'Kala Vahinilo - Part 10' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 23/09/2024
'కాల వాహినిలో - పార్ట్ 10' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.
గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు.
ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది.
తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య.
ఇక కాల వాహినిలో.. పార్ట్ 10 చదవండి.
కావ్య డి.ఐ.జి పార్థసారథి గారి కార్యాలయం ప్రాంగణంలో కారును ఆపి ఆఫీసులోనికి ప్రవేశించింది.
"ఎ.ఎస్.పి కావ్య వచ్చిందని సార్‍కు చెప్పండి" అని కానిస్టేబుల్‍తో చెప్పింది.
అతను పార్థసారథి గదికి వెళ్ళి కొన్నిక్షణాల్లో తిరిగి వచ్చాడు.
"కూర్చోండి మేడమ్, పిలుస్తానన్నారు" చెప్పాడు కానిస్టేబుల్.
కావ్య కుర్చీలో కూర్చుంది.
’పార్థసారథి ఏమి అడగబోతాడు? తాను ఏం జవాబు చెప్పాలి’ అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంది కావ్య.
పది నిముషాల తర్వాత ఇరువురు వ్యక్తులు అతని గదినుండి బయటికి వచ్చారు.
కాలింగ్ బెల్ మ్రోగింది. కానిస్టేబుల్ లోనికి వెళ్ళి కొన్ని సెకండ్లలో తిరిగి వచ్చాడు.
"మేడమ్! మిమ్మల్ని సార్ రమ్మన్నారు" వినయంగా చెప్పాడు.
కావ్య కుర్చీనుంచి లేచి పార్థసారథి గదిలోనికి ప్రవేశించింది. ద్వారం వైపే చూస్తున్న అతన్ని చూచి....
"గుడ్ ఈవెనింగ్ సార్!" అంది కావ్య.
కొన్ని క్షణాలు పరీక్షగా కావ్యను చూచాడు డి.ఐ.జి పార్థసారధి.
చిరునవ్వుతో అతని ముఖంలోనికి చూచింది కావ్య.
"కూర్చో.... కావ్యా!"
అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ "థాంక్యూ సార్!" అంది కావ్య.
ఆ చనిపోయిన వ్యక్తికి నీకు ఏమిటి సంబంధం?"
"రుద్రక్క చెప్పిందిగా సార్! వారు మా మామయ్యగారు!"
"వారు గతించి ఎంతకాలం అయ్యింది?"
"ఫైవ్ ఇయర్స్!"
"ఆ కేస్ క్లోజ్ అయిపోయింది కావ్యా!"
"తెలుసు. న్యాయం కోసం నేను రీ ఓపెన్ చేయాలని నిర్ణయించుకొన్నాను సార్!"
పరీక్షగా కావ్యను చూచాడు పార్థసారథి.
"ఇప్పుడు దాన్ని గెలికితే.... కొత్త సమస్యలు బయటికి రావచ్చు!"
"రానీండి సార్!" నిర్లక్ష్యంగా మెల్లగా చెప్పింది కావ్య.
రుద్రమ కాల్...... పార్థసారథి తన సెల్‍ను చేతికి తీసుకొన్నాడు.
"సార్! గుడ్ ఈవెనింగ్..... కావ్య వచ్చిందా"
"ఆ....ఆ..... వచ్చింది"
"సాయం చేయండి సార్!" చెప్పింది రుద్రమ.
"సరే.... సరే... నీవు పెట్టేయ్!" సెల్ కట్ చేశాడు పార్థసారథి.
"నీవు ఎవరితో ఢీ కొట్టాలనుకుంటున్నావో తెలుసా!"
"న్యాయంతో సార్!"
"ఏమిటీ?"
"న్యాయం"
"ఆ...." ఆశ్చర్యపోయాడు పార్థసారథి.
"అవును సార్!" చిరునవ్వుతో జవాబు చెప్పింది కావ్య.
"నీ మంచికోరి చెబుతున్నాను. నీ ప్రయత్నాన్ని మానుకో!" వార్నింగులా చెప్పాడూ పార్థసారథి.
"నాకు ఏది మంచో... ఏది చెడో తెలుసు సార్. ఈ ఖాకీ బట్టలు వేసుకొన్నవారు చెడును ప్రోత్సాహించకూడదు. ఏరి కాల్పిపారేయాలి. తొలిసారి ఈ బట్టలను వేసికొనేటప్పుడు నేను అలాగే ప్రమాణం చేసి వీటిని ధరించాను. సార్! నన్ను ఇంకా ఏమైనా అడగాలా సార్!" నిశితంగా పార్థసారథి ముఖంలోనికి చూచింది కావ్య.
"నీవు ఆడ కూతురువన్న మాటను మరిచి మాట్లాడుతున్నావు కావ్యా!" హెచ్చరించాడు పార్థసారథి.
"మనం వేసుకొన్న ఖాకీ బట్టలకు ఆడ మగ బేధం లేదు సార్!... పోలీస్ డ్రస్... ఆడ అయినా మగ అయినా రంగు ఒక్కటే.... కర్తవ్యం ఒక్కటే సార్!" క్షణం తర్వాత "థాంక్యూ సార్! వస్తాను" లేచి కావ్య సెల్యూట్ చేసి వేగంగా గది నుండి బయటికి నడిచింది.
పార్థసారథి.... ఆశ్చర్యంతో... వెళుతున్న కావ్యను చూచాడు.
కావ్య.... తన ఆఫీసులో తన స్థానంలో కూర్చొని కానిస్టేబుల్ వీరయ్యను పిలిచింది.
వీరయ్య వచ్చాడు. సెల్యూట్ చేశాడు.
"చెప్పండమ్మా!"
"కూర్చోండి"
ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు వీరయ్య. కావ్య ఏం చెప్పనున్నదో అని ఆమె ముఖంలోనికి సూటిగా చూచాడు.
"వీరయ్యా!"
"నెల్లూరులో మీరా అనే కౌన్సిలర్ పేరు వినియున్నావా?"
"తెలీదమ్మా!"
"అతను ఉండేది మాలప్పేటలోనట. రాత్రికి మఫ్టీలో వెళ్ళి అతని వివరాలు తెలిసికొని రావాలి. తోడుగా నీకు నమ్మకమైన వారిని తీసుకొని వెళ్ళు. పని చాలా సీక్రెట్‍గా జరగాలి. ఎవరికీ అనుమానం రాకూడదు" పరీక్షగా వీరయ్య ముఖంలోనికి చూచింది కావ్య.
"అలాగే అమ్మా!"
"పని ఈ రాత్రికే జరగాలి"
"సరే అమ్మా!"
సెల్ మ్రోగింది. అవతలివైపు ఎస్.పి రామకృష్ణ.
"గుడ్‍మార్నింగ్ సార్!"
"ఎక్కడ వున్నావు?"
"నా సీట్లో"
"వెంటనే రాగలవా?"
"అరగంటలో వస్తాన్ సార్!"
"నేను ఈ రోజు లీవు. ఇంటికి రా!"
"అలాగే సార్!"
కార్లో బయలుదేరి కావ్య అరగంటలోపల రామకృష్ణ గారి ఇంటికి చేరింది. వరండాలో వున్నవారికి విష్ చేసింది.
నవ్వుతూ ఆహ్వానించారు రామకృష్ణ.
ఇరువురూ హాల్లోకి వెళ్ళారు.
రామకృష్ణ అర్థాంగి సుమలత హాల్లోకి వచ్చింది.
"సుమా! షి ఈజ్ కావ్య"
కావ్య చేతులు జోడించి సుమకు నమస్కరించింది.
"గుర్తుపట్టాను. రండి... కూర్చోండి" అంది సుమ.
రామకృష్ణగారు కూర్చున్నారు. ఎదుటి సోఫాలో కావ్య కూర్చుంది.
"కాఫీ తెస్తాను" సుమ వంటగది వైపుకు వెళ్ళింది.
"కావ్యా!"
"చెప్పండి సార్!"
"నేను నీతో రెండు విషయాలు మాట్లాడాలని పిలిచాను"
చిరునవ్వుతో చెప్పారు రామకృష్ణ.
మీరు అడగబోయే రెండు విషయాలు నాకు తెలుసు అని ఆ నవ్వులో అర్థం.
రామకృష్ణకు కావ్య తలంపు అర్థం కాలేదు.
తన సహజ ధోరణిలో.....
"మా తమ్ముని విషయంలో ఫైనల్‍గా నీ అభిప్రాయం ఏమిటి?"
"ఏ విషయంలో సార్!" ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అడిగింది కావ్య.
"అతన్ని వివాహం చేసుకొనే విషయంలో!"
"చెప్పాను కదా సార్! నాకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని లేదని... ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు సార్!"
రామకృష్ణ అర్థాంగి సుమ ఇరువురికీ కాఫీ కప్పులు అందించి ట్రేలోని కప్పును చేతికి తీసుకొని కావ్య ప్రక్కన కూర్చుంది.
చిరునవ్వుతో కావ్య ముఖంలోనికి చూచింది.
కావ్య క్షణంసేపు ఆమె ముఖంలోనికి చూచి... దీక్షగా కాఫీ త్రాగసాగింది.
"అడిగారా అండీ" భర్తనుద్దేశించి అడిగింది సుమ.
"అడిగాను"
"కావ్యా! మా మరిది చాలా మంచివాడు" అంది సుమ.
’నా బావ కూడా ఎంతో మంచివాడు. నేనంటే ఆయనకు ప్రాణం. ఇప్పుడు ఎక్కడున్నాడో!’ అనుకొని.....
"వారికి త్వరలో తప్పకుండా తగిన అమ్మాయి దొరుకుతుంది మేడమ్!" కాఫీ కప్పును టీపాయ్ పై వుంచి చిరునవ్వుతో చెప్పింది కావ్య.
సుమ ముఖాన్ని తేలేసింది. భర్త ముఖంలోనికి చూచింది.
వారి చేతిలోని ఖాళీ కప్పును అందుకొని ట్రేలో వుంచి... ట్రేని చేతికి తీసుకొని వంటగదివైపుకు వెళ్ళింది.
"కావ్యా!.... నీ అభిప్రాయం మారదా!"
"సారీ సార్.... నో వే!"
రామకృష్ణ కొన్ని క్షణాలు కిటికీ గుండా శూన్యంలోనికి చూచాడు.
"రెండవ విషయం" అన్నాడు.
"చెప్పండి సార్!"
"ఐదేళ్ళ క్రింద ముగిసిపోయిన కేసును నీవు పునఃపరిశీలన చేయడం తగదు..."
"అంటే.... అన్యాయం.... అహంకారం.... అధర్మం.... విలయతాండవం ఆడాల్సిందేనా సార్!" రోషంతో అడిగింది కావ్య.
రామకృష్ణ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
"సార్! నేను చెప్పబోయేది నాకంటే పెద్దలైన మీకు నా మనవి. కేవలం కూడు గుడ్డ కోసం నేను ఈ ఉద్యోగాన్ని చేయడం లేదు. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టటానికే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఆ పోయిన వ్యక్తి నా పినమామగారు. వారిని దారుణంగా చంపారు. అలా చంపినవారు శిక్షార్హులు. వారిని తప్పక శిక్షించాలి. అంటే వారెవరో ఈ సమాజానికి తెలియాలి. అందుకే నా ప్రయత్నం.
మీ చెవులకు నా మాటలు తప్పుగా వినిపించి వుంటే నన్ను క్షమించండి సార్! నేను మిమ్మల్ని నొప్పించేందుకు ఆ మాటలు చెప్పలేదు. నా నిశ్చితాభిప్రాయాన్ని చెప్పాను. ఈ విషయంలో మీరు నాపై అధికారి కాబట్టి నాకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్!" అని లేచి నిలబడింది కావ్య.
యాంత్రికంగా రామకృష్ణ కూడా లేచి నిలబడ్డాడు.
"మేడమ్ గారిని పిలవండి సార్!.... వారికి చెప్పి నేను వెళతాను" అనునయంగా చెప్పింది కావ్య.
రామకృష్ణ నిట్టుర్చాడు.
"సుమా!" పిలిచాడు.
కొన్నిక్షణాల్లో సుమ హాల్లోకి వచ్చింది.
కావ్య ఆమెను సమీపించింది.
"మేడమ్! కాఫీ చాలా బాగుంది. మా సార్ చాలా మంచివారు. వారిని జాగ్రత్తగా చూచుకోండి మేడమ్!" నవ్వుతూ చేతులు జోడించింది.
"వారిని నేను చూచుకోవాల్సిన అవసరం లేదు. వారే నన్ను చూచుకొంటారు" మహా తెలివిగా మాట్లాడాననే భావనతో నవ్వింది సుమ.
"సో!.... యు ఆర్ లక్కీ మేడమ్... వెళ్ళొస్తాను... సార్ బై!!!"
వేగంగా బయటకు నడిచింది కావ్య.
ఇరువురూ వెళుతున్న కావ్యను చిత్రంగా చూస్తూ నిలుచున్నారు.
కార్లో కూర్చొని కావ్య తిరుమలరావుకు ఫోన్ చేసింది.
"హలో!...." తిరుమలరావు కంఠం.
"అన్నా! ఎక్కడున్నావు?"
"కోర్టు దగ్గర"
"నేను అక్కడికి వస్తున్నా!"
"ఎంత సేపట్లో రాగలవు?"
"పదిహేను నిముషాల్లో!"
"సరే.... రా!"
"ఓకే!...."
రామకృష్ణ దంపతులు తనతో మాట్లాడిన మాటలు వారికి తాను ఇచ్చిన సమాధానాన్ని గురించి, మీరా గురించి ఆలోచిస్తూ కారును తాలూకా కోర్టు వైపుకు నడిపింది కావ్య.
తాలూకా కోర్టులో కానుగ చెట్ల క్రింద కారును ఆపి దిగింది కావ్య.
తిరుమలరావు నవ్వుతూ ఆమెను సమీపించాడు.
"ఏంది చెల్లెమ్మా! కోర్టుకు వచ్చావు?" చిరునవ్వుతో అడిగాడు.
"నీతో మాట్లాడాలని"
"విషయం ఏమిటి?"
"కౌన్సిలర్ మీరా నీకు తెలుసా?"
"వాడు నా క్లయింట్... అన్నదమ్ముల మధ్యన భూమి తాకరాదు. వాడి తండ్రికి ఇద్దరు భార్యలు. ఆ తమ్ముడు రెండవ భార్య కొడుకు. ఆ కేసు నా దగ్గరకే వచ్చింది. వాయిదాలు జరుగుతున్నాయి."
"చిన మామయ్య గారి హత్య కేసులో వాడి హస్తమూ వుంది అన్నా!" విచారంగా చెప్పింది కావ్య.
"అలాగా!....."
"అవును... కడప నుంచి బాంబులు తెచ్చింది వాడే!.... బాంబులు వీడికి ఇచ్చిన జోగయ్య చెప్పాడు"
"వాడిప్పుడు రూలింగ్ పార్టీ కౌన్సిలర్...."
"ఐతే ఏం?.... వాడు చేసిన తప్పు ఒప్పు అవుతుందా!"
"అంతేకాదు వాడు నందాదేవికి చాలా ముఖ్యుడు"
"కాబట్టే ఆ పని చేయగలిగాడు. ఐదేళ్ళ క్రిందట ఆ సుబ్బారాయుడు ఇంట్లో అతని ముఖ్యులుగా వున్న పనివారెవరో నీకు తెలుసా!"
తిరుమలరావు సాలోచనగా "ఇద్దరుండే వారు!"
"వాళ్ల పేర్లు!"
"సాంబయ్య.... సోమయ్య్య"
"వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వున్నారు?"
"సాంబయ్య ఊర్లోనే వున్నాడు."
"సోమయ్య!"
వాళ్ళ అత్తగారి వూరు అల్లూరు. నాలుగేళ్ల క్రిందట వాళ్ళ అత్తమామలకు వేరే సంతతి లేనందున వయస్సు మీరిన వారిని చూచుకొనేందుకని అల్లూరికి షిఫ్ట్ అయిపోయాడు."
"వాడు ఎలాంటి వాడు?"
"వాడితో నాకు పరిచయం లేదు కావ్యా!"
"రేపు నీవు నాతో అల్లూరికి వస్తావా?"
"ఎందుకు?...."
"సోమయ్యను కలుసుకునేటందుకు..."
తిరుమలరావు కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచనలో వుండిపోయాడు.
"ఏం.... అన్నా!.... లాయర్ గారూ!.... భయపడుతున్నారా!" నవ్వింది కావ్య.
"భయమా!.... నాకెందుకు భయం?"
"అయితే... వెంటనే నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదు?"
"నీ మనోభావాన్ని గురించి ఆలోచించాను."
"ఏం ఆలోచించావ్!"
"ఆ కేసు విషయంలో నీవు పూర్తిగా...."
"దిగిపోయాను... ఇంతకూ... నాతో వస్తావా.... రావా?"
"వస్తాను"
"గుడ్!.... నా అన్నయ్యవని నిరూపించుకొన్నావు" అందంగా ఆనందంగా నవ్వింది కావ్య.
"నీ ప్రయత్నం ఫలించాలని కోరుకొంటున్నాను చెల్లీ!"
"థాంక్యూ.... అన్న్నయ్యా!.... రేపు ఆరుగంటలకు బయలుదేరుదాం. నేను మన ఇంటికి వస్తాను. రెడీగా వుండు."
"అలాగే"
"అన్నయ్యా!.... నేను వెళుతున్నాను" కార్లో కూర్చొని స్టార్ట్ చేసింది కావ్య.
సమయం.... రాత్రి తొమ్మిది గంటలు. వీరయ్య సత్యానందరావు ఇంటికి వచ్చాడు.
అతని రాక కోసం... ఎదురు చూస్తున్న కావ్య వీరయ్యను చూచి....
"కూర్చోండి.... అమ్మతో చెప్పి వస్తాను"
వీరయ్య తలాడించాడు.
కావ్య ఇంట్లోకి వెళ్ళి ఓ గంటలో తిరిగి వస్తానని తల్లికి చెప్పి వరండాలోనికి వచ్చింది.
వీరయ్య కావ్య వీధిలోనికి ప్రవేశించారు.
"అమ్మా! ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము?"
"సాంబయ్య గారింటికి. ఇల్లు మీకు తెలుసుగా!"
"తెలుసమ్మా!"
"మీరాను గురించి వివరాలు" కావ్య పూర్తిగా అడుగకముందే.....
"ఆ.... తెలిసికొన్నానమ్మా!" వ్వాళ్ళ తండ్రి పేరు ఖాజా. వారికి ఇద్దరు భార్యలు. మీరా మొదటి భార్య సంతతి. ఆమె చనిపోవడంతో ఖాజా మరో వివాహం చేసుకొన్నాడు. ఆమెకు ఒక కొడుకు వలీ. అన్నదమ్ములిద్దరికి వివాహాలు జరిగాయి. మీరాకు ఇద్దరు ఆడపిల్లలు. వలీకి ఇద్దరు మగపిల్లలు. తనకు మగపిల్లలు లేరని మీరా సంవత్సరం క్రిందట మరో వివాహం చేసుకొన్నాడు. ఆమె ప్రస్తుతం గర్భవతి.
వారానికి నాలుగురోజులు ఒక ఇంట్లో, మూడు రోజులు మరో ఇంట్లో వుంటాడు. మొదటి బార్య పేరు మీద కిరాణా షాపు.... రెండో భార్య పేరు మీద ప్లాస్టిక్ సామాన్ల దుకణాలు నడుపుతున్నాడు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కౌన్సిలర్ అయ్యాడు. జిల్లా ఛైర్ పర్సన్ అయిన నందాదేవికి చాలా ముఖ్యుడు. ఇవమ్మా మీరా వివరాలు" చెప్పడం ముగించాడు వీరయ్య.
"ఓకే! సాంబయ్య ఇల్లు ఎక్కడ?" అడిగింది కావ్య.
"దగ్గరకు వచ్చామమ్మా! మరో పదినిముషాల్లో చేరుతాం" అన్నాడు వీరయ్య.
తర్వాత.... ఇరువురూ మౌనంగా నడుస్తున్నారు.
వారిని క్రాస్ చేసి వేగంగా జాగ్ వార్ కారు ముందుకు వెళ్ళింది.
ఆ కారు ఆ వూరి వారిది కాదు.
"వీరయ్యా!"
"ఆ కారు ఈ వూర్లో ఎవరికుంది?"
"ఆ బండి ఈ వూరిది కాదమ్మా!"
"మరి ఏ వూరిది?"
"నాకు మాత్రం ఏం తెలుసమ్మా!"
"కనుక్కోవాలి!"
"రేపు కనుక్కొంటానమ్మా!"
"ఆ బండిలో ఒక్కడే వున్నాడూ కదూ!"
"అవునమ్మా!.... వెనుక ఎవరూ లేరు. కారు తోలే మనిషి ఒక్కడే వున్నారు."
"సుబ్బారాయుడిగారి బంధువులేమో!"
"అయ్యుండొచ్చమ్మా! ఇంతకూ ఆ కారు పేరు ఏమిటమ్మా!"
"జాగావార్"
"చాలా బాగుందమ్మా!"
"అరవై లక్షలు"
"అరవై లక్షలా!" ఆశ్చర్యపోయాడు వీరయ్య.
"దాదాపు.... ఆర్డరు చేసి తెప్పించుకోవాలి"
’పార్థసారథిగారికి సంబంధించిన మనిషి ఎవరైనా అయి వుండవచ్చునేమో!.... ఆదివారం కదా! నందాదేవి ఇక్కడ వుండి వుంటుంది. నేను తనతో చేసిన ప్రసంగాన్ని ఆమెకు తెలియజేయడానికి పార్థసారథి ఎవరినైనా పంపించి వుండవచ్చు. నందాదేవికి పార్థసారథికి మంచి స్నేహితం... అని నేను విన్న విషయమేగా!.... ఏది ఏమైనా చిన్న మామయ్య రఘునందనను దారుణంగా హింసించిన వారు... చట్టబద్ధంగా తగిన శిక్షను అనుభవించి తీరాలి... అంతవరకు నా ప్రయత్నం సాగించాలి’ అనే నిర్ణయానికి వచ్చింది కావ్య.
ఇరువురూ.... సాంబయ్య ఇంటిని సమీపించారు.
"అమ్మా!.... అదే సాంబయ్య ఇల్లు" చూపుడు వేలితో చూపించాడు వీరయ్య.
అతని ఇంటి ప్రక్కన ఒక వేపచెట్టు.... దాని చుట్టూ విశాలమైన ఎత్తు అరుగు ఉంది.
"వీరయ్యా!...."
"అమ్మా!..."
"నేను ఇక్కడే వుంటాను. మీరు వెళ్ళి సాంబయ్యను పిలుచుకొని రండి" అంటూ అరుగు మీద కూర్చుంది కావ్య.
వీరయ్య సాంబయ్య ఇంటిని సమీపించి మూసివున్న తలుపును తట్టాడు. కొన్ని సెకండ్ల తర్వాత సాంబయ్య తలుపు తెరిచాడు.
వీరయ్యను చూసి భయపడ్డాడు.
"సార్!" నోరు తెరిచాడు.
"సాంబయ్యా! భయపడకు. కావ్య అమ్మగారు వచ్చారు నీతో మాట్లాడాలట నాతోరా!" సౌమ్యంగా చెప్పాడు వీరయ్య.
సాంబయ్య దిక్కులు చూచాడు.
"చెప్పానుగా! భయపడకు నాతోరా!"
ద్వారం దాటి భయంభయంగా సాంబయ్య బయటికి వచ్చాడు తలుపు మూశాడు.
కొద్ది క్షణాల్లో ఇరువురూ అరుగును సమీపించారు.
కన్నీటితో చేతులు జోడించాడు సాంబయ్య.
"రా.... సాంబయ్యా! కూర్చో" చెప్పింది కావ్య.
"ఫర్వాలేదమ్మగోరూ!"
"నేను అడిగే ప్రశ్నకు నిజమైన సమాధానం చెప్పాలి"
"చెబుతా తల్లీ!"
"మా చినమామయ్య రఘునందరావుగారిపై బాంబు విసిరి బావిలో త్రోసింది ఎవరూ? నీవా! సోమయ్యా?"
సాంబయ్య భోరున ఏడ్చాడు.
"సాంబయ్యా! నీకు ఎలాంటి భయం అవసరం లేదు నిజాన్ని చెప్పు."
"అమ్మా! ఆ పాడుపని చేసింది ఆ సోమి గాడేనమ్మా!"
“సుబ్బారాయుడు, రాంబాబు చెప్పారు. వాడు చేశాడు. అందులో నా దోషం ఏమీ లేదన్నా" ఏడుస్తూ వంగి కావ్య పాదాలను పట్టుకొన్నాడు.
"నాకు ముగ్గురు బిడ్డలు. వారి సాక్షిగా చెబుతున్నా తల్లీ!" భోరున ఏడ్చాడు సాంబయ్య.
"సాంబయ్యా! ఈ నిజాన్ని నీవు కోర్టులో చెప్పగలవా?"
"చెబుతాను తల్లో చెబుతాను నేను చచ్చిపోయినా ఫర్వాలేదమ్మా! నిజాన్నే చెబుతాను తల్లీ!"
"సరే.... ఇక నీవు వెళ్ళవచ్చు. నేను రమ్మని కబురు పంపినప్పుడు రావాలి సరేనా?"
"అలాగే తల్లీ"
కావ్య అరుగు దిగింది.
"వీరయ్యా! పదండి" ముందుకు నడిచింది కావ్య.
వీరయ్య ఆమెను అనుసరించాడు.
సాంబయ్య మాటలను తన సెల్‍లో రికార్డు చేసిన విషయం వీరయ్యకు, సాంబయ్యకు తెలియదు.
వారు సాంబయ్య ఇంటికి వచ్చేదారిలో కనిపిమ్చిన కారు వెనుతిరిగి వారి ముందు నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ముగ్గురూ చూచారు.
"అమ్మా!" పిలిచాడు వీరయ్య.
"ఏం వీరయ్యా"
"మీరు సోమయ్యను కూడా కలవాలిగా!"
"అవును.... రేపు ఉదయం మీరు మా తిరుమల అన్నయ్య గారింటికి ఆరున్నరకు రావాలి. ఇబ్బంది లేదుగా !"
"లేదమ్మా వస్తాను"
"నా వల్ల మీకు శ్రమ"
"అమ్మా అదేంమాట.... నేను న్యాయం కోసం నా డ్యూటీని చేస్తున్నానమ్మా!"
"థాంక్యూ వీరయ్యా!"
ఇరువురూ సత్యానందరావు ఇంటిని సమీపించారు. కావ్య గుడ్‍నైట్ చెప్పి లోనికి వెళ్ళింది. వీరయ్య తన ఇంటివైపునకు నడిచాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments