కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Kakathi Rudrama Episode 21' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 21 వ భాగం
గత ఎపిసోడ్ లో
ఏరవీరాదేవి పూజ ముగించుకొని తన సహచరులతో తిరిగి వస్తోంది రుద్రమ దేవి.
రేచెర్ల రుద్రారెడ్డి, అనుచరులతో రక్షణగా ఆమె వెంట ఉన్నాడు.
హఠాత్తుగా హరిహర మురారి దేవులు వారిని సైన్య సమేతంగా చుట్టుముడతారు.
రుద్రమ దేవిని అప్పగించి పారిపొమ్మని రుద్రారెడ్డికి చెబుతారు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 చదవండి..
వీరభద్రప్రభువు గుర్రము, నోటివెంట నురుగులు కక్కుచున్నది. అయినా వేగం తగ్గించ
లేదు. అలసట లేదు. మార్గము రాను రాను - ఆ గుర్రము కాళ్ళ వెనుకకు జారిపోయి, దగ్గరవుచున్నది.
వడ్డిపల్లె నుంచి మొగలిచెర్ల కూతవేటు దూరం. గుర్రమును ఇంక బాధ పెట్టదలచు కోలేదు. వడ్డిపల్లెలో పది గంటలయినది. సూర్యుడు అప్పటికే చురచుర లాడు
చున్నాడు. గ్రామాధిపతి వీరభద్ర ప్రభువును చూసి, ప్రజలతో వచ్చి నమస్కరించి విధేయతతో నిలబడియున్నాడు.
వీరభద్రప్రభువు కళ్ళు ఎర్ర గన్నేరులవలె వున్నవి. కంటికి కునుకెరుగడు. ఆత్మల పొరలలో, రుద్రమదేవికి ప్రమాదము జరగగలదని స్పందన మొదలైంది. కాలకృత్యములు తీర్చుకుని, స్నానమాచరించి, కాకతీదేవిని నిష్టగా అయిదు నిమిషములు ప్రార్థించినాడు. ప్రభువు ఆజ్ఞచేత గ్రామాధిపతి సుశిక్షితులైన వీరులనూ, ముఖ్యంగా విలువిద్యా ప్రవీణులను వెంటబెట్టుకుని బయలుదేరెను.
ఆనాటి ఆంధ్రవీరులు విలువిద్యలో శబ్దమును విని, చోటును గురిచూసి ఒక్కబాణముతో కొట్టగల ధీమంతులు. ఈ విద్యను శబ్ధభేది అంటారు.
ఇంతలో రథములోపల రుద్రమాంబిక కనుసైగను చూసి, అన్నమాంబిక విల్లును సిద్దము చేసి వుంచింది. రేచర్ల రుద్రసేనాని, ఎట్లా దెబ్బతీయాలా యని మధన పడుతున్నాడు.
సైన్యం ఏమి చేసైనా- ఆఖరుకు ప్రాణాలు ధారపోసి అయినా తమ చక్రవర్తికి ఏ ప్రమాదమూ జరక్కుండా చూడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వీరభద్రప్రభువు సైన్యంతో మొగలిచెర్ల చేరేసరికి, సాయంత్రం సూర్యుడు క్షీణిస్తున్నాడు. అప్పటికే రుద్రమదేవి ఓరుగల్లు వైపునకు బయలుదేరిందని తెలియవచ్చింది.
ప్రభువు - ఒక్కక్షణం ఆగి ఏకవీరాదేవికి నిష్టగా ప్రణామం చేసి, మళ్ళీ గాలివేగంతో ఓరుగల్లు వైపునకు బయలు దేరినాడు. గుర్రాలు వేగం అందుకున్నవి. వీరభద్ర ప్రభువునకు చిన్నసైన్యం వెడుతున్నట్టు కనిపించింది.
గుర్రాల గిట్టల చప్పుడువిని రుద్రమదేవి అన్నమాంబిక చెవిలో- ‘మన సైన్యం వస్తున్నది’ అన్నది . అన్నమాంబిక చిరునవ్వు నవ్వింది.
వెనకాల వస్తున్న సైన్యం పొడగట్టి - రుద్ర సేనాని ధైర్యం చేసి,
" కాకతీవీరులారా! కత్తులు పట్టుకోండి" అని అరిచినాడు.
వొరలలో చేరిన ఖడ్గములు పైకి లేచినవి.
ఈ హఠాత్పరిమాణము ఏమిటో హరిహర మురారిదేవులకు అర్థం కాలేదు.
రుద్రమదేవి లేచి నిలబడి--
" మీరు నాలుగు వేలుకాదు. నాలుగులక్షల సైన్యంతో వచ్చిననూ, చావునుంచి తప్పుకొనలేరు" అన్నది.
అన్నమాంబిక అపర సత్యభామ వలె లేచి, ధనస్సు నందుకుని, గురిచూసి మురారి దేవుని శిరస్సు ఖండించబోయినది. అప్రమత్తముగానున్న హరిహర దేవుడు అన్నమాంబిక ధనస్సును ఖండించినాడు.
ఇదే క్షణమున -
హరిహరదేవుని తల తాటిఎత్తున ఎగిరి దబ్బున భూమి మీద పడినది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి హరిహరదేవుని శిరస్సు, వీరభద్రప్రభువు సునిశిత బాణముతో ఖండించబడినదని తెలిసినది. వీరభద్రప్రభువు ఎత్తయిన కొండపైన నిలబడియున్నాడు.
మురారిదేవుడు - రుద్రమదేవిని సంహరించవలెనని వింటినారిని సంధించినాడు. రుద్రమదేవి క్రూరమైన శరాఘాతముతో మురారిదేవుని వక్షమును చేధించి
నది. అతను గుర్రముపైన కూలబడిపోయినాడు. మరొక్క బాణము అతని కంఠమున దిగబడినదిట. అతను చచ్చి, పడిపోయినాడు.
హరిహర మురారిదేవుల చరిత్ర, క్షణములో యింత హృదయవిదారకంగా ముగిసినది. దాయాదుల గొడవ అంతమయినది.
ఇది కను మూసి తెరిచేంతలో జరిగిన విషాద వృత్తాంతము. రుద్రమదేవికి కన్నీరు రెప్పలలో దాగినది. ఆమెకు సోదర ప్రేమ హృదయమున కదిలింది. వారు దుర్మార్గులై
నప్పటికీ- " చెల్లీ!" అని సంబోధించినారు.
రుద్రమప్రభువు సేనాపతి --
"కాకతీ సామ్రజ్యలక్ష్మీ.. నీకు జయము, జయము" అని జయజయధ్వనులు చేశాడు. సైనికులు కూడా విజయధ్వానాలు చేశారు.
హరిహర మురారి దేవుల సైన్యములు, రుద్రమదేవికి లోబడి వారివెంట బయలుదేరినవి. రుద్రమదేవి కడకు, గుర్రముపై వీరభద్రప్రభువు వచ్చి రథము ప్రక్కన నిలబడి -
"చక్రవర్తులకు అభివాదము, క్షేమమే కదా" అన్నాడు.
అంతటి వీరనారియు, స్నిగ్ధఅయి, సిగ్గుతో - చిరునవ్వు నవ్వినది.
వీరభద్రప్రభువు ముఖము ప్రఫుల్లమైనది.
రుద్ర ప్రభువు సేనాని- "ఇక కదులుడు" అని ఆజ్ఞ ఇచ్చినాడు.
శివదేవయ్యామాత్యులు ఆశ్చర్యచకితులైనారు.
వీరభద్రప్రభువు లేనిచో, ఈ కాకతీసామ్రాజ్య చక్రవర్తులు ఏమై పోయెడివారు? విధి ఎంత చిత్రము! చాళుక్య ప్రభువుల మనస్సులో రుద్రమదేవికి ఆపద కలగనున్నదని ఏల భీతివాటిల్లెను. ఇది విధి విధానము కాదా! కాకతీ తల్లి అపార కరుణ కాదా! ఏకవీర కృపాకటాక్షము కాదా!
ఓరుగల్లు నగరమంతయూ ఆనాడు వీరభద్ర ప్రభువు కబుర్లే. రుద్రమదేవి సాహసం, అన్నమాంబిక ధైర్యము గురించియే.
ఇంటింటా ఈ కథలే. గుంపులు గుంపులు గా కలిసి చెప్పుకున్నారు. క్షాత్రము భూషణమై వారి పెదవులపై అమిరి, చిరునవ్వుల సంకేతముతో బయటకు వెడలినది.
స్త్రీ కి పురుషుడు తోడు.
పురుషునకు స్త్రీ నీడ.
ఇది సర్వజీవకాల సత్యము.
ముమ్ముడాంబిక ముద్దులగుమ్మ వలె-
అన్నమాంబిక అన్నులమిన్నవలె- అవతరించినారు.
రుద్రమాంబ - స్నానమాచరించి, పలుచని వస్త్రములు కట్టి, నల్లని మేఘములవంటి వెంట్రుకలను భుజములపై జారవేసి, వుత్తమ పీఠమున జారబడి కూర్చున్నది.
ఇంతలో శివదేవయ్యామాత్యులు వచ్చారు.
వచ్చి-- "తల్లీ" అన్నారు.
ఆమె మామూలుగా కూర్చుని, "బాబయ్య గారూ " అన్నది.
"ఎంత ప్రమాదము తప్పిపోయినది"
"ఇది క్షాత్రవులకు తప్పనివి కదా బాబయ్యగారూ!"
"ఐనను, మనము అప్రమత్తులై వుండాలి. యికనుంచి మీరు వంటరిగా వెళ్ళకూడదు. ఇది మా ఆజ్ఞ. అభీష్టము.. "
"బాబయ్యగారూ, మీ మాట ఈ కుమార్తె ఎప్పుడు తప్పినది!"
"వచ్చెదనమ్మా. ఇంకనూ చాలా పనులున్నవి. ఈ పూట మీరు విశ్రాంతి తీసుకొనవలెను. "
ఆమె నవ్వి తల వూపినది.
------------------------------------------------
కాకతీయ శిల్పుల నైపుణ్యానికి సాక్ష్యాలు
------------------------------------------------
కీర్తితోరణం ---వేయి స్తంభాలఆలయం.
------------------------------------------------
భారతదేశం లోని తెలంగాణారాష్ట్రంలో వరంగల్ ( ఓరుగల్లు) మరియు హనుమకొండ జాతీయరహదారికి సమీపంలో నెలవై వుంది ప్రఖ్యాతిగాంచిన వేయిస్తంభాలఆలయం.
చరిత్ర: 12వ శతాబ్దం కాలంలో ఓరుగల్లును ఏలిన కాకతీయ రాజవంశీకుడైన రాజు రుద్రదేవునిచే నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. నాటి కాకతీయ శిల్పుకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయ శిల్పసంపద చారిత్రక ఆధారంగా నిలిచివుంది.
క్రీ. శ. 1163 లో నిర్మింబడిన ఈ ఆలయం, కాకతీయుల కాలంనాటి శిల్పుల శిల్పకళా వైభవం, శిల్పకళా నైపుణ్యము నకు దర్పణం పడుతోంది. ఆ తరువాత కాలంలో,
తుగ్లక్ వంశీయులు దక్షిణభారతం పై సాగించిన దండయాత్రల పరంపరలో వేయిస్తంభాల ఆలయం గూడా వారి దురాగతాలకు బలైంది. నేడు శిథిలరూపంలో నిలిచిన ఈ ఆలయము. కళారాధుల కళ్ళను చెమరింప జేయకమానదు.
నిర్మాణం: ఈ ఆలయం లో గల వెయ్యి స్తంభాలలో ఏ ఒక్కటి గూడా, ఆలయంలో కొలువై యున్న దేవతామూర్తుల దర్శనానికి ఆటంకంగా నిలవకపోవటం ఆనాటి శిల్పుల అపూర్వ నైపుణ్యానికి నిదర్శనం.
నక్షత్రాకారంలో నిర్మించబడ్డ ఈ ఆలయం అనేక శివలింగాలకు, మంటపాలకు నిలయమై వుంది. ఆలయం లోపల మూడు మందిరాలు గల త్రికూటాలయం వుంటుంది. ఈ మూడు మందిరాలు శివుడు, విష్ణువు మరియు సూర్యుడు యొక్క మూర్తులకు ఆలవాలమై వున్నాయి.
ఈ వేయిస్తంభాల ఆలయం చుట్టూ ఒక పెద్ద ఉద్యానవనం వుంది. ఈ తోటలో అనేకచిన్న శివ మందిరాలు కొలువైయున్నాయి. ఆలయంలో నిలిచివున్న స్తంభాలన్నీ విశేష శిల్ప చెక్కడంపనితో, అందంగా కనిపిస్తాయి.
ఈ ఆలయంలోని నల్లరాతితో చెక్కబడ్డ నందివిగ్రహం తళతళలాడుతూ ఎంతో కళగా కనిపిస్తుంది. ఆలయం మొత్తం, ఒకమీటరు ఎత్తుగల దిమ్మె పై నిర్మించ బడినది. రాతితో మలచిన ఏనుగులు, జల్లెడ వంటి రాతి తెరలు, ఆనాటి రాజవంశ కళలకు ప్రతిబింబాలై కనిపిస్తాయి.
2004 లో భారతప్రభుత్వం పర్యాటకుల సందర్శనార్థం, ఈ ఆలయాన్ని పునరుద్దరించింది.
-------------------------------------------------------------------------
యాదవమహారాజు తనసైన్యంతో దగ్గరలోనే వున్న ప్రతిష్టానపురం దాటలేకపోతున్నాడు. గోనగన్నారెడ్డి, మహాదేవరాజు ఆరులక్షలసైన్యాన్ని అడుగు కదలనీయడు.
అంతగా శత్రువు ఒత్తిడి ఎక్కువైతే పదిఅడుగులు వెనక్కు వేస్తాడు. ఇరువైపులవారికి గౌతమీ కాపుకాస్తున్నది. అన్నీ- కొండలు, గుట్టలు, అరణ్యాలు.
ప్రతీ గుట్టా, కొండా, ప్రతీసెలయేరూ, ప్రతీ అడవి గన్నారెడ్డికి కాపుదలగా నున్నవి. సునాయసముగా సాగిపోవలసిన సైన్యం అడుగడుక్కు విఘ్నం. మహాదేవరాజుకు కోపం మిన్ను ముట్టుతూ వుంది. తానిలా జైత్రయాత్ర సాగిస్తే ఎన్నాళ్ళకు ఓరుగల్లు పోవటం?
యుద్దవ్యూహాధ్యక్షుడు, సేనను ముందుకు దూసుకుయేంత మగటిమి కలవాడు. ఎదిరించే శత్రువు మనస్సు తెలిసికొని యుద్దం నడిపే భయంకర ప్రతిభాశాలి. కాని అతని ప్రతిచర్యకు అడ్డుపడుతూ అతనిని మించిన గండరగండడు.
కొండలమీదనుంచి రాళ్ళు దొర్లుకుంటూ వచ్చి లోయలో పోయే సైన్యాలను నాశనం చేస్తున్నాయి. ఎంత నెమ్మదిగా నడుచుచున్న అశ్వికసైన్యాలు పైకి సాధారణ భూమి
వలె కనబడే సమతలముపై నడుచుచుండగా, చటుక్కున గోతిలో పడిపోవుచుండును. సెలయేరులో నీరు త్రాగినవారు మత్తుచే పడిపోవుచుండిరి. నిర్జనంగా కనబడే చిట్టడవిని సమీపించే సైన్యాలమీద అఖండ బాణవర్షం కురుసి వేలకొలది సైనికులు విగతజీవులై పడిపోవుచుండిరి.
గ్రామాలలో జనసంచారము లేదు. పంటలు లేవు. పశువులు లేవు. గ్రామాలు మొండిగోడలతో, చెట్లన్నీ ఆకులు, పళ్ళూ, కాయలు లేకుండా వున్నాయి. ఈ విచిత్ర వ్యూహాలు మహాదేవుడికి అంతుపట్టలేదు.
ప్రళయకాల రుద్రుడై గన్నారెడ్డిని నలిపి వేయాలనుకున్నాడు. ఖడ్గముతో ముక్కలు ముక్కలు వేయాలనుకున్నాడు. దేవగిరికి నలభై మైళ్ళ దూరములో గల మంజుల అనే గ్రామములో విడిది చేశాడు. అప్పటికే అతని సేనలో గన్నారెడ్డి సైన్యాలవలన డెబ్బై వేల సైనికులు నిహతులైనారు. ఆరు నెలలకు తెచ్చుకున్న ఆహారములో రెండు నెలల పదార్థాలు దోచుకుపోయారు.
ఆహారపదార్థాలు సైన్యం మధ్య వుండే ఏర్పాటు చేసి, ఈ మహాసైన్యం చుట్టూ ఆశ్వికసైన్యాలు, విలుకాండ్ర దళాలు, సర్వకాలమూ యుద్ధసన్నద్ధు లై వుండేటట్లు
ఏర్పాటు గావించెను. అనేక గూడచారి దళాలను విరోధిసైన్యాల రాక తెలియజేయు ఏర్పాటు గావించెను.
మహాదేవరాజు, ఆ రాత్రి ఆలోచనాశిబిరంలో మంత్రులూ, సేనాధిపతులు చేరినారు. మహారాజు సింహాసనం పై అధివసించెను.
ముఖ్యసేనాపతి: ( మహాదేవునని దాయాది) మహారాజా: మన ఎనిమిది లక్షల సైన్యాలలో రెండులక్షల సైన్యాన్ని గన్నయ్యను తరమడానికి పంపాను. ఆ సైన్యం మంజీరానది తీరాలకు నైరుతిగా అతని సైన్యాలను తరుముతూనే వుంది.
ఇంతట్లో ఎక్కడ నుండి వచ్చాడో " గోనగన్నారెడ్డి" మన సైన్యాలని, సేనాపతులనూ చికాకు పెడుతున్నాడు.
మహాదేవరాజు: వీడు బ్రహ్మరాక్షసా? పిశాచా?
భవానీభట్టు(మహామంత్రి): మహాప్రభో! ఈ గోనగన్నారెడ్డికి గజదొంగ అని పేరు పడింది. అంతా మాయ. వీడు రుద్రమదేవికి సహాయంగాఏర్పడిన దొంగ సైన్యాలకు నాయకుడు.
సింగదేవుడు: లేకపోతే సాధారణ గజదొంగతనం ఒక్కటీ చేయకుండా, రుద్రమ్మ పై తిరగబడిన సామంతులనెల్లా పట్టి హతమారుస్తాడా?
భవానీభట్టు: వీడు మన జైత్రయాత్రకు అడ్డం అని కాదు. కాని నేను పెట్టిన ముహూర్తానికి ఓరుగల్లు కోట ముట్టడించ లేకపోయాము.
జైతుగి( అశ్విక సైన్యాద్యక్షుడు): రేపు మనం మంజీర ఎలా దాటడం?
సింగదేవుడు: నిర్మల నుండి మల్యాల చౌడయ్య సైన్యాలతో అడ్డుపడేట్టున్నాడు.
మహాదేవరాజు: సింగదేవప్రభూ! మన రెండు లక్షలసైన్యాన్ని వెనక్కు రమ్మనండి. ఆ సైన్యం ఏబైవేలదాకా నావల మీద మంజీర - గోదావరి సంగమం దగ్గర కాకుండా దక్షిణంగా గిరికోట దగ్గర దాట ఆజ్ఞ ఇవ్వండి. ఆ దాటింప వలసిన బాధ్యత జైతుగీ దేవ ప్రభువుది.
భవానీభట్టు: ఆ సైన్యన్ని దాటనీయకుండా గన్నారెడ్డి ఒకప్రక్కనుంచీ, మల్యాల చౌడయ్య ఒకప్రక్కనుంచీ తాకవచ్చును కదా!
మహాదేవరాజు: అవన్నీ ఆలోచించాను భట్టోజీ! దాటే సైన్యాన్ని మేము మొదట తెలియజేసినట్లు కోటల విధానంతో తాత్కాలికపు కోటలు ఏర్పాటు చేసుకుని శత్రువు వెనుకనుంచీ మీదబడకుండా చూచుకొనండి.
భవానీభట్టు: చిత్తం, మహారాజా!
మహా: తక్కిన ఏభైవేల నావలలో మేము సంగమానికి ఎగువ బోధనగిరి కడ దాటగలము.
సింగదేవుడు: ఈ లోగా మన దేశంనుడీ ఆహారపదార్థాలను తీసుకుని వచ్చేటందుకు వెళ్ళిన రెండులక్షల సైన్యం వచ్చి కలుసుకుంటుంది.
మహాదేవరాజు: మంజీర దాటగనే మన సైన్యాలను ఆరు సైన్యాలుగా విభజిస్తాను. ఒక్కొక్క సైన్యం అయిదారు మైళ్ళ దూరంలో యాత్ర సాగించాలి. శత్రువు ఎదురుపడితే లెక్కచేయక ముందుకు సాగిపోయి శత్రువును చుట్టుముట్టి నాశనం చేయాలి.
శంకరదేవ(గజాద్యక్షుడు): శత్రువుల సైన్యాలు తక్కువగా ఉన్నాయి అని కదా మనకు వేగు వచ్చినది. ఆంధ్రసామంతులు కొందరైనా మనవైపుకు చేరకపోయినా ఆ రుద్రమ్మకు సాయమ వెళ్ళరు. అంతవరకూ లాభం మహారాజా.
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
コメント