Video link
'Kakathi Rudrama Episode 2' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో
గణపతి రుద్ర దేవులకు పురుష సంతతి లేదు.
అందుచేత కుమార్తె రుద్రమ దేవిని రుద్ర దేవుడిగా పెంచుతాడు.
రుద్రమ దేవి అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరుతుంది.
ఇక చదవండి...
రుద్రమ 27 నవంబర్ 1289 వ సం!! చందంపట్ల గ్రామము, నకిరేకల్ మండలం నల్లగొండ జిల్లాలో జన్మించెను.
కాకతీయ గణపతి దేవ చక్రవర్తి యిహ రాజ్యాన్ని పాలించటానికి పనికిరాడు.
అస్తమించబోయే ప్రొద్దులాంటి వయస్సు ఆయనది. ఆయనకి దుఃఖం వుంది.
కానీ చక్రవర్తిగా కష్టనష్టాల్ని యితరులతో చెప్పుకోలేడు.
ఆయన తొలి కుమార్తె ' రుద్రమదేవి' ని- పురుషవేషం లోనే పెంచాడు.ఆమె అన్నింటిలోనూ ధీర........'
మహావీరుడు' గా చలామణి ఐన పురుషవేషధారి.
ప్రజలకు ఆమె స్త్రీ అయినా రుద్రమదేవిగా కాదు. పురుషుడైన ' రుద్రదేవుడు' !
రుద్రమదేవి-రుద్రదేవుడుగా సింహాసనం ఎక్కటంతో - జరుగుతున్న గందర గోళాలకు లెక్కలేదు. అయితే గణపతి రుద్రదేవ చక్రవర్తి అదృష్టవంతుడు కావటం చేత , ఆయనకి ముఖ్యులూ- విశ్వాసాపాత్రులు ఈ రాజ్యంలో ప్రచ్ఛన్నయుద్దాలు లేకుండా శాంతి ధామంగా చేసారు.
ముఖ్యంగా అనేక వీర బిరుద బిరుదాంకితుడు శ్రీజన్నగ దేవుడు- అఖండ మేదావీ, సంస్కృతాంధ్ర భాషను పుక్కిలి పట్టిన శివదేవయ్య- రాజ్యంలో అరాచకాలు లేకుండా కాపాడుతున్నారు.ఇది కాకతీయసామ్రాజ్యానికి చెందిన ప్రస్తుత పరిస్థితి.
గణపతి రుద్రదేవుల అతి విస్తీర్ణసామ్రాజ్యం వెనక , దానిని సంరక్షించుకుంటూ- విశ్వాసంగా కాపాడుకుంటూ వచ్చిన అనేకానేక యోధులు
వున్నారు. వారు ప్రభువును చిత్తశుద్ధితో నిజాయితీతో సేవించారు.
అట్లా చక్రవర్తికి నమ్మకపాత్రుడు - విశ్వాస పాత్రుడు అయిన గోన లకుమయా రెడ్డి
వర్ధమాన పురాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలన చేయటం మొదలుపెట్టాడు.
చక్రవర్తి చాలాచిన్న విషయానికి కూడా లకుమయా రెడ్డిని సంప్రదించేవాడు.
నిజానికి ఈ రాజ్యానికి అర్హుడు, పెద్దవాడూ అయిన లకుమయారెడ్డి సోదరుడు
అస్వస్థుడు కావటం చేత, ఆయన ప్రథమ పుత్రుడు గన్నారెడ్డి చిన్నవాడు
కావటం చేత, అన్నగారి తరఫున అతని కుమారుడైన గన్నారెడ్డి స్థానంలో
లకుమయారెడ్డి రాజ్యపాలన చేస్తున్నాడు.
కాకతీయ సామ్రాజ్య విస్థరణకు ఆదినుంచీ యాదవరాజులు ప్రతిబంధకంగా వుంటూనే వచ్చారు. యుద్ద తంత్రజ్ఞుడూ, మహాసేనానీ, వీరుడు అయిన లకుమయారెడ్డి , తమ శత్రు రాజ్యమైన ' కుంతదేశం' మీదకి చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం, సేనలను చొప్పించి అరివీర భయంకరుడై , చిచ్చరపిడుగై , తేరిపార చూడరాని దుర్నిరీక్ష వీరతేజంతో, కళ్యాణ పురపు యాదవరాజ్య ప్రతినిధులను- ఆ చేత్తో 'వాతాపీ' నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
అదీగాక ఇద్దరు రెడ్డిరాజులు కావడం చేత, భవిష్యత్తులో సంబందిత భాందవ్యాలు చేసుకుని, రెండు రెడ్డిరాజ్యాల నొక్కటిగా చేసుకోవాలనే ప్రగాఢత అంతరాంతరాల్లో వుండటం చేత - ఆదవోని ప్రభువు కోటారెడ్డికి, లకుమయా రెడ్డికీ - మంచి స్నేహ భాందవ్యాలు వుంటున్నాయి.
అయితే యిప్పటివరకూ- కాటు వేయడానికి అదను కోసం చూస్తున్న రాచరికపు నాగులు, విషాలు నింపుకుని, పెద్దపడగలతో - ఎదురు చూస్తున్నాయి.
ముఖ్యంగా యిందులో --
దాయాదులు హరిహర, మురారిదేవులు, దేనాటి శ్రీపతి ప్రభువులు, కమ్మనాటి విజయగోపాలుడూ, ఎరువమాను మలిదేవరాజు,
సాకనాడు-పొత్తనాడు కలిసి పరిపాలిస్తున్న సిద్దయ చోడరాజు.
ఏ క్షణాన్నయినా వీళ్ళందరూ కుమ్మక్కయి, కాకతీయ ప్రభువుల మీదికి అకస్మాత్తుగా విచ్చు కత్తుల వలె దండయాత్ర చెయ్య వచ్చును. ఇది లోలోన జరుగుతున్నకుతంత్రం.
అందరూ గుడిగుడి జంగాలే. అందరూ గుండెలు తీయగల దొంగలే. అటు చూస్తే హరిహర- మురారీ దేవులు కాకతీయ సామ్రాజ్యం కోసం వెయ్యి కలలు కంటూ, గణపతిదేవుల మరణవార్త కోసం యెదురు చూస్తున్నారు. సామంత రాజుల్లో తిరుగుబాటు ప్రబలేట్టు ఉన్నది.
శత్రు రాజులైన వారందరూ స్నేహ హస్తాలు సాచి, గణపతి రుద్రదేవులు కనుమూయగనే, ఉరకలెత్తే రేచులవలె , జాతి పులుల వలె, అప్పుడే రుద్రమదేవి మీద ఉరకటానికి సిద్ధంగా ఉన్నారు. గణపతి రుద్రదేవులు ప్రాభవంలో ఉన్నప్పుడు చెప్పుల క్రింద తేళ్లవలె బ్రతికిన పిరికి వెదవలు కూడా, ఇవ్వాళ పురుష మూర్తులవలె ప్రగల్భాలు పలుకుతూ మీసాలు సవరిస్తున్నారు.
----------------
తిక్కన భట్టారకుని గంభీర, వీర, స్నిగ్ధ, ఔన్నత్య, పామర, పండిత, జనరంజకమై , కవి శ్రేష్టులను సైతము ' ఔరా' అనిపించగల పద్య గద్య రచన, "ఆంధ్ర మహా భారతము" సింహపురి యని సగర్వంగా రెడ్డి వీరులు చెప్పుకునే నెల్లూరు
నుంచి ఓరుగల్లు వరకూ చేరుతున్నాయి. కాకతి చక్రవర్తులు అవసాన దశలో కూడా ఈ మహా గ్రంథం కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రతీ మూన్నాళ్ళకీ క్రొత్త ఆశ్వాసం లోని నాలుగవ వంతు భాగం కోటలోనికి వచ్చి
చేరుతున్నది.
ప్రభువులను మృత్యువు ఏ క్షణాన్నయినా కనికరించవచ్చు. ఎంతకాదన్నా, రుద్రదేవ రాజుని పురుష వేషంలో కొలవటానికి సిద్దంగా కొంతమంది రాజులు వుండనే వున్నారు.
ఎనభై ఏళ్ళు నిండిన గణపతి దేవ చక్రవర్తుల అపూర్వ కృపా కటాక్షణాల వల్ల, సామంతులు కడుపులో నీళ్ళు కదలకుండా రాజ్యపాలన చేస్తున్నారు.
రాజన్న వాడికి యింకొంచెం ముందుచూపు, సూక్ష్మదృష్టి వుండాలి. లేకపోతే నిభాయించుకు రావడం కష్టం.
కాకతీ సామ్రాజ్యానికీ, చోళసామ్రాజ్యానికి - ఎప్పుడూ చుక్కెదురే. రాజ్యకాంక్ష అనే కత్తుల వంతెన మీద- ఈ రెంజు సామ్రాజ్యాలూ, తెగ నరుక్కుని రక్తపాతం సృష్టించినవే.
అయితే. ఈనాడు - చోళప్రభువు వీరభద్రుడు రుద్రమదేవిని గాఢంగ ప్రేమిస్తున్నాడని రూఢీగా వార్తలు వస్తున్నాయి.
రుద్రమదేవిని ఎంత వీరత్వంగా పెంచినా , ఎంత పురుషుడిగా చేసినా , ఆమె లో సహజమైన స్త్రీ కాంక్షలు ఉండకుండా వుండవు. అదీగాక రెండేళ్ళ నాడు గణపతి రుద్రదేవ చక్రవర్తి తన కుమార్తెయగు రుద్రమదేవిని ' రుద్రదేవుడు'
గా చేసి - ప్రజలను నమ్మించటానికి , ఆమెకు తన బావమరిది జాయప సేనాని కుమార్తె ‘ముమ్ముడాంబిక' అనే అందాల బాలిక నిచ్చి వివాహము చేశారు.
ఇది మరొక చిత్రమైన రాజకీయ నాటకం.
అంతేనా! ఆ రాజునకు సామంతులై - భక్తి శ్రద్దలతో సేవించ వలెనని వీర ప్రమాణాలు చేయించారు.
ఆ నాడు చేసిన వారేగానీ, ఈ నాడు కాకతీయ ప్రభువుల అవసాన దశలో పాటించే వారు లేరు. మనిషికి పుట్టుకతోనే రాగ ద్వేషాలుంటాయి. స్వార్థం - కుట్ర- కుతంత్రం వుంటాయి. అది రాజకీయమైతే వేరే చెప్పనక్కరలేదు.
గూఢచారులు రెక్కలు కట్టుకుని వార్తలు సేకరిస్తున్నారు. అవసానదశలో నున్న ప్రభువులు ఈ సామ్రాజ్య బాధ్యతే గాక- త్వరిత గతిని తీసుకునే నిర్ణయాలకి అన్నీ అధికారాలూ శివదేవయ్యమంత్రులకూ, జాయప
సేనానీకి, జన్నిగ దేవ సేనాపతులకూ వదిలిపెట్టారు.
ఇప్పుడు చేయవలసిందల్లా మగవాడుగా పెరుగుతున్న లేదా అదే భావన తో
వున్న రుద్రదేవచక్రవర్తికి ' నీవు స్త్రీవి- రుద్రమదేవ చక్రవర్తిణివి' అని తెలియ
జెయ్యటం.
ఇది కష్టసాధ్య మైన పనే, కానీ తప్పదు.
చుట్టూ చీకట్లు, ముసురుతున్నట్లు సామ్రాజ్యం నిండా కుట్రదారుల ఆలోచనలతో
రాగ ద్వేషాగ్నులు ముసురుతున్నాయి.
--------------------------------------------------------
ఓరుగల్లులో, రాచనగరు లోనున్న లోపలి కోటలో, అంతా నిమ్మకు నీరెత్తినట్లున్నది. వృద్ధులయిన శ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి తన సౌద నగరంలో, స్వయం భూదేవారాధన తత్పరుడై చల్లగా కైలాసేశ్వర పాద పద్మారాధనకై ఈ దేహం చాలించి ఎప్పుడా వెళ్ళడము అని నిరీక్షస్తున్నాడు.
అత్యవసరమైతే గానీ తమతో రాజ్య విస్తరణ విషయాలు చర్చింపవద్దని చక్రవర్తి ఆజ్ఞ జారీచేశారు. మహా మంత్రులైన శివదేవయ్య దేశికేంద్రులు, శివ మహాత్మ్యం, శివ వేదాంతం వినిపిస్తూ వుంటారు. మహా కవులనేకులు, తమ
తమ రచనలు చదివి వారికి వినిపించి, ఆ సార్వభౌములవల్ల బహుమతులు,
అగ్రహారాలూ, ధనరాసులు పొందుతూ ఉంటారు.
కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు సింహపురాన్నుంచి తాను రచించిన
ఆంధ్ర మహాభారత పర్వాలు, ఆశ్వాసాలు ఎప్పటికప్పుడు ఆంధ్ర సార్వభౌముని
కడకు పంపిస్తున్నారు. అవి పంపించడం ప్రారంభించి మూడు సంవత్సరాలైనవి.
చక్రవర్తి శ్రీ తిక్కన సోమయాజి దివ్య కవితామృతము తో ఓలలాడుతూ ఎప్పుడు
తదితర పర్వాలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండెను.
ఒక ఉదయాన సార్వభౌముని కడకు శివదేవయ్య మంత్రి, శ్రీశ్రీ రేచర్ల
ప్రసాదిత్య ప్రభువు విచ్చేసినారు. చక్రవర్తి కి ప్రసాదిత్యుడు మోకరిల్లి ప్రణమిల్లి
నమస్కరించినాడు. వారిని కూర్చండ నియమించి యా వృద్ద చక్రవర్తి తన
పల్యంక సింహాసనం పై కూర్చుండి దిండు మీద ఒదిగి " గురుదేవా! ఉదయమే దయ చేశారు?" అని ప్రశ్నించెను.
శివదేవయ్య “మహాప్రభూ! ఒక్క నిమేషం ఏకాంతం ఇప్పించాలి” అని కోరారు
అక్కడ వివిదాసనాలపై అధివసించి శివదేవయ్య దేశికులు రాగానే సార్వభౌముని తో పాటు లేచిన పండితాది వివిధ జనులు, ఆరాధ్యులు, జంగమ గురువులు ఆవలికి వెళ్ళిపోయిరి. కంచుకులా మందిర కవాటములు బంధించి తాము వెడలిపోయిరి.
శివదేవయ్య: “మహాప్రభూ! వివిధ దేశాలతో త్రిలింగ సామ్రాజ్యం పై కుట్రలెక్కు వైతున్నాయి”
గణ: ఎవరూ? ఎలా? కుట్రపన్నుతున్నారు? రెండేళ్ళనాడు సామంతులందరూ వచ్చి తమ రాజభక్తిని ప్రమాణపూర్వకముగా ప్రకటించి వున్నారు కదా!
శివ: నిజమే ప్రభూ! కానీ శ్రీ రుద్రదేవయ్య వారిని పురుషునిగా ఎంచి ప్రమాణం చేయించితిమి. వారందరూ అలాగే చేసిరి. శ్రీ రుద్రదేవయ్య గారు పురుషులేనని చెబుతూ ఎంతకాలం రహస్యం వుంచ గలవారం? ఏనాడో ఆ రహస్యం బయట పడ వలసిందేనని మహాప్రభువు లెరుగనిది కాదు.
గణ: అవును.మేము పరమశివుని సన్నిధిని చేరిన వెనుక కొంతకాలం రుద్రదేవయ్య చక్రవర్తి గా రాజ్యపాలన సాగించి నిలద్రొక్కుకున్న వెనుక అప్పుడు రహస్యం నెమ్మదిగా బైటపెట్టవచ్చును గాక.
శివ: మహాప్రభూ! శ్రీప్రసాదిత్య నాయనిం వారు కొన్ని ముఖ్యమైన విషయాలు తమకు తెలియ జేస్తారు.
ప్రసా: మహాప్రభూ! గోన లకుమయా, ఆదవోని కోటారెడ్డి, కందవోలు నంది భూపాలుడు, కళ్యాణ పుర చోడదయుడు, పూగీనాటి కోట పెమ్మడి రాయుడు, కందుకూరి కేశి నాయుడు.. వీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు. తుంబలక, మానువ, హలువ వారు ఈకుట్రలో కలవాలని వువ్విళ్ళూరుతున్నారు. బేడచెలుకి, మేడిఫల కాచయ ప్రభువుల నమ్మలేము. ఈ లాంటి రహస్యవార్తలు అటు తూర్పునుండి, దక్షిణ
దేశాల నుండి వస్తున్నాయి. వారందరికీ చిన్న చక్రవర్తుల రహస్యం తెలిసిందని అనుమానించ వలసి ఉంటుంది.
శివ: అందుకనే మహాప్రభువు లకు నేను మనవి చేసేది, ముందుగా రుద్రదేవులు స్త్రీ యే అని లోకానికి చాటడం, తరువాత......
గణ: మహామంత్రీ! ఈ విషయం లో మీరూ, రుద్రదేవ ప్రభువులూ, ప్రసాదిత్యులూ, జాయప సేనానీ ఆలోచించి ఏది మంచిదైతే అదియే చేయండి.
ఎవరు కుట్రలో చేరబోతున్నారో వారిని ధర్మంగా శిక్షించండి. అనుమాన రహితం
చేసుకుని మరీ, పనికి దిగండి.
చూడండి.. తిక్కన సోమయాజులవారు వుద్యోగ పర్వంలో ఈ విషయం ఎంత చక్కగా వర్ణించారో!
ధర్మరాజు ఆఖరికి అయిదూళ్ళడిగిన , అప్పుడు కాదనిపించుకొని కూడా శ్రీకృష్ణుల
వారి రాయబారం నడిపించారు. ఓహోహో ఏమి అద్వితీయ కవిత్వం!
తమ
పురుషార్థం లోని స్వభావాలు ఎన్నో వున్నాయి. ఆయన మహాగ్రంథంలో, ఇక సెలవ్.
విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేయండి.
శివదేవయ్య మంత్రి మహామాత్యులైన చెన్నాప్రగడ గణపామాత్యులు వారి
మేనల్లుడు. ఆరాధ్యులైన వీరశైవుడుకాడు. విష్ణభక్తి కలవాడు. అఖండ పండితుడు. వేద
వేదాంగ పారంగతుడు. సకల శైవాగమవేత్త. మేనమామ వలె అఖండ వైద్యుడు.
చక్రవర్తి అనేక వైద్యాలయాలు , ప్రసూతి ఆలయాలు , వైద్య విధాన పరిషత్తులు
ఏర్పాటు చేసిన ధర్మశాలి. సర్వతంత్రుడు. తన బావగారైన గోపరాజు రామప్రదానిచే త్రైలింగ మహా సామ్రాజ్య పాలన నిర్విక్రమముగా జరుగేటట్లు చూస్తున్నవాడు.
ఈవల ప్రసాదిత్య నాయుడు కాకతీయవంశం తో పాటు వుద్భవించిన రేచర్ల వంశ ముక్తాఫలము. రేచర్ల వారందరూ కాకతీయ వంశ మూల పురుషుడు అయిన భేత ప్రభువు కాలంనుండి కాకతీయ ప్రభువులకు దక్షిణహస్తాలుగా వుండిన మహా
పద్మనాయక వెలమ కులజులు - అఖండ శౌర్య సంపన్నులు., శౌర్యప్రతాపము కలవారు, సూక్ష్మ బుద్దిశాలురు. కాకతీయ ప్రభువులకు పెట్టనికోట.
శివదేవయ్య మంత్రి, నాయని వంక చూసి “సేనాపతీ! రుద్రమదేవి వారి మనస్సు మార్చడం ఎల్లాగూ? ఆ దేవికి మీరు స్త్రీలమ్మా అనే భావం నచ్చజెప్పడం ఎలాగూ?” అని అడిగాడు.
"గురుదేవుల వారికి నే నా సలహా ఇచ్చేది ! ఈ పాటికి ఏదో ఎత్తు వేయకుండా వుంటారూ?"
శివదేవయ్య: " ప్రసాదిత్యులవారూ ! మానవ ప్రకృతి మనుష్యుని ఊహకుమించి నడుస్తూ వుంటుంది!”
ప్రసాదాదిత్యులు: " మహామంత్రీ! చాళుక్య వీరభద్రుల వారికి తమరు ఎందుకు వార్త పంపినట్లు?"
శివదేవయ్య: "యవ్వన హృదయాన్ని, యవ్వన హృదయమే గ్రహిస్తుంది. చాళుక్య వీరభద్ర మహా ప్రభువు యౌవనవంతుడు, మహావీరుడు, కామినీ జయంతుడు. ఆయనకు యువరాజుల వారి హృదయం అర్దం కాకూడదా అని రప్పించాను”
ప్రసాదాదిత్యులు: " తమ అభిప్రాయం నేను తెలుసుకోలేనంటారే?పైగా రుద్రదేవి ప్రభువులు , చాళుక్య వీరభద్ర ప్రభువు కలిసి ఎందుకు వేటకు వెళ్లడం ఏర్పాటు చేశారు?"
శివదేవయ్య: " ప్రసాదిత్యులవారూ! మీరు మన మనుకున్న మువ్వన్నె మోకాన్ని సిద్దం చేశారా?"
.
ప్రసాదాదిత్యులు: "అన్నీ సిద్దమే . నేను ఆ ప్రదేశంలోనే వారిరువురకు తెలియకుండా సిద్దంగానే వుంటున్నాము".
ఇంకా ఉంది.....
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Chala bagundi detailed story telling good
Pl continue