'Kala Vahinilo - Part 5' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 29/08/2024
'కాల వాహినిలో - పార్ట్ 5' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.
గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల, కావ్య.
తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య.
ఇక కాల వాహినిలో.... పార్ట్ 5 చదవండి.
అరుణుడు తూర్పున ఉదయించాడు.
కావ్య పోలీస్ ఆఫీసర్. అయినా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి బక్కెట్‍తో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఇంటి ముంగిట చల్లి ముగ్గు వేయటం.. సూర్యోదయానికి ముందు ఆమె ప్రథమ కర్తవ్యం. ఆ విధిని తాను నిర్వర్తించాలని ఆమెను చెప్పింది... నేర్పింది తల్లి జానకి.
ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చక్కగా పూర్తిచేసి వేసిన రంగుల ముగ్గును తృప్తిగా చూచుకొని ఇంటివైపుకు నడవసాగింది.
వాకిట్లో కారు ఆగిన సవ్వడి. వెనుతిరిగి చూసింది. కారునుండి దిగాడు ఆరు అడుగుల అందగాడు..
అతను... కావ్యను ఎంతో ఆశ్చర్యంగా చూడసాగాడు. డ్రైవర్ సూట్ కేసులను డిక్కీ నుంచి తీసి అతని ప్రక్కన ఉంచి..
"సార్!.. డబ్బులు!"
అతను తొట్రుపాటుతో జేబులోని పర్స్ తీసి అతనికి డబ్బులు ఇచ్చాడు. ఓ ఐదువందలు అధికంగానే ఇచ్చాడు. అతని కారు చెన్నై విమానాశ్రయం నుండి. డ్రైవర్ డబ్బును లెక్కపెట్టి అదనంగా వున్నందున ఆ బాబుగారికి సలామ్ కొట్టి కార్లో కూర్చుని వెళ్ళిపోయాడు.
కావ్య.. పరిస్థితి అయోమయం?.. ఎవరు ఇతను!... ఇంత ఉదయాన్నే వచ్చాడు!.. చంద్రం బావనే! మరి వేరెవరైనానా!.. ఆశ్చర్యం.. ఆలోచన..
ఆ వచ్చింది... ఆ ఇంటి వారసుడు... సత్యానందరావు.. సావిత్రమ్మల కుమారుడు. పన్నెండేళ్ళ క్రిందట ఆ ఇంటినుంచి రోషంతో పారిపోయినవాడు. కావ్యకు బావ చంద్రశేఖరరావు.
చంద్రం... తన్ను చూచి శిలాప్రతిమలా నిలబడ్డ.. కావ్యను సమీపించి.. తలవంచి ఆమె ముఖంలోకి నవ్వుతూ చూస్తూ..
"కావ్య.. కావ్య!" మెల్లగా చెప్పాడు.
అతని పిలుపును విన్న కావ్య తొట్రుపాటుతో కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూచింది.
"కవీ! గుర్తుపట్టలేదా!" నవ్వుతూ అన్నాడు చంద్రం.
చిన్నతనంలో చంద్రం, కావ్యలు కలిసి వున్నప్పుడు చంద్రం కావ్యను ’కవీ’ అని పిలిచేవాడు.
ఆ పిలుపును వినగానే కావ్య "బా..వా.. బా...వా..." అని అవధులు లేని ఆనందంతో "అమ్మా.. మామయ్యా.. చందూ బావ వచ్చాడు" అంటూ బిగ్గరగా అరుస్తూ ఇంటి వైపుకు పరుగుతీసింది.
చంద్రం చిరునవ్వుతో ఆమెను అనుసరించాడు.
ఆ పిలుపును విన్న సత్యానందరావు, సావిత్రి పరుగున వరండాలోనికి వచ్చారు. కొద్ది క్షణాలు తర్వాత నరేంద్ర, జానకీలు వెంట కావ్య వరండాలోకి ప్రవేశించారు.
తల్లీ తండ్రిని చూచిన చంద్రం "అమ్మా!.. నాన్నా!" అంటూ పిలిచాడు. కంఠంలో ఆ క్షణాన కంపనం... బొంగురుపోయింది. కళ్ళనుండి కన్నీళ్ళు..
"నాయనా చందూ!" సావిత్రమ్మ పరవశంతో చంద్రాన్ని చుట్టేసింది.
"అమ్మా.. అమ్మా..." అంటూ ఆ ఆరడుగుల చంద్రం పసిబిడ్డలా ఆ తల్లి చేతుల్లో ఒదిగిపోయాడు.
పరమానందంతో సత్యానందరావు తన చేతులతో చంద్రం, సావిత్రిలను చుట్టి తన హృదయానికి హత్తుకున్నాడు.
పన్నెండేళ్ల తర్వాత కలయిక. ఆ తల్లీ తండ్రి కొడుకుల హృదయాల కంపనం... పరవశం... ఆనందం... కలానికి అందని భావాలు..
నరేంద్ర జానకీలు ఆనందంతో తన చేతులను సత్యానందరావు భుజాలపై వుంచారు. కొన్ని క్షణాలు వారంతా ఆ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.
కావ్య ఆనంద భాష్పాలతో వారినందరినీ చిత్రంగా చూస్తూ నిలబడిపోయింది.
ఆ స్థితిలో కొన్ని క్షణాలు గడిచిపోయాయి.
"రా నాన్నా.. రా!..." కొడుకు చేతిని తన చేతిలోనికి తీసుకొని సావిత్రి ఇంట్లోకి నడిచింది. అందరూ ఆమెను అనుసరించారు.
సోఫాలో కూర్చున్న చంద్రాన్ని ఒక్కొక్కరుగా వచ్చి పరిశీలనగా చూచి కన్నీరు కార్చారు. అవి కన్నీరు కాదు. ఆనంద భాష్పాలు. అందరూ చంద్రం చుట్టూనే వున్నారు.
అందరినీ చూచి.. పేరు పేరున పలకరించాడు చంద్రం. "మీ అందరికీ నేను గత పన్నెండు సంవత్సరాలు ఎక్కడ వున్నది... ఏం చేసింది... ఎలా వుండగలిగింది తెలుసుకోవాలని వుంది కదా.. స్నానం చేసి... టిఫిన్ తిని.. నా కథను మీకు చెబుతాను" నవ్వుతూ చెప్పాడు చంద్రం.
"అలాగే నాన్నా!... వెళ్ళి ముందు స్నానం చెయ్యి!" అంది సావిత్రి. క్షణం తర్వాత "కవీ! బావకు బాత్రూం చూపించు" అంది.
"అలాగే అత్తయ్యా!"
చందూ తల్లినీ, కావ్యను పరీక్షగా చూచాడు. ఇరువురూ నవ్వుతున్నారు. తనూ నవ్వుతూ..
"కవీ!"
"ఆ.. బావా!"
"బాత్రూం ఎక్కడ?"
"రండి" కావ్య ముందుకు నడిచింది.
చంద్రం కావ్యను అనుసరించాడు.
పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన చంద్రానికి ఆ ఇంట కనిపించిన చేర్పు.. ఇంటి వెనుక భాగంలో విశాలంగా మూడు బెడ్ రూమ్స్, అటాచ్‍డ్ రెస్ట్ రూమ్స్ ఆ గదులకు మధ్యన ఒక హాలు..
హాల్లో నిలబడి నాలుగు వైపులా చూచాడు చంద్రం.. కావ్య ఒక గదిలో ప్రవేశించి ద్వారం ముందు ఆగి..
"బావా!.."
కావ్య ముఖంలోకి చూచాడు చంద్రం.
"ఇంటిలో ఈ భాగం కొత్తగా నిర్మించింది" చిరునవ్వుతో చెప్పింది.
"చాలా బాగుంది.."
"రండి లోపలికి"
చంద్రం గదిలో ప్రవేశించాడు.
చూపుడు వ్రేలితో తలుపును చూపుతూ..
"అది రెస్ట్ రూం. గీజరు ఆన్ చేసి వున్నాను. వేడి నీళ్లతో స్నానం చేయండి. అలసట తీరుతుంది" చెప్పింది కావ్య.
పనివాడు ఆలీ రెండు సూట్ కేసులను తెచ్చి ఆ రూములో వుంచాడు.
"నీ పేరేమిటి బాబూ!" అడిగాడు చంద్రం.
"ఆలీ సార్!"
"ఆ.. ఆలీ! ఇక నీవు వెళ్ళి నీ పని చూచుకో!" చంద్రం ముఖంలోకి క్షణం సేపు చూచి ఆలీ వైపు తిరిగి చెప్పింది కావ్య.
చంద్రం సూట్ కేసు ఓపెన్ చేసి బట్టలు బయటకు తీసి.. మంచంపై వుంచి.. టవల్ భుజాన వేసుకొని..
"కవీ! ఇక నీవు వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను"
"అలాగే బావా!" రెండడుగులు ముందుకు వేసి వెనుతిరిగి "సోపు.. షాంపు అన్నీ లోపల వున్నాయి" అంది కావ్య.
"ఓకే థాంక్యూ!" చంద్రం లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు.
’ఆ... థాంక్యూ.. ఏంటీ నేను పరాయిదాన్నా!.. రానీ బయటకు.. అయ్యగారికి చెబుతాను నేనెవరో!’ క్షణం ఆగి ’అంతవరకూ ఆగడం ఎందుకు చెప్పేస్తే పోలా’ అనుకొని వెనుతిరిగి ద్వారం దగ్గరకు వచ్చి తలుపును తట్టింది కావ్య.
"ఎవరూ?" చంద్రం లోపలనుంచి..
"నేను.."
"కవీనా!"
"అవును.. తలుపు తెరవండి!"
"స్నానం చేస్తున్నా!"
"ఒక్కమాట!"
"అర్జంటా!..."
"చాలా!..."
చంద్ర తలుపు గడియ తీసి కొద్దిగా షట్టర్‍ను ఓపెన్ చేశాడు.
"కవీ!.. ఏంటి అర్జంటు?"
"నేను ఎవరో మీకు తెలుసా?"
కావ్య ప్రశ్నకు చంద్రం ఆశ్చర్యపోయాడు. ’ఈ పిల్లకు ఏమైనా పిచ్చా!’ అనుకొని నవ్వుతూ "నా మరదలివి!" అన్నాడు చంద్రం.
"అంతేకాదు... నేను పోలీస్... నీవు వ్రాసినట్లే చదివాను. నౌవ్ అయాం ఎ.ఎస్.పి" సగర్వంగా తలాడిస్తూ చెప్పింది కావ్య.
"అలాగా!"
"అవును బావా!"
సావిత్రమ్మ గదిలోకి వచ్చింది.
"ఏయ్ కవీ! నా కొడుకు ఏం చేస్తున్నాడే" అంటూ "నాయనా చందూ!" అని పిలిచింది సావిత్రి.
తల్లి పిలుపు విన్న చంద్రం "స్నానం చేసి వస్తానమ్మా!" అంటూ తలుపు బిగించాడు.
"ఏమిటే... నా కొడుకును సతాయిస్తున్నావా?"
"లేదు.. బాత్‍రూం చూపించాను. వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేసి రండి బావా అని చెప్పాను. ఆ.. అంతే!" అంది కావ్య అమాయకురాలిలా..
"సరే పద.. టిఫిన్ డైనింగు టేబుల్ మీద సర్దుదాం"
"అలాగే అత్తయ్యా!"
ఇరువురూ ముందు భాగంలోని పాత ఇంట్లోకి వచ్చారు. కావ్య టిఫెన్ గిన్నెలను డైనింగ్ టేబుల్ మీద వుంచింది. జగ్గులో నీళ్ళు, గ్లాసులను.. ప్లేట్లను... టేబుల్ పైకి చేర్చింది.
పావుగంటలో చంద్రం స్నానం ముగించి డ్రస్ మార్చుకొని పాత ఇంట్లోకి ప్రవేశించాడు.
సత్యానందరావు, నరేంద్ర, సావిత్రి, జానకీ, కావ్య అందరూ అతని రాక కోసం డైనింగ్ టేబుల్ ముందు వెయిటింగ్...
చంద్రం తల్లిని సమీపించి..
"అమ్మా!.. ఓ అరగంట ఆలస్యం అవుతుంది. మీరంతా తినండి. నేను దేవుని గదిలోకి వెళ్ళి వస్తాను" అన్నాడు చంద్రం.
అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూచారు. చిరునవ్వుతో తల్లి సావిత్రి అతని కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకొని పూజగదివైపుకు నడిచింది. అందరూ వారిని అనుసరించారు.
వేకువనే స్నానం చేసి... పూజ చేయడం... సత్యానందరావు గారికి అలవాటు. వారి పూజ ముగిసింది. వెలుగుతున్న జ్యోతులను చూచి చంద్రం..
"అమ్మా!.. మీరు పూజ చేశారా!"
"మీ నాన్నగారు ఆరుకంటలకంతా ముగించారు. అది వారి దినచర్య" చిరునవ్వుతో చెప్పింది సావిత్రి.
"మా అన్నయ్య వూర్లో లేని రోజున మా వదిన.. లేకపోతే నేను ఆ పుజా విధానాన్ని ఆరుగంటల లోపల ముగిస్తాము చందూ!"
"ఓహో! చాలా సంతోషం అత్తయ్యా! పది నిముషాల్లో వస్తాను" చెప్పి పద్మాసనంతో పూజా మందిరం ముందు కూర్చున్నాడు.
చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. సర్వేశ్వరుల ధ్యానంలో నిమగ్నుడైనాడు. అందరూ మౌనంగా కళ్ళు మూసుకున్నారు. పరాత్పరుని నామ జపంలో...
పావుగంట కాలం గడిచింది. చంద్రం కళ్ళు తెరిచి నిలబడి సర్వేశ్వరులకు నమస్కరించాడు.
తన తల్లి... తండ్రి... అత్త.. మామయ్య పాదాలను తాకి "నా తప్పును మన్నించండి. మీతో చెప్పకుండా పారిపోవడం నేను చేసిన నేరం.. కానీ నేను ఏ ఉద్దేశ్యంతో వెళ్ళానో... దాన్ని సాధించి తిరిగి వచ్చాను. నన్ను ద్రోహిగా నిలబెట్టిన వారంతా వున్నారా!.. ఎలా వున్నారు?.. వున్నవారు కొద్ది రోజుల్లోనే వాళ్ళ తప్పును వాళ్ళే ఒప్పుకునేలా చేస్తాను. నిజం.. కావచ్చు. నివురు కప్పిన నిప్పు... కాని ఓ రోజున భగ్గున మండి తీరుతుంది. ఆ నిప్పునే నేను దాని ప్రభావాన్ని వారంతా చవి చూడబోతున్నారు." ఎంతో ఆవేశంతో చెప్పుకొచ్చిన చంద్రం ఆపేశాడు. అందరినీ పరీక్షగా చూశాడు. అందరి కళ్ళల్లో కన్నీరు..
సత్యానందరావు.. చంద్రాన్ని సమీపించాడు. అతని భుజంపై చేయి చేశాడు.
"నాయనా! పగ.. ప్రతీకారం మంచికి మానవత్వానికి విరుద్ధం. అవి రాక్షస లక్షణాలు. ప్రేమ, అభిమానం, క్షమాగుణం, సౌభ్రాతృత్వం మానవ లక్షణాలు... ఈ ఇంటివారికి తెలిసినవి. వీరు పాటించేవి. గతాన్ని మరిచిపో... మమతను...సమతను అందరికీ పంచు. డెబ్బై మూడేళ్ళ స్వాతంత్ర్య్ చరిత్రలో.. మీ తరంలో స్వర్ణ అధ్యాయాన్ని వ్రాసే ప్రయత్నాలను చేసి అందరూ కలసికట్టుగా అందరి క్షేమం కోసం కన్నవారి ఆనందం కోసం, సాటివారి శ్రేయస్సు కోసం, హైందవతను యావత్ విశ్వం గౌరవించి... అభిమానించి.. ఆదరించేలా మన దేశ ప్రధాని శ్రీయుతులు గౌరవనీయులు.. పూజనీయులు అయి శ్రీ మోడీగారి భావాలను ఆశయాలను అర్థం చేసుకొని కుల మత తత్వాలకు అతీతంగా నవ హైందవ సమ సమాజాన్ని నిర్మించడం నీలాంటి యువతరం యొక్క కర్తవ్యం కావాలి.
డెభ్భై మూడేళ్ళ రాజ్యాంగ వ్యవస్థ నేడు ఎలా వుందో తెలుసా!... గవర్నమెంటు అధికారులు కొందరి నిశానీదారుల బెదిరింపులకు, వారి అవసర కార్యకలాపాలను కొందరు అధికారులు వారి ఆత్మకు విరుద్ధంగా చేయవలసి వస్తుంది. గవర్నమెంటు పాలకులు.. ఉపాధ్యాయులు.. డాక్టర్లు.. న్యాయవాదులు అందరినీ కొందరు నాయకులు శాసిస్తున్నారు. వారి ఆత్మ గౌరవాలను మంట గలుపుతున్నారు. వారిని తమ ఇంటి నౌకర్లుగా భావిస్తున్నారు. ఇది రాక్షస నీతి... ఈ అరాచకవిధానం మారాలి. ఎవరి పరిధిలో వారు ధర్మబద్ధంగా వారివారి విధులను నిర్వహించాలి. దేశప్రగతికి అందరూ... భాగస్వాములే.. మానవ సముదాయం... దేశం... అంటే.. మన శరీరంతో సమానం.. అన్ని భాగాలు వుండవలసిన రీతిలో వుండి వాటి వాటి విధులను అవి క్రమంగా నిర్వహించగలిగితేనే శరీరానికి ఆరోగ్యం.. మనస్సుకు ఆనందం..
పదిమంది మంచిని కోరడం మన ధర్మం. మన మంచి ఆ పదిమంది మధ్యనే ఉంటుంది. ఇది వేదభూమి... కర్మభూమి... అద్వైత భూమి. ఈ మన పవిత్ర భూమికి.. మట్టికి వున్న విలువ గొప్పతనం ప్రపంచంలో ఏ గడ్డకూ లేదు. ఈ మహోన్నత ఔన్నత్యాన్ని ఎరిగి జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు ఈ మన సువిశాల భరతమాతకు.. మీ యువతరం మనుగడ.. గర్వకారణం కావాలి... భారతవాసి వారు ఏ కులం... ఏ మతం... వారైనా సరే.. యావత్ ప్రపంచం.. వారి వారి నడవడిక మూలంగా గౌరవించాలి.. అభిమానించాలి. అలాంటి చక్కటి భావితరాన్ని నిర్మించడం... నీ.. నీలాంటి యువకుల కర్తవ్యం..." ఎంతో ఆవేశంతో చెప్పిన సత్యానందరావు ఆపి కళ్ళు మూసుకున్నాడు.
అందరూ ఆశ్చర్యంతో వారిని చూచారు. మితభాషిగా వుండే... వారి హృదయంలో.. తనవారి పట్ల... తన భారతీయుల పట్ల.. తన దేశం పట్ల... భావితరం భవిష్యత్తు పట్ల ఇన్ని భావాలున్నాయనే విషయం.. వారందరికీ ఇప్పుడే అర్థమయ్యింది.
సత్యానందరావుగారి నొసటన చెమట...
అర్థాంగి.. సావిత్రి దగ్గరకు వచ్చింది. తన పవిటతో ఆ చెమటను తుడిచింది.
"చాలా చెప్పి అలసిపోయారు!"
వారికి మాత్రమే వినబడేలా మెల్లగా వారి చెవి చెంత ఆ పలుకులను పలికింది సావిత్రి.
చిరునవ్వు.. సత్యానందరావుగారి సమాధానం..
సావిత్రి అందరినీ కలయచూచింది. అందరి కళ్ళల్లో ఆశ్చర్యం..
నరేంద్ర తన బావను సమీపించి...
"బావా! నేడు నేను మీలో మరో వివేకానంద స్వామిని చూచాను. మీకు సాటి మీరే బావా!" ఆనందంగా వారిని కౌగలించుకున్నారు.
కావ్య.. సత్యానందరావు గారిని సమీపించింది.
"మామయ్యా! యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్! సెల్యూట్!" ఆనందంగా పోలీస్ సెల్యుట్ చేసింది.
సత్యానందరావు ప్రీతిగా కావ్య భుజంపై చేయి వేశాడు.
"ఆకలేస్తూ వుందమ్మా! టిఫెన్ పెట్టవా!" చిరునవ్వుతో చిన్నపిల్లాడిలా అడిగాడు సత్యానందరావు.
"అంతా రెడీ మామయ్యా! రండి..." సత్యానందరావు గారి చేతిని తన చేతిలోనికి తీసుకొంది కావ్య.
కావ్యకు సత్యానందరావుగారి పట్ల వున్న అభిమానానికి చంద్రం ఆశ్చర్యంగా కావ్యను చూచాడు. దాన్ని గమనించిన జానకి చంద్రాన్ని సమీపించి అతని కుడిచేతిని తన ఎడమ చేతిలోనికి తీసుకొని "నాన్నా! చందూ! రా... టిఫిన్ తిందువు గాని" ప్రీతిగా అతని కళ్ళల్లోకి చూచింది జానకి. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. జానకీ కావ్య అందరికీ వడ్డించారు. వారూ కూర్చున్నారు.
కావ్య, చంద్రంల వివాహ ప్రసక్తిని ఎత్తింది సావిత్రి.
"త్వరలో పెండ్లి జరిపించాల అన్నయ్యా" అంది జానకి.
"బావా! జానకి మాటను కాదనకండి!" అన్నాడు నరేంద్ర.
"చంద్రా! కావ్య నీకు ఇష్టమేనా!" అడిగాడు నవ్వుతూ సత్యానందరావు గారు.
"నాన్నా! మీ ఇష్టమే నా ఇష్టం" అన్నాడు చిరునవ్వుతో చంద్రం.
"ఏయ్ పోలీస్! నీవేమంటావ్" నవ్వుతూ అడిగింది సావిత్రి.
"మీ అందరి ఇష్టమే నా ఇష్టం!" చిరునవ్వుతో సిగ్గుతో తలదించుకొని చెప్పింది కావ్య.
"నరేంద్రా! మీ అందరికీ సమ్మతమైన విషయం నాకూ సమ్మతమే.. సంతోషం.. ఈరోజు దశమి పూర్తిగా ఉంది. కాఫీ తాగి బలరామయ్యను పిలుస్తాను. నిశ్చితార్థ వివాహ ముహూర్తాలు నిశ్చయించేదానికి" నవ్వుతూ చెప్పాడు సత్యానందరావు.
జానకీ.. కావ్య అందరికీ కాఫీలు ఇచ్చారు. త్రాగడం ముగిసింది.
సత్యానందరావు గారి పిలుపు విని అరగంటలో వచ్చారు బలరామశాస్త్రిగారు. పంచాంగాన్ని... చంద్రం, కావ్యల జాతకాలను పరిశీలించి... నిశ్చితార్థానికి వివాహానికి ముహూర్తాలు నిర్ణయించి లగ్న పత్రికలు వ్రాశారు. నాలుగు వారాల్లో వివాహం...
సత్యానందరావు, నరేంద్రలు వారి సతీమణులు కావ్య, చంద్రంల వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. పిలిచినా సుబ్బారాయుడి కుటుంబం ఆ వివాహానికి రాలేదు.
సమయం వేకువన మూడు గంటల ప్రాంతం. తెరిచివున్న కిటికీ తలుపులు గాలికి గోడకు తగిలి పెదగా సవ్వడి.. బయట కుండపోతగా... వురుములు.. మెరుపులతో భారీ వర్షం.
కావ్య ఉలిక్కిపడి నిద్రలేచి కిటికీవైపు చూచింది. టైమ్ చూచుకొంది. ఆమె కమ్మని కల చెదిరిపోయింది. కిటికీ మూసి విచారంతో మంచంపై వాలింది కావ్య.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments