కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Kakathi Rudrama Episode 16' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ
16 వ భాగం
గత ఎపిసోడ్ లో…
గన్నారెడ్డి గురించి సరైన అవగాహన కలిగి ఉంటాడు శివదేవయ్య.
అదే విషయాన్ని రుద్రమ దేవికి వివరిస్తాడు.
శివ సాధువు వేషంలో లకుమయారెడ్డిని, అతని అనుచరులను స్పృహ తప్పిస్తాడు గన్నారెడ్డి.
లకుమయారెడ్డిని బంధించి ఆ వర్తమానాన్ని శివదేవయ్యకి చేరవేస్తాడు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 చదవండి..
ఓరుగల్లులో ఎక్కడ చూసినా
ఆనందమే. కోలాహలమే. సంరంభమమే.
సంరంభ ఆనంద కోలాహలమే.
విజయదశమి..........
అమ్మవారి అలంకరణలు చూచుటకు వెయ్యి కన్నులు కావలెను.
పగలు- వేడుకలు, జాతర.
రాత్రి అమ్మవారు ఏడు గుర్రాలు పూనిన రధముమీద ఊరేగుతున్నది.
అమ్మవారితో పాటు ఊరు ఊరేగుచున్నది.
ఎటు చూసినా సందడి.
సైనికులు, సేనాపతులు, ప్రజలు అమ్మవారి వెంట వున్నారు. మేళతాళములు
ముందు మదగజము మీద రుద్రమదేవి. ఆమెను ఆ వేషంలో చూడటం ప్రజలకు అదే మొదలు. ఎంత అందముగా నున్నది.. తమ చక్రవర్తిణీ!
ఎటు విన్నా అదే మాట.
ఆ వెనుక ఏనుగు మీద వున్నది 'అన్నమాంబిక' కోటారెడ్డి ప్రభువుల కొమరిత యట.
ఈమె నేనట గన్నారెడ్డి తెచ్చినది.
ప్రజలు ఎవరి ఆనందంలో వారున్నారు.
మధ్యరాత్రఐనది- వూరంతా కాగడాల వెలుగు.
లకుమయారెడ్డి మీద యివాళ ఎవరికీ భయాలూ, అనుమానాలూ లేవు. అతనూ స్వేచ్ఛగా బయటికి వచ్చాడు. కాకతమ్మ గుడి వెనక అంతా చీకటి మయము.
ఆ చీకటిలో వారు నలుగురు
రుద్రయ్యమంత్రి, లకుమయారెడ్డి, హరిహ,ర మురారిదేవులు.
వారి సంభాషణలు యిది:
"మీరు యుద్ద ప్రయత్నాలుచేసి, కాకతీయ సామ్రాజ్యమును త్వరగా ఆక్రమించవలెను”
అని లకుమయారెడ్డి అన్నాడు.
"మేమునూ ఆ ప్రయత్నములోనే వున్నాము"
"యాదవరాజులు, మహాదేవరాజు ప్రభువులు ఏమంటున్నారు"
తమ తండ్రిగారు కృష్ణభూపతులు ఆఖరి దశలో వున్నారు. వారు హరీ అనటమూ, వీరు వురికి రావటము"
"సైన్యములు సిద్దమా?"
"ఆ.... ఆ ప్రయత్నము లన్నీయూ ఎన్నడో జరిగినవి".
"ముందు రుద్రమదేవిని, ఆ తరువాత గణపతిదేవ చక్రవర్తినీ హతమార్చవలెను. "
"తప్పక"
"మరి యాదవ రాజులకు ఏమివ్వవలెను".
"గెలిచిన తరువాత పదికోట్ల బంగారునాణెములు ".
"అది ధర్మమే" అన్నాడు లకుమయారెడ్డి.
"మనసేనలకు ఏల అంతరాయము కలిగినది. ?" అన్నాడు మురారిదేవుడు.
"ఆ గన్నారెడ్డి దొంగ చేసిన నిర్వాకమది. మహాదేవరాజు దగ్గర నుంచి వస్తున్న రుద్రయ్య మంత్రిని బంధించినాడు. అచ్చట మా రుద్రయ్య మంత్రిని నిత్యపెళ్ళి కొడుకు
వలె చూసినాడట".
" చిత్తము. ఆ విషయములో సందేహము లేదు. "
" అతనికీ నాకు బాందవ్యమున్నదట" అన్నాడు హరిహరదేవుడు.
ప్రభువులకు సాక్షాత్తు అన్న కుమారుడే. " అన్నాడు రుద్రయ్య మంత్రి.
" మా యింటి పేరును నాశనం చేశాడు"
ఇంతలో హరిహరదేవుడు కలగజేసుకుని-
" అతడు వట్టి దొంగే కాదు, దోయటమేకాదు, యుద్దతంత్రంలో గొప్పనేర్పరిట, మహా
వీరుడట... లేకపోతే మనవైపున వున్న సామంతుల భార్యలందరి తాళ్ళు తెంచేశాడు. "
' అది గోనవారి పౌరుషపటిమ" అన్నాడు మురారీదేవుడు.
" నా శ్రాద్దం. అతడి వెనకదన్ను వుంది. " అన్నాడు రుద్రయ్యమంత్రి అని క్షణం ఆగి-
" చాటుగా పొడుస్తాడు. ఎదురుగా యుద్దం చెయ్యలేడు. ఉత్తనాప".
" మరి రుద్రమదేవి, గొప్ప చక్రవర్తిణి గదా! అతనికి ఎందుకు బుద్ది చెప్పరు".
" కాకతీ సామ్రాజ్యం క్షీణదశకు వస్తున్నదని అర్దం . రాజ్యాలు పతనమయ్యే స్థితి దాపురిస్తే యిట్లాంటి అనర్దాలే వస్తాయి. దొంగలు విజృంభించి ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తారు. " అన్నాడు రుద్రయ్యమంత్రి మురారి దేవుడి ప్రశ్నకు సమాధానంగా.
లకుమయారెడ్డి కలగజేసుకుని, "సామంతులంతా ఆ క్షణంకోసం ఎదురు చూస్తున్నారు. తిరుగుబాటు యింకెంతో దూరంలో లేదు. ఆడది రాజ్యం చెయ్యటం, దాని నీడన బ్రతకడం ఎవరికి మాత్రం
యిష్టం!"
"గన్నారెడ్డిని నాశనం చేయడం మా లక్ష్యం " అన్నాడు హరిహరదేవుడు.
"అన్న కుమారునడని జాలి చూపించారు మా ప్రభువులు యిన్నాళ్ళు. ఇక యిప్పుడు వాడి తప్పిదాలను క్షమించమని ఎట్లా అనగలడు" అన్నాడు రుద్రయ్యమంత్రి.
" మీ యిష్టం" అన్నాడు లకుమయారెడ్డి.
" మీరు తప్పించుకునే అన్ని ప్రయత్నములు చేస్తున్నాం" అని హరిహరదేవుడు క్షణం
ఆగి, "మనకు అన్ని విధాల బాసటగా వుంటామని రహస్యవార్త వొకటి వొస్తూ వుంటోంది. వారెవరై వుంటారు?"
" అదీ తెలుస్తుంది. ఎదురు చూడటమే" అన్నాడు లకుమయారెడ్డి.
-------------------------------------
ఉదయము.
స్వచ్ఛపు ఉదయము... వెలుతురు వచ్చినది... సాగినది... పాకినది... కోట బురుజులను
మెరిపించినది. లోకమునకు కాంతిని అర్పించినది. రుద్రమదేవి, రుద్రదేవుల వలె వేషం వేసుకున్నారు. తండ్రిగారు రమ్మని కబురు పంపినారు- ఆయన బాలీసుల నానుకుని కూర్చుని వున్నారు.
ఆమె తండ్రి ప్రక్కన కూర్చున్నది.
ఆయన కుమార్తె ముఖం లోకి చూసినాడు. చెక్కిళ్ళపై కన్నీరు జల జల జారినది. ఆమె కూడా కన్నీళ్ళు తుడచుకున్నది.
"రమ్మని కబురు పంపినారు".
"నీతో చిన్న పని పడింది తల్లీ!"
"చెప్పండి నాన్నగారూ"
ఇంతలో శివదేవయ్య మంత్రులు వచ్చినారు. ఈ రాజ్యములో వారికి అడ్డు లేదు.
"మీరు వచ్చి నా పనిని తేలిక పరిచినారు".
శివదేవయ్య చిరునవ్వు నవ్వినారు. నవ్వి.
"అమ్మా! .... మీ తండ్రిగారి మనసులోని మాట యిది. నిన్ను ఆయన పురుషుని వలె పెంచినారు. చూసుకున్నారు కూడా. ఎక్కువ రాజ్యభారాన్ని తమ తలకెత్తారు. గణపాంబదేవి వలె నిన్ను అత్తగారింటికి పంపలేక పోయినారు. ఈ రాజరికాల్లో ధర్మము, ఆచారము రెండూ రెండు మార్గములు. -
ధర్మం స్త్రీని చక్రవర్తిణి చేయును.
ఆచారము దానిని ఆక్షేపించును.
వాటిని వదిలితే, ఈ రాజ్యమును నీ అంత సమర్ధవంతంగా పరిపాలించువారు మనకు లేరు. పోతే వారికి మూడు కోరికలు వున్నవి.
" అవి ఏవి?"
"మీరు కాకతీ సామ్రాజ్యాన్ని అధిరోహించే తొమ్మిదవ చక్రవర్తులు. మొదటి కోరిక ఇది. ఇది మీకు అంగీకారమే కదా?"
ఆమె తల వూపినది. ఇష్టమేనన్న భావము ప్రస్ఫుటమైనది. చక్రవర్తులు గమనించారు.
రెండు: " మీరు వివాహం చేసుకోబోయే భర్తకు అతనికి కాకతీసామ్రాజ్యసింహాసనమును పొందగల హక్కులేదు. అతడు ఎంత ఘనుడైనా సరే. "
ఆమె కనుబొమలు మూతలుపడినవి. ఏదో అడగవలెనని అడగక వూరుకున్నది.
‘చక్రవర్తిణి భర్త చక్రవర్తికాకుండుట ఎట్లు?’ అని అడగవలెనని అడగలేదు-
"ఇది మీకు సమ్మతమా ?"
"సమ్మతమే "
"మీకు పుత్రులు జన్మించినట్లయితే, ఆతనిని మీరే, కాకతీయ వంశానికి దత్తతయిచ్చి అతనికి రాజ్యం అప్పగించవలెను"
"జన్మించకపోయినట్లయితే - ఆడ సంతతే కలిగితే ?" అని ఆమె అడిగినది..
మీరు మీకు యిష్టం వచ్చిన వారినెవరినయినా కాకతీయ వంశం లోకి దత్తత తీసుకుని రాజ్యము నప్పగించవలెను. "
ఆమె ముసలి తండ్రిని, మృత్యువు తన శీతల హస్తాలతో జాలిగా లాక్కొనబోతున్న వృద్ధమూర్తి మనసు నొప్పించలేక యిట్లా అంది.
"నేను కాకతీవంశ తొమ్మిదవ చక్రవర్తిణి. నా భర్తకు సింహాసనం హక్కు లేదు. నా బిడ్డయినా దత్తత తీసుకుని కాకతి యింటి పేరుతో రాజ్యాన్ని పాలిస్తాడు. ఇది కాకతీదేవి మీద ఆన. సర్వభూతముల మీద ఆన. మీ పాదపద్మాల సాక్షిగా ఆన. నా తిరుగులేని నిర్ణయము . ప్రమాణము. "
తండ్రిగారి ముఖంలోకి చూసినది. ఆమె తండ్రిగారికి నమస్కరించి లేచి వచ్చింది. ఆమె ముఖములో భావములను శివదేవయ్య గ్రహించినాడు.
‘భార్యపైన హక్కు ఎవరిది? భర్తది. - మరి తనమీద, అనగా తన శరీరము మీద తప్ప, తన భర్తకు సంక్రమించెడు అధికారములు శూన్యమా! మరి వివాహము ఎందుకు? అర్ధబాగము అన్న ఆర్యోక్తి యిక్కడ వర్తించదా?’
ఇక్కడో ధర్మసూక్ష్మము-
ఈ వార్త చాళుక్య వీరప్రభువుకు తెలిస్తే కేవలము తాను అతనికి భార్యగానే మిగిలి పోతున్నదనా? వారి భావ మెట్లుండును. తనను సామాన్య స్త్రీ కి మలే ప్రేమించి-
"రుద్రమదేవీ.. ఈ సింహాసనము నీది. నీవు మాత్రమే నా దానవు. - మనకు వున్నది పరిమిత దాంపత్య జీవితమే" అనగలిగితే..
ఏమో, కాలము తనకు ఏమి యివ్వనున్నది-ఎంత విచిత్రమైన జీవితము తనది-
---------------------------
"మా మరిదిగారికి ప్రాణప్రమాదము జరుగదు కదా? అన్నది రుద్రమదేవి.
శివదేవయ్య ముఖం విచారంతో వుంది-
" చెప్పలేము తల్లీ"
"వేగులు తెచ్చిన వార్తలేమి?"
"ప్రస్తుతము గంభీరముగా నున్నది"
"ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు".
"బేతమహారాజుల పెదతండ్రి కుమారులు కోట పేర్మినాయుడూ- తెర్రాల కాటమనాయకుడూ- గుంటూరు నాగవిభనాయకడూ-"
"కోట బేతరాజును బంధించిన వార్త నిజమేనా?"
శివదేవయ్య: " ఆ .... అది నిజమేనట".
రుద్రమదేవి: " అయితే మనము యిప్పుడు ఏమి చేయవలెను!"
శివదేవయ్య: " ప్రసాదిత్యప్రభువుకూ, సబ్బిసాహిర మండల ప్రముఖ సేనాపతి నడికము బాపదేవ ప్రభువునకూ, జాయపప్రభువులకూ వేగిరం రమ్మని వార్తలు పంపినాము"
రుద్రమదేవి: "వారి ఎొంత సేపట్లో రావచ్చును?
శివదేవయ్య: " ఏ క్షణాన్నయినా రావచ్చును".
ఇంతలో ముగ్గురూ రానే వచ్చి వినయంగా నమస్కరించారు.
రుద్రమదేవి: " ఆసీనులుకండు".
కూర్చున్నారు.
రుద్రమదేవి: " మీరు జాగ్రత్తగా వినాలి.
బొప్పదేవరప్రభూ, నేను సకలసేనాధిపతిని. నా తర్వాత సేనాధిపతి మీరు. మనము మన సైన్యంతో గుంటూరు మీదకు యుద్ద సన్నద్ధులై కదుల్తాము.
జాయపరాజు ప్రభూ, మీరు ప్రసాదిత్య ప్రభువులకు సాయంగా, ఏకశిలానగరంలోవుండవలెను. రాజ్యకార్యనిర్వహణ బాధ్యతలు, శివదేవయ్య బాబయ్యగారిని సంప్రదిస్తూ వుండాలి. సేనాధిపతి జన్నిదేవులు జాగ్రత్తగా కోటనూ, వారి పుత్రుల సాయంతో కాపాడగలగాలి. బాబయ్యగారు మంచి ముహూర్తము నిశ్చయిస్తారు. ఆ నాడే మా యుద్ధప్రయాణం మొదలు".
" చిత్తం!"
---------------------------------------------------------------
అన్నమాంబిక: ". ప్రభూ!"
రుద్రమదేవి: " ఎవరదీ!"
అన్నమాంబిక: " నే నక్కా-"
రుద్రమదేవి: " అహా ...... అన్నమాంబికా రాకుమార్తెలా?"
అన్నమాంబిక: " అదేమక్కా .... ఆ పిలుపు!"
రుద్రమదేవి: " నీవు నన్ను ప్రభూ అనినచో, నేను నిన్నేమనవలెను".
అన్నమాంబిక: " క్షమించక్కా......... "
రుద్రమదేవి: " అటులనే తథాస్తు".
అన్నమాంబిక: " నా కో చిన్న కోరిక వున్నది".
రుద్రమదేవి: " అడుగుము".
అన్నమాంబిక: " అడిగిన తర్వాత కాదనరాదు".
రుద్రమదేవి: " మేము కాకతీయులము కాదనము".
అన్నమాంబిక: " నేను నిన్ను వదలి వుండలేను".
రుద్రమదేవి: " నేను త్వరలో తిరిగి వస్తాము".
అన్నమాంబిక: " ఐనా సరే, నేనూ యుద్దానికి వస్తాను".
రుద్రమదేవి: " ఏదన్నా, ప్రమాదం జరిగితే"
అన్నమాంబిక: "ప్రమాదం జరిగే రాతవుంటే, ఎక్కడున్నా జరగవచ్చు".
రుద్రమదేవి: " రాక తప్పదంటావు".
అన్నమాంబిక: " వుహూ..... ".
రుద్రమదేవి: " ఐతే సిద్దం కా .... ఆడదాని కత్తి దెబ్బలలోతు తెలియవలసిన సమయము ఆసన్నమైంది".
అన్నమాంబిక: " మా అక్క మంచిది".
రుద్రమదేవి:" అన్నీ దొంగమాటలు" రుద్రమదేవి నవ్వింది. " మనవెంట యింకా ఎవరెవరున్నారు".
అన్నమాంబిక: మా పినతల్లి నాదాంబామహాదేవీగారూ".
రుద్రమదేవి: " సరే.... ఇప్పుడు మీరు యుద్దయాత్రలో పాల్గొంటే, కొంత మందికి జ్ఞానోదయమన్నా అవుతుంది".
"చూద్దాము".
అన్నమాంబిక: " స్త్రీలకు ఇది పరీక్షా సమయము. ఆడది అన్నింటా సమర్థురాలే. ఆమె కన్నతల్లిగానూ వుండగలదు. కత్తిని ధరించగలదు. మగవానిగా వుండగలదు. అవసరమైతే తెగటార్చగలదు యిట్లా స్త్రీలు తెలుసుకుంటారు".
రుద్రమదేవి: " నిజమే . బాగా అన్నావు".
అన్నమాంబిక: " అక్కా, కత్తి పట్టి చాలా కాలమైంది. నీ దయవల్ల అదీ నెరవేరబోతోంది".
పూర్ణిమరాత్రికి సైన్యాలు కాకతీనగరాన్ని వదిలాయి. కృష్ణా తీరాన్ని చేరాయి. నావలలో ప్రయాణం రాత్రికి రాత్రి చేసి- గుంటూరు పట్టణాన్ని తాకాలీ. నావలను సిద్దం చేశారు.
ముమ్ముడాంబిక కూడా వస్తానని గోల చేసింది. కానీ, గుంటూరును స్వాధీనం చేసుకున్న తరువాత రావచ్చునని, నచ్చజెప్పి అంతఃపురంలో వుంచారు.
వీరనాయకులు కవచదారులై రుద్రమదేవి- అన్నమాంబికా రధాల పక్కన కత్తులతో గుర్రాలపై స్వారీ చేస్తున్నారు.
ఎంత సైన్యము. ఎంత సంరంభము- చెప్పనలవి గాని జైత్రయాత్ర అది. అన్నమాంబిక ఆనందమునకు అవధులు లేవు . రాచకులాంగనకు, కత్తి పట్టుకున్న ఒళ్ళు పులకరించదా!
--------------------------------------------------------------------
కాకతి ప్రభువులు వృద్ధులై, అంతిమ ఘడియలలో వుండటమూ- కాకతి గద్దెను ఆక్రమించాలని చాలామంది వువ్విళూరటమూ- ఎవడికి వాడే ఆ విశాల సామ్రాజ్యాన్ని సింహాసనాన్ని ఆక్రమించి, అధిష్టించాలని వువ్విళూరటమూ- ఆడది అయిన రుద్రమదేవి ఏమీ చేయదలదన్న ధీమా - చాలా మందిని కుట్రదారులుగా చేసింది.
నాగమనాయకుడు విశ్వాసపాత్రుడు. కాకతీ చక్రవర్తులకు నమ్మకమయిన సేనాపతి. కోట బేతరాజులకు యిష్టుడైన సామంతప్రభువు.
అయితే అందరికీ వున్న వ్యామోహమే అతనినీ అంధున్ని చేసి- ఇతర రాజులు యిచ్చిన చెడ్డ సలహాలను పాటించి, కాకతీ సామ్రాజ్యంమీదకి దండయాత్ర చేయాలనే తలంపు కలిగించింది. అదేగాక, కాకతీ సామ్రాజ్య విస్తరణకు తన వీరత్వమే కారణమనే ప్రగాఢమైన నమ్మకం, నాగయ్య నాయకునికి వుండటం కూడా ఈ దండయాత్రకు మరొక్క హేతువు.
అతను గణపతి రుద్రదేవుల సారధ్యంలొ-
కమ్మనాటి వారిని-
ఆర్వేలనాటి వారిని-
పాకనాటి సామంత ప్రభువులనూ-
ఓడించి -ఎన్నో బిరుదులు సంపాదించాడు. ఆ దర్పం ఒకటి అతనిలో ఉన్నది. అదీగాక, తండ్రి పౌరుషం కుమార్తెకు ఎట్లా వస్తుంది? అనే మరొక్క వితండ ఆలోచన.
అగ్ని అంటుకుంటే యితరులు ఆజ్యంపోసి దానిని ఉధృతం చేశారు. నాగయ్యనాయకుణ్ణి చాలామంది సామంతుల వుసికొల్పారు. ఇక తాను ఏకశిలానగర ప్రభువుగా కలలు కనటం ప్రారంభిచాడు.
పూర్ణిమ వెళ్ళిన మరునాడు కృష్ణానదిని తనసైన్యంతో దాటాడు. -మరి రెన్నాళ్ళకు కృష్ణాతీరపు ఉత్తరభాగంలో ఉన్న గార్ల చేరాడు.
రేచెర్ల గణనాధుడు గార్ల ప్రభువు. గార్ల ప్రభువు ఎక్కడికి వెళుతున్నారని అడిగితే, తీర్థయాత్రలతో పాటు పుణ్యక్షేత్రములు దర్శించుటకు అని చెప్పవలెననుకున్నాడు.
అయితే, నాగయ్యనాయకుని ప్రతీ అడుగు గొంకప్రభువుల వేగులు తెచ్చిన వార్తల వల్ల రుద్రమదేవికి అందుతూనేఉన్నాయి. ఆమెకు అంగరక్షక యువకులు అన్నింటినీ సమీక్షిస్తున్నారు. బాప్పదేవుడు, గొంకప్రభువు, రుద్రమదేవి యుద్దతంత్రాలూ, దీర్ఘ చర్చలూ చేస్తూనే ఉన్నారు.
లక్షన్నర సైన్యం మూడు భాగాలుగా విభజించబడింది.
గార్ల ఉత్తరభాగం నుంచి బాప్పదేవుడూ, దక్షిణదిక్కునుంచి రుద్రమదేవి.
గొంక ప్రభువు యిరవైవేల సైన్యంతోనూ, గార్ల ప్రభువు రేచెర్ల గణనాధుని అండతో పడమట దిక్కునుంచి తాకవలెనని నిర్ణయమైంది.
అంతేగాక నాగమ్మనాయకుడు పారిపోకుండా, గార్ల ప్రభువులు మార్గాలన్నింటిని బంధించినారు. ఈ నిర్ణయం జరిగిన మూన్నాళ్ళకు-
నాగమ్మనాయకుని సైన్యంపై మూడువేపులనుంచీ శత్రుసైన్యాలు వచ్చిపడ్డాయి. నాగయ్యనాయకుడు చలించలేదు. -అతను ఎన్నో యుద్ధము లను చేసిన- చూసిన అనుభవజ్ఞుడు. పైగా సర్వ సైనాద్యక్షుడిగా చాలా యుద్దాలలో పాల్గొని ఆరితేరినవాడు అతడు చక్రబంధణం చేశాడు.
బాప్పనాయకుడు గానీ, రుద్రమదేవిగానీ, గొంక ప్రభువు గానీ, ఎన్ని తాకిళ్ళు తాకినా, చక్రవ్యూహాన్ని ఛేదించగలగడం గానీ, లేదా నాగయ్యనాయకుని కదిలించడం గానీ చేయలేకపోయారు. బలమైన కాకతీయ సైన్యం బెంబేలుపడింది.
వేగులు ముందు దారి తీస్తుండగా- బేతమహారాజు, తమసైన్యమూ- తమ మేనమామలైన సతనాటి ప్రభువుల సైన్యము సమీకరించుకుని, రుద్రమదేవి సైన్యంలో వచ్చి కలిపారు.
రెండు లక్షలమంది సైనికులు నాగయ్యనాయకుని సైన్యాన్న ఢీకొన్నది. భయంకరమైన యుద్దము జరిగినది. వేలాదిమంది మరణించటమూ, క్షతగాత్రులవటమూ జరిగినది.
బాప్పదేవుని వీరత్వము వలన చక్రవ్యూహ ఛేదనం జరిగి, కాకతీసైన్యాలు గట్టుతెగిన ఏరువలె నాగయ్యనాయకుని సైన్యాలను రక్తములో ముంచి తేల్చినవి.
రుద్రమదేవి కత్తిదెబ్బలకు ఎన్ని తలలి పగిలాయో- ఎన్ని తలలు శరీరమునుంచి వేరు పడ్డాయో చెప్పలేము. ఆమె వీరరుద్ర, అపరఉగ్రభద్రకాళిక వలె విరుచుకుపడింది. ఆమె వెనుకనున్న అంగరక్షకులు మేలిపులివంటి మెరికలు... దొరికితే నరుకుతారు...... ఆనాడు చూడవలసినదే ఆమె యుద్దపఠిమ.
నాగయ్యనాయకునికి, బాప్పగేవునికి ముఖాముఖి( ద్వంద యుద్దము) యుద్దము జరిగినది. ఇరుపక్షాలవారూ యుద్దాన్ని ఆపి, ఈ పోరును వీక్షించడం మొదలుపెట్టారు.ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి- రక్తం ఛివ ఛివ లాడుతూ పారుతున్నది. బాప్పదేవుడు కసకసలాడుతూ, శివాలు తొక్కుతున్నాడు. అతని చేతిలోని ఖడ్గము సర్రు సర్రు మంటున్నది.
కాకతీ సైనికుల విజయధ్వానాల మధ్య బాప్పదేవుడు నాగయ్య నాయకుని తల సర్రున ఖండించాడు.
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Comentarios