top of page

కళలకు కాణాచి ప్రకృతి


'Kalalaku Kanachi Prakruthi' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally

'కళలకు కాణాచి ప్రకృతి' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అనాది కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యమొనరించుటకై అనేక కృత్యములాచరించుచున్నాడు. వీటిలో కొన్ని ఉపయోగ దృష్టితోనూ కొన్ని సౌందర్య దృష్టితోను చేయబడుచున్నట్లు కాననగును. ప్రతిభా నైపుణ్యములకు అనుకూలమైన వీటన్నింటిని కళలు అని అంటారు. వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు. వీటిలో మొదటి తెగకు చెందినవి మానవ శరీర సౌందర్యమునకు, రెండవ తెగకు చెందినవి మానవ హృదయానందమునకు తోడ్పడును. మొదట తెగవానిని సామాన్య కళలని రెండవ తెగ వాటిని లలిత కళలని చెప్పవచ్చును. లలిత కళలనగా..


1. శిల్పము, . 2. సంగీతము, . 3. నృత్యము, . 4. కవిత్వము, . 5. చిత్ర లేఖనము.


సృష్టిలో కళ లేని స్థానము కళ లేని మానవుడు కళ లేని పశు పక్షాదులు కనలేమనుటలో అతిశయోక్తి లేదు. ప్రకృతి అంతా కళలమయం. మనిషి మాట్లడుటలో కళ, ఆడుట లో కళ, పాడుటలో కళ, తినుటలో కళ, తిరుగుటలో కళ నవ్వుటలో కళ ఇట్ల ప్రతి కదలికలో కళను దర్శిస్తాము. పసి పిల్లల నవ్వులో ఏడ్పులోనూ ఒక విధమైన కళ ద్యోతకమైతది. కళ లేనిది సృష్టియే లేదు . సూర్యుని వెలుతురూ కళనే, చంద్రుని వెన్నలా కళనే. చెలియలికట్ట చెంత కూర్చొని చూస్తె సముద్రపు అలలూ కళనే. కళలలో అందము, ఉల్లాసము, ప్రేరణ ఆత్మీయత, అనురాగము, చెప్పాలంటె కళలు ఒక సముద్రమంత విశాలము.


మానవుడు తినడానికి తిండి, ధరించడానికి వస్త్రాలు, ప్రాథమిక అవసరాలు సమకూర్చుకున్న తరువాత మానసికోల్లాసము కొరకు కళల పట్ల ఆకర్షితుడౌతాడు. అప్పుడు తాను స్వయంగా కళా సృష్టి చేస్తాడు. లేదా ఇతరులు చూపే కళా ప్రదర్శనలో పాల్గొంటాడు. ఆదివాసులు, జానపదులు నగర వాసులు అను భేదము లేకుండా వారి వారి రీతులలో కళలను ఆరాధించెవాళ్ళే.


భారతీయ సంస్కృతిలో కళలు . అరువది నాలుగు. వీటినే చతుస్షష్టి కళలు అంటారు. అవి కూడ వివిధ రకాలలో ఉంటాయి. ఈ చతుస్షష్టి కళలు ఒక శ్లోకములో తెలుపబడ్డాయి. శ్లోకము;. వేద వేదాంగేతిహాసాంగమ, న్యాయ, కావ్యాలంకార, నాటక, గాన, కవిత్వ, కామశాస్త్ర, శకున, సాముద్రికా, రత్న పరీక్షా, స్వర్ణ పరీక్షాశ్వలఖ్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ, దోహళ గంధ వాద, ధాతువాద, ఖనీవాద, రసవాదాగ్నిస్తంభ, జలస్తంభ, వాయుస్తంభ. ఖడ్గస్తంభ, వశ్యాకర్షణ, మోహన, విద్వేషోఛ్ఛాటన, మారణ, కాలవంచన, వాణిజ్య, పాశుపాల్య, కృష్యా, సవకర్మ లావుక, యుద్ధ, మృగయా, రతి కౌశలా, దృశ్యకరణీ, ద్యూతకరణీ, చిత్ర, లోహ, పాషాణ, మృద్దారు, వేణు, చర్మాంబర క్రియా చౌర్తషసిద్ధి, స్వరవంచనా, దృష్టివంచనాంజన, జలప్లవన, వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల, మహేంద్రజాలఖ్య, చతుస్షష్టి విద్యా నిషద్వాయమాన నిర్వద్య విద్వజ్ఞాన విద్యోదితే.


ఈ అరువది నాలుగు కళల వివరాలు.


1. వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము. 2. వేదాంగములు. వేదమునకు సంబంధించిన ఆరు శాస్త్రములు. 1. శిక్ష, 2. వ్యాకరణము, . 3. ఛందస్సు, . 4. జ్యోతిషము, . 5. నిరుక్తము, . 6కల్పము. 3. ఇతిహాసము. రామాయణము, భారతము, భాగవతము, పురాణాదులు. 4. ఆగమశాస్త్రము. 1. శైవాగమము, 2. పాంచరాత్రాగమము, . 3. వైఖాసనాగమము, . 4. స్మార్తాగమము. 5. న్యాయము. తర్క శాస్త్రము 6. కావ్యము. కబ్బము, కృతి, ప్రబంధము. 7. అలంకారము. సాహిత్య శాస్త్రము. 8. నాటకములు. రూపకము, రూపము, నర్తనము. 9. గానము. సంగీతము. 10. కవిత్వము. ఛందోబద్ధముగ పద్యముగాని, శ్లోకము గాని రచించడము.


11. కామ శాస్త్రము. 12. ద్యూతము. జూదమాడడము దీనినే అక్షసూక్తమందురు. 13. దేశ భాషా జ్ఞానము. 14. లిపికర్మ. దేశ భాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయు విధానము. 15. వాచకము. ఏ గ్రంథమైనను తప్పు లేకుండ శ్రావ్యముగ, అర్థవంతముగ చదువు నేర్పు. 16. సమస్తావధానములు. అష్టావధాన, శతావధాన, నేత్రావధానాది అవధానములలో నైపుణ్యము. 17. స్వర శాస్త్రము. ఉఛ్వాస నిస్వాసలకు సంబంధించినదై ఐడా పింగళా సుసుష్మ నాడులకు చెందిందినదై చెప్పబడు శుభాశుభ ఫల బోధకమైన శాస్త్రము. 18. శకునము. ప్రయాణాది కాలమున పక్షులు, జంతువులు, మానవులు ఎదురుగా రావడము గూర్చి గాని ప్రక్కలకు వెళ్ళడము గూర్చి సంభాషించు భాషణములను గూర్చి గమనించి తన కార్యము యొక్క శుభాశుభములు నెరుంగునట్టి శాస్త్రము. 19. సాముద్రికము. హస్త రేకలు, బిందువులు, వగైరాల గురించి శుభాశుభములు యెరుంగునట్టి శాస్త్రము. 20. రత్న పరీక్ష. నవ రత్నముల గురించి వాటి ప్రభావం, నాణ్యత వాటి గుణాల నెరుగు జ్ఞానం.


21. స్వర్ణ పరీక్ష. బంగారము స్వఛ్ఛత గుర్తించు జ్ఞానము. 22. అశ్వ లక్షణము. గుర్రములకు సంబంధించిన జ్ఞానము. 23. గజ లక్షణము. ఏనుగుకు సంబంధించిన జ్ఞానము. 24. మల్లవిద్య. కుస్తీలు పట్టు జ్ఞానము. 25. పాక కరమ. వంటలు చేయు విధానము. 26. దోహళము. వృక్ష శాస్త్రము. 27. గంధవాదము. వివిధములైన సువాసనలు, అత్తరు, పన్నీరు, వంటివి తయారు చేయు విధానము. 28. ధాతువాదము. రసాయన వస్తువులెరుంగు జ్ఞానము. 29. ఖనీవాద. గనుల గురించి తెలుసు శాస్త్రము. 30. రసవాదము. పాదరసము మొదలైన వాటితో బంగారము మొదలైన వాటిని చేయు విధానము.


31. అగ్ని స్తంభన . నిప్పులో కాలకుండ నడుచు విధము. 32. జల స్తంభన. నీళ్ళు గడ్డకట్టించి అందులో మెలగుట. 33. వాయు స్తంభన. గాలిలో తేలియుండు విద్య. 34. ఖడ్గ స్తంభన. శతృవు ఖడ్గాలను ఎదుర్కొను విద్య. 35. వశ్యము. పరులను లోబరచుకొను విద్య. 36. ఆకర్షణము. పరులను చేర్చుకొను విద్య. 37. మోహనము. పరుల మోహింపజేయు విధము. 38. విద్వేషము. పరులకు విరోధము కల్పించడము. 39. ఉఛ్చాటనము. పరులను ఉన్నచొటునుండి వెడలుగొట్టుట. 40. మారణము. పరులకు ప్రాణ హాని కల్పించడము.


41. కాలవంచనము. కాలముగాని కాలముగ పరిస్థితులు మార్పు కలిగించడము. 42. వాణిజ్యము. వ్యాపారములు చేయు చతురత. 43. పాశుపాల్యము. పశువులను పెంచడములో నేర్పు. 44. కృషి. వ్యవసాయములో మెళకువలు. 45. ఆసవ కర్మ. ఆసవములు. మందులు చేయు పద్ధతి. 46. యుద్ధము. యుద్ధము చేయు నేర్పు. 47. లావు కర్మ. పశుపక్షాదులను వశపరచుకొను విధానము. 48. మృగయా. వేటాడు నేర్పు. 49. రతి కళా కౌశలము. శృంగార కార్యములో నేర్పు. 50. అదృశ్యకరణీ. పరులకు కానరాని రీతి.


51. ద్యూతకరణీ. రాయబార కార్యములలో నేర్పు. 52. చిత్ర. చిత్రములు వేయు కళ. 53. లోహ. పాత్రలు చేయు నేర్పు. 54. పాషాణ. రాళ్ళు చెక్కడము (శిల్పకళ) 55. మృత్. మట్టితో చేయపని. 57. వేణు. వెదురుతో చేయు పని. 58. చర్మ. తోళ్ళ పరిశ్రమ. 59. అంబర. వస్త్ర పరిశ్రమ. 60. చౌర్య. దొంగతనము చేయుటలో నేర్పు.


61. ఓషదసిద్ధి. మూలికల ద్వారా కార్య సాధనా విధానము. 62. మంత్ర సిద్ధి . మంత్రముల ద్వారా కార్య సాధనము. 63. స్వరవంచన. కంఠధ్వనివల్ల ఆకర్షించడము. 64. దృష్టి వంచన. అంజనము. చూపులతో ఆకర్షణ.


ఇవిగాక పాదుకా సిద్ధి. అనగా ఇంద్రజాల, మహేంద్రజాలములు. తలచిన చోటికి చేరెడు గారడీ విద్య. హస్త కళలు. చిత్రలేఖనం.. కలంకారి.. నగిషీ.. ముగ్గులు. దృశ్యకళలు. ... రేఖా చిత్రం.. చిత్ర లేఖనం.. ముద్రణ.. ఛాయా చిత్రం.. చలన చిత్రం.. జానపద కళలు.. అలంకరణ.


కాలానుగుణ్యంగా వచ్చి చేరిన కళనేకం మచ్చుకు. వాహన చోదక కళ, . అంతరిక్ష పరిశోధనా కళ, గణక యంత్రకళ, . ముష్టెత్తు కళ, భవన నిర్మాణ కళ,


1. చిత్ర లేఖనము: ఇది చక్షురింద్రియము ద్వారా మనస్సుకూఅనందము కలిగించును. చిత్రలేఖనము చిత్రిత వస్తువు యొక్క సంపూర్ణమైన ఆకారమును గాక అందలి ఒకే పార్శ్వమును మాత్రమే చూడగలము. అదియునుగాక చిత్రకారుడు దృశ్యమును బాగా పరిశీలించి తన చిత్రమును రూపొందించును. ఆ క్షణము గడిచి పోయినచో ఆ దృశ్యము యొక్క స్తితియందు కొంత మార్పు జరుగవచ్చును. ఈ మార్పునుగూడా సూచింప దలచినచో చిత్రకారుడు మరియొక్క చిత్రమును రచించవలసినదే.


2. శిల్పము: ఇదికూడా కొంచెమించుమించు చిత్రలేఖనము వంటిదే . చక్షురింద్రియము ద్వారా మానసమునకు ఆనందము చెకూర్చును. ఇందు వస్తువు యొక్క కించిత్కాల స్తేయమైన ఏకైక విన్యాసమే ప్రదర్శింపబడును. కాని శిల్పియందు వస్తువును సంపూర్ణాకృతిగా ప్రదర్శించ జాలును. శిల్పి చెక్కిన సమగ్ర విగ్రహములందు మనము అన్ని పార్శ్వములను కూడా చూడ గలము. చిత్ర లేఖనమును మనము తాకి చూచినచో అందలి విశేషణమును ఏమియు దర్శించ జాలము . శిల్పమున్నట్లు కాక స్పర్శచే అందలి నిమ్నోన్నత భాగములను గుర్తించి పరిశీలించగలము. చిత్ర లేఖనమును గురించి విని విషయమును ఇట్లా ఉంటుందని గ్రహించడానికి మాతమే అర్హుడు కాని శిల్పమైనచో అతడు చేతితో తాకి స్పర్శ ప్రభావముతో దాని రమణీయమును అంతనూ కాకపోయిననూ కొంచెమైనను గ్రహించి ఆనందించుటకు అవకాశమున్నది.


3. సంగీతము: ఇది శ్రవణేంద్రియముల ద్వారా మనసుకు ఆనందము కలిగించును. కేవలము స్వరమైనమైనది. స్వరాశ్రయమైనట్టిది. తాళ, లయ ఆశ్రయమైన నృత్యమువంటిది. ఇది మానవులకేకాక ప్రాణవంతమైన జంతుజాలమంతయు తన వైపు ఆకర్షించుకొనగలదు. అందుచేతనే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అను నానుడి ఏర్పడినది.


4. నృత్యము: ఇది భావాశ్రయమైనది. ఇది పదార్థాభినయాత్మక మైన మార్గమని ప్రసిద్ధి చెందినది. జనులు సామాన్యముగా నృత్యము, నాట్యము అందలి బేధము తెలియక రెండింటిని సమానార్థకముగా తలతురు. దశరూపకారుడు అన్యధ్భావాశ్రయం నృత్యం అనియు, ధనికుడు రసాశ్రయాన్నాత్యాద్భావాశ్రయం నృత్యమన్యదేశం అనియు ఈ రెండింటికి బేధము నిరూపించారు. నాట్యము రసాశ్రయమైనది. ఇందు కావ్యాబ్దాభినయము గోచరించును. నృత్యము ఆంగికాభినయము ప్రాధాన్యము వహించుచున్నది. నాట్యము సాత్వికాభినయ బహుళమై ఒప్పుచుండును. నృత్యము కూడా నృత్తము వలెనే శ్రవణేంద్రియముకంటె చక్షురింద్రియమునకే ఎక్కువ ప్రీతి కలిగించును. నృత్యము క్షణ చాంచల్యమున దళావిపర్యయమును కూడా సూచింపజాలియుండును.


5. కావ్యము: ఇది శ్రవణేంద్రియములకు అపార ప్రీతి కలిగించి మనస్సునకు అధికముగా ఉల్లాసము కలిగించును. ఇతర లలితకళలందెచటను లేని వాక్సాహాయ్యము దీనికి ఉన్నది. ఈ సాహాయ్యముచే కవి దృశ్యమును వర్ణించి వానిని పఠితుల మనఃఫలకముల సాక్షాత్కరింపజేయును. ఈ విధముగా ఇందు సంగీతమును, చిత్ర లేఖనము ఆశ్రితములైయుండి మనసునకు ఆనందము కలిగించును. ఈ వాక్కే లలిత కళలలో కావ్యమునకు అగ్రస్థానము ఒసంగుచున్నది. సప్త సంతానములందే కాక లలితకళలలో కూడ ప్రసిద్ధిగాంచి ఖిలము గాకుండ శాశ్వితంగా ఉండునది కవిత్వమే.


సంగీత, నాట్యములు రెండును తత్కర్తలు పాడుచు ప్రదర్శించుచు ఉండునంత కాలమే మనకానందమొసగును. చిత్ర లేఖనము కాల క్రమమున మాసిపోవుటకవకాశమున్నది. శిల్పము శిలామయమగుటచే కొంత దీర్ఘకాలము ఉండజాలినను శాశ్వితము మాత్రము కాదు. కవిత్వము శబ్ధమయమగుటచే శబ్ధముండు నంతకాలము అక్షరమై యుండజాలును. ఈ విధంగా శాశ్వితమును బట్టి చూచినను లలిత కళలలో కవిత్వమునకే అగ్రస్థానము.


లలిత కళలలో కావ్యమునకు అగ్రస్థానమున్నట్లే కావ్యములలో నాటకమునకు అగ్ర తాంబూలము లభించుచున్నది . అందుకే కావ్యేషు నాటకం రమ్యం అంటారు. తెలుగువారికి అపూర్వమైన జానపద కళా వారసత్వమున్నది. జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తున్నది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి అనడం లో అతిశయోక్తి లేదు. ఇలాంటి సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం జానపద ప్రదర్శన కళలకు తెలుగు భూమి పండిన పంటపొలం లాంటిది. ఎన్నో రకాల జానపద ప్రదర్శన కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి.

శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలే.


జానపద కళలు రెండు రకాలు.


1. స్వర జానపద కళలు . అందరూ వివిధ సందర్భానుసారంగా పాడుకునే గేయాలు, సామెతలు మొదలైనవి.


2. వృత్తి జానపద కళలు. ఒక కులము వారు జీవనోపాధి కొరకు వృత్తిగా స్వీకరించే కళలు.


1. పెళ్ళి పాట, . 2. మౌఖిక సాహిత్యములో పురాణాలు, . 3. సోది, . 4. తోలుబొమ్మలాట, 5. బుర్రకథలు, . 6. గంగిరెద్దులాట, . 7. బుడుబుక్కలు, 8. పెద్దమ్మలోళ్ళు. , 9. జమ్ముకలవారు, . 10. జంగాలు, . 11. బైండ్ల కథలు, . 12. జానపద నృత్యాలు.


ప్రకృతి, కళల మయము. సూర్యుని వెలుతురు ఒక కళ. , చంద్రుని వెన్నెల ఒక కళ(షొడష కళలు ), పూలలో కళ, దేవునిలో కళ, స్త్రీలలో కళ, నగరాలలో కళ, పిచ్చుకల గూడు ఒక కళ, కోయిల కూత ఒక కళ, తేనెటీగల తెట్టె ఒక కళ, నెమిలి నాట్యము ఒక కళ, పక్షుల కిలకిలారావాలు ఒక కళ, లేగల గంతులు ఒక కళ, ప్రకృతిలో చరా చరము లన్నియు కళలే.. నదుల ప్రవాహము ఒక కళ, అమ్మ ఒడిలోని బ్రతుకే ఒక కళ.


నింగిలో మేఘాలు ఒక కళ, సూర్యోదయం ఒక కళ, సూర్యాస్తమయము ఒక కళ, వర్షము కురుయుట ఒక కళ,

మగువ నుదుట తిలకము ఒక కళ, వస్త్ర ధారణ ఒక కళ, పసి పిల్లల వచ్చీ రాని మాటలు ఒక కళ, పసి పిల్లల బుడి బుడి నడకలు ఒక కళ, దైవారాధన ఒక కళ, పాఠ శాలలో ప్రార్థన ఒక కళ, పంక్తి భోజనము ఒక కళ. వడ్డన ఒక కళ, కళల వర్ణనే ఒక కళ.


అందుకే కళలకు కాణాచి ప్రకృతి. అందుకే "పుష్పేషు జాతి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అని అంటారు. అంటే ప్రకృతి లో పూవులు ఒక కళ, ప్రకృతి సృష్టికి మూలమైన పరమాత్మునిది ఒక కళ, స్త్రీ జాతిలో దేవ నర్తకి రంభదీ ఒక కళే, అట్లనే కంచిపట్టణాన్ని అందముగా తీర్చి దిద్దుట ఒక కళే. మొత్తానికి సృష్టి అంతా కళా రూపమే.

*** *** ***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page