top of page

జీవిత సత్యం

Writer's picture: Srinivasarao JeediguntaSrinivasarao Jeedigunta

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #JeevithaSathyam, #జీవితసత్యం, #TeluguHeartTouchingStories


Jeevitha Sathyam- New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 26/02/2025

జీవిత సత్యం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఆలా చొక్కా వేసుకుని వెళ్ళిపోతే ఎలా, నిన్న వచ్చిన జీతం యిటు ఇవ్వండి, యింటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి” అంది మొగుడు శంకరం కి అడ్డంగా నిలబడి సుజాత. 


జేబులోనుంచి అయిదు వేలు తీసి భార్యకి యిచ్చి, “యింతే వుంది నా దగ్గర, జాగ్రత్తగా వాడు” అంటున్న భర్తతో, “యింతే ఉండటం ఏమిటి, మీ జీతం అరవై వేలుగా” అంది సుజాత. 


అక్కడే మంచం మీద కూర్చుని వున్న అత్తగారు సుందరమ్మ "నోర్ముయ్, మొగుడికి అడ్డంగా నిలబడి డబ్బులు గురించి నిలదీసే దానివా? వాడి డబ్బు వాడిష్టం, మీ మామగారి ముందు నేను తల ఎత్తి మాట్లాడే దానిని కాదు” అంటూ అరుస్తోంది. 


“అందుకేనా ఆయన వెళ్ళిపోయాడు పైలోకానికి. మొగుడు డబ్బు యింట్లో ఇవ్వకపోతే సంసారం ఎలా జరుగుతుంది. మీకు వేళ పట్టున నాలుగు మెతుకులు ఎలా వస్తాయి” అంది అత్తగారి తో సుజాత. 


అంతే జుట్టు పట్టుకొని లాగి పక్కకి విసిరి, “మా అమ్మకి ఎదురు చెప్పేదానివా నువ్వు” అంటూ నోటికి వచ్చిన తిట్లు తిడుతూ బయటకు వెళ్ళిపోయాడు శంకరం. 


“అలా ఏడుస్తూ కూర్చోకుండా లేచి ఏదో ఒకటి వండి నాకు తగలెయ్యవే, అసలే షుగర్ పడిపోయి నీరసంగా వుంది” అని అంటున్న అత్తగారి వంక అసహ్యం గా చూసి, మెల్లగా గోడ పట్టుకుని లేచి సంచి తీసుకుని బయటకు బయలుదేరింది. 


“ఎక్కడకి పోతున్నావు, నా మాట వినిపించడం లేదా” అంటున్న అత్తగారితో, “నేను, పిల్లలు మింగడానికి బియ్యం తెస్తాను” అంది. 


“ఓసినీ పొగరు తగలెయ్యా, అంటే నేను కూడా మింగటానికి అనేగా, ఏదో లేనింటి పిల్లని తెచ్చుకుంటే సద్దుకుపోతుంది అనుకుంటే మమ్మలినే ఎదురించే స్టేజికి వచ్చావు, వాడు రాని, నీ విషయం తేల్చివేస్తాను” అని అంది సుందరమ్మ ముక్కు తుడుచుకుంటూ. 


రాత్రి పది దాటిన తరువాత ఇంటికి వచ్చాడు శంకరం. వంటగది లోకి వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకుని హాలులోకి వచ్చి తల్లిని అడిగాడు ‘నువ్వు తిన్నావా’ అని. 


“తిన్నాను, ఏడుస్తూ పెడితే ఏం వంటపడుతుంది” అంది. 


“అదేమిటి? ఉదయం డబ్బు యిచ్చానుగా. సరుకులు తీసుకుని రాలేదా?” అన్నాడు. 


“ఈ ఆర్డరాత్రి ఎందుకురా గొడవ, రేపు మీ ఆవిడకి చెప్పు, అమ్మతో సవ్యంగా లేకపోతే నీ ఇంటికి పొమ్మని” అంది సుందరమ్మ. 


“అది ఇంటికి పోతే నీ కంచం లో అన్నం ఎలా వస్తుంది, నా పెళ్లి అయిన దగ్గర నుంచి నువ్వు మంచం దిగకుండా దానితోనే వండిస్తున్నావు” అన్నాడు. 

“నువ్వు కూడా మారిపోయావు నాయనా, అవునులే రాత్రి అయ్యిందిగా” అంటూ కూనిరాగం తీసింది. 


తన గదిలోకి వెళ్ళి మంచం మీద పిల్లల పక్కన పడుకున్నాడు. ‘ఎందుకు అలవాటు అయ్యిందో ఈ పేకాట, డబ్బులు పోవడమే గాని రావడం లేదు. ఈ ఊబిలోనుంచి బయటకు రాలేకపోతున్నాను’ అనుకుంటూ పిల్లల మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాడు శంకరం. 


భారంగా తెల్లారింది. పిల్లలని స్కూల్ కి పంపి భర్తకి లంచ్ బాక్స్ సద్ది టేబుల్ మీద పెట్టింది. 


“యిదిగో, నిన్న యిచ్చిన డబ్బులో ఒక వెయ్యి రూపాయలు యివ్వు, సాయంత్రం తిరిగి యిస్తాను” అన్నాడు భార్య తో శంకరం. 


“కిరాణా షాప్ వాడికి బాకీ తీర్చి, ఈ నెలకి సరుకులు తెచ్చాను, నా దగ్గర రెండు వందలు కంటే లేదు. యింకా పాలవాడికి డబ్బులు యివ్వాలి. మీరే ఏమన్నావుంటే ఇవ్వండి” అంది వంటగదిలోనుంచి 

బయటకు రాకుండా. 


“ఎప్పుడూ లేదని ఏడుపే” అన్నాడు చిరాకుగా. 


“అబ్బాయి.. దానిని అడిగి ఉపయోగం ఏముందిరా. మరీ అంతగా డబ్బులు అవసరం అయితే నా పెన్షన్ లో నుంచి కొంత తీసుకో, అయినా నిన్ననే కదరా నీ జీతం వచ్చింది. అప్పుడే అయిపోయిందా” అంది సుందరమ్మ. 


‘తల్లికి ఏమి తెలుసు ఆవిడ పెన్షన్ కూడా పేకాటలో పోయింది’ అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. 


“ఆ మాట అడిగినందుకేగా నన్ను మీరు నానా మాటలు అని మీ అబ్బాయి చేత కొట్టించారు. కొడుకు మీద ప్రేమ తో మీ అబ్బాయి ని మీరే నాశనం చేస్తున్నారు” అంది అత్తగారితో సుజాత. 


“నువ్వు కాలు పెట్టిన వేళావిశేషం వాడు యిలా తయారయ్యాడు, అంతా నాఖర్మ” అంది సుందరమ్మ. 


ప్రతీ రోజు ఏదో ఒక గొడవతో గడుస్తోంది. సుజాత ఆడపడుచులు తమ్ముడు శంకరం ని ఏమి అనలేక, సుజాత కి కొంత డబ్బు సహాయం చేస్తున్నారు పిల్లలని చదివించుకోవడానికి. సుందరమ్మ అంటే ఆడపిల్లలకి కూడా అసహ్యం కలిగింది, తమ తల్లే తమ్ముడు చెడిపోవడానికి, వదినగారు బాధలు పడటానికి కారణం అని. 


“శనివారం మీకు సెలవేగా.. ఎక్కడికి బయలుదేరారు, ఈ రోజు అయినా పిల్లలతో గడపాలని అనిపించిదా” అంది భర్తతో సుజాత. 


“యింట్లో వుంటే ఏముంది, నీ ఏడుపుగొట్టు మాటలు తప్పా, వాడికి డబ్బు బాకీ, వీడికి డబ్బులు బాకీ అని అనడం, అందుకే బయటకుపోతున్నా” అన్నాడు. 


“చూడండి, మీరు యిలా జీతం మొత్తం ఖర్చు పెట్టుకుని ఇంట్లో అయిదు వేలు యిస్తే ఈ సంసారం నడపటం కష్టంగా వుంది. అందుకే మా అన్నయ్య వాళ్ల ఆఫీస్ లో చిన్న ఉద్యోగం వుందిట, అందులో జాయిన్ అవుతాను రేపు సోమవారం నుంచి. వచ్చే జీతం తో పిల్లలకి కడుపునిండా భోజనం పెట్టగలుగుతాను” అంది. 


“మీ అన్నయ్య ఆఫీసు మన యింటి నుంచి యిరవై కిలోమీటర్లు, ఎలా వెళ్తావు, అక్కర్లేదు యింట్లో వుండు” అన్నాడు శంకరం. 


“పోనిలేరా. డబ్బు సంపాదన ఎంత కష్టమో దానికి తెలుస్తుంది, వెళ్ళని” అంది సుందరమ్మ. 


సోమవారం ఉదయమే లేచి, అన్ని పనులు పూర్తి చేసుకుని, భర్త ని ఆఫీస్ కి పంపి, తను కూడా ఆఫీసు కి బయలుదేరుతో, “మీ భోజనం టేబుల్ మీద పెట్టాను”, అంది యింకా పడుకుని నిద్రపోతున్న అత్తగారితో సుజాత. 


బస్సులు పట్టుకుని సాయంత్రం ఇంటికి చేరే సరికి ఆరుగంటలు అయ్యింది. యింకా అత్తగారు పడుకునే ఉండటం చూసి, ‘ఈవిడకి ఈ నిద్ర ఉండటం తో నేను బతికి వున్నాను’ అనుకుంటూ టేబుల్ మీద గిన్నెలో చూస్తే పెట్టిన అన్నం పెట్టినట్టే వుంది. అదేమిటి యివిడగారు అన్నం తినలేదు అంటూ వెళ్ళి ‘అత్తయ్యగారు’ అని పిలిచింది. ఉలుకు లేదు పలుకు లేదు.  అనుమానం కలిగి చెయ్యి పట్టుకుని చూసింది సుజాత. కొంపముంచి వెళ్ళిపోయింది సుందరమ్మ. ఎంతైనా అత్తగారు, దానితో ఒక్కసారి గా కెవ్వున అరిచి, భర్తకి ఫోన్ చేసి చెప్పింది. 


“మా అమ్మకి మొద్దు నిద్ర అలవాటే, సరిగ్గా చూసావా” అన్నాడు శంకరం కంగారుగా. 

“ఆ చూసాను, ఒళ్ళు ఐస్ లా వుంది, ఊపిరి ఆడటం లేదు, మీరు త్వరగా రండి, నాకు భయం గా వుంది” అంది సుజాత. చేతిలో పేకముక్కలు కింద పడేసి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే చుట్టు పక్కన ఇళ్ల వాళ్ళు తమ యింటి ముందు వుండటంతో ఏడుస్తూ తల్లి పక్కన కూర్చున్నాడు. 


భర్తకి గ్లాస్ లో నీళ్లు తెచ్చి యిచ్చి, “ధైర్యంగా వుండండి, మీ అక్కగారు వాళ్ళు వస్తున్నారు” అంది. 


భార్య వంక చూస్తో, “అమ్మ యిలా వెళ్ళిపోతుంది అనుకోలేదు, నెల మధ్యలో వున్నాము, చేతిలో కాణి లేదు, అప్పు యిచ్చే వాళ్ళు లేరు, యిప్పుడు ఈ కార్యక్రమం ఎలా చెయ్యాలి. మా అక్కయ్యలని అడిగి చూడు, ఏమైనా డబ్బులు ఇవ్వగలరేమో, వాళ్ళకి కూడా బాధ్యత వుంది గా” అంటున్న భర్త వంక, అత్తగారి వంక చూసి, ‘ఊపిరి వున్నంతవరకు నా ఊపిరి తీసింది యిలా శవం గా మారి తనకి చివరి కార్యక్రమం కోసం ఎదురు చూస్తోంది. వచ్చే జీతం మొత్తం తగలేసుకుని, తల్లి మాటలు విని భార్య ని బాధ పెట్టి యిప్పుడు ఏమిచేయ్యలేని స్థితి లో వున్నాడు’ అనుకుని భర్తని పక్క గదిలోకి పిలిచి “యిదిగో నా గాజులు, యివి తీసుకుని వెళ్ళి డబ్బులు తెచ్చి ముందు మీ అమ్మగారిని సంతృప్తి గా పంపించండి. జాగ్రత్తగా రండి, డబ్బులు చేతిలోకి రాగానే మీ మనసు ఎటు లాగుతుందో నాకు తెలుసు” అంది. 


“సుజాత, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు ఈ గాజులు పక్కన యింటి మూర్తి గారికి యిచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని రమ్మను. నువ్వు ఈ ఆపద సమయంలో ఆడుకున్నందుకు నాకు ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు” అన్నాడు. మొత్తానికి భర్తలో మార్పు వచ్చినందుకు సంతోష పడింది. 


జరగవలసిన కార్యక్రమాలు పదిరోజులు యిల్లు కదలకుండా సవ్యంగా జరిపించాడు శంకరం. సెలవు పూర్తి అయిన తరువాత ఆఫీస్ కి బయలుదేరుతున్న భర్తతో “ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారుగా” అంది.


అలాగే అని వెళ్లిన శంకరం అలవాటు ప్రకారం గాజులు తాకట్టు పెట్టిన డబ్బులో మిగిలిన రెండు వేలు పెట్టి పేకాట లో కూర్చున్నాడు. షరా మాములుగా డబ్బులు పోగుట్టుకుని రాత్రి పదిగంటలకు యింటికి చేరుకున్నాడు. భార్య పడుకుని ఉండటం తో కంచం లో అన్నం పెట్టుకుని తినడం చూసి సుజాత “మీరు మారరా, సిగ్గు అనిపించడం లేదా” అంది. 


“తింటున్న కంచం భార్య మీదకి విసిరి, అసలే తల్లిపోయిన బాధలో కొద్దిగా బయట గడిపి వస్తే మాటలతో బాధ పెడ్తావా. నోరు ఎత్తకుండా పడివుండు, లేదంటే నేనే యిల్లు వదిలిపెట్టి పోతాను” అన్నాడు. 


మొహం మీద పడ్డ మెతుకులు తుడుచుకుని సుజాత ఆలోచిస్తో పడుకుంది. ‘ఈ మనిషి మారడం కష్టం. ‘పిల్లలని తీసుకుని’, అన్నయ్య, ‘వచ్చేయి, కొన్నళ్ళు దూరంగా వుంటే బుద్ది వస్తుంది’ అన్నాడు. కానీ తన సంసారం వాడికి భారంగా ఉంచడం యిష్టం లేక ఈ నరకం లో ఉంటున్నాను. పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవ్వడంతో నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు పక్కన ఇంటికి వెళ్ళి వుంటున్నారు, ఈ బాధలకు విముక్తి ఎప్పుడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. 


రేపు ఎలగైన పోయిన డబ్బులు గెలుచుకుని పెళ్ళాం పిల్లలు ని సరిగ్గా చూసుకోవాలి అనుకుంటు పడుకున్నాడు శంకరం. 


తెల్లారింది, భర్త కి లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి సుజాత ఆఫీస్ కి వెళ్ళిపోయింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి భర్త యింట్లోనే ఉండటం చూసి ఆశ్చర్యంతో, మీరు ఆఫీసు కి వెళ్లలేదా అని అడిగింది సుజాత. వెళ్ళాను, చేతిలో కాణి లేనప్పుడు అక్కడ వుండి లాభం ఏముంది, డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడు అని అర్ధం అయ్యింది. ఇన్నాళ్ళు నేను యిచ్చే అరాకొర డబ్బుల తో యిల్లు ఎలా గడిపావో తలుచుకుంటే సిగ్గుగా వుంది అన్నాడు శంకరం. 


యింట్లోకి కి వెళ్ళి కాళ్ళు కడుగుకుని వచ్చి వంటగదిలోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. భర్త కాళ్ళు కాలిన పిల్లిలా యింట్లో అటుయిటు అసహనం గా తిరగడం చూసి, భర్త మనసులో ఏముందో తెలుసుకుందామని, “ఎందుకు ఆలా అసహనంగా వున్నారు, నా దగ్గర వున్న వెయ్యి రూపాయలు ఇవ్వమంటారా.. మళ్ళీ వెళ్ళి ఆడుకుందురు గాని” అంది. 


అప్పటివరకు ఏదోలా వున్న శంకరం, “నిజంగానే యిస్తావా, ఈ ఒక్కరోజు ఆడి, డబ్బులు సంపాదించుకుని వస్తాను” అంటూ చెయ్యి జాపాడు.. 


పర్సు లో నుంచి డబ్బు తీసి భర్త చేతిలో పెట్టి “మీరు మారరు, యిదే నా చివరి మాట మీతో” అంది తిరిగి వంటగది లోకి వెళ్ళిపోతో. 


అలవాటు ప్రకారం అర్దరాత్రి ఇంటికి చేరుకుని సోఫాలో పడుకుని నిద్రపోయాడు. తెల్లారింది లేచి చూసిన శంకరం కి అప్పుడే భార్య ఆఫీసుకి తయారు అయ్యి వుంది. మెల్లగా లేచి మొహం కడుక్కుంటూ ఆమ్మో అంటూ కుప్పకూలిపోయాడు. అది చూసి కంగారుగా భర్తని లేపి సోపాలో కూర్చోపెట్టి ఏమైంది అంది.


జవాబు ఇవ్వకుండా చెస్ట్ రుద్దుకుంటో ‘నొప్పిగా వుంది’ అన్నాడు

ఆయాస పడుతూ. 


చేతిలో వున్న బ్యాగ్ మంచం మీద పడేసి, అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. 


“భయపడకు, అంబులెన్సు పంపుతున్నా, నేను, మీ వదిన కూడా వస్తున్నాము” అన్నాడు. అయిదు నిమిషాలలో అంబులెన్సు ఆతరువాత ఐదు నిమిషాలలో అన్నగారు వాళ్ళు వచ్చేయడం సృహ తప్పి వున్న శంకరం ని హార్ట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. 


ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ సుజాత తో చెప్పాడు, “మూడు బ్లాక్స్ వున్నాయి, త్వరగా ఆపరేషన్ చెయ్యటం అవసరం, కొద్దిసేపట్లో రూమ్ కి తీసుకుని వస్తారు, మీరు ఆపరేషన్ కి ఓకే అంటే వెళ్లి అకౌంట్స్ సెక్షన్ లో ప్యాకేజీ గురించి అడిగి తెలుసుకుని డబ్బులు కట్టండి’ అన్నాడు. 


డాక్టర్ గారి మాటలకు ‘యిప్పుడు ఆపరేషన్ అంటే డబ్బులు ఎక్కడ నుంచి తీసుకుని రావాలి, పోనీ ఇన్సూరెన్స్ వుందా అంటే అదికూడా లేదు’ అనుకుంటూ భర్తని తీసుకుని వెళ్లిన రూమ్ కి వెళ్ళింది. 


మెల్లగా కళ్ళు తెరిచి “డాక్టర్ ఆపరేషన్ అన్నాడు, నేను ఆపరేషన్ చేయించుకోను, ఇప్పటికే నీకు చేసిన అన్యాయం చాలు, యిప్పుడు గుండెల్లో నొప్పికూడ లేదు” అన్నాడు. 


“మీరు కంగారు పడకండి, మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను అన్నయ్య ని అడిగి ఎక్కడైనా అప్పు తీసుకోమని అడుగుతాను. భగవంతుడు వున్నాడు” అంది భర్త చెయ్యి పట్టుకుని సుజాత. 


భార్య మాటలు విన్న శంకరం, “సుజాత.. నీకు నేనంటే అసహ్యంగా లేదా, నేను పేకాటలో డబ్బు బాగా సంపాదించి యిల్లు కొనుక్కుని మనం హాయిగా ఉండాలి అని అనుకున్నాను, కాని బురదలో దిగిపోయాను అని అనుకోలేదు, నిన్ను ఏడిపించినందుకు దేముడు నాకు సరైన శిక్ష వేసాడు” అన్నాడు కళ్ల నిండా నీరుతో. 


బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకుని వచ్చిన సుజాత అన్నగారు, చెల్లెలు బావగారు ఏదో మాట్లాడుకోవడం చూసి గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అన్నగారి చేతిలో నుంచి టిఫిన్ ప్యాకెట్ తీసుకుని టేబుల్ మీద పెట్టి అన్నగారిని తీసుకుని వరండాలోకి వెళ్ళి డబ్బు గురించి చెప్పింది. ఒక్కసారి ఆలోచించి, “సుజాత, నాన్న నీకు రాసిచ్చిన పొలం మీ ఆయన బలవంతంగా అమ్మకానికి పెట్టినప్పుడు ఆ పొలం నేను కొనుకున్నాను గుర్తుందిగా.. అది నేను కొనుకున్నా నీ పొలమే. దాని మీద డబ్బు అప్పు తీసుకుందాం. బావగారి ఆరోగ్యం ముఖ్యం మనకి” అన్నాడు. 

“అన్నయ్య, నీకు అంతా నాన్న పోలిక వచ్చింది, యింత మంచితనం మా మీద చూపిస్తున్నావు.. ముందు ఈ గండం గట్టేక్కితే ఆ బాకీ మీ బావగారు తీరుస్తారని నమ్మకంగా వుంది. యింత దెబ్బ తగిలిన తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది” అంది సుజాత. 


చెల్లెలు చెయ్యి పట్టుకుని నవ్వి “దాని గురించి ఆలోచించక ముందు బావగారికి టిఫిన్ పెట్టి నువ్వు తిను. నేను డబ్బు వేట లో పడతాను” అన్నాడు. 


“ఏమంటున్నాడు” అని అడిగాడు శంకరం. 


“టిఫిన్ తీసుకునివచ్చాడు”, అంటూ పొట్లం విప్పి, ఇడ్లీ ముక్క భర్త నోటికి అందించింది. 


భార్య చెయ్యి పట్టుకుని “నేనేగా ఎన్నోసారులు తినే కంచం నీ మీద విసిరేసాను, అయినా నువ్వు దేవతలా నాకు తినిపిస్తున్నావు” అన్నాడు బాధగా. 


“చూడండి.. భార్య భర్తల మధ్య జరిగింది అప్పుడే మర్చిపోవాలి. మీ కోసం నేను, నా కోసం మీరు అంతే. మీలోని మార్పు శాశ్వతంగా ఉండేడట్లు చూసుకోండి. మన పిల్లలని బాగా చదివించుకుందాం” అంది. 


“అయితే నేను బతుకుతాను అని నువ్వు నమ్ముతున్నావా, ఆపరేషన్ కి కావలిసిన డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి సుజాత” అన్నాడు. 

“మీ బావమరిది అన్ని చూసుకుంటాడు. మీరు మళ్ళీ ఆఫీసుకి వెళ్లి ప్రతీ నెల మీ జీతం నుంచి బాకీ తీరుస్తారు, అనవసరంగా ఆలోచించక విశ్రాంతి తీసుకోండి” అంది.. 


మూడు రోజుల తరువాత ఆపరేషన్ అయ్యి రూంకి తిరిగి వచ్చాడు శంకరం. సుజాత, సుజాత అన్నగారు బావగారి దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నారు. 



“ఒక నెల రోజులు తరువాత ఆఫీస్ కి వెళ్ళవచ్చు అమ్మా, లేటెస్ట్ టెక్నాలజీ తో ఆపరేషన్ చెయ్యడం వలన కుట్లు ఎక్కువ పడలేదు” అని చెప్పి శంకరం ని డిశ్చార్జ్ చేసారు. 


బలమైన ఆహారం, టైముకి మందులు యిచ్చేది సుజాత. త్వరగానే కోలుకున్నాడు శంకరం. “ఈరోజు మీరు ఆఫీస్ కి ఆటోలో వెళ్ళండి. లంచ్ కాగానే మందులు వేసుకోండి” అని భర్తకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీసుకి వెళ్ళిపోయింది. ఆఫీస్ లో మిత్రులు కనిపించగానే మళ్ళీ పాత అలవాటుకి లొంగిపోతాడేమో అని అనుకుంది. 


సాయంత్రం నాలుగు గంటలకు తనకి భర్త నుంచి ఫోన్ రావడం తో కంగారుగా హలో అంది. 


“నేనే మాట్లాడుతున్నాను, సాయంత్రం త్వరగా వస్తే ఫస్ట్ షో సినిమా కి వెళ్దాం” అన్నాడు. 


“అలాగే వచ్చేస్తాను, మీరు వస్తారా అన్నమాట ప్రకారం” అంది. 

“జీవిత సత్యం బోధపడింది, యిహ మన జీవితం ఆనందంగా గడిచేలా వుంటాను” అన్నాడు శంకరం. 


శుభం


                                 

-జీడిగుంట శ్రీనివాసరావు













 
 
 

コメント


bottom of page