top of page

జ్వాల

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Jwala, #జ్వాల


Jwala - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 31/01/2025

జ్వాల - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


జలంలో సంచరించే సర్పముల వలన జలం విష తుల్యం అవుతుందని వరుణ దేవుని అనుచరులు సర్పములను హింసించసాగారు. అంతేగాక కృత్రిమ సర్ప భక్షక జీవులను అధికంగా సృష్టించారు.. కృత్రిమ సర్ప భక్షక జీవుల ప్రభావం తో సర్ప సంతతి భయపడింది. తమ శక్తి యుక్తులను ఉపయోగించి సర్పములన్నీ ఆకాశంలో ఎగర సాగాయి. ఎగిరే పాములను చూసి సమస్త జగతి గజగజలాడి పోసాగింది. గరుత్మంతుడు సహితం కించిత్ భయపడ్డాడు.

 

విశ్వ సంరక్షణ నిమిత్తం తక్షకుడు ఘోర తపస్సు చేయసాగాడు. తక్షకుని తపస్సుకు సమస్త జీవులు అతలాకుతలం అయ్యాయి. తక్షకుని తపస్సును చూచిన దేవతా సర్పములన్నీ తమకు మరింత మంచి రోజులు రాబోతున్నాయి అని మహదానందంతో పడగలు విప్పి ఆడసాగాయి. నాగినులు ఒళ్ళు మరిచి నాగ నృత్యాలు చేసాయి.

 

తక్షకుని తపస్సు కు మెచ్చిన వరుణ దేవుడు సర్పముల మీద తన అనుచరుల హింసను ఆపు చేసాడు. అనుచితంగా పరజీవ హింస పాపం అన్నాడు. వరుణ దేవుని అనుచరులు వరుణ దేవుని మాటలను శిరసావహించారు. 


తక్షకుడు వెంటనే ఎగిరే సర్పములను కట్టడి చేసాడు. ఆకాశం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఇంద్రధనుస్సు తో ప్రకాశించసాగింది. అప్పటినుండి వరుణ దేవుడు, ఇంద్రుడు తక్షకునితో స్నేహం చేయసాగారు. వరుణ దేవుడు తక్షకునికి చంద్ర గదను బహుమతిగా ఇచ్చాడు. చంద్రగద రూపము మహా విచిత్రం గా ఉండేది. 


చంద్రగద ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం తాండవించేది. చంద్రగదను చూడగానే సముద్రాలలోని ఆటుపోట్లు అందంగా కదలాడేవి. వాటిని చూసి అలల కింద తను తిరుగుతున్నట్లుగా భూమాత మురిసిపోయేది. ఒకప్పుడు చంద్రగద తనలో ఒక భాగం గా భూమాత భావించేది‌. సమస్త జీవరాశి ఆనందంగా నృత్యం చేసేది. చంద్రగద ను చూడగానే పర్యావరణం పులకరించిపోయేది. 


దేవేంద్రుని వర ప్రసాదంతో తక్షకునికి జ్వాల అనే కుమార్తె జన్మించింది. దేవేంద్రుని వరుణుని తేజో వికాస ప్రభావంతో జ్వాల సుర తేజంతో ప్రకాశించే మానవ రూప కన్యలా ఎదగసాగింది. జ్వాల ప్రకృతి ని పార్వతీమాత గా భావించి ప్రకృతిలోని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ను అభ్యసించడానికి ప్రయత్నించేది. 


జ్వాల వేదాలలో స్తుతించబడుతున్న పంచభూతముల మూలాల గురించి బాగా ఆలోచించేది. అలాగే వేదాలలో స్తుతించబడుతున్న గంగ, యమున, సరస్వతి వంటి నదులు గురించి వాటి వెనుకన ఉన్న విజ్ఞాన అంశాల గురించి తెలుసు కోవడానికి ప్రయత్నించేది.

 

 జ్వాల ఎదిగే కొద్దీ సమస్త విద్యలతో వేద యాగ జ్వాల లా ప్రకాశించసాగింది. వేద జ్వాల లా ప్రకాశించే జ్వాల ఏది చెబితే చంద్రగద అది చేసేవాడు. జ్వాల చంద్రగద ను ముద్దుగా చంద్రగద మామ అని పిలిచేది. 


జ్వాల చంద్రగద సహాయం తో భూమి వాతావరణం ను సుస్థిరంగా ఉంచేది. జ్వాల చంద్రగద సహాయం తో కొన్ని జంతువుల పునరుత్పత్తి ని కూడా చేసింది. ఇలా జ్వాల ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించేది. ఆమె సేవలు చూసి నరుల తో పాటు సురులు సహితం ఆమెను పలు విధాలుగా స్తుతించే వారు. జ్వాల కు చంద్రగద తో పాటు ఆమె పినతండ్రి శ్రుతసేనుడు కూడా తోడుగా ఉండేవాడు. ముగ్గురూ కలిసి పార్వతి లాంటి ప్రకృతి ని సంరక్షిస్తూ జనులకు కావలసినవన్నీ సంప్రదాయ బద్దంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బద్దంగా సమకూర్చేవారు. 


జ్వాల ఎక్కడ ఉంటే అక్కడ పార్వతీ మాత ప్రకృతి లో లీనమయ్యి సర్వ మంగళ గా మారేది. పవిత్ర పంచ భూతాలను ప్రసాదించి ప్రజలను ఆనందపరిచేది. 

జ్వాల దురిత చిత్తుల పాలిట మండే జ్వాల లా ఉండేది. మంచివారి పాలిట యాగ జ్వాల లా ఉండేది. 


సుదేవ ఋచీకుల సుపుత్రుడు ఋక్షకుడు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. చంద్రుని అంశతో జన్మించిన ఋక్షకుడు మహా శివుని సేవ చేస్తూ ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నగా చూసుకోసాగాడు. 


ఋక్షకుడు ఎక్కడ ఉంటే అక్కడ అమృత వర్షం కురిసినట్లు ఉండేది. అతని చుట్టూ ఉన్న వారు మాకిక మరణం లేదన్న భావనతో ఉండేవారు. అతనితో మాట్లాడటానికి అందరూ ఇష్టపడేవారు. అమావస్య తెలియని చంద్రునిలా ఋక్షకుడు ప్రకాశించసాగాడు. 


అతని ఏలుబడిలో ఉన్న ప్రజలు సమస్యల్లో కూడా అమృత వర్షం లో కాలక్షేపం చేస్తున్నట్లు ఉండేవారు. ఋక్షకుని లో చంద్ర తేజం కించిత్ అధికంగా ఉందన్న విషయాన్ని ఋక్షకుని కుల గురువు వశిష్ట మహర్షి గమనించాడు. అతనిని చూడగానే మైమరచి పోయే మగువలను చూసాడు.

 

ఋక్షకుని సాధ్యమైనంత త్వరగా వివాహం చేయాలని అతని తలిదండ్రులు సుదేవ ఋచీకుల కు వశిష్ట మహర్షి చెప్పాడు. 


ఋక్షకుని కి ఎలాంటి యువతితో వివాహం చేస్తే బాగుంటుంది అని సుదేవ ఋచీకులు కుల గురువు వశిష్ట మహర్షి ని అడిగారు. అప్పుడు వశిష్ట మహర్షి " ఋచీకుని లో చంద్ర తేజం కించిత్ అధికంగా ఉంది. అతనిని చూడగానే కన్యలే కాదు, వివాహమైన వనితలు సహితం ఏదో తెలియని మైకంలో పడిపోతారు. కాబట్టి అలాంటి వానికి యాగ జ్వాల లాంటి యువతి ధర్మపత్ని అయితే వారి దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. " అని వశిష్ఠ మహర్షి అన్నాడు. 


కుల గురువు వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఋచీకుడు యాగ జ్వాల లాంటి యువతి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. తక్షకుని కుమార్తె జ్వాల యాగ జ్వాల యే అని ఇంద్రాది దేవతలు ఋచీకుని తో అన్నారు. 


ఋచీకుడు ఇంద్ర వరుణాదుల తో కలిసి తక్షకుని వద్దకు వెళ్ళాడు. అక్కడ యాగ జ్వాల లా ప్రకాశిస్తున్న జ్వాలను చూసాడు. ఈమెయే తన కుమారునికి తగిన ధర్మపత్ని అని మనసులో అనుకున్నాడు. 


తక్షకునితో తాము వచ్చిన కారణాన్ని ఋచీకుడు సమయోచితంగా చెప్పాడు. తక్షకుడు లిప్త కాలం ఆలోచించాడు. అనంతరం తన కుమార్తె జ్వాల తో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరి సమ్మతితో జ్వాల ఋక్షకుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారికి పుట్టిన సుసంతానమే మతినారుడు. 


మతినారుడు సరస్వతీ నదీ తీరాన మహోన్నతమైన తపస్సు చేసాడు. 


***

సర్వే జనాః సుఖినోభవంతు 

***

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








Comments


bottom of page