#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Kalarathri, #కాళరాత్రి, #TeluguHorrorStories, #తెలుగుభయానకకథలు, #దెయ్యం కథలు, #TeluguGhostStory
'Kalarathri' - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 27/10/2024
'కాళరాత్రి' తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది డెంటల్ మెడిసిన్ కోర్స్ చదివే నలుగురు అమ్మాయిలుండే హాస్టల్ రూమ్. ఆ రూమ్ లో
గీతిక, జాహ్నవి, మంజుల, మమత ఉన్నారు.
ఆ రోజు ఆదివారం కావడం తో అందరూ రూమ్ లో ఉన్నారు.
"మన జానూ(జాహ్నవి) కి ధైర్యం ఎక్కువే . సీనియర్ సురేంద్ర కి పది మంది లో బుద్ది చెప్పింది" సాగదీసింది మంజుల ఫేస్ కి క్రీమ్ రాసుకుంటూ.
"అదేమన్నా గొప్పా? పగలు అందరూ ఉండగా" అంది గీతిక మూతి ముడుస్తూ!
"మరేం చెయ్యాలి?" అడిగింది మంజుల
"అర్ధ రాత్రి స్మశానానికి వెళ్ళి నే చెప్పిన చోట చెట్టుకి ఎర్ర గుడ్డ కట్టాలి. దానిమీద మన కాలేజి లోగో ఉంటుంది "
" పందెం ఏమిటో చెప్పు" అంది పుస్తకం నుండి తల ఎత్తిన మమత.
"పరీక్షలు చదువుకోకుండా, ఈ స్మశానాల గోల ఏమిటి" అంది జాహ్నవి.
"నువ్వు తగ్గద్దు జానూ, ఈ గీతిక పొగరు అణుద్దాం. వెడతానని చెప్పు " మిగిలిన ఇద్దరూ ముక్త కంఠం తో.
" పందేం విను. జాను అర్థ రాత్రి వెళ్ళి చెట్టు కి ఎర్ర గుడ్డ కడితే" ఐ" ఫోన్ ఇస్తాను.
"జానూ ఓడిపోతే తను నాకు ఐ ఫోన్ కొనాలి " అంది గీతిక.
"సరేనని చెప్పవే" అని మంజుల, మమత అన్నారు.
జాహ్నవి చివరకు ఒప్పుకుంది.
*******
పంజాగుట్ట కు దగ్గర లో ఉన్న స్మశానం. రాత్రి పదకొండు గంటలకి స్కూటి మీద బయలు దేరింది జాహ్నవి . సరిగ్గా పన్నెండు గంటలకి అడుగుపెట్టింది స్మశానం లోకి. దూరం గా రెండు శవాలు కాలుతున్నాయి. ఆ వెలుతురు తప్ప వేరే వెలుగు లేదు. కరెంట్ లేదు. కాటికాపరి శవాల్ని కదిపి తన రూమ్ కి వెళ్ళి పోయాడు. దూరం గా నక్కల ఊళలు వినిపిస్తున్నాయి. జాహ్నవి తన సెల్ ఫోన్ లైట్ తో ముందుకు వెడుతోంది.
జాహ్నవి ముఖాన్ని రెక్కల తో కొట్టి రెండు గబ్బిలాలు ఎగిరిపోయాయి.చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి. జాహ్నవి కాలికి మెత్తగా ఏదో తగిలింది. పామేమో! స్వతహాగా ధైర్య వంతురాలైనా జాహ్నవి కి ఆ వాతావరణం వెన్ను లో చలి పుట్టించింది.
చెట్టు దగ్గరికి రాగానే ఒక జుట్టు విరబూసుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఆ స్త్రీ లో గీతిక పోలికలు ఉన్నాయి.
"నేను వచ్చానో లేదో నని నాకన్నా ముందు వచ్చావా"
"ముందు రావడమేమిటి? ఇక్కడే ఉంటాను." అందా ఆ ఆకారం.
"ఇక్కడ ఉండడమేమిటి?"
"దెయ్యాలు ఇక్కడ ఉండక మరి ఎక్కడ ఉంటాయి?"
"దె... దె... య్య... య్య..."
జాహ్నవి తల మీద బలమైన చెట్టు కొమ్మ దెబ్బ తగిలింది.
జాహ్నవికి స్పృహ తప్పింది.
*******
ఉదయం ఆరు గంటలు. జాహ్నవి కళ్లు తెరిచింది.
ఎదురుగా కాటికాపరి. మై గాడ్ రాత్రంతా స్మశానం లో...
" రాత్రి ఎందుకొచ్చినట్టు"
" మా ఫ్రెండ్ ని వెతుకుతూ దారి తప్పాను. "
" జాగ్రర్త. పొరపాటున కూడా ఇటు రాకు. ఇది అఘెరా లు తిరిగే చోటు."
తరువాత కష్టపడి స్కూటి వెతుక్కుని హాస్టల్ కి వచ్చింది.
******
"గీతికా గీతికా" అని కేకలు పెట్టింది జాహ్నవి.
"గీతికా లేదు" చెప్పింది మంజుల.
"ఎక్కడికి పోయింది. పందెం చెడగొడదామని నా కన్నా ముందు స్మశానానికి వచ్చింది"
"స్శశానం ఏమిటి? నువ్వు వెళ్ళిన అరగంట కే గీతిక కి కడుపు నొప్పి అని హాస్పిటల్ లో జాయినయ్యింది. డాక్టర్లు అపెండీ సైటీస్ అని ఆపరేషన్ చేసారు"
" అంటే రాత్రి నిజంగా దె... దె.... య్యం...."
"ఏమిటీ గొణుగు తున్నావు "
అప్ఫుడు ఎదురుగా అద్దం లో గీతిక పోలికలున్న అమ్మాయి కనిపించింది.
" అదే అదే " అని అరిచింది జాహ్నవి.
" ఏముంది ఆద్దం లో " అడిగింది మంజుల.
మళ్ళి అద్దం కేసి చూసింది జాహ్నవి. ఒక్కసారిగా అద్దం ముక్కలైంది.
******
దెయ్యం ఇక్కడే ఉందా? స్మశానం నుండి వెంటబడుతోందా? గీతిక రాక పోతే గీతిక పోలికలున్న
అమ్మాయి ఎవరు? ఆలోచించే కొద్దీ తల తిరుగుతోంది జాహ్నవి కి.
" చూడు అక్కడి నుండి వచ్చాక డల్ గా ఉంటున్నావు. ఈ పిచ్చి పందాలు ఎందుకు?" అంది మమత అనునయం గా.
మమత ప్రక్కన ఒక అమ్మాయి కనబడింది.
"గీతికా హాస్పిటల్ నుండి ఎప్పుడు వచ్చావు?"
"గీతిక రావడమేమిటి? నేను, నువ్వు తప్ప ఎవరున్నారు?" అంది మమత.
మళ్ళీ చూసింది. అక్కడ ఎవరూ లేరు
*****'
రెండు రోజుల తర్వాత గీతిక వచ్చింది.
"ఈ పనికి రాని పందాలతో చూడు ఎంతో ఎనర్జీ తో ఉండే జానూ డల్లయ్యింది." అంది మమత.
" సారీ జానూ! ఆరోజు ఏమయ్యింది? "
జరిగినదంతా చెప్పింది జాహ్నవి.
'నా పోలికలతో దెయ్యమా' అని ఆశ్చర్యపోయింది గీతిక.
*******
అప్పటి నుండి రోజూ రాత్రి పన్నెండు గంటలకి ఆడ గొంతుక తో ఏడుపు వినిపించేది జాహ్నవికి. తలుపు తీసుకుని మేడ మీదకి వెళ్ళి కిందకి చూస్తే నిర్మానుష్య మైన వీధి లో జుట్టు విరబోసుకుని వెళ్ళే స్త్రీ కనిపించేది.
తరువాత జాహ్నవికి నిద్ర పట్టేది కాదు. జాహ్నవి తన సమస్య పరిష్కారానికి పారా సైకాలజిస్ట్ పరమేశ్వర్ ని సహాయం కోరింది
******
"నీ కేస్ విన్నాక నాకనపించింది ఏమిటంటే ఆ దెయ్యం నీ సహాయం కోరుతోంది"
అన్నాడు పరమేశ్వర్ గంభీరంగా.
"నేనెలా సాయపడగలను?"
"చూసావా ఇందాక ఉజా బోర్డ్ లో ఆత్మ ని పిలిచినపుడు
S A V E M E అక్షరాల దగ్గర కప్ ఆగింది."
"నువ్వు చూసిన దెయ్యం ఎవరి పోలికల్లో ఉందన్నావు?"
" గీతిక, నా రూమ్మేట్ "
" ఆమె ని ఒకసారి పిలు "
*********
అరగంట తర్వాత మంజుల, గీతిక వచ్చారు. పరమేశ్వర్ ఒక ప్రశ్న సూటిగా అడిగాడు.
" మీ బంధువుల్లో ఎవరైన నీ పోలిక తో ఉన్న వాళ్ళు చనిపోయారా? "
ఆ ప్రశ్న వినగానే గీతిక కి ఒక్క సారి భావోద్వేగానికి లోనయి ఏడ్చేసింది.
" సారి నిన్ను బాధ పెట్టాలని కాదు.." అన్నాడు పరమేశ్వర్ అనునయంగా.
"అవును నా అక్క రీతిక. రీతిక, నేను కవల పిల్లలం"
గీతిక చెప్పడం ప్రారంభించింది.
*********
" మాది అమలాపురం దగ్గరలో ఉన్న ముమ్మిడివరం. నేను అక్క ఇద్దరమే. ఇద్దర్నీ నాన్న గారు కాలు కింద పెట్ఠకుండా గారం గా పెంచారు.
ఇంటర్మీడియట్ లో అక్క రమేష్ అనే వేరే కాస్ట్ కుర్రాడిని ప్రేమించింది. నాన్న కోపం తో ఊగిపోయి అక్క కాలేజ్ చదువు మాన్పించారు. రెండు నెలల తర్వాత రమేష్ తో లేచిపోవాలని ప్రయత్నించి నాన్న పెట్టిన మనష్యులకి దొరికింది.
తర్వాత రమేష్ ఏమయ్యాడో తెలియలేదు. మూడు నెలల తర్వాత రమేష్ శవం రైలు పట్టాల మీద దొరికిందని ఊళ్ళో చెప్పుకున్నారు.
అది విన్న అక్క మా ఊరి పాడుపడిన బావి లో దూకి మాకు దూరమయ్యింది"
అది చెప్పి గీతిక కళ్ళు ఒత్తుకుంది.
"తర్వాత నాన్న గారు భయపడి ఈ గొడవలకి దూరం గా నన్ను సిటీకి పంపించారు. "
గీతిక కి ఇంత కధ ఉందా జాహ్నవి ఆశ్చర్యపోయింది.
"ఆయువు తీరకుండా రీతిక చనిపోవడం వల్ల ప్రేతమయ్యింది. రీతిక ప్రేతాన్ని అంత కన్నా పై నున్న లోకాలకి పంపితే కాని ఉత్తమ గతులు, పునర్జన్మ ఉండవు." అని పరమేశ్వర్ ఆలోచించి తన మొబైల్ లో చాలా సేపు వెదికి ఒక నెంబర్ ఇచ్చి కలవమన్నాడు.
ఆ నెంబర్ శరభయ్య శర్మది.
**********
శరభయ్య శర్మ జాహ్నవి చెప్పింది విన్నాడు. తరువాత ఒక పరిష్కారం సూచించాడు.
" వచ్చే ఆదివారం ఉదయం నుండి అర్ధ రాత్రి వరకూ కాళి ధ్యానం చెయ్యాలి. అర్ధరాత్రి సమయం లో ఆత్మ, హోమం లో పడి పైకి పొగ రూపం లో లేచిపోతుంది. చివరి ఘడియలు చాలా మఖ్యం. అక్కడ భయపడకూడదు. ఇందుకు సిద్దమేనా?"
జాహ్నవి సిద్దమేనంది.
"ఎందుకు రిస్క్ నీకు మా రాత ఏలా ఉంటే అలా అవుతుంది" అంది గీతిక.
"ఆ మాత్రం నా ఫ్రెండ్ కోసం చెయ్యలేనా "
******
అష్టదళ పద్మం మీద కూర్చుని జాహ్నవి కాళీ ధ్యానం ప్రారంభించింది. ఎదురుగా ఉన్న అగ్ని హోత్రం లో నెయ్యి వేస్తూ "ఒం, హ్రీం క్రీం" అంటూ మంత్రాలు చదువుతున్నాడు శరభయ్య శర్మ.
అర్ధరాత్రి సమీపిస్తుండగా ఇతర ఆత్మలు జాహ్నవి ధ్యానాన్ని భగ్నం చెయ్యడానికి ప్రయత్నించాయి. జాహ్నవి చలించలేదు. సరిగ్గా అర్థరాత్రి రీతిక ఆత్మ హోమం లోకి
ప్రవేశించింది. శరభయ్య మంత్రోచ్చారణ పెంచాడు. పెద్ద శబ్దం తో తెల్లని పొగ గాలి లో కలిసిపోయింది.
జాహ్నవి కళ్లు తెరిచింది.
"మన ధ్యానం ఫలించింది. రీతిక ఆత్మ పై లోకాలకి వెళ్ళి పోయింది. ఇక నీకు కనబడదు."
శరభయ్య శర్మ గారి పాదాలకు నమస్కరించి నిష్క్రమించింది జాహ్నవి
******
"థాంక్ యు ఫర్ ఎవ్విరి తింగ్" అని జాహ్నవి ని కౌగలించుకుంది గీతిక.
"ఏదైనా మా జాను యే చెయ్యాలి" అంది మంజుల.
" గొప్పే " అంది మమత.
"నాదేముంది ఆ కాళి అనుగ్రహం " భక్తి తో నమస్కరించింది జాహ్నవి
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments