top of page

కాల వాహినిలో - పార్ట్ 1

ధారావాహిక ప్రారంభం


'Kala Vahinilo - Part 1'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 09/08/2024

'కాల వాహినిలో - పార్ట్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సంవత్సరం.. 2019.

ఆగష్టు నెల తేదీ 15... మన స్వాతంత్ర్య దినోత్సవం.. తెలుగు సంప్రదాయం ప్రకారం... వికారి నామ సంవత్సరం... ఆషాఢమాసం.. పూర్ణిమ తిధి.. అందరికీ శలవు రోజు... ఆ గ్రామానికి పెద్ద.. సత్యానందరావు.

వారి తాతగారు నిర్మించిన హైస్కూలు భవనం ముందు ఉదయం ఏడున్నర గంటలకు త్రివర్ణ జాతీయ పతాకాన్ని.. స్కూలు అధ్యాపకులు... బాల బాలికల సమక్షంలో సత్యానందరావు గారు జెండా కర్రను ఆవిష్కరించారు. అందరూ శ్రీయుతులు కీర్తిశేషులు అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన మన జాతీయ గీతాన్ని ఆలపించారు. 


"జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాతా..

పంజాబ సింధు గుజరాత మరాఠా.. ద్రావిడ ఉత్కళ వంగ...

వింధ్య హిమాచల యమునాగంగా... ఉచ్చల జలధితరంగా..

తవ శుభనామేజాగే.. 

తవశుభ ఆషిస మాగే..

గాహే తవ జయగాధా.. 

జనగణమంగళదాయక జయహే...

భారత భాగ్య విధాతా... 

జయహే.. జయహే.. జయహే..

జయ.. జయ.. జయ... జయహే.."


అందరూ ఏక కంఠంతో పాడడం ముగిసింది. సత్యానందరావు గారి అక్క కుమారుడు తిరుమలరావు న్యాయవాది. మామగారి ఆదేశం ప్రకారం... అందరికీ చాక్లెట్లు పంచాడు.


చివరిసారి జాతీయ పతాకానికి వందనం చేసి పిల్లలు తమ తమ ఇండ్లవైపునకు నడిచారు.

హెడ్‍మాస్టర్ నారాయణరెడ్డి గారు... సత్యానందరావు టీచర్లు కొందరు.. హెడ్‍మాస్టరు గారి గదిలో కూర్చుని క్రొత్తగా నిర్మింపదలచిన భవనాన్ని గురించి చర్చించారు. టీచర్లు వెళ్ళిపోయారు. 

హెడ్‍మాస్టర్ నారాయణ రెడ్డి గారికి చెప్పి సత్యానందరావు, అల్లుడు తిరుమలరావుతో కలిసి తన ఇంటివైపుకు బయలుదేరారు.


వారికి కావ్య కార్లో ఎదురైంది. ఆమె ఎ.ఎస్.పి. తన కారును ప్రక్కగా ఆపి దిగి సత్యానందరావు, తిరుమలరావులను సమీపించి చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూచింది.

"ఏమ్మా! డ్యూటీకి బయలుదేరావా?" చిరునవ్వుతో అడిగారు సత్యానందరావు.


"అవును మామయ్యా!" 


మరుక్షణాన..

"మరి నాకు చాక్‍లెట్ ఏది?" కొంటెగా నవ్వుతూ అడిగింది కావ్య.


తిరుమలరావు వెంటనే జేబులోంచి ఐదు చాక్‍లెట్స్ తీసి నవ్వుతూ మామగారి చేతిలో ఉంచాడు.

సత్యానందరావు అల్లుడు ముఖంలోనికి ప్రీతిగా చిరునవ్వుతో చూచి...

"ఆ.. ఇంద..."


కావ్య నవ్వుతూ చేతిని జాచింది.

చాక్‍లెట్‍ను ఆమె చేతిలో వుంచాడు సత్యానందరావు.

"జాగ్రత్త తల్లీ!" ఆ మాటలో ఎంతో అభిమానం.


"అలాగే మామయ్యా! వెళ్ళొస్తాను"


"ఆ... మంచిది... మంచిది.. వెళ్ళిరండి" నవ్వుతూ నాటకీయంగా చెప్పాడు తిరుమలరావు.


కావ్య ముందుకు నడచి కార్లో కూర్చొని స్టార్ట్ చేసింది. 

"తిరుమలా!" పిలిచాడు సత్యానందరావు.


"ఏం మామయ్యా!" అడిగాడు.


"అమ్మాయి... పనిలో చేరి రెండు సంవత్సరాలయ్యిందిగా!"


"ఆ.. రెండు సంవత్సరాలా... పదిరోజులు... మరో విషయం... మామయ్యా"


"ఏమిటా అది?"


"రేపు మన కావ్య పుట్టినరోజు"


"రేపా!" ఆశ్చర్యంతో అడిగాడు సత్యానందరావు.


"అవును మామయ్యా!"


"రేయ్! తిరుమలా.. నీవు ఎలా చేస్తావో! ఏం చేస్తావో! రేపు కావ్యకు సర్‍ప్రైజ్‍గా పార్టీ ఏర్పాటు చేయాలి సరేనా!"


"మామయ్యా! మీరు చెప్పారుగా ఇక ఆ విషయాన్ని నాకు వదిలేయండి" తలెగరేస్తూ నవ్వుతూ చెప్పాడు తిరుమల.


సత్యానందరావు ఆనందంగా నవ్వాడు "నీ సామర్థ్యం నాకు తెలుసుగా!" అన్నాడు.


"అంతా మీ శిక్షణే కదా మామయ్యా!" చిరునవ్వుతో చెప్పాడు తిరుమలరావు.


ఇరువురూ సత్యానందరావు నిలయాన్ని సమీపించారు. వారు ఇంట్లో ప్రవేశించే సమయానికి సత్యానందరావుగారి అర్థాంగి సావిత్రి... సోదరి జానకీ హడావిడిగా ఇంటిని శుభ్రం చేస్తూ... అన్ని వస్తువులను క్రమంగా అమర్చుతున్నారు.


"ఆ.. వచ్చారా! రండి... రండీ" నవ్వుతూ స్వాగతం పలికింది సావిత్రి.


"ఏమిటి సావిత్రీ! చాలా హడావిడిగా ఉన్నారు ఇద్దరూ!" అడిగారు సత్యానందరావు.


"రేపు మన కోడలి పుట్టినరోజు మరిచిపోయారా!" అడిగింది సావిత్రి.


"అన్నయ్యా! కావ్య రేపు తన ఆఫీస్ స్టాఫ్ నందరినీ భోజనానికి పిలుస్తానని చెప్పింది" అంది జానకి.


"ఓ... అలాగా!"


"అవును అన్నయ్యా! అందుకే నేను, వదిన ఈ పనిలో వున్నాము" చిరునవ్వుతో చెప్పింది జానకి.


"అత్తయ్యా! నేను ఏమైనా సాయం చేయనా" అడిగాడు తిరుమలరావు.


"ఫొటోస్ అన్నింటినీ తుడిచిపెట్టి వున్నాము. వాటిని పైన గోడకు తగిలించరా!" చెప్పింది సావిత్రి.


"ఓ... అలాగే అత్తయ్యా!"


ఆనందంగా ఆ పనిని ప్రారంభించాడు తిరుమలరావు.


జానకి ఫోటోలను ఒక్కొక్కటిగా అందించగా వాటిని క్రమంగా గోడకు ఉన్న మేకులకు తగిలించాడు తిరుమలరావు.


ఆ ఫొటోల క్రమం మొదటిది సత్యానందరావు గారి తాత నాయనమ్మల గారిది.. రెండవది సత్యానందరావు గారి తల్లిదండ్రులది, మూడవది తన తండ్రి చిన్న వయసులోనే మరణించిన కారణంగా అన్నగారి సంతతి అయిన తనను, అక్కయ్యని, చెల్లిని, తమ్ముడిని పెంచి పెద్దచేసిన వారికి తెలిసిన (పిన) తండ్రి, తల్లిది. నాల్గవది చంద్రం తిరుమలది. ఆ ఫొటోను జానకి తిరుమలకు అందించలేదు.


ఆ కుటుంబానికి ఆ గ్రామంలో ఓ గొప్ప చరిత్ర ఉంది. సాటివారి పట్ల అభిమానం, ఆదరణ, ప్రేమ ఆ ఇంటివారందరికీ సొంతం. ముఖ్యంగా పెద్దా చిన్నలయందున గౌరవం, ఆత్మీయత ఒకే రీతిగా ఆ కుటుంబ సభ్యులందరిలో వెనుక తరాన్నుంచి ముందు తరానికి సంక్రమించిన మహోన్నత గుణాలు.


తనకు అందించకుండా గోడకు ఆనించిన ఒక ఫొటోను చూచాడు తిరుమలరావు. అందులో వున్నది తను చంద్రం. ఆ ఫోటోను జానకి తనకు ఎందుకు అందివ్వలేదనే కారణం తెలిసిన తిరుమలరావు చూడనట్లు మౌనంగా ఉండిపోయాడు. బెంచిపై నుంచి క్రిందకు దిగాడు. ఆ విషయాన్ని సత్యానందరావు, సావిత్రిలు కూడా గ్రహించారు. ఆ ఇరువురూ మౌనంగా తమ గదిలోనికి వెళ్ళిపోయారు. వారి ముఖభావాలను గ్రహించిన తిరుమలరావు, జానకి ఒకరి ముఖాలను ఒకరు చూచుకొన్నారు. ఆ ఇరువురి వదనాల్లో ఒకే భావన, ఆవేదన.


"వదినా! నేను ఇంటికి వెళుతున్నాను. ఆ ఫొటోను నేను తీసుకొంటాను" మెల్లగా చెప్పాడు తిరుమలరావు.


జానకి అతని ముఖంలోనికి ఆశ్చర్యంగా చూచింది. 

"అందులో నేనూ వున్నానుగా వదినా!" అభ్యర్థనగా చెప్పాడు తిరుమల.


జానకి ముఖంలో విరక్తితో కూడిన నవ్వు.

"సరే!... నీ ఇష్టం" అంది జానకి క్లుప్తంగా.


తిరుమలరావు గోడకు ఆనించివున్న ఫొటోను చేతికి తీసుకున్నాడు. జానకి ముఖంలోనికి చూచాడు. ’వస్తాను’ అన్నట్టు తలాడించి మౌనంగా హాలు నుండి బయటికి నడిచాడు.


జానకి భర్త నరేంద్ర అతనికి ఎదురైనాడు.

"అన్నయ్యా! పొలం నుంచే కదా రావడం!" అడిగాడు తిరుమలరావు.


"అవును తమ్ముడూ!" నరేంద్ర జవాబు.


"పంట కోతకు వచ్చిందిగా!"


"ఆ... పదిరోజుల్లో కోయాలి తమ్ముడూ!"


"ఇంటికి వెళుతున్నా అన్నయ్యా!"


"మంచిది వెళ్ళిరా!"


నరేంద్ర ఇంట్లోకి నడిచాడు. తిరుమలరావు సత్యానందరావు గారి గృహప్రాంగణం దాటి వీధిలో ప్రవేశించాడు.

ఓ యాభై అడుగులు నడిచాడు.

వెనుక నుంచి వచ్చిన కారు అతని ప్రక్కన ఆగింది. లోనికి చూచాడు.

కారును నడుపుతున్నది దివ్య.


"రా బావా! నేను అటువైపే వెళుతున్నా! నిన్ను ఇంటి దగ్గర దింపుతా!" ప్రీతిగా చెప్పింది చిరునవ్వుతో.


తిరుమలరావు కనురెప్పలు పైకెత్తి దివ్య ముఖంలోనికి తీక్షణంగా చూచాడు.

"నన్ను అలా పిలవవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా"


తిరుమలరావు ముగించకముందే..

ఓరకంట అతని ముఖంలోనికి చూస్తూ దివ్య..


"చిన్నప్పటినుంచి అలాగే పిలిచేదాన్ని ఇప్పుడూ అదే. ఈ మధ్యన బావా అని పిలవకు అని నీవు అన్నంతమాత్రానా నేను పిలవకుండా ఎలా వుంటాను?" సూటిగా అతని కళ్ళలోనికి చూచింది దివ్య.


"ఇకమీదట అలా పిలవకు" బెదిరించినట్లు చెప్పాడు తిరుమల.


"ఏం చేస్తావ్! నేను అలాగే పిలుస్తా!" నవ్వింది దివ్య.


"సరే.. నీ దారిన నీవు పో!" కసిగా అన్నాడు తిరుమల.


"త్వరలో పెండ్లి!" చిరునవ్వుతో చెప్పింది దివ్య.


"ఎవరికి?"


"నాకే!"


"చేసుకో"


"వాడు నాకు ఇష్టం లేదు. ముందు కారెక్కు!"


"నేను ఎక్కను. నీవు వెళ్ళు"


"అంతేనా!"


"అంతే!"


"ఓయ్... బావా!" అంది దివ్య వెటకారంగా...


"ఏందీ ఓయ్ నా!" ఆశ్చర్యంతో అన్నాడు తిరుమలరావు. 


"అవును మాట వినకపోతే ఏమంటారేమిటి" బుంగమూతి పెట్టి చెప్పింది దివ్య.


"కడసారిగా అడుగుతున్నా! కారు ఎక్కుతావా... ఎక్కవా... బావా" చివరి రెండు అక్షరాలను సాగదీస్తూ పలికింది.


"నా నిర్ణయాన్ని ముందే చెప్పాను."


"ఏ విషయంలో!"


"నీ కారు ఎక్కే విషయంలో!"


"మరీ!"


"ఏమిటి మరీ!"


"మన పెండ్లి విషయం?"


"అది ఈ జన్మలో జరుగదు" జాప్యం చేయకుండా ఖచ్చితంగా చెప్పాడు తిరుమల.


దివ్య కళ్ళు పెద్దవి చేసి తిరుమలరావు ముఖంలోనికి తీక్షణంగా చూచింది కొన్ని క్షణాలు.


"ఎలా జరుగదో నేనూ చూస్తాను హు" కారును వేగంగా ముందుకు నడిపింది రుసరుసలాడుతూ దివ్య.

కొంతదూరం నుంచి వారిరువురినీ చూచిన రామయోగి తిరుమలరావును సమీపించాడు నవ్వుతూ.

"అన్నా! ఎం.ఆర్. ఓ గారు ఏమంటున్నారు?"


"ఏం లేదురా! కారెక్కండి ఇంటిదగ్గర దించుతాను అంది"


"ఆ ఒక్కమాట మాదిరే లేదే! ప్రసంగం చాలాసేపు జరిగిందిగా!" వ్యంగ్యంగా నవ్వాడు రామయోగి.


తీక్షణంగా రామయోగి ముఖంలోనికి చూచాడు తిరుమలరావు.

"కోప్పడకన్నా! విషయం చెబితే నేనేమైనా సాయం చేయగలనేమోనని" చిరునవ్వుతో నవ్వాడు యోగి.


"నోర్ముయ్యరా! సాయమేందిరా సాయం. నీవు నాకు ఏం సాయం చేస్తావురా!"


"చెప్పనా!"


"చెప్పు"


"నీ మనస్సులోని మాటను ఓ కాగితం ముక్కమీద వ్రాసివ్వు. తీసుకెళ్ళి దివ్యకు చేరుస్తా. జవాబును తెచ్చి నీకు ఇస్తాను" నవ్వాడు రామయోగి.


"ఓహో! అదా తమరి అభిప్రాయం."


"అవునన్నా! నీకు నేరుగా చెప్పడం కొంచం కష్టమే కదా!"


"అని నేను నీతో చెప్పానా!"


ఆశ్చర్యంగా రామయోగి తిరుమలరావు ముఖంలోనికి చూచాడు.

"పిచ్చిపిచ్చిగా వాగకు. అది మనకు సరిపడదు పద"


తిరుమలరావు అడ్వకేట్. అతని అసిస్టెంటు రామయోగి.

ఇరువురూ తిరుమలరావు ఇంటివైపునకు నడిచారు.

మిత్రులిరువురూ తిరుమలరావు ఆఫీస్ గదిలో ప్రవేశించారు. సాలోచనగా కూర్చున్నాడు కుర్చీలో తిరుమలరావు. ఎదుటి కుర్చీలో కూర్చుంటూ రామయోగి...

"అన్నా! ఏమిటో దీర్ఘాలోచన!" అడిగాడు.


అవునన్నట్లు తలాడించాడు తిరుమలరావు.


"నాతో చెప్పవా!"


"నీకు తెలిసిందేరా!"


"కోర్టు కేసు విషయమా! అదే ఆ లంకెబిందెల లక్ష్మయ్య కేసును గురించా?"


"ఒరేయ్! ఈరోజు ఏం వారం?"


"ఆదివారం"


"ఆదివారం నేను కోర్టు కేసుల విషయాలేమీ చూడను ఆలోచించను అని నీకు తెలుసుగా!"


"ఆ...ఆ... తెలుసు మరి నీ ఆలోచన!"


"నేను వ్రాస్తున్న మన ఊరి కథను గురించి."


టేబుల్ మీద తిరుమలరావు వుంచిన ఫొటోను చేతికి తీసుకొని కొన్ని క్షణాలు చూచి...

"అన్నా... మన చందూ!"


"ప్రస్తుతం నా మనస్సు వాడిని గురించేరా ఆలోచిస్తూ ఉంది."


రామయోగి జాలిగా తిరుమల ముఖంలోనికి చూచాడు.

"అన్నా!"


"అడుగు"


"చందూ బ్రతికి వున్నాడంటావా?"


"యోగీ!" బిగ్గరగా కసిరినట్టు సంభోదించాడు తిరుమలరావు.


"రేయ్! చందు పిరికివాడు కాదు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేదానికి" ఆవేశంగా చెప్పాడు తిరుమల.


"అవునవును ఆ విషయం నాకూ తెలుసుగా కానీ.."


"కానీ... ఏమిటిరా!"


"పన్నెండేళ్ళు గడిచిపోయాయి కదన్నా. జాబులేదు... ఫోనూ లేదు అందుకనే నాకు..."


"వున్నాడా లేడా అనే సందేహం అవునా!"


"అవునన్నా!" బిక్కమొహంతో మెల్లగా చెప్పాడు రామయోగి.


"రామూ!..."


"అన్నా!.."


"మరోసారి ఆ మాట అనకురా! వాడు ఎక్కడో లక్షణంగా వుంటాడు వుండాలి"


"అది నీ నా కోరిక అన్నా!"


"వాడూ త్వరలో తిరిగి రావాలి"


"ఇది మన ఇరువురి కోరికే"


"వస్తాడు"


"ఎప్పుడు?"


"అదే నాకు తెలియని విషయం! వాడు వస్తే నా కథను పూర్తి చేయాలని"


"రాకపోతే!..."


"అది అసంపూర్ణమే అవుతుంది" విచారంగా చెప్పాడు తిరుమలరావు.


"అన్నా!.." కళ్ళు మూసుకొని పిలిచాడు యోగి.


"చెప్పరా!"


"చంద్రం వస్తాడన్నా! నీవు నీ కథను నీవు కోరిన రీతిగా వ్రాసి ముగిస్తావన్నా!" ఆవేశంతో చెప్పాడు యోగి.


"ఆ నమ్మకంతోనే ఆ కథను ప్రారంభించానురా!"


"త్వరలో నీవు దాన్ని సంపూర్ణం చేస్తావన్నా!" నవ్వాడు యోగి.


"ఆ ఫొటోను అక్కడ తగిలించరా!" తనకు ఎదురుగా వున్న గోడను చూపించాడు తిరుమలరావు.


రామయోగి లేచి ఆ ఫొటోను ఆ గోడకు వున్న చీలకు తగిలించాడు.

తిరుమలరావు తల్లి అన్నమ్మ... ద్వారం దగ్గరకు వచ్చింది.

"రండ్రా!... భోంచేద్దురుగాని..." పిలిచింది అన్నమ్మ.


"వస్తున్నామమ్మా!.. పదరా!.." అన్నాడు తిరుమల.


ఇరువురు మిత్రులు ఆఫీస్ గదినుండి బయటికి నడిచారు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


66 views0 comments

Comments


bottom of page