top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

కలసి వుంటే కలదు సుఖం 



'Kalasi Unte Kaladu Sukham' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 16/08/2024

'కలసి వుంటే కలదు సుఖం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఆలా కళ్ళు చిట్లించుకుని సెల్ ఫోన్ లో టైపు చెయ్యటం ఎందుకు, రెండు కళ్ళు పోగుట్టుకుంటారా?” అని అంటున్న భార్య కీర్తి తో, “లేదే! మంచి కథ రాయటానికి ఐడియా ఆలోచిస్తున్నా” అన్నాడు విష్ణు.


“నెలకు ఒక్క కథ రాయటానికే యింత యిబ్బంది గా వుంది, మా తమ్ముడు యాదగిరి వారం వారం ఒక కథ వ్రాసి పత్రికలకి ఎలా పంపుతున్నాడో” అన్నాడు.


“ఒక్క కథ అయినా బాగుంటే చాలు, గంగిగోవు పాలు గరిటెడు అయినా చాలు” అంది. 


“అందుకే తెగ ఆలోచిస్తున్నా, ఏదైనా మంచి సబ్జెక్టు కోసం” అన్నాడు ఫోన్ పక్కన పెట్టేసి.

పక్కింటి సుందరమ్మ పిన్నిగారు లోపలకి రావడం చూసి సద్దుకుని కూర్చున్నాడు విష్ణు. 

“అన్నయ్య గారు ఇంట్లోనే వున్నారా? మంచి సమయానికి వచ్చాను, మీతో రెండు విషయాలు మాట్లాడాలి. పర్వాలేదా?” అంది సుందరమ్మ గారు.


“చెప్పండి, ఏమిటీ బాగా సంతోషం గా వున్నారు, యింటి గృహప్రవేశం పెట్టుకున్నారా?” అన్నాడు విష్ణు.


“అదే చెప్పాలి అని వచ్చాను, కీర్తి, ఆలా కూర్చొని నువ్వు కూడా విను, రేపు వచ్చే గురువారం సాయంత్రం మా యింటి గృహప్రవేశం, నాకు మగదిక్కు లేదు. మీరిద్దరే చుట్టాలు. అన్నయ్యా! నువ్వు, కీర్తి వచ్చి కార్యక్రమం జరిపించాలి. మా అమ్మాయి వసుధ వుంది గాని, ఎంత వరకు ఆఫీస్ పని గొడవే” అంది.


“భలే వారే! మేమిద్దరం తప్పకుండా వచ్చి మీకు పనులలో సహాయ పడతాం. కంగారు పడకండి, అన్నీ సవ్యంగా జరుగుతాయి. రెండవ విషయం ఏమిటి అమ్మాయి పెళ్లి కుదిరిందా?” అని అడిగాడు విష్ణు.

 

“అదే ఆ విషయం కే వస్తున్నా, చూడు అన్నయ్య, అమ్మాయి పెద్ద చదువు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తోంది. మంచి జీతం, నాకున్న ఆస్తి కి అదే వారసరాలు. చూస్తో చూస్తో దానికంటే తక్కువ సంపాదించే వాడికి ఎలా ఇవ్వగలను” అంది సుందరమ్మ.


“అవును.. మీ రిక్విరెమెంట్స్ ఏమిటి” అన్నాడు విష్ణు.


“పెద్దగా ఏమీలేవు అన్నయ్య, పిల్లాడికి తల్లిదండ్రులు ఉండకూడదు, ఒక్కడే సంతానం అయితే చాలు, ఎందుకంటె నా శేషజీవితం మా అమ్మాయి దగ్గరే గడుపుతాను. పిల్లాడి తల్లిదండ్రులు వుంటే వాళ్ళు ముందు వచ్చి కూర్చుంటారు” అంది సుందరమ్మ.


“అంటే పిల్లాడి తల్లిదండ్రులు పెళ్ళికి ముందే పోవాలా లేకపోతే పెళ్లి అయిన తరువాత పోయినా పరవాలేదా” అన్నాడు, తన పరిస్థితి తలుచుకుంటూ. ఎందుకంటే తనకి బ్యాంకు ఆఫీసర్ గా చేస్తున్న కొడుకు వున్నాడు.


“వాళ్ల వీలుని బట్టి అన్నయ్య, ముందే అయితే మంచిది. పెళ్లిఖర్చులు నేనే పెట్టి పెళ్లి చేసేద్దాం” అని అంది దుర్మార్గం గా సుందరమ్మ.


“సరే ముందు గృహప్రవేశం కానిద్దాం, ఆ తరువాత పెళ్లి సంబంధం వెతుకుతాను” అన్నాడు విష్ణు.

అప్పుడే లోపలికి వస్తున్న విష్ణు కొడుకు శ్రీకాంత్ ని చూసి, “మీ అబ్బాయి అంత బాగుంటే చాలు అన్నయ్య, మీ వాడు ఇంజనీర్ అయితే అతన్ని అల్లుడు గా చేసుకునే దానిని” అంది సుందరమ్మ.

“ఎలా కుదురుతుంది, మేము బలవంతంగా చావలేము కదా, మా వాడి పెళ్లికోసం” అని చెప్పి లోపలకి వెళ్ళిపోయాడు.


కాసేపు కీర్తి తో మాట్లాడి వెళ్ళిపోయింది సుందరమ్మ.

“ఏమిటండి యీవిడ వరస, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా వుంటారు, మరి కాబోయే అల్లుడు కూడా అత్తగారు ఉండకూడదు అంటే ఈవిడ పరిస్థితి ఏమిటి” అంది కీర్తి.


“అంతా సాఫ్ట్వేర్ మహిమ, కూతురు లక్షలు సంపాదించుతో వుంటే తల్లిదండ్రులు కండిషన్స్ పెట్టే స్టేజి కి వెళ్లిపోయారు. ఎందుకైనా మంచిది మనం కూడా రోజూ వాడే మందులు వేసుకోకుండా వుంటే మంచిది, మన వాడి పెళ్ళికి యిటువంటి షరతులు వినకుండా పోతాము” అన్నాడు నవ్వుతూ.

“అన్నయ్య గారు, మీరు వదినని తీసుకుని త్వరగా వస్తే, మా అమ్మాయి, మీరు దేముడి ఫోటోలు తీసుకుని కొత్త యింట్లోకి అడుగు పెట్టాలి.


నాకేమో ఎలాగో ఆ అదృష్టం లేదు, ఆయనే వుంటే ఈ పనులకైనా పనికి వచ్చే వారు. ఏమిటో ఎవ్వరు ఒక శ్రావణమాసం కి పిలవరు, ఒక పేరంటం కి పిలవరు అన్నయ్య, ఆయన పోతే నాదా తప్పు” అంది.


“యిప్పుడు ఎందుకమ్మా కళ్ళ నీళ్లు పెట్టుకుంటావు, గృహప్రవేశం ముందు పెట్టుకుని. కావాలి అంటే ఆ శ్రావణమాసం లో నువ్వే ఒక కేజీ శనగలు నానపెట్టుకో” అన్నాడు విష్ణు.


సాయంత్రం ఆరుగంటలకల్లా నూతన గృహం దగ్గరికి చేరుకున్నారు. 

“అన్నయ్యా! ముందు నీ చేతితో మెయిన్ స్విచ్ ఆన్ చెయ్యి” అంది సుందరమ్మ. 


ముందుకు వెళ్ళబోతున్న విష్ణు చెవిలో “జాగ్రత్తగా ఆన్ చెయ్యండి షాక్ కొడుతుందేమో, కూతురు ని దగ్గర వుంచుకుని మిమ్మల్ని ఎందుకు ఆన్ చెయ్యమంటోంది” అంది కీర్తి.


“పర్వాలేదు లే నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను” అని వెళ్లి మెయిన్ స్విచ్ మీద టెస్టర్ పెట్టి చూసి, అప్పుడు ఆన్ చేసాడు. ఇల్లంతా కాంతులు జిమ్ముతో లైట్స్ వెలిగాయి. అది చూసి చిన్న పిల్ల లాగా తప్పట్లు కొడుతున్న సుందరమ్మని చూసి నవ్వుకున్నారు.


“అన్నయ్యా! ఈ గది మా అమ్మాయిది, ఈ గది నాది, మిగిలిన రెండు గదులు చుట్టాలు వస్తే ఉపయోగ పడతాయి” అంది సుందరమ్మ. 


“అంటే ఇల్లరికం అల్లుడు కావాలి అంటారు” అన్నాడు విష్ణు. 


“అంతేగా అన్నయ్యా, అల్లుడు, కూతురు తోపాటే నేను వుంటాను. వాళ్ళకి మాత్రం పెద్ద దిక్కు వద్దా” అంది సుందరమ్మ. 


ఏమో అనుకొన్నాడు కానీ సుందరమ్మ బాగానే ఖర్చు పెట్టి గృహప్రవేశం పూర్తి చేసింది.


భోజనాలు అయ్యి కూర్చుని వుండగా, “అన్నయ్యా! గృహప్రవేశం బాగా జరిపించావు, యిహ అమ్మాయికి మంచి సంబంధం చూసి పుణ్యం కట్టుకోవాలి” అంది.


“అడగటం మర్చిపోయాను, మీ అమ్మగారి వైపు కాని, మీ భర్త గారి వైపు గాని ఎవ్వరు లేరా” అన్నాడు సుందరమ్మ తో.


“లేకే అన్నయ్యా, నేనే ఎవ్వరిని దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళకి మా డబ్బు మీద ఆశ తప్పా మా మీద ప్రేమ లేదు. అందరిని చెడగొట్టుకుని, యిప్పుడు నా కూతురి పెళ్లిగురించి సహాయం అడిగితే ఎవ్వరు వచ్చి నిలబడతారు. నువ్వే నాకు తొడబుట్టిన వాడివి అనుకున్నాను అన్నయ్య” అంది సుందరమ్మ.


ముందుగా అమ్మాయి డీటెయిల్స్ మ్యారేజ్ బ్యూరో లో రిజిస్ట్రేషన్ చేసాడు, ఆ మర్నాడు నుంచి మగ పిల్లల అడ్రస్ లు పంపటం మొదలు పెట్టారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. బాగున్నవి కొన్ని అడ్రస్ లు పట్టుకుని వెళ్ళాడు విష్ణు. 


కొన్ని ఇళ్లలో పెళ్ళికొడుకు తండ్రి లుంగీ కట్టుకుని వరండాలో వాకింగ్ చెయ్యడం చూసి, ‘అబ్బే తల్లిదండ్రుల వున్న సంబంధం వద్దు అందిగా’ అనుకుని లోపలికి వెళ్లకుండా వచ్చేసాడు. 

కొన్ని ఇళ్లలో గోడలుకు దండలు వేసిన ఫోటోలు కనిపించకపోవడం తో వెనక్కి వచ్చేసాడు.


కొంతమంది మగపిల్లాడి తల్లిదండ్రులు, ‘మగదిక్కు లేని కుటుంబం లో సంబంధం వద్దు’ అనడం తో విసిగిపోయి, సుందరమ్మ కి విషయం చెప్పి, ‘యిహ సంబంధం వెతకడం నా వల్ల కాదు’ అన్నాడు.

ఇంతలో పక్క గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న సుందరమ్మ కూతురు వసుధ తల్లి దగ్గరికి వచ్చి కూర్చుని, “అమ్మా, మామయ్య.. నా గురించి మీరు సంబంధాలు చూడకండి, నేను విష్ణు మామయ్య కొడుకు శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంటాను. మా యిద్దరికి చాలా సంవత్సరాలనుండి పరిచయం వుంది, మొన్న గృహప్రవేశం నాడు నిర్ణయం తీసుకున్నాము పెళ్లి చేసుకోవాలి అని” అంది.


కూతురి మాటలకు కొయ్యబారిపోయిన సుందరమ్మ ని చూసి విష్ణు, “చూడు వసుధ, మీ అమ్మగారికి మగపిల్లాడికి తల్లిదండ్రులు ఉండకూడదు, కానీ మా అబ్బాయి కి మేము వున్నాము, మీ అమ్మగారు ఆ కండిషన్ తీసేసి, ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నాకు అభ్యనంతరం లేదు” అని చెప్పి బయటకు వచ్చేసాడు.


“నీకు ఇదేమి పోయేకాలమే, నీ కంటే చదువు తక్కువ, సంపాదన తక్కువ, ఆస్తి తక్కువ, చివరికి స్వంత యిల్లు కూడా లేదు. అటువంటి వాడితో పెళ్లి ఏమిటే” అంది కూతురితో సుందరమ్మ.


“అమ్మా! ఎవడో తెలియని వాడిని తీసుకొని వచ్చి వాడితో పెళ్లి చేస్తే రేపు మన ఆస్తి తన పేరు మీద వ్రాయమంటే ఏమిచేస్తావ్, విష్ణు మామయ్యగారి అబ్బాయి శ్రీకాంత్ మంచివాడు, బ్యాంకులో పని చేస్తోవుండటం వలన అతను చూడని డబ్బు లేదు. అందుకే అతనికి నీ ఆస్తి మీద ఆశ ఉండదు. అన్నిటికి మించి మన రెండు కుటుంబాలు గురించి మనకి బాగా తెలుసు” అంది వసుధ తల్లితో.


“అది సరేనే, శ్రీకాంత్ తో అతని తల్లిదండ్రులు కూడా వుంటారు, మరి నేను ఎక్కడ ఉండాలి, మీతోనే ఉందాము అంటే ఏం బాగుంటుంది” అంది సుందరమ్మ.


“అమ్మా! నీకే కాదు, నీ లాంటి తల్లిదండ్రులు ఆలోచన లేక ఒక ఆడపిల్ల పుట్టగానే, ఈ పిల్లను బాగా పెంచేతే చాలు అని ఆపిల్లకి తమ్ముడో, చెల్లెలో లేకుండా చేస్తారు. రేపు ఆపిల్ల కి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు లేక, తొడబుట్టిన వాడు లేక ఎవ్వరికి చెప్పుకుంటుంది? అదే నాకు తమ్ముడో, చెల్లెలో వుంటే నీకు యిప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి వచ్చేది కాదు. 


నేను చెప్పేది ఆడపిల్ల పెళ్లి అయిన తరువాత పిల్ల తల్లికూడా వాళ్ళతో వుండటం కుదరదు, ఎందుకంటే అమ్మాయి భర్త తల్లిదండ్రులకి మాత్రమే ఆ హక్కు వుంది ఈ కాలంలో. అందుకే నువ్వు ఈ ఇంట్లోనే వుండు, ఎలాగో విష్ణు మామయ్య నీకు పరిచయం, మేము వారం వారం వచ్చి చూసి వెళ్తాము, నువ్వు కూడా వచ్చి కొన్ని రోజులు వుండి వెళ్ళవచ్చు” అంది.


“నీకున్న ముందు చూపు మీ నాన్నకి వుండివుంటే నాకు యిప్పుడు నీతో చెప్పించుకునే అవసరం వుండేది కాదు. సరే కాని, రేపో మాపో పోయే దానిని, నీ సంతోషం కి అడ్డం పడటం ఎందుకు, మంచి రోజు చూసుకుని విష్ణు మామయ్య తో మాట్లాడుతాను” అంది సుందరమ్మ.


మాటలు అయిపోయాయి, పెళ్లి కూడా ఘనంగా చేసింది సుందరమ్మ, అల్లుడికి కొత్త కారు కొని యిచ్చింది. మూడు నిద్రలు అయిపోయిన తరువాత ఒక మంచి రోజు చూసుకుని విష్ణు దంపతులు, కోడలు కొడుకు పాటు సుందరమ్మ కట్టిన కొత్త యింట్లోకి వెళ్లిపోయారు. సుందరమ్మ ఒక్కత్తి తన పాత ఇంట్లోనే ఉండిపోయింది.


ఒకరోజు ఉదయం విష్ణు తన కొడుకుని పిలిచి “కారు తియ్యి బయటకు వెళ్ళాలి” అన్నాడు. 

“యిప్పుడు ఎందుకు నాన్నా, సాయంత్రం వెళ్లదాం” అన్నా వినకుండా కొడుకుని తీసుకుని బయలుదేరాడు.


యింటి ముందు కారు ఆగడం తో బయటికి వచ్చిన సుందరమ్మ గారికి కారులోనుంచి అల్లుడు, వియ్యంకుడు దిగటం చూసి ఎదురు వెళ్లి, “రండి అన్నయ్య, అమ్మాయి రాలేదా” అంది.


“లేదమ్మా, అత్తాకోడళ్ళు ఏదో పనిలో వున్నారు, సరేగాని ముందు మీరు బట్టలు సద్దుకుని మాతో బయలుదేరండి, యిహ మీరు మాతోనే, మీ గది మిమ్మల్ని పిలుస్తోంది” అన్నాడు విష్ణు. 


“వద్దులే అన్నయ్యా, యిక్కడ నేను బాగానే వున్నాను” అంది సుందరమ్మ. 


“అయితే అత్తయ్యా, మా సామాను సద్దుకుని మేమే యిక్కడికి వచ్చేస్తాం” అన్నాడు శ్రీకాంత్. 


“మేము ఎంతో మీ అల్లుడికి మీరు అంతే, మీరు ఒంటరిగా యిక్కడ ఉండటానికి ఒప్పుకోను త్వరగా బట్టలు సద్దుకోండి, మిగిలిన సామాను తరువాత తీసుకుని వెళ్దాం” అని కంగారు పెట్టాడు.


కారులో నుంచి తన మామగారితో పాటు, తన భర్త, తల్లి దిగటం చూసి పరుగున వెళ్లి తల్లిని కౌగిలించుకుంది.


“యిహ అమ్మ కూడా మనతోనే వుంటుంది” అని మామగారు అనడం విని, వసుధ కృతజ్ఞత తో మామగారి పాదాలకు నమస్కారం చేసి దీవెనలు తీసుకుంది.

  శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.












58 views0 comments

Comments


bottom of page