#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika
'Kala Vahinilo - Part 17' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 30/10/2024
'కాల వాహినిలో - పార్ట్ 17' తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు.
ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.
తిరుమల, కావ్యలకు తానే చందూనన్న విషయం చెబుతాడు చందా సింగ్. తిరుమల, దివ్యల వివాహం గురించి నందాదేవితో మాట్లాడుతాడు.
కలెక్టర్ ఆఫీసులో కోవిడ్ గురించి తన ఉపన్యాసం ప్రారంభిస్తాడు. అందరూ అతన్ని అభినందిస్తారు.
ఇక కాల వాహినిలో.. పార్ట్ 17 చదవండి.
విక్రమ్ చిరునవ్వుతో చందాసింగ్‍ను సమీపించి చేతులు జోడించాడు. "సార్! మీకు సాటి మీరే సార్!" అన్నాడు.
చందాసింగ్ ఆప్యాయంగా అతని భుజంపై చేయివేసి నవ్వాడు.
కావ్య వచ్చి వాకిట నిలబడింది.
ఆమెను చూచిన విక్రమ్ "సార్! మేడమ్... కావ్యగారు!"
"కాదు"
"ఆ...." అని నోరు తెరిచాడు విక్రమ్.
"మై ఉడ్‍బీ!" నవ్వుతూ కావ్యను సమీపించాడు చందాసింగ్.
చిరునవ్వుతో స్వాగతం పలికింది కావ్య.
"ఎంతసేపైంది వచ్చి?"
"బావగారు మంచి జోష్‍లో వున్నప్పుడే వచ్చాను" ఓరకంట చందాసింగ్ ముఖంలోనికి చూస్తూ నవ్వింది కావ్య.
తెల్లని ఆమె పలువరుస మల్లెలై మెరిశాయి.
ప్రీతిగా ఆమె కుడిచేతిని తన ఎడమ చేతిలోనికి నవ్వుతూ తీసుకొన్నాడు చందాసింగ్.
నాలుగు కళ్ళు కలిశాయి.... ఏదో కమ్మని ఊసులు....
చెట్టుమీది కోయిల ’కుహూ.... కుహూ’ అంటూ కమ్మటి నాదం...
ఇరువురూ నవ్వుతూ ఆవైపు చూశారు.
"కోకిల గానం" అంది కావ్య కళ్ళు ఎగరేస్తూ....
"మధురం.... మధురం... మనోహరం" చిరునవ్వుతో చందు జవాబు.
డ్రైవర్ కారు వెనుక డోర్ తెరిచాడు.
అతన్ని చూచిన ఇరువురూ....
వేగంగా నడిచి కార్లో కూర్చున్నారు.
డ్రైవర్... "సార్! ఎక్కడికి వెళ్ళాలి?"
"బంగళాకి" కలెక్టరు జవాబు.
కావ్య మాస్క్ అందించింది చంద్రానికి.
నవ్వుతూ తీసుకొని తగిలించుకొని....
"థాంక్యూ డియర్!"
ఆనందంగా అందంగా నవ్వింది కావ్య.
క్షణం తర్వాత "బావా! నేను మీకు ఓ విషయం చెప్పాలి"
"చెప్పు చిన్నీ!"
"మహా శివరాత్రికి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేటప్పుడు చిన్న మామయ్యగారి గదిలోని లాఫ్‍ట్ పైన చిమ్మినప్పుడు ఓ డైరీ క్రింద పడింది. ఒక పేజీ తెరుచుకొంది. ఇతరుల డైరీని సెల్‍ను మన చేతికి తీసుకొని చూడటం అసభ్యత అన్న విషయం నాకు తెలుసు
‘నందు నన్ను ప్రేమించినా... నేను’ అనే అక్షరాలను అప్రయత్నంగా చూచాను. అనుమానంతో ఆ మూడు లైన్లు చదివాను. సెల్‍లో ఫోటో తీశాను. ఒక్కసారి చూడండి బావా!"
కావ్య తన సెల్‍ను ఆన్ చేసి చందాసింగ్‍కు చూపించింది.
’నందూ నన్ను ప్రేమించినా నేను తనను ప్రేమించలేను. కారణం రెండు కుటుంబాల మధ్యన ఎంతోకాలంగా వున్న వైరభావం. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండిపోవడంలో నాకు ఆనందం’
చదివి విచారంగా చందాసింగ్ నిట్టూర్చాడు.
"బావా! ఆ తర్వాత ఆ డైరీని లాఫ్‍ట్ పైనే పెట్టాను. ఈ విషయాన్ని ఇంతవరకూ ఎవరికి చెప్పలేదు. వ్రాతను చూపించలేదు. నాకు అర్థం అయ్యింది చిన్నమామయ్య వివాహం చేసుకోకుండా వుండిపోయిన దానికి కారణం నందాదేవి"
తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పి చంద్రం ముఖంలోనికి చూచింది కావ్య.
"నీమాటా నిజమే! బాబాయి కేసును నీవు చాలా గొప్పగా పరిశీలించావు. సాక్ష్యాలు సేకరించావు. ఆ సి.డి విని నందాదేవి నిశ్చేష్టురాలైంది. చివరగా నేను ఆమెకు చెప్పింది రేపు ఏడుగంటలకల్లా తను, తన అన్న వదినలు మన ఇంటికి వచ్చి దివ్యను మన తిరుమలరావుకు ఇచ్చి వివాహం చేస్తామని చెప్పాలి. అలా వారు చేస్తే సఖ్యం, చేయకపోతే వైరం. కానీ నేను మనసా వాచా కోరేది సఖ్యాన్నే చిన్నీ!" చిరునవ్వుతో చెప్పాడు చంద్రం.
కొన్నిక్షణాలు ఓరకంట అతని ముఖంలోకి చూచి...
"ఎవరి సఖ్యాన్ని!" చిరుకోపాన్ని నటిస్తూ అడిగింది కావ్య.
ఆమె భావనను గ్రహించిన చంద్రం.... దగ్గరకు జరిగి కావ్య భుజంపై చేయి వేసి ఆమె ముఖంలోనికి తొంగి చూస్తూ...
"ఈ నా.... నా... ముద్దుల..."
కావ్య తన చేతిని చందూ నోటికి అడ్డంపెట్టి డ్రైవర్ వైపు కళ్ళతో సౌంజ్ఞ చేసింది. ఆ సౌంజ్ఞ అర్థం ’అతను వింటున్నాడని’
ఆనందంగా నవ్వుతూ చందు ముఖంలోనికి చూచింది.
"ఆ... చిన్నీ మనం హాస్పిటల్‍కు వెళ్ళాలి. డ్రైవర్! జి.హెచ్.కి పదండి. కవీ! నందాదేవి ఫాదర్ సుబ్బారాయుడుగారు హాస్పిటల్‍లో వున్నారు. ఓసారి చూచి వెళదాం."
కావ్య అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
"చిన్నీ! ’అపకారికి ఉపకారము... నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ’ పద్యం జ్ఞాపకం వుందా" చిరునవ్వుతో చెప్పాడు చందాసింగ్.
చిరునవ్వుతో అవునన్నట్టు తలాడించింది కావ్య.
’నా బావమనస్సు ఎంత గొప్ప మనస్సూ! బావ నిజమైన నాయకుడు పాలకుడు’ ముసిముసి నవ్వులు. ఆ తలపులతో మనస్సున పులకింత.
ఆడి కారు జి.హెచ్‍లో ప్రవేశించింది.
చందూ కారు దిగాడు వెనకాలే కావ్య దిగింది.
చిరునవ్వుతో అడిగాడు "వస్తావా!"
"నేను రాకుండా మీరు వెళతారా!" కళ్ళు ఎగరేస్తూ అడిగింది కావ్య.
చిరునవ్వుతో ప్రీతిగా కావ్య ముఖంలోనికి చూచాడు చందూ.
ఇరువురు సుబ్బారాయుడుగారు ఉన్న వార్డును సమీపించారు.
గది బయట... నందాదేవి.
ఆమెను సమీపించారు కావ్య, చందాసింగ్.
వారిని చూచిన నందాదేవి భోరున ఏడ్చింది.
రాంబాబు బయటకు వచ్చాడు. వారిరువురినీ చూచి అవమానంతో, బాధతో ద్రోహిలా తలవంచుకున్నాడు.
దివ్య బయటకు వచ్చి కావ్యను సమీపించి ఏడ్చింది.
"ఏడవకు దివ్యా! తాతయ్యగారికి ఏమీకాదు. పదిరోజుల్లో బాగయ్యు ఇంటికి వస్తారు"
కలెక్టరుగారు వచ్చారన్న వార్త విని హాస్పిటల్ చీఫ్ చందాసింగ్ వద్దకు వచ్చి విష్ చేశాడు.
చందాసింగ్ ప్రతినమస్కారం చేసి "సార్! వారు మా బంధువు. వయస్సులో పెద్దవారు జాగ్రత్తగా చూడండి సార్! ప్లీజ్!"
అది అతిదీనంగా చందాసింగ్ కలెక్టరు గారి అభ్యర్థన.....
"సార్!.... సార్! నథింగ్ విల్ రాంగ్!... ఐ విల్ టేక్ కేర్"
"థాంక్యూ సార్!" నందాదేవిని సమీపించి "భయపడకండి.... బాధపడకండి... దైవాన్ని ధ్యానించండి. త్వరలో తాతయ్యగారు నవ్వుతూ ఇంటికి తిరిగి వస్తారు" ఎంతో సౌమ్యంగా చెప్పారు.
దివ్య వారి ప్రక్కకు వచ్చింది. ఆమెను చూచాడు. ఆమె ముఖభావన అర్థం అయింది.
"నందాదేవిగారూ! తాతయ్యగారు ఇంటికి చేరాక తిరుమల - దివ్య వివాహాన్ని గురించి మాట్లాడుకుందాం" క్షణం ఆగి నవ్వుతూ "సరేనా!" అడిగాడు చందాసింగ్.
"అలాగే సార్!" మెల్లగా అంది నందాదేవి.
"ఓకే! కలుద్దాం" మరోమాట మీ ఈ నిర్ణయంతో పాతిక సంవత్సరాల మనవూరి కథ మారుతుంది. స్నేహం.... సౌభ్రాతృత్వం వర్థిల్లుతాయి. పగ ద్వేషాలు సమసిపోతాయి. ఇలాంటి మార్పు అన్ని గ్రామాల్లోనూ రావాలి. అది నా లక్ష్యం. అందుకు మీ సహకారం...."
"తప్పక ఉంటుంది సార్!" నవ్వుతూ చెప్పింది నందాదేవి.
చందు నవ్వి తలూపాడు.
కావ్య, చంద్రలు ప్రక్కప్రక్కన నడుచుకొంటూ హాస్పిటల్ బయటకు వచ్చారు. కార్లో కూర్చున్నారు.
"బంగళాకు పోనీయండి" చెప్పాడు చందాసింగ్ కావ్య వైపు చూసి....
"స్నానం చేసి నా పెంపుడు తల్లితండ్రితో కలిసి మనం మన వూరికి మన ఇంటికి వెళదాం. ఓకేనా డియర్!" నవ్వుతూ చెప్పాడు చందాసింగ్.
"ఓకే సార్!"
పావుగంటలో కలెక్టర్ గారి బంగళా పోర్టికోలో కారు ఆగింది.
వరండాలో కూర్చొని వున్న తన పెంపుడు తల్లిదండ్రులను కావ్యకు పరిచయం చేశాడు చందాసింగ్.
ఇరువురూ స్నానం చేశారు.
పంజాబ్ నుంచి చందు పెంపుడు తలి కౌసల్య తెచ్చిన చుడీదార్‍ను ఆమె కోడలికి అందించింది.
అంతవరకూ గడ్డంలో వున్న చందాసింగ్ గడ్డాన్ని తొలగించాడు. తెల్లని లాల్చీ, దోవతి కట్టుతో పెండ్లి కొడుకులా తయారైనాడు చందు.
కావ్య, చందూ ఒకరినొకరు చూచుకొని మురిసిపోయారు.
సెల్ మ్రోగింది.
"బావా! నేను విషయాన్ని మనవారందరికి చెప్పేశాను. బయలుదేరారా లేదా!" ఆత్రంగా ఆడిగాడు తిరుమల.
"ఒరేయ్ బావా! టెన్షన్ పార్టీ! స్థిమితంగా ఉండు బయలుదేరుతున్నాం" నవ్వుతూ చెప్పాడు చందు.
నలుగురూ కార్లో కూర్చున్నారు. కారు పెన్నా బ్రిడ్జి దాటి ముందుకు వెళ్ళి హైవేలో ప్రవేశించింది.
"బేటే!... అప్నా గాంవ్ పహూంచ్‍నే కేలియే కితనా సమయై లగేగా!" అడిగింది కౌసల్య.
పక్కనే కూర్చొని వున్న కావ్య "ఆదా గంటా అత్తమ్మాజీ!" నవ్వుతూ చెప్పింది.
కావ్య పలికిన ’అత్తమ్మాజీ’ డైలాగ్ అందరినీ నవ్వించింది.
అందరూ ఆనందంగా నవ్వుకొన్నారు.
కారు రివ్వున దూసుకుపోతోంది.
పన్నెండేళ్ళ తర్వాత తల్లిదండ్రులను చూస్తున్నాననే ఉద్వేగం.... ఇంతకాలం వారిని మానసిక క్షోభకు గురిచేశాననే పశ్చాత్తాపం చందు మనసులో పెనవేసుకుపోతుండగా... చందు మనసులో తనకు జన్మనిచ్చిన తల్లితండ్రి ప్రతిరూపాలు కదలాడాయి.
’త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనా బద్ధుడై పదునాలుగు సంవత్సరాలు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేశారు. ద్వాపర యుగంలో పాండవులు జూదంలో సర్వస్వం కోల్పోయి మాటకు కట్టుబడి పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు.
నేను మాట పట్టింపుతో.... పంతంతో... ఇల్లు విడిచిపోయాను. పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి నేను అనుకొన్న రీతిలో వచ్చాను. పగ తీర్చుకొనేదానికి తగిన సామర్థ్యం ఉంది. కానీ ఆ పని నేను చేస్తే వాళ్ళు నేనూ ఒక్కటే అవుతాముగా! నా తండ్రి ధర్మ పక్షపాతి. చీమకు కూడా తెలిసి వారు హానిచేయరు. నా తల్లి ఏనాడు నాకు తెలిసినంతవరకు నా తండ్రిగారి మాటకు ఎదిరించలేదు. అన్యోన్య దాంపత్యానికి నా తల్లిదండ్రులు ఆదర్శం. ఇక వారి శేష జీవితంలో నా తల్లిదండ్రులతో వారు సంతోషించేలా గడపాలి. నేటి ఈ కలియుగ ధర్మాన్ని మార్చే రీతిగా... ధర్మబద్ధంగా నా జీవితాన్ని సాగించాలి. అనాలోచితంగా.... విచక్షణా రహితంగా.... జీవిత విధానాన్ని సాగించే యువత తత్వంలో మార్పు తేవాలి.’
కారు గండవరంలో ప్రవేశించింది. డ్రైవర్‍కు ఇంటికి దారి చూపించాడు. కారు సత్యానందరావు గారి ఇంటిముందు ఆగింది. అందరికంటే ముందుగా కావ్య దిగి ఇంట్లోకి సంతోషంగా పరుగెత్తింది.
తన పెంపుడు తల్లిదండ్రులను కారు నుంచి దిగేదానికి తన చేయూతనందించాడు చందు. రెండు చేతులతో వారి చేతులను పట్టుకొని గృహ ప్రాంగణంలోనికి ప్రవేశించాడు.
ఇంటిగేటుకు వరండాకు ఏభై అడుగుల దూరం. అడుగుతీసి అడుగు వేస్తుంటే.... ఏదో కలవరం.... కళ్ళల్లో కన్నీరు.
సత్యానందరావు, సావిత్రి ఒకరి వెనుక ఒకరు వరండాలోనికి వచ్చారు. వారికి చందుకి ఇరవై అడుగుల దూరం. పెంపుడు తల్లిదండ్రుల చేతులు వదిలి వేగంగా తల్లిదండ్రుల దగ్గరకు పరుగెత్తి తన చేతులతో ఇరువురుని చుట్టు....
"అమ్మా!.... నాన్నా! నన్ను క్షమించండి" అంతవరకూ గుండెలో సుడులు తిరుగుతున్న ఆవేదన కన్నీరుగా వెలువడింది. భోరున ఏడ్చేశాడు చంద్రం.
తనయుని ఆలింగ స్పర్శతో ఆ తల్లిదండ్రుల హృదయ వేదన కట్టలు తెంచుకుంది.
ఆ ముగ్గురూ ఆ పరవశ స్థితిలో కొన్ని క్షణాలు గడిపారు. తల్లిదండ్రుల, బిడ్డల పరిష్వంగ సుఖం అది మాటలకు అతీతం. అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే...
పెంపుడు తల్లిదండ్రులు వారిని సమీపించారు.చంద్ర వారిని తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. పెద్దలు పరస్పర అభినందనలతో ఆప్యాయంగా చేతులు కలుపుకొన్నారు. ఇరువురు తల్లులు కౌగలించుకొన్నారు.
జానకి, నరేంద్రలు జరుగుతున్న దానిని కళ్ళనిండా ఆనంద భాష్పాలతో ఆనందంగా వీక్షించారు. తిరుమల, యోగి ఆనందానికి హద్దులు లేవు.
చంద్ర నవ్వుతూ నరేంద్ర.... జానకిలకు సమీపించాడు. ఇరువురూ కన్నీటితో అదే ఆనందభాష్పాలతో అతన్ని దగ్గరకు తీసుకున్నారు.
కావ్య ఎర్రనీళ్ళ పళ్ళెంతో తల్లిని సమీపించింది. జానకి చంద్రానికి దిష్టి తీసింది. ఆ పళ్ళేన్ని కావ్య అందుకుంది. పనిమనిషి చేతికి ఇచ్చింది.
వాకిట కారు ఆగింది.
అందరూ ఆసక్తిగా ఆవైపు చూచారు.
నవ్వుతూ నందాదేవి వరండాను సమీపించింది. వినమ్రంగా వంగి సత్యానందరావు గారు పాదాలను తాకి నమస్కరించింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు. తప్పుగా వ్యవహరించామనే వ్యధ.
“నాన్నగారి ఆరోగ్యం ఎలావుందమ్మా!" ఆప్యాయంగా అడిగాడు సత్యానందరావు.
"నాన్నగారు వారంరోజుల్లో ఇంటికి వస్తారు. దివ్య తిరుమల వివాహానికి మాతోపాటు ఆయన కూడా సంతోషంతో అంగీకారం తెలిపారు. వారు ఇంటికి రాగానే మా అన్నావదిన మీకు తెలియజేస్తారు. వివాహ ముహూర్తాలను మీరే నిర్ణయించాలి" ప్రాధేయపూర్వకంగా కోరింది నందాదేవి.
"చందు-కావ్య, తిరుమల-దివ్యల వివాహాలను త్వరలో మంచి ముహూర్తం చూసి జరిపిద్దాం. మనందరి సంకల్పం అదేగా" నవ్వుతూ చెప్పారు సత్యానందరావు.
"అవును" అన్నారు అందరూ ఏకకంఠంతో సంతోషంగా.
చందు కావ్య వంక కొంటెగా చూశాడు. కావ్య సిగ్గుతో తలవంచుకుంది.
"అందరూ లోనికిరండీ" అంటూ పిలిచింది జానకి.
"సింగ్‍జీ.... భాయ్ సాబ్ ఆయియే" అంటూ గౌరవంగా పిలిచారు సత్యానందరావు. ఆనందంగా అందరూ హాల్లోకి చేరి పెళ్ళి సంగతుల చర్చ ఆరంభించారు.
===============================================================================
సమాప్తం
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున,
రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి తరఫున మా అభివాదాలు తెలియజేస్తున్నాము.
===============================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments