కాకతి రుద్రమ ఎపిసోడ్ 22
- Ayyala Somayajula Subramanyam
- Nov 25, 2022
- 7 min read
Updated: Dec 2, 2022
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Kakathi Rudrama Episode 22' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 22 వ భాగం
గత ఎపిసోడ్ లో
అన్నమాంబిక ధనస్సు నందుకుని, మురారి దేవుని శిరస్సు ఖండించబోయినది.
హరిహర దేవుడు, అన్నమాంబిక ధనస్సును ఖండించాడు.
అక్కడికి చేరుకున్న వీరభద్రుడు దూరంనుండే ఒక బాణంతో హరిహరదేవుని శిరస్సు ఖండించాడు.
రుద్రమ దేవి, తన బాణంతో మురారి దేవుని సంహరించింది.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 చదవండి..
మంజీర నదిని దాటడం బ్రహ్మప్రళయమే అయినది. మంజీర నదిని దాటి, కాకతీయుల నెగ్గినంత సంబరపడినారు. మహాదేవరాజునకు వచ్చేది వానాకాలమని తెలియును. అందుకు తగిన సన్నాహాలతో యుద్దయాత్ర ప్రారంభించినాడు. కోట్లకొలది చాపలను, వెదురు ఊచలను కూడా పట్టించుకొని వచ్చినాడు. దానితో లక్షలకొలది నివేశాలు నిర్మించడం, వానలు వెలిసిన వెనుక ముందుకు సాగడం, ఈ రీతిగా అంచెలుగా యుద్దయాత్ర సాగుచున్నది.
గోనగన్నారెడ్డి బలాలు, చౌండుని బలాలు యాదవుని సేనావాహిని ముప్పుతిప్పలు పెడుతూ నాశనం చేయసాగినవి. ఎప్పుడు ఓరుగల్లు జేరుదామా, ఎప్పుడు మహానగరం చుట్టూవున్న పాళెములన్నీ ఆక్రమించుకొని, తాను నిశ్చయించుకున్న వ్యూహం ప్రకారం ముట్టడి సాగించడమా అని తహతహ జనించినది మహాదేవరాజునకు!
నెల ముట్టడి సాగేసరికి ఆంధ్రులు కాళ్ళ బేరానికి వస్తారు. ఆడదాని రాజ్యం అంటే అసహ్యము కొలది తనతో కలిసి పోదురు. ఈ లాంటి ఆశతో ఏ మాత్రమూ పట్టుదల సడలకుండా మహాదేవరాజు ప్రయాణం చేస్తున్నాడు మహావాహినితో.
గన్నారెడ్డి యుద్దతంత్రాలు అర్థం చేసుకుని మహాదేవరాజు, కొన్ని ఎత్తుగడలు, రక్షణలు సృష్టించాడు. రాళ్ళచక్రాలున్న కొండల్లాంటి బళ్ళు కట్టించాడు. ఆ బళ్ళపైన చిన్న చిన్న కర్రకోటలు, ఎనమండుగురు, పదిమంది పట్టేవి కట్టించాడు. ఆ రథాలను ఎనిమిది జతల ఎద్దులు లాగుతుంటాయి.
బండిమీద చిన్న కర్రకోట గోడలతో ఉన్న వీరులు బాణాలు వేయడానికి పెద్దరంద్రాలు చేయించాడు. వీరిని సేనల చూట్టూ మహాదేవరాజు ఉంచినాడు. విరోధి కనబడగనే శత్రువును చూచి కోటలబండ్లు ఆపుచేయించి వారిని కోటగోడలా చేశాడు. ఈ ఏర్పాటు గన్నారెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు. యుద్దచమత్కృతి అంతా ఎత్తుకు పై ఎత్తు వేయుటలోనే ఉంది.
-----------------------------------
గన్నయ్య యుద్ద విధానము: మహాదేవరాజు బళ్ళకోట ద్వంసం చేయాలి. నూనెతో తడిసిన గుడ్డలు, ఎండిన చితుకులు నింపి, కాడులు లేని బళ్ళు ఇరవై వేలయినా సిద్ధం చేయించి విరోధి వచ్చే దారిలో నేలపైకి ఆ బండ్లు నలుమూలలా నుంచీ దొర్లుతూ వచ్చే ప్రదేశాలలో సిద్దం చేసి ఉంచాలి. దారులలో రాళ్ళూ రప్పలూ లేకుండా ఉండాలి.
ఈ బళ్ళు సిద్దంగా వుంచిన లోయలకు కొద్ది దూరములో మన ఆశ్విక సైన్యాలు కొన్ని, విరోధులతో తలపడి ఘోరయుద్దం చేస్తు వెనకడుగులు వేస్తూ, వేగంగా బళ్ళ వెనక్కు మాయంకావాలి. బళ్ళకు మంచి బరువు కట్టాలి. మన ఆశ్విక సైన్యాలను తరుముకు వచ్చేవారి సైన్యాలమీద ఈ బళ్ళు దూకుతాయి. అన్నిబలాలు దూకుతాయి.
ఈ బళ్ళు అన్నివేపుల నుంచీ పడాలి. ఆ శకటాగ్ని ప్రయోగం వల్ల మహాదేవుని సైన్యాలు ఏబదివేల వరకూ నాశనం అయిపోయాయి. అతడు కాలాగ్నిరుద్రుడై ఆంధ్రులను కాలిక్రింద పురుగులుగా రాచివేద్దామన్నంత కోపం వచ్చింది. అయినా ఏమి చేయగలడు?
ఇన్ని లక్షల సైన్యంతో బయలుదేరి కూడా పరాభవం పొందుతూనే ఉన్నాడు. అయినా పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆంధ్రులతో యుద్దం నల్లేరుమీద బండి వలె యని ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే ఏడెనిమిది వర్షాలు నిరంతర కృషిచేసి ఎనిమది లక్షల
సైన్యం, ఇరువది కోట్లధనము ప్రోగుచేసినాడు.
తనతండ్రి కృష్ణభూపతి దేవగిరి యాదవులకు తలవంపులు తెచ్చినాడు. గణపతిదేవునకు భయపడి స్నేహమని తన రాజ్యం ఎల్లాగో దక్కించుకున్నాడు. తాను వంశ ప్రతిభ అప్రతిమానకాంతితో వెలగింప జేయలేనినాడు, తన జన్మకు అర్థమేమి? ఇంత కంటె మంచి అదను తనకెలా దెరుకుతుంది? ఆడది రాజ్యం చేయుటయా యని సామంతులు తిరగబడుచున్నారు.
ఆంధ్రరాజ్యం చాలా భాగం కబళించవచ్చు. తనకు అణకువ అయినవాడిని ఒక్కని ఓరుగల్లు సింహాసనమెక్కించి తాను నాటకం ఆడించవచ్చు. ఇంతకన్న యుద్ధవిజయ సమయం తనకు కుదరదన్నమాట నిశ్చయం నిశ్చయం.
అగ్నిశకట ప్రయోగానంతరము సైన్యము సడలకుండా కూడదీసుకుని నూతనంగా సూచీవ్యూహాలు మూడు రచించి, తన వాహినులన్నీ ముందుకు నడిపించసాగాడు.
సేనలను తరిమి తరిమి నడుపుచున్నాడు. ఎలాంటి అడ్డం వచ్చినా, దారిలోంచి తుడిచెయ్యమన్నాడు. అత్యంత వేగంగా జైత్రయాత్ర సాగించే సేనలదారిలో పెద్ద అవరోధాలైనా అడ్డగించలేవన్నాడు.
ఆ నాటినుంచి మహాదేవుని సైన్యాన్ని అడ్డగించడానికి భయపడ్డాయి గన్నయ్య సైన్యాలు. వేగవంతమైన నదికి ఆనకట్ట ఎవరు కట్టగలరు.
మళ్ళీ వెనుకనుండి యుద్దం మొదలెట్టాడు గన్నారెడ్డి. అంతటితో ఊరుకోక శత్రువు రెండురోజులలో వస్తారనగా మార్గమధ్యమునకు దగ్గరలో అగ్నికోట ఒకటి కట్టించెను.
గంధకపు ధాతువులతో అగ్నిస్తంభాలు సిద్దం చేయించి, అది అక్కడక్కడ మూడు మైళ్ళడువునా, అరమైలు మందమున పాతివేయించాడు.
మూడవనాడు విరోధుల బలాలు చేరువకు రాగానే, ఆ అగ్ని స్తంభాలు అంటించినారు. పొగలు, మంటలు ఆకాశాన్నంటాయి. అగ్నికుడ్యాలు, భరింపరాని వాసనల
పొగలు చూచి, అతివేగంగా వచ్చే మహాదేవుని సేనలు ఆగిపోయినవి. మహాదేవరాజు తమ భద్రగజంపై అధివసించి, ఆ దృశ్యం చూసి విరోధిని శ్లాఘిస్తూ సేనలను అగ్నిచక్రవ్యూహం రచించి నెమ్మదిగా వెనుకకు జరిపించినాడు.
ఆ దినమంతా మహాయుద్దరం జరుగినది. సాయంకాలానికి అగ్నులు చల్లారెను. వెంటనే రాత్రయినా సరే సైన్యం ముందుకు సాగిపోండని మహాదేవుడు ఆజ్ఞ. సేనలలో ఏబదివేలు విగతజీవులైనారు.
ఆ వేగం వేగంతో మహాదేవుడు నాలుగుదినాలలో వచ్చి ఓరుగల్లును ముట్టడించాడు. ఓరుగల్లు చుట్టూ ఒక ఇల్లుగానీ, గ్రామముగానీ లేదు.. మురికిగోతులు, మండే ఊళ్ళూ ఉన్నవి. అనుమకొండ మట్టివాడయి, పూర్తిగా కుడ్యరక్షితమై శత్రువుల రాకకు సిద్దంగా నున్నవి. ------
---------------------------------------------
చక్రవర్తిణి శ్రీరుద్రదేవి ఆజ్ఞ. రైతుబిడ్డలు ఎవరూ కత్తులు తీయరాదు. పూర్వకాలం నుంచీ
ఉన్న ఇరుమొనలఖడ్గాలు, ఖడ్గమృగచర్మపు డాళ్ళు, భళ్ళాలు తీయవలసిందే. కానీ
అలా ఎవ్వరూ యుద్ధ సన్నద్దులు కావద్దని చక్రవర్తిణి ఆజ్ఞ. యావత్ ఆంధ్రదేశము ఆంధ్రచక్రవర్తిణి అయిన శ్రీరుద్రదేవిపై కత్తి కట్టువచ్చిన మహాదేవుని ఖండఖండాలుగా చేయ ఉగ్రులైపోయారు. చక్రవర్తిణి ఆజ్ఞతో ఆగిపోయారు.
గ్రామాలలోకి ఎప్పుడూ యుద్దంరాదు. అది నాగరిక లక్షణం. పూర్వయుగాలనుంచీ ఎప్పుడూ యుద్దానికి, భారతీయ గ్రామానికీ సంబంధం లేదు. యుద్దస్థలం ఇరువర్గాలు నిర్ణయించుకుని యుద్దం చేయుదురు. కోటలచే రక్షింపబడే గ్రామాలను మాత్రం ముట్టడింతురు.
రుద్రమదేవి మహాదేవుని గోదావరీతీరం కడ ఎదురుకుందామని చూసింది. కానీ మహాదేవుడు ప్రతిష్టానపురం కడనే గోదావరి దాటడం చేత ప్రయత్నము మానుకొన్నది. మహాదేవుడు అఖండ సేనావాహినితో వస్తున్నాడు. దారిలో ఎదుర్కనుట ఓటమిని ఎదుర్కొనుటే అని శివదేవయ్య మంత్రి ప్రయత్నము మాన్పినాడు.
గోనగన్నారెడ్డి తనవంతుగా మహాదేవునికి చేయవలసిన నాశనము చేస్తూనే ఉన్నాడు. ఆహార పదార్థాలు కూడా అందకుండా, అందుబాటులో ఉన్నవాటిని తస్కరించుట మొదలగునవి.
ముట్టడి ప్రారంభమైంది. కంపకోటనుండి నిశితబాణవర్షము ఎదుర్కొన్నది. మహాదేవరాజు ఆ మహానగరపు కోటగోడలను నిశితముగా చూస్తూ చుట్టి చూచివచ్చెను. కంపకోట చుట్టూ ఉన్న కందకము చిన్న నదివలె ఉన్నది.
కంపకోటకు చుట్టూ చిన్నచిన్న బురుజు లున్నాయి. కంపకోటకు అరమైలు దూరాన మహాదేవుని సైన్యాలు ఆగినాయి. వెదురు, పేము, ముళ్ళకంపలు, పేడతో, గంధకంతో ఆ కోటగోడ నిర్మితమైంది.
వీరులు కంపకోట పైనుండి యుద్దం చేయరు. కంపకోట వెనుక తట్టున ఉన్న బురుజులమీదనుండి మేటి విలుకాండ్రు శత్రువును చీకాకు పరుస్తారు. ఆ బురుజులు కంపతోనే నిర్మిస్తారు.
శత్రువులకు కంపకోటలంటేనే భయం. కంపకోట గోడలవెనుక నుండి బురుజుల మీదనుండీ శత్రువులను బాణాలచేతా, శిలాప్రయోగాల చేతా, అగ్నివర్షంచేతా చీకాకు పరుస్తూ వుంటారు. ఒకవేళ కంపకోట పట్టుబడుతుందని భయం కలిగితే ఆ కోట
ను కాల్చి తమ నగరంలోకి చేరుకుంటారు.
మహాదేవరాజు కంపకోట చుట్టూ అర్దమైలు దూరంలో ఇరువది చిన్నకోటల నిర్మాణానికి తలపెట్టి, పని ప్రారంభించెను. ఆ ఇరువది కోటలను కలుపుతూ ఒక చిన్నగోడ నిర్మాణం చేయించసాగాడు. ఆ గోడకు ముందు పెద్దగొయ్యి, ద్వారాలకు ముందు మాత్రం దారులు.
కోట ముట్టడి యంత్రాలు, దూలాలు, గొలుసులు మొదలయినవి బళ్ళమీద వచ్చినవి తీసి వానిని కూరుస్తున్నారు. వెదురుతో, పేముతో అల్లిన పెద్ద దడులను ఉప్పునీళ్ళలో ఊరవేసిన తోళ్ళు బిగిస్తున్నారు. ఆ దడులే యుద్దం సాగిన వెనుక కోటగోడల దగ్గరకు వెళ్ళేవారిని అగ్నిబాణాలనుండి రాళ్ళవర్షము నుండి రక్షిస్తాయి.
ఆ దడులను నిలబెట్టేందుకు సన్నదూలాలు సిద్దమైనవి. ఏనుగులకు కవచాదులు సిద్దమవు చుండెను. ఏనుగులమీద కోట అంబారీలు సమకూరుస్తున్నారు. గుర్రపు దళాలను రక్షించే పొడుగుడాళ్ళు బళ్ళలోంచి దింపుతున్నారు.
యుద్దవీరులు, యుద్దనాయకులు, దళపతులు, అశ్వపతులు, ముఖపతులు నివసించే శిబిరాలు సిద్దమౌచున్నవి. నగరపు కోట చుట్టుకొలత పదిహేను కిలోమీటర్లున్నది. ఆ కొలత చుట్టూ అరమైలు నుండీ ఒక మైలు మందముగా మహాదేవరాజు సైన్యము విడిసినది.
సేనలకు సరిపోవు ఆహార సామగ్రులుంచడానికి దండు మధ్య అక్కడక్కడ కోట గృహాలు నిర్మించారు. వానికి ఇరువది అంగల దూరములో అయిదువేల పచనగృహాలు నిర్మించారు. పచనగృహాలకు నూరు అంగల దూరములో వైద్యాలయములు ఉన్నాయి.
అశ్వికశాలలు, గజశాలలు, వైద్యాలయాలకు నూరుఅంగల దూరములో నున్నవి. ఆ పైన సేవకుల పాకలు, పందిళ్ళు, ఆ పైన స్కందావార రక్షణపు కంపకోటలు.
నాశనమైనంత నాశనము కాగా, మహాదేవరాజు సేనలో అయిదు లక్షలవీరులున్నారు. దేవగిరినుండి బయలుదేరిన వారు ఎనిమిది లక్షలు. సేవకులు,వర్తకులు, బండ్లుతోలువారు, దాసీలు, వైద్యులు, చాకలివారు, క్షురకులు, వంటచేయువారు.. మొదలైనవారు మూడు లక్షలున్నారు. ఈ మహాజనమునంతటినీ చూచుకొని తాను వేసిన పథకమురీతిగా అన్నియు జరగడము చూచి మహాదేవరాజు జయము తనదేనని ఉప్పొంగిపోయినాడు.
తన స్కందావారమంతా కలయతిరుగుతూ అన్ని విషయములు స్వయముగా మహారాజే కనుగొనుటచే వీరులకు, సేనాధిపులకు, సేవకులకు నిర్వచించలేని సంతోషంకలిగింది.
మహాదేవరాజు వచ్చి మూడుదినాలయింది. ఇంతవరకూ ఓరుగల్లులో అలికిడి లేదు. స్కందావారం బయటా అలికిడి లేదు.
--------------------------------------------------
శివదేవయ్య మంత్రిరథమెక్కి నగరరక్షణపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళాడు. ఆయన భటులు, శిష్యులు, పండితులు, సేనాధిపతులు వెంటరాగా సరాసరి తూర్పుద్వారం దగ్గరకు వెళ్ళెను. అక్కడే పరాశక్తి అవతారమై పురుషవేషంతో, కవచాదులతో ఉత్తమాశ్వం ఎక్కి అంగరక్షకులు, ముఖ్యసేనాధిపులు సచివులు కొలువ రుద్రదేవి దర్శనమైనది.
అందరు తమతమ వాహనాలు దిగి గురుదేవులకు
నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొందారు. శ్రీ చక్రవర్తితో తంత్రపాలుడు ప్రోలరౌతు ఉన్నాడు. ప్రోలరౌతు కుమారులు ఎక్కినాయుడు, రుధ్రినాయుడు, పినరుద్రనాయుడు పోలినాయుడు అనే నలుగురూ అంగరక్షకులుగా ఉన్నారు. మారంరాజు, ప్రోలంరాజు
దారపనాయుడు, మారిననాయుడు కవచరక్షకులుగా నుండిరి.
మొదటి కోటయైన కంపకోటను రక్షింప ప్రసాదిత్య నాయుడు తనవంతుగాను, రెండవకోట మట్టికోటను రక్షింప వీరభద్రుడు తన పైననూ వేసుకున్నారు. మూడవ రాతికోటను రక్షింప జాయపసేనానీ నియమించబడెను. లోని నగరుకోట రక్షింప చాళుక్య మహాదేవుడు నియమించబడెను.
ప్రసాదిత్యుని కుమారుడు రుద్రసేనాని నగరపాలకుడుగా, తూర్పద్వారాల రక్షకుడుగా ఏర్పాటయ్యెను. నాగభూపతి పడమటి ద్వార రక్షకులుగా పైకిపోయే సేనలకధిపతిగా నియమితుడైనాడు.
పడికము బాప్పదేవుడు ఉత్తరపు ద్వారము, దక్షిణద్వారమునకు బెండపూడి ప్రేలయమంత్రి నియమితులైనారు.
భూమికోటకు ఎనిమిది గవనులు, ఒక్కొక్కదిక్కునకు రెండురెండు గవనులున్నాయి. పదునెనిమిది దిడ్లు - మూలకు మూడు, దిక్కుకు ఒకటి, తూర్పునకు మాత్రం మూడు చొప్పున - ఏర్పాటు చేయించినది రుద్రమదేవి.
కంపకోటకు గవనులు నాలుగు, దిడ్లు ఎనిమిది ఉన్నవి. రాతికోటకు గవనులు నాలుగు, దిడ్లు ఎనిమిది చేర్చినదామె. రాతికోట లోతట్టున సోపానాలు పెట్టించినది. రాతికోట బురుజుల పైన వీరవరులు కాపున్నారు.
కంపకోట, మట్టికోట, రాతికోట, భూమికోట, ఇటుకకోటల ద్వారాలన్నీ చక్రవర్తిణియూ, శివదేవయ్య, చాళుక్యవీరభద్రుడు, అంగరక్షకులు చుట్టుముట్టీ మట్టికోటకు పోయి, గోడఎక్కి విరోధుల పటాటోపాలన్నీ చూస్తూ సాయంకాలానికి తిరిగి నగరు చేరుకున్నారు.
రుద్రదేవి, శివదేవయ్య పాదాలకి సాగిలపడి నమస్కరించి ఆశీర్వచనం పొంది నగరులోనికి పోయినది. అన్నమాంబిక కూడా రుద్రమదేవి సలహా మీద పురుషవేషం వేసుకుని బయటకు వెళ్ళిపోయెను.
ముమ్ముడాంబిక కూడా పురుషవేషం వేసికొని చక్రవర్తికి కుడిచేయిగా ఉండటానికి ఉబలాట పడుచున్నది. అందుకు చక్రవర్తి ఆజ్ఞ ఈయలేదు. ఆ కారణం వల్ల ముమ్మడమ్మకు ఎంతో కోపంగా ఉన్నది.
రుద్రదేవి లోపలికెళ్ళి కవచాదులు, వస్త్రాదులు విడిచి, స్త్రీ వస్త్రాదులు ధరించి, పూజ ముగించి " ఈ యుద్ద పర్యవసానం ఏమవుతుందా" అని ఆలోచనాధీనయై భోజనం చేస్తున్నది. ఆమె ప్రక్కనే భోజనం చేసే ముమ్మడాంబిక మూతిముడుచుకుని భోజనం ఏలాగో చేస్తున్న విషయం కొంత సేపటికి కాని రుద్రదేవి గ్రహించలేకపోయింది.
రుద్ర: చెల్లీ। ఏమిటా భోజనం!
ముమ్మ; నా చక్రవర్తి నన్ను ఆజ్ఞాపిస్తే నేను ఎక్కువగా తినవచ్చును. కానీ అది నాలో ఇమడగలదని అనుకోను.
రుద్ర; అంత కోపం వస్తే ఏమి చెప్పను? నేను మగవీరునిలా తిరిగి తెచ్చుకున్న అపకీర్తి చాలదూ?
ముమ్మ; నన్నంటే అనండీ. మిమ్మలనుకుని అబద్దమాడకండి.
రుద్ర; సరే, నీకు అంతకోపం వస్తే నాతో రావచ్చును. కోటలు దాటివెళ్ళి యుద్దం చేయవలసి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు........
ముమ్మ; అన్నాంబికను ఎట్లా పంపించారు?
రుద్ర; అన్నాంబిక విషయమూ, నీ విషయమూ ఒకటేనా చెప్పు? అన్నాంబ గన్నారెడ్డిని ప్రేమించినది. ఆమెకు ఏది అడ్డమైనా లెక్కచేయదు.
ముమ్మ; నేను మిమ్మల్ని ఒకనాడు సర్వసృష్టికన్నా ఎక్కువగా ప్రేమించాను. మీరు ఆడువారు కావడం నాదా తప్పు?
రుద్ర; సరే; సరే; నా కన్న తక్కువగా ప్రేమించే వ్యక్తి ఇక ఎవరు?
ముమ్మ; అప్పుడు మీతో ఉండాలనే కోరను గదా!
రుద్ర; అయితే త్వరలో అలాంటి పెద్దమనిషిని వెదకాలి.
ముమ్మ; వెదికేవరకూ మీతోనే ఉండనియ్యండి!
రుద్ర; ఏమి తంటా తెచ్చిపెట్టావు?
ముమ్మ; నేను తంటా తెచ్చిపెట్టేదాన్నయితే నన్ను ఎందుకు పెళ్ళి చేసుకొన్నారు మగవేషంతో?
రుద్ర; నీ బాధ్యత నా ఒక్కరిదే కాదు చెల్లీ!
ముమ్మ; దేశంలో అందరి మనుష్యులదీ మీ బాధ్యతకాదా? అయినా మీరు ఎందుకు యుద్దంలో నాయకత్వం వహిస్తున్నారు?
రుద్ర; రాజు అలా వహిస్తుండాలి.
ముమ్మ; రాణులు మాత్రం బాధ్యత వహించనక్కరలేదు కాబోలు!!
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
תגובות