top of page

కడదాకా కలిసి

#KadadakaKalisi, #కడదాకాకలిసి, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #MiddleAgeLove, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Kadadaka Kalisi - New Telugu Story Written By - Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 09/11/2024

కడదాకా కలిసి -  తెలుగు కథ

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



“నాన్నా .. మా స్నేహితుల వాళ్ళ తల్లితండ్రులు బదిరి, కేదారనాథ్ యాత్రలకు వెళుతున్నారు. మీరు కూడా వెళ్ళిరండి. డబ్బుల గురించి ఆలోచించకండి, మరీ వయసు మీద పడిన తరువాత వెళ్ళలేరు, ” తండ్రితో చెప్పాడు రంగనాధం పెద్దబ్బాయి వినోద్. 


“ అవును నాన్నా! మా అత్తయ్య మామాయ్య వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక యాత్ర చేస్తునే ఉంటారు. ఈ వయసులో పుణ్యం సంపాదించుకోవాలి గానీ, మీకు ఎంతసేపు ఇంటిపట్టునే ఉంటారు. హాయిగా వెళ్ళిరండి. మీకేమి బాదరబందీ లేదు” ముక్కుసూటిగా మాట్లాడే రంగనాధం రెండో కొడుకు వినీత్ అన్నాడు. 


“అవును బాబు.. మీరు చెప్పింది నిజమే. మీ అమ్మ పోయినప్పటి నుండి నాకు లోకమే శూన్యం అయిపోయింది. అందుకే ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని నాలో నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నేను తీర్థయాత్ర లకు వెళతాను బాబు, ” సంతోషంతో అన్నాడు. 


“మావయ్య .. ఇదిగోండి మీ బట్టలన్నీ సర్దాను. మీకు మందులు పెట్టాను. ఇందులో, తినడానికి కారపూస అటుకుల చుడువా పెట్టాను. సమయానికి మందులు వేసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త మామయ్య, ” సర్దిన బ్యాగులు చూపెడుతూ చెప్పింది పెద్ద కోడలు సుమ. 


“మావయ్య, ఈ బ్యాగులో డబ్బులు పెట్టాను. ఇది ఎప్పుడు మీ చేతిలోనే ఉంచుకోండి. మీకు చేతి ఖర్చులకు అవసరమైన చిల్లర డబ్బులు ఇదిగో ఈ చిన్న బ్యాగులో ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళిరండి మామయ్య, ఫోన్ చేస్తుండండి. ఆరోగ్యం జాగ్రత్త, ” మామ కాళ్ళకు నమస్కారం చేస్తూ చెప్పింది చిన్న కోడలు స్వప్న. 


“అమ్మా .. మీరు ఇంత ఆప్యాయత చూపిస్తున్నారు కనుకనే నాకు ఇన్నాళ్లుగా ఇలాంటి ఆలోచన రాలేదు. మీ అత్తయ్య ఉంటే ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళమేమో. మీరు, పిల్లలు జాగ్రత్త. చిన్న పిల్లలు.. పాపం వాళ్ళను కొట్టకుండా ప్రేమగా చూసుకోండి. పెద్దోడా.. చిన్నోడా.. వస్తాను” మనవళ్లను మనవరాలిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ బయలుదేరాడు రంగనాథం. 

మనసులో ఏదో భయం.. 


‘మళ్లీ తిరిగి వస్తానో లేదో.. ఎంత అదృష్టం ఉంటే గాని ఇలాంటి యాత్ర చేసే భాగ్యం దొరుకుతుంది.. నా కొడుకులు కోడళ్ళు మంచి వాళ్ళు. నా భార్యకే అదృష్టం లేదు ఇవన్నీ అనుభవించడానికి. ఏదో కొంపలంటుకుపోయినట్టు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వెళ్లిపోయింది. వాళ్లకు తల్లి తండ్రి అని నేనై పెంచాను. అందుకే వాళ్లకి తండ్రి అంటే అంత పిచ్చి ప్రేమ. నా పిల్లలను కష్టపెట్టడం ఇష్టం లేకనే నేను ఏది అడగలేకపోయాను’ ఆలోచన సరళి నుండి బయటకు వచ్చాడు, రైల్లో అందరూ కూర్చుని మాట్లాడుతుంటే. 


ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అనుకున్నట్టుగానే సరదాగా జరిగింది. చార్ ధామ్ యాత్రలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అందరూ సరదాగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. 


జీవితంలో చివరి మలుపులో ఉన్న రంగనాథంకు అనుకోని అతిథిలా ప్రవేశించింది కాత్యాయని. ఆమె కూడా వీళ్ళతో పాటుగా యాత్రకు వచ్చింది, అందరితో కలగోలుపుగా ఉంటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా ఉండేది. ఆమెకు భర్త లేడు. ఒంటరిది. నా అనే వాళ్ళు లేరు. ఆస్తిపాస్తులకు కొదవలేదు. రంగనాథంను ప్రత్యేకంగా చూసేది. ఇద్దరు ఒకరికి ఒకరు మనసు విప్పి తమ జీవితంలో జరిగినవి మాట్లాడుకున్నారు. ఒకరంటే ఒకరికి ఆప్యాయత అభిమానం కుదిరాయి. ఇద్దరి జీవితంలో ఆనందం పొందింది చాలా తక్కువ. యాత్ర ముగింపులో ఇద్దరికీ విడిపోవాల్సిన సమయం వచ్చింది. 


“కాత్యాయని .. ఇంత తొందరగా మనం విడిపోతుంటే ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది నీకేమనిపించడం లేదా, ” పరిచయమైన మొదట్లో కాత్యాయనిగారు అనిపిలిచే రంగనాథం ఇప్పుడు ‘కాత్యాయని’ అని పిలిచే చనువు ఏర్పడింది. 


 “ఏమండి .. నాకూ అలాగే ఉంది. ఇన్నాళ్ళు ఎలా ఒంటరిగా గడిపానో కానీ, మీ పరిచయం తర్వాత నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. మీకేం.. మీరు మీ ఇంటికి వెళ్లాక మీ వాళ్ళ అందరితో కలిసి నన్ను మర్చిపోయి హాయిగా ఉంటారేమో కానీ, నేను ఎక్కడున్నా ఒంటరిని. నా తోడు ఎవరు, ” బాధతో గొంతు బయటకు రావడంలేదు. కళ్ళల్లో ఎంత దాచుకున్న దాగని కన్నీళ్లు ఆమె మనసు ఎంతగా బాధ అనుభవిస్తుందో చెబుతుంది. 


“ఛ ఛా ఏమిటిది కాత్యాయని చిన్నపిల్లలా .. చూడు.. అందరు మన వైపే చూస్తున్నారు. మన ప్రయాణం రైలు పెట్టేలాంటిది. రైలు ఎక్కాము.. కలిసిమెలిసి ఉన్నాము.. సంతోషం కష్టం సుఖం అన్నీ అనుభవించాం. అయిపోయింది, తిరిగి ఎవరి గమ్యం వాళ్ళు చేరవలసిన సమయం వచ్చింది. స్టేజి రాగానే దిగిపోవాలి తప్పదు కదా, ”


“ అంతేనంటారా! మీకు ఇలా విడిపోతున్నందుకు బాధ లేదా? ఇంకా కొన్ని రోజులు మనం ఇలాగే కలిసి ఉండాలని ఉంది, ఏమంటారు, ”


“దానిదేముంది కాత్యాయని .. నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి నెల రోజులపాటు మాతో ఉందువుగానీ, మా కోడళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకుంటారనుకున్నావు” 


“ఏమండి.. ఎంతసేపు మీ ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు, ఒక ఆడదాని మనసు అర్ధం చేసుకోలేరా మీరు? నేను జీవితంలో అన్ని పోగొట్టుకొని ఈ వయసులో ఒంటరిగా బతుకుతున్నాను. తెరిచిన పుస్తకంలా నా మనసు మీ ముందుంచినా మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే.., ” చెప్పడం ఆపింది. 


“ఆపేసావేం చెప్పు.. మన జీవితాల్లో ఆనందం అనుభవించే రోజులు పోయాయి. ఇప్పుడంతా రోజులు ఎలా గడుస్తాయని ఆలోచించడమే.. ఆరోగ్యంగా ఉన్నాము. నడిచిపోతుంది. రేపు రేపు ఒక తోడు లేకుండా ఎలా గడపగలను అనే సమస్య అప్పుడప్పుడు వేధిస్తుంది, ”


“చూడండి! మీకు నిండా యాభై సంవత్సరాలు కూడా లేవు, చనిపోయిన మీ భార్య కోసము మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా మిగిలిపోయారు. నేను ఒకరి చేతిలో మోసపోయి నా బ్రతుకును అడవిగాచిన వెన్నెల చేసుకున్నాను. మీరు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి. మనిద్దరం కలిసి రైలు ప్రయాణము చివరి వరకు ఎందుకు చేయకూడదు? ఇద్దరి గమ్యం ఒకటే ఎందుకు కాకూడదు, ”


“కాత్యాయని! నువ్వు అంటున్నది ఈ వయసులో మనం కలిసి ఉండడమా? అంటే నాకు అర్థం కావడం లేదు, ”


“ఏం.. నన్ను మీ భార్యగా స్వీకరించలేరా? నేను మీకు భార్యగా తగనా? మీ మనసు అర్థం చేసుకున్నాను. మీ మంచితనం చూశాక నా జీవితం మీ నీడలో సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?, ”


“నువ్వంటున్నది నిజమా! నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించి అంటున్నావా కాత్యాయని, నిన్ను వద్దని నేను అనగలనా.. నీ మంచితనము చూశాక నేను కాదని ఎలా అనగలనుకున్నావు? ఆప్యాయత అనురాగం కరువైన నాకు నువ్వు సేద తీరుస్తుంటే నాకు అభ్యంతరమా! ఎడారి పువ్వుల్లా మిగిలిన మనము మన జీవితాలను చిగురింప చేసుకుందామంటే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారు, కాకపోతే ఒక్కసారి పిల్లలతో మాట్లాడి, ”


“ఏమండీ ఒకవేళ మీ పిల్లలు ఈ వయసులో ఇదేం పని అన్నారనుకోండి అప్పుడు మీ మనసు చంపుకుంటారా?, ”


“ కానీ ఇన్నాళ్లుగా వాళ్ల కోసం నేను బతికాను. ఇప్పుడు వాళ్ళను కాదని నాదారి నేను చూసుకుంటే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, ”


“నేను ఒక మాట చెబుతాను. మనం ఇక్కడే గుడిలో దండలు మార్చుకొని ఇంటికి వెళదాము. మనను చూసిన మీ అబ్బాయిలు ఒక్క నిమిషం కంగారు పడతారు. కాకపోతే ఆలోచిస్తారు కదా ! ఇన్నాళ్లు నాన్న మా కోసం అన్ని వదులుకున్నారు, ఇప్పుడన్నా మంచి పని చేశారని సంతోషిస్తారు. ఒకవేళ మీరు వెళ్లి పెళ్లి చేసుకుంటాం అంటే మాత్రం కచ్చితంగా వద్దంటారు. కావాలంటే మీరే చూడండి, ”


“నువ్వు చెప్పింది నిజమే కాత్యాయని.. కాదనను కానీ, జరిగిపోయిన దాని కంటే జరగవలసిన దాని గురించే ఎక్కువ ఆలోచిస్తారు. సరే, నువ్వు అన్నట్టుగా ఇక్కడే దేవాలయానికి వెళ్లి దండాలు మార్చుకుందాం. మనకు ఎలాగో ఈ రోజంతా సమయం ఉంది కాబట్టి పద, ”


“ఏమండీ నా జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందనుకోలేదు., ఎన్నో ఒడిదుడుకులతో తాడులేని బొంగరంలా తిరిగిన నన్ను కడదాకా కలిసి ఉండేలా దీవించమని ఆ కనిపించని దేవుడిని, ఈ కనిపించి కనికరించిన దేవుడిని వేడుకుంటున్నాను, ” పరవశంతో రంగనాథం కాళ్లకు దండం పెడుతూ అంది. 


“కాత్యాయిని.. నీకే కాదు, నా భార్య పోయినప్పటి నుండి నా జీవిత రాగాలు పలికించే రాగ వీణ, తంత్రి తెగి, మూగ పోయింది, మళ్లీ ఆ దైవ సంకల్పంతో మనం ఒకటయ్యాము. నాకు ఇంకా ఆనందం అనుభవించే యోగం ఉన్నట్టుంది. నువ్వూ నాకు ఒక మాట ఇస్తావా.. ఎవరు ఏమన్నా ఎలాంటి కష్టం వచ్చినా నాతో కడదాకా కలిసి ఉంటానని మాట ఇవ్వు, ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే భరించుకునే శక్తి ఇక నాకు లేదు, ” ఆమె చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. 


“ఎంత మాట అన్నారు మిమ్మల్ని విడిచి వెళ్లడం అంటూ జరిగితే నా శ్వాస ఆగినప్పుడే, ఈ వయసులో మనం ఒకటైంది సంసార జీవితం కోసం కాదని ఒంటరిపోయిన పక్షులు సేదతీర్చుకునే బంధం కోసం, ఒకరినొకరు ఓదార్చుకొని స్వాంతన పొందడం ఆత్మీయతను పంచుకోవడం, ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయండి ఒక బంధమనే చట్రంలో బంధీ అయితే తప్పా! అదీ మీ పరిష్వంగంలో నేను ఉన్నంతకాలం మనను ఎవరు విడదీయరు, ” అతను రెండు చేతులను తన చెంపలకు ఆనించుకుంటూ తన్మయత్వంతో అన్నది. 


 తండ్రి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న కొడుకులు కోడళ్ళకు ఆటో దిగుతున్న తండ్రితో పాటు కొత్త వ్యక్తి దిగడం చూసి ఆశ్చర్యపోయారు. 


“అదేంటి నాన్నా! ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాము, మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ పని చేయడం లేదని వస్తుంది. బహుశా చార్జింగ్ లేదేమోనని అని అనుకున్నాము, ” 


“బాబు, ముందు ఇంట్లోకి పదండి చెబుతాను.. రా కాత్యాయని, ” తన బ్యాగులు కొడుకులు పట్టుకుంటే ఆమె బ్యాగు తను పట్టుకొని ఆమెకు చేయి అందించాడు రంగనాధం.


 అయోమయంగా చూస్తున్న కోడళ్ళకు కొడుకులకు జరిగిన విషయం చెప్పి. “బాబు, నేను చేసిన పని మీకు నచ్చితే కలిసుందాము. లేదు, మా వల్ల మీకు తల వంపులు అవుతుందంటే.. ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. నేను బాధపడను, ”అన్నాడు రంగనాధం. 


“నాన్నా! మీరు మమ్మల్ని అర్థం చేసుకుంది ఇంతేనా! మా కోసం మీ జీవితాన్ని ధార పోశారు. అలాంటి మిమ్మల్ని మేము తప్పు పట్టడమా? లేదు నాన్న.. మాకు చాలా ఆనందంగా ఉంది, ” అన్నారు పిల్లలు.


“అవును మామయ్య .. ఈ వయసులో మీకు ఒక తోడుంటే ఎంత బాగుండేదని నేను స్వప్న చాలాసార్లు అనుకున్నాం. కానీ మీతో చెప్పే ధైర్యం లేక పోయాము. మాకు ఇంట్లో పెద్దదిక్కు లేదని చాలాసార్లు బాధపడ్డాము. ఇప్పుడు ఇక మాకు ఆ భయం లేదు. అత్తయ్యా! ఇకనుండి మమ్మల్ని కోడళ్ళుగా కాదు, మీ కూతుర్ల లాగా చూసుకోండి. మా అందరి బాధ్యత మీదే, ” ఇద్దరు చేరోవైపు వచ్చి కాత్యాయనిని పట్టుకున్నారు. 


“నిజంగా నాకు ఈ జన్మలో ఇంతటి అదృష్టం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇంతటి బాధ్యతను నా మీద పెట్టిన మిమ్మల్ని నిజంగా నా బిడ్డలు గానే చూసుకుంటాను, ” ఆనందంతో స్వప్నను సుమను దగ్గరకు తీసుకుంటూ భర్త వైపు చూసింది. 


కొడుకులను హృదయానికి హత్తుకుంటూ భార్య కాత్యాయనిని ప్రేమగా చూసాడు రంగనాధం. 


 ॥॥ శుభం॥॥


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 







 




 


















 


4 Comments


Lakshmii Trigulla

2 hours ago

Thank you all

Like

Aluwala Madhavi

6 hours ago

కథ ఈనాటి వాస్తవ పరిస్థితులను కళ్ళముందు చూపింది .చాలాబాగుంది.

Like

mk kumar
mk kumar
Nov 10, 2024

bagundi. vruddulu kuda pelli chesukovadam tappuledani chepparu. ayute pillalu tandriki maddatu ivvadam bagundi.

Like


@swapnaj8931

11 minutes ago

Katha climax super ga undi attayya.

Like
bottom of page