top of page

జీవిత చిత్రాలు - 8

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-8-telugu-web-series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 28/03/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. 

యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు. 


భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజులు పనిమీద ఛత్తీస్ ఘడ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దార్లో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు. బాబాయితో కలిసి వెళ్లి, డబ్బులు చెల్లించి, వారిని విడిపిస్తాడు ఆది. యువరాణికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు. 


కిరణ్ ఫోన్ చెయ్యడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. వారి వివాహం జరిపిస్తానని హామీ ఇస్తాడు.


ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి. 


ఆది క్రిందికి వచ్చాడు.

హాల్లోకి వస్తూ.. గోవిందరాజులు.. "చిన్నా!.. కిరణ్ ఏడిరా!.." అడిగాడు. సోఫాలో కూర్చున్నాడు.

ఆది వారి ప్రక్కన కూర్చున్నాడు.

"పైన తన గదిలో వున్నాడు బాబాయ్"


"ఏం.. ఒంట్లో ఏమైనా నలతగా వుందా!.."


"బాబాయ్!.." సంకోచిస్తూ గోవిందరాజు ముఖంలోకి చూచాడు ఆది.


"విషయం ఏమిటో చెప్పు" పరీక్షగా ఆది ముఖంలోకి చూచాడు గోవిందరాజు.


స్నానం చేసి రాత్రి భోజనానికి ఏం చేయాలో చెప్పేదానికి వంటింట్లోకి వెళ్ళిన శాంతమ్మకు.. కనకమ్మ, ఎవరో అమ్మాయి మన ఇంటికి వచ్చిందని, సబ్ ఇన్స్ పెక్టర్ వచ్చి వెళ్ళాడన్న విషయాన్ని చెప్పింది.


హాల్లోకి వస్తూ.. "చిన్నా!.. మన ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందట. సబ్ ఇన్స్ పెక్టర్ వచ్చి వెళ్లాడట. ఏమిట్రా విషయం?" ఎదుటి సోఫాలో కూర్చొని ఆది ముఖంలోకి సందేహంతో చూచింది.


"పిన్నీ.. బాబాయ్!.. అన్నీ వివరంగా చెబుతాను వినండి."


వారి పరోక్షంలో.. తనకు కిరణ్ ఫోన్ చేయడం నుంచి ప్రారంభించి.. ఉదయం సబ్ ఇన్స్ పెక్టర్ దివాకర్ వచ్చి తనకు విషయాన్ని.. తాను దివాకర్‍‍కి చెప్పిన సమాధానాన్ని, దానికి వారు తెలియజేసిన సమ్మతినీ.. వివరంగా ఆ పెద్దలిరువురికీ వివరించాడు ఆది.

అంతా విన్న వారిరువురూ ఎంతగానో ఆశ్చర్యపోయారు.


చివరగా.. 

"పిన్నీ.. బాబాయ్!.. కిరణ్, గులాబీలు మీరు ఏమంటారో అని చాలా భయపడుతూ మేడమీద గదిలో వున్నారు. వారిని పిలుస్తాను. గులాబీని మీరు చూడండి. మాతో పాటే కాలేజీలో చదివిన అమ్మాయి. చాలా మంచిది. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వారి వివాహం మనం జరిగేలా చూడాలి" చెప్పి వేగంగా మేడమీదకి వెళ్ళి రెండు నిమిషాల్లో క్రిందికి దిగి వచ్చాడు. 


అతని వెనకాలే కిరణ్.. గులాబీలు వచ్చి దోషులు వలె తలలు దించుకొని ఆ పెద్దల ముందు నిలబడ్డారు.


గోవిందరాజు.. శాంతమ్మ కొన్ని క్షణాలు వారిని పరీక్షగా చూచారు. గులాబీ కళ్ళనుంచి కారే కన్నీటిని చూచిన శాంతమ్మ.. మాతృహృదయం ద్రవించింది. లేచి గులాబీని సమీపించింది. తన చేతులతో ఆమె ముఖాన్ని పైకెత్తి.. పవిటతో ఆమె కన్నీటిని తుడిచింది. 


"భయపడకు. రా.." గులాబీ చేతిని తన చేతిలోనికి తీసుకొని సోఫాను సమీపించి..

"కూర్చో!.." అంది.


గులాబీ మౌనంగా తలదించుకొని కూర్చుంది.


ఆది.. సౌంజ్ఞతో కిరణ్.. "అమ్మా!.. నన్ను క్షమించమ్మా!.." వంగి ఆమె పాదాలను పట్టుకొన్నాడు. 


కొడుకు భుజాలను పట్టుకొని లేవనెత్తి.. అతని కన్నీటిని తుడిచింది ఆ తల్లి.

జరుగుతున్న సన్నివేశాన్ని మౌనంగా పరీక్షగా చూస్తూ వుండిపోయాడు గోవిందరాజు.

"కిరణ్!.. ఈ తల్లీతండ్రి మీద నీకు నమ్మకం లేదా!.." బొంగురుపోయిన కంఠంతో అడిగింది శాంతమ్మ.


"నాన్నా!.. ప్లీజ్.. నావల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించండి" తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు కిరణ్.


విచారవదనంతో తనయుని చూస్తూ వుండిపోయాడు గోవిందరాజులు.

వారి హృదయవేదనను ఎరిగిన ఆది.. కిరణ్‍ను లేవనెత్తి సోఫాలో వారి ప్రక్కన కూర్చోబెట్టాడు.

"పిన్నీ.. బాబాయ్!.. గులాబీ మీకు నచ్చిందా!" నవ్వుతూ అడిగాడు.


గోవిందరాజు ఆది ముఖంలోకి పరీక్షగా చూచాడు. 


ఆది.. చేతులు జోడించి.. "బాబాయ్!.. మా తప్పులను మా పెద్దలైన మీరు కాక మరెవరు మన్నించగలరు? కిరణ్, గులాబీల ముఖాలను చూడండి. వారు ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. వివాహం చేసుకొని సహాజీవనం చేయాలనుకొన్నారే తప్ప.. మరే తప్పూ చేయలేదు బాబాయ్. మీరు అన్నీ తెలిసినవారు. ఎందరినో ఎన్నెన్ని విధాలో ఆదుకొన్నవారు. వారి కోరికను మన్నించండి. వారు భార్యాభర్తలై ఆదర్శ సంసార జీవనాన్ని సాగించాలని ఆశీర్వదించండి" ప్రాధేయపూర్వకంగా గోవిందరాజుల చేతులు పట్టుకొన్నాడు ఆది.


కొన్ని క్షణాలు ఆది ముఖంలోకి చూచాడు గోవిందరాజు.

"ఇప్పుడు మనం ఏమి చేయాలి చిన్నా!.."


"వాణ్ణి అడుగుతారేమిటండీ!.. మీరు వెళ్ళి గులాబీ తండ్రి గారిని కలిసి మాట్లాడాలి కదా!.." ప్రశ్నార్థకంగా చూస్తూ చెప్పింది శాంతమ్మ.


"అవును బాబాయ్. పిన్ని చెప్పినట్లు మనం వెంటనే ఆపని చేయాలి"


"అంటే మనం హైదరాబాద్ వెళ్ళాలిగా!.."


"ఎప్పుడు?"


"మనం ఈ రాత్రికే బయలుదేరాలి."


"శాంతీ!.. నీ కోరికా ఇదే కదూ!"


"అవును."


"సరే చిన్నా!.. మనం హైదరాబాద్‍కు ఈ రాత్రే బయలుదేరుదాం." 


గులాబీ ముఖంలోకి చూచి..

"భయపడకమ్మా!.. మీ వివాహం జరిగేదానికి నేను చేయవలసిన ప్రయత్నాన్ని గట్టిగా చేస్తాను. మీ నాన్న అమ్మ అంగీకరిస్తే అందరికీ ఆనందం. వారు.. ఒకవేళ కాదన్నా.. నేను మీ ఇరువురి వివాహాన్ని జరిపిస్తాను. కారణం నీవు మేజర్. నీ భావి జీవితానికి సంబంధించిన నిర్ణయాలను నీవుగా నిర్ణయించుకొనేదానికి నీకు సర్వహక్కులు వున్నాయి" అనునయంగా చెప్పాడు గోవిందరాజు.


"గులాబీ!.. నాతోరా!.." ఆమె చేతిని పట్టుకొని శాంతమ్మ ఆమెతో కలిసి తన గది వైపుకు బయలుదేరింది.


"బాబాయ్!.. నేను వెళ్ళి ఇన్స్ స్పెక్టర్ దివాకర్ గారితో మాట్లాడి వస్తాను."


"అన్నా!.. నేనూ నీతో వస్తాను."


"సరే వెళ్ళిరండి" ఇరువురినీ చూచి చెప్పాడు గోవిందరాజు.


ఆది.. కిరణ్ కార్లో బయలుదేరి పోలీస్ స్టేషన్‍కు వెళ్ళారు. స్టేషన్ నుండి బయటికి వచ్చిన దివాకర్‍ వారిని చూచి ఆగాడు. ఇరువురూ వారిని సమీపించారు. విష్ చేశారు.


ఆది.. దివాకర్‍తో, తను గోవిందరాజు హైదరాబాద్ ఈ రాత్రికే బయలుదేరుతున్నట్లుగా చెప్పి.. వారిని రమ్మనమని కోరాడు. దివాకర్ మనతో గులాబీని కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పాడు. కారణం తెలిసిన ఆది అందుకు అంగీకరించాడు. పది గంటలకు బయలుదేరుదాం. మిమ్మల్ని నేను పికప్ చేసుకొంటానని చెప్పి వారి ఇంటి అడ్రస్, మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని తమ ఇంటి వైపుకు బయలుదేరారు ఆది, కిరణ్‍లు.


తమ హైదరాబాద్ ప్రయాణ విషయాన్ని గురించి ఆది ఆలోచిస్తూ కారును నడుపుతున్నాడు.

"అన్నా!.. మీతో పాటే గులాబీని తీసుకొని వెళ్ళాలా!.." విచారంగా అడిగాడు కిరణ్.


"వెళ్ళాలి"


"తప్పదా అన్నా!"


"అరే!.. అన్నా.. అన్నా అనే నీ ఈ కొత్త పిలుపును వింటుంటే.. నాకు చాలా భయంగా వుందిరా కిరణ్!"


"నేనేం తప్పుగా అనడం లేదు కదా అన్నా!" దీనంగా ఆది ముఖంలోకి చూచాడు కిరణ్.


"రేయ్!.. కిరణ్!..అన్నా అనే పిలుపు నా దృష్టిలో చాలా గొప్పది. గౌరవప్రదమైంది. ఆ పిలుపుకు నాకు తెలిసిన మరో అర్థం నాన్నా అని. చిన్నవారు తమకంటే పెద్ద అయిన వ్యక్తిని అన్నా అని పిలిస్తే వారి తండ్రి తర్వాత.. ఆ అన్న, చిన్నవారి బాగోగులు చూచే మరో తండ్రిలాంటి వ్యక్తి. తండ్రితో సమానం. నీవు నాకు ఇచ్చే ఈ గౌరవాన్ని నేను నీ విషయంలో ప్రస్తుత సమస్యలో ఏ రీతిగా వర్తించి నీ కోర్కెను తీర్చి.. నీకు ఆనందాన్ని ఇవ్వగలనా లేదా!.. అనేదే నా భయం. నీవు నన్ను ఎంతగా అభిమానిస్తున్నావో.. నమ్ముతున్నావో నాకు బాగా తెలుసురా. నీ కోర్కెను నా కోర్కెను ఆ భగవంతుడే తీర్చాలి" నిట్టూర్చి కిరణ్ ముఖంలోకి చూచాడు ఆది.


"నీ నమ్మకమే.. నీకు జయాన్ని ఇస్తుంది అన్నా!.." నవ్వుతూ చెప్పాడు కిరణ్.

*

ప్రొడ్యూసర్ వినాయకం.. సెంట్రల్ మినిస్టర్ బెనర్జీగారు మంచి స్నేహితులు. క్రషర్ యూనిట్‍ను ఓపెనింగ్ ఫంక్షన్‍కు బేలాడీలా అదే బలేలీకి వారు వచ్చిన సందర్భంగా అక్కడికి వెళ్ళి వారిని కలిసి మాట్లాడి, ఆ పని ముగిసిన తర్వాత లోకేషన్లు చూచి.. తిరిగి వస్తున్న సమయంలో రోడ్లో ఒక దుర్ఘటన జరిగింది.


వినాయకం గారు వీరి మిత్రులు ఇరువురూ కారు డ్రైవర్ బొలారోలో ప్రయాణిస్తున్నారు.


భద్రాచలం నుంచి కంట అనే గ్రామం వరకూ ఆంధ్రరాష్ట్ర సరిహద్దు. రోడ్డు వెడల్పు పదహారు అడుగులకు మించి వుండదు. ఆ అడవుల్లో ఎదురు చాలా ప్రశస్తం. ప్రతిరోజూ దాదాపు పాతిక లారీలు ఎదురు లోడ్‍తో ఛత్తీస్‍ఘడ్ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. ఆ లారీలు ఎదురైనప్పుడు కారుని రోడ్డు చివరన ఆపి అవి దాటి ముందుకు వెళ్ళిన తర్వాతనే కారును రోడ్డు మధ్యకు తీసుకొని ముందుకు సాగాల్సి వుంటుంది.


రెండు రాష్ట్రాల సరిహద్దులో వున్న రోడ్లను గురించి ఏ రాష్ట్రమూ పట్టించుకోదు. కానీ.. అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాల వ్యక్తుల.. ప్రముఖుల వాహనాలు ఆ రోడ్డు మీదనే అటూ ఇటూ తిరుగుతుంటాయి. ఈ స్థితి.. అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో వున్న రోడ్లకు ఒకే తీరు. కారణం ఆ రోడ్ల ద్వారా ఆయా స్టేట్ గవర్నమెంట్లకు వచ్చే రెవిన్యూ బహు స్వల్పం. హైదరాబాద్ నుండి కిరండోల్ వరకూ ఒక బస్సు నడుస్తూ ఉంది.


ఎం.పి వినాయకం గారి కారు ముందు ఒక బులెట్ పై ఇరువురు వ్యక్తులు పయనిస్తున్నారు మధ్య రోడ్డున. సైడ్ కోసం డ్రైవర్ హారన్ పదేపదే మ్రోగించాడు. కానీ.. వారి సైడ్‍కు వెళ్ళి కారుకు దారి ఇవ్వలేదు.


పది నిముషాల పాటు డ్రైవర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. డ్రైవర్‍తో సహా వినాయకం వారి ఇరువురు మిత్రులూ విసుగు చెందారు.


వినాయకానికి ఆవేశం పెరిగింది.


"రేయ్!.. ఎక్సలేటర్ తొక్కి ఆ బులెట్ ముందుకు కారును పోనిచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టు. వాళ్ళెవరో వాళ్ల సంగతేంటో బులెట్‍ను క్రాస్ చేసి రోడ్డు అడ్డంగా త్రిప్పాడు. బులెట్ పదిహేను అడుగుల దూరంలో ఆగిపోయింది.


వినాయకం అతని మిత్రులూ కారు దిగారు. వేగంగా వారిని సమీపించారు.


బైక్‍పై కూర్చొని వున్న వారి జుట్టు పట్టుకొని క్రిందికి లాగి కసితీరా చెంపలు వాయించారు.

’రోడ్డు మీ అబ్బగాడి సొమ్మారా!’ అంటూ..


వాళ్ళూ తిరగబడ్డారు. ఉభయ వర్గాల కొట్లాట స్థాయి పెరిగింది. వీరు ముగ్గురైనందున దెబ్బలు తిని ఆ ఇరువురూ నేలకూలారు. వాళ్ళూ తాగి వున్నారన్న విషయాన్ని వీరు గమనించారు.

తను జోక్యం చేసుకుంటే.. ఇబ్బంది అవుతుందని అనుభవం కలవారు డ్రైవర్ కదల్లేదు.

ముగ్గురూ.. వారిని తిట్టుకొంటూ వచ్చి కార్లో కూర్చున్నారు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.


"ఏరా కోటిగా!.. మేము ముగ్గురం వాళ్ళతో అంతగా గొడవ పడుతుంటే నీవు బండిని వదలి రాలేదేంరా!.." ఆవేశంతో అడిగాడు వినాయకం.


"సార్!.. ఈ జాగా మంచిది కాదు సార్. ఈ దారిన తిరిగే వాళ్ళలో ఎవరు దొరలో.. ఎవరు దొంగలో తెలిసికొనే దానికి ప్రయత్నించకూడదు సార్. నేనూ మీతో వచ్చి వాళ్ళతో గొడవపడి.. నాకేదైనా జరిగితే.. మిమ్మల్ని హైదరాబాదుకు చేర్చేదెవరు సార్.. అనుభవం కల ఏ డ్రైవరూ బండి నడుపుతున్నప్పుడు క్రిందికి దిగడు సార్. మీ మంచిని కోరే నేను అలా చేశాను." వినయంగా చెప్పాడు డ్రైవర్ కోటయ్య.


"అన్నా!.. వాడు సెప్పింది నిజమేనన్నా!" ఒక హితుని మాట.


నలుగురూ ఎవరి ఆలోచనల్లో వారు వుండిపోయారు.


ఒక వ్యక్తి.. మనకు మంచి స్నేహితునిగా భావించేదానికి చాలా సమయం కావాలి. ఇరువురి అభిరుచులు.. నిర్ణయాలు.. మనస్తత్వాలు ఒకటైతేనే ఇరువురి వ్యక్తుల మధ్యన స్నేహం కుదురుతుంది. ఈ సృష్టిలోని అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహ బంధం. ఆ రీతిగా ఏర్పడిన మంచి స్నేహం వారి జీవితాంతం వరకూ చెక్కు చెదరకుండా వుంటుంది. ఒకరికోసం మరొకరు ఏం చేసేదానికైనా సిద్ధంగా వుంటారు.


కానీ.. విరోధం.. క్షణాల్లో ఏర్పడుతుంది. తనలోని ఆవేశం కారణంగా.. వినాయకం.. ఆ దారిన పోయే అపరిచిత వ్యక్తులకు విరోధిగా మారిపోయాడు.


=======================================================================

ఇంకా వుంది..

జీవిత చిత్రాలు - పార్ట్ 9 త్వరలో..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page