top of page

జీవిత చిత్రాలు - 9

Updated: 7 days ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-9-telugu-web-series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 03/04/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. 

యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు. 


భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజులు పనిమీద ఛత్తీస్ ఘడ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దార్లో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు. బాబాయితో కలిసి వెళ్లి, డబ్బులు చెల్లించి, వారిని విడిపిస్తాడు ఆది. యువరాణికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు. 


కిరణ్ ఫోన్ చెయ్యడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. వారి వివాహం జరిపిస్తానని హామీ ఇస్తాడు. గులాబీ పేరెంట్స్ ని కలుద్దామంటాడు. 

ఇక జీవిత చిత్రాలు ధారావాహిక తొమ్మిదవ భాగం చదవండి.


అనుకొన్న టైముకు గోవిందరాజు, ఆదిత్య, గులాబీ, ఇన్సస్పెక్టర్ దివాకర్ కార్లో హైదరాబాదుకు బయలుదేరారు. ఆదిత్య కారును నడుపుతున్నాడు. అతని ప్రక్కన దివాకర్, వెనుక సీట్లో గోవిందరాజు, గులాబీలు కూర్చొని వున్నారు.


బయలుదేరే ముందు డి.ఎస్పీకి తాను గులాబీని కలుసుకొన్నాననీ.. ఆమెకు సంబంధించిన అన్ని వివరాలు వివరించి, తన హైదరాబాదు ప్రోగ్రామును గురించి చెప్పాడు. డి.ఎస్పీ తన అంగీకారాన్ని దివాకర్‍కు తెలియజేశాడు.


"సార్!.."


"చెప్పండి దివాకర్ గారూ!.."


"నా భార్య నాన్నగారు, వుండేది హైదరాబాదులోనే. వారిరువురూ అడ్వకేట్స్. మనం నేరుగా మా ఇంటికి వెళతాము. గులాబీని అక్కడ దించి ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి.. మీరు, నేను, చిన్నా, వినాయకం గారిని కలుసుకొని అన్ని వివరాలూ వారికి చెబుదాం. మన మాటలను విని.. వారు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో.. దాన్ని అనుసరించి మనం నడుచుకోవలసి వస్తుంది. వారు కిరణ్, గులాబీల వివాహానికి అంగీకరించితే అందరికీ ఆనందం. ఒకవేళ వారు కాదంటే.. మీరు ఏం చేయదలుచుకొన్నారు సార్!" అడిగాడు దివాకర్.


"దివాకర్ గారూ!.. నేను వినాయకం గారి అంత గొప్ప వ్యక్తిని కాకపోవచ్చు. కానీ మంచినీ, మానవత్వాన్ని విశ్వసించి పాటించేవాణ్ణి నేను. మా కాలానికీ.. ఈ కాలానికీ.. మనుషుల వ్యక్తిత్వాల్లో ఎంతో మార్పు. ప్రతి ఒకరికీ నేడు.. స్వతంత్ర భావాలు నిర్ణయాలు అధికం. ఇతరుల సలహాలను పాటించేవారు బహుకొద్ది మంది. దానికి కారణం నేడు వారు చదివే చదువులు.. అందుబాటులో వున్న అనేక రకాలైన మీడియా సాధనాలు. వీటన్నింటికీ అతీతంగా.. పెద్దల మాట మీద గౌరవం.. ఆదరణా వుండేవాళ్ళు బహుకొద్ది మంది పిల్లలు మాత్రమే.


ఇక పెద్దవారి విషయానికి వస్తే.. వారు ఇచ్చే విపరీత స్వేఛ్చా స్వాతంత్ర్యాలను చాలామంది యువతరం.. విచక్షణారహిత వ్యామోహంలో పడి దుర్వినియోగం చేసుకొని, తమ జీవితాలను కష్టాలు పాలు చేసుకొని.. తల్లిదండ్రులకు అయిన వారికి ఎంతో ఆవేదనను కలిగిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొంటే ఏం ప్రయోజనం వుండదుగా. ఫలితాన్ని అనుభవించవలసిందే కదా!..


ఈ తటస్థ స్థితిలో.. పెద్దల పాత్ర పోషణ చాలా క్లిష్టమైనది. ఆవేశరహితమైన ఆలోచనతో జాగ్రత్తగా వర్తించవలసిన తరుణం. నా కొడుకు కిరణ్.. నా ముందు ఇలాంటి సమస్యతో నిలబడతాడని నేను ఏనాడూ ఊహించలేదు. చిన్నా చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. వాణ్ణి నేను ఒక్కమాట కూడా అనలేదు అని.. నా ఆవేశాన్ని వాడికి చూపటం తప్ప.. అందువల్ల నాకు గాని వాడికి గానీ.. ఎలాంటి ప్రయోజనం వుండబోదని నాకు తెలుసు.


ఎదురు చూడని సమస్య ఎదురైనప్పుడు.. ఆవేశంతో దాన్ని పరిష్కరించలేము. శాంతి సహనాలతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం ఉచితం. ఒక సమస్య పరిష్కారంలో మరో సమస్య ఉత్పన్నం కాకూడదు.


అందుకే.. నేను కిరణ్ వివాహాన్ని గులాబీతో చేయాలని నిర్ణయించుకొన్నాను. గులాబీ తండ్రిగారు సమ్మతిస్తే.. ఏ సమస్యా వుండదు. కాదంటే.. అదీ సమస్యే. కాని.. దాని పరిష్కారానికి నేను సిద్ధంగా వున్నాను" నిట్టూర్చి ఆపాడు గోవిందరాజు.


"ఏ రీతిగా సార్!.." అడిగాడు దివాకర్.


"గులాబీ తండ్రికి నేను భయపడను. వారి వివాహం నేను జరిపిస్తా. కలిసిన మనస్సులను విడదియ్య ప్రయత్నించడం పాపం దివాకర్ గారూ!.." నవ్వుతూ చెప్పాడు.

"సార్!.. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ప్రతి తల్లిదండ్రులు మీలా ఆలోచిస్తే.. ప్రేమికుల విషయంలో ఈనాడు మనం వినే వింత వార్తల సంఖ్య తగ్గిపోతుంది. ఆ ప్రేమికులు ఆనందంగా వారి జీవితాలను సాగించగలుగుతారు." నవ్వుతూ చెప్పాడు దివాకర్.


ఆది.. గులాబీలు వారి సంభాషణను విని ఎంతగానో సంతోషించారు.

ముఖ్యంగా గులాబీ.. ’నేను చాలా అదృష్టవంతురాలిని. నా అత్తామామలు చాలా మంచివారు. ఎందరికో ఆదర్శప్రాయులు’ ఆనందంగా అనుకొంది.

"మీరు వైజాగ్ రాకముందు ఎక్కడ పనిచేశారు దివాకర్ గారూ!"


"డిప్యూటేషన్‍లో మూడేళ్ళు బెలాడీలలో పనిచేశాను."


"అది నక్సల్స్ ఏరియా కదూ!.."


"ఆ.. దట్టమైన అడవి ప్రాంతాల్లో వున్నారు."


"వారి వలన మీకు ఎలాంటి చేదు అనుభవం లేదుగా!.."


"లేదు.. నేను వెళ్ళకముందు రెండు సంవత్సరాల క్రింద ఒక దారుణం జరిగిందట."


"ఏమిటది?"


"చినగంట్యాడ పోలీస్ స్టేషన్‍పై తుపాకుల కోసం నక్సల్స్ రాత్రి సమయంలో దాడి చేశారట. కొంతమంది పోలీసులు.. వారిలో కొంతమంది తుపాకుల కాల్పులకు బలైపోయారట."


"ప్రభుత్వం చేసే ప్రయత్నాలు వారిలో మార్పును తేలేక వున్నాయి కదూ!.."


"మార్పు అనేది వ్యక్తిగత విషయం. ఒక చేదు అనుభవం.. వ్యక్తుల మనస్సును మార్చేదానికి కారణం కాగలదు. ఆ సంఘటన తర్వాత కొందరు సరెండర్ అయ్యారు. కానీ.. వారిలోనూ తత్వభేదం.. అంటే పగ, ప్రతీకార వాంఛ కలవారు కొంతమంది ఆ కారణంగా కొందరు అడవుల్లోనే వుండి అష్టకష్టాలు పడుతున్నారు."


"వారి సమస్యలకు పరిష్కార మార్గమే లేదంటారా!.."


"సార్!.. ప్రతి సమస్యకూ సావధానంగా ఆలోచిస్తే పరిష్కారం దొరికి తీరుతుంది. వారు.. ముఠాతత్వాన్ని విస్మరించి.. మానవతా వాదాన్ని.. సహాజీవన విధానాన్ని.. కోరుకుంటే.. వారి సమస్య పరిష్కారం అయినట్లే. అలాంటి రోజు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను సార్" జిజ్ఞాసగా చెప్పాడు దివాకర్.


సమయం రాత్రి రెండు గంటల ప్రాంతం. గులాబీ కళ్ళు మూసుకొని నిద్రపోయింది. గోవిందరాజు గారు నిద్రకు ఉపక్రమించారు. దివాకర్ కొంతసేపు తాను నడుపుతానని చెప్పి.. ఆది స్థానంలో కూర్చున్నాడు.

*

పదిగంటలకు వారు హైదరాబాద్ చేరారు. హిమాయత్ నగర్‍లో వున్న దివాకర్ భవంతి కార్ పోర్టికోలో కారును ఆపాడు ఆది.


నలుగురూ దిగారు. దివాకర్ భార్య పార్వతి నవ్వుతూ వారికి స్వాగతం పలికింది.

నలుగురు స్నానాదులు చేసి పార్వతి వడ్డించగా భోజనం చేశారు.

దివాకర్.. పార్వతికి గులాబీని గురించి ఏకాంతంలో వివరించాడు. విషయాన్ని అర్థం చేసుకొన్న పార్వతి గులాబీని ఎంతో ప్రీతిగా చూచింది.


దివాకర్.. తన డిపార్టుమెంటు అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు.

అరగంటలో డి.ఐ.జి కొండలరావు వారి ఇంటికి వచ్చాడు. అందరినీ చూచాడు.

దివాకర్.. కొండలరావు, దివాకర్ ఆఫీస్ గదికి వెళ్ళారు. అది దివాకర్‍ది కాదు. యదార్థంగా లాయర్ పార్వతిది.


"దివాకర్!.. వాటీజ్ యువర్ ప్లాన్ నౌ!" అడిగాడు కొండలరావు.


"సార్!.. మీ దగ్గర ఎం.పి గారి ఫోన్ నెంబర్ వుందా!.."


"వుంది."


"మీరు వారికి ఫోన్ చేసి వారి అమ్మాయిగారు క్షేమంగా మన వద్ద వున్నట్లు, మనం వారిని కలిసేదానికి అపాయింట్మెంట్ తీసుకోండి సార్!.."


కొండలరావు.. ప్రొడ్యూసర్ వినాయకం గారికి ఫోన్ చేశాడు. యంగేజ్ సౌండు విన్నాడు.

"యంగేజ్‍లో వుంది దివాకర్!.. కొద్దిసేపు తర్వాత చేస్తాను."


"సార్!.. మరో ముఖ్య విషయం. హాల్లో మీరు చూచారే పెద్దాయన.. వారి పేరు గోవిందరాజు. వారి చిన్నబ్బాయి పేరు కిరణ్. గులాబీ, కిరణ్ బి.టెక్‍లో కాలేజీ మెట్స్. వారిరువురూ ప్రేమించుకొన్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.


కానీ.. వినాయకం గారు ఆమెతో సంప్రదించకుండా, వారి స్నేహితుని కుమారుడు.. అమెరికాలో ఉద్యోగంలో వున్న అతనితో వారం రోజుల్లో వివాహం చేయాలని నిర్ణయించి.. నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారట. తెల్లవారితే నిశ్చితార్థం అనగా ఆ గులాబీ హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్ళిపోయింది.


కిరణ్‍న్ని కలుసుకొంది. వారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఈమెను చూచి.. తమ కొడుకుతో.. వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకొన్నారు. ఆ విషయాన్ని వినాయకం గారితో మాట్లాడాలని గోవిందరాజుగారు వచ్చారు. ఈ విషయంలో.. మనం వారికి సాయం చేయవలసి ఉంది. సార్!.. దీనికి మీ అభిప్రాయం ఏమిటి?" వినయంగా అడిగాడు దివాకర్.

"అలాగా!.." సాలోచనగా అన్నాడు డి.ఐ.జి.


"అవును సార్!.."


కొద్ది నిముషాలు ఆలోచించి కొండలరావు..

"దివాకర్!.. మనం చేయగలిగిందల్లా ఒకటేనయ్యా!"


"ఏంటి సార్ అది?"


"మొదట మనిద్దరం వెళ్ళి అమ్మాయిని ట్రేస్ చేశామని ఈ సాయంత్రానికి ఆమె హైదరాబాద్ వస్తుందని.. ఆమె ప్రేమ విషయాన్ని.. ఆమె ప్రేమించిన కిరణ్ తల్లిదండ్రుల అభిప్రాయాన్నీ వారికి తెలియజేస్తాము. మనం చెప్పబోయే విషయాన్ని విని వారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వారు కిరణ్, గులాబీల వివాహానికి అంగీకరిస్తే.. గోవిందరాజుగారికి గులాబీని సాయంత్రం వారి ఇంటికి తీసుకొని వెళదాం. అప్పుడు గోవిందరాజుగారు వారితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడవచ్చు. వివాహ ముహూర్తాన్ని నిర్ణయించవచ్చు."


"సార్!.. ఒకవేళ వారు కిరణ్‍తో గులాబీ వివాహాన్ని నిరాకరిస్తే!.."


"మనం ఏం చేయలేము. గులాబీని వారికి అప్పగించి రావాల్సిందే!.."


సెల్‍ల్లో వినాయకం నెంబర్.. డయల్ చేశాడు డి.ఐ.జి కొండలరావు.

"దివాకర్!.. రింగ్ అవుతూ ఉంది."


"ఆఁ.. సార్ గుడ్ ఈవెనింగ్ సార్!.. అమ్మాయి వివరాలు తెలిశాయి. వైజాక్‍లోని మావారు ఈ సాయంత్రానికి అమ్మాయిగారితో వస్తున్నారు. వారు మనల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. బయలుదేరి రానా సార్!.."

..

"ఓకే సార్.. అరగంటలో మీ ముందుంటాను."

చిరునవ్వుతో.. కొండలరావు సెల్ కట్ చేశాడు.


"రమ్మన్నారా సార్!.. " అడిగాడు దివాకర్.


"అవును పద. అరగంటలో వారి ముందుండాలి."


ఇరువురూ.. గది బయటికి వచ్చారు. దివాకర్ విషయాన్ని గోవిందరాజుకు చెప్పి.. కొండలరావుతో.. వినాయకం ఇంటికి బయలుదేరాడు.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comentarios


bottom of page