#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika
'Kala Vahinilo - Part 13' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 08/10/2024
'కాల వాహినిలో - పార్ట్ 13' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు.
ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది.
తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.
కరోనా గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తన పీఏతో చెబుతాడు చందాసింగ్.
ఇక కాల వాహినిలో.. పార్ట్ 13 చదవండి.
జిల్లాలోని అన్ని డిపార్టుమెంట్స్ సీనియర్ అధికారులు జిలా పరిషత్తు ఛైర్ పర్సన్ నందాదేవిగారు కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ హాల్లో ఆశీనులై ఉన్నారు. నిర్ణీత కాలం టెన్‍థర్టీకి కలెక్టర్ చందాసింగ్ హాల్లో ప్రవేశించి తన స్థానంలో నిలబడి చేతులు జోడించి....
"అందరికీ నా నమస్సుమాంజలి" చిరునవ్వుతో చెప్పాడు.
అక్కడ ఆశీనులై యున్న ముఫ్ఫైమంది బెదిరిపోయి ఆశ్చర్యంతో లేచి నిలుచున్నారు. యాంత్రికంగా చేతులు జోడించారు. ప్రక్కనే నిలబడివున్న వారి పి.ఏ విక్రమ్ ఆశ్చర్యపోయాడు.
"మీరంతా నా సంబోధనకు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడినే. మనం మన కమ్మటి తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం."
"కరోనా చైనాలో 2019 నవంబరు... డిశంబరు ప్రాంతాల్లో వారు తినే క్రిమికీటక ఆహారపు అలవాట్ల వల్ల ప్రారంభం అయ్యింది. చైనాలోని వూహాన్ సెంట్రల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అల్‍ఫెన్ యాభై సంవత్సరముల స్త్రీమూర్తి ఆధ్వర్యంలోనే డిసెంబరు 30 న డాక్టర్ వివెన్ వియాంగ్ మొదటి కరోనా వైరస్ రోగులకు వైద్యం చేశారట. ఆ డాక్టర్ గారిని చైనా ఫిబ్రవరి 7వ తేదీన అంతం చేశారట. ఆ తర్వాత చైనీయ అధికారులు, పాలకులు వూహాన్ హాస్పిటల్‍లోని రికార్డులను అన్నింటినీ తగులబెట్టారట. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అయిన ఆల్‍ఫెన్‍ని ఆ ఘోర నిజాన్ని ఆమె బయట పెడుతుందేమో అనే భయంతో ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా వుండాలనే ఉద్దేశ్యంతో... డాక్టర్ ఆల్‍ఫన్‍ను మాయం చేశారట. ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం విలపిస్తున్నారట.
వ్యక్తులను చంపగలవు, వారి సామర్థ్యమును మరుగు చేయగలం, కనపడని వైరస్ వ్యాప్తిని అరికట్టలేం. ఆ వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాల వైపు వ్యాపించిండి. త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరూ కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ ఎదుటివారికి చెప్పవలసిన సమయం ఇది. కాని చైనా అలాంటి పని చేయలేదు. రోగానికి కులం లేదు, మతం లేదు. అది ఎవరికైనా ఆపాదించవచ్చు. మన మేలుకోరి మంచి మాటలను చెప్పే వారిని గౌరవించి నియమాలను అతిక్రమించకుండా వర్తించడం నేడు అందరి కర్తవ్యం కావాలి. మాస్కులు ధరించాలి, గుంపులు గుంపులుగా జనం గుమికూడరాదు.
ముఖ్యంగా దైవ నమ్మిక.... నీకు నచ్చిన విధానంలో ఆ సర్వేశ్వర స్మరణ... ఆరాధన ప్రతి ఒక్కరూ నిత్యం చేయాలి. ఇది సనాతన అధ్వైత ధార్మిక మహా ఋషుల భూమి భారతావని. వారు గొప్ప తపస్సంపన్నులు. మహనీయులు... దైవ సాక్షాత్కారాన్ని పొందినవారు. వారికి వారసులం మనం.....
భూమి గోళాకారంగా వున్నదని మొదట చెప్పినవారు - మన ఆర్యభట్టు
భూమికి గురుత్వాకర్షణ శక్తి వుందని కనిపెట్టినది - మన భాస్కరాచార్య
ప్రపంచంలోనే మొదటగా శస్త్ర చికిత్స చేసినవాడు - మన సుశ్రుతుడు
మొట్టమొదట విద్యుత్తు కనిపెట్టినవాడు - మన అగస్త్యుడు
విమానయాన శాస్త్రాన్ని రచించినవాడు - మన భరద్వాజమహర్షి
భూకంపాలను ముందుగా వూహించినది - మన వరాహమిహురుడు
గణిత, భౌతిక, ఖనిజ శాస్త్రాలను, ఎన్ సైక్లోపీడియా
గురించి వ్రాసినది - మన వాల్మీకి
రసాయనిక శాస్త్రమును అందించినది - మన నాగార్జునుడు
కాస్మోలజీని గురించి తెలియజేసినది - మన కపిలుడు
అణువులు గురించి వివరించినది - మన కణాదుడు
డి.ఎన్.ఎ గురించి తెలిపినది - మన బోధిధర్మ
మేఘ శాస్త్రాన్ని వివరించినది - మన అత్రి మహర్షి
మొట్టమొదటిసారి ప్రత్తినుండి వస్త్రాలను తయారు చేసినది - మన ఉత్సమధుడు
సంగీతాన్ని (సరిగమప) ప్రపంచానికి అందించినది - మన స్వాతిముని
వీరందరూ మహా తపోధనులు, మహోన్నత కీర్తి శేషులు, మహాఋషులు, మనకందరికీ పూజనీయులు. హైందవులు. ఈ మన భారతావనిలో అంతటి అద్వితీయమైన చరిత్రకారులు జన్మించారు. వారి ప్రజ్ఞాపాటవాలను లిపి మూలంగా మనకు మిగిల్చి దైవసన్నిధికి చేరారు. అనాదిగా ఈ భారతం... అంతటి మహోన్నతమైనది మనదేశం. ఈ భారతదేశం... హైందవజాతి గొప్పతనాన్ని జన్మవిలువలను తెలుసుకొని అందరూ కలిసి మెలసి ప్రేమ సౌభ్రాతృత్వాలతో నడుచుకోవడం నేడు మన అందరి కర్తవ్యం. ఆ తత్వం సమాజశాంతికి దేశశాంతికి యావత్ ప్రపంచ శాంతికి కారణం అవుతుంది.
ప్రతి వ్యక్తి కష్టకాలంలోనే గతించిన తన ఆత్మీయులు, మిత్రులు, దైవం గుర్తుకువస్తారు. పై మహనీయులను గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే.... వారి ఆ అంతిమ విజయాలకు నియమం... నిష్ట, సహనం, కట్టుబాటు, దైవ ఆరాధన ఈ ఐదు గుణాలు వాటి ఆచరణే కారణం. ఈ కరోనా విపత్కర సమయంలో మనమంతా ఏకమై పై పంచవిధులను నిర్వర్తిస్తే ఆ మహమ్మారి మనలను ఆపాదించకుండా వుండగలం. ఇది ఒక వ్యక్తికి, ఒక జాతికి, ఒక మతానికి సంబంధించి పక్షపాతంగా వ్యవహరించేది కాదు. కారణం దానికి జాతి కులం లేదు. మీరు... మీ...మీ ఇతర సభ్యులందరికీ ఈ సందేశాన్ని తెలియజేయండి. అందరూ తాము జాగ్రత్తగా విధులను పాటిస్తూ ఎదుటి వారిని కూడా ఆ మార్గాన్నే అనుసరించేలా చూడవలసిన బాధ్యత మనందరిది. సహనంతో నా ప్రసంగాన్ని విన్న మీకందరికీ నా ధన్యవాదములు. సర్వే జనాః సుఖినోభవస్తు" లేచి చేతులు జోడించి బయటికి నడిచారు చందాసింగ్. అందరూ అతని వాగ్దాటికి ఆశ్చర్యపోయారు. పిఏ విక్రమ్ వారిని అనుసరించాడు.
హాలునుండి అందరూ బయటికి నడిచారు.
చందాసింగ్ తన గదిలో ప్రవేశించి కూర్చున్నాడు.
"విక్రమ్!" పిలిచాడు చందాసింగ్.
"సార్!"
"నాకు ఇరువురి ఫోన్ నెంబర్స్ కావాలి"
"ఎవరెవరివి సార్!"
"నందాదేవి... ఎ.ఎస్.పి కావ్య"
"ఫైవ్ మినిట్స్ లో చెపుతాను సార్!" గది నుంచి బయటకు నడిచాడు విక్రమ్.
చందాసింగ్ కళ్ళముందు శివాలయంలో తాను చూచిన ఇరువురు దంపతులు నిలిచారు.
’అమ్మా... నాన్న... అత్తయ్యా మామయ్యలు మరి బాబాయ్ వారితో రాలేదే!’
వారిని చూడగానే తనలో కలిగిన ఆవేశాన్ని, ఆవేదనను అణుచుకొని వారికి పాదాభివండనం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకొని బయటకు నడిచాడు.
’అమ్మా నాన్నలను పలకరించివుంటే నో.... నో... ఆ సమయంలో ఆ పని చేయకూడదు. వారు అమ్మా..... నాన్నా నన్ను గుర్తుపట్టరా! పన్నెండేళ్ళ తర్వాత చూచారు. ఇరువురికి వయస్సు మీరింది. వృద్ధాప్యం ఆవరించింది. గుర్తుపట్టలేకపోయి వుండవచ్చు. సంవత్సరాల తరబడి తన హృదయంలో వారిపై తనకున్న ప్రేమ అభిమానాలను నోరువిప్పి వారికి తెలియజేయాలి. త్వరలో వారిని కలవాలి. అమ్మ ఒడిలో వాలి తనివితీరా ఏడవాలి. నాన్నను అక్కున చేర్చుకొని ఆనందిందాలి’ కళ్ళు మూసుకొని ఆలోచనా స్రవంతిలో వున్న చందాసింగ్…
"సార్!" విక్రమ్ పిలుపుతో తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు. అతను కళ్ళు ఎర్రగా వుండటం విక్రమ్ గమనించాడు.
"సార్! నందాదేవి గారి నెంబర్ 9777787777 ఎ.ఎస్.పి కావ్య గారి నెంబరు 9600086000"
చిన్న కాగితాన్ని చందాసింగ్‍కు అందించాడు విక్రమ్. వారి ముఖంలోనికి పరీక్షగా చూస్తూ....
’ఏదో విషయానికి సార్ బాధపడుతున్నట్లుగా వుంది’ అనుకొన్నాడు విక్రమ్.
"విక్రమ్ ప్లీజ్ సిట్"
విక్రమ్ కూర్చొని చందాసింగ్ ముఖంలోనికి చూచాడు.
"విక్రమ్! నందాదేవి భర్తగారు ఏం చేస్తుంటారు?" అడిగాడు చందాసింగ్.
"సార్!.... వారికి భర్తలేరు. రెండుసార్లు వివాహం జరిగిందట. ఇరువురూ గతించారు."
"ఓహో...." తలాడించాడు చందాసింగ్.
"సార్!"
"ఏమిటి?"
"నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా సార్?"
"అడగండి"
"మీరు మా తెలుగు భాషను ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్"
చందాసింగ్ నవ్వాడు
"విక్రమ్! నేను తెలుగువాడినే"
"సార్!" ఆశ్చర్యపోయాడు విక్రమ్.
"అవును"
"మరి మీపేరు?"
"నన్ను చేరదీసి అభిమానించి.... చదివించి... ఇంతటి వాణ్ణి చేసిన నన్ను తమ కళ్ళతో కన్న నా తల్లిదండ్రులు ఆ రేపటి మీటింగ్‍ను గురించి అందరికి మెసేజ్ పంపారా?"
"పంపాను సార్!"
’తన తల్లిదండ్రులను గురించి చెప్పడం ఇష్టం లేదు కాబోలు టాపిక్‍ను మార్చారు సార్’ అనుకొన్నాడు విక్రమ్.
చందాసింగ్ టైమ్ చూచుకొన్నాడు కుర్చీనుంచి లేచాడు.
"భోజనానికి వెళ్ళి వస్తాను" ఆ గదినుండి బయటికి నడిచాడు.
వారి వెనకాలే కారు పోర్టికో వరకూ వచ్చి వారు కార్లో కూర్చున్న తర్వాత.... కారు కదలగానే ఆఫీసులోనికి వెళ్ళిపోయాడు విక్రమ్.
చందాసింగ్ కారుకు కావ్య కారు ఎదురైంది. వ్యతిరేక దశలో వెళుతూ ఉంది కావ్య. చందాసింగ్ కార్లో వున్న కావ్యను గమనించాడు. సెల్ తీసి ఫోన్ చేశాడు.
రింగ్ అయిన సెల్‍ను చేతికి తీసుకొంది కావ్య.
"హలో!" అంది.
"హలో!...." మెల్లగా అన్నాడు చందాసింగ్.
"ఎవరండీ?"
"కనిపెట్టండి"
’వీడెవడు? పేరు చెప్పకుండానే నన్ను కనిపెట్టమంటున్నాడు’ అనుకొంది కావ్య.
"హలో!" అంది.
"యస్!.... హలో!.. కలెక్టర్ స్పీకింగ్!"
ఆ మాటను వినగానే కావ్య బెదిరిపోయింది.
"సార్!.... సార్!...." అప్రయత్నంగా అనేసింది.
"ప్లీజ్ కమ్ టు మై బంగళా!"
"సార్!" ఆశ్చర్యంతో అడిగింది కావ్య.
"యస్! నౌ.... నౌ...." కలెక్టర్ సెల్ కట్ చేశాడు.
కావ్య బెదిరిపోయింది. భయాందోళనలతో కారును వెనక్కు తిప్పింది. మనస్సున ఎన్నో ప్రశ్నలు. ’కలెక్టరు గారు నన్ను ఎందుకు పిలిచినట్లు? వారేదన్నా ఆదేశాలు ఇవ్వాలంటే నాపై అధికారులకు కదా ఇవ్వాలి? నన్ను వారు చూచింది ఈ ఉదయమేగా! ఆ సమయంలో నాతో ఏమీ మాట్లాడలేదుగా? మరి ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలని పిలిచారు?"
పరిపరివిధాల పై ఆలోచనలతో కావ్య కలెక్టర్ బంగళా ఆవరణంలో ప్రవేశించింది. కారును పార్కింగ్ స్థలంలో వుంచి కారు దిగింది. కర్చీఫ్‍తో ముఖాన పట్టిన చెమటను తుడుచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని పోర్టికోలో వున్న స్టెప్స్ ఎక్కి వరందాలోనికి ప్రవేశించింది.
ముఖద్వారం మూసివుంది. ఎడంచేతివైపు గోడకు వున్న కాలింగ్ బెల్‍ను చూచింది కావ్య. మెల్లగా స్విచ్‍ని నొక్కింది. ఐదు సెకండ్ల తరువాత తలుపు తెరుచుకొని వంట మనిషి కావ్యను చూచాడు.
"సార్ రమ్మన్నారు వున్నారా" మెల్లగా భయంతో అడిగింది.
"ఆ... వున్నారండి... మీపేరు?"
"కావ్య..."
"సార్‍కి చెప్పి వస్తాను" తలుపు దగ్గరికి నెట్టి అతను లోనికి వెళ్ళాడు.
కావ్య గుటకలు మింగుతూ ధైర్యాన్ని కూడగట్టుకుంది. ’నేనేం తప్పుచేశాను. నేను ఎందుకు భయపడాలి? ఎందుకు పిలిచాడో ఏమో! ఏదడిగినా జవాబు తెలిసుంటే చెబుతాను. తెలియకపోతే ’తెలీదు సార్ అంటాను’ అంటూ ఆలోచనలో పడింది.
వంట మనిషి తెలుపు తెరిచి....
"సార్! మిమ్మల్ని రమ్మన్నారు"
కావ్య మెల్లగా లోనికి ప్రవేశించింది.
అతను తలుపు మూశాడు. లోనికి వెళ్ళిపోతూ....
"కూర్చోండి సార్ వస్తారు" అని చెప్పి లోనికి నడిచాడు.
కావ్య తలాడించి ఆ హాలు నాలుగువైపులా పరీక్షగా చూచింది.
నాలుగు సోఫాలు ఎదురెదురుగా అమర్చి వున్నాయి.
మధ్యన దీర్ఘచతురస్రాకారపు టీపాయ్.... హాలు నాలుగుమూలలా స్టాండ్.... ఫ్లవర్ వాజులు నీట్‍గా అమర్చి వున్నాయి. కుడివైపు గోడకు రెండు కిటికీలు మధ్యన టేబుల్, దానిముందు రెండు కుర్చీలు క్రమంగా వున్నాయి.
చందాసింగ్ దక్షిణపు వైపున వున్న గది నుండి బయటికి వచ్చాడు.
అయోమయావస్థలో నిలబడి వున్న కావ్య అతన్ని చూసి సెల్యూట్ చేసి....
"గుడ్ మార్నింగ్ సార్!"
"ఈజిట్ గుడ్ మార్నింగ్! సే గుడ్ ఆఫ్టర్ నూన్ పిల్లా!" నవ్వుతూ అన్నాడు చందాసింగ్ కావ్యను పరీక్షగా చూస్తూ....
"ప్లీజ్ సిట్" సోఫాలో కూర్చుంటూ చెప్పాడు చందాసింగ్.
అతను అన్న ’పిల్లా’ పదం కావ్య హౄదయంలో సంచలనాన్ని సృష్టించింది.
’పిల్లా!.... పిల్లా!’ ఆ పదాన్ని మరలా అప్రయత్నంగా ఆమె పెదాలు పలికాయి.
"కవీ! ప్లీజ్ సిట్!" చిరునవ్వుతో ఆమె ముఖంలోనికి చూస్తూ చెప్పాడు చందాసింగ్.
తొట్రుపాటుతో సోఫాలో కూర్చుని ఓరకంట ఆశ్చర్యంగా అతని ముఖంలోనికి చూచింది కావ్య.
"ఎంతగా ఎదిగిపోయావ్" కావ్య ముఖంలోనికి సూటిగా చూస్తూ గలగలా నవ్వాడు చందాసింగ్.
వంచిన తలను మెల్లగా ఎత్తి అతని ముఖంలోనికి చూచింది కావ్య.
చందాసింగ్ లేచివచ్చి ఆమె కూర్చున్న సోఫాలో ప్రక్కన కూర్చున్నాడు.
వంచి వున్న ఆమె ముఖంలోనికి వంగి చూస్తూ....
"చిన్నీ!..."
ఆ పిలుపు వినగానే వెంటనే ఆశ్చర్యంతో తల పైకెత్తి అతని ముఖంలోనికి చూచింది కావ్య.
"నేను మీ బావను చిన్నీ" ప్రీతిగా ఆమె కళ్ళల్లోనికి చూస్తూ చెప్పాడు చందాసింగ్.
కావ్య గట్టిగా కళ్ళు మూసుకొంది.
’ఇది కలా! నిజమా!’ అనుకొంది మనసులో.
"చిన్నీ! కళ్ళు తెరువు మాట్లాడు"
కావ్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో కన్నీరు...
కంఠం బొంగురుపోయింది.
"బా...వా...బా...వా...!" గద్గద స్వరంతో పారవశ్యంతో పలికింది.
కళ్ళనిండా వున్న కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.
"ఇది నిజమేనా బావా!"
"నిజం చిన్నీ నేను నీ బావను నిజం" నవ్వుతూ చెప్పాడు చందాసింగ్.
కావ్య కన్నీటిని తనపైని టవల్‍తో తుడిచాడు.
"మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. పద... భోజనం చేద్దాం" కావ్య కుడిచేతిని తన ఎడంచేతిలోనికి తీసుకొన్నాడు. మంత్రముగ్దగా కావ్య అతని ముఖంలోనికి చూస్తూలేచింది. ఇరువురూ డైనింగ్ హాల్లోకి వచ్చారు.
వంటమనిషి పాండు అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద క్రమంగా అమర్చి వుంచాడు.
ఇరువురు ప్రక్కప్రక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పాండు వారి ముందు పింగాణీ ప్లేట్లను ఉంచి వడ్డించాడు.
ఆనందంతో కావ్యకు మాటలు కరువయ్యాయి. ఇది కలా!... నిజమా!... అనే సందేహంతోనే చందాసింగ్ ముఖంలోనికి ఆశ్చర్యంతో చూచింది.
"ఏయ్.... మరదలు పిల్లా..... ఇది వాస్తవం... సందేహాన్ని వదలి కడుపునిండా తిను" చిరునవ్వుతో చెప్పాడు చందాసింగ్.
"నాకు ఆకలిగా లేదు బావా!.... మీరు ’నేను నీ బావను’ అని చెప్పినప్పుడే నా కడుపు నిండిపోయింది’ ఆనందంగా చెప్పింది. అప్పుడు ఆమె కళ్ళనుంచి కన్నీరు...
"చిన్నీ! ఎందుకు...."
చందాసింగ్ పూర్తిచేయకముందే "బావా! ఇవి కన్నీరు కావు ఆనందభాష్పాలు" తన తలను అతని భుజానికి ఆనించి చెప్పింది కావ్య.
"అమ్మా! మీరు తినకపోతే అయ్యగారు తినరు. తినండమ్మా" ప్రీతిగా చెప్పాడు పాండు.
"చిన్నీ! పాండు అన్న నా దగ్గర ఎనిమిది సంవత్సరాలుగా వుంటున్నాడు. నా కథ... అభిరుచులు.... అన్నీ ఆయనకు తెలుసు. నీవు నాకు ఏమౌతావో... అది కూడా తెలుసు" నవ్వుతూ చెప్పాడు చందాసింగ్.
కావ్య తినడం ప్రారంభించింది. పాండు ఇరువురికి ఎంతో ప్రీతిగా వడ్డించాడు భోజనం ముగిసింది.
కావ్య చందాసింగ్ హాల్లోకి వచ్చి సోఫాలో ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. కొన్ని క్షణాలు కావ్య చందాసింగ్ ముఖంలోనికి సూటిగా చూచింది. ఆమె మనస్సున అతని గురించి ఎన్నో ప్రశ్నలు. తదేకంగా తననే చూస్తున్న కావ్య చేతిని తన చేతిలోనికి తీసుకొని....
"చిన్నీ! ఇప్పుడు నీవు ఏమనుకొంటున్నావో చెప్పనా"
"చెప్పండి"
"ఈయనకు చందాసింగ్ అనే పేరు ఎలా వచ్చిందని కదూ"
"అవును బావా"
"అదో పెద్ద కథ. సాయంత్రం రా. ఆ..... చిన్నీ తిరుమల ఎలా వున్నాడు?"
"ఆయనకేం లాయర్ అయినాడు. మంచి పేరు ప్రతిష్టలతో వున్నాడు మా అన్నయ్య!"
"అన్నయ్యా!" క్షణం తర్వాత "ఆ....ఆ..... అంతేగామరి వాడికి ఫోన్ చెయ్యి"
కావ్య తిరుమలరావుకు ఫోన్ చేసింది. నవ్వుతూ విషయాన్ని చెప్పింది. తిరుమలరావు ఆనందానికి హద్దులు లేవు. ఉబ్బితబ్బిబ్బై పోయాడు.
"చెల్లీ!.... ఫోన్ బావకు ఇవ్వు."
కావ్య ఫోన్ చందాసింగ్‍కు అందించింది.
"బావా!" ఆత్రంగా అరిచాడు తిరుమలరావు.
"అవునురా! తిరుమలా ఎలా వున్నావ్?"
"నేను బాగున్నాను బావా! మీరూ...."
"చెప్పిందిగా నీ చెల్లి నా గురించి. సాయంత్రం ఇరువురూ రండి. మనం కలిసి చాలా విషయాలు మాట్లాడుకోవాలి అమ్మా నాన్నలు ఎలా వున్నారు?"
"అమ్మ బాగుంది నాన్న వెళ్ళిపోయారు"
"ఓహో! సాయంత్రం కలుద్దాం సరేనా!"
"తప్పకుండా బావా!"
చందాసింగ్ సెల్ కట్ చేశాడు.
"చిన్నీ! ఈ రోజు శివాలయంలో నేను అమ్మా నాన్నలను, అత్తయ్యా మామయ్యలను చూచాను. వారి ఆశీర్వాదాన్ని తీసుకొన్నాను."
"వారితో రాఘునందన బాబాయ్ రాలేదేం?" ఆత్రంగా అడిగాడు చందాసింగ్.
కావ్య ముఖంలో విచారం.
"కావ్యా! ఎందుకు బాధపడుతున్నావ్?"
"ఆ కిరాతకులు సుబ్బారాయుడు రాంబాబు నందాదేవి చిన్నమామయ్యను చంపేశారు."
"ఆ....."
"ఎప్పుడు?"
"ఐదేళ్ళ క్రిందట"
చందాసింగ్ తలను ప్రక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకొన్నాడు.
అతని పెదవులు ’బాబాయ్!... బాబాయ్’ అనే అక్షరాలను పలికాయి. కళ్ళల్లో కన్నీరు....
కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.
"బావా! నీవు వ్రాసిన లేఖ ప్రకారం నేను ఐ.పి.యస్ చేసి పోలీస్ ఆఫీసరయ్యాను. చిన్న మామయ్యగారి పాత కేసు ఫైల్‍ను తీసుకొని చదివి విచారణ ప్రారంభించాను. నేరస్థుల వాంగ్మూలాన్ని రికార్డు చేశాను. మీరూ మామయ్యా సరేనంటే వారినందరినీ అరెస్టు చేసి జైలుపాలు చేస్తాను" ఎంతో ఆవేశంతో చెప్పింది కావ్య.
"కవీ! ఆవేశపడకు. నేను నాపై పడ్డ నేరాన్ని.... నేను ఆ నేరం చేయలేదని నిరూపించుకొనేదానికి పదవి, డబ్బు అవసరమని వెళ్ళాను. గడిచిన పన్నెండు సంవత్సరాల్లో నేను కోరినవాటిని సంపాదించాను. ఆ సాధనలో ఆ మార్గంలో నాకు తెలిసిన నిజం... పగ.... ప్రతీకారం..... పతనానికి దారి అని.... ప్రేమ అభిమానం ఆనందానికి నిలయమని గ్రహించాను. అంతా దైవ నిర్ణయం. నాకు ఇప్పుడు ఆ కుటుంబంపై ఎలాంటి ద్వేషం పగ లేదు. కవీ! నీకూ వుండకూడదు. నాలుగు వారాలుగా మఫ్టీలో పగలు రాత్రి జిల్లాలోని అన్ని గ్రామాలు తిరిగాను. వారి వారి అవసరాలను తెలుసుకొన్నాను. అందరి సమస్యలను క్రమంగా తీర్చాలనేది నా ఉద్దేశ్యం. సాయంత్రం కలుద్దాం పద" అన్నాడు చందాసింగ్.
ఇరువురు చిరునవ్వులతో హాల్లో నుంచి బయటికి నడిచారు. ’నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లండి’ అంటూ మనసారా దీవించాడు పాండు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
コメント