top of page

కలసికట్టుగా ఉండండ్రా బాబు



'Kalasikattuga Undandra Babu' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 07/06/2024 

'కలసికట్టుగా ఉండండ్రా బాబుతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



''నమస్కారం సార్ లాయర్ గారు''


''రావయ్య కూర్చో. చాలా చిన్న కుర్రాడిలా ఉన్నావు నీకు కూడా సమస్య ఉందా.. సరే నీ ఊరు, పేరు నీ పూర్తి సమస్య వివరంగా చెప్పు నాయనా''


''సార్ మాది పక్క ఊరే హసన్బాధ సార్. నా పేరు జోగినాధం అండి. నాది అతి భయంకరమైన సమస్య సార్''


''ఈ ఊరి పేరు వింటేనే చాలా భయంకరమైన బాధలో నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది.. సమస్యలు చాలా భయంకరమైనప్పటికి నేనున్నాను కదా, నీకేం పరవా లేదు బాబు. అందుకనే కదా ఈ భయంకరేశ్వరం ఇక్కడ ఉన్నది''


''సార్ భయంకరమైన లాయర్ గారు. సార్ నా సమస్య వివరంగా చెబుతాను వినండి సార్.. 


నాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అయిందండి.

ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా పెళ్ళాం గుణవతి

అనవసరంగా ఉత్తి పున్నానికి తిడుతుంది సార్. ఆ

తిట్లు ఏ మనిషి మరో మనిషిని తిట్టకూడని తిట్లు 

సార్.. ''


''ఆవిడ పేరు చాలా బాగుందయ్యా. గుణవతి అంటున్నావ్. మరి నీకు సమస్య ఎలా వస్తుంది.. అసలు ఆవిడ కోరిక ఏమిటట''


''డబ్బు ఉన్నా లేకపోయినా కోరికలన్నీ పూర్తిగా తీర్చాను. సినిమాలు షికార్లు సరదాలు ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టాను, బంగారాలు సింగారాలు ఏ మాత్రం లోటు చేయ లేదు. 


అయినా నన్ను తిట్టరాని తిట్లు తిడుతుంది సార్. నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది సార్. చచ్చిపోవాలని ఉందండి. నిజం నా మాట నమ్మండి. 


చిట్ట చివరగా మీ గురించి ఊరందరూ చెబితే ఇక్కడికి వచ్చానండి. ఇదిగోండి సార్ మీ ఫీజు 500 రూపాయలు.

పరిష్కారం చెప్పి నా జన్మ ధన్యం చేయండి సార్. ''

అంటూ జోగినాథం డబ్బులు ఇచ్చి లాయర్ గారిని బ్రతిమిలాడాడు. 


''డబ్బు ఏముందయ్యా జేబులో పెట్టుకో.. ఈ మాయ దారి డబ్బు ఈరోజు ఉండి రేపు పోతుంది. నేనొక విషయం అడుగుతాను వివరంగా చెప్పు. అసలు నీ భార్య ఏ కారణం చేత నిన్ను అనవసరంగా తిడుతుంది అంటావు''


''రాసుకోండి సార్. ఉత్తి పున్నానికే తిడుతుంది సార్. ''


''అయ్యయ్యో పాపం. ఉత్తి పున్నానికే ఎందుకు తిడు తుందయ్యా. ఏదో అతి చిన్న బుల్లి కారణం అంటూ ఏదో ఒకటి ఉండి తీరాలి కదా.''


''అదే కదా సార్ నా అసలు బాధ. కారణం కాకరకాయ లేకుండానే ఉత్తి పున్నానికే తిడుతుంది సార్. ఇవి కాళ్లు కాదు కాదనుకోండి. ఇక మీరే నాకు దిక్కు. నా యొక్క సమస్య పరిష్కారం చెప్పండి సార్..'' అంటూ లాయర్ గారిని పట్టుకు బతిమాలాడాడు జోగినాథం. 


''నా రెండు కాళ్లు పట్టుకున్నావయ్యా. మళ్లీ అవి కాళ్లు కాదంటావ్ ఏంటి. ఈ లెక్కన చూస్తుంటే నీకు కొంచెం లూజు మైండ్ అన్నట్టు ఉంది''. 


''అలా అంటారేంటి సార్.. నేను అలా ఫ్లో లో అనే సాను సార్''


''సమస్య అర్థమైంది కానీ పూర్తి వివరాలు నీ బరువుతో సహా మా గుమస్తా చలపతికి ఇచ్చి నువ్వు ఒక వారం తర్వాత కనపడు ఈలోగా నోటీసు తయారు చేస్తాను. ఈ వంద రూపాయలు నీ దగ్గర ఉంచుకో ఎందుకైనా 

పనికి వస్తాయి'' అంటూ ఫీజు తను తీసుకోకపోవడం కాకుండా తనే మరొక 100 రూపాయలు జోగినాథంకి ఇచ్చాడు భయంకరేశ్వరం. 


''అదేంటి సార్, మీరే నాకు తిరిగి డబ్బులు ఇస్తున్నారు.. ప్రపంచంలో ఈ వింత ఎక్కడా చూడలేదు. మా చుట్టూ పక్కల ఊర్లలో రామచంద్రపురం, కడియం, ద్రాక్షా రామలలో మీ గురించి గొప్పగా చెబితే భయంకరం గారు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నమాట. మీరు అంత భయంకరంగా లేరు సార్ బుల్లి మీసాలతో అరటిపండు లాగా ఉన్నారు.''


''జోగినాథం! అదే కదా వింత.. ఇప్పుడు సతీ అనసూయ అంటారు.. ఆవిడ అలా ఉండదు. అందరిని 

చితగకొడుతుంది. హరిశ్చoద్రరావు అంటారు.. అతను

అన్ని అబద్ధాలే ఆడతాడు. అతనికి సత్యం మాట్లాడ్డం రాదు. అలాగే నా పేరు కూడా రివర్స్ అన్నమాట. సో ఆ గొడవ పక్కనపెట్టి నువ్వు క్షేమంగా వెళ్లి రా. నా గురించి ఇంకా ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా? నీకు ఏమైనా విషయాలు తెలుసా?” అంటూ క్వశ్చన్ గా అడిగాడు భయంకరేశ్వరం.


''సార్ సార్! మీ గురించి కాకి కూడా ఏమీ అనుకోవడం 

లేదు.. ''


''కదా.. నా గురించి చాలా స్టోరీ ఉందిలే. ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ క్షేమంగా వెళ్ళు. '' అంటూ పంపించాడు. 


అలా అలా వారం పోయాక రా నెల పోయాక రా అంటూ 6 నెలలు గడిపాడు నోటీసు పంపించకుండా భయంకరేశ్వరం. 


****


6 నెలల తర్వాత.. తర్వాత


జోగినాథం సరాసరి లాయర్ గారు ఇంటికి వచ్చాడు. 


భయంకరేశ్వరం తన ఇంటికి తాళాలు వేసి జోగినా దాన్ని తీసుకొని భీమేశ్వరస్వామి గుడి రావి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లి ఆ దిమ్మ మీద కూర్చోబెట్టాడు


''అదేంటి సార్ ఇంటికి వచ్చిన నన్ను ఈ గుడి దగ్గరికి తీసుకు వచ్చి ఈ రావి చెట్టు దిమ్మమీద కూర్చోబెట్టి చెబుతున్నారు. ఆరు నెలల నుండి అదిగో నోటీసు తయారు చేస్తున్నాను ఇదిగో ఈరోజు పంపేస్తున్నాను అంటూ అంటున్నారు కానీ ఏమీ జరగలేదు. ఒడిలో కూర్చోపెట్టుకున్నట్టు కూర్చోబెట్టి నా బాధలన్నీ పూర్తిగా వింటారు. అయ్యో పాపం అంటారు పని చెయ్యరు'' అంటూ విసవిస లాడాడు జోగినాథం. 


''కంగారు పడకయ్యా.. ''.. అంటూ భయంకరేశ్వరం పక్కనే ఉన్న బడ్డీ కొట్టులో నుండి ఒక కప్పు టీ తెప్పించి అతనికి ఇచ్చి.. 


''ముందు నీకు మానసిక ప్రశాంతత కలగాలి. అందు కోసమే ఇక్కడకు తీసుకు వచ్చాను. మన తెలుగు రాష్ట్రాలలో నీలాంటి సమస్యతో నీలా చాలామంది బాధితులు ఉన్నారయ్యా బాబు. ఎక్కడో భార్య బాధిత సంఘం అని పెట్టారట. దాని గురించి కూడా పూర్తి వివరాలు సేకరించాను.. అక్కడ ఆ ఆఫీసుకు తాళం వేసి ఉందట. ఆఫీసు ఓపెన్ చేస్తే చీపిరి కట్టతో బాదేస్తామని అరడజనుమంది ఆడవాళ్లు బయటే కూర్చుని ఉన్నారట. ఇది పరిస్థితి. 


దీనిని బట్టి సమస్యను మనం చాలా లోతుగా పరిశీలించ వలసిన అవసరం ఉంది. కూకటి వేళ్ళతో పెకిలించి పడేయాలి అన్నదే నా ప్రయత్నం కూడా. అవసరమైతే గుణపం గడ్డపారతో తవ్వి మరి బయట పడేస్తాను. 


సరే చివరిసారిగా అడుగుతున్నాను. ఇంతకీ నీ భార్య నిన్ను ఎందుకు తిడుతుంది అంటావు?''

ఖచ్చితమైన క్వశ్చన్ వేశాడు భయంకరేశ్వరం. 


''6 నెలల నుండి చెప్పిన మాటే చెప్పలేక చచ్చి చచ్చి చచ్చిపోతున్నాను సార్. డబ్బులు తీసుకోరు. తిరిగి నాకే ఇస్తారు. నోటీసు తయారుచెయ్యరు. నా పెళ్ళానికి పంపరు. దానిని కోర్టుకి ఈడ్చరు. సార్! అసలు విషయం ఏమిటి?'' ధైర్యం తెచ్చుకుని చాలా గట్టిగా అడిగాడు జోగినాథం లాయర్ భయంకరేశ్వరంని. 


''నీలో కోపం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇన్నాళ్లు అలా అలా ఆపాను. మిస్టర్ జోగినాథం. ఈసారి కచ్చితంగా నీ పని మీదే ఉండి నోటీసు చాలా పకడ్బందీగా తయారు చేసి రిజిస్టర్ పోస్టులో మీ ఆవిడకి పంపేస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు'' అంటూ గట్టిగా చెప్పి తను లేచి చరచర వెళ్ళిపోతూ తిరిగి వచ్చి తన జేబులో చెయ్యి పెట్టి పర్సు తీసి అందులో నుండి 100 రూపాయలు తీసి జోగినాధం జేబులో బలవంతంగా పెట్టి ‘ఈ డబ్బులు ఉంచు’ అంటూ వెళ్లిపోయాడు లాయర్ భయంకరేశ్వరం. 


****


''నమస్తే లాయర్ గారు గారు. ఇప్పటికి సంవత్సరం అయింది సార్. 


మా ఆవిడ ఏమంటుందో తెలుసా సార్.. 

'సంవత్సరంనుంచి లాయర్ దగ్గరికి తిరుగుతున్నావు. ఆయన నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఏం పీకారు. ' అంటుంది సార్. ఎంత అవమానంగా ఉందో మీకు తెలుసా. చులకన అయిపోయాను''.. గొల్లుమన్నాడు జోగినాథం


భయంకరేశ్వరం జోగినాథాన్ని ఒక హోటల్కు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. 


''అయ్యో పాపం జోగినాథం! ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. ముందు ఏడుపు ఆపు. ఆడవాళ్లు తిట్టిన తిట్లు కొన్ని మనం వినకూడదయ్య ఒకవేళ విన్నా, ఎడమ చెవితో విని కుడి చెవిలోంచి వదిలేయాలి. లేదా కుడి చెవిలో విని ఎడమ చెవిలోంచి వదిలేయాలి.. 


అలా వదిలేయడానికి చాలా రంధ్రాలు ఉన్నాయి కదా. ఏదో ఒక రంద్రం నుంచి వదిలేయాలి. ఇప్పుడు ముందు ఆ ఏడుపు ఆ.పు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆఖరుగా అడుగు తున్నాను. అసలు నిన్ను మీ ఆవిడ ఉత్తిపున్నానికే ఎందుకు తిడుతుంది?. ''


''మళ్లీ మళ్లీ చెప్తున్నాను సార్, నేను కూడా ఆఖరుగానే మీకు చెప్తున్నాను లాయర్ గారు.. ఉత్తిపున్నానికే నా పెళ్ళాం నన్ను తిడుతుంది మహాప్రభో. '' అంటూ చెప్పి కిందపడి దొర్లుతున్నాడు జోగినాథం. 


లాయర్ భయంకరేశ్వరం అతనిని పైకి లేవదీసి ప్రేమగా గుండెలకు హత్తుకుని ఓ 500 రూపాయలు అతని చేతిలో పెట్టాడు. 


''ఈరోజు నన్ను ఈ హోటల్కు తీసుకొచ్చి ఎందుకు టిఫిన్ ఇప్పించారు చెప్పండి సార్.. చెప్పండి సార్. అటు ఇటు తేలిపోవాలి సార్.. చెప్పండి సార్. ''

అంటూ అడిగాడు.. జోగినాథం. 


''మిస్టర్ జోగినాథం నీ దగ్గర దాగుడుమూతలు ఆడనయ్యా. ముఖ్యమైన విషయం చెబుదామని ఇంత దూరం తీసుకువచ్చాను. విషయం ఇప్పుడు చెప్పేస్తా. అయితే ఈవిషయం 5 వ చెవికి తెలియకూడదు. అలా ఈ బ్రహ్మ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని నాకు మాట ఇయ్''


''అలాగే సార్''


''అలాగ.. కాదు. నా చేతిలో చేయి వేసి చెప్పు. భార్య ఉత్తిపున్నానికి భర్తను తిట్టడం విషయంలో భార్యల మీద కేసు పెట్టడానికి ఏదైనా మంచి లాపాయింటు దొరుకుతుందేమో దాని ఆధారంగా కేసు పెడదాము అని నేను చాలా లా పుస్తకాలు తిరగేసేనయ్యా. 

అలా 30 సంవత్సరాల నుండి వెతుకుతున్నా నాకు ఒక్కలా కూడా దొరకలేదు. అలాంటప్పుడు ఏ చట్టం ఆధారంగా కేసు పెట్టాలో అర్థం కావడం లేదు నాకు. 


మంచి పగడ్బందీ ఆక్ట్ దొరికాక.. దొరికాక నీ కేసు టేక్ అప్ చేద్దామని ఆగాను అంతే.. ''' చెప్పాడు లాయర్ భయంకరేశ్వరం.


''30 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నారా.. ఎందుకు సార్ మీకు పెళ్ళాలు అంటే అంత కసి” ఆశ్చర్యంగా అడిగాడు జోగినాథం. 


''ఎందుకంటే 30 ఏళ్లుగా నా భార్య నన్ను ఉత్తిపున్నానికే తిడుతుందయ్యా బాబు. నాది నీ మీద పది రెట్లు ఎక్కువ బాధ. ఇప్పుడు నాకు తోడు నువ్వే. నా కష్టం విని ఓదార్చే ఆప్తుడువి నువ్వే '' లాయర్ భయంకరేశ్వరం జలజల కారుతున్న కన్నీటిని తుడుచుకుంటున్నాడు. 


'' అయ్యయ్యో పాపం'' అంటూ జోగినాథం తన దగ్గర జేబురుమాలుతో లాయర్ గారి కళ్ళు తుడుస్తూ

''సార్ లాయర్ గారు! అయితే ఈ సమస్యకు పరిష్కా రమే లేదా?''


 ''ఎందుకు లేదయ్యా.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండి తీరుతుంది. సోక్రటీస్ మహానుభావుడు.. భార్య వల్ల నరకయాతన అనుభవించినట్టు చదివాం. మన గాడ్ శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ చేత కాలి దెబ్బలు తిన లేదా? వాళ్లు ఏమైనా చేయగలిగారా?


మనం కూడా అలాంటి కోవకు చెందిన చరిత్ర పురుషులమే అని సరి పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. పరిష్కారం దానంత అదే ఎప్పుడో ఒకప్పుడు దొరకక పోదు. 


తక్షణం మనం మనలాంటి వాళ్ళు అందరూ కలిసి చేయవలసింది ఏమిటి అంటే.. అందరం కలిసి మెలిసి ఉండి కష్టసుఖాలు పంచుకోవాలి. 


కలసి ఉంటే కలదు సుఖం అని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు కదా. 


 కనక జోగినాధం, రా.. మనం ఇంటికి వెళ్లి పోదాం.. ''


అంటూ లాయర్ భయంకరేశ్వరం.. జోగినాథం భుజం మీద చేయి పెట్టి నడిపించుకుంటూ ఇంకా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. 


తనకు తోడు దొరికినందుకు జోగినాథం మురిసి పోతూ.. భవిష్యత్తు మీద ఆశతో ముందడుగు వేస్తున్నాడు.. నిజమే బాధితులు అందరూ ‘కలిసి ఉంటే కలదు సుఖం మరి’ అనుకుంటూ.

 

( పై కథ కేవలం హాస్యం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కాదని సవినయంగా మనవి చేస్తున్నాను.)


ఇట్లు.. కథారచయిత

నల్లబాటి రాఘవేంద్రరావు.

***

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు




33 views1 comment

1 Comment


సర్, మీ కథలు బావుంటాయి.

భార్య భర్తల మధ్య వుండే 'నస' సహజమే - దీనికి పరిష్కారం 'సద్దుకు పోవటం' : కధ బావుంది.

Like
bottom of page