top of page

జీవిత చిత్రాలు - 7

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-7-telugu-web-series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 21/03/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. 

యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు. 


భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజులు పనిమీద ఛత్తీస్ ఘడ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దార్లో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు. బాబాయితో కలిసి వెళ్లి, డబ్బులు చెల్లించి, వారిని విడిపిస్తాడు ఆది. యువరాణికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు. 


కిరణ్ ఫోన్ చెయ్యడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. 



ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఏడవ భాగం చదవండి. 


వంట మనిషి కనకమ్మ వచ్చింది. మధ్యాహ్న భోజనానికి కావలసిన వాటిని గులాబీని అడిగి ఆది ఆమెకు చెప్పాడు. ముగ్గురూ వచ్చి హాల్లో కూర్చున్నారు. 

"గులాబీ!.. ఇప్పుడు చెప్పు వివరంగా నీ సమస్య ఏమిటో!" అడిగాడు ఆది. 


"నేను కిరణ్‍ను ప్రేమిస్తున్నాను. "


"ఈ విషయంలో నీవు.. " కిరణ్ ముఖంలోకి చూచాడు ఆది. 


"అన్నా!.. నా నిర్ణయాన్ని నీకు చెప్పాను కదా!" జాలిగా ఆది కళ్ళల్లోకి చూచాడు కిరణ్. 


ఆఁ.. క్షణం సేపు ఆలోచించి.. "గులాబీ!.. మా బాబాయి పిన్ని మనస్తత్వం నాకు బాగా తెలుసు. వారికి కులమతాల పట్టింపు లేదు. వారికి కావలసింది వారు కోరేది. ప్రతి ఒక్కరిలో మంచితనం.. మానవత్వం. మావాడు నిన్ను.. నీవు వాణ్ణి ప్రేమించుకొన్న కారణంగా మావారు మీ ఉభయులు వివాహానికి తప్పకుండా అంగీకరిస్తారు. ఇందుకు మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా!"


"మా అమ్మా నాన్నలకు కులాల పట్టింపు ఉంది. వారు మా వివాహానికి అంగీకరించరు" విచారంగా చెప్పింది గులాబి. 


"గులాబీ!.. నా ఉద్దేశ్యంలో ’ప్రేమ’ ఎంతో గొప్పది. ఈ సృష్టికి అదే మూలం. నీ తల్లిదండ్రులకు నీమీద వుండేది ప్రేమ. మా ఇరువురి మధ్యన వున్నదీ ప్రేమ. కానీ ఈ రెండు అక్షరాలకు వారి మదిలో వున్న భావాలకు.. మీ మనస్సులో వున్న భావాలకు వ్యత్యాసం ఉంది. ఇరువురి వివాహం అనేది, ఆ స్త్రీ.. పురుషునికి మాత్రమే సంబంధించినది కాదు. రెండు కుటుంబ గౌరవాలకు సంబంధించింది. 


మీ ఇరువురి మనస్సులోని భావాలను గ్రహించి ఆదరించి.. ఇరువురి తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకొని మీ వివాహాన్ని జరిపిస్తే.. అది మీకు.. రెండు కుటుంబాల సభ్యులకు ఆనంద దాయకం అవుతుంది. సభ్య సమాజమూ గౌరవిస్తుంది.. ఆదరిస్తుంది. 


నాకు.. నా వాళ్ళకూ మా కిరణ్ వివాహాన్ని ఆ రీతిగా జరిపించాలనే సంకల్పం. 


కాబట్టి నా బాబాయి పిన్ని వచ్చిన తర్వాత.. వారితో మాట్లాడి.. నేను మా బాబాయి వెళ్ళి మీ అమ్మా నాన్నలను కలుసుకొని.. మీ విషయాన్ని వారికి చెప్పి.. వారిని ఒప్పించే దానికి ప్రయత్నిస్తాము. మా బాబాయ్ పిన్ని రేపు వస్తారు. అంతవరకూ నీవు నిర్భయంగా మా ఇంటిని నీ ఇల్లుగా భావించి ఆనందంగా ఉండు. 


మీవారు మా మాటలను విని.. సమ్మతిస్తే అందరికీ ఆనందం. కాదంటే.. మా ఇంటి వరకే ఆ ఆనందం పరిమితమౌతుంది. నేను కోరేది మొదటిది. మీ వారిని ఒప్పించే దానికి గట్టిగా ప్రయత్నిస్తాను. సరేనా!.. " ఎంతో అనునయంగా చెప్పాడు ఆది. 


గులాబీ, కిరణ్ ముఖాల్లో ఎంతో ఆనందం. 

ఆది సెల్ మ్రోగింది. ఆది గోవిందరాజు గారి కాల్. 


"చెప్పండి బాబాయ్!"

.. 

"నేను ఈ ఉదయాన్నే వచ్చాను బాబాయ్"

.. 

"ఓ.. వాడికేం.. ఎంతో ఆనందంగా వున్నాడు" కిరణ్, గులాబీల ముఖాల్లోకి క్షణంసేపు చూచి ఆనందంగా నవ్వాడు ఆది. కాల్ కట్ చేశాడు. 


"రేపు సాయంత్రానికి వస్తారట. గులాబీ కట్టుబట్టలతో వచ్చినట్లు ఉంది. కిరణ్, గులాబీతో వెళ్ళి నాలుగు జతలు బట్టలు కొనుక్కుని రండి. "


గులాబీ, కిరణ్ కార్లో బజరువైపుకు వెళ్ళారు. ఆది.. తన గదికి వెళ్ళి మంచంపై వాలిపోయాడు. 

*

"వంటమనిషి.. కాలింగ్ బెల్ శబ్దాన్ని విని.. వచ్చి తలుపు తెరిచింది. 

ఎదురుగుండా సబ్ ఇన్స్ పెక్టర్ నిలబడి వున్నాడు. కనకమ్మ వారిని చూచి బెదిరిపోయింది. 

"చిన్నాగారు వున్నారా!" అడిగాడు. 


"వున్నారండీ.. రండి కూర్చోండి" సోఫాను చూపించింది. 


"వారితో మాట్లాడాలి. పిలవండి" సోఫాలో కూర్చుంటూ చెప్పాడు. 


పరుగున కనకమ్మ ఆది గదికి వెళ్ళింది. 

"చిన్నయ్యా!.." పిలిచింది. 


ఆది.. ఉలిక్కిపడి లేచాడు. 

"ఏమిటి కనకమ్మా!.." అడిగాడు ఆది. 


"ఇన్స్ స్పెక్టర్ వచ్చారండే. మీతో మాట్లాడాలంట" అంది. 


ఆది.. హాల్లోకి వచ్చాడు. అతని వెనకాలే కనకమ్మ మేడ దిగి.. వంటగది వైపుకు వెళ్ళిపోయింది. 


"గుడ్ ఆప్టర్ నూన్ సార్"


అదే మాటను చెప్పాడు ఇన్స్ పెక్టర్ దివాకర్. 

"ఫోన్ చేసి ఉంటే నేను వచ్చివుండే వాణ్ణి కదా సార్!"


"మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదుగా!.. అందుకే నేను వచ్చాను" చిరునవ్వుతో చెప్పాడు. 


"ఓ.. సారీ సార్.. చెప్పండి సార్!.. ఏమిటి విషయం?"


"ప్రొడ్యూసర్ వినాయకం.. తన కూతురు కనబడటం లేదని హైద్రాబాదులో మావారికి కంప్లయింట్ ఇచ్చారు. మావారు అన్ని నగరాలకు ఆమె ఫొటోను పంపి కనబడితే.. పట్టుకో వలసిందిగా మా హై కమాండ్ ఆర్డర్స్ మాకు అందాయి. ఆ కారణంగా మీరు గులాబీని మాకు అప్పగించాలి".


"సార్!.. గులాబీ.. కిరణ్ బయటికి వెళ్ళారు. ఆమె తన ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసింది. అలా ఆమె వచ్చేదానికి కారణం.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఫారిన్‍లో వున్న తన స్నేహితుని కుమారునితో నిశ్చితార్థం.. వివాహం, వారం రోజుల్లో వినాయకం గారు నిర్ణయించడమే!.. బిడ్డల నిర్ణయాలను.. మనోభావాలను పట్టించుకోకుండా పంతంతో కొందరు తల్లిదండ్రులు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటారో.. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 


వీరి విషయంలో కిరణ్.. గులాబీ ప్రేమించుకొన్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. తన నిర్ణయాన్ని తాను తల్లిదండ్రులకు చెప్పే దానికి వారు అవకాశం ఇవ్వని కారణంగా.. గులాబీ వారికి చెప్పకుండా ఇల్లు వదలి రావలసి వచ్చింది. 


ప్రస్తుతంలో ఆమె మీకు తెలుసుగా, మా ఇంట్లోనే ఉంది. బట్టలు కొనుక్కునేటందుకు, తను కట్టుబట్టలతో వచ్చిన కారణంగా.. కిరణ్‍తో కలిసి బజారుకు వెళ్ళింది. శ్రీశైలం నుంచి మా అమ్మా నాన్న రేపు సాయంత్రానికి వస్తున్నారు. 


గులాబీ, కిరణ్‍ల వివాహానికి మా తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పరు. మావారికి కులమతాల పట్టింపు లేదు. వారు రావడంతోటే.. నేను మా నాన్నగారు కలిసి హైదరాబాదుకు వెళ్ళి గులాబీ తల్లిదండ్రులతో ఆమె వివాహాన్ని.. తాను ప్రేమించిన మా తమ్ముడు కిరణ్‍తో జరిపించవలసినదిగా కోరుతాము. మీకు వీలుంటే మీరూ.. మాతో వస్తే.. నాకు చాలా సంతోషం. 

లాడ్జిలో.. దిగినందున గులాబీకి జరిగిన అవమానం ఎంతో.. మీకు తెలిసిందే. మీరు నాకంటే పెద్దవారు. మంచి మనస్సు వున్నవారు. దయచేసి మీ విద్యుక్తధర్మాన్ని.. రేపు సాయంత్రం వరకూ ఆపితే మాకు గులాబీకి ఎంతో మంచి చేసినవారవుతారు. సహృదయంలో నా విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాను" వినయంగా చేతులు జోడించాడు ఆదిత్య. 


కొన్ని క్షణాలు.. ఇన్స్ స్పెక్టర్ దివాకర్ కళ్ళు మూసుకొని ఆలోచించాడు. 


"సార్!.. నన్ను నమ్మండి. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక అక్షరంలోనూ ఎలాంటి మార్పు జరుగదు. కారణం.. మాట తప్పడాన్ని నేను సహించను" ఎంతో వినయంగా చెప్పాడు ఆది. 

దివాకర్.. నవ్వాడు. 


"ఈ వూర్లో నేను రెండు సంవత్సరాలుగా వుంటున్నాను. మీ నాన్నగారి పేరును విని యున్నాను. నీ ప్రతి మాట మీదా నాకు నమ్మకం ఉంది. ఆదిత్యా!.. నీ ఇష్ట ప్రకారమే జరుగనీ" అన్నాడు. 


"థాంక్యూ సార్!.. మీరు మాకు చేసిన ఈ మేలును నా జీవితాంతం మరిచిపోను. "


"మంచిది ఇకనే వెళతాను" దివాకర్ లేచాడు. 


ఇరువురూ వరండాలోకి వచ్చారు. దివాకర్ కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. తన కుడిచేతితో ఆదికి బై చెప్పి. 

*

మరుదినం సాయంత్రం నాలుగు గంటలకు గోవిందరాజు, శాంతమ్మలు యాత్ర నుంచి తిరిగి వచ్చారు. 


వారు అరగంటలో వస్తామని ఫోన్ చేయగానే.. ఆదిత్య, కిరణ్, గులాబీలకు మేడపైన వున్న కిరణ్ గదికి వెళ్ళమని, తాను వచ్చి పిలిచే వరకూ బయటికి రావద్దని కిరణ్‍తో చెప్పాడు. 


"అన్నా!.. నాకు చాలా భయంగా ఉంది" విచారంగా చెప్పాడు కిరణ్.

 

"ఎందుకురా!"


"అమ్మా నాన్నలు ఏమంటారోనని" దీనంగా ఆది కళ్ళల్లోకి చూచాడు. 


"చేయకూడనిది చేసి.. ఇప్పుడు భయం అంటే ఎలారా!.. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవలసిన సమయమిది. భయపడకు. గులాబీకి బాధపెట్టకు. అమ్మ నాన్నలకు చెప్పి.. వారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. నేను చూచుకొంటాను" అనునయంగా చెప్పాడు ఆది. 

కిరణ్.. గులాబీలు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. ఏం జరుగుతుందో అనే భయం వారి కళ్ళల్లో నిండి ఉంది. ఆ ఇరువురూ మేడపైన గదికి వెళ్ళిపోయారు. 


ఇరువురికీ నవ్వుతూ ఎదురువెళ్ళి ఆప్యాయంగా పలుకరించాడు ఆది. వారు వచ్చి హాల్లో కూర్చున్నారు. వంటమనిషి కనకమ్మ హాల్లోకి వచ్చి.. "అమ్మా.. టీ తీసుకురానా!" శాంతమ్మ ప్రక్కకు వచ్చి అడిగింది. 


"తీ త్రాగుతారా!.. " భర్తను ఉద్దేశించి అడిగింది శాంతమ్మ. 


"ఆఁ.. తెమ్మను"


కనకమ్మ.. వంట గదివైపుకు వెళ్ళిపోయింది. 

నిలబడి ఉన్న ఆదిని చూచి గోవిందరాజు.. 

"కూర్చో చిన్నా!.. నీవు వూరు వెళ్ళావు కదా!.. నీ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది. అక్కడి విశేషాలు ఏమిటి?" అడిగాడు. 


ఆది.. సోఫాలో వారి ప్రక్కన కూర్చొని.. 

"బాబాయ్!.. కొంతవరకూ నా ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. మీరు టీ త్రాగి ప్రెష్ కండి. తర్వాత అన్ని విషయాలూ మీకు వివరంగా చెబుతాను. "


కనకమ్మ మూడు కప్పుల టీతో హాల్లోకి వచ్చింది ముగ్గురికీ అందించింది. 

"రాత్రికి ఏం వంట చేయమంటారమ్మా!"


"కనకమ్మా!.. పిన్నిని స్థిమితంగా టీ త్రాగనీ. ఆమెను కాసేపు ప్రశాంతంగా కూర్చోని. తర్వాత.. అన్ని వివరంగా నీతో చెబుతుంది. "


"అట్టాగే బాబూ!.. "


ఖాళీ కప్పులను తీసుకొని కనకమ్మ వంటగది వైపుకు వెళ్ళిపోయింది. 


"పిన్నీ!.. యాత్ర చాలా ఆనందంగా వుండింది కదూ!.. "


"అవును చిన్నా!.. నేను ఎంతగానో ఆనందించాను. "


"బాబాయ్!.. మీరు.. "


"చిన్నా!.. ఆ శ్రీశైల క్షేత్ర దర్శనాన్ని.. మాటలతో చెప్పలేనురా. దాన్ని స్వయంగా అనుభవించవలసిందే నాకు మహదానందం కలిగిందిరా!.. " చిరునవ్వుతో చెప్పాడు గోవిందరాజు. 


"సరే!.. ఒళ్ళు కసకసలాడుతోంది. స్నానానికి వెళుతున్నాను" చెప్పి.. శాంతమ్మ తన గదికి వెళ్ళిపోయింది. 


"ఆ.. చిన్నా!.. నేనూ స్నానం చేసి వస్తాన్రా!" సోఫా నుంచి లేచాడు గోవిందరాజు. 


ఆది సెల్ మ్రోగింది. చేతికి తీసుకుని చూచాడు. ఫోన్ చేసింది.. భాస్కర్. 


"ఎవరు?" అడిగాడు గోవిందరాజు. 


"బాబాయ్!.. ఆ వూరి నుంచి నా స్నేహితుడు భాస్కర్. "


"ఓ.. మాట్లాడు" చెప్పి వెళ్ళిపోయాడు. 


"హలో!.. "


"ఆ.. నీవు నీ వాళ్ళంతా ఎలా వున్నారు ఆదీ!.. "


"అంతా బాగున్నారు భాస్కర్.. !"


"ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు?"


"ఓ సమస్య.. దాన్ని సాల్వ్ చేసి వారంలోపల వస్తాను. "


"యువరాణి.. నీ గురించి అడిగింది. "


"ఏమని!.. "


"నిన్ను చూడాలట. నీకు థాంక్స్ చెప్పాలట. "


"అలాగా!.. "


"అవును. "


"సుధ.. తాతయ్య, నానమ్మ ఎలా వున్నారు?"


"బాగా వున్నారు. "


"అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారు?"


"నీవు వెళ్ళిన మరుదినం"


"యువరాణి ఆరోగ్యం ఎలా ఉంది?"


"షి ఈజ్ ఫైన్. నో ప్రాబ్లం.. అవును.. నీవు ఏదో సమస్య అన్నావే.. అదేమిటో నేను తెలుసుకోవచ్చా!"


"మా కిరణ్ గాడు ఓ అమ్మాయిని.. మా కాలేజ్ మేట్‍ను ప్రేమించాడు. వాళ్ళది మన కులం కాదు. అమ్మాయి నాన్నగారు వినాయకం. సినీ ప్రొడ్యూసర్, వాళ్ళది హైదరాబాద్. వినాయకం గారు తన స్నేహితుని కొడుకుతో.. ఆ అమ్మాయి పెండ్లి వారం రోజుల్లో జరిగేలా నిర్ణయించాడు. ఆ మహాతల్లి ఇంటినుంచి పారిపోయి మా ఇంటికి వచ్చింది. అరగంట క్రితమే బాబాయ్ పిన్నీ శ్రీశైలం నుంచి తిరిగి వచ్చారు. ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో, కిరణ్.. వాళ్ళ అమ్మాయి గులాబీల ప్రేమ విషయాన్ని చెప్పి.. వారిని ఒప్పించి, వారి వివాహం జరిగేలా చూడాలి. ఇదే నా సమస్య" చెప్పాడు ఆది. 


"మీ బాబాయి, పిన్ని ఈ వర్ణాంతర వివాహానికి అంగీకరిస్తారా!"


"వారి వల్ల ఏ అభ్యంతరమూ వుండదు. గులాబీ తల్లిదండ్రులు ఏమంటారో.. ఇప్పుడు నేనేమి చెప్పలేను. "


"ఎం. పిగారు కదా.. వారికీ విశాల భావాలు వుండి వుంటాయి భయపడకు. "


"విశాల భావాలు.. ఆదర్శ ప్రసంగాలు చాలామంది విషయంలో ఈ రోజుల్లో వేదికలకే పరిమితం. ఈ విషయం నీకూ తెలుసుగా. "


"పిల్లా పిల్లోడూ.. ఒకమాట మీద వున్నారుగా!.. కాసేపు ప్రగల్బాలు పలికినా.. ఆ ఎం. పి గారు చివరికి అంగీకరిస్తాడులే.. " నవ్వాడు భాస్కర్. 


"సరే.. నీమాట ప్రకారం జరిగితే.. నాకు ఎంతో ఆనందం. నీకు వీలుపడితే.. యువరాణితో మనం కావాలనుకొన్న స్థలం విషయాన్ని గురించి మాట్లాడు. "


"అలాగే.. ప్రయత్నిస్తాను. నీ ప్రయత్నం ఏమైందో హైదరాబాదు నుంచి ఫోన్ చెయ్యి. "


"అలాగే భాస్కర్. అందరినీ అడిగానని చెప్పు. "


"అలాగే.. ఆల్ ది బెస్ట్" ఫోన్ కట్ చేశాడు. 


ఆది వేగంగా మెట్లెక్కి కిరణ్ గదిలో ప్రవేశించాడు. ఆ ఇరువురూ చెరో కుర్చీలో కూర్చొని బిక్క ముఖాలు వేసుకొని విచారంగా వున్నారు. 


"అమ్మా నాన్న వచ్చారు. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు. విషయాన్ని వారికి చెబుతాను. తెగని ఆలోచనలను వదలి ముఖాలు కడుక్కొని ఫ్రెష్‍గా కూర్చోండి. నేను పిలిచినప్పుడు క్రిందికి రండి. సరేనా!" మెల్లగా నవ్వుతూ చెప్పాడు ఆది. 


ఇరువురూ తలలు ఆడించారు. కొన్ని క్షణాల్లో పరీక్షా ఫలితాలను వినబోయే విద్యార్థులను గుర్తుకు తెస్తున్నారు కిరణ్, గులాబీలు. 


=======================================================================

ఇంకా వుంది..

జీవిత చిత్రాలు - పార్ట్ 8 త్వరలో..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page