కాకతి రుద్రమ ఎపిసోడ్ 3
- Ayyala Somayajula Subramanyam
- Jul 9, 2022
- 4 min read
Updated: Jul 17, 2022
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Kakathi Rudrama Episode 3' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
శ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి అవసాన దశలో ఉన్నాడు.
రాజ్యంలో తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు శివదేవయ్య, మహారాజుకు తెలియజేస్తాడు. చాళుక్య వీరభద్రుల వారు, రుద్రమ దేవి కలుసుకునే ఏర్పాటు చేసినట్లు ప్రసాదాదిత్యులు తెలియజేస్తారు.
ఇక చదవండి...
ఓరుగల్లుకు ముప్పది మైళ్ళ దూరంలో గోదావరి తీరారణ్యాలున్నవి. గోదావరి తీరానివి
గంభీరమైన అడవులు. కృష్ణా తీరానివి అందమైన అడవులు, హిమాలయ పర్వతారణ్యాలు దివ్యమైనవి. మలయ ద్వీపారణ్యాలు భయంకరమైనవి.
ఈ అరణ్యాలలో వెలుగెరుగని నేలలున్నాయి. నల్ల, ఎర్ర, రాలి మొదలైన ఏ విధమైన
నేలకనబడని గడ్డిజాతులు, ముళ్ళజాతులు, లక్షల కొలది తీగెలజాతులు,
ఓషదులజాతులునేలమట్టం మొక్కలు , చిన్న జొంపాలు, నిలువుణర ఎత్తు ముసుర్లు ఆకాశం ఎత్తు చెట్లు, అడుగుమందారాల చెట్లు, తీగలు, సాలితంతుల తీగెలు, అనేక జాతులవి.
అనేక వృక్షాలు , కరక్కాయ, ఉసిరిక, జీడి, తాళిక , తంగేళ్ళు, మద్దులు, రేలలు, టేకుపాలు మామిళ్ళు, తాడులు, ఇప్పలు, చండ్రలు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయేవి. అన్నిదెసలూ ఆక్రమించేవి. ఆకులముళ్ళు, కాయలముళ్ళు , పూవులముళ్ళు, కొమ్మల
కలవి, మంచి వాసన కొట్టేవి, కారపువాసనకొట్టేవి, చేదువాసన , మత్తువాసన, దుర్గందము
కొట్టేవి, రంగురంగులపూలవి, చిన్నపూసలవి, పెద్దపూసలవి, అడివిమల్లె, అడివిపారు
జాతం, శేఫాలిక, అందాలఆకులు, రంగురంగులఆకులు, అనేక రూపాల ఆకులు,
పొడుగువి, పొట్టివి, నీటిదగ్గర పెరిగేవి, రాళ్ళరాళ్ళమధ్య పెరిగేవి..
----------------
చాళుక్యసామ్రాజ్యానికి , ఆంధ్రసామ్రాజ్యానికి మధ్యన కొన్నేళ్ళక్రితం వైషమ్యాలు, అప్పుడప్పుడు యుద్దాలూ వుండేవి గానీ, అని రానురాను తగ్గిపోయాయి. ఈ యుద్దాలు
మానవ జీవనవిధానాన్ని అస్తవ్యస్తం చేస్తాయని యిరుపక్షాలు గ్రహించారు. వీరి జీవన
విధానాల్లో గొప్ప మార్పులు వచ్చిపడ్డాయి.
శాంతికాముకత్వాన్ని దీక్షాదక్షగా-
చాళుక్య , కాకతీయప్రభువులు గ్రహించారు. కాబట్టీ యిటీవల రెండు రాజ్యాల్లోనూ ,
శాంతి కపోతాలు రెక్కలు విప్పి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఎగరటం మొదలయ్యాయి.
కాకతీయువరాణీ రుద్రమదేవి, శాంతిని ఆకాంక్షిచిన స్త్రీయే. --- ఆమెలో స్త్రీత్వం
తాలూకు రాగరంజితాలు, ప్రేమాభిమానాలు వున్నాయి.
అట్లాగే చాళుక్య ప్రభువు ' వీరభద్రుడు'---
అందంలో, చందంలో, ఈవిలో, ఠీవిలో, బలంలో , వీరత్వంలో, పాలనలో -----
కళలలో , సంగీతంలో, సాహిత్యంలో -చోళసామ్రాజ్యాలకి వున్న గౌరవాలని వీరభద్ర
ప్రభువు మినుమిక్కుటం చేశాడు. అంతేగాక , కాకతీసామ్రాజ్యాన్ని , ప్రభువులని ఆద
రించాడు. ----ఈ ఆదరణ తరువాత తరువాత ఒక అద్భుతమైన గౌరవప్రతిష్టలకి
రాచబాట వేసింది.
రుద్రమ అంతరాంతరాల్లో వీరభద్రుడు తళుక్కున మెరుస్తునే వున్నాడు. వేటకి వెళ్ళి
నప్పుడు , అతగాడి విలువిద్యప్రదర్శన , వింటి ఝూంకారము, గురిగా వెళ్ళి మొకమును
ఎక్కడ అనుకుంటే అక్కడే తాకి, నేలగూల్చగలిగిన ప్రజ్ఞ.
ఇన్ని కబుర్లూ రుద్రమదేవికి అందుతూనే వుండేవి.
రాజ్యభారం ఆమెని పురుషునిగా నటించేట్టు చేసినా, స్త్రీ సహజమైన లాలిత్యానికి
ఆమె తలవంచక తప్పింది కాదు.
నిజానికి ---------
గోదావరి పావనజలాలు సస్యశ్యామలధాత్రిగా , అలరారుతున్న ఓరుగల్లుని ఆనుకని,
జీవనది గోదావరి పారుతున్నది.
ఇటు తట్టున కృష్ణమ్మ తల్లి--------
అటు తట్టున గోదారమ్మ---
ప్రతి ఏడు నిండి, ఉరవళ్ళు- పరవళ్ళ తో ప్రవహించి ఆంధ్రజాతికి , ప్రజావళికి
బంగారాన్ని యిచ్చే ఈ నదుల నానుకుని గంభీరమైన పర్వతాలు , అగాధలోయలూ,
భయంకరమైన అడవులు వున్నవి. కృష్ణతీరపు అడవులు అంత పెద్దవి కావు. కానీ
గోదావరి తీర ప్రాంతపు ప్రాంతాల అరణ్యాలు భయంకంపితమైనవే.
-- రాజులు గొప్పతమకంతో , వీరత్వంతో , మృగయా వేటల వినోదార్థం
వస్తూండేవారు.
ఇటు కాకతీప్రభువులే కాదు-
అటు చోళ ప్రభువులు---
వేట విషయంలో తెంపరులే, నిష్ణాతులే.
రుద్రదేవుడనే రుద్రమదేవికి ఈ వేట పిచ్చి చాలా వుంది. ఈ పిచ్చి యువరాజులు
వేటకి వస్తున్నారంటే , చాలా ఆర్భాటాలు జరిగేవి. - గ్రామాధికారులకు నాలుగునాళ్ళ
ముందే కబుర్లు వెళ్ళేవి.
ఈ గోదావరి తీర, క్రూరమృగాలు తిరిగే భయంకరమైన అరణ్యమధ్య భాగంలో
రుద్రదేవుడు, వీరభద్రుడు కలుసుకోవడం జరిగింది.
ఇది అతి విచిత్రమైన సమాగమం !
అసలేం. జరిగిందంటే---------
--------------------------------
వేట నిర్విఘ్నంగా జరుగుతున్నవి. వేటకాండ్లు రెచ్చగొట్టడం, రుద్రదేవి , చాళుక్యవీర
భద్రుడు , మహాదేవప్రభువు విరియాల మల్లాంబిక బాణాలు సంధించి చెవులకంట
అల్లెత్రాళ్ళు లాగి సువ్వున ఆ క్రూరమృగాల గుండెల్లోంచి దూసిపోవేయడం, పెద్ద
పులులు, చిరుతలు, ఎలుగులు, అడవిపందులు , సివంగులు , అడవి పిల్లులు
కుప్పకూల్చడం జరుగుతున్నది.
ఏ కారణం చేతనో చాళుక్యవీరభద్రుడు, రుద్రమదేవి తమతమ గుర్రాలమీద స్వారీ
అవుతూ అడవిలో ఒక భాగంలో తారసిల్లారు.
వీర: ప్రభూ! మీ గురి అర్జునునికి పాఠాలు నేర్పుతున్నది .
రుద్ర: మీరు నిన్న సాయంకాలము పడవేసిన బెబ్బులి రెండు కళ్ళమధ్యను జ్ఞాన
నేత్రం తెరువబడలేదా మహారాజా? ఆ బెబ్బులి నన్ను పగబట్టనట్లు నామీదకి ఉర
కటం, మీ రా సమయం లో దగ్గరిలో ఉండటం.........
వీర; మీరు అలా అంటారేమి మహాప్రభూ! మీరు యేదో యదాలాపంగా ఉన్న సమ
యంలో ఆగి మీ పైన వురికింది. అక్కడ నేను ఉన్నాను గనుక మా ప్రభువు సహాయా
నికై నేను వచ్చాను.
రుద్ర: మీరు మొదటి బాణం వేయగానే , నా గుఱ్ఱంపై ఉరకబోయిన ఆ పెద్దపులి మీ
వైపుకు తిరిగింది. వెంటనే మీ రెండో బాణం దాని మెదడులో నుండి దూసుకుపో
యింది. ! మీ ఉపకృతికి నేనేమీ మారు ఈయగలను?
వీర: మహాప్రభూ! మీ స్నేహం కన్న మీ ఆదరణ కన్న నాకు కావలసినది ఏమున్నది?
పురుషవేషం లో నున్న రుద్రదేవి బాలునిలా ఉన్నది. మీసాలు రాని
పదహారేళ్ళకుమారునిలా ఉన్నది. ఆమె తలపై శిరస్త్రాణము ఉంది. వెనుక వున్న
ఎత్తయిన కేశాలనుగట్టిగా ముడిచినప్పటికీ ధమిల్లము అతి పెద్దది గా ఉండటం వ
వల్ల అందుపై సన్నని వుక్కుగొలుసుల అల్లిక వస్త్రములు వ్రేలాడుచున్నవి.
వుత్తుంగాలైన ఆమె సౌవర్ణ వక్షోజాలను అదిమి స్తనవల్కము ధరించి ,
అందుపై పట్టుతో రచింబడిన పురుషకంచుకము ధరించి, ఆ కంచుకముపై ఆమె
ఉక్కుకవచం ధరించింది. మెళ్ళో పురుషహారము లు ధరించింది.
స్త్రీలకు , పురుషులకు ఒకే విధమైన ఆభరణములు ఉంటవి. తేడా పని తనంలో
మాత్రం ఉంది.
రుద్రదేవి పురుషాభరణాలు ధరిస్తుంది. ఆమె అధివసించిన ఆజానేయము
ఉత్తమ అరబ్బీగుర్రము. ఈ జాతిగుర్రాలు భరుకచ్ఛం నుండి వస్తాయి. అక్కడనుండి
మెరకదారిని ఓరుగల్లు మహాపురము వస్తాయి.
ఆంధ్రులు అశ్వవీరులు కాబట్టే వారిలో అశ్వసాహిణులెక్కువ. అశ్వశాస్త్రం తెలియని
ఆంధ్ర వీరుడు లేనేలేడు. అరబ్బులకు గుర్రాలన్నా ఎంత ప్రీతో ఆంధ్రులకూ అంత ప్రీతి.
రుద్రదేవి అశ్వసాహిణులలో మహోత్తమ సాహిణి. ఆనాడామెను మించిన పురుషుల
లో ఒకే ఒక్కడు గోనగన్నారెడ్డి మాత్రమే !
రుద్రదేవిని ప్రేమించని గుర్రం లేదు. చక్రవర్తి అశ్వశాలలో ఆమె అడుగుల
చప్పుడు కూడ ప్రతి గుర్రమునకు తెలియును.
-------------------------
అసలు--------
ఈ సమస్త మానవజాతి పుట్టినప్పటినుంచీ, హెచ్చుతగ్గులు వుంటూనే వున్నాయి. ఇది
నిర్మూలించ దుస్సాధ్యమైనది. అట్లాగే కులాలు, మతాలు, శాఖలు, తెగలు -----
చోళరాజులు--
యాదవరాజులు----
వెలమరాజులు-----
కాకతీ రాజులు-----
రెడ్డి రాజులు
ఎవరికున్న ప్రాభవాలు వారికి వుండనే వున్నాయి.
అయితే------
ఈ కథా కాలంనాటికీ-- అన్ని రంగాల్లోనూ అన్ని విధానాల్లోనూ కాకతీ ప్రభువులే
దుర్నిరీక్ష తేజంతో విరాజిల్లిపోతున్నారు.
అట్లాగే -----
చక్రవర్తులు-----
పెద్దరాజులు-------
చిన్న రాజులు------
సామంతరాజులు -----
లాంటి తెగలు కూడా అసంఖ్యాకంగా వున్నాయి.
ప్రస్తుతం ---
కాకతి రాజులు చక్రవర్తుల స్థానంలో వుంటే--
లకుమయరెడ్డి రాజులు, పెద్దరాజుల స్థాయిలోని వారైతే ,
చోళ ప్రభువు వీరభద్రుడు కేవలము సామంతరాజే,
అది అట్లా వుంటే --
సాయంత్రం సూర్యుడు పడమటి మబ్బుల్లో కుంకబోతున్నాడు.
సాయంసంజ పడమటి మబ్బుల్లో కుచ్చెళ్ళు జారవిడుస్తున్నది.
ఆవలివైపున చీకటి నొప్పులు పడుతున్నది.
తిరుగుప్రయాణాలు మొదలైనవి.
కొద్రికొద్దిగా చీకటి------
అలసాలనంగా వీస్తున్న గాలి తెంపుల తుంపులు--
---------------------------
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
కథను తెలుగుదనంతో ఆనాటి విశేషాలతో చాలా బాగా వ్రాస్తున్నారు.
కథ చదువుతూ పూర్వపు తెలుగును ఆస్వాదిస్తున్నాను. నాక్కూడా ఇందులో కొన్ని పదాల అర్థాలు తెలియవు అని చెప్పటానికి కొంత బాధగా వుంది. ఆ పదాల అర్థాలు మిమ్మల్ని అడగవచ్చా, మీకు ఇబ్బంది లేకపోతేనేలెండి?
ఇలాంటి కథలు చదవటం వల్ల నేను వాడుకలో లేని ఎన్నో తెలుగు పదాలను మననం చేస్కున్నట్లై, సంతోషం కలిగింది. ధన్యవాదాలు 🙏