#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, # కాళీయమర్దనము, #KaliyaMardhanamu, #KrishnaLeela, #కృష్ణలీల, #ఇష్టపది

గాయత్రి గారి కవితలు పార్ట్ 5
Kaliya Mardhanamu - Gayathri Gari Kavithalu Part 5 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 09/03/2025
కాళీయ మర్దనము - గాయత్రి గారి కవితలు పార్ట్ 5 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
కాళీయ మర్దనము
(ఇష్టపది )
నెమలిపింఛముఁ జుట్టి నిలువునామముఁ బెట్టి
కమనీయముగ దండ కడియాలనే కట్టి
పట్టుదట్టిని చాల పైకెగయగా కట్టి
దిట్టతనమును జూపి ధీరుడై తొడగొట్టి
కాళీయు మర్దించి గర్వంబు ద్రుంచంగ
నీలాల మడుగులో నిలువునా దూకంగ
భయముతో యాదవులు పరుగులే పెట్టగా
జయుడైన కృష్ణుండు సర్పమును కొట్టగా
అదురుతో నా సర్ప మభయంబు కోరగా
పదచిహ్నములఁ జూపి బ్రతుకుమని తెల్పగా
ఆ పాద ముద్రలే యాధార మనుకొంది
గోపాలుడిని పాము కొల్చితరియించింది
భక్తిగా లీలలను వ్రాసిరట కవులెల్ల
ముక్తిలభియించునని మ్రొక్కిరట జనులెల్ల
పంకజాక్షుని తల్చ పాపాలు తొలగులే!
శంకలను విడనాడ సద్గతులు కలుగులే!//
************************************
కృష్ణలీల.
(ఇష్టపది )

చీరలను దోచాడు చిన్నికృష్ణుడు నాడు
తారంగ మాడుచూ దాలిమిని చూపాడు.
వెన్నకుండలు కొట్టి వేషాలు వేశాడు.
కన్నెపిల్లల మదిని కాపురము చేశాడు.
సాలములు కూల్చుచూ శాపాలు తొలగించె
కాలపురుషుడు శౌరి గారాల నొలికించె
తల్లికొంగును బట్టి తన లీల చూపాడు.
కల్లలాడుచు పెద్ద కార్యాలు సలిపాడు.
మన్నుతిన్నాడమ్మ!మగరాయుడే వీడు.
పన్నగము తలపైన పాదాలు మోపాడు.
మురళివాయించుచూ మోహమును కలిగించి
సరసాల రాసమున జగతినే మరపించి
రక్కసుల దునుమాడి రవణతో నిలిచాడు.
చక్కదనముల రేడు సాధువుల చెలికాడు.
పురుషార్థ తత్వమును బోధగా తెలిపాడు.
ధరణినే రక్షించి ధర్మమును నిలిపాడు.
పరమాత్ముడే నాడు బాలుడై తిరిగాడు.
తిరుశైలమున నేడు దేవుడై నిలిచాడు.
కరుణాసముద్రుడై కర్మలను తొలిగించు.
మొరలనే వినుచుండి ముక్తిఫలమందించు.
దీనజనబాంధవుని దిక్కంచు కొల్చుకో!
శ్రీనివాసుని సతము చిత్తమున తల్చుకో!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments