'Kalpana Asayam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 18/06/2024
'కల్పన ఆశయం' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కాలేజీలో క్లాసులు అయిపోగానే బస్టాపులో బస్సు కోసం ఎదురుచూస్తోంది కల్పన.
“కల్పనా! మీ ఇంటివద్ద నేను డ్రాప్ చేస్తాను. స్కూటర్ ఎక్కు” ఏకవచనంతో చనువుగా అంటూ వచ్చాడు విశాల్.
“వద్దు. “ అని సీరియస్ గా ముఖం ప్రక్కకు తిప్పుకుంది కల్పన.
ఇంతలో కల్పన ఇంటికి వెళ్లే బస్సు రావడం, అందులో ఆమె ఎక్కి కూర్చోవడం జరిగింది.
బస్సులో కూర్చున్న మాటే గానీ కల్పనకు మనసంతా చిరాకుగా ఉంది. గత కొన్ని నెలలనుంచి తనని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు విశాల్. తనకి ఆ అభిప్రాయం లేదని, తను మంచిగా చదువుకోవాలని ఎన్నోమార్లు చెప్పినా మొండిగా ప్రతిరోజూ ఏదో వంకన ఆమెతో మాటలుకలిపి ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు విశాల్.
చదువుసంధ్యలు అబ్బక దుర్వ్యసనాలకు లోనై తండ్రి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే విశాల్ అంటే ఆ ఇంటి చుట్టుప్రక్కల ఎవరికి సదభిప్రాయంలేదు. అతనికి తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి నరహరి విశాల్ ని పెంచి పెద్ద చేశాడు. చదువు అబ్బక దుర్వసనాలకు లోనై తండ్రిని, తండ్రి మాటని ఖాతరుచేసేవాడు కాదు విశాల్. కొడుకుని నయానా, భయాన మార్చ ప్రయత్నించి విఫలమయ్యాడు నరహరి. తన ఆస్తిని దక్కకుండా ఏదైనా అనాధాశ్రమానికి వ్రాస్తానని బెదిరించాడు కొడుకుని. మాట వరసకన్నా అన్నంతపనీ తన తండ్రి చేస్తాడని ఆయన్ని తల దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆయన్ని అంతం చేశాడు విశాల్.
ఇరుగుపొరుగు వారినందరినీ కార్డియాక్ అరెస్టుతో ఆయన చనిపోయాడని నమ్మబలికించాడు. విశాల్ స్వభావం తెలిసి కూడా అందరూ మిన్నకుండిపోయారు.
ఇంక ఆస్తి అంతా హస్తగతమైంది. అతని దృష్టి తమ ఇంటికి దగ్గరలోనే ఉంటున్న కల్పన మీద పడింది. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కల్పన తన తండ్రి దామోదరం, తల్లి రుక్మిణిలతో కలిసి ఉంటోంది. దామోదరం ఒక కంపెనీలో పనిచేస్తూ తన కూతుర్ని కష్టపడి చదివిస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ చక్కగా చదువుతూ స్కాలర్షిప్ ని తెచ్చుకుంటోంది కల్పన. కష్టపడి చదివి తను మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లితండ్రులను కంటికి రెప్పలాగా చూసుకోవాలని కల్పన ఆశయం..
విశాల్ తనని ప్రేమపేరుతో వేధిస్తున్న విషయాన్ని కల్పన తన తల్లిదండ్రులకు, కాలేజీ ప్రిన్సిపాల్ కు చెప్పింది. వాళ్లు అతడిని పిలిచి మందలించారు. అది మనసులో పెట్టుకుని ఇంకా రెచ్చిపోతున్న అతని మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చింది కల్పన. అతనిచ్చే డబ్బులకు కక్కుర్తిపడి పోలీసులు కల్పన కంప్లైంట్ ని ఖాతరుచేయలేదు. కొన్నాళ్లకు కల్పనకు అర్థమై తన జాగ్రత్తలో తను ఉంటూ ఈ చదువు పూర్తైతే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందనే దృక్పధంతో ఉంది.
కల్పన తనని, తన ప్రేమని నిరాకరించిందని ఆమె మీద పగని పెంచుకున్నాడు విశాల్.
ఒకరోజున కాలేజీ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒంటరైన కల్పనపై యాసిడ్ దాడి చేసి రెప్పపాటులో పారిపోయాడు విశాల్. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కుప్పకూలింది కల్పన. భగభగమనే యాసిడ్ మంటతో ఆమె ముఖమంతా సగం వరకు కాలిపోయింది. ఇంతలో బస్సు కోసం ఎవరో అటుగా వచ్చిన వాళ్లు ఆమెని చూసి గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు. డాక్టర్లు చికిత్స చేసి ఆమెని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. కల్పన ఫోనులో ఉన్న నెంబర్ ఆధారంగా ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు డాక్టర్లు. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు.
విషయం విన్న దామోదరం దంపతులు ఆఘమేఘాలమీద వచ్చి కూతుర్ని చూసి దుఃఖించారు. తమ కూతురిని బ్రతికించమని చేతులు జోడించి కన్నీళ్లతో డాక్టర్లని ప్రార్ధించారు. తమవంతు కృషిని తాము చేస్తామని, 24 గంటలు గడిస్తే గానీ తామేమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. తమ కూతురిని బ్రతికించమని దేవుళ్లను ప్రార్ధించారు రుక్మిణి దంపతులు.
పోలీసులు కల్పన తల్లితండ్రుల వద్ద, ఆమె కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద కంప్లైంట్ ని తీసుకున్నారు. వాళ్లు విశాల్ మీదే అనుమానం వ్యక్తం చేయడంతో, లోగడ తమ వద్ద విశాల్ మీద కల్పన ఇచ్చిన కంప్లైంట్ లతో పోలీసులు తప్పించుకు పోయిన విశాల్ ని వెతికి పట్టుకుని అరెస్టు చేశారు.
48గంటల తర్వాత కల్పన ప్రాణాపొయంనుంచి బయటపడింది. దామోదరం దంపతులు సంతోషించారు. కాలేజీ స్టాఫ్, ప్రిన్సిపాల్, తోటి స్నేహితులు అందరూ హాస్పిటల్ కు వచ్చి కల్పనని చూసి పరామర్శించి ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లారు. డాక్టర్లు ఆమెకు మంచి వైద్యం చేస్తున్నారు. పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ ను తీసుకుని, జరిగింది తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి విశాల్ కు శిక్ష తప్పదని చెప్పి వెళ్లారు.
కోర్టు కేసు నడుస్తోంది. తగిన వైద్య చికిత్సను తీసుకున్నాక తమ ఇంటికి డిశ్చార్జ్ అయింది కల్పన. శారీరకంగా, మానసికంగా నెమ్మదిగా కోలుకుంటోంది కల్పన. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమెకి పునర్జీవితాన్నిచ్చారు. కల్పన, ఆమె తల్లిదండ్రులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
కొన్నాళ్లకి కోర్టు తీర్పు వచ్చింది. నేరం రుజువై విశాల్ కి యావజ్జీవకారాగార శిక్ష పడింది.
కల్పన మరలా కాలేజీకి వెళుతోంది. కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి మంచిమార్కులతో పాసయింది. ఆమె తల్లితండ్రులు చాలా సంతోషించారు. అతి త్వరలోనే మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది కల్పన. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది కల్పన.
తన ఆశయం నెరవేరినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది కల్పన.
.. సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
గత 5సం.. నుంచి “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో నేను కధలు వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు🙏.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments