top of page
Writer's picturePitta Govinda Rao

జీవితం ఒక శాపం


'Jeevitham Oka Sapam' - New Telugu Story Written By Pitta Gopi

'జీవితం ఒక శాపం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ప్రపంచం ఎంత అభివృద్ధి సాదిస్తున్నా కూడా ఈరోజుల్లో ఒక మనిషి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మోసపోకుండా ఉండని మనిషి అంటూ ఈ భూమి మీద లేరంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.


కొంతమంది, మనుషుల గూర్చి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ తెలుసుకునే లోపే మోసపోతుంటారు. అది సొంత మనుషులు అయినా.. , బయటవారు అయినా.. మోసం చేయటం, నమ్మకం కోల్పోవటం అనేది కామన్.


ఒక మనిషి ఎలాంటివాడో తెలుసుకోవటం అంటే మాటలు కాదు ఈరోజుల్లో. మోసపోకుండా ఒకరు మంచోడో, చెడ్డవాడో కూడా తెలియదు.


రాణి చదువుకున్నప్పటికి తనకు ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళాలన్న ఎవరో తోడు ఉండాలి. లేకపోతే భయపడుతుంది, ఏ పనైనా తన వల్ల అవుతుందా లేదా అని.


రాణికి పెళ్ళి కుదిరింది. కాబోయే వాడు ఎవరో కాదు..

తన తల్లికి తమ్ముడే. అయినా పెళ్లి విషయంలో కాస్త బాధ పడుతూ ఉంటుంది రాణి. ఎందుకంటే రాణి తండ్రి యొక్క అక్కగారి కొడుకు ప్రణయ్ కూడా రాణిని అమితంగా ప్రేమించాడు. కానీ రాణి మాత్రం తన తల్లి గారి తమ్ముడు సిద్దుని పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకుంది.


ఇక కొద్దిగా గతానికి వెళ్తే..


ఇద్దరు కూడా తనను ఎంతోగానో ప్రేమించారు. తనకు ఏమి కావాలంటే అది ఇస్తూ ఉండేవారు. అయితే ప్రణయ్ కంటే సిద్దు నే రాణికి బాగా క్లోజ్ మరియు చిన్నప్పటి నుండి ఎక్కువగా రాణి ఊరు వస్తూ ఉండేవాడు.


రాణి సిద్దు సొంత అక్క కూతురు కాబట్టి ఎప్పుడు తమ ఇంటికి వచ్చినా ఏ సమస్య ఉండదు.


అలాగే రాణికి స్కూల్ స్థాయి నుండి కాలేజ్ స్థాయి వరకు ఏ సహాయం కావాలన్నా... అన్ని సిద్దూనే చూసుకునేవాడు.


ఒక స్కూల్ జాయినింగ్ అన్నా..

ఒక పబ్లిక్ పరిక్షలు తొలి రోజు అన్నా...

ఇంకా ఇలాంటి ఏ పనైనా ఉంటుంది అంటే చాలు రాణికి తోడుగా ఉంటాడని సిద్దుని తమ ఊరు పిలిచేసేది రాణి తల్లి. అందుకే రాణి, సిద్దులు ఎక్కువ క్లోజ్.


రాణి కూడా భవిష్యత్ ని, రాబోయే రోజులను, బందుమిత్రులును తెలుసుకోకుండా ముందే సిద్దు నే పెళ్ళి చేసుకుంటానని చెప్పేసింది.


ఆ కారణమో... లేదా పరాయి ఆడవాళ్ళు మోజు ఏమో.. సిద్దు రాణిని ప్రేమిస్తూ... పరాయి ఆడవాళ్ళు తో ఎఫైర్ కొనసాగించేవాడు. ఈ విషయం మాత్రం రాణికి తెలియదు.


ఇది రాణి సిద్దుల బంధం.


ఇక ప్రణయ్ రాణి రజస్వల ఫంక్షన్ కి తన తల్లితో వెళ్లి తొలిసారి చూశాడు. అంతకు ముందు కూడా తాను చూసే ఉంటాడు కానీ తాను చిన్నపిల్ల అయి ఉంటుంది.


ఫంక్షన్ లో రాణి అందం చెలాకీతనం, బంధుమిత్రులతో ఆమె నడవడిక చూసి ముగ్దుడైపోతాడు. తనతో పదే పదే ఫొటోలు దిగటంతో రాణి ప్రణయ్ గూర్చి తెలుసుకుంది. అతడు తనకు బావే అని తన తండ్రి యొక్క అక్క కొడుకని తాను కూడా ప్రణయ్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రణయ్ మంచివాడు. మరియు అందంగా కూడా ఉండటంతో రాణి మనసు దోచుకున్నాడు. ప్రణయ్ అంటే రాణికి కూడా ఇష్టం ఏర్పడటంతో ప్రణయ్ అప్పటి నుండి ఏ చిన్న అవకాశం దొరికినా.. రాణి ఊరు వెళ్తూ.. తనను చూసి వస్తూ ఉండేవాడు.


ఇక వర్తమానానికి వస్తే


చిన్నప్పటి నుండి తోడు నీడగా ఉన్నాడు. అందుకే సిద్దుని పెళ్ళి చేసుకుంటానని నిర్ణయించుకునే సరికి ప్రణయ్ మారు మాట్లాడకుండా కంటతడి పెట్టి వెళ్ళిపోయాడు.


అలా రాణి సిద్దులు పెళ్ళి జరిగింది.

కొంతకాలం వారి కాపురం బాగా సాగింది. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు కదా..


రాణి యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు చలనం కోల్పోయాయి. జీవితాంతం వీల్చైర్ కి పరిమితం అవ్వల్సిందని అయితే అనుకోకుండా ఒక్కోసారి కాళ్ళకు చలనం రావొచ్చని కానీ ఖచ్చితంగా చెప్పలేమని డాక్టర్లు చెప్పారు.


అప్పటి నుండి అత్త మామల నుండి రాణికి ఏ గౌరవం కూడా రాలేదు. సరికదా సిద్దు పరాయి ఆడవాళ్ళు తో తృప్తి పొందుతూ రాణిని నిర్లక్ష్యం చేయటంతో తాను పుట్టింటికి పోయింది.


అలా ఎంత కాలం అయినా సిద్దులో మార్పు రాక రాణి పుట్టింటికే పరిమితం అయింది.


ప్రణయ్ ని వదులుకుంది రాణి మాత్రమే కానీ రాణి తల్లిదండ్రులు కాదు కదా. వారిని చూసేందుకు ప్రణయ్ రాగా రాణిని ఆ పరిస్థితుల్లో చూసి బిగ్గరగా ఏడవసాగాడు.


రాణిని క్షమించి తనను అలా బయటకు తీసుకెళ్తూ తనలో ధైర్యం నింపుతూ నవ్వులను బహుమతి గా ఇచ్చేవాడు.


అలా రాణి ప్రణయ్ లు రిజిస్టర్ మేరీజ్ చేసుకున్నారు. వారి కాపురం చక్కగా సాగుతోంది.


కొంతకాలానికి రాణి కాళ్ళకి చలనం వచ్చింది. ఇప్పుడు ప్రణయ్ తో రాణి సాధారణ జీవితం గడుపుతుంది.


ఈ విషయం తెలిసి సిద్దు ఒకరోజు ప్రణయ్ కి తెలియకుండా రాణికి కలిసి " క్షమించమని, తాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని చిన్నప్పటినుండి ఎంతో ప్రేమ చూపితే ఒక్కసారి పట్టించుకోనంత మాత్రాన తనను వదిలిపోతావా... రిజిస్టర్ మేరీజ్ కంటే పెద్దలు ముందు జరిగిన పెళ్ళే చెల్లుబాటు అవుతుంది " అని

"తనవెంట రావాలి" అని ఒప్పించి తీసుకెళ్ళిపోయాడు సిద్దు.


ఈ విషయంలో రాణి తల్లిదండ్రులు కూడా కాస్తా ఆందోళన చెందారు. ఎందుకంటే మొదటే మోసం చేసింది చాలక ఆపదలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకున్న ప్రణయ్ ని వదిలేసింది కాబట్టి.


ఈసారి సిద్దు మోసం చేస్తే ప్రణయ్ మాత్రమే కాదు తాము కూడా క్షమించలేమనే నిర్ణయానికి వచ్చేశారు రాణి తల్లిదండ్రులు.


సిద్దు బాగానే చూసుకుంటున్నాడు రాణిని. దీంతో అనవసరంగా ప్రణయ్ తో రిజిస్టర్ మేరీజ్ చేసుకున్నానని బాధపడి సిద్దు సహాయం తో దాన్ని రద్దు చేసుకోగల్గింది.


కాలం వేగంగా ముందుకు వెళ్ళింది. ఒకలా ఉండదుగా మరీ !


మనుషులం కదా.. కాలం పెట్టే పరిక్షలనే కాక, మన అనుకునేవాళ్ళు పెట్టే బాదలు, కన్నీళ్లను కూడా ఎదుర్కుంటున్నాం.


ఈసారి ఇంట్లో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారిపడి కాళ్ళ సమస్య తిరగబెట్టింది.


అప్పటికీ కానీ రాణికి అర్థం కాలేదు. తనను ఇష్టంగా ప్రేమించే వారు ఎవరో, కష్టంగా నమ్మకద్రోహంతో ప్రేమించేవారు ఎవరో అని. సిద్దు మరలా వీల్చైర్ కి పరిమితం అయిన రాణికి దూరం పెట్టగా ఎంత కోపం ఉన్నా.. కష్టాల్లో తల్లిదండ్రులే కదా ఎవరికైనా దిక్కు. తల్లిదండ్రులు చెంతకే వెళ్ళింది రాణి.


ఈసారి జరిగిన మోసాన్ని గ్రహించి బాధపడుతు మరలా ప్రణయ్ రాకకోసం వేచిచూస్తుంది రాణి.


అనుకున్నట్లే కొంతకాలానికి ప్రణయ్ వచ్చాడు.


కానీ.

రాణి కోసం కాదు.

తన వివాహ వేడుకలకు రాణి కుటుంబాన్ని ఆహ్వానించడానికి.


వివాహ పత్రికను రాణి చదివింది. ప్రణయ్ కి తాను చేసిన గాయాన్ని, తన బాధను ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చింది. ఓదార్చటానికి ఇప్పుడు ప్రణయ్ తన సొంతం కాదు తనకు కేవలం ఒక బంధువు మాత్రమే


రెండుసార్లు ఒక మంచి వ్యక్తి అది కూడా తనకు బంధువును వదులుకుని నాశనం అయ్యాననే బాధ ఒకవైపు..


చిన్నప్పటి నుండి తనతో ఉంటూ తనకు సహకారాలు అందించిన సిద్దు రహస్యాలు, వ్యక్తిత్వం తెలుసుకోలేకపోయాననే బాధ మరోవైపు..


నిజంగా రాణి జీవితం ఒక శాపంలా ఉంది కదా.. అని తల్లిదండ్రులు తాము బతికున్నంత వరకు రాణిని చూసుకునేందుకు సిద్దపడ్డారు.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





46 views0 comments

Comments


bottom of page