కళ్యాణం – కమనీయం
- Visalakshi Damaraju
- Feb 25, 2023
- 4 min read

Kalyanam - Kamaniyam New Telugu Story
Written By Damaraju Visalakshi
రచన: దామరాజు విశాలాక్షి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పెళ్ళి సంబంధం కోసం, వచ్చిన, కామేశం కళ్యాణి లను చూసి ఖంగు తిన్నది శ్రీ విద్య..
తనను చూసి కూడా ఏమీ తెలియనట్లు, ఎవరో.. అన్నట్లు మాట్లాడుతున్న వారిని చూస్తే ఒళ్ళు మండుతున్నా భరించింది కూతురికోసం.. చక్కగా పలహారాలవీ తిని, ‘ఇక మేము వెళ్తామండీ.. ఫోన్చేస్తాము ఇంటికెళ్ళి’ అన్న కామేశంతో, ఇక ఊరుకోలేక, అంది విద్య..
“అవసరం లేదులెండి.. పలహారాలవి అయ్యాయిగదా! ప్రశాంతంగా ఉండండి. మా అమ్మాయి ఈ పెళ్లికి ఏమంత సుముఖంగా లేదు. ”
శ్రీవిద్య మాటకి ఉలిక్కిపడి, సూటిగా తలెత్తి చూసిన కామేశం, ఆలోచించే లోపల అంది విద్య. “పర్లేదులెండి, కొడుకు పెళ్లిచూపుల పేరుతో, మీరిద్దరేగాక, మీ కోడుకుతో సహా మరి కొందరిళ్ళల్లో తిని వెళ్ళొచ్చుగదా?.. ”
విద్య అంటుంటే,
“ఏమిటి నాన్నా। ఈమె వెటకారంగా మాటాడుతోంది? మేనర్స్ తెలీదా ? మీరే కదా.. వాళ్ళు పెళ్ళిచూపులకు రమ్మని కబుర్లు పెడుతున్నారన్నారు.. వీలుకాకపోయినా పర్మిషన్పెట్టి వచ్చాను” అన్నాడు ఆవేశంగా అబ్బాయి.
“అంత ఆవేశపడకు బాబూ ! అనుభవజ్ఞులైన మీ అమ్మానాన్న అన్నీ, నేర్పిస్తారు. అన్నట్టు నీతోపాటు పెళ్లి చూపులకు రాడానికి, నీకు అత్తకూతురో, మామకూతురో, పక్కింటి అమ్మాయో లేరా? లేకపోయినా పర్వాలేదులే! మీనాన్న ఎవరినో తీసుకొస్తారు” అంది శ్రీవిద్య.
“ఈమేమిటి, నాన్నా! ఇంత అసహ్యంగా అలా మాటాడుతోంది?” అంటున్న కృష్ణతో..
“మొదట నువ్వు ఇలాగే అంటావు. నాలుగు రోజులుపోతే, నీకే బాగుంటుంది. మీనాన్ననడుగు, నేర్పుతాడు. లేదా మీ అమ్మనడిగితే సలహాలు చెప్తుంది” అంది శ్రీవిద్య.. చురచురలాడుతూ వాళ్లనిచూసి..
ఆమె అలాగనగానే, “మాటాడుతుంది.. ఆమె తీరే అంత! పద౦డి పద౦డి.. ” అని అబ్బాయి తండ్రి కామేశ్వరరావు అన్నాడు.
“ఆవిడ గారు ముందునుంచే ఇంతే।.. వీళ్ళని తెలిస్తే రాకపోదుము” అని తల్లి కళ్యాణి అంది.
“మీ సంబంధమని తెలిస్తే, ముందే రానిచ్చేదాన్ని కాదు. ఇంత సేపూ నేనెవరో తెలియనట్లు ఎంచక్కా నటించారు? అయినా ! నటన మీకలవాటేగా.. ?” కోపంగా అంది శ్రీవిద్య.. కామేశం, కళ్యాణిలను ఆసహ్యంగా చూస్తూ..
“చాలు.. ఇక పదండి” అని విస విసా వెళ్లి పోయాడు కామేశం కొడుకు కృష్ణ..
వెనక్కి తిరిగి చూడకుండా కొడుకును అనుసరించారు కామేశం, కళ్యాణి.. అయోమయంగా చూస్తున్న పెళ్లి కూతురు, ఆమె తండ్రీ, అడుగుతున్నా వినిపించుకోకుండా.
వాళ్ళు వెళ్ళాక, విసురుగా లేచి, తనగదిలోకి కెళ్ళి తలుపు వేసుకుంది శ్రీ విద్య..
ఆలోచనల్లోకి జారుకున్న శ్రీవిద్య తో, కప్పు కాఫీ తెచ్చిఇచ్చి. తాగే వరకూ పక్కన కూర్చుని, “వాళ్ళని ఎందుకలా అన్నావమ్మా? వాళ్లనీకు ముందు తెలుసా?” అంది కూతురు.
“అవకాశవాదులైన మనుషులు, తమ లాభంకోసం ఆశయాలను వదిలేస్తారనడానికి, ఉదాహరణ వీళ్ళే” అంది శ్రీవిద్య.
“ఏంటి అమ్మా, ఇదంతా?” అన్న కూతురితో విద్య చెప్పింది.
“కామేశం, కల్యాణి, చెట్టపట్టాల్ వేసుకొని, చెన్నై షాపింగ్ మాల్ లో, తిరుగుతున్నారుట. షాపింగుకు వచ్చి చూసిన షర్మిల, శాంతి, శారద షాకయ్యారు..
అలాగే శ్రీధర్, శశాంక్, శ్యాం, కల్యాణిని చూసి ఖంగు తిన్నారుట..
పార్వతి, ప్రమీల పద్మావతి పళ్ళు కొరికారట..
అంజన, అఖిల, అర్చనలు ఆత్రం ఆపుకోలేక అడిగేశారుట..”
“అబ్బ ! వాళ్లి ద్దరూ పెళ్లి చేసుకుంటే మీ ఆందరి కేంటట ? సుత్తికొట్టక చెప్పు” శ్రీవిద్య కూతురంది..
“ప్రపంచంలో ఎందరు పెళ్లి చేసుకోలేదు.. అందరిలాంటి వాళ్ళే వీరనుకోడానికి లేదు.. పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళని వీళ్లిద్దరూ పెడత్రోవ పట్టించి, పెళ్లి పేరెత్తితే, పట పటాపళ్ళు కొరికేవారు.. ఎవరు పెళ్లి చేసుకుంటామన్నా ఎగతాళి చేసి ఏడిపించేవారు.. పెళ్లికి వ్యతిరేకంగా నినాదాలిచ్చేవారు..
పక్క పక్కఇళ్ళల్లో ఉన్నా, ‘ పులి పంది వారడిగా‘ ఉన్న వీరిద్దరూ.. ఎలా పెళ్లి చేసుకున్నారు ?
“ఛీ, ఛీ, మీరు మాకు అలాంటి ఆలోచన లేదంటే, నిజమే అనుకున్నాము’ అని అడిగారు.
“అందరినీ కాదని, అందరిని విడదీసి, మీరు ఇద్దరూ ఇలాగ ఎలా పెళ్ళి చేసుకున్నా”రని నిలదీశారు.
మాఇళ్ళకి పెళ్లి చూపులకొచ్చిన కామేశమ్ గాడికి, వాడితో తోకలావచ్చి తినివెళ్లిన నీకు పెళ్లెలాగయిందని కళ్యాణిని అడిగారు.
“అదంతే ! ‘మేరేజేస్ ఆర్ మేడిన్ హెవెన్‘ అని తేలిగ్గా నవ్వి వెళ్లిపోయారట ఈ కామేశం, కళ్యాణీ” అంది విద్య ఆవేశంగా..
“అమ్మా, తల్లీ ! నువ్వు తెలుగు టీవీ సీరియళ్సు బాగా చూస్తావని నాకు తెలుసుగాని సాగదీయక, అసలు కథ చెప్పు” చిరాకుపడింది శ్రీవిద్య కూతురు..
“అయినా వాళ్ళు పెళ్ళి చేసుకుంటే మీ అందరికీ బాధేంటి? వివరంగా చెప్పు” విసుక్కుంది కూతురు..
“వీళ్లు, ఇందాక చెప్పిన మేము అంతా క్లాస్మేట్సుమి.. ప్రేమ మోసం, పెళ్ళి వేషం.. అని ఉపన్యాసాలిస్తూ, చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల మాటవిని వారుచెప్పినట్లు చెయ్యాలని నీతులు బోధించేవారు వీరిద్దరూ, కాలేజీలో.
ఏ సరదాపని చేసినా, మా ఇళ్ళల్లో చెప్పి, తగువులు పెట్టి తమాషా చూసేవారు.
వీళ్లిద్దరికీ పెళ్లయ్యింది.
క్లాస్ మేట్ కాంతారావు పెళ్ళిలో వీళ్ళను కలిశారు నా స్నేహితురాళ్లు.
“అమితాబ్లా ఆరడుగుల పొడుగువాడు, శోభన్ బాబులా సోగ్గాడు అయితేనే చేసుకుంటానని, ఈ సోడాబుడ్డి కళ్ళద్దాల వాడినెలా చేసుకున్నావే?” అని అడిగారు.
“పెళ్లి చూపులకొచ్చి మమ్మల్ని అవమానించిన, ఈ సోడా బుడ్డిగాడి గాడినెలా చేసుకున్నావ్?” అని వెంకట్, స్వామీ, సుదర్శన్ కల్యాణిపై కన్నెర్ర జేస్తే..
“ఆపండి కాకి గోల.. అంతా ఆపైవాడి లీల” అని పకపకా నవ్వి వెళ్ళిందిట కల్యాణి.
కామేశం. కళ్యాణీల కల్యాణ౦పై కస్సు బస్సు మంటున్న వారంతా తలలు బద్దలు కొట్టుకొని, అసలు వీరిద్దరూ ఎలా ఒకటయ్యారని ఆరా తీశారుట..
పక్కపక్క వాటాల్లో వుండే కామేశం, కళ్యాణీలకు ఎప్పుడూ పడేదికాదు.
అయినా పెళ్లి చూపులకు అన్నయ్యగారు, అక్కయ్య గారని రెండు కుటుంబాలు వారూ వచ్చే వారు. పెళ్లి వయసు వచ్చాక, తల్లీ తండ్రి తెచ్చిన సంబధాలన్నీ తిప్పికొట్టింది కళ్యాణి..
‘వీడేమీ అమితాబచ్చాన్లా ఆరడుగుల పొడవులేడని, వాడు చిరంజీవిలా లేడని’ తిప్పి కొట్టేది..
కామేశం కలక్టరాఫీస్ లో క్లర్క్ జాబు తెచ్చుకొన్నాడు.
కన్ను మిన్ను గానక జయప్రదలా జాజి పువ్వులా లేదని, హేమామాలిని లా ఏమంత రిచ్ కాదనో, పెళ్లి చూపులపేరుతో ప్రతీ అమ్మాయినీ చూసి వాళ్ళు పెట్టిన టిఫెన్లు తిని, డ్రింకులు తాగి, వెళ్ళాక చెప్తామనే వాడు..
కల్యాణిని వెంటబెట్టుకోచ్చేవారు శోభన దేవతని.. శుభములదేవతని.. కామేశమ్, కళ్యాణీ ల తల్లిదండ్రులు.
మీరిద్దరూ చేసుకోండిరా అంటే వీళ్లు వినలేదట.. అలా నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చి, మా ఇంట్లోనూ తిని వెళ్ళారు.
“పొట్టపెరిగి, బట్టతలై, ఎవరూ పిల్లనివ్వననే పరిస్థితికి వచ్చాడు కామేశం.
కళ్యాణి అప్పటికే అన్ని సంబధాలు తనే తప్పించుకొంది. బాగున్నాయనుకొన్న రెండు సంబంధాల వాళ్ళు తన చెళ్లెళ్లను చేసుకున్నారు.
చెల్లెళ్ళు పిల్లల తల్లులైనా, తనకు పెళ్లి కాలేదు.
శోబన్బాబు, మోహన్బాబు కాకపోయినా, వాళ్ళ బాబులాటి వాడుకూడా దొరకలేదు.
తల్లి తండ్రి గొణుగుడు, ఇరుగుఇరుగు పొరుగు హేళన తట్టుకోలేక, బయిట కెళ్తే అందరి ఎగతాళి మాటలు వినలేక, తిరిగి కామేశంతో పరిచయం పెంచుకుందట కళ్యాణి.
స్నేహితులు జీవితంలో స్థిరపడకపోయినా పెళ్లయి హాయిగా ఉండడంతో, ఆబాధ తట్టుకోలేక కనబడిన కామేశాన్ని, మాటా మాటా కలిపి కలిపి ముగ్గు లోకి దింపిందిట కల్యాణి.
విగ్గు పెట్టుకొనే స్తితికొచ్చిన తనను, ముగ్గులోకి దిపుతోందని తెలిసినా, మురిసిపోయి మూడు ముళ్ళ వేసాడుట కామేశం.. ”ముగించి౦ది శ్రీ విద్య..
కోపంగా అంది “వాడి కొడుకే కదా వీడు.. ఈ పెళ్లి కొడుక్కి తెలియాలని చెప్పాను.. ఆపోలిక లెక్కడ వచ్చాయోనని భయపడ్డాను” అంది విద్య..
హాయిగా నవ్వారు శ్రీ విద్య భర్త, కూతురు..
అక్కడ కళ్యాణిని, కామేశాన్ని నిలదీసిన కొడుకుతో, ‘మీ నాన్న ఆవిడను పెళ్లి చూపులు చూసి ఒప్పుకోక, దాని స్నేహితురాలినైన నన్ను చేసుకున్నాడు. అది దాని అక్కసు.. పోనీలే.. చక్కని చుక్కలాంటి పిల్లతో నీపెళ్లి చేస్తా’నని సర్ది చెప్పింది కళ్యాణి..
ఆరునెలలు తిరక్కముందే హాయిగా, పక్కింటి ప్రత్యూష తో చెట్టపట్టాలేసుకు వచ్చి, ‘పైసా కట్నంవద్దు. పెళ్లి చేసుకుంటా’నన్నకొడుకును చూసి షాకయ్యారు కామేశం కళ్యాణి..
నాకంటే అదృష్టవంతుడు నా కొడుకన్నాడు కామేశం.. ---------------------------------------------------------------------------
దామరాజు విశాలాక్షి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు దామరాజు విశాలాక్షి. విశ్రాంతౌపాధ్యాయని, విశాఖపట్నం.
ప్రస్తుతం కెనడానుండి.
Comments