top of page

జ్ణాపకాలు

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #జ్ణాపకాలు, #Jnapakalu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Jnapakalu - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 13/03/2025 

జ్ణాపకాలు - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పెరటి తోటలో పూల మొక్కలను చూస్తూ, మనసులో పేరుకున్న విషాదాన్ని కొంతైనా తగ్గించుకోవాలన్న సత్యదేవ్ ఆశ నెరవేరేలా లేదు. ఆ విషాదానికి మూలమైన సంఘటనల తాలూకు జ్ణాపకాలు, మరుగునపడనిదే వుపశమనమెలా లభిస్తుంది?


జ్ణాపకాలు. ఒకటా, రెండా? ఆరు దశాబ్దాల జీవిత కాలానికి సంబంధించినవి. కొన్ని సంతోషాన్ని నింపినవి. కొన్ని జీవితాన్ని మలుపు తిప్పినవి. కొన్ని తాత్విక చింతనను పెంచినవి. అటువంటి జ్ణాపకాలకు కారణమైన వ్యక్తి గోపాల్, ఈ రోజు భౌతికంగా లేడు. ఎనిమిది దశబ్దాల, సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆయన, ఒక వేదాంతిలా, ఒక యోగిలా ప్రశాంతంగా, మృత్యువుని చిరునవ్వుతో కౌగలించుకున్న తీరును తల్చుకుని సత్యదేవ్ యిలా అనుకున్నాడు. 

"గోపి బావగారూ ! మీకు భాష్పాంజలి ఘటించడం సరికాదు. అందుకోండి నా పుష్పాంజలి. ఒక హితుడిగా, ఒక మార్గ నిర్దేశికునిగా, ఒక తార్కికునిగా, నాజీవితాన్ని అర్ధవంతం చేసిన మీకు ధన్యవాదములు." అని అనుకుంటూ అతను కొన్ని పూవులను కోసి తులసి మొక్కకు అర్పించాడు. 

అంతలో అతని భార్య లలిత వచ్చి, "మీ అక్క" అంటూ ఫోన్ అతనికి అందించింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, అతను తృప్తిగా నిట్టూర్చాడు. అతని మనసు గతంలోకి పరుగుతీసింది. 

@@@

ఇది సత్యదేవ్ మొదటి మధుర జ్ణాపకం. 


సత్య దేవ్ అక్క నీల, బి. యే పాసైన పది రోజులకే, వారి మేనత్త ఒక పెళ్ళి సంబంధం తెచ్చింది. ఆమె పిల్లలందరి ముందే, సత్య దేవ్ తండ్రి లక్ష్మణ్ తో యిలా చెప్పింది. 


"తమ్ముడూ, నీ భార్య మానసిక వైకల్యం తెలిసి కూడా మన అమ్మాయిని చూస్తామని, నచ్చితే చేసుకుంటామనే ఒక మంచి సంబంధం వుంది. గోపాల్, మన చుట్టాలబ్బాయే. అతను ఇంజినీరింగ్ పూర్తి చేసి, అమెరికా వెడుతున్నాడు. అతనికి పెళ్ళి చేసి పంపించాలని వాళ్ళ అమ్మగారు తొందరపడుతున్నారు. వారిని వెంటనే సంప్రదించు." 


 లక్ష్మణ్ సంతోషంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. పెళ్ళి చూపులు యేర్పాటయ్యాయి. నీల ను చక్కగా అలంకరించారు. సహజంగానే అందగత్తయిన ఆమె, ముతైదువులు చేసిన అలంకారంతో, ఒక దేవ కన్యలా మెరిసిపోతోంది. వచ్చిన వరుడు, కాదని అనలేడు, అని సత్యదేవ్ భావించాడు. అదే జరిగింది. అయితే, గోపాల్ స్నేహితుడు, అతడిని ప్రక్కకి తీసుకుని వెళ్ళి, యేదో మాట్లాడాడు. 


గోపాల్ చిరునవ్వుతో వెనక్కి వచ్చి, ఆదుర్దాగా చూస్తున్న లక్ష్మణ్ తో "అత్తయ్య గారి మానసిక స్థితి బాగోలేదు కదా! ఆ బలహీనత, మీ అమ్మాయికిగాని, లేదా పుట్ట బోయే పిల్లలకి గానీ రావచ్చునని అంటున్నాడు."


ఆ మాటలకు తండ్రి ముఖం పాలిపోవడం గమనించిన సత్య దేవ్ కి, ఆ స్నేహితుడి మీద పీకల దాకా కోపం వచ్చింది. చిన్నవాడుగా యేమనలేక, గోపాల్ ఇంకా యేమంటున్నాడో, అని చెవులు రిక్కించాడు. 


"నాకు నీల నచ్చింది. చురుకుదనం, తెలివి తేటలు వున్న అమ్మాయి అయితే, అమెరికాలో తేలికగా సర్దుకు పోతుంది. నీలకు ఆ గుణాలున్నాయి. అత్తగారి మనో వైకల్యం, పుట్టుకతో వచ్చినది కాదు. మీ అమ్మాయిని ఎల్లప్పుడూ ఆనందంగా వుంచుతానని మీకు మాట యిస్తున్నాను. " 


ఆ మాటలకు అందరూ సంతోషించారు. సత్యదేవ్ మనసులో గోపాల్ ఒక హితుడిగా కొలువై నిలిచాడు. 

@@@

సత్యదేవ్ తొలి జ్ణాపకం అతని మానసిక వికాసానికి ప్రేరణ అయితే, అతని రెండో జ్ణాపకం, అతని మేధో వికాసానికి దోహదం చేసినది. పెళ్ళి జరిగిన నాటి నుండి, అవకాశం దొరికినప్పుడల్లా, గోపాల్ ప్రక్కనే వుండడం, అతనికి కావల్సినవి అందించడం తన పనిగా పెట్టుకున్నాడు. ఒక రోజు గోపాల్, సత్యదేవ్ ని ఒక ప్రశ్న అడిగాడు. 


 "చక్కగా చదువుకుంటున్నావు, గుడ్. మరి నీ హాబీలు యేమిటి?" 


 "క్రికెట్, ఫుట్ బాల్ ఆడతాను" అని బదులిచ్చాడు సత్యదేవ్ వుత్సాహంగా. 


"గుడ్! నీకు సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలేమైనా వచ్చా? అవయితే, జీవితాంతం నీతోనే వుంటాయి. మానసిక వికాసానికి తోడ్పడతాయి." 


"రావు" అని సత్య దేవ్ జవాబిచ్చేలోపు, స్నేహితుల రాకతో గోపాల్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. 

వివాహ సందర్భంగా జరిగిన సంగీత్ లో గోపాల్ కుటుంబ సభ్యులు సంగీతం, డాన్స్, ఏక పాత్రాబినయనం వంటి ప్రోగ్రాములతో అందరిని అలరించిన సంగతి సత్య దేవ్ మర్చిపోలేదు. అందువల్ల, గోపాల్ వెళ్ళిపోయినా అతని ప్రశ్న సత్యదేవ్ మదిలో వుండిపోయింది. 


“మంచి డిగ్రీతో పాటు ఏదో ఒక ప్రత్యేకత నేను సాధించాలి. నాకు చేతనైనది యేది? భవిష్యత్తులో నాకు గుర్తింపు తేగలిగిన నైపుణ్యం నాలో యేముంది?” అన్న ప్రశ్నలతో అతను చాలా కాలం ఒక రకం వుక్కపోతకు గురయ్యాడు. 


ఒక సంవత్సరం తర్వాత, ఆ ప్రశ్నలకు జవాబు దొరికింది. తనలో ఒక రచయిత కాగల లక్షణాలున్నాయని అతను గ్రహించాడు. ఆ దిశగా కృషిచేసి, అతడు రచయితగా, ఎన్నో బహుమతులు గెలుచుకుని గోపాల్ ప్రశంసలందుకున్నాడు. ఆ విధంగా, తన విజయానికి మార్గదర్శి, తన బావగారైన గోపాల్ అని, అతడు తరచుగా తన తోటి వారికి చెప్తూంటాడు. 

@@@

సత్య దేవ్ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన మరో జ్ణాపకం, గోపాల్ తార్కికత. సత్యదేవ్ నిశ్శబ్దంగా, ఒక ప్రక్కన హాలులో కూర్చుని, ఒక అనిశ్చల ధ్యాన స్థితిలో వుండడం గమనించిన లలిత అతని చెంతకు చేరి, "ఏమిటి ఆలోచిస్తున్నారు? అన్నయ్య గారి గురించా? ఆయనని తలచుకుంటే, గుర్తుకు వచ్చేవి, ఆయన పరిశీలానాసక్తి, మరియు విషయ విశ్లేషణ. ఆయన ఒక శోధకుడు, ఒక మంచి భాష్యకారుడు." 


“నిజమే. కానీ ఆయన తర్కం ఒకో సారి విచిత్రంగా వుండేది. నీకు గుర్తుందా? మన ప్రేమ, పెళ్ళి గురించి ఆయన ఆలోచనలు, మనల్ని అడిగిన ప్రశ్నలు, ఒక రకంగా, అప్పుడు విసుగనిపించాయి. కానీ ఆలోచిస్తే, అవి ఆనాటి మన బంధాన్నిమనం మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంతో సహకరించాయని ఒప్పుకోక తప్పదు." 


" ఆహా! అవి ప్రేమ యక్షప్రశ్నలు. మన సమాధానాలు నచ్చాకే, ఆయన మన పెళ్ళికి సహాయం చేసారు. అందుకే ఆయనను నేను తండ్రిలా భావిస్తాను." 


లలిత సమాధానం పూర్తయ్యేలోపు ఆమె ఫోన్ మ్రోగింది. అది ఆమె స్నేహితురాలినుంచి. అంటే, కనీసం, ఇంకో ఇరవై నిమిషాల వరకు లలిత, తిరిగి రాదని భావించిన సత్యదేవ్ తన జ్ణాపకాల రహదారిలో నడవసాగాడు. ఆరోజు గోపాల్ అడిగిన ప్రశ్నలలో ముఖ్యమైనవి, వాటికి వారిద్దరూ కలిసి యిచ్చిన సమాధానాలు, సత్యదేవ్ మదిలో మెదిలాయి. 


"మీ మధ్య వుండే ప్రేమకి, మీ తల్లిదండ్రుల పట్ల మీకుండే ప్రేమకి, తేడా యేమిటి?” 


“కామం, అంటే శరీరాల కలయిక కోసం కలిగే తపన” అని చెప్పబోయి, చెప్పలేక, సత్యదేవ్ మౌనం వహించాడు. 


"తేడా యేమీ లేదు. తల్లిదండ్రులు దైవాలు, వారి పట్ల మనకుండే ప్రేమ దైవ ప్రేమ. అలాంటి ప్రేమే భార్యా భర్తల మధ్య వుండాలి. ఒకరినొకరు ప్రేమతో, ఆరాధనా భావంతో చూసుకోవాలి. పోతే ఈ రెండు ప్రేమల మధ్య వుండే అవసరాలు మాత్రం భిన్నంగా వుంటాయి. కామ వాంఛ వంటి అవసరానికి బానిసైనవాడు, తల్లి దండ్రులని చిన్న చూపు చూస్తాడు. వాడిది పశు ప్రేమ అని అంటాము, " అంది లలిత. 


"మీరు ప్రేమని ప్రేమిస్తున్నారా లేక వ్యక్తిని ప్రేమిస్తున్నారా?” 


గోపాల్ అడిగిన ప్రశ్న సత్యదేవ్ కి అర్ధంకాలేదు. అతని ప్రశ్నార్ధక ముఖాన్ని చూసి గోపాల్ యిలా చెప్పాడు. 


"ప్రేమ లేఖలు మురిసిపోయి చదువుతాం, డేటింగులకి ముస్తాబై వెడతాం. ప్రేమలో వున్నారా అని యెవరైనా అడిగితే, గర్వంగా తలూపుతాం. రాత్రి గంటలు, గంటలు మాట్లాడుతాం. ఒక్క సారి పెళ్ళి అయిపోయాక, అంతా మారుతుంది. ఆ ఆకర్షణ, అత్రం, ఆ గర్వం, ఆ మాట్లాడే ఓపిక వంటి ప్రేమ సంకేతాలు మటుమాయమైపోతాయి. భాగస్వామి పట్ల అభిప్రాయాలు మారడం మొదలవుతుంది. మనం ప్రేమించినది యేమిటి? అది అశాశ్వతమా? అయితే అది పెళ్ళికి పునాది యెలా అవుతుంది?" 


ఈసారి సత్య దేవ్ ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "అవన్నీ మా మధ్య లేవు. తొలి సారి చూసినప్పుడే లలిత నా భార్య అని నాకు అర్ధమైంది. అదే విషయం, అవకాశం దొరికినప్పుడు, ఆమెకు చెప్పాను. ఆమె కూడా, వెంటనే ఒప్పుకుంది. ఒకరినొకరం తెలుసుకుంటూ, బలహీనతలను అర్ధం చేసుకుంటూ, అవసరమైన రీతిలో మమ్మల్ని మార్చుకుంటూ, మా బంధాన్ని కాపాడుకోవాలని ప్రమాణం చేసుకున్నాం. ”


లలిత మంద్ర స్వరంలో, " అవును అన్నయ్యగారు, మా బంధాన్ని నిలుపుకునే మానసిక శక్తి మాలో కలకాలం వుండేలా ఆశీర్వదించండి. " అంది ఆయన పాదాలకు ప్రణమిల్లుతూ. 


సత్యదేవ్ అమెని అనుసరించాడు. ప్రఫుల్ల వద నంతో ఆయన, ఆరోజు ప్రేమగా వారిద్దరిని ఆశీర్వదించిన ఆ క్షణాలు, వారి మదిలో శాశ్వత ముద్రని వేసుకున్నాయి. 

@@@

ఫోన్ సంభాషణ ముగించిన లలిత తిరిగి వచ్చి, సత్యదేవ్ తో యిలా అంది

"గోపాల్ అన్నయ్య లాంటి కొందరు, జ్ణాపకాల రూపంలో అమరులై వుంటారు. ఏదో ఒక దశలో వారి ఆలోచనాధోరణి, మన నిర్ణయాలని ప్రభావితం చేస్తుంది. 


అప్పుడనుకుంటాం ఆ వ్యక్తి మృత్యుంజయుడని మనతోనే వున్నాడని, ఆయన మన ముందు ముద్రించిన పాదముద్రలని, అనుసరించి మనం ముందుకు పోతున్నామని. ఇంక ఆలోచనలు కట్టిపెట్టి, భోజనానికి రండి. " 


ఆమె మాటలలోని వాస్తవం, సత్యదేవ్ మనసును ఆహ్లాదపరిచింది. ఆతడు లేచి చిరునవ్వుతో ఆమె ననుసరించాడు. 


@@@@@

  

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

 
 
 

Comments


bottom of page