కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Kakathi Rudrama Episode 6' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
సుకుమారమైన స్త్రీత్వాన్ని కోల్పోతున్నందుకు బాధ పడుతుంది రుద్రమ దేవి.
ఆమెను పురుషుడిగా పెంచడానికి దారితీసిన కారణాలు ఆమెకు వివరించమని గణపతి రుద్రదేవుడు, శివదేవయ్యను కోరుతాడు.
ఇక చదవండి...
గణపతి రుద్రదేవుడు, స్వయంభూదేవుని నిమేషం ప్రార్థించి ఒక నిశ్చయానికి వచ్చెను.
వెంటనే మహారాణీ అంతఃపురం లో చక్రవర్తిని కలుసుకోవలసిందిగా శివదేవయ్య
దేశికులకు వార్త వెళ్ళినది.
నలభై విఘడియలలో శివదేవయ్యమంత్రి, మహారాణి నగరానికి విచ్చేసి లోపలికి వార్త పంపగా మహారాణీ అభ్యంతర సభామందిరములో చిన్నదానిలోనికి మహామంత్రిని తీసుకొనిరా మహారాణీ చెలికత్తె లను పంపినది. వారు దారి చూపుచుండగా శివదేవయ్య లోనికి దయచేసినారు. ఆయన పాదాలకు చక్రవర్తియు, సామ్రాజ్ఞియు, రుద్రదేవియు నమస్కరించి ఉచితాసనంపై కూరుచుండ ప్రార్థించిరి.
శివదేవయ్య వారందరినీ ఆశీర్వదించి ఉపవిష్టు లైరి.
శివ: మహాప్రభూ! ఎందుకు ఇంత తొందరగా నాకు వార్త పంపినారు?యువరాజుగారు తొందరలో నగరానికి రాగానే నేనున్ను వెంటనే మా గృహానికి వేంచేశాను. ఇంతలో మీ వార్త వచ్చినది.
గణ: మహామాత్యా! రుద్రప్రభువు తాను బాలికయై యుండగా ఏల పురుషునిగా తన్ను పెంచినారు అని అడుగుతున్నారు.
శివ: అలానా! రుద్రప్రభువులు చాళుక్య మహావంశ చరిత్ర ఎరుగుదురా అని మనవి చేసుకుంటున్నాను.
రుద్ర: ఎరుగుదును బాబయ్యగారూ !
శివ: ఆ వంశం లో ఇద్దరు ముగ్గురు కుమారులు చక్రవర్తులకు కలుగుతూ ఉండడం, వారిలో వారు అన్నదమ్ములు రాజ్యానికై పోరుతూ దేశానికి అరిష్టం తీసుకువస్తూ ఉండడము జరిగినదాయెను. ఆ జ్ఞాతి యుద్దాల వల్ల సుభిక్షమైన ఈ నాడులన్నీ కాటకాలకు లోనవుతూ ఉండేవి.
రుద్ర: మహామంత్రీ! చాళుక్యమహారాజుల చరిత్రకు నన్ను పురుషునిగా పెంచడానికి సంబంధం ఏమిటి?
శివ: ప్రభూ; వినండి. రాజులేని రాజ్యం తలలేని దేహం వంటిది. ఒక రాజ్యానికై ఇద్దరు రాజులు పోటీపడటం రాజు లేకపోవడమే కదా!
రుద్ర: మీరు నాకీ రాజనీతి చిన్నతనంలోనే భోదించినారు.
శివ: అలాంటప్పుడు నేను వచ్చి, మళ్ళీ పాఠాలన్నీ జ్ఞాపకం చెయ్యాలా కాకతీయ ప్రభూ!
రుద్ర: మా నాయనగారికి మగపిల్లలు లేకపోవడం వల్ల నేను బాలిక నైనప్పటికి నన్ను బాలునిగా పెంచారు.
శివ: చక్రవర్తికి తమ్ములన్నా లేరు. ప్రతాప రుద్రచక్రవర్తి ఉంపుడుకత్తెకు పుట్టిన సారంగధర దేవునకు మాత్రం ఇద్దరు పుత్రలు హరిహర, మురారి దేవులున్నారు.
వాళ్ళకి రాజ్యం కబళించాలని ఉన్నది. ధర్మ సంరక్షణార్థం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజే ఉండాలి. మన తెలుగు మహాసామ్రాజ్యము అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలై ఉంటే ధర్మ సంరక్షణం జరగదు.ఈ రాజ్యం కోసల విషయమని, కళింగమని, వేంగీ విషయమనీ, నతనాటి సీమయనీ, గృద్రవాడ విషయము, మంజిష్ట దేశము, కమ్మనాటి విషయమనీ, వెలనాడనీ, ఆరువేలనాడనీ, వూగీవిషయమనీ, పొత్తపి నాడని, సింధువాడనీ, మార్జవాడని, మానువనాడనీ, కొరవదేశమనీ, కొలనిసాక విషయమనీ, చక్రకోట్యమనీ, మంత్రకూట విషయమనీ, ఈ విధంగా చిన్నచిన్న రాజ్యాలతో నిండిఉన్నది. వీని నన్నిటిని ఏకచ్ఛత్రం క్రింద తీసుకువచ్చి, సుఖరాజ్యం స్థాపించి, ధర్మపాలన చేస్తూ , శాంతి భద్రతల నెలకొల్పి, పురుషార్థాలు వెల్లి విరిసేటట్లు
చేయవలసివ బాధ్యత మహాపురుషులది!
చాళుక్య రాజ్యాలు రెండూ నాశనమయ్యాయి. ఆ తరువాత పెద తాతగారైన రుద్రమహారాజు తండ్రి ప్రోల మహారాజులు కాకతీయ సామ్రాజ్యం స్థాపించారు. చాళుక్యులు బలవంతులుగా ఉన్నంత కాలం, శ్రీ ప్రోలరాజు తండ్రి శ్రీ భేత మహాప్రభువు వారికి నమ్మకం గల మండలేశ్వరుడై, సామంతుడై ఉండెను. భేత మహారాజు తండ్రి శ్రీ ప్రోల మహారాజు, వారి తండ్రి భేత మహారాజు మహా మండలేశ్వరులుగా, సామంతులై ఉండిరి.
గణపతి: తండ్రీ! నాకు పుత్రులు కలుగలేదు.ఇందరి రాణులలో ఒకరి గర్భము ఫలించ లేదు. స్వయంభూ దేవుడు ప్రసాదించిన శక్తి తో ఈ దేశికులసహాయంతో కాకతీయ సామ్రాజ్యం వృద్ధి చేసి దేశంలో ధర్మం నెలకొల్పాను. అలాంటి ఈ మహారాజ్యానికి
యువరాజు లేడు తల్లీ! నువ్వు పుట్టడమే హిమవంతుని ఇంట పార్వతి జనియించి నట్లయింది నాకు. చిన్నవారైనా, నాకు పంచాక్షరి ఉపదేశించి అర్జునునికి సారథ్యం చేసిన శ్రీకృష్ణునివలె, ఈ శివదేవయ్య దేశికులు నువ్వు ఉద్భవించగానే నాకు పుత్రులు పుట్టబోరని, నీ జాతకమునందు మహా సామ్రాజ్ఞీత్వము వ్రాసి ఉన్నదనీ చెప్పి
పుత్రుడుదయించు కట్టుదిట్టాలు చేయించారు.
మహారాణీ: తల్లీ! నిన్ను పుత్రునిగా పెంచడం ఎంత కష్టమైంది.చక్రవర్తీ, మహామంత్రి ఆలోచించి చేసిన ఏర్పాటది.
శివ: ప్రభూ! ఈ భూమిలో ధర్మం కొనసాగడానికే ఈ విధానం అవలంభించాము . మీరు బాలికలని చెప్పగల శుభముహూర్తం వస్తుంది. ప్రపంచం లో ఆర్యభూములలో యిదివరకు సంభవించని ఒక దివ్యఘటన ఇప్పుడు సంభవిస్తుంది గాక! మీరు అఖండ ఆంధ్ర మహాసామ్రాజ్య సింహాసనం అధిష్ఠించాలని మిమ్ము బాలకునిగా పెంచినాము తల్లీ! వీర పురుషోచితమైన విద్యలన్నీ మీకు నేర్పినారు. మీరు ఉత్తమోత్తమైన చక్రవర్తులు కాగలరు. ఇదీ రహస్యం.
రుద్రదేవి తలవాల్చికొని " నన్ను క్షమించండి బాబయ్యగారూ, నన్ను ఆశీర్వ
దించండి గురుదేవా! అమ్మగారూ! మీ సహజోదీర హృదయంతో నన్ను మీ హృదయంలోకి తీసుకోండి. మీరు నా కర్పించిన ఈ దివ్యధర్మాన్ని నా ప్రాణాలతో కాపాడు కొంటాను " అన్నది.
-------------------------------------
గణపతి రుద్రదేవులకు అత్యంత ఆప్తుడైన , యిష్టుడై, నమ్మకస్తుడై , విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకుంటున్న , బావమరిది ' జాయప' సేనానికి. , అందానికి మారురూపుగా చెప్పుకుంటున్న ‘ముమ్ముడాంబ' అనే అందమైన కూతురుంది.
ఇప్పుడు- ముమ్మడమ్మ కూడా పందొమ్మిదేళ్ళ లావణ్య. అందాలబాల.
ముమ్మడమ్మ ఎవరు?
రుద్రదేవుల భార్య.
ఇదెందుకు జరిగింది? రుద్రమదేవి మనస్సు బాధతో విలవిలలాడింది. తను స్త్రీ ని కాను- పురుషుణ్ణని లోకానికి చాటటం. సాటి ప్రభువులకు తెలియజెయ్యటం.
భావిలో, కాకతీ సామ్రాజ్యాన్ని అధిరోహించే , యువరాజు రుద్రదేవుడని , సమస్త
రాజులకి అర్థంకావటం.
కానీ యిప్పుడేమి జరుగ నున్నది!
ముమ్ముడాంబిక స్త్రీ కాదా? ఆమెకు కాంక్షలు లేవా?
జాయప మహారాజైనా, తమ తండ్రికి బావమరిదైనా, ఒక స్త్రీకి - మరొక స్త్రీ నిచ్చి పెళ్ళి చేయటమా? విశ్వాసానికి మాత్రం హద్దు లేదా? మరీ యింతటి మూర్ఖత్వమా!
ముమ్మడమ్మ లాంటి అందెగత్తె జీవితం , మునుముందు ఏమి కానున్నది? ఇది ఎంత వంచన, దుఃఖం!
ఆటలలో----
పాటలలో---
సంగీతంలో---
నృత్యంలో -----
అందం లో---
చందం లో--- తనంత----
దీటురాని ఎంతోమంది రాచకన్నెల మధ్య ముమ్ముడాంబ ఏ యింట కాలుపెడితే,
ఆ యింట్లో వెలుతురు వస్తుందే- అటువంటి లావణ్య తిలకము లోకులకోసం వంచించి----
యిన్ని వేల ప్రజల సమక్షంలో----
యిన్ని వందల ప్రభువుల సన్నిధిన----
పది రాజ్యాల జనాన్ని , విందులు వినోదాలతో, ఐదు రోజులు ఓలలాడించి , ముమ్ముడమ్మకు , ఎంత అన్యాయం చేసారు.కాకతీ కుల సార్వభౌములు!
ఆ పిల్ల తన వొళ్ళో పడుకుంటే ---
తన చిన్ని పెదవులతో , తన చెంపను ముద్దెట్తే-
ఆరాధనాపూర్వకమైన కళ్ళతో తనని చూస్తే-
" ప్రభూ! నా సర్వస్వమా!" అని వినిపించీ, వినిపించనట్టు అన్పిస్తే-
" మీ కోసం కొత్త ఆట నేర్చుకున్నాను.ఆడనా"- అని
" మీ కోసం కొత్తపాట నేర్చుకున్నాను,పాడనా" అని, అంటే , తను జవాబు చెప్పలేక , తత్తర పడిపోతూ వుంటే---
"కాకతీ ప్రభువులకు నా కన్నా ఎక్కువ సిగ్గు".అని , చెంపన మరొక్కసారి వొళ్ళు జల్లుమనేట్టు ముద్దెట్టుకునే ముమ్ముడమ్మ కు తనకు అన్యాయం జరిగిందనీ- కుటిలమైన రాజనీతి , తనను వెన్నుపోటు పొడిచిందనీ తెలిస్తే , రాబోయే పరిణామాలకు కర్తగా మిగిలేదెవరు? ఈ దురంతానికి సాక్షి కన్నీరేనా- చాలా ప్రశ్నలకు అశ్రువులు - నిశ్శ
బ్దమూ మాత్రమే జవాబులా?
అంతే కాదు, యింకా విచిత్రమేమిటంటే ---
'తనకూ, ముమ్మడాంబకు పునస్సందానము'.
పెళ్ళయిన పదినాళ్ళకి ఒక రాత్రి , తన తల్లి, సోమాంబిక పిలిచి-
"రుద్రదేవా! నీకు యివ్వాళపునస్సంధానము".అన్నది.
"అనగా!"
"భార్యాభర్తలను ఏకశయ్యాగతులుగా చేసే తంతు."
ఇది అన్యాయము,"
" నిజమే-కానీ లోకం కోసమైనా యిది చేయక తప్పదు."
“ఆమె ప్రశ్నలకు ఏమని జవాబు చెప్పను?"
" తమకు కాత్యాయని వ్రతమున్నదని చెప్పుట".
" ఇది పాపము కాదా?.
" తప్పని పాపమమ్మా యిది."
రుద్రదేవుడు ఆ పైన తల్లిని ప్రశ్నించే ప్రసక్తి లేదు. ఎందుకంటే , ప్రతీ ప్రశ్నకు ఇలాంటి సమాదానమే వస్తుంది.
ఆ రాత్రి-----
ఆ తొలినాటి రాత్రి..
ముమ్ముడాంబకు భర్తమీద కలలుకనే రాత్రి రానే వచ్చింది.
చెలికత్తెలు మేలమాడుతూ , సర్వభూషితాలంకారిణి అయిన , జగన్మోహిణి ముమ్మడాంబికను , హారతులిచ్చి నవ్వుల సందళ్ళ మధ్య, " నీ ప్రియవిభుడితో నీవు పొందిన ఆనందాన్ని రేప్రొద్దున మాకు చెప్పటం మరిచిపోకు సుమా" అని -గదిలోకి నెట్టి తలుపులు వేసి వెళ్ళిపోయారు.
ఆమె కళ్ళు క్రిందకు దించుకుని , నిలబడి వున్నది.
రుద్రదేవుడు దగ్గరకు రాడు-
తన ప్రియుడు--
తన విభుడు --
తన మన్మధుడు----
ఎంతకీ చేరువుకాడనే ఆశ్చర్యంతో , ఆమె యింత యింత కళ్ళను, యింత యింతలుగా చేసుకుని , వింతవింతలుగా చూసింది.
ఎన్ని కలలు కన్నది. ఆమె భర్తను గురించి?
ఆమెకు ఏడుపు వస్తున్నది- భరించలే, క్రోధము- రోషము -
అది విశాలమైన పడక గది.చిన్న ఊరంత పట్టె మంచము- గదిలోకి కిటికీ రెక్కల మధ్యనుండి జారిపడి , నేలను అందంగా మెరిపిస్తున్న వెన్నెల రాత్రి. చల్లని గాలి.
రుద్రదేవుడు నెమ్మదిగా నడచివచ్చి -
" ప్రియా"!"
జవాబు లేదు---
"నేను నీ భర్తను , రుద్రదేవుడను".
"వూ"
"కోపమా!"
ఆమె అతన్ని గాఢంగా పెనవేసుకున్నది. దుఃఖంతో గొంతు పూడుకుపోతున్నది.
ఆర్తితో అల్లాడిపోతున్నది.
చిన్న చేతులతో , అతన్ని గుండెలమీద లాక్కుని , అంతులేని తమకంతో --
"ప్రభూ! ప్రభూ! ప్రభూ! " అన్నది.
"నీ కేమి కావాలి దేవీ".
"మీరు " అని క్షణం ఆగి " మీరు.....మీరు.......మీరు....".
"అలా".
"మీ ద్వారా నా కడుపులో పెరగవలసిన , రేపటి కాకతీ వంశపు వీరకిశోరమంతటి యువరాజు".
రుద్రదేవుడు సంభ్రమపడినాడు.
ఎంత గొప్ప కోరిక కోరినది ముమ్ముడాంబిక- ఏం చేస్తే ఆమెను ఈ తాత్కలిక దుఃఖం నుంచి తప్పించవచ్చు
"ఇటు చూడు"
ఆమె కళ్ళెత్తి చూసింది.
"నీవు బాధ పడరాదు".
"ఉహూ".
రుద్రదేవుడు కిరీటము తీసి , పొడుగాటి వెంట్రుకలను - ముడి వూడదీసి, భుజం
మీదికి జారవిడుచుకున్నాడు.
"ఇదేమి ప్రభూ!"
"నీ అంత పొడుగాటి , నిడుపాటి వెంట్రుకలు నాకూ వున్నవి దేవీ..ఇవి పెంచటం ఎందుకో తెలుసా! మా కాకతీ వంశస్తులకు కాత్యాయనీదేవి వ్రతము వున్నది. అది పరిసమాప్తి కానిదే, మేము మా భార్యలతో సుఖించరాదు. ఇది మా ఆచారము. ఈ వ్రతం అవ్వగానే , మేము ఈ కేశ ములను ఖండిస్తాము. అప్పటిదాకా ఈ దేవేరి , ఈ దేవుని కలియరాదు.ఏక శయ్యాగతులు కారాదు".
"ఆ మహాద్భాగ్య మెన్నడు?"
"మేము తెలియపర్చగలము రాణీ".
అంత దుఃఖములోనూ , తనమీద గాఢమైన అనురాగం గలిగిన ముమ్మడమ్మ తనని నమ్మింది.
ఆమె, ఆ నాటి రాత్రి , ఆ విశాల తల్పంమీద , ఒంటరిగా , కన్నీటి చారికలతో నిద్రపోయింది. ఒక మూలగా - దెబ్బ తిన్న పక్షి మల్లే.
అప్పటినుంచీ , యిప్పటివరకూ , తనను ముమ్ముండాబ కలువనేలేదు.
ఆమెకు కట్టడి ఎక్కువైనది.
తననుంచి , ప్రతిరోజూ పిలుపుకోసం , ఆమె ఎదురు చూస్తూనే వున్నది. కానీ తాను ఏమని కబురు పంపగలదు !
ఇంకా వుంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
留言