'Kalahala Kapuram' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'కలహాల కాపురం' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
జలజారి శ్రీమంతుడు, బాగా చదువుకున్నవాడు. గ్రామములోనే నివసిస్తున్నాడు. కారణం పూర్వీకుల ఆస్తి- అంటే ఊరిలో అందరి ఇండ్లకంటె పెద్ద భవంతి, భూములు కూడా చాలానే ఉండుట చేత, ఊరిలో పలుకుబడి కూడా కలిగిన పెద్దమనిషి కావడమే.. భార్య పేరు తాళిక. జగడానికి వెనుకకు పోని ప్రకృతి ఆమెది. కొడుకులు నలుగురు, కూతుర్లు లేరు.
కొడుకులు చదువుకొని పట్టణములో నివసిస్తుంటారు. వాళ్ళ నలుగురికి పెళ్ళిళ్ళు చేస్తాడు. అప్పుడు నలుగురు వేరు వేరుగా కాపురం చేస్తుంటారు. ఇక ఏ బాధ్యత లేకుండా సుఖంగా ఉండాలనుకున్న జలజారికి- ఏ పండుగో పబ్బమో జరుపుకున్న నాడు నలుగురు కొడుకులు, కోడళ్ళు రావడము సంతోషానికంటె వాళ్ళ కలహాలు అణుచ లేక తబ్బిబ్బవుతుంటాడు.
చీటికి మాటికి ఏ బలమైన కారణము లేకుండా తగవులు పెట్టుకోవడము పరిపాటి ఉన్న నాలుగు రోజులు..
జలజారి కొడుకులకు చెబుతాడు “చూడండి నాయనా! పరమ శివుని కాపురము- శంకరుణి ఇంట్లో సంఘీభావము చూపుట లోకానికి ఒక పాఠమే.
1. పులికి ఎద్దుకు పడదు = పార్వతీ పరమేశ్వరుల వాహనాలు.
2. పాముకు ఎలుకకు పడదు = శివుని మెడలో పాము. గణపతి వాహనము ఎలుక.
3. నెమిలికి పాముకు పడదు = కుమార స్వామి వాహనము నెమలి. శివుని మెడలో పాము.
4. పార్వతి గంగ సవతులు. శివుడు గంగను తలపై నిలుపుకున్నా పార్వతి సహిస్తుంది.
ఈ సత్యము గ్రహించండి నాయనలార. రామ లక్ష్మణులు అన్నదమ్ములే కద.. వారిలో సహనము ప్రేమ అనురాగ ముండుట చే జనము నేటికి దైవముగా కొలుస్తారు. వాస్తవానికి రాముడు ఒక క్షత్రీయుడు. చక్రవర్తి అయినా వారి మంచి తనముతో రాముడు దేవుడైనాడు. కాని తాను దేవుడనని చెప్పుకోలేదు.
మరి నాకెందుకీ ఖర్మ! నేను ఏమి లోపము చేశానని. మీరు అందరు వేరు వేరుగ ఎవరి కాపురమ వారు చేసుకుంటున్నారు. మీ అమ్మకూడ అగ్నిలో ఆజ్యము పోస్తుందేకాని జగడాలు వద్దని ఒక్కనాడు కూడ చెప్పదు. ఆమెకు అదేమి సంతోషమో” అని బాధ పడుతాడు జలజారి.
గణపతి వాహన గర్తాట ననగను
పశుపతి గళనాగు బట్ట జూచు
సామిది వాహన సహసాన దినజూచు
పశుపతి మెడలోని పాము నపుడు
చండిక వాహన చండక దినజూచు
నభవుని వాహన నంది ననగ
గజరిపు తలపైన గంగను జూచుచు
ఈశ్వరి జెందగ ఈర్ష యపుడు
చంద్రు డనగ శిరము చల్లగ నిలువగ
శివుని నుడిటి కన్ను శివము ఎత్త
పరమ శివుడు విషము పానము జేయును
సదన మందు పోరు సహన మనక
చూడండి నాయనలార ఈ పద్యము చదివి అర్థము చేసుకొని నాకా పరిస్తితి తేకండి. మీకు అర్థము కాకపోతె వివరించి చెబుతాను వినండి అంటు......
గణపతి వాహనము గర్తాట అంటె ఎలుక.
పశుపతి గళ నాగు అంటె శివుని మెడలో పాము.
అంటె పాము ఎలుకను తిన జూస్తది.
సామి అంటె కుమార స్వామి అతని వాహనము సహసాన అంటె నెమలి.
ఆ నెమలి శివుని మెడలోని పామును తిన చూస్తది.
చండిక అంటె పార్వతి ఆమె వాహనము చండక అంటె పులి.
నభవుడు అంటె శివుడు అతని వాహనము నంది అంటె ఎద్దు. అంటె పులి ఎద్దును తిన జూస్తది.
గజరిపు అంటె గజాసురుని శత్రువు శివుడు. అతని తలమీద గంగ నిలుస్తది, ఆ గంగను చూచి పార్వతికి ఈర్ష కలుగుచుంటది.
చల్లటి చంద్రుడు శివుని తలమీద ఉండగా శివుని నుదిటి నిప్పులుగక్కే కన్ను తీష్ణంగా చూస్తది.
ఇవన్ని చూడ లేక పరమ శివుడు విషము త్రాగుటడట ఇది ఒక కవి చమత్కారంగా చెప్పి నా మన యింటి పరిస్థితికి ఉపమానంగా తీసుకోవలసి వస్తుంది”.
తండ్రి ఆవేదన చూసి కొడుకులకు కొంత పరివర్తన కలిగి ఆ రోజు మాత్రము ఏ పేచీ పెట్టకుండ గమ్మున ఉండి మరునాడు ఎవరి దారిన వాళ్ళు పోతారు.
తాళిక మాత్రం భర్తతో అంటుంది “మీరు ఏవేవో కథలు చెప్పి వాళ్ళు నిమ్మళంగ ఉండకుండ చేశారు పాపం!” అని కళ్ళు తుడుచుకుంటుంది.
“ఇదేమి రావణ కాష్టమే.. నన్ను నిమ్మళంగ ఇంట్లో ఉండనీయవా” అంటాడు కోపము వచ్చినా దిగమింగుకోని జలజారి.
“మీ ప్రకృతి తెలిసి కూడా అదుపులో పెట్టక పోవడము నాదే తప్పు.
అశ్వంబు చెడుదైన ఆరోహకుణి తప్పు
దంతి దుష్టైన మాష్టీను తప్పు
తనయుండు దుష్టైన తండ్రి తప్పు
కూతురు చెడుగైన మాత తప్పు
భార్య గయ్యాళైన ప్రాణ నాథుని తప్పు
అని ఉపమానంగ చిన్నప్పుడుచదివిన పద్యము జ్ఞాపకమున్నంత వరకు చదువుతాడు జలజారి.
అప్పుడు తాళికకు కోపము వస్తుంది కాని సౌమ్య చిత్తము ప్రకటించక పోవడముతో పారిజాతాపహరణము పద్యము మాదిరి అనగా..
అనవిని వ్రేటు బడ్డ యురగాంగన వోలె
నేయి బోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల
యనంగ లేచి హెచ్చిన కనుదోయి కెంపు
తన చెక్కిట కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై..
అని నట్లు ప్రవర్తిస్తుంది. అదీ పూర్తిగ జ్ఞాపకము లేని పద్యము తలచుకొని భార్య ప్రవర్తన చూసి వాపోతాడు జలజారి ఈ వయసులో ఏమీ అనలేక.
నీదీ ప్రవర్తనే కాని పరివర్తన రాదా అని భార్యను అంటాడు విసుగుతో ఉండబట్టలేక.
మళ్ళీ ఒకనాడు దీపావళి పండుగకని నలుగురు కొడుకులు కోడళ్ళు వస్తారు. ఆరోజు మాత్రము ఇల్లు కళకళ లాడుతుంది కొడుకులు, కోడండ్రుమనుమలు, మనుమరాండ్రతో. జలజారి చాలా సంతోష పడుతాడు. తెల్లవారి షరా మామూలే ఏదో ఒక సాకుతో యేరాండ్లు తగవులాడుకుంటారు.
ఇక జలజారికి చాలా విసుగేసి ఇదేమిటి ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అనుకుంటాడు మనసులో.
ఇక లాభము లేదనుకొని ఉన్న ఆస్తిని ఐదు సమాన భాగాలు చేసి నలుగురికి నాలుగు భాగాలు, ఐదవ భాగము తమకు అని ఉంచుకొని ఇకనైనా కలహాలు పెట్టుకోకండి నేను బ్రతికున్నంతకాలము అంటు గద్గద స్వరముతో బాధపడుతాడు జలజారి.
సీసం..
దామోద రుండును దారువు అయెనన
ఏలన దెలుపగ ఎరుగ సతులు
ఇరువురు ఉండగ ఇబ్బంది అతనికి
నిలిచియు ఒకతన నిలువ దొకతి
శేషుడు ఉదధిలొ సేమము ఉండగ
పయనము జేయను పనికి రాడు
గరుడిని రమ్మన్న గనగను ఉరగము
దానిని దినజూచు ధర్మ మొదిలి
ఆ. వె.. ఇట్టి బాధ లుండ ఇందీవ రుండన
కొయ్య బారి పోయె కొసకు జూడ
పూరి యందు జేరి పూజలు బొందుతు
జగము నాథు డనుచు జనము గొల్వ.
ఇద్దరు భార్యలున్న ఈశ్వరేశ్వరుడంటె కష్టాలు వచ్చి కడకు కొయ్యబారి పోయిండు. నాకు ఒక్కదానితోనే ఒడలు వణుకు చున్నది. ఆ విష్ణువు తో మొరపెట్టుకుంటే నా సంగతి తెలిసికూడ నన్ను తలుచుడేమిటి అంటాడేమొ.. అనుకొని మనసు చిన్న బుచ్చుకొని- తనగదిలో తను ఏ పురాణమో చదువుకుంటూ ఉంటాడు జలజారి.
కొడుకుల్ బుట్టరటంచు నేడ్తురవివేకుల్
జీవన భ్రాంతులై లెస్సగా కొడుకుల్ బుట్టిరి కౌరవేంద్రునకు
వారిచే నే గతుల్ బడసేన్ యా కొడుకుల్ బుట్టని
శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్.
ఈ పద్యము చదువు కుంటు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా నాకు నలుగురు కొడుకులని సంతసించాను కాని ఈ కీచులాటలతో నా పరువుపోయింది పరమేశ్వరా.. అని దిగాలు పడిపోతాడు జలజారి.
ఊరుకునుడు అంత ఉత్తమము లేదు అను కుంటూ.
సమాప్తము.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments