top of page

కాల వాహినిలో - పార్ట్ 6



'Kala Vahinilo - Part 6'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 03/09/2024

'కాల వాహినిలో - పార్ట్ 6' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.

గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల, కావ్య.

తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. బావతో తన వివాహం జరిగినట్లు కల కంటుంది. 



ఇక కాల వాహినిలో.... పార్ట్ 6 చదవండి. 


జిలా పరిషత్తు ఛైర్ పర్సన్ నందాదేవి... తండ్రి సుబ్బారాయుడుగారిని చూడాలని నెల్లూరు నుంచి తన గ్రామానికి బయలుదేరింది. కార్లో ఒంటరిగా.. ఆ రోజు ఆదివారం. ఆ వూరికి జిల్లా హెడ్ క్వార్టర్సుకు దూరం ముఫ్ఫై కిలో మీటర్లు. హైవేలోనుంచి కారు చీలిన రోడ్డు వైపునకు తిరిగింది. అక్కడికి.. గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు. వేగంగా దూసుకుపోతున్న అమ్మగారి బి.యం. డబ్ల్యూ కారు ఆగిపోయింది.


నందాదేవి గారు కారును రీస్టార్ట్ చేశారు. స్టార్ట్ కాలేదు. మరోసారి ప్రయత్నించారు. ఫలితం శూన్యం. విసుగుతో ఆవేశంతో కారు దిగింది. రోడ్డు తూర్పు పడమరలుగా ఉన్నందున రెండువైపులా చూచింది. కార్లో... స్కూటర్స్ తో ఎవరైనా వస్తున్నారేమోనని.. ఎవరూ కనిపించలేదు. ఆఫీస్ పనిమీద మఫ్టీలో కావ్య తన కార్లో నెల్లురికి బయలుదేరింది. పది నిముషాల్లో నందాదేవి నిలబడి వున్న ప్రాంతానికి చేరింది.


అప్రసన్నంగా నిలబడి దిక్కులు చూస్తున్న నందాదేవిని చూచి కారును ముందుకు పోనిచ్చి త్రిప్పి.. నందాదేవి కారుముందు ఆపి కారు దిగి ఆమెను సమీపించింది. "గుడ్ మార్నింగ్ మేడమ్!" చిరునవ్వుతో చెప్పింది కావ్య. 


తెల్లని చీర.. బ్లౌజ్.. ముడివేయని కురులలో మల్లెపూలు, నొసటన కుంకుమబొట్టు... కళ్ళకు కాటుక... కుడిచేతికి రెండు బంగారు గాజులు, ఎడం చేతికి వాచ్, మెడలో బంగారు చైన్... దివి నుంచి భువికి దిగిన దేవకన్యలా కనిపించింది కావ్య.. నందాదేవికి.

"అబ్బా!... ఏమి అందం దీనిది?" అనుకొంది మనస్సున.


"రండి.. నా కార్లో కూర్చోండి. ఇంటి దగ్గర దింపుతాను" అభిమానంతో చెప్పింది కావ్య.


నందాదేవి రోడ్డు రెండువైపులా చూచింది. కావ్య కారులో ఎక్కడం నందాదేవి గారికి ఇష్టం లేదు.

"రెండు వైపుల నుంచి ఏమీ రావడం లేదు" వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పింది కావ్య క్షణం తర్వాత.

"మీ అన్నయ్యగారు, మేనకోడలు, మీ వదినగారు తిరుమలకు వెళ్ళి వున్నారు. సాయంత్రానికి వస్తారట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్‍మేషన్. నేను అర్జంటుగా వెళ్ళాలి. మీరు నా కారు ఎక్కితే... మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి నేను వెళతాను" అనునయంగా చెప్పింది కావ్య.


కావ్యను ఎగాదిగా చూచి... నిట్టూర్చి..

"పద..." అంది నందాదేవి. కావ్య కారువైపుకు నడిచింది. ఆమెకంటే ముందుగా కారును సమీపించి ముందు డోర్ తెరిచింది కావ్య.


నందాదేవి... వెనుక డోర్ తెరుచుకొని కూర్చుంది.


ఆమెను చూచి చిరునవ్వుతో..

"షల్ ఐ స్టార్ట్!" వ్యంగ్యంగా అడిగింది కావ్య.


నందాదేవి గర్వంగా తలాడించింది.

కావ్య కారును స్టార్ట్ చేసింది. 

"మేడమ్! మీ కోడలి పెళ్ళి ఎప్పుడు?"


నందాదేవి కావ్య ప్రశ్నకు ఆశ్చర్యపోయింది.

"దాని వివాహానికి నీకు ఏమిటి సంబంధం? దాని సంగతి అటుంచు. నీ పెళ్ళి ఎప్పుడు?"


"త్వరలో!"


"ఎవరితో!"


"మా బావ చంద్రం గారితో!"


"ఆ..!" ఆశ్చర్యమ్తో నోరు తెరిచింది నందాదేవి.


కావ్య నవ్వుకొంటూ "మేడమ్! ఎందుకు అంత ఆశ్చర్యం?"


"వాడు బ్రతికి వున్నాడా?"


"వున్నాడు!"


"ఎక్కడ వున్నాడు?"


"అది నీకు అనవసరం!"


"ఏమన్నావ్!"


"నీకు అనవసరం అన్నాను" గద్దించినట్లు చెప్పింది కావ్య.


"హు... పన్నెండేళ్ళు గడిచాయి. కాలగతిలో మట్టిలో కలిసిపోయి వుంటాడు" వికటంగా నవ్వింది నందాదేవి.


"ఏయ్... నందా! అహంకారంతో నోటికి వచ్చినట్లు వాగకు. వయస్సులో పెద్దదానివి. నీ మర్యాదను నీవు కాపాడుకో. ఇంకొక్కమాట నా బావను గురించి నీవు తప్పుగా అంటే నిన్ను కార్లోంచి కిందకు త్రోసి చంపేస్తాను జాగ్రత్త!" ఆవేశంతో చెప్పింది కావ్య.


ఆమె మాటలకు నందాదేవి జంకింది. అన్నంత పని చేస్తుందేమోనని భయం కలిగింది. మౌనంగా కూర్చుంది.


కారును సుబ్బారాయుడి ఇంటి ముందు ఆపింది కావ్య. తను కారు దిగి వెనుక డోర్ వైపుకు నడిచి డోర్ తెరిచి "ఏయ్ నందాదేవి! నీవు ఎలాంటి దానివో.. నీ గత చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. నేను సత్యానందరావు, రఘునందనరావు గార్ల మేనకోడలిని. నారాయణరావు గారి మనుమరాలిని. పెద్దదానివని గౌరవమైన పదవిలో వున్నావని రోడ్డులో కారు ఫెయిల్ అయ్యి బాధపడుతున్నావని సాయం చేసిన నన్ను.. నా బావను గురించి నీచంగా ఎలా మాట్లాడగలిగావు? తప్పు కదూ... అహంకారం అన్నివేళలా మంచిది కాదు. మనుషులను మనుషులుగా చూడ్డం నేర్చుకో" పక్కకు జరిగి డోర్ తెరిచి..

"దిగు.." అంది కావ్య.


ఆగ్రహావేశాలతో నందాదేవి కారు దిగింది.

కావ్య కార్లో కూర్చొని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు నడిపింది.

భోజనానంతరం నందాదేవి తన గదిలో మంచంపై వాలింది. ఉదయం కావ్య తనను అన్నమాటలు ’ఏయ్!.. నందాదేవి!.. నీవు ఎలాంటిదానవో నీ గత చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. నేను సత్యానందరావు రఘునందనరావు గార్ల మేనకోడలిని.. నారాయణరావు గారి మనుమరాలిని...’

నందాదేవి చెవుల్లో మారుమ్రోగాయి... రఘునందన... రఘునందన..


అప్రయత్నంగా ఆ పేరును ఆమె పెదాలు పలికాయి. మనోదర్పణం మీద గత స్మృతులు...


సుబ్బారాయుడి భార్య అనసూయ.. ఎంతో దైవభక్తి. నోములు, ఉపవాసాలు, పూజాపునస్కారాలు, దానం ధర్మం, పరోపకార చింతన కలిగిన ఇల్లాలు. సుబ్బారాయుడుగారు దానికి పూర్తిగా వ్యతిరేకం.

ఎదుటివాడు పచ్చగా వుంటే చూడలేడు. ఆ వూరికి వచ్చిన రెండేళ్ళలోనే గ్రామ ప్రజానీకానికి రెండు వర్గాలుగా తన దుష్ట రాజకీయ తంత్రాలతో చీల్చేశాడు. ఆ వూర్లో వీరి రాకముందు వున్న ఐకమత్యం అడవుల పాలయ్యింది.


ఇద్దరు కొడుకులు. ఆనంద్ పెద్ద.. చిన్న రాంబాబు. ఓ కుమార్తె నందాదేవి.

నందాదేవికి పదేళ్ళ ప్రాయంలో ఆ వూరికి వచ్చి సెటిల్ అయినాడు సుబ్బారాయుడు.


ఆనాటికి సత్యానందరావు గారి తాతగారు కృష్ణారావు.. సత్యానందరావు గారి తండ్రి నారాయణరావు గారికి ఆ చుట్టుప్రక్కల పది పన్నెండు గ్రామాల్లో చాలా గొప్ప పేరు. వారికి ఆ కీర్తి.. వారి తత్వాన్ని అనుసరించి వారికి సంక్రమించింది. సత్యం.. ధర్మం.. దానం.. నీతి నిజాయితీ వారి సొమ్ము... అది.. సుబ్బారావుగారికి అసూయ.


వారిని మించిన వారుగా తాను కావాలని మనస్సున ఆశ...

ఐదేళ్ళ తర్వాత ఆ గ్రామానికి తాను సర్పంచిగా అయ్యాడు. అంతవరకు కృష్ణారావుగారికి పోటీ అనేది లేదు. యునానిమస్.. ఏకగ్రీవం..

కృష్ణారావు.. నారాయణరావులు.. సుబ్బారాయుడిని అభినందించారే కాని.. అసహ్యించుకొని ద్వేషించలేదు.


ఆరవ సంవత్సరంలో శివాలయ ట్రస్టీ పదవి సంపాదించాడు సుబ్బారాయుడు.

దానికి కృష్ణారావు కుటుంబీకులు చలించలేదు. ’మార్పు అనేది మంచికే...’ పరామర్శించ వచ్చిన వారికి వారు ఇచ్చిన సమాధానం.


నందాదేవి యుక్తవయస్కురాలైంది. ఆమె ఎదిగేకొద్ది సుబారాయుడికి పరపరి పెరిగింది. కాంట్రాక్టర్‍గా మారిపోయి మంచిపేరును డబ్బు సంపాదించాడు.


సత్యానందరావు, రఘునందనరావు, నారాయణరావుగారి కొడుకులు. రఘునందన రెండవ వాడు. మంచి అందగాడు. నందాదేవి కన్నా రెండు సంవత్సరాలు పెద్ద. ఒకే స్కూలు, కాలేజీలో చదివేవారు. నందాదేవికి రఘునందన అంటే ఇష్టం. అలాగే రఘునందనకూ నందాదేవి అంటే అభిమానం.


రెండు కుటుంబాల మధ్యన సయోధ్యత లేనందున... వారు నోరు తెరచి మాట్లాడుకొని ఎరుగరు.

కాలగతిలో ’ధనం హెచ్చిన మదంహెచ్చును’ అన్న సామెత ప్రకారం సుబ్బారాయుడు. రాంబాబు, కృష్ణారావు గారి కుటుంబ సభ్యుల గురించి పదిమందిలో చులకనగా మాట్లాడటం రెండు మూడు పర్యాయాలు రఘునందన వినడం జరిగింది. తాను విన్నదాన్ని తాతగారికి తండ్రిగారికి అన్నగారికి చెప్పి విచారపోయాడు. సహనానికి మారుపేరైన వారు.. ’ఎవరి పాపం వారిని హరిస్తుంది... అనవసరంగా నీవు బాధపడకు...’ అని రఘునందనకు నచ్చచెప్పేవారు.


తాత... తండ్రి... అన్నయ్య మాటల వలన రఘునందనకు అర్థం అయ్యింది. ’ఆ రెండు కుటుంబాలు ఏకం కావడం... ఈ జన్మలో జరగని పని అని..’


కానీ సుబ్బారాయుడి మనస్సున ఆ కుటుంబాన్ని ఏ రీతిగానైనా తన గుప్పెట్లోకి తీసుకోవాలనే ఆశ.. అతని కొడుకు ఆనంద్, నారాయణరావు గారి పెద్ద కూతురు అన్నమ్మను ప్రేమించాడు. ఆమె నాయనమ్మ రుక్మిణీదేవి గొప్ప సంగీత విద్వాంసురాలు. అన్నమ్మ తన నానమ్మగారి వద్ద సంగీతం నేర్చుకొంది. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయా ఆలయాల వార్షిక ఉత్సవాలు (తిరుణాల్లో) సప్తాహ్నికంగా కాని, పంచాహ్నికంగా కాని... ఒకరోజు ఓ రెండు గంటల పాటు అన్నమ్మ కచేరీ జరిగేది. ఆ కచేరికి ఆనంద్ తప్పనిసరిగా వెళ్ళేవాడు. ఎంతో వినయం, విధేయతా, అద్భుత సంగీత పాండిత్యం వున్న అన్నమ్మను తన ఇల్లాలుగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు ఆనంద్. అతను తల్లి పోలిక. సుబ్బారాయుడి తత్వం కాదు.


ఆనంద్ తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. ’బంగారం లాంటి పిల్ల... నా కోడలైతే... నాకు ఎంతో ఆనందం’ అంది సుబ్బారాయుడు భార్య అనసూయ.


సుబ్బారాయుడి ఆలోచనే వేరే... ’ఆ పిల్ల నాయింటి కోడలైతే... ఆ కుటుంబం నా గుప్పెట్లోకి వస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నామటకు ఎదురుండదు’ అనే భావన..


మంచిరోజు... సమయం చూచుకొని గ్రామ పురోహితులతో కలిసి కృష్ణారావు గారి ఇంటికి వెళ్ళి సుబ్బారాయుడు తన నిర్ణయాన్ని తెలియజేశాడు.


సమాధానంగా కృష్ణారావు.. "మీతో తూగే అంత తాహతు మాకు లేదు. క్షమించండి. మా పిల్ల మీ ఇంటి కోడలు కాలేదు" ఖచ్చితంగా వారి నిర్ణయాన్ని తెలియజేశాడు కృష్ణారావు.


పురోహితులు ఏదో చెప్పబోయారు. ఎడంచేతి చూపుడు వేలిని తన నోటికి అడ్డం పెట్టుకొని అతనివైపు చూచాడు కృష్ణారావు గారు.


వచ్చిన ఇరువురూ అవమానంతో కృష్ణారావును తిట్టుకుంటూ.. వీధిలోకి ప్రవేశించారు.

విషయాన్ని విన్న ఆనంద్ శివాలయంలో అన్నమ్మను కలిసి తన నిర్ణయాన్ని చెప్పి పారిపోయి పెండ్లి చేసుకొందాం అన్నాడు. అన్నమ్మ అందుకు అంగీకరించలేదు. ’నీమీద నాకు అలాంటి అభిప్రాయం లేదు’ అంది అన్నమ్మ.

నెలరోజుల లోపల తన చెల్లెలు కొడుకు సదాశివంతో అన్నమ్మ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించారు కృష్ణారావు, నారాయణరావులు.. సదాశివం గారిది అదే వూరు.

అన్నమ్మను ఎంతగానో అభిమానించి వివాహం చేసుకోవాలనే నిర్ణయంతో వుండిన ఆనంద్.. ఆవేదనతో తప్పతాగి దిగుడు బావిలో దూకి చచ్చిపోయాడు.


సుబ్బారాయుడి కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. వూరిజనం.. ఆనంద్ చావుకు అన్నమ్మ అని వ్యాఖ్యానించారు. 


ఆ కారణంగా ఆ రెండు కుటుంబాల మధ్యన ద్వేషం... కక్ష.. పగ ప్రబలాయి.

కొందరు.. "వాడు ప్రేమిస్తే సరిపోయిందా... ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించాలిగా!.. ఒక చేతిని గాల్లోకి విసిరితే శబ్దం వస్తుందా!.. తప్పు వాడిదే.. ఆ అమ్మాయిది కాదు’ అనుకొన్నారు.

ఆరుమాసాలు గడిచాయి.


సుబ్బారాయుడి హితులు... కావలి వాస్తవ్యులు రామచంద్రయ్య వస్త్రాల వ్యాపారి. అతని కొడుకు ప్రతాప్‍కు వివాహం చేయాలనే నిర్ణయంతో... నందాదేవిని వారు చూచి వున్న కారణంగా సుబ్బారాయుడికి ఫోన్ చేసి "నీ కూతురికి నా కొడుకు ప్రతాప్‍కి వివాహం జరపాలని నా ఉద్దేశ్యం. నీకు సమ్మతమేనా!" అడిగాడు రామచంద్రయ్య.


"ఆలోచించి చెబుతాను" క్లుప్తంగా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బారాయుడు.


వారి అర్థాంగి అనసూయమ్మ.. విషయాన్ని తెలుసుకొని "వారికై వారు అడిగారు కాబట్టి మనకు బాగా తెలిసిన సంబంధం కనుక కాదనకుండా ఒప్పుకొనడం మనకు మంచిది. ఆ అబ్బాయి ఎం.టెక్ ఇంజనీర్ కదా!.. ఆలోచించి ’సరే’ అనే మీ నిర్ణయాన్ని వారికి తెలియజేయండి" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళిపోయింది అనసూయ. వారి జవాబుకు ఎదురు చూడకుండా ఆమె అలా వెళ్ళిపోయేదానికి కారణం మనిషి ఎదురుగా వుంటే తన గొప్పతనాన్ని చాటుకుంటూ వాదనలో దిగుతాడు సుబ్బారాయుడు.


సుబ్బారాయుడు తన కొడుకు రాంబాబుతో కావలికి వెళ్ళి రామచంద్రరావు గారి షాపు, ఇల్లు వాకిళ్ళను చూచి వారితో తన సమ్మతిని తెలియజేశాడు. అదే వూర్లో వున్న తన అక్క నాగమ్మ కూతురు శాంతిని చూచి చెల్లెలితో మాట్లాడి వూరికి తిరిగి వచ్చాడు.


నెలరోజుల్లో ముందు నందాదేవి వివాహం... మూడు గంటల వ్యత్యాసంతో కొడుకు రాంబాబు వివాహాన్ని జరిపించాడు సుబ్బారాయుడు.


వివాహం నాటికి నందాదేవి వయస్సు... ఇరవై రెండు.. రాంబాబు వయస్సు... ఇరవై ఎనిమిది... కృష్ణారావు, నారాయణరావుల మీద పంతంతో కొడుకు కూతురి వివాహాలు చాలా ఘనంగా చేశాడు సుబ్బారాయుడు. ఆ కుటుంబాన్ని వివాహాలకు పిలవలేదు.


నందాదేవి భర్తతో కలిసి హనీమూన్‍కు కేరళ రాష్ట్రానికి వెళ్ళారు. రాంబాబు లక్ష్మి వారణాసి గయ వైపు హనీమూన్‍కు వెళ్ళారు. ఆయా ప్రాంతాల్లో సరదాగా తిరిగి ఆనందించారు.


పదిరోజుల తర్వాత స్వస్థలానికి చేరారు. తిరిగి వచ్చిన రోజునుంచీ ప్రతాప్ జ్వరంతో మంచం ఎక్కాడు. మూడవ రోజున గతించాడు. 


పెండ్లి జరిగిన పదహారు రోజులకే... నందాదేవి.. పసుపు కుంకుమలకు దూరం అయింది. ప్రతాప్ అంతిమ సంస్కారాలు పూర్తి అయిన తర్వాత నందాదేవి పుట్టింటికి వచ్చేసింది.


ఇంటిల్లిపాది నందాదేవి దుస్థితికి ఎంతగానో బాధపడ్డారు. ఇది సుబ్బారాయుడుకి రెండవ షాక్.. అయినా పశ్చాత్తాపం లేదు. అహంకారం పెరిగింది. కృష్ణారావు కుటుంబ సభ్యుల పట్ల ద్వేషం తారాస్థాయికి ఎదిగింది.


ఓ నెలరోజులు మౌనంగా వుండిన నందాదేవి యం.ఎ చదువుతానని తిరుపతికి వెళతానని తండ్రి, తల్లికి తెలియజేసింది.


చిన్నవయస్సులోనే భర్తకు దూరం అయిన.. ఆమె మామగారు రామచంద్రయ్య దంపతులు కొడుకు పోయిన వేదనతో పాటు నందాదేవి స్థితికీ ఎంతగానో బాధపడ్డారు. సుబ్బారాయుడు,

రామచంద్రయ్యగారు మంచి స్నేహితులు కాబట్టి.. నందకు మరో వివాహం జరిపించి ఆమె జీవితానికి ఆనందాన్ని కలిగించాలని మాట్లాడుకొనేవారు.


రామచంద్రగారి అన్నయ్య రామారావు గారు విజయవాడలో హోటల్స్ యజమాని. వారికి ఇరువురు కుమారులు. శంకర్.. ఈశ్వర్.. శంకర్‍కి వివాహం జరిగి రెండు సంవత్సరాలు. అతని భార్య గౌరి కాన్పు సమయంలో మగ శిశువును ప్రసవించి బాలింతగుణంతో మరణించింది.


రామారావు తన అన్నయ్యతో ’చినబాబు క్షేమం కోసం పెంపకం కోసం... శంకర్‍కు మరో వివాహం చేయాలనేది తమ దంపతుల నిర్ణయం అని’ అందుకు శంకర్ కూడా సమ్మతించినట్టు రామారావు అన్న రామచంద్రయ్యకు చెప్పాడు.


ఆ విషయాన్ని రామచంద్రయ్య సుబ్బారాయుడికి తెలియజేసి ’బావా! మన నందాదేవికి శంకరానికి వివాహం జరిపిస్తే బాగుంటుంది. నీవు అక్కా కలిసి నందతో మాట్లాడండి’ చెప్పాడు రామచంద్రయ్య.

నందాదేవితో తల్లి తండ్రి అన్న ఆ సంబంధాన్ని గురించి మాట్లాడారు. మొదట నిరాకరించిన నందాదేవి... చివరగా తన తల్లి చెప్పిన మాటలకు చలించింది.


"నందూ! మేమందరం నీకన్నా పెద్దవాళ్ళం. నీకంతే ముందు పోవాల్సినవాళ్లం. నీకంటూ జీవితాంతం వరకు తోడునీడగా ఓ మనిషి... నీ మనిషి... నీకు అవసరం.. పైగా ఆ పసిబిడ్డకు తల్లిలేదు.. ఆ భగవంతుడు నీకు తల్లి స్థానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆనందంగా అంగీకరించు. మంచి ఇల్లాలిగా, తల్లిగా మారి నీ జీవితానికి పరిపూర్ణతను సంతరించుకో.. నా మాట విను తల్లీ!" ఆ మాటను విన్న నందాదేవి ఆలోచించి.. తన పెద్దలకు వివాహ సమ్మతిని తెలియజేసింది.


"నాకు ఆ వివాహానికి సమ్మతం. చాలా సింపుల్‍గా తిరుమలలో మా వివాహం జరగాలి" అంది నందాదేవి. 


అందరూ ఆనందించారు. విషయాన్ని రామచంద్రయ్యకు తెలియజేశారు.

మూడువారాల తర్వాత... నాల్గవ వారంలో ముహూర్తం..

అందరూ తిరుమలకు చేరారు. నందాదేవి శంకర్‍ల వివాహం జరిగింది.


వివాహానంతరం రెండు కుటుంబాల సభ్యులు విజయవాడకు తిరుమల నుంచి కార్లలో బయలుదేరారు. కావలికి ముందు వధూవరుల కారుకు బ్రేక్ ఫెయిల్ అయినందున ముందు వెళుతున్న లారీకి గుద్దుకొని రోడ్డు సైడ్‍కు దొర్లింది. డ్రైవర్.. శంకర్ మరణించాడు. నందాదేవికి తీవ్రగాయాలు తగిలి ఒక కాలు విరిగింది. నాలుగు వారాలు హాస్పిటల్లో వుండి డిశ్చార్జి అయ్యింది. ఎడమకాలిలో ప్లేట్లు వుంచి సరిచేశారు.


నందాదేవికి రెండో వివాహం అయిందని పేరేగాని... ఆమె తన అత్తగారి ఇంటిని చూడలేదు. ఇరవై మూడు సంవత్సరాలనే రెండుసార్లు పసుపు, కుంకుమలకు దూరం అయింది. ఊరిజనం... నందాదేవి నష్టజాతకురాలని అనుకొన్నారు. ఆ సంఘటన కారణంగా నందాదేవి ఎంతగానో బాధపడింది. వారంరోజులు తిండీ నీళ్లు మానేసింది. పలకరించ వచ్చిన వారిని కసిరి వెళ్ళిపొమ్మనేది.


ఆ తర్వాత.. ఏం ఆలోచించిందో... ఏం నిర్ణయం తీసుకొందో... ఏమీ జరగనట్లు మామూలుగా అందరినీ పలకరించడం, టైమ్ ప్రకారం స్నానం, భోజనం, పెద్దవారైన తల్లి తండ్రిని ప్రీతిగా పలకరించడం, అందరితో నవ్వుతూ మాట్లాడటం ప్రారంభించింది. అధికార పార్టీలో సభ్యురాలుగా చేరింది. వచ్చిన సర్పంచి ఎలక్షన్లలో నిలబడి విజయాన్ని సాధించింది.


జీప్.. ఒకదాన్ని కొని వారి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడి సర్పంచులలో వారి వారి అవసరాలను గురించి చర్చించేది. జిలా పరిషత్ ఛైర్మన్ గారిని కలుసుకొని తన ప్రాంతపు గ్రామాల అవసరాలను గురించి వివరించేది. ఫండ్స్ సాయం చేయవలసిందిగా అర్థించేది. సంవత్సరం లోపలే నందాదేవి పేరు జిల్లాలోని అన్ని గ్రామాలకు, పెద్ద వూర్లకు తెలిసేలా తిరిగి తిరిగి జనంలో తనకు గుర్తింపును ఏర్పరచుకొంది నందాదేవి.


తనకంటే సీనియర్ నాయకులతో పరిచయం... పార్టీని గురించి చర్చలు సమావేశాలు జరిపి జనహిత నాయకురాలుగా పేరు తెచ్చుకొంది. పార్టీ జిలా కార్యదర్శిగా ఎదిగింది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


28 views0 comments

Bình luận


bottom of page