1). భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్యని " పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టం?"అని అడిగాడు.
భార్య ఆశగా " మూడూ ఇష్టమే! మూడు చీరలూ కొనిచ్చెయ్యండి"-అంది.
భర్త మొహం చిట్లించి, " చీరలా? చీరలేమిటి? నేను చెప్పినది ఊళ్ల పేర్లు!
మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, ఈ మూడు ఊళ్ళల్లో ఒకటి కోరుకొమ్మన్నారు.
నీ అభిప్రాయం కూడా అడగాలికదా అనిఅడిగా" అన్నాడు.
పంపినవారు : వాడపల్లి పద్మప్రియ
ప్రచురించిన తేదీ : 22 /10 /2021
2).సీరియల్ కష్టాలు "హాయ్యో హాయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందొదినా, పాపం "తొక్కలో మొగుడు సీరియల్" లో సుజాతకి ఎన్ని కష్టాలు వచ్చాయో, చిన్నప్పటినుంచీ పాపం సవతి తల్లి ఎన్నో కష్టాలు పెట్టింది, చదువు కూడా చెప్పించలేదు. సతీష్ ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది శాంభవి. తనని అలా చూస్తూ కంగారు తిన్న సతీష్ "ఏమైందే.. ఎందుకలా ఏడుస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా? అని అడిగాడు. సతీష్ ని చూసి భోరున ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ "మొన్నటికి మొన్న మణిక్యాంబ, రామరాజు ముగ్గురాడపిల్లలని పెంచలేక, అప్పుల బాధ పడలేక, అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక, పెళ్ళీడు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యలేక,,, అందరూ కలిసి పాయసంలో విషం కలుపుకొని తిని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. పాయసంలో జీడిపప్పు లేకపోతే రుచి బాగోదు అని, జీడిపప్పు కొనలేక, గన్నేరు పప్పు తెచ్చుకుని మరీ వేసుకున్నారు అండి. ఎంత అన్యాయమో చూడండి. ఎంతమంది ఉన్నా పాపం ఎవరూ వాళ్ళకి సాయం చెయ్యలేదు!" అంది ఏడుస్తూ శాంభవి. "అయ్యో, ఎవరో చెప్పు ఎదో మనకు తోచిన సహాయం చేద్దాం. నువ్వు అలా ఏడవకే!" అని భార్యని ఓదారుస్తూ "ఇంతకీ ఎవరే వాళ్ళు, మన బంధువులా, తెలిసిన వాళ్ళా?" అన్నాడు. "అవునండి బాగా తెలిసిన వాళ్ళు, రోజూ చూసే వాళ్ళు, పాపం అలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదండీ. " అంటూ విలపిస్తోంది. "ఒసేయ్ ఇంతకీ వాళ్ళెవరో చెప్పవే?" "అదే అండి. ముద్ద గన్నేరు సీరియల్ లో హీరోయిన్ ఫ్యామిలీ అండి." "ఏంటి సీరియల్ వాళ్ళా, నేనింకా ఎవరో అనుకుని అనవసరంగా టెన్షన్ పడి, సాయం చెయ్యటానికి కూడా రెడి అయ్యాను కదే" అన్నాడు విసుక్కుంటూ. "అయ్యో అది కాదండి, ముగ్గురు ఆడపిల్లలు అండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదండి పాపం" అంది మళ్ళీ. "ఎహె ఆపు నీ గోల. ఎంతసేపు ఆ సీరియల్ గోలే కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నా గురించి పట్టించుకోవా, నువ్వూ నీ సీరియల్..." అనగానే "నన్నేమన్నా అంటే అనండి గాని నా సీరియల్స్ ని ఏమైనా అంతర్ మాత్రం నేనూరుకోను" అంది. "ఆహ్ ఏం చేస్తావే, చెప్పు ఏం చేద్దాం అని?" కోపంగా అడిగాడు. వెంటనే బయటకి తోసి తలుపేసి "ఈరోజుకి అక్కడే ఉండండి, ఏం తింటారో, ఎక్కడ పడుకుంటారో మీ ఇష్టం" అని డోర్ లాక్ చేసుకుని పడుకుంది. "రాత్రంతా ఈ దోమలతో గడపాలా?" అనుకుంటూ తను చేసిన పనికి తనని తనే తిట్టుకుంటూ పడుకున్నాడు సతీష్. ****భర్తల్లారా కాస్త జాగ్రత్త, సీరియల్స్ గురించి శ్రీమతి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త!
పంపినవారు : పరిమళ కళ్యాణ్
ప్రచురించిన తేదీ : 31 /10 /2021