'Kalagamanam' - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 05/03/2024
'కాలగమనం' తెలుగు కథ
రచన: విజయా సుందర్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"మమ్మీ! మమ్మీ.."
తన గదిలో నుండి గావు కేకలు పెడుతున్న మనవరాలు 'స్మిత' గొంతు విన్న సూరమ్మ, 'దీని నోటి నుంచి కోపంలో కూడా ఈ ముదనష్టపు పిలుపు తప్ప రాదు కదా' అని తిట్టుకుంటూ తన గదినుండి బయటకు వచ్చి, "ఎందుకే అలా అరుస్తావు? మీ మమ్మీ ఈ టైం లో ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నదీ?" అంటూ సాగదీసింది.
"ఓ ఓల్డ్ లేడీ! నువ్వు వచ్చావా...డిస్గస్టింగ్ " అంటూ విసవిసా నడుచుకుంటూ వచ్చి, టేబిల్ మీద పెట్టిన తన మొబైల్ తీసుకుని ఇంగిలీషులో తల్లి మీద అరిచి, 'ఓల్డ్ లేడీ ' అంటూ తన మీద ఏదో చెప్పింది.
అంతా అలా మ్రాన్పడి చూస్తున్న సూరమ్మ, ఏమీ తినకుండా మళ్లీ బైటకి వెళ్లబోతున్న మనవరాలిని, తిని వెళ్ళమని చెప్పింది మార్దవమైన గొంతుతో. స్మిత అదేమీ పట్టించుకోకుండా, మళ్లీ మళ్లీ బ్రతిమాలుతున్న నాయనమ్మని విసుగ్గా చురచురా చూసి, "యూ ఓల్డ్ లేడీ... ఎందుకే ఆ షిట్ తినమని వేధిస్తావు?" అంటుంటే సూరమ్మ ఇంకా ఊరుకోలేక, ఇంగ్లీష్లో, "యు హావ్ గ్రోన్ దిస్ టాల్ ఈటింగ్ దాట్ షిట్ ఓన్లీ.. బెటర్ మైండ్ యువర్ టంగ్ యు యంగ్ లేడీ" అన్నది ధాటిగా!
అవాక్కయింది అమ్మడు, పల్లెటూర్లో పేడ మనిషి గా తన లెక్కలోని ఈవిడ ఇంత చక్కని ఉచ్చారణతో ఇంగ్లీష్ మాట్లాడటమా అని! ఈమెకి తెలియదు పెళ్ళైన కొత్తలో, సూరమ్మ ని భర్త మెట్రిక్ కి కట్టించి, ఇంగ్లీష్ పేపర్ చదవటం అలవాటు చేశాడని. కాస్త జోరు తగ్గించి, .. "నో వే నేను అవి తినలేను" అంటూ వెళ్ళిపోయింది.
'హు! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా నా పిచ్చి గానీ' అనుకుని నిట్టూర్చిందావిడ!
నవనాగరికత మాత్రమే జీవనవిధానమని, ఇంగ్లీష్ లో మాట్లాడటం మాత్రమే సంస్కారామని తమ ఇంటి పద్ధతులుకి తిలోదకాలిచ్చేసిన కామేశ్వరి ఉరఫ్ కామేషి పిల్లలు స్మిత, శ్రీకాంత్ లను కూడా అదే పద్దతిలో పెంచింది. భర్త మురారి మాట చెల్లకుండా తన నోటితో అదుపు చేసేసింది. అత్తగారు సూరమ్మ భర్త కాలం చేశాక, కొడుకు తన దగ్గరకి వచ్చి ఉండమన్నా, ఆవిడ కోడలి పద్దతులకి ఇమడలేక పల్లెటూళ్ళో ఒంటరిగానే ఉంటున్నది. మురారి బలవంతం మీద అప్పుడప్పుడూ వస్తోంది.
శ్రీకాంత్ అర్ధరాత్రి దాటుతుండగా, కొద్దిగా తూలుతూ వస్తూ తన గదిలోకి వెళ్తుంటే సూరమ్మ విస్తుపోయి చూసింది. ఇంకో గంటకి కోడలు గేటు దగ్గర సిగరెట్ నుసి దులిపి నోట్లో పెట్టుకుని పీలుస్తూ, దింపడానికి వచ్చిన ఆయన చెయ్యి పట్టుకుని ఊపేస్తుండటం, వరండాలో కూర్చుని, ఆ కుటుంబ తీరు తెన్నులకి అతలాకుతలమైన మనసుతో వగస్తున్న సూరమ్మ భరించలేకపోయింది! ఎంతో ఆవేశంగా లేచి వాకిట్లోకి వెళ్లబోయింది.
తాళం తీసుకుని లోపలికి వచ్చిన కామేశ్వరి అత్తగార్ని అక్కడ చూసి, "అదేమిటీ.. మిమ్మల్ని పది రోజులయ్యాక తెమ్మని అతనికి చెప్పానే... అప్పుడే ఎందుకు వచ్చారు?"
సూరమ్మ తానింకా ఎందుకు బ్రతికున్నానా అనుకుంటూ, "అతనెవరో?" అన్నది పళ్ళ బిగువున తన మనసుని బిగబట్టుకుని.
అసలు ఆ కోడలు ఆవిడ ఉనికిని భరించలేక అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్న ఆలోచనే లేని ఆమె విసవిసా లోపలికి వెళ్ళిపోయింది.
మేడ మీద ఉన్న కొడుకు దగ్గరకి వెళ్ళి సూరమ్మ, " ఏమిటిరా ఈ సంసారం తీరు? అసలు నువ్వు కళ్ళు తెరుచుకుని ఉన్నావా?"
అప్పుడే మందు ఫిక్స్ చేసుకుంటున్న మురారి, " అమ్మా! నేను బ్రతికి ఉన్న శవాన్ని. నన్నేమీ అడగకు. నీకు కావాల్సినంత కాలక్షేపం నీ గదిలో ఏర్పరిచాను, నీకు కావాల్సిన వంట విశాలమ్మ గారు చేసి పెడతారు. నువ్వు హాయిగా ఉండు, నన్ను హాయిగా ఉండనివ్వు. ఈ కాస్త సమయం నాది. అమ్మా!, మా అమ్మవు కదూ... నన్ను ఇలా వదిలేసి నువ్వు పడుకో. రేపు ఆదివారం కదా. మనిద్దరం ఒక ప్రశాంతమైన చోటికి వెళదాము. అక్కడ నేను నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను. నా చిన్న నాటి ముచ్చట్లు, చెల్లాయి జీవితం లోని మధురిమలు నాకు పూసగుచ్చినట్లు చెప్పాలి. నేనింక ఎన్నో రోజులు బ్రతకనమ్మా" అంటూ పసిపిల్లవాడిలా ఏడుస్తున్న చెట్టంత కొడుకుని అక్కున చేర్చుకుని తల నిమురుతూ ఉండిపోయింది, కారిపోతున్న కన్నీళ్ళు తుడుచుకునే ప్రయత్నమైనా చెయ్యని ఆ కన్నతల్లి!
పగిలిపోతున్న గుండెని చిక్కపట్టుకుని, గబగబా తన గదిలోకి వచ్చింది. 'ఆఖరి మాట ఏమిటీ నా బాబిగాడన్నది', ఏమిటి ఎక్కవ రోజులు బతకడా? అంటే... నిర్వేదంలో అన్నాడా? లేక ఏదన్నా నయం చెయ్యలేని జబ్బు చేసిందా? ఏమయ్యింది నా చిట్టి తండ్రికి?'. సూరమ్మకి మురారి, వాడి చెల్లెలు వాగ్దేవి చిన్నతనం గుర్తుకొచ్చింది...
ముచ్చటైన దాంపత్యం సూర్యలక్ష్మి, గోవిందరావులది! అన్యోన్యమైన ఆ జంటకు మురారి జన్మించాక మరీ ఆనందం అంబరమంటింది. పెళ్లయిన ఐదేళ్ళదాకా సంతానం కలగకపోతే చుట్టపక్కాలు ఎకసెక్కాలాడారే గానీ, గోవిందరావు, ఆయన తల్లిదండ్రులూ చిన్న మాట కూడా అనలేదు కోడల్ని. పైపెచ్చు, "లోపం నీలోనే ఉండి ఉంటుందని అనుకోవడం ఎందుకే పిచ్చి పిల్లా... మా అబ్బాయిలో కూడ ఉండవచ్చు కదా. అయినా మీకేం వయసు మించి పోలేదు. నాకూ మూడేళ్ల తర్వాతే కడుపు పండింది. అదీ వీడి తరవాత మళ్లీ రానేలేదు. నువ్వేమీ అందరి మాటలూ మనసులో పెట్టుకోకు" అని ఓదార్చే అత్తగారిలో ఆ అమ్మవారినే చూసుకున్న సూర్యలక్ష్మి తన బాధని భర్త ప్రేమ, అత్తమామల ఆప్యాయతలో మర్చిపోగలిగింది.
అత్తగారి నమ్మకం వమ్ముపోకుండా మురారి కడుపులో పడ్డాడు. ఇంట్లో అందరి ఆనందానికి హద్దే లేదు. వాడి ముద్దు ముచ్చటల్లో ఏడాది తిరిగ లేదు, వాగ్దేవి కడుపున పడ్డది. ఆనందం రెట్టింపు అయ్యే సమయంలోనే, అనుకోని విపత్తు సంభవించింది!
గోవిందరావు తండ్రికి ఊళ్ళో ముమ్మురంగా ఉన్న విషజ్వరం సోకి నిమిషాల మీద, డాక్టర్ దగ్గరకి వీసుకువెళ్లే వ్యవధి ఏ మాత్రమూ ఇవ్వకుండా మృత్యువు కబళించింది. ఇంత ఆకస్మాత్తుగా సంభవించిన భర్త మృత్యువుని తట్టుకోలేని ఇల్లాలు గోవందరావు తల్లి ఆయనని తీసుకు వెళ్తున్నప్పుడు విరుచుకు పడిపోయిన ఆమె ఇంక లేవలేదు. నిస్పృహతో ఆహారం తీసుకోక బలహీనమైన ఆమెని కూడా విషజ్వరం కబళించేసింది. గోవిందరావు, సూర్యలక్ష్మి ఈ వరస మరణాలకు తట్టుకోలేకపోయారు.
చిన్న పిల్ల వాడు ఉన్నాడు కనక, సూర్యలక్ష్మి కడుపుతో ఉన్నది కనుక ఆ ఇంట్లో ఉన్న ఇద్దరూ మౌనంగా బ్రతుకు ఈడుస్తున్నారు. సూర్యలక్ష్మి తల్లిదండ్రులు, అప్పట్లో అది రివాజు కాకపోయినా అనుకోని కష్టం వచ్చిన కూతురి దగ్గర ఉన్నారు.
బలహీనంగా ఉన్న సూర్యలక్ష్మికి కాన్పు కష్టమై ఆపరేషన్ చేశారు.డాక్టర్ ఇంక పిల్లలు కలగడం ఆమె ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదని ఎంత చెప్పినా, ఆమె అత్తగారికిచ్చిన మాట తప్పి తానుగా పిల్లల్ని కనడం మాననని తెగేసి చెప్పింది. గోవిందరావు పుట్టిన కూతుర్ని చూసి ఏ కొద్దిగా సంతోషించాడో కానీ తల్లిదండ్రుల మరణం ఆయనలో ఆశ అనేది లేకుండా చేసి, ఒక వేదాంతిలా మార్చేసింది. భార్య నిర్ణయానికి, "ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది" అని నిర్వేదంగా ఉండిపోయాడు.
తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడన్నట్లు, గోవిందరావు మానసిక ధైర్యం రోజురోజుకీ దిగజారి పోతున్నది. దానికి తోడు మూడేళ్ళ మురారికి డబుల్ టైఫాయిడ్ వచ్చింది.
పసిపిల్లవాడు అల్లాడిపోతున్నాడు ఎంతకీ జారని జ్వరంతో. నెలల పిల్ల వాగ్దేవి, ఈ జ్వరము పిల్లవాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న భార్య అవస్థ... మళ్లీ ఏదో జరగబోతున్నది అని బెంగపడిపోయాడు. ఏ జబ్బు లేకపోయినా మంచానికి అంటుకు పోతున్న భర్త ని చూసి, తెచ్చిపెట్టుకున్న ధైర్యం తో సంసారాన్ని నడుపుతున్న సూర్యలక్ష్మికి, పుట్టింటి వాళ్ల ఆసరా మాత్రమే కొండంత అయింది.
పట్నం నుండి డాక్టరుని పిలిపించి మురారి జబ్బు నయం చేసుకోగలిగారు గానీ... ఇంక జీవితం విసిరే సవాళ్ళని తట్టుకోలేనంటూ గోవిందరావు తనువు చాలించాడు.
సూర్యలక్ష్మికి లోకం చీకటయింది. అగాధం లోకి కూరుకుపోతున్న మనసుని పగ్గాలేసి పట్టుకున్నది, తన కన్నీళ్లు తుడుస్తున్న బుడి బుడి నడకల తమ కలల పంట మురారి, చిక్కుముళ్ళల్లో పుట్టిన చిన్నారి వాగ్దేవిని అక్కున చేర్చుకుని, జీవన సంగ్రామానికి నడుం కట్టింది, ఆ ఇల్లాలు!
భగవంతుని దయవల్ల డబ్బుకేమీ కొరత లేనందున, తన అన్నదమ్ముల అండదండలతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయగలిగింది. తల్లి దండ్రులు దాటిపోయారు.
కొడుకు మురారి ఇంజనీరింగ్ చదువుతుండగానే, తెలిసిన చుట్టాల్లో మంచి సంబంధం వస్తే వాగ్దేవి పెళ్లి చేసేసింది. చాలా మంచి ఇంట్లో పడ్డది. హాయిగా కాపురం చేసుకుంటున్నది.
ఒకరోజు తనతో చదువుకుంటున్నదని, కామేశ్వరిని తీసుకొచ్చాడు మురారి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది... కానీ మనుషుల పొడ గిట్టనిదానిలాగా ఉన్న ఆమె ప్రవర్తన చూసి, కొడుకు ఆమెని పెళ్లి చేసుకుంటానన్న సంగతి చెప్పినప్పుడు నయాన, ఆఖరికి భయాన కూడా చెప్పింది... ఆ అమ్మయితో కొడుకు సుఖఃపడలేడని, అందం శాశ్వతం కాదనీ. పోగాలం దాపురించాక ఎవరి చేత చెప్పించినా వినలేదు. పెళ్లి అయిన నెల రోజులేమన్నా సుఖంగా ఉన్నాడేమో.ఆ తరవాత నరకం చూపిస్తున్నది మనిషి ముసుగులో ఉన్న ఆ రాక్షసి!
ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేదు. ఆవిడ ఉద్యోగం చెయ్యదు. పల్లెటూళ్ళో ఆస్తి ఎందుకు, అమ్మి పారేసి తల్లిని తమతో ఉండమంటుంది. ఆవిడ మనస్తత్వం తెలిసిన మురారి రెండోసారి తల్లిని కదిలించే ప్రయత్నం చెయ్యలేదు. భార్య మాట వ్యతిరేకించినది అదొక్కటి, తల్లి మాట విన్నదీ పల్లెటూరులో ఆస్తి అమ్మకుండా ఉండటం. మొత్తం తగలేసి అందరూ వీధిని పడ్డప్పుడు ఆదుకునేది ఈ ఆస్తేనని సూరమ్మ కూడా కఠినంగా ఉండిపోయింది.
తెల్లవారుతుండగా, ఒక జులపాల వాడితో తూలుకుంటూ గదిలోకి వెళ్తున్న మనవరాల్ని నిర్వేదంగా చూసింది ఆవిడ, ' అయిపోయింది ఈ కుటుంబం పరువు, ప్రతిష్ఠ! అసలు కుటుంబమే కూలి పోయాక ఇంకా ఏమిటి' అనుకున్నది.
ఆరోజు మురారి చక్కగా గడ్డం గీసుకుని, తలారా స్నానం చేసి, తెల్లని లాల్చీ పైజామా వేసుకుని, తల్లి చక్కగా అలంకరించి పూజ చేసిన దేవుడి ఫోటోకి దణ్ణం పెట్టుకుని, తల్లి చేసిన పులిహోర, చక్కెరపొంగలి, దద్ద్యోజనం ఎంతో ఆబగా తిన్నాడు...ఎన్నాళ్ల నుండో తిండి లేని వాడి లా తింటున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది. ఇక్కడ ఈ ర్రాక్షసుల మధ్య అతన్ని వదిలి, తన ఆత్మాభిమానం నిలుపుకున్న తన మీద తనకే అసహ్యం వేసింది సూరమ్మకి. దాంతో పాటు ఏవో తీర్మానాలు మనసునిండా సుడులు తిరగసాగాయి!
ఇద్దరూ ఒక సుందర నందనవనం లాంటి ఉద్యానవనానికి వెళ్లారు. ఊరవతల తనకోసం ఏర్పాటు చేసుకున్న ఏకాంత మందిరం. అక్కడికి వెళ్తూనే మురారి మరో మనిషై పోయాడు. అక్కడ చిన్న సరసులో నడయాడుతున్న బాతులతో కబుర్లు చెప్పాడు, చెట్టు మీద తన రాగాలాపన తో సందడి చేస్తున్న కోయిలతో గొంతు కలిపి కృష్ణ శాస్త్రి గారి పాట పాడాడు. తల్లి కళ్లల్లో మెరుస్తున్న ఆనందం అతనికెంతో తృప్తినిచ్చింది.
తల్లి ఒళ్ళో తలపెట్టుకుని అడిగి అడిగి చెప్పించుకున్నాడు, తండ్రి, తాత మామ్మలతో గడచిన తన బాల్యాన్ని. తాను ఎత్తుకు మోసిన చిన్నారి వాగ్దేవి కబుర్లు... ఇల్లాలయి, ఇద్దరు బంగారు తల్లుల తల్లి అయ్యి భర్తతో అందమైన, ఆనందమైన జీవితం గడుపుతున్న చెల్లెలి గురించి వింటూ పులకించిపోయాడు!
"ఇంత అభిమానమున్న నేను చెల్లిని చూసేందుకు ఎందుకు వెళ్లనని కదా నీ సందేహం? వద్దమ్మా నా నీడ కూడా దాని మీద పడకూడదు. నా పెళ్ళాం రాక్షసి దాని పెళ్లికి ఎన్ని అవరోధాలు తెచ్చిపెట్టింది... బావ మంచిముత్యం కనుక దాని మాటలు, అది సృష్టించిన ఉత్తరాలు నమ్మలేదు."
కొడుకు మాటలతో అంతా గుర్తు వచ్చింది, ఈర్శ్యతో వాగ్దేవి మీద, కామేశ్వరి కల్పించిన నిందలు!
అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మురారి. అన్నీ విని సూరమ్మ, "బాబీ నేను నిన్నొక్క వరం అడుగుతాను ఇస్తావా నాన్నా" అన్నది.
కరిగిపోయాడు కొడుకు, " అమ్మా! చెప్పమ్మా ఏదైనా సరే చేస్తాను. నేను ఎప్పుడూ నీ దగ్గరనించీ తీసుకోవడమే కానీ ఇవ్వలేదు" అన్నాడు.
తన కోరిక చెప్పింది సూరమ్మ.
" అమ్మా! నేనే అడుగుదామనుకున్నాను. నువ్వే ఇచ్చావు నాకా వరం. నేను ఉద్యోగం రిజైన్ చేసాను. ఆ రాక్షసి కుటుంబానికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళ పేరు మీద మార్చి అన్నీ రెడీ చేసేసాను. నువ్వు ఇప్పుడు ఇలా అడగకపోతే నేను రిశీకేశ్ లో స్వామీజీ దగ్గరకి వెళ్లిపోయేవాణ్ణి! నా రోజులు ఇంక రెండు నెలలు మహా అయితే"
కొడుకు నోరు మూసింది సూరమ్మ.
"నువ్వు నా మాట పూర్తిగా వింటే అన్నీ చక్కబడతాయి. నీకేం తక్కువని చావాలి? మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టు" అని రకరకాలుగా జీవితం పట్ల ఆశ కలిగించింది.!
ముందు కొడుకుని తీసుకుని తమ ఊరు వెళ్లి, కొన్నాళ్ళు ఉన్న మందులు వాడుతూ, అప్పుడు పట్నం తీసుకెళ్లి మెరుగైన వైద్యం, మంచి ఆహారం, విశ్రాంతి తో మురారి అనుకున్న దానికంటే ముందే హై బీపీ, షుగర్, అల్సర్. అన్నీ తగ్గించుకున్నాడు. అక్కడ్నించీ అల్లుడి సహకారంతో అన్ని పుణ్యక్షేత్రాలూ తిప్పింది.
అసలు తన ఉనికి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లి సాంగత్యంలో ఆధ్యాత్మిక జీవనం అలవరచుకున్నాడు. ఎంతో ప్రశాంతత!
గుడిలో నిరంతరం కీర్తనలు పాడే అనుపమ విధి వంచితురాలు. తాను కూడా కీర్తనలు మళ్లీ సాధన చేసి పాడేవాడు. ఆ నేపథ్యంలో ఇద్దరికీ మంచి స్నేహం కలిసింది.
ఉత్తమ ఆభిరుచులు కలిగిన అనుపమ వైపు సహజంగానే ఆకర్షింపబడ్డాడు మురారి. భర్తను కోల్పోయిన అనుపమకు కూడా తన బాధను మురారి సాంగత్యం సేదదేరుస్తున్నట్లుగా ఉన్నది. వాళ్లిద్దరూ తమది స్నేహమే అనుకుంటున్నా, సూరమ్మ ఆలోచనలు వాళ్ళని ఒకటి చేస్తే....దెబ్బతిన్న పక్షులు రెండూ సాంత్వన చెందుతాయేమో అనుకుంటున్నది! రాగల కాలమే తీర్పు చెప్పాలి!
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
Comments