top of page

జర్నలిస్ట్

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #journalist, #జర్నలిస్ట్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


journalist - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

Published In manatelugukathalu.com On 28/01/2025

జర్నలిస్ట్ - తెలుగు కథ

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆల్ఫా దిన పత్రికలో న్యూస్ రిపోర్టర్ గా అవకాశం వచ్చింది దినకర్ అనే యువకుడికి. కొద్ది రోజులు సీనియర్ దగ్గర మెళకువలు తెలుసుకోమ్మన్నారు సబ్ ఎడిటర్ గారు. చేరిన రోజే ఒక మర్డర్ కు సంబంధించిన న్యూస్ వెయ్యాల్సి వచ్చింది.. ఒక రాజకీయపార్టీకి చెందిన చిన్నపాటి నాయకుడు హత్యకు గురయ్యాడు. సీనియర్ జర్నలిస్ట్ దామోదరం ఆదేశాల మేరకు ఆ స్పాట్ కి వెళ్లి వివరాలు సేకరించుకుని వచ్చాడు దినకర్. 


తాను రాసుకు వచ్చిన మేటర్ ని దామోదరం గారికి చూపించాడు. ఆయన ఆ వివరాలను నాలుగైదు సెకన్లు కూడా చూడకుండా దినకర్ కి తిరిగి ఇచ్చేసాడు. 


"ఇలా ప్రతిసారీ మేటర్ రాస్తూ వుంటే తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అందుకే నేను ముందే అన్ని రకాల మేటర్ లు నా లాప్టాప్ లో ఉంచాను. దాంట్లో తగినది సెలెక్ట్ చేసి పేర్లు.. ప్రదేశాలు లాంటివి మాత్రమే మారిస్తే సరిపోతుంది. ఇదిగో.. ఇందులో మర్డర్స్ అనే ఫోల్డర్ ఉంది. అందులో ఎంపీఎం అనే సబ్ ఫోల్డర్ ఉంది. అందులో ఐదారు రకాల వార్తాకథనాలు ఉంటాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి, పేర్లు గట్రా మార్చి నాకు చూపించు" అంటూ తన లాప్టాప్ ను దినకర్ కు అందించాడు. 


వెంటనే ఆ పనిలో పడ్డాడు దినకర్.. ఉన్న వాటిల్లో ఒక మేటర్ సెలెక్ట్ చేసి, కొన్ని మార్పులు చేసి ఒకసారి చెక్ చేశాడు. 


ఆ వార్తాకథనం ఇలా ఉంది:


'నిన్న రాత్రి పేదల ఆశాజ్యోతి, నిస్వార్థ రాజకీయ వాది రంగయ్య గారు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ని కిలోమీటర్ మేర పరుగెత్తించి కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లతో వెంబడించి, తాను పేదల మనిషినని, వదిలెయ్యమని ప్రాధేయ పడుతున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. మరణించిన రంగయ్య శవం దగ్గర అతని పిల్లలు హృదయవిదారకంగా ఏడవడం, చూసేవారి మనస్సులను కలచివేసింది. మరణించిన రంగయ్య, స్థానిక గూండాల బారినుండి మహిళలను, పేదలను ప్రాణాలకు తెగించి కాపాడేవాడు. రంగయ్య మరణంతో ఇక ఆ గూండాలు మరింతగా రెచ్చపోవచ్చని ప్రజలు ఆందోళన పడుతున్నారు. 'ఇక మాకు దిక్కెవరు దేవుడా.. ' అని పేద మహిళలు విలపిస్తున్నారు. ’ 


వార్తాకథనం పూర్తి చేసి సీనియర్ దామోదరానికి అందజేశాడు దినకర్. 


"వెరీ గుడ్. అదే ఫోల్డర్ లో మహిళలు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోను జత చెయ్యి" చెప్పాడు దాము. 

***

సరిగ్గా వారం రోజుల తరువాత.. 

మరో పార్టీ నాయకుడు హతమయ్యాడు. 

ఈసారి అదే ఫోల్డర్ నుండి తగిన కథనాన్ని ఎంపిక చేసి మేటర్ రెడీ చేసి దామోదరం గారిని ఇంప్రెస్ చెయ్యాలి అనుకున్నాడు దినకర్. 


వార్తాకథనాన్ని చక్కగా తయారు చేసి, దానికి తగ్గ ఫోటోలు జత చేసి దామోదరం గారికి చూపించాడు. 


అయన ఎప్పటిలాగే నాలుగైదు క్షణాలు చూసి, "గుడ్. తొందరగానే పికప్ అయ్యావు. అన్నట్లు.. మేటర్ ఏ ఫోల్డర్ నుండి తీసుకున్నావు?" సందేహిస్తూ అడిగాడు. 


"అదే సర్.. ఎంపీఎం అనే సబ్ ఫోల్డర్ నుండి తీసుకున్నాను"


"చంపావయ్యా! అనుకుంటూనే ఉన్నాను. ఈసారి ఓపీఎం ఫోల్డర్ నుండి తీసుకోవాలి. వెళ్లి తొందరగా మార్చి రెడీ చెయ్యి" అన్నాడు దామోదరం. 


వెనక్కి వెళ్లి ఓపీఎం ఫోల్డర్ తెరిచాడు దినకర్. 


ఒక న్యూస్ ఐటం చదివాడు. అందులో ఇలా ఉంది.. 


'నిన్న రాత్రి రాజయ్య అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. మరణించిన రాజయ్య పలు హత్యకేసులో ముద్దాయి. గతంలో పేదల స్థలాలు ఆక్రమించిన కేసుల్లోనూ మహిళలను వేధించిన కేసుల్లోనూ నిందితుడు. గత ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య ఎవరు చేసి ఉండొచ్చని స్థానికులను ప్రశ్నించగా హతుడివల్ల బాధింపబడ్డ వారు వందల్లో ఉన్నారనీ, వారిలో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చనీ అన్నారు. 


ఇక ఈ ప్రాంతంలో మహిళలు నిర్భయంగా తిరగవచ్చని అక్కడ గుమికూడిన మహిళలు మాట్లాడుకోవడం ఈ విలేఖరి చెవిన పడింది. '


మిగిలిన న్యూస్ ఐటమ్స్ కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. 


వాటిలోనే ఒకదాన్ని సవరించి దామోదరానికి అందిస్తూ అడిగాడు ఆ ఫోల్డర్ల పేర్లకు అర్థం ఏమిటని. 


అతడు గొంతు తగ్గించి చిన్నగా ఇలా అన్నాడు. "అది నేను పెట్టుకున్న కోడ్ లాంగ్వేజ్. 'ఎంపీఎం' అంటే 'మన పార్టీవాడు మర్డరయితే' అని. ఈ న్యూస్ లో చనిపోయిన వాడిపట్ల సానుభూతి కలిగేలా రాయాలి. 


'ఓపీఎం' అంటే 'అపోజిషన్ పార్టీవాడు మర్డరయితే' అని. ఇక్కడ చనిపోయినవాడు హిరణ్యకశిపుడో, నరకాసురుడో అన్నట్లు రాయాలి. 'పోతే పోయాడు' అని చదివిన వాళ్ళకి అనిపించాలి". చెప్పాడు దామోదరం. 


"మన పార్టీవాడు ఏమిటి?" అడిగాడు దినకర్ అర్థం కాక. 


"నిజమైన మనలాంటి జర్నలిస్థులకు పార్టీలతో సంబంధం ఉండదు. కానీ మన పత్రికాధీశులకు ఉంటుంది. పత్రికను ఒకరకంగా ఒక పార్టీని ప్రమోట్ చెయ్యడానికి వాడుతారు. ఇక ఆ లాప్టాప్ లో మరిన్ని ఫోల్డర్లు ఉన్నాయి. 


MPOC (మనపార్టీలో అదర్ క్యాస్ట్), OPMC (అదర్ పార్టీలో మన క్యాస్ట్).. ఇలా అన్నమాట. మన పార్టీ వాడైనా వేరే క్యాస్ట్ అయితే పూర్తిగా నమ్మకూడదు. అలాగే మన క్యాస్ట్ వాడు అవతలి పార్టీలో వుంటే పూర్తిగా తీసి పారేయకూడదు. ఏరోజుకైనా మన గూటికి చేరొచ్చు. 


ఇక్కడకూడా మన క్యాస్ట్ అంటే నీ నా క్యాస్ట్ కాదు. మన అధిపతి క్యాస్ట్ అన్నమాట" వివరించాడు దామోదరం. 


తల తిరిగినట్లైంది దినకర్ కు. 


కొంత సేపటికి తేరుకొని, "నేను ఈ ఆల్ఫా పత్రికలో పని చెయ్యలేను" అన్నాడు. 


దామోదరం కాస్సేపు అలోచించి " కానీ ఎక్కడైనా ఇలానే ఉంటుంది. నేను గతంలో బీటా పత్రికలో పని చేసాను. అక్కడ కూడా ఇంతే. మొన్న ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ట్రై చెయ్యి" అంటూ తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ‘స్వాతంత్య్ర సమర యోధుడు వెంకయ్యగారి మనవడు దినకర్ అనే వ్యక్తికి అవకాశం ఇవ్వ’మని చెప్పాడు. 


దామోదరం దగ్గర సెలవు తీసుకొని బీటా పత్రిక ఆఫీసుకు వెళ్ళాడు దినకర్. 


అక్కడ ఉన్న వ్యక్తి దినకర్ తో "దామోదరం నీ గురించి చెప్పాడు.. నువ్వు మంచి భావావేశం గల యువకుడివని! అక్కడ రకరకాల ఫోల్డర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యావుట? ఇక్కడ ఒకే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ పేరు 'అంతా నాయకుడి మయం'. 


ఎక్కువ భాగం మన నాయకుడి ప్రకటనలు, హామీలు, యాత్రలు ఇలాంటి వాటి గురించే ఉంటుంది. తరువాత మన పార్టీలోని ఇతర నాయకుల గురించి ఉంటుంది. ఇతర పార్టీలు ఉన్నా లేనట్లే అనేలా వార్తలు రాయాలి" చెప్పాడతను. 


అతనికి అప్పుడే బై చెప్పి దామోదరం వద్దకు వచ్చాడు దినకర్. 


"ఏమిటి.. ఇక్కడే కొనసాగుతావా?" అడిగాడు దామోదరం. 


"కాదు. ఆత్మ వంచన చేసుకొని జర్నలిజం చెయ్యలేను. సొంతగా వార్తా పత్రిక పెట్టే స్థాయి లేదు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నిష్పాక్షికంగా, నిర్భయంగా వార్తలు అందిస్తాను" ఆవేశంగా అన్నాడు దినకర్. 


"ఇప్పుడు ప్రతి పార్టీకి లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానల్స్ వేరే వేరే పేర్లతో ఉన్నాయి. వాటిలో లైక్స్ పెట్టడానికి, జేజేలు కొట్టడానికి, అవతలి వారిని బూతులు తిట్టడానికీ డబ్బులిచ్చి మనుషుల్ని ఏర్పాటు చేసుకొన్నారు. వాటి మధ్య నీ ఛానల్ ఏమాత్రం విజయం సాధిస్తుంది?" అంటూ తన లాప్టాప్ లో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాడు. 


అందులో పార్టీ నాయకుడి ప్రసంగానికి సంబంధించిన ఒక క్లిప్ ఉంది. 


దాని కింద 

'మీ అభిప్రాయాలు అంత సరిగా ఉన్నట్లు లేవు. 

ఇట్లు కే. సుగుణ, హైదరాబాద్' అని కామెంట్ పెట్టి "నేనేమైన తప్పుగా రాశానా?" అని దినకర్ ని అడిగాడు. 


"లేదు. ఒక పాఠకురాలు మర్యాదగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉంది" అన్నాడు దినకర్. 


మరి కాసేపటికే ఆ కామెంట్ కి రిప్లైలు ఇలా వచ్చాయి.. 


'ఒసే సుగుణా.. నీకు ఆ పార్టీ వాడు చెప్పేదీ చేసేదీ బాగుంటుందా.. " అని ఒకడు.. 


'దీనికి పేరులో మాత్రమే గుణం ఉంది' అని ఒకడు.. 


'ఒరేయ్! పతివ్రతని అవమానించకండి' అని ఒకడు.. 


'అంటే నా డార్లింగ్ సుగుణకు పెళ్ళైపోయిందా.. నేను ఫీలయ్యాను.. ' అని ఒకడు.. 


ఇలా ఆ కామెంట్ల పరంపర చెప్పలేని రీతిలో కొనసాగుతూనే ఉంది. 


"ఇప్పుడు చెప్పు. పోస్ట్ వ్యూస్ పెంచుకోవడానికి ఆ ఛానల్ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టిస్తారు. ఇలాంటి వాటి మధ్య నీ ఛానల్ ఎలా నిలదొక్కుకుంటుంది?" ప్రశ్నించాడు దామోదరం. 


"తన నాయకుడిని విమర్శిస్తే ప్రజలు ఉరుకోరనే హైప్ క్రియేట్ చెయ్యడానికే ఇలా చేస్తారు. ప్రజలు కేవలం కాలక్షేపం కోసం ఇలాంటి పోస్ట్లు చూస్తారు. ఒకవేళ వీళ్ళ గురించి పోస్ట్లు పెట్టినా ఇలానే చూస్తారు. చూసినవారంతా వాళ్ళని, వాళ్ళ రాతల్ని ఆమోదించినట్లు కాదు. ప్రజలు ఇలాంటి పోస్ట్ లను చూడటం మానెయ్యాలి. ఆ విషయాన్నీ నేను నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. 


ఇక రాజకీయ పార్టీల గురించి.. 


"ప్రతి ఎన్నికల్లో అధికార పక్షం విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వ యంత్రాంగమంతా అధికార పక్షానికి దన్నుగా ఉంటుంది. మరి ఎప్పుడూ అధికార పక్షం ఓడిపోకూడదు కదా. ఓడిపోయిందంటే ప్రజలు డబ్బుకు లొంగలేదనీ అధికారానికి భయపడలేదనీ అర్థం కదా!


ప్రజలెప్పుడూ అమాయకులు కాదు. వాళ్ళను మోసం చెయ్యవచ్చని అనుకునే నాయకులే అమాయకులు. తమ రాతలు ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని అనుకునే పత్రికల వాళ్ళు అమాయకులు. జర్నలిస్టుగా ప్రజలకు నిజమైన వార్తలు అందించాలనేదే నా తాపత్రయం" చెప్పాడు దినకర్. 


"మీ తాతగారు స్వాతంత్య్ర సమర యోధులు. కాబట్టి ఆ ఆవేశం, నిజాయితీ నీలోనూ ఉంది. నీ ప్రయత్నాలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నీలాంటి భావాలే చాలామంది జర్నలిస్టుల్లో ఉన్నాయి. సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. నీకు తప్పకుండా అందరి మద్దతు లభిస్తుంది" అభినందిస్తూ చెప్పాడు దామోదరం. 


శుభం 


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 









59 views2 comments

2 Comments


జర్నలిస్ట్: ఎమ్. సీతారామ కుమార్


వార్తల్లో ఇన్ని లొసుగులు ఉంటాయా? ... వార్తలను కేవలం వినోదం, టైం పాస్ లా తీసుకోవాలా? ఎంతో మంది జీవితాలను ఫణంగా పెట్టి, ప్రాణాలు త్యాగం చేసి ... మనకు స్వాతంత్ర్యం... స్వేచ్ఛా వాయువులు కలగ చేశారు ... దానికి ఇదా తిరిగి ఇస్తున్న బహుమతి???


వార్తలు చదవకుంటే ... చూడకుంటే ... వినకుంటే మేలు!

...

ఉత్తి క్రీడా వార్తలు, సినిమా శీర్షికలు చదివితే మేలు ???

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like

AVUNANDI PATRIKALA STAAE ILAGEVUNDI> NIJAM CHEPPERU.

Like
bottom of page