వాళ్ళు అంతా చెప్పారు. మావాళ్ళు పొరపడ్డారు. ప్లీజ్.. ఇక మీరు వెళ్ళవచ్చు" చెప్పాడు దివాకర్.
ఆది.. కిరణ్ కుర్చీల నుంచి లేచి నిలబడ్డారు.
"థాంక్యూ సార్!.." నవ్వుతూ ఆది తన కుడిచేతిని ముందుకు సాచాడు.
దివాకర్ చిరునవ్వుతో ఆది చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు.
ముందు ఆది.. వెనకాల కిరణ్, గులాబీలు తలలు వంచుకొని ఆదిని అనుసరించారు.
ఆది డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. వారిరువురూ వెనుక సీట్లో కూర్చున్నారు. ఆది కారును స్టార్ట్ చేశాడు.
కిరణ్.. మెల్లగా గులాబీ ముఖంలోకి జంకుతూ చూచాడు. గులాబీ కోపంతో తన తలను కిటికీ వైపుకు త్రిప్పుకొంది.
ఆది.. కారును హోటల్ ముందు ఆపి.. టిఫిన్ తీసుకు వస్తానని చెప్పి హోటల్లోకి వెళ్ళిపోయాడు.
"గులాబీ!.."
రోషంగా అతని ముఖంలోకి చూచింది.
"నీవు మనిషివేనా!.. ఫోన్ చేస్తే.. వెంటనే రాకుండా ఇప్పుడా వచ్చేది!.. రాత్రంతా ఆ చీకటి గదిలో దోమలచే పీకించుకొంటూ ఏడ్చాను నీ కారణంగా!" గద్గద స్వరంతో చెప్పింది.
"ఐయాం సారీ గులాబీ!.. నీవు ఫోన్ చేయగానే నాకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆదికి ఫోన్ చేశాను. ఆది వూర్లో లేడు. రావడంతోనే స్టేషనుకు వచ్చేశాము" అనునయంగా చెప్పాడు కిరణ్.
"ఒకవేళ.. ఆది సాయంత్రం దాకా రాకపోతే.. నీవు నా గురించి పట్టించుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చొని వుండేవాడివేగా!.. అవునా.. కాదా!.."
"సారీ గులాబీ!.. అయాం సో సారీ!.. ఇప్పుడు మనం కలిశాం కదా!.. ఆ విషయాన్ని వదిలెయ్. ప్లీజ్" దీనంగా చెప్పాడు కిరణ్.
ఆది రావడాన్ని గమనించిన గులాబీ మూతి ముడుచుకొని మౌనంగా వుండిపోయింది.
"ఏరా!.. కిరణ్.. గులాబీ ఏమంటుంది. తనకు నీమీద చాలా కోపం కదూ!.."
"అవునన్నయ్యా!.."
"గులాబీ!.." మెల్లగా పిలిచాడు ఆది. అద్దాన్ని సరిచేసి అద్దంలో ఆమె ముఖాన్ని చూస్తూ..
"ఊ.."
"ఇంటికి వెళ్ళగానే ముందు శుభ్రంగా స్నానం చెయ్యి. మా అమ్మగారి చీరా రవికా ఇస్తాను. ధరించు. టిఫిన్ తిని.. హాల్లో కూర్చొని అన్ని విషయాలు వివరంగా చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం. మీ నాన్నగారికి మీ వూర్లో అంత మంచిపేరు ఉంది. నీవు దేనికీ భయపడకు. అన్నీ మేము చూచుకొంటాం. సరేనా!.." చిరునవ్వుతో చెప్పాడు ఆది.
"సరే!.." మెల్లగా చెప్పింది గులాబీ.
కిరణ్.. తన కుడిచేతిని గులాబీ.. ఎడమ చేతిపై మెల్లగా వుంచాడు.
"క్షమించు.." వంగి మెల్లగా చెప్పాడు.
గులాబీ వేగంగా చేతిని విదిలించింది. చిరునవ్వుతో కిరణ్ ఆమె చెవి దగ్గర తన నోటిని చేర్చి..
"కోపంలో నీవు మరీ అందంగా వుంటావ్ రోజ్" నవ్వుతూ మెల్లగా చెప్పాడు.
గులాబీ.. కిరణ్‍న్ను ఎక్కిరించింది.
ముందున్న అద్దంలో గులాబీ ముఖ భంగిమను చూచిన ఆది..
"గులాబీ!.. నా తమ్ముడు అమాయకుడు. సతాయించకు. తట్టుకోలేడు" నవ్వుతూ చెప్పాడు.
పదిహేను నిముషాల్లో కారు వారి భవంతి ముందున్న కార్ పోర్టికోలో ఆపాడు ఆది.
ముగ్గురూ కారు దిగి లోనికి నడిచారు. స్నానాలు చేశారు. కిరణ్ అందించిన చీర రవికను గులాబీ ధరించింది.
ముగ్గురూ కలిసి ఆది తెచ్చిన టిఫిన్ తిన్నారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments