కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Kabadi Kalyani' written by M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
కబాడీ ఆడేవాళ్ళంటే హీరోలు అనుకుంటుంది కళ్యాణి.
ఆమెను ప్రేమించిన కృష్ణారెడ్డి పెద్దల ద్వారా సంప్రదిస్తాడు.
కబాడీ ప్లేయర్ నే చేసుకుంటానంటుంది కల్యాణి. ఆమె కోసం కబాడీ నేర్చుకుంటాడు కృష్ణారెడ్డి.ఈ కథను ప్రముఖ రచయిత MRV సత్యనారాయణ మూర్తి గారు రచించారు.
సంక్రాంతి పండగ వచ్చిందంటే మా పెనుగొండలోని లింగాలవీధి, కోటప్పకొండ తిరణాలలా కిట కిట లాడిపోతుంది. భోగి నుండి ఐదురోజులపాటు భావన్నారాయణ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. పద్మశాలీల కుటుంబాలవారు ఈ ఉత్సవాలు చేస్తారు. ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు, మగవారికి ‘స్లో సైక్లింగ్’ పోటీలు ఉంటాయి. వీటితో తమకేమీ సంబంధం లేనట్టు పిల్లకాయలు రామాలయం ముందు బొంగరాల ఆట, బచ్చాల ఆట ఆడుతూ తమ లోకంలో తాము ఉంటారు.
కొండవేటి వారి మేడ ముందు రంగులరాట్నం, అబ్బీసు రెడ్డి గారి ఇంటిముందు ‘కాశీ పట్నం చూడరా బాబూ’ బయస్కోపు.. ఎంతో కోలాహలంగా పిల్లలు,వాళ్ళ తల్లితండ్రులతో చాలా సందడిగా ఉంటుంది. పండగకు అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు, వాళ్లకు ఎస్కార్ట్ గా వచ్చిన బావమరుదులు అంతా కలిసి ముగ్గులు వేసే ఆడపిల్లల్ని చూసే దొంగచూపులు అబ్బో... ఒకటేమిటి ఎన్నో చిత్రాలు, విచిత్రాలు కనువిందు చేస్తాయి.
ప్రతి రోజూ సాయంత్రం పిల్లలకు పాటల పోటీలు జరుగుతాయి. తొమ్మిది గంటలకు పాటల పోటీలో నెగ్గిన వారికి వెంటనే బహుమతులు ఇస్తారు. ఆ తర్వాత హరికధో , బుర్రకధో ఉంటుంది. నాల్గవ రోజు,ఐదవరోజు మాత్రం ఖచ్చితంగా నాటకాలు ఉంటాయి. కార్యక్రమాలు నిర్వహించే నందం చిన సత్యంకు, నాటకాలు అంటే ప్రాణం. సత్యహరిశ్చంద్ర, కురుక్షేత్రం వంటి పెద్ద నాటకాలు ఉంటాయి. నటీ,నటులు మేకప్ వేసుకుంటూ ఉంటే, బరకాల సందుల లోంచి వాళ్ళని చూడటం గొప్ప త్రిల్లింగ్ గా ఉండేది. వాళ్ళ చెమ్కీ దుస్తులు, కిరీటాలు, కత్తులు చూస్తూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళ బెట్టెవాళ్ళం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం జనార్ధన స్వామి గుడిముందు జరిగే కబాడీ పోటీలు మరెంతో రసవత్తంగా ఉండేవి. ఈ పోటీలలో పాల్గోనడానికి చుట్టు పక్కల గ్రామాల నుండి కూడా టీములు వచ్చేవి. ఆ టీములుతో పాటు వారి మద్దతు దారులు కూడా వచ్చేవారు. ఊళ్ళో నుండి కూడా రెండు,మూడు టీములు పోటీలో పాల్గోనేవి. జనార్ధనస్వామి గుడిముందు ఎడమవైపు మొదటి ఇల్లు గోపాలం మాస్టారిది, రెండవ ఇల్లు శివయ్య గారిది. లింగాలవీది సుమారు వంద అడుగుల వెడల్పు ఉంటుంది. పెనుగొండలో అంతటి విశాలమైన వీధి ఇంకోటి లేదు. ఈ రెండు ఇళ్ళూ కూడా పది అడుగుల ఎత్తులో ఉంటాయి. పది మెట్లు ఎక్కి ఇంటిలోకి వెళ్ళాలి. ఈ మెట్లు రోడ్డు మీదకు ఉంటాయి. గోపాలం మాస్టారు ఇంటి మెట్లు, శివయ్య గారి ఇంటి మెట్లు మధ్యలో ఉన్న స్తలాన్ని ఒక అడుగు లోతు తవ్వి కబాడీ కోర్ట్ తయారుచేసేవారు ఉత్సవ కమిటీ వారు. జనవరిలో ఆటలు అయిపోయేవి. జూన్, జూలై నెలలలో కురిసె వర్షానికి వీళ్ళ ఇద్దరి ఇళ్ళ ముందు నీళ్ళు నిలిచిపోయి ఇబ్బందిపడేవారు. శివయ్య గారు, ’మీరు ఈ కబాడీ పోటీలు హైస్కూల్ లో పెట్టుకోండని’ చెబితే, కమిటీ వాళ్ళు ‘ఇది రోడ్డు. మీ స్థలం కాదు’ అని కొట్టిపారేసేవారు ఆయన మాటల్ని.
ఏది ఏమైనా కబాడీ పోటీలు మాత్రం చాలా రసవత్తరంగా సాగేవి. ఒక సంవత్సరం పల్లపువీధి కుర్రాళ్ళ జట్టుకి, చేపలబజారు వీధి కుర్రాళ్ళ జట్టుకి ఫైనల్ పోటీ జరిగింది. ఊరు ఊరంతా ఆ రోజు అక్కడే వున్నారు. చివరికి ఒక్క పాయింట్ తేడాతో చేపలబజారు వీధి జట్టు నెగ్గింది. ఆరడుగుల పొడుగు ఉన్న మత్సకారుల పిల్లాడు శీను, వాళ్ళ జట్టు నెగ్గించడంలో ప్రధానపాత్ర వహించాడు. ఆరోజు సాయంత్రం ‘శీను’ని గుర్రబ్బండి మీద నిలబెట్టి, ఊరు అంతా ఊరేగించారు.
గాంధీబొమ్మల సెంటర్ లో, పుత్రయ్య గారి కొట్టు దగ్గర నిమ్మతొనలు కొనుక్కోవడానికి వచ్చిన వెంకటరెడ్డి గారి రెండో అమ్మాయి కల్యాణి ఆ ఊరేగింపు చూసి ఆశ్చర్య పోయింది.
”ఏమిటి?” అని పుత్రయ్య గారిని అడిగితే, “ఆ కుర్రాడు కబాడీ బాగా ఆడాడు. వాళ్ళ జట్టు నెగ్గింది. అందుకు అతణ్ణి ఊరేగిస్తున్నారు” అన్నారు పుత్రయ్య గారు. అంతే. ఆ తర్వాత సంవత్సరం నుంచి లింగాలవీదిలో జరిగే కబాడీ పోటీలు క్రమం తప్పకుండా చూడటం అలవాటు అయ్యింది కళ్యాణికి. హైస్కూల్ చదువు అయ్యి కాలేజీలో చేరినా కబాడీ పోటీలు చూడటం మానలేదు.
గోపాలం మాస్టారు ఇంటి నుండి శివయ్య గారి ఇంటివరకూ అడుగున్నర వెడల్పు, నలభై అడుగుల పొడువు ఉన్న చిన్న అరుగు వుంది. ఆడపిల్లలు అందరూ ఆ అరుగు మీద నిలబడి కబాడీ పోటీలు చూసేవారు. ఆడపిల్లలు లేనప్పుడు మగపిల్లలు ఆ అరుగు ఎక్కడానికి కమిటీవారు అనుమతి ఇచ్చేవారు.
మార్టేరు, పండిత విల్లూరు, దేవ, ఏలేటిపాడు, కాకిలేరు గ్రామాల నుండి కూడా జట్లు వచ్చి పోటీలో పాల్గోనేవి. పెనుగొండ జట్టులో చాట్రాది బాబూ రావు, తోట వెంకటేశ్వర రావు చాలా బాగా ఆడేవారు. కూతకు వెళ్తే ఎదుటి జట్టులోని వారిని కనీసం ఇద్దరు, ముగ్గుర్ని ముట్టుకుని వచ్చేవారు. ఎవరైనా పట్టుకోవాలని చూస్తె జింకపిల్లలా ఎగిరి వచ్చేసేవారు. వీళ్ళు ఇద్దరూ ఆడుతుంటే పిల్లలు ‘ఖయ్యి’ మంటూ ఈలలు వేసి హడావిడి చేసేవారు.
కబాడీ కోర్ట్ దగ్గర పుల్ల ఐస్ అమ్మేవాళ్ళు, కారపు సెనగలు అమ్మేవాళ్ళు, పీచు మిఠాయి అమ్మేవాళ్ళు చాలా సందడి చేసేవారు. పోటీలలో నెగ్గిన జట్టుకి పెద్ద కప్పు బహుమతిగా ఇచ్చేవారు. మూడుసార్లు వరుసగా నెగ్గితే ఆ కప్పు వాళ్ళ స్వంతం అయ్యేది. లేదంటే మరుసటి సంవత్సరం ఆ కప్పు కమిటీ వాళ్లకు ఇచ్చేయాలి. ఇది గాక నెగ్గిన ఆటగాళ్లకు వ్యక్తిగత బహుమతులు ఇచ్చేవారు. బజారులోని బంగారం దుకాణం వాళ్ళు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ‘వెండి మెడల్స్’ ఇచ్చేవారు.
****
పెనుగొండలో కాలేజీ పెట్టి రెండేళ్ళు అయ్యింది. కళ్యాణి ఇంటర్మీడియట్ రెండో
ఏడాది చదువుతోంది. యధాప్రకారం సంక్రాంతి నాడు కొత్త బట్టలు కట్టుకుని పిల్ల అరుగు
మీద నిలబడి కబాడీ చూస్తోంది. ఆమె ఫ్రెండ్ గిరిజ రెండు పుల్ల ఐస్ లు తీసుకువచ్చి ఒకటి కళ్యాణికి ఇచ్చి రెండోది తను తీసుకుంది. కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ, ఐస్ తింటూ కబాడీ చూస్తున్నారు ఇద్దరూ. ఉదయం ఎండ కళ్యాణి మొహం మీద పడి, పసిడిరంగులో ఉన్న ఆమె మరింత అందంగా కనిపించింది మార్టేరు కృష్ణారెడ్డికి.
పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అచ్చిరెడ్డిని అడిగాడు”ఎవర్రా , ఆ బంగారు తీగ?”అని. మిత్రుడి చూపు ఎక్కడుందో పసిగట్టిన అచ్చిరెడ్డి చిరునవ్వు నవ్వుతూ ‘ఆ ఎర్ర వోణీ అమ్మాయేనా?’ అన్నాడు.
‘అవును’ అన్నాడు కృష్ణారెడ్డి తలతిప్పకుండా ఆమె వైపే చూస్తూ.
“అమ్మో, కళ్యాణా! చాలా డేంజర్రా బాబూ”అన్నాడు అచ్చిరెడ్డి భయం నటిస్తూ.
“ఒరేయ్, వెర్రి వేషాలు వేయక నిజం చెప్పు. ఎవరి అమ్మాయి?”అన్నాడు కృష్ణారెడ్డి
మిత్రుడి చెయ్యి గట్టిగా నొక్కుతూ. తను ఆలస్యం చేస్తే తన చెయ్యి కృష్ణారెడ్డి చేతిలో రుబ్బురోలు పొత్రం కింద పడిన జంతికలా ముక్కలైపోతుందని గ్రహించాడు అచ్చిరెడ్డి. ‘అబ్బ, ఉండరా బాబూ, ఆ అమ్మాయి జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. వాళ్ళ నాన్న వెంకటరెడ్డి కోపరేటివ్ బ్యాంకు లో పనిచేస్తారు’ అంటూ కృష్ణారెడ్డి చేతిలోంచి తన చేతిని గట్టిగా లాక్కున్నాడు.
“అవును, ఇందాకా చాలా డేంజర్ రా ఆ అమ్మాయి అని అన్నావ్. ఏంటి కథ?” అడిగాడు కృష్ణారెడ్డి.
అప్పటికి కల్యాణి ఐస్ తినడం పూర్తి చేసి, పుల్ల గిరిజకు ఇచ్చింది. గిరిజ రెండు పుల్లలూ చేతిలో పట్టుకునే కబాడీ చూస్తోంది. ఆమె రాజసం చూసి కృష్ణారెడ్డికి ముచ్చట వేసింది. అచ్చిరెడ్డి కేసి తిరిగి నేను అడిగిన దానికి సమాధానం ఏది అన్నట్టు కళ్ళు ఎగరేసాడు.
“లాస్ట్ ఇయర్ పండితవిల్లూరు రమణ గాడు వచ్చాడు కబాడీ పోటీలు చూడటానికి. పోటీ అయ్యాక వెళ్తూ వెళ్తూ, కల్యాణి ని ‘నీకు కబాడీ అంటే అంత ఇంటరెస్టా?’ అన్నాడు వెటకారంగా. అంతే, లాగి దవడ మీద ఒకటి ఇచ్చింది. రెండు పళ్ళు కదిలాయి ఆ దెబ్బకి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మార్టేరు డెంటిస్ట్ సోమరాజు గారి దగ్గరే, ఆ రెండు పళ్ళూ పీకించుకుని వెళ్ళాడు. మర్నాడు కాలేజీలో అడిగిన వాళ్లకు ‘దారిలో సైకిల్ కి పంది అడ్డం వచ్చి రోడ్డు మీద పడిపోయానని, పళ్ళు కదిలిపోతే తీయించుకున్నానని అబద్ధం చెప్పాడు. జరిగిన సంగతి ఇదీ” అన్నాడు అచ్చిరెడ్డి.
‘అబ్బో, అయితే ఈవిడ రాణీకాసుల రంగమ్మ అన్నమాట’ అని నవ్వుకున్నాడు
కృష్ణారెడ్డి. కాసేపటికి ఆట అయిపోవడంతో కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఇంటికి వెళ్లి ఒక అరగంట కూర్చుని తర్వాత సైకిల్ మీద మార్టేరు వెళ్ళిపోయాడు. కృష్ణారెడ్డి పెనుగొండ కాలేజీ లోనే బి.ఎస్.సి.ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రోజూ మార్టేరు నుండి సైకిల్ మీద కాలేజీ కి వస్తాడు. ఏ రోజున కళ్యాణిని చూసాడో అప్పటినుండి కృష్ణారెడ్డి ఆమెనే పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ నెలలో మార్టేరు వెంకటేశ్వరస్వామి తీర్థానికి గిరిజతో వచ్చిన కళ్యాణిని చూసి తన నిర్ణయాన్ని మరింతగా బలపర్చుకున్నాడు కృష్ణారెడ్డి. గిరిజ పెద్దమ్మ గారి అబ్బాయి బ్రహ్మారెడ్డి, కృష్ణారెడ్డి మంచి స్నేహితులు. బ్రహ్మారెడ్డి కల్యాణికి కృష్ణారెడ్డిని పరిచయం చేసాడు ’నా స్నేహితుడు కృష్ణా, పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్’ అని. ఆ మాటలు విని చిన్న నవ్వు నవ్వింది కల్యాణి. నలుగురూ తీర్ధంలో అరగంటసేపు అటూ ఇటూ తిరిగారు. బ్రహ్మారెడ్డి నాలుగు ఐస్ క్రీం కప్పులు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీం తిన్నారు నలుగురూ. గిరిజే , కళ్యాణి చేతిలోంచి ఖాళీ కప్పు తీసుకుని డస్ట్ బిన్ లో పడేసి వచ్చింది. ఈ దృశ్యం చూసి మరోసారి ఆశ్చర్యపోయాడు కృష్ణారెడ్డి.
కాసేపు ఉండి గిరిజ, కల్యాణి పెనుగొండ వచ్చేశారు.
****
కాలచక్రంలో మూడేళ్ళు గిర్రున తిరిగాయి. కృష్ణారెడ్డి డిగ్రీ అయ్యాకా బి.ఎడ్.చేసి
టీచర్ గా సెలెక్ట్ అయ్యి పెనుమంట్ర హై స్కూల్ లో జాయిన్ అయ్యాడు. ఒక ఆదివారం నాడు బ్రహ్మారెడ్డి ని తీసుకుని కళ్యాణిఇంటికి వచ్చాడు కృష్ణారెడ్డి. వెంకటరెడ్డి ఇంటి దగ్గరే ఉన్నారు.
“నేను మార్టేరు కొండారెడ్డి గారి అబ్బాయి కృష్ణారెడ్డిని. పెనుమంట్ర హై స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాను. మీ అమ్మాయి కళ్యాణిని ఇష్టపడుతున్నాను. మీకు, మీ అమ్మాయికి అంగీకారం అయితే ఆమెని పెళ్లిచేసుకుంటాను” చెప్పాడు కృష్ణారెడ్డి.
“మీ నాన్నగారు ఏం చేస్తారు?” అడిగారు వెంకటరెడ్డి.
“మార్టేరు పంచాయతీ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నారు. మా ఇద్దరు అక్కలకు
పెళ్ళిళ్ళు అయిపోయాయి” నెమ్మదిగా చెప్పాడు కృష్ణారెడ్డి. వెంకటరెడ్డి కూతుర్ని పిలిచాడు.
కల్యాణి, తల్లి రమణి వచ్చారు. కృష్ణారెడ్డిని చూసి చిన్నగా నవ్వింది కల్యాణి. వీళ్ళు ఇద్దరికీ ముందే పరిచయం ఉందని గ్రహించాడు వెంకటరెడ్డి. రమణికి కృష్ణారెడ్డి బాగా నచ్చాడు. ఉంగరాల జుట్టు.. పైగా పొడగరి. అమ్మాయికి ఈడూ జోడూ బాగుంటుందని ఆనందపడింది. తల్లీ, కూతురూ పక్క గదిలోనే ఉండడం వలన వాళ్ళ మాటలు పూర్తిగా విన్నారు.
కూతురికేసి తిరిగి ”ఈ కుర్రాడు పెనుమంట్ర లో మాస్టారుగా పని చేస్తున్నాడట. నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు..” అని ఆగాడు వెంకటరెడ్డి. ఒక్క నిముషం కృష్ణారెడ్డి కేసి చూసింది. తన కంటే కొంచెం రంగు తక్కువైనా బాగానే ఉన్నాడు. గతంలో తను చూసినప్పటికంటే బాగున్నాడు.
ఉద్యోగం ఉంది. బాదరబందీలు లేవు. ‘అమ్మో మరి తన జీవితాశయం’ అని గాభరా పడింది కల్యాణి.
వెంటనే “మీకు కబాడీ ఆడడం వచ్చునా?” అడిగింది.
“నేను బాస్కెట్ బాల్ నేషనల్ ప్లేయర్ ని.” గర్వంగా చెప్పాడు కృష్ణారెడ్డి.
అతని సమాధానానికి చిరాకు పడింది కల్యాణి. “నేను అడిగింది కబాడీ ఆడడం వచ్చునా అని. మీరు బాస్కెట్ బాల్ ప్లేయరో, వాలీ బాల్ ప్లేయరో నాకు అనవసరం.”
ఆమె మాటలకు కంగారుపడ్డాడు కృష్ణారెడ్డి.
“నాకు కబాడీ ఆటలో అనుభవం లేదు” సంజాయిషీగా అన్నాడు.
“నేను పెళ్లి చేసుకుంటే కబాడీ ప్లేయర్ నే చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మా ఊరి లింగాలవీది కబాడీ పోటీలలో నెగ్గినజట్టులోని వాడినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది కల్యాణి. తల్లి ఆమె వెనకే వెళ్ళింది. వెంకటరెడ్డి 'ఇంక మీరు వెళ్ళవచ్చు' అన్నట్టు చూసాడు, కృష్ణారెడ్డి, బ్రహ్మారెడ్డి వైపు.
పదవతరగతి పరీక్షల్లో తప్పిన పిల్లాడిలా మొహం వేలాడేసుకుని బ్రహ్మారెడ్డి వెనకే బయటకు వచ్చాడు కృష్ణారెడ్డి.
బ్రహ్మారెడ్డి స్కూటర్ మీద వెనక కూర్చున్న కృష్ణారెడ్డి “అయినా ఈ అమ్మాయికి కబాడీ అంటే అంత పిచ్చేమిటిరా బాబూ?” అన్నాడు అసహనంగా.
బ్రహ్మారెడ్డి చిన్నగా నవ్వి ”నువ్వు కబాడీ నేర్చుకుని పందెంలో గెలిస్తేనే కల్యాణి నిన్ను పెళ్లిచేసుకుంటుంది. అది గుర్తు పెట్టుకో. లేదంటే కళ్యాణిని మర్చిపో” అన్నాడు. తర్వాత కృష్ణారెడ్డిని ఇంటిదగ్గర విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు బ్రహ్మారెడ్డి.
ఆ రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణారెడ్డి, కళ్యాణి మనసు ఎలా గెలవాలా ? అని. కబాడీ ఒక్కటే పరిష్కారంగా కనిపించింది. మర్నాడే పెనుమంట్ర హై స్కూల్ డ్రిల్ మాస్టారు ప్రసాదరెడ్డితో తన గోడు వెళ్ళబోసుకున్నాడు కృష్ణారెడ్డి.
“మనం ఇద్దరం ఒకే స్కూల్ లో పనిచేస్తున్నాం కదా. రోజూ సాయంత్రం ఆఖరి పీరియడ్ నేను పిల్లలకు ఆటలు నేర్పుతానుగా. మీ కోసం రెండు కబాడీ టీంలను తయారు చేస్తాను. ఒక దాంట్లో మీరు ఉందురుగాని. కానీ హెడ్ మాస్టర్ అనుమతి తీసుకోండి. లేకపోతే పిల్లలతో ఆటలు ఏమిటని? మిమ్మల్ని చిరాకుపడతారు” అన్నాడు ప్రసాదరెడ్డి.
కృష్ణారెడ్డి హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి రోజూ ఆఖరి పీరియడ్ తనకు లెక్కల క్లాసులు లేవని, పిల్లలతో కబాడీ ఆడుకుంటానని చాలా వినయంగా అడిగాడు. పిల్లలకు లెక్కలు బాగా చెబుతాడని కృష్ణారెడ్డి అంటే హెడ్ మాస్టర్ కి అభిమానం. మిగతా మాస్టర్లలా కాకుండా తన దగ్గర చాలా వినయంగా ఉంటాడని మరింత ప్రేమ ఆయనకు.
“దానికేం భాగ్యం అలాగే కానీ. నీకూ కాలక్షేపం.. పిల్లలకు సరదాగా ఉంటుంది...” అంటూ పెద్దగా నవ్వాడు హెడ్ మాస్టర్. అది జోకు కాకపోయినా చిన్నగా నవ్వాడు కృష్ణారెడ్డి.
ఒక నెలరోజులు కబాడీ ఆట బాగానే జరిగింది. ఆటలో ప్రసాదరెడ్డి చెప్పిన మెళకువలు పాటిస్తూ ఆడుతున్నాడు కృష్ణారెడ్డి. ఒక రోజు కృష్ణారెడ్డి కూతకు వెళ్ళినప్పుడు, ఎదురు జట్టు లోని కిశోర్, సుదీర్ అతని ఎడమ చేయ్యిని గట్టిగా పట్టుకున్నారు. కృష్ణారెడ్డి గట్టిగా విదుల్చుకున్నాడు. కానీ వాళ్ళు ఇద్దరూ ఆ చెయ్యిని గట్టిగా పట్టుకున్నారు. మరో ఇద్దరు వచ్చి అతని కాళ్ళని గట్టిగా పట్టుకున్నారు. కృష్ణారెడ్డి కదలలేక పోయాడు. అవుట్ అయిపోయాడు. కానీ ఇంకో అనర్ధం జరిగిపోయింది. ఎడమచెయ్యి గట్టిగా విదుల్చుకున్నప్పుడు పిల్లలు ఇద్దరూ చాలా గట్టిగా పట్టుకోవడంతో కృష్ణారెడ్డి ఎడమచెయ్యి రెక్క గూడు కదిలిపోయింది. ప్రసాదరెడ్డి గబ గబా వచ్చి కృష్ణారెడ్డి భుజం సరిచేసాడు. కిశోర్, సుధీర్ లను కేకలు వేసాడు గట్టిగా ఎందుకు పట్టుకున్నారని.
వాళ్ళు సమాధానం చెప్పకుండా తల దించుకున్నారు. ప్రసాదరెడ్డి, కృష్ణారెడ్డి ని తన రూమ్ లోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు. అతను అలా వెళ్ళగానే కిశోర్, సుధీర్ నర్మ గర్భంగా నవ్వుకున్నారు. వారం రోజులక్రితం, లెక్కల హోం వర్క్ చేసుకురాలేదని వాళ్ళు ఇద్దర్నీ గోడ కుర్చీ వేయించాడు కృష్ణారెడ్డి. అది మనసులో పెట్టుకుని ఈ రోజు ఇద్దరూ కావాలనే కృష్ణారెడ్డి ఒక్క చెయ్యే గట్టిగా పట్టుకుని అతణ్ణి ఇబ్బంది పెట్టారు. కృష్ణారెడ్డి కి ‘భుజం పోటు’రావడంతో ఊళ్ళో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు ప్రసాదరెడ్డి. డాక్టర్ పరీక్ష చేసి ’ఎముక తప్పుకుందని’ రెక్క గూడు సరిచేసి కట్టు కట్టి పంపించారు. ప్రసాదరెడ్డి తన స్కూటర్ మీద కృష్ణారెడ్డి ని తీసుకువచ్చి మార్టేరులో దింపి వెళ్ళిపోయాడు. భుజానికి కట్టుతో ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి కంగారుపడింది కృష్ణారెడ్డి తల్లి. ”అదేమిటిరా, పొద్దున్న నిక్షేపంగా బడికి వెళ్లినవాడివి ఇలా వచ్చావ్” అంటూ రాగాలు తీసింది.
”అబ్బా, ఏం లేదమ్మా కబాడీ లో చిన్న ఇబ్బంది కలిగింది.అంతే” అని తల్లిని సముదాయించ బోయాడు కృష్ణారెడ్డి.
‘కబాడీ’ అన్న మాట వినగానే ఆవిడ అగ్గి మీద గుగ్గిలంలా అయిపొయింది. “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి లా ఆ పెనుగొండ పిల్ల నిన్ను అడగడమేమిటి? నువ్వు తగుదునమ్మా అంటూ కబాడీ నేర్చుకోవడమేమిటి? ఇలా చేతులూ, కాళ్ళూ విరగ్గొట్టుకుని ఉంటె రేపు నీకు పెళ్లి ఎలా అవుతుంది? నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచించడం మానెయ్యి. నత్తరామేశ్వరం లో మా అన్నయ్య కూతురు ఉంది. అయిదు ఎకరాలు కట్నం ఇస్తాడు. పిల్లకి ఏభై కాసుల బంగారం పెడతాడు. హాయిగా మీ ఇద్దరూ నా కళ్ళముందు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉంటారు. అంతే గానీ, కబాడీ నేర్చుకుని పెనుగొండ పోటీల్లో నెగ్గిన వాడినే చేసుకుంటానని ‘మంగమ్మ ప్రతిజ్ఞ’ చేసిన ఆ తిప్పులాడి కోసం నువ్వు ఇలా తయారవడం నాకేం నచ్చలేదురా” అంటూ వార్నింగ్ ఇచ్చింది అతని తల్లి. ఇప్పుడు తను ఏం మాట్లాడినా తల్లి మరింత రెచ్చిపోతుందని మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు కృష్ణారెడ్డి. రాత్రి ఇంటికి వచ్చిన తండ్రి కూడా అతణ్ణి గట్టిగా మందలించాడు కబాడీ జోలికి వెళ్ళవద్దని. వారం అనుకున్న విశ్రాంతి నెలరోజులు పట్టింది. బ్రహ్మారెడ్డి ద్వారా ఈ విషయం తెలుసుకున్న గిరిజ, కళ్యాణికి చెప్పింది కృష్ణారెడ్డి గురించి. ”దానికేముంది గిరిజా, సైకిల్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అందుకని భయపడితే ,సైకిల్ తొక్కడం రాదు. తర్వాత మోటార్ సైకిల్ నడపడం కూడా రాదు” అని తేలిగ్గా చెప్పింది కల్యాణి. గిరిజ ఆశ్చర్యంగా ఆమెకేసి చూసింది. ఈ వార్త అంచెలంచెలుగా కృష్ణారెడ్డి కి చేరింది. అతనిలో పట్టుదల మరింతగా పెరిగింది. వారం గడిచాక కృష్ణారెడ్డిని చూడటానికి వచ్చిన ప్రసాదరెడ్డి మరిన్ని సూచనలు చెప్పాడు.
“మనం కూతకు వెళ్ళగానే, ఎదటి వారి కదలికల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వాడి చెయ్యి కదిలిందీ అంటే మనం అలెర్ట్ అయిపోవాలి. పాము నీ ఎదురుగా ఉంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నువ్వు ఎవరికీ దొరక్కుండా, ఎదుటివాడిని టచ్ చేసి వేగంగా నీ జట్టు దగ్గరకు రాగలవు. పరాకు గానీ, అలసత్వం గానీ పనికి రావు. ఇంకో విషయం. ఎదుటి పక్షం వాడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. నీతో సమాన ఉజ్జీ గా భావించి ఆట ఆడాలి. అప్పుడే విజయం నీకు దక్కుతుంది” అన్నాడు ప్రసాదరెడ్డి.
నెల రోజుల తర్వాత కృష్ణారెడ్డి డ్యూటీలో చేరి పిల్లలకు లెక్కలు చెప్పడం ప్రారంభించాడు. రోజూ సకాలంలో ఇంటికి వస్తున్న కొడుకుని చూసి తల్లి తండ్రులు ఇద్దరూ సంతోషించారు. ఆరు నెలలు గడిచాకా ఆరవిల్లిలో జరిగిన కబాడీ పోటీలలో పాల్గొన్న కృష్ణారెడ్డి జట్టు రెండవస్థానంలో నిలిచి విజయం సాధించింది. కానీ పెనుగొండ కబాడీ పోటీలలో నెగ్గాలంటే మరింత ప్రాక్టిస్ అవసరం అని ప్రసాదరెడ్డి చెప్పడంతో, ఆ సంవత్సరం పోటీలలో పాల్గొనలేదు. కళ్యాణి చాలా నిరుత్సాహపడింది. ఆమె తల్లి తండ్రులు ఎం.ఏ.అయిపోయిందిగా పెళ్లి చేసుకోమని పోరుతున్నారు. ఈ బాధపడలేక రాజమండ్రి మహిళా కళాశాలలో లెక్చరర్ గా చేరింది కళ్యాణి.
ఆ మరుసటి సంవత్సరం పెనుమంట్ర పిల్లలు, మార్టేరు పిల్లలతో కలిసి ఒక జట్టుగా పెనుగొండ కబాడీ పోటీలలో పాల్గొన్నాడు కృష్ణారెడ్డి. అందర్నీ ఓడిస్తూ ఫైనల్ కి చేరుకుంది కృష్ణారెడ్డి జట్టు. ప్రతిరోజూ కళ్యాణి ఆటలు చూడటానికి వచ్చేది. కృష్ణారెడ్డి ఆమెని చూసి కొత్త ఉత్సాహం తెచ్చుకుని చెలరేగిపోయే వాడు. ముక్కనుమ రోజు సాయంత్రం కబాడీ ఫైనల్ పోటీలు. పోటీలో నెగ్గితే తనూ, కృష్ణారెడ్డి ద్వారకాతిరుమల నడచి వస్తామని మొక్కుకున్నాడు బ్రహ్మారెడ్డి.
కృష్ణారెడ్డి జట్టు ఫైనల్ లో నెగ్గితే తనూ, కళ్యాణి అయినవిల్లి వచ్చి వినాయకుడికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంది గిరిజ. ఈ సంగతి కళ్యాణికి చెప్పలేదు గిరిజ. ఫైనల్ పోటీలు మార్టేరు జట్టుకి, ఏలేటిపాడు జట్టుకి జరిగాయి. ఎందుకైనా మంచిదని పెనుగొండ హై స్కూల్ డ్రిల్ మాస్టారు తాతారెడ్డి ని రిఫరీగా పెట్టారు కమిటీవాళ్ళు. రెండు జట్టులకు చెందిన మద్దుతు దారులు భారీగా వచ్చారు. కళ్యాణి, గిరిజ చిన్న అరుగుమీద నిలబడి ఆట చూస్తున్నారు. ఆట సగం అయ్యేసరికి ఏలేటిపాడు జట్టు రెండు పాయింట్లు ఆధిక్యంలో ఉంది. కళ్యాణి కంటే గిరిజకు చాలా టెన్షన్ గా ఉంది. గేమ్ అవగానే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని జనార్ధన స్వామికి మొక్కుకుంది గిరిజ. విరామం తర్వాత ఆట మళ్ళీ ప్రారంభం అయ్యింది.
కృష్ణారెడ్డి లో పట్టుదల పెరిగింది. బరిలో ఉన్న తాచుపాములా బుసలు కొడుతూ కూతకు వెళ్లి పాయింట్లు పట్టుకురావడం ప్రారంభించాడు. సంతోషం పట్టలేక గిరిజ గట్టిగా ఈలవేసింది. అది చూసి మరింతగా రెచ్చిపోయాడు కృష్ణారెడ్డి. ఈ ఆట తన జీవన్మరణ సమస్యగా భావించాడు. రాక్షసగణం మీద దాడిచేసిన హనుమంతుడిలా విజృంభించి, మొత్తానికి జట్టుని గెలిపించాడు. మార్టేరు,పెనుమంట్ర గ్రామాల నుంచి వచ్చిన వారు ఆనందంతో కోర్టులోకి వచ్చి డాన్సులు చేసారు. బ్రహ్మారెడ్డి మోటార్ సైకిల్ మీద మార్టేరు వెళ్లి వచ్చేటప్పుడు జీపులో వచ్చాడు. కళ్యాణి కోర్టులోకి వచ్చి కృష్ణారెడ్డి కి షేక్ హ్యాండ్ ఇచ్చి అబినందించి గిరిజతో కలిసి వెళ్ళిపోయింది.
కబాడీ పోటీల్లో నెగ్గిన కృష్ణారెడ్డి జట్టుని జీపులో ఎక్కించి బ్రహ్మారెడ్డి బృందం పెనుగొండ ఊళ్ళో ఊరేగించారు. గాంధీబొమ్మల సెంటర్ దగ్గర కళ్యాణి, ఆమె స్నేహితురాళ్ళు కబాడీ వీరులకు హారతులు ఇచ్చి అభినందించారు. ఆ మర్నాడే కృష్ణారెడ్డి తల్లితండ్రులు కళ్యాణి ఇంటికి వచ్చి ఆమె తల్లి తండ్రులతో పెళ్లి విషయం మాట్లాడివెళ్ళారు. తాము చూసినవాడి కన్నా, కూతురికి నచ్చినవాడికే ఇచ్చి పెళ్ళిచేస్తే ఆమె సుఖపడుతుందని కళ్యాణి తల్లితండ్రులు భావించి కృష్ణారెడ్డి, కళ్యాణి పెళ్ళి ఘనంగా జరిపించారు. పెళ్ళికి ముందే ఇరువర్గాలవారు తమ మొక్కులు చెల్లించారు.
ఏడాది తిరిగేసరికి కళ్యాణికి కవలలు పుట్టారు. విజయ్, విక్రమ్ అని పేర్లు పెట్టారు. పిల్లలకు ఆరేళ్ళు వచ్చాయి. స్కూల్ కి వెళ్తున్నారు. రోజూ కృష్ణారెడ్డి విజయ్ ని బాస్కెట్ బాల్ నేర్చుకోమని భార్యకి తెలియకుండా బోధిస్తున్నాడు. విక్రమ్ ని వంటింట్లోకి తీసుకువెళ్ళి కబాడీ నేర్చుకోమని బ్రతిమాలుతోంది. కళ్యాణి . ఇద్దరూ కూడా వాళ్ళ మాటలకు బుద్ధిగా తలూపుతున్నారు.
విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఇద్దరికీ క్రికెట్ అంటేనే ఇష్టం..!
శుభం
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
Kommentare