#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika
'Kala Vahinilo - Part 12' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 03/10/2024
'కాల వాహినిలో - పార్ట్ 12' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు.
ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది.
తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య. డి.ఐ.జి పార్థసారథి, ఎస్.పి రామకృష్ణ ఆమెను వారించాలని చూస్తారు. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.
ఇక కాల వాహినిలో.. పార్ట్ 12 చదవండి.
ఆ రోజు మహాశివరాత్రి... ఫిబ్రవరి 21వ తేది శుక్రవారం... కావ్య మూడుగంటలకు లేచి తయారయింది. తల్లి తండ్రి మామయ్య అత్తయ్యలకు చెప్పి కారులో నాలుగున్నర గంటల లోపలే యస్.పి రామకృష్ణ ఆఫీసుకు చేరింది.
ఆమె అక్కడికి వెళ్ళిన పది నిముషాల్లో రామకృష్ణ వచ్చారు. ఇరువురూ బయలుదేరి డి.ఐ.జి పార్థసారథి గారి ఆఫీసునకు ఐదుగంటలు కల్లా వెళ్ళి అందరూ కలిసి ఐదు నలభై కల్లా కలెక్టర్ బంగళాకు చేరారు. ఐదు ఏభైకి కలెక్టర్ చందాసింగ్‍జి తెల్లని లాల్చీ, ధోవతి కట్టు పంచతో వరండాలోని వచ్చారు. వారి వెనుకాలే కలెక్టర్ పి.ఏ విక్రమ్ ఉన్నారు. వచ్చిన వారందరూ దూరాన్ని పాటించి మాస్కులు కట్టుకొని నిలబడి వున్నారు. పోలీస్ ఆఫీసర్లందరూ ఠీవీగా నిలబడి కలెక్టరు గారికి సెల్యూట్ చేశారు. అందరినీ పరికించి చూచాడు చందాసింగ్ జీ చిరునవ్వుతో....
జిల్లా పరిషత్ చైర్మన్ నందాదేవి హడావుడిగా వచ్చి వరండా ముందు ప్రక్కగా నిలబడి కలెక్టరు గారికి విష్ చేసింది. వారి పి.ఏ విక్రమ్ వరండా ముందున్న నాలుగు మెట్లలో రెండు మెట్లు దిగి... కలెక్టరు గారి ముఖంలోనికి చూచాడు.
విక్రమ్ చూపులోని అర్థాన్ని గ్రహించిన చందాసింగ్ "యా....." అంటూ వేగంగా మెట్లు దిగాడు.
తెల్లని దేహచ్ఛాయ, మల్లెలను మైమరపించే తెల్లని వస్త్రధారణ, నల్లని ఉంగరాల జుట్టు, చిరుగడ్డం, కోరమీసాలు, విశాలమైన ఫాలభాగం కనుబొమ్మల మధ్యన విభూతి, దాని మధ్యన కుంకుమ దేవలోకాన్నించి భువికి దిగివచ్చిన దేవతామూర్తిలా చందాసింగ్ గోచరించాడు అందరికి. నందాదేవిని సమీపించారు విక్రమ్ ప్రక్కన చందాసింగ్.
"సార్! మీరు జిలాపరిషత్తు ఛైర్‍పర్సన్ నందాదేవిగారు" చెప్పాడు విక్రమ్.
"నందాదేవి!" ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆమెను చందాసింగ్ నఖశిఖ పర్యంతం కొన్నిక్షణాలు పరీక్షగా చూచాడు.
"యస్ సార్! నందాదేవి జిలా పరిషత్ ఛైర్ పర్సన్" చిరునవ్వుతో జవాబు చెప్పింది నందాదేవి.
"ఓ....!" చిరునవ్వుతో తలాడించి ముందుకు నడిచాడు కలెక్టరు చందాసింగ్‍జీ.
విక్రమ్... తర్వాత డిప్యూటీ ఛైర్ పర్సన్‍ని హోదాల వారీగా నిలబడి వున్న పోలీస్ ఆఫీసర్స్ ని పబ్లిక్ హెల్త్ ఆర్. డబ్ల్యూ. యస్. సి. ఇ ఎస్. ఇ, ఇ. లను ఇతర డిపార్టుమెంట్స్ ఆఫీసర్సు పేరుపేరునా పరిచయం చేశారు. కరచాలనం చేయబోయిన కొందరికి చిరునవ్వుతో నమస్కరించారు. వారు తొట్రుపాటుతో చేతులు జోడించారు.
అందరినీ కలిసి వేగంగా వరండాలోనికి వచ్చి వారినందరినీ ఉద్దేశించి....
"డియర్ ఆఫీసర్స్...! నౌ ఐయామ్ గోయింగ్ ఆన్ మై పర్సనల్ వర్క్... ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అటెండ్ యువర్ డ్యూటీస్. ఐ డోంట్ వాంట్ ఎనీ సెక్యూరిటీ థాంక్యూ ఆల్" అంటూ ఠీవీగా చెప్పాడు. మెట్లు దిగి కారును సమీపించాడు. డ్రైవరు డోర్‍ను తెరిచాడు. వెనుక సీట్లో కూర్చున్నాడు.
ముందు సీట్లో కూర్చోబోయిన విక్రమ్‍ను చూచి...
"విక్రమ్! యు ప్లీజ్ సిట్ బ్యాక్" కారునుండి వేగంగా దిగాడు చందాసింగ్.
క్షణంసేపు ఆశ్చర్యపోయిన విక్రమ్
"యస్ సార్!" వెనుక డోర్ ప్రక్కకు వచ్చాడు.
కలెక్టర్ చందాసింగ్ ముందు సీట్లో కూర్చున్నాడు. విక్రమ్... డ్రైవరు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. డ్రైవరు కారును స్టార్ట్ చేశాడు.
అక్కడ వున్నవారంతా చందాసింగ్‍ను ఆశ్చర్యంగా చూశారు.
కావ్య చిత్తరువులా నిలబడి జరుగుతున్నదాన్ని చూస్తూ వుండిపోయింది.
తనను దాటి వెళ్ళిన చందాసింగ్ వెనుతిరిగి ఆమెను ఒక్కక్షణం చూచి ముందుకు సాగిన విషయాన్ని కావ్య గమనించింది. మనస్సున ఏదో మధురభావన.
తనతో ఎవరూ రావద్దన్న కలెక్టరు గారి మాటతో ఆమె వూహించినవన్నీ గాలిమేడలైపోయాయి. అతనికి సెక్యూరిటీగా తాను వెళితే అతన్ని దగ్గరగా చేరి పరిశీలించాలనుకొంది. కాని దానికి ఆస్కారం లేకుండా చేశాడు కలెక్టర్ చందాసింగ్.
అందరూ వారి వారి వాహనాల్లో వారి వారి కార్యాలయాలకు కొందరు గొప్పవారు నిలయాలకు వెళ్ళిపోయారు. కావ్య తన బాస్ రామకృష్టతో చెప్పి తన స్టేషన్‍కు వెళ్ళిపోయింది. తన స్థానంలో కూర్చుంది. ఆమె మనస్సు నిండా కలెక్టర్ చందాసింగ్ కదలికలు, ఠీవిగ పలికిన పలుకులు, ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులు వెదజల్లే ఆ ముఖారవిందం హృదయాంతరాళాల్లో ఏదో బాధ. ఏదో ఆశ....
’ఇతనిలాగే ఒకనాడు నా బావ వస్తాడు. నా బావ వస్తాడు’ అనుకొంది కావ్య.
కలెక్టరు గారి కారు శివాలయం ముందు ఆగింది. చందాసింగ్ దిగాడు. నాలుగు దిక్కులను పరిశీలనగా చూచాడు. ఏదో ఆలోచనలతో నిలబడిపోయాడు. వారినే పరీక్షగా చూస్తున్న విక్రమ్....
"సార్! షల్ ఉయ్ గో ఇన్ సైడ్?" ఎంతో వినయంగా అడిగాడు.
తొట్రుపాటుతో చందాసింగ్ విక్రమ్ ముఖంలోనికి చూచాడు.
"యస్!" ఆలయం వైపునకు నడిచాడు.
ముందు విక్రమ్...
అర్చకులకు వారిని గురించి చెప్పాడు విక్రమ్.
వారు నమస్కరించి స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రవేశించాడు చందాసింగ్. అర్చకులు స్వామివారికి సహస్రనామార్చన చేసి హారతి ఇచ్చారు. హారతి కళ్ళకు అద్దుకుని పర్స్ తెరిచి వెయ్యిరూపాయలను కానుకగా పళ్ళెంలో వుంచాడు.
చేతులు జోడించాడు. కళ్ళు మూసుకొన్నాడు. శ్రీ కాశీ విశ్వనాధాష్టక పఠనం ప్రారంభించాడు.
శ్రీ కాశీ విశ్వనాధాష్టకం :-
గంగాతరంత రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం,
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాధమ్||1
వామగోచర మనేక గుణస్వరూపం
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠమ్,
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీపుపతిం భజ విశ్వనాధమ్||2
భూతాధిపం, భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్,
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాధమ్||3
శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచభాణమ్,
నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం,
వారాణసీపురపతిం భజ విశ్వనాధమ్ || 4
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానామ్,
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 5
తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయమ్
ఆనందకంద మపరాజిత మప్రమేయమ్,
నాగత్మకం సకల నిష్కల మాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్||6
రాగాది దోషరహితం, స్వజనానురాగం
వైరాగ్యశాంతి నిలయం, గిరిజా సహాయమ్,
మాధుర్య థైర్య సుభగం, గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్||7
ఆశాం విహాయ పరిహృత్య పరస్యన్ నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమౌథౌ,
ఆదాయ హృత్‍కమల మధ్యగతం వరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్8
వారాణనీపురపతేః స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టకమిదం పఠతే మనుష్యఃఅ
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేహనిలయే లభతేచ మోక్షమ్||
విశ్వనాధాష్టకమిదం, యఃపఠేత్ శివసన్నిధౌ|
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్.....
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహకాళం ఓంకారం అమరేశ్వరమ్
వైద్యనాథం చితాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం
సేతు బంధేచ రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే
కేదారం హిమావత్ వృష్ఠే ఘృశ్మేశం శివాలయే
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్ధాయ యఃపఠేత్
సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్||
సర్వేజనాఃస్సుఖినో భవంతు.... లోకాస్సమస్తాః సుఖినో భవన్తుః"
ఆ సర్వేశ్వర స్తోత్రం చేసిన అనంతరం... లింగ వామభాగం నుంచి సాష్టాంగ నమస్కారం చేశాడు చందాసింగ్.
సుస్వరంతో వారు పఠించిన శ్రీ విశ్వనాథాష్టకాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని విన్న అర్చకులు ఆశ్చర్యపోయారు.
తీర్థప్రసాదాలను ఇచ్చి రుద్రపాదాలను తలపైనుంచి వారిని ఆశీర్వదించారు.
ప్రక్కనే వుండి అంతా వీక్షిస్తున్న విక్రమ్ వారి ప్రతిభను దైవభక్తిని చూచి మురిసిపోయాడు.
అదే సమయానికి సత్యానందరావు వారి సతీమణి సావిత్రి... నరేంద్ర అతని అర్థాంగి జానకి ఆలయంలో ప్రవేశించారు. వారిని చందాసింగ్ కొన్ని క్షణాలు పరీక్షగా చూచారు.
ప్రధాన అర్చకులు సత్యానందరావు గారి ప్రక్కకు చేరి "కొత్తగా మన ప్రాంతానికి వచ్చిన కలెక్టరు గారు" మెల్లగా చెప్పారు.
ఆ నలుగురూ చందాసింగ్‍ను కొన్ని క్షణాలు తదేకంగా ఆశ్చర్యంలో చూచారు.
అర్చకులు చందాసింగ్‍ను సమీపించి "ఈ గ్రామ పెద్దలు ఎంతో కీర్తి ప్రతిష్టలున్న కుటుంబం సార్!" ఎంతో వినయంగా నెమ్మదిగా చెప్పారు.
చందాసింగ్ వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నలుగురి పాదాలను తాకాడు.
"ఆశీర్వాద్ కీజీయే!" మెల్లగా చిరునవ్వుతో అన్నాడు.
అవధులు లేని ఆశ్చర్యంలో మునిగిపోయారు. వారు తమ కుడిచేతిని పైకెత్తి "దీర్ఘాయుష్మాన్ భవ!.... ఇష్టకామ్యాది సిద్ధిరస్తు!!" అంటూ చందాసింగ్‍ను మనసారా ఆశీర్వదించారు.
చందాసింగ్ లేచి చేతులు జోడించి వారికి నమస్కరించి వేగంగా ఆలయం నుండి బయటకు నడిచాడు. విక్రమ్ వారిననుసరించాడు. "సార్! కొండ బిట్రగుంట జానాహై సాబ్!" అడిగాడు.
"యస్" అన్నాడు చందాసింగ్.
ఈసారి చందాసింగ్ కారు వెనుక సీట్లో కూర్చున్నాడు. విక్రమ్ ముందు సీట్లో కూర్చున్నాడు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.
ఆలయం నుండి సత్యానందరావు సతీమణి సావిత్రి.... సోదరి జానకి వారి భర్త నరేంద్ర బయటికి వచ్చారు.
సావిత్రి భర్తగారి ముఖంలోనికి చూచింది. వారి వదనంలో విచారం... కారణం తెలిసిన సావిత్రి వారిని ఏమీ అడగకుండా మౌనంగా నడిచింది.
చెల్లెలు జానకి "అన్నయ్యా! ఈ కలెక్టర్ చాలా మంచివారుగా వున్నారు. అంతేకాదు వారిలో మన చందూ పోలికలు చాలా వున్నాయి కదా అన్నయ్యా" ప్రీతిగా అడిగింది.
అవునన్నట్టు తలాడించి....
"చెల్లీ! మనుషులను పోలిన మనుషులు వుంటారమ్మా!" మెల్లగా చెప్పాడు సత్యానందరావు చందాసింగ్ ఆలోచనలతో....
నలుగురూ...మౌనంగా తమ నిలయం వైపునకు నడిచారు.
నలభై నిముషాల్లో కారు కొండబిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆగింది.
మెట్లెక్కి కొండపైని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారు చందాసింగ్, విక్రమ్‍లు.
ఆ కలియుగ వరదుని దర్శించి, తీర్థప్రసాదాలు తీసుకొని నెల్లూరికి బయలుదేరారు. పదిన్నరకు చందాసింగ్ నిలయంలో కారు పోర్టికోలో కారు ఆగింది.
వేగంగా దిగి లోనికి వెళ్ళి పది నిముషాల్లో డ్రస్ మార్చుకొని వచ్చి కార్లో కూర్చున్నాడు చందాసింగ్.
శివాలయాన్ని వదలి తర్వాత ఇంతవరకు ఒక్కమాట విక్రమ్‍తో మాట్లాడలేదు చందాసింగ్.
అతని వదనం ఎంతో గంభీరంగా గోచరించింది విక్రమ్‍కు.
’మనస్సున దేన్ని గురించో బాధ పడుతున్నట్టున్నారు సార్’ అనుకొన్నాడు విక్రమ్.
కారు ఆఫీస్ ఆవరణంలో ప్రవేశించింది. ముందు విక్రమ్, వెనుక చందాసింగ్ నడిచి కలెక్టర్ గదిని సమీపించారు.
ద్వారం ముందు ఆగి విక్రమ్....
"సార్!.... దిసీజ్ యువర్ ఆఫీస్ రూమ్" వినయంతో చెప్పి తలుపును తెరిచాడు.
"థాంక్యూ విక్రమ్!" చిరునవ్వుతో చెప్పి లోనికి ప్రవేశించాడు కలెక్టర్ చందాసింగ్. తన సీట్లో కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.
ఎదురుగా ఎంతో వినయంగా నిలబడి కలెక్టర్ గారు ఏమి చెప్పబోతారో అని వారి ముఖాన్నే చూస్తున్నాడు విక్రమ్. కొన్ని క్షణాల తర్వాత తొట్రుపాటుతోకళ్ళు తెరిచి....
"ఓ.... సారీ విక్రమ్! ప్లీజ్ సిట్" అన్నాడు.
విక్రమ్ చిరునవ్వుతో కూర్చున్నాడు.
ఫోన్ మ్రోగింది చెవి దగ్గరకు చేర్చాడు.
’గుడ్ మార్నింగ్ సార్!’
అవతలి వ్యక్తి కరోనాను గురించి చెప్పసాగారు. వారి ఉపోద్ఘాతం మూడు నిమిషాల్లో ముగిసింది. వారు సి.ఎం గారు.
"ఓకే సార్! బై..." చందాసింగ్ ఫోను టేబుల్‍పై వుంచాడు.
"ఓ సర్క్యూలర్ తయారు చేయండి విక్రమ్. రేపు ఉదయం పదిన్నరకు అన్ని డిపార్టుమెంట్సు హెడ్స్ కు మీటింగ్. ఆ మీటింగ్‍కు అందరూ హాజరు కావాలి. అజండా ’కరోనా... తీసుకోవలసిన జాగ్రత్తలు’ సరేనా!"
"ఓకే సార్!"
"ప్లీజ్ రిలీజ్ ది సర్క్యూలర్"
"ఓకే సార్!" విక్రమ్ లేచి తన స్థానానికి వెళ్ళాడు.
సెల్ మ్రోగింది. చేతికి తీసుకొన్నాడు చందాసింగ్.
"పాపాజీ నమస్తే జాయిన్ కియాహూ! సబ్ కుచ్ అఛ్ఛాహై... ఆప్ ఆయేగేం... బహూత్ కుష్ కీ బాత్ హై... ఆయియే... ఆయియే... దాదాజీ ఆయియే!" ఆనందంతో చెప్పాడు చందాసింగ్.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Opmerkingen