top of page

కాల వాహినిలో - పార్ట్ 11

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో


'Kala Vahinilo - Part 11'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 28/09/2024

'కాల వాహినిలో - పార్ట్ 11' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. 


గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. 


ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది. 



తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య. డి.ఐ.జి పార్థసారథి, ఎస్.పి రామకృష్ణ ఆమెను వారించాలని చూస్తారు.


ఇక కాల వాహినిలో.. పార్ట్ 11 చదవండి. 


"జ్వరం ఎప్పటినుంచమ్మా!" అడిగాడు వీరయ్య.

"వేకువనుంచి"


"మందు ఏమైనా వేశారా?"


"మా అంజి.. నా కొడుకు రెండు గంటల క్రిందట ఏవో మాత్రలు తెచ్చాడు. వాటిని వేడినీళ్ళతో వేశాను" చెప్పింది సోమయ్య భార్య.


వీరయ్య కొన్ని క్షణాలు సోమయ్యను పరీక్షగా చూచాడు. 

వేగంగా బయటకు వచ్చి విషయాన్ని కావ్యకు తిరుమలరావుకు చెప్పాడు.


ఆ సమయంలో సోమయ్య భార్య తలుపు దగ్గరకు వచ్చి వారిని పరిశీలనగా చూచింది. ఆమె హృదయంలో ఏదో భయం.. కళ్ళల్లో నీళ్ళునిండాయి.


ముగ్గురూ ద్వారాన్ని సమీపించి లోనికి ప్రవేశించారు. తిరుమలరావు సోమయ్యను తాకి చూచాడు. జ్వరం.. చాలా తీవ్రంగా వుందని గ్రహించాడు.

వచ్చేదారిలో మెయిన్ రోడ్డుపైన తాను చూచిన నర్సింగ్ హోమ్ గుర్తుకు వచ్చింది. 


"వీరయ్యా! ఇతన్ని హాస్పిటల్లో చేరుద్దాం. జ్వరం తగ్గాక ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాడు."


"అలాగే సార్!"

ఉదయం తొమ్మిదిన్నరకు కావ్య.. తిరుమలరావు.. వీరయ్య కారు అల్లూరులో ప్రవేశించింది.కారు నుంచి మూడుసార్లు కిందికి దిగి వీరయ్య.. సోమయ్యను గురించి విచారించాడు. ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. కొత్త వూర్లో కాలేజి దాటిన తర్వాత ఎండ తీవ్రత వలన కావ్యకు నిమ్మకాయ సోడా తాగాలనిపించింది. రోడ్డు ప్రక్కన చూచింది. చెట్టు క్రింద సోడా బండి వుండడం గమనించి రోడ్డు ప్రక్కన కారు ఆపింది.


"అన్నా!.. దిగండి సోడా తాగుదాం.. దాహంగా ఉంది" అంది కావ్య.


ముగ్గురూ కారు దిగారు.

ఆ సోడా బండి దగ్గర పదిహేనేళ్ళ పిల్లవాడు నిమ్మకాయ సోడా కలిపిస్తున్నాడు.

ఆ సోడా బండిని ముగ్గురూ సమీపించారు.

"తమ్ముడూ! ఫుల్ నిమ్మకాయతో మూడు సోడాలివ్వు" చెప్పింది కావ్య.


"అలాగే అక్కా!" నవ్వుతూ చెప్పి గ్లాసు కడగటం ప్రారంభించాడు ఆ బాబు.


"బాబూ నీ పేరేమిటి?" అడిగాడు వీరయ్య.


"అంజిబాబండి"


"ఈ బండి నీదేనా?"


"అవునండి"


"ఈ వయస్సులో చదువుకోకుండా ఈ పని చేస్తున్నావే కారణం?" అడిగాడు తిరుమలరావు.


"అన్నా! నాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఓ అక్క, అమ్మ, తాగుబోతు నాన్నా వున్నారండి. చెల్లెలు, అక్క చదువుకొంటున్నారు. అమ్మ అయిదారిళ్ళల్లో పనిచేస్తుంది. నేను ఈ పని ఆ ఆదాయంతో మా కుటుంబం గంజి కూడు తింటున్నామండీ."


"మీ నాన్న వయస్సు ఎంత?" అడిగాడు వీరయ్య.


"దాదాపు అరవై సంవత్సరాలుండొచ్చు."


"మీది ఈ వూరేనా?" అడిగాడు తిరుమలరావు.


"కాదన్నా"


"ఏ వూరు?"


"నెల్లూరి దగ్గర గండవరం."


"మీ నాయన పేరేంటి బాబు?" నెమ్మదిగా అడిగాడు వీరయ్య.


గ్లాసులో నిమ్మకాయలు పిండి ఉప్పు వేసి సోడాలు కొట్టి పోసి ముగ్గురికి అందించాడు ఆ అబ్బాయి.


"మీ నాన్న పేరు చెప్పలేదే బాబు!" అడిగాడు వీరయ్య సోడాను సిప్ చేస్తూ.


"ఏ పేరేతై ఏమండీ ఆయన మంచోడు కాదు" విచారంగా చెప్పాడు ఆ బాబు.


"ఇంతకీ పేరేమిటీ?" అడిగాడు తిరుమలరావు.


"సోమయ్య అన్నా! పక్కా తాగుబోతు నా దృష్టిలో ఆయన లేనట్టే!" విచారంగా చెప్పాడు ఆ అబ్బాయి.


’సోమయ్య’ అన్నపేరు వినగానే ముగ్గురూ ఆశ్చర్యానందాలతో ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

వారి ముఖాల్లో సంతోషం..


గటగటా నిమ్మకాయ సోడాలను త్రాగారు. వారి చేతుల్లోని గ్లాసులను అందుకొన్నాడు ఆ బాబు.

"అంజీ! మీ ఇల్లు ఎక్కడ?" మెల్లగా అడిగాడు వీరయ్య.


"ఎందుకండీ?"


"మీ నాన్న నా స్నేహితుడు. ఇంకా తాగుతూనే వున్నాడా?" విచారంగా అడిగాడు వీరయ్య.


"మేము కావలికి వెళుతున్నాము. నేను ఓసారి మీ నాన్నను చూడాలనుకొంటున్నాను మీ ఇల్లు ఎక్కడో చెబుతావా?"


"మీరు మా నాన్న స్నేహితులా?"


"అవును బాబు ఓ సారి చూచి మాట్లాడుతాను."


"మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచోళ్ళలా వున్నారు. ఆ తాగుబోతోడితో మీకు స్నేహమా!" ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అంజిబాబు.


"వారు నీవనుకున్నంత చెడ్డవారు కాదు బాబూ!" 

అనునయంగా చెప్పాడు వీరయ్య.


"ఒకప్పుడు మంచోడేమో కానీ ఇప్పుడు మాకు నరకాన్ని చూపిస్తున్నాడు" విచారంగా చెప్పాడు అంజిబాబు.


"నేను మాట్లాడుతానుగా!"


"సరే.. మీ ఇష్టం.. ఆ ఎదుటి సందులో చివరికి వెళ్ళి ఎడం చేతివైపు సందులోకి తిరగండి. ఆ సందులో కుడివైపున చివరి పూరిల్లు మాది" అంటూ చెప్పాడు అంజిబాబు.


’అబ్బా.. యక్షప్రశ్నలు మాని చెప్పాడు’ అనుకొంది కావ్య.


తిరుమలరావు పదిరూపాయలు ఇచ్చాడు.

"సార్!.. చిల్లర లేదు"


"ఫరవాలేదు వుంచుకో. నీవు మాకు కావాల్సిన వాడివైనావు" 

నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు.


"వద్దండీ!.. ఆగండి.. ఇప్పుడే వస్తాను" అంటూ పరుగున ఓ నలభై అడుగుల దూరంలో ఉన్న చిల్లర అంగడి దగ్గరకు వెళ్ళి పదిరూపాయలు మార్చుకొని పరుగున వచ్చి ఏడు రూపాయలను తిరుమలరావుకు ఇచ్చాడు అంజిబాబు.


"వుంచుకోమన్నాను కదా!"


"వద్దు సార్! నా సోడా ఖరీదెంతో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. అది తప్పు సార్!" చిరునవ్వుతో చెప్పాడు అంజిబాబు.


’గుడ్.. అంజి.. నీవు ఒకనాటికి చాలా గొప్పవాడివౌతావు తమ్ముడూ!’ అంటూ తన పర్స్ తెరిచి ఐదువందల కాగితాన్ని అతని జేబులో కూరింది కావ్య.

"అక్క ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వకూడదు.. తీసుకోవాలి" నవ్వుతూ చెప్పింది కావ్య.


వీరయ్యా.. కావ్యా ఖాకీ దుస్తులు ధరించనందున అంజిబాబుకు వారిమీద అనుమానం రాలేదు.

అంజిబాబు వినయంగా వారికి నమస్కరించాడు.


ముగ్గురూ కారెక్కి ఆ సందులో ప్రవేశించారు. పదినిమిషాల్లో అంజిబాబు ఇంటిని సమీపించారు. ముగ్గురూ కారు దిగారు.


"అమ్మా! మీరు ఇక్కడే వుండండి. నేను వెళ్ళి సోమయ్య వున్నాడో.. లేడో.. చూచి వస్తాను" వీరయ్య ఆ ఇంటివైపునకు నడిచాడు.


అతను ఇంటిని సమీపించేసరికి తలుపు తెరుచుకొని సోమయ్య భార్య బయటికి వచ్చింది. ఆమెను చూచిన వీరయ్య..

"అమ్మా!.. సోమయ్య వున్నాడా!"


"మీరెవరు సార్!"


"నేను ఆయన స్నేహితుణ్ణి"


"ఆయనకు ఒళ్ళు బాగాలేదు. పడుకొన్నాడు"


"నేను రెండు నిముషాలు అతనితో మాట్లాడాలి."


"మీ పేరు?"


"వీరయ్య"


"రండి"


ఆమె వెనుదిరిగి ఇంట్లోకి ప్రవేశించింది.

వీరయ్య ఆమెను అనుసరించాడు.


నులకమంచంలో సోమయ్య పడుకుని కళ్ళు మూసుకొని వున్నాడు.

వీరయ్య తన చేతితో అతన్ని తాకి చూచాడు. ఒళ్ళు ఎంతో వేడీగా ఉంది.


’జ్వరం చాలా తీవ్రంగా వున్నట్లుంది’ అనుకొన్నాడు.

"కావ్యా నీవేమంటావ్?"


"హాస్పిటల్లో చేర్పిద్దాం అన్నయ్యా!" సోమయ్య భార్య వైపు తిరిగి..

"అమ్మా! మీవారి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడే వుంచుకొంటే మీరు ఇబ్బంది పడతారు. దగ్గరలోనే హాస్పిటల్ ఉంది. అక్కడ చేరుస్తాము.. మీ అబ్బాయి అంజి చాలా మంచివాడు" అనునయంగా చెప్పింది కావ్య.


"ఇంతకూ మీరు ఎవరు సార్?" గద్గద స్వరంతో అడిగింది సోమయ్య భార్య శోభ.


"చెప్పానుగా అమ్మా! నేను సోమయ్య స్నేహితుడనని. ముందు హాస్పిటల్‍లో చేరుద్దాం పదండి!"


వీరయ్య తిరుమలరావు సోమయ్య చేతులను తమ భుజాలపై వేసుకొని కారుదాకా తీసుకొని వచ్చి వెనుక సీట్లో కూర్చోపెట్టారు. ఒకవైపు అతని భార్య.. మరోవైపు వీరయ్య కూర్చున్నారు. తిరుమలరావు కావ్య ముందు కూర్చున్నారు.

కావ్య కారును స్టార్ట్ చేసింది. పది నిముషాల్లో కారు క్లినిక్ దగ్గరకు చేరింది.

సోమయ్యను అడ్మిట్ చేశారు. డాక్టరు అతన్ని పరీక్షించాడు. రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుందని అంతవరకు హాస్పిటల్లోనే వుండాలని చెప్పాడు.

ఆ డాక్టర్ పేరు విజయభాస్కర్.


ప్రాథమిక ట్రీట్‍మెంట్ అయిన తర్వాత అతన్ని బెడ్‍పైకి చేర్చారు. సోమయ్య భార్య భోరున ఏడుస్తూ ఉంది.

ఆమెను చూచి వీరయ్య..

"అమ్మా! మీవారిని గురించి మీరు ఏమీ భయపడవద్దు. హాస్పిటల్లో చేర్చాముగా. డాక్టర్లు.. నర్సులు వాణ్ణి జాగ్రత్తగా చూచుకొంటారు. నీవు ఏమీ డబ్బు కట్టవలసిన అవసరం లేదు. అంతా నేను చూచుకొంటాను. నీవు ధైర్యంగా అతని పక్కన ఉండు. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను" ఎంతో అభిమానంతో చెప్పాడు వీరయ్య.


అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ఈలోగా కావ్య తిరుమలరావు అంజిబాబు వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్పారు. "మీ అమ్మ ఆనందం కోసం నీవు మీ నాన్నను జాగ్రత్తగా చూచుకోవాలి" అని చెప్పి ఐదువేలు అతని చేతికి ఇచ్చారు. అంజిబాబు ఆశ్చర్యపోయాడు. హాస్పిటల్‍కి వచ్చి సోమయ్యకు ట్రీట్‌మెంటు చేసిన డాక్టరును కలిశారు. 


"సార్! సోమయ్యను వెంటనే డిశ్చార్జి చేయకండి. రెండురోజుల తర్వాత మేము వస్తాము. అతని స్థితిని మాకు ఫోనులో చెప్పండి. మేము రోజుకు రెండుసార్లు మీకు ఫోను చేస్తాము. అతనితో మాకు చాలా ముఖ్యమైన పనిఉంది. జాగ్రత్తగా చూడండి." ఎంతో వినయంగా చెప్పాడు తిరుమలరావు.


వారి అభ్యర్థన తీరుకు సంతోషించిన డాక్టర్ ’అలాగే సార్’ అన్నాడు. కావ్య సోమయ్య భార్య చేతిలో వెయ్యి రూపాయలు ఉంచింది. ఆమె వారికి చేతులెత్తి దణ్ణం పెట్టింది.

ముగ్గురూ నెల్లూరికి బయలుదేరారు.


"ఆ.. కావ్య, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను. బహుశా ఈ విషయం నీకు తెలిసే వుంటుందనుకొంటున్నా!"


"ఏమిటన్నా.. విషయం!"


"ఈ జిల్లాకు కొత్త కలెక్టరు గారు రాబోతున్నారు. వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. మా బాస్ నాకు చెప్పారు. పేరు చందాసింగ్. మీ బాస్ రామకృష్ణ నీకు చెప్పలేదా!"


"తెలిసివున్నా చెప్పడు" నవ్వింది కావ్య.


"కారణం?"


"వారి రెండు ప్రపోజల్స్. నేను కాదన్నానుగా"


"మొదటిది నీ మ్యారేజి.. రెండవది?"


"ఈ కేసు విచారణ చిన్నమామయ్యగారి హత్యా కేసు విషయంలో నేను చేసే ఈ ప్రయత్నాలు వారికి, వారి పై అధికారి డి.ఐ.జి పార్థసారథికి ఇష్టం లేదు. కానీ నా ప్రయత్నాన్ని నేను మానను. ఇద్దరికీ ఆ మాటే చెప్పాను. ఆ కారణంగా నేనంటే వారికి ఇష్టం లేదు" చిరునవ్వుతో చెప్పింది కావ్య.


"అసలు విషయమేమిటంటే వారు ఈ ప్రాంతానికి వచ్చి రెండు మూడు వారాలైందట. ఇంకా ఛార్జి తీసుకోలేదు. రేపుశివరాత్రి నాడు జాయిన్ కాబోతున్నారట. ఒంటరిగా రాత్రి సమయంలో ఈ మూడు వారాలు అన్ని పల్లెలను తిరిగి చూచారట. 


చైనాలో కరోనా అనే వైరస్ పుట్టి, చైనా అంతటా ప్రబలుతున్నదట. రానున్న రోజులు ఎంతో భయంకరంగా మారేలా అనిపిస్తూ వుంది. ఎల్లుండి కొత్త సంవత్సరం 2020 ఎలా ఉండబోతుందో!" విచారంగా చెప్పాడు తిరుమలరావు.


"అవును.. న్యూ ఇయర్ 2020 అన్నా! నీ చేతిలో.. నా చేతిలో ఏదో లేదు. అంతా దైవ నిర్ణయం. మనం శాంతి కాముకులం.. దేశానికి ప్రపంచానికి రానున్న కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకోవడం మన ధర్మం, కర్తవ్యం. ఏం వీరయ్యా" నవ్వింది కావ్య.


"అవును తల్లీ! మీరు చెప్పింది అక్షరాలా నిజం" నవ్వుతూ అన్నాడు వీరయ్య.

కారును తిరుమల ఇంటిముందు ఆపింది కావ్య. తిరుమల దిగాడు బై చెప్పాడు.

నవ్వుతూ చేతిని వూపి కావ్య కారును కదిలించింది.

క్రొత్త సంత్సరం 2020 ప్రారంభం అయింది. జనవరి 26వ తేదీన మన దేశ గణతంత్ర దినోత్సవం. దీనినే రిపబ్లిక్ డే గా వ్యవహరిస్తున్నాం. మన తెలుగు సంప్రదాయం ప్రకారం వికారి నామ సంవత్సరం మాఘ.. శుద్ధ విదియ.. ధనిష్ఠా నక్షత్రం, ఆదివారం.


ప్రాథమిక సెకండరీ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు, పిల్లలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం పాడి స్వాతంత్ర్య సంపాదనకు ప్రాణాలర్పించిన నాయకులను స్మరించుకొంటూ ఆనందంగా గడిపారు. గవర్నమెంటు ముఖ్య కార్యాలయాల్లో మన రాజధాని ఢిల్లీలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్య నగరాల్లో తొమ్మిది యూనియన్ టెరిటరీస్‍లో పాలక పెద్దలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనాలను అర్పించారు. కొత్త సంవత్సరం దేశానికి అన్ని విధాలా ఆనంద దాయకం కావాలని ఆ భగవంతుని కోరుకున్నారు.


ప్రతి మానవునికి ఆశ ఉంటుంది. సాధించాలనే సంకల్పం ఉంటుంది. ఆశ అనేది అందరికీ ఒకటే. సంకల్పాలు వేరు వేరుగా రెండు విధాలు. ధర్మం న్యాయం, నీతి, నిజాయితీ ఇది మొదటిది. స్వార్థం, ద్వేషం, మోసం అవినీతి ఇది రెండవది. దేశ ప్రజానీకానికి కష్టాలను, నష్టాలను కలిగించేవి ఈ రెండవ తత్వవాదుల చర్యల వల్లనే.

చైనా, పాకిస్తాన్ మనకు వ్యతిరేకులు. వారిరువురు ఒకటి. రెండవ తత్వ వారసులు చైనాలో అతిపెద్ద నగరం వూహాన్.. కరోనా వైరస్ అక్కడే తలఎత్తి దేశంలో వ్యాపించింది. కానీ ఆ విషయాన్ని వారు బయటి ప్రపంచానికి తెలియచేయకుండా మౌనంగా ఉండిపోయారు. స్వార్థం.. ద్వేషం.. ఒకనాటికి తప్పక దహిస్తాయి అనే సత్యం చైనీయుల విషయంలో నిజమై ఆ వైరస్ దేశ వ్యాప్తమై ప్రపంచ వ్యాప్తంగా క్రమ్ముకొంటూ ఉంది.


తిరుమల యోగి హైస్కూల్లో జాతీయ జెండాకు వందనం చేసి ఇంటికి వచ్చి ఆఫీసు గదిలో కూర్చొని వున్నారు. ఎదురుగా రామయోగి కూర్చొని కేసు కట్టను పరిశీలిస్తూ వున్నాడు. తన ముందున్న కట్టను చూచి..

"ఒరేయ్ యోగి! దీన్ని ఎందుకురా ముందు వుంచావు?" అడిగాడు తిరుమల.


"రేపు వాయిదా కదా.. మీరా వస్తానన్నాడు" చెప్పాడు యోగి.


"ఓహో!.. అలాగా!.. వాడు రాగానే నీవు ఇంటిదాకా వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపో"


"అర్థం అయింది అలాగే!" నవ్వాడు రామయోగి.


ఐదు నిముషాల తర్వాత మీరా వచ్చాడు.

"నమస్కారం సార్!" అన్నాడు.


"ఆ..ఆ.. రా మీరా! కూర్చో" చెప్పాడు తిరుమలరావు.


"అన్నా! కట్ట నీముందు ఉంది. అన్ని కాగితాలు అందులోనే వున్నాయి. నేను ఇంటిదాకా వెళ్ళి ఓ అరగంటలో వస్తా" కుర్చీలోంచి లేచాడు రామయోగి.


"సరే!" కాగితాలను పరిశీలిస్తూ చెప్పాడు తిరుమల.


రామయోగి బయటకు వెళ్ళిపోయాడు.

"సార్! రేపు మన వాయిదా కదూ!"


"అవును సాక్ష్యాన్ని పట్టావా?"


"నాయాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే భయపడి చస్తుండార్ సార్!"


"నేను ఏర్పాటు చేయనా!"


"సార్! అంతకన్నానా సార్! వాడికి పదో పరకో పడేస్తా.. వూరికే వద్దులే" 


"మీరా!.."


"నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ నిజాన్ని చెప్పాలి"


"చెప్తాను సార్! అడగండి"


"మాట మార్చవు కదా!"


"అమ్మతోడు సార్! నిజాన్నే చెబుతా!"


"నీకు కడపలో వుండే బాంబుల వ్యాపారి జోగయ్య తెలుసా!"


"సార్!" ఆశ్చర్యపోయాడు మీరా.


"జోగయ్యా! తెలుసా?" సూటిగా మీరా ముఖంలోనికి చూస్తూ అడిగాడు తిరుమలరావు.


మీరా ముఖం కళావిహీనం అయింది. తలదించుకొన్నాడు.

"నీవు చెప్పే విషయాలు మన ఇరువురి మధ్యనే వుండబోతాయి. కాబట్టి నిజం చెప్పు మీరా!"


"సార్! వాడు నాకు ఐదేళ్ళ క్రిందట పరిచయం!" మెల్లగా చెప్పాడు మీరా.


"ఏ రీతిగా!.."


"రాంబాబుకు వాడి దగ్గరనుంచి ఐదు బాంబులు తెచ్చి ఇచ్చాను" దీనంగా చూచాడు తిరుమల ముఖంలోనికి.


"ఓకే! నీవు దేనికీ భయపడకు. నీ కేసుకు కావాల్సిన సాక్ష్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నిన్ను గెలిపిస్తాను. రేపు ఏడున్నరకు కోర్టుకు రా!"


"సార్!.. మనం గెలుస్తామంటారా!"


"తప్పకుండా గెలుపు న్యాయం పక్కనే ఉంటుంది. ఇక నీవు వెళ్ళవచ్చు."


"నేను మిమ్మల్నే నమ్ముకొన్నాను సార్!" దీనంగా చెప్పాడు మీరా!"


"మీరా! నీవు నమ్మవలసింది నన్ను కాదు న్యాయాన్ని" చిరునవ్వుతో చెప్పాడు తిరుమలరావు.


మీరా కుర్చీలోనుంచి లేచి తిరుమలరావుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.


అంతవరకూ హాల్లో అన్నమ్మతో మాట్లాదుతున్న రామయోగి లోనికి వచ్చాడు.

"అన్నా పని!"


"ముగిసింది సెల్‍లో రికార్డు చేశాను."


"వెరీగుడ్ అన్నా!" ఆనందంగా చెప్పాడు యోగి. 


కావ్య వాళ్ళు సోమయ్యను అల్లూరు నర్సింగ్ హోమ్‍లో చేర్చి నాలుగురోజులు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం క్లినిక్‍కు ఫోన్ చేసి అతని కండీషన్‍ను కనుక్కొనేది కావ్య. సోమయ్యతో భార్య కొడుకు.. వీరయ్య, కావ్య తిరుమలరావులను గురించి వారు చేసిన సాయాన్ని గురించి చెప్పారు. చావబోయి బ్రతికిన సోమయ్య వారిని తలచుకొని చేతులు జోడించాడు.

ఐదవరోజు వీరయ్య కావ్య, తిరుమలరావులు అల్లూరికి వెళ్ళి సోమయ్యను హాస్పిటల్లో కలిశారు. అతన్ని డిశ్చార్జి చేశారు. సోమయ్యను ఇంటికి చేర్చారు.


వీరయ్య, కావ్యను తిరుమలరావును, సోమయ్యకు ఎవరన్నదీ వివరంగా చెప్పి పరిచయం చేశాడు.


సుబ్బారాయుడు మూలంగా తాను రఘునందన విషయంలో చేసిన తప్పును తలచుకొని భోరున ఏడ్చాడు. ’ఆ పాపాన్ని చేసింది నేనే’ అనే నిజాన్ని ఒప్పుకొన్నాడు సోమయ్య.

కావ్య, తిరుమలరావు, వీరయ్యలు నెల్లూరికి తిరిగి వచ్చారు. ఒక సి.డిలో జోగయ్య వాంగ్మూలాన్ని మీరా మాటలను సోమయ్య చెప్పిన నిజాన్ని క్రమంగా రికార్డు చేశారు కావ్య, తిరుమలరావు.


జోగయ్య, మీరా, సోమయ్య సంభాషణలను రికార్డు చేసిన సి.డి ని తీసుకొని యస్.పి రామకృష్ణ గారి ఇంటికి అపాయింట్‍మెంట్ తీసుకొని వెళ్ళింది కావ్య.


అతని ఆఫీస్ గదిలోని కంప్యూటర్‍లో సి.డి.ని ఉంచి ఆన్ చేసింది.


జోగయ్య, మీరా, సోమయ్యల స్టేట్‍మెంట్స్ ను విని రామకృష్ణ ఆశ్చర్యపోయాడు.


కావ్యను అభినందించాడు.

కావ్య ఆనందంతో చేతులు జోడించి.. "అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదబలం సార్! ఉద్యోగంలో వున్నంతవరకూ సత్యానికి, ధర్మానికి, నీతికి, న్యాయానికి కట్టుబడే పనిచేస్తాను" ఆనందంగా చెప్పింది కావ్య.


"కావ్యా! జిల్లాకు కొత్త కలెక్టరు చందాసింగ్ జీ రేపు రాబోతున్నారు" రాబోయే కొత్త కలెక్టరు గురించి చెప్పాడు రామకృష్ణ. ఆశ్చర్యంతో ఆమె పెదవులు అప్రయత్నంగా ’చందాసింగ్’ పేరును పలికాయి.


"రేపు ఉదయం వారు ఆరుగంటలకు మీ వూరి శివాలయాన్ని దర్శిస్తారట. తర్వాత కొండ బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి వచ్చి ఆఫీసులో ప్రవేశిస్తారట. సో యు ఆర్ ఆన్ డ్యూటీ విత్ హిమ్ ఐ టూ" చెప్పాడు రామకృష్ణ.


"ఓకే సార్! తలాడించింది కావ్య.

 రెండు క్షణాల తర్వాత..

"సార్!.. వారు సిక్స్.. యు నో?"


"యస్.. చందాసింగ్ నీకెందుకా సందేహం?" నవ్వాడు రామకృష్ణ.


క్షణం తర్వాత "ఆ కావ్యా! వారు చిన్న వయస్సులో ఈ ప్రాంతంలో వున్నారట. అందుకే ఆ ఆలయాలను చూడాలన్నారట" చెప్పాడు రామకృష్ణ.

కావ్య మనస్సులో ఏదో కలవరం. ’ఆ వచ్చే కలెక్టరు తన బావ చంద్రశేఖరరావు అయ్యుంటే ఎంతో.. ఎంతో.. బాగుంటుందిగా మరుక్షణంలోనే పేరు ’సింగ్’ అతను నా బావ ఎలా కాగలడు? ప్రశ్న మనస్సు వికలం చిరుచెమటలు పట్టాయి కావ్యకు.


ఆమె ముఖ భంగిమలను చూచిన రామకృష్ణ "కావ్యా! ఏం నీ ముఖ భంగిమ మారింది. ఆరుగంటలకు ఎలా రాగలనా అనా! చూడమ్మా! మన ఉద్యోగంలో కొన్ని సమయాల్లో నో రాత్రి.. నో పగలు.. డ్యూటీ ఈజ్ డ్యూటీ తప్పదు" నవ్వాడు ఎస్.పి రామకృష్ణ.


"నో.. నో.. సార్! అలాంటిదేమీ లేదు సార్. ఐ లవ్ మై డ్యూటీ! బిఫోర్ ఫోర్ ఐ విల్ బి హియర్ సర్!.. ఇక నే వెళతాను. నేను మీకు వినిపించిన సి.డిని మామయ్యగారికి వినిపించి వారు ఎలా చేయమంటే అలా చేస్తాను. ఆ విషయంలో వారిదే తుదినిర్ణయం. మీకు ఎందుకు వినిపించానంటే మీలాంటి గొప్పవారు యదార్థాన్ని తెలుసుకోవాలి. అందుకని మీకు వినిపించాను. వస్తాను సార్!" సెల్యూట్ చేసి కావ్య వేగంగా రామకృష్ట గదినుండి బయటికి వచ్చి కార్లో కూర్చొని తిరుమలరావుకి ఫోన్ చేసి రేపు డ్యూటీలో చేరబోతున్న క్రొత్త కలెక్టరు గారిని గురించి చెప్పింది.


ఆమె మాటలు విన్న తిరుమలరావు మనస్సున కావ్యకు కలిగిన భావనే.. ’ఆ చందాసింగ్ నా బావ చంద్రశేఖర్ రావు అయితే.. ఎంతో బాగుంటుందని’ అలా జరగాలని సర్వేశ్వరుని కోరుకున్నాడు తిరుమలరావు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


24 views0 comments

Comments


bottom of page