top of page

కామ

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Kama, #కామ

Kama - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 05/01/2025

కామ - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మాలను క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా పాటించేవాడు. అతని ఏలుబడిలో పదునెక్కిన భూసారం పుష్టికరమైన పంటలను ప్రసాదించేది. యజ్ఞ యాగాదులనుండి ఆవిర్భవించిన దట్టమైన పొగలు ప్రకృతి ని, పుడమినిని, గగనాన్ని ఆవరించేవి. దాని ప్రభావం తో వాతావరణం పవిత్రమై సారవంతంగా ప్రకాసించేది.


పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మం పాటించగ వచ్చిన ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఫలితాల్లో వచ్చిన కష్టసుఖాలను తనే భరించేవాడు. ధర్మార్థ కామ మోక్ష మార్గాలను నియమ బద్ధంగా ప్రజల చేత అనుసరింపచేసేవాడు.


 పృథశ్రవస మహారాజు ఏ ధర్మాన్ని అయినా ముందు తను అనుసరించేవాడు. ఆపై మంచి ఫలితం ఉన్న ధర్మాన్ని ప్రజలను అనుసరించమనేవాడు. అందుకే అతని రాజ్యం లో అధిక శాతం మంది మనుషులు అతనంటే మహా యిష్టపడేవారు. 


 పృథశ్రవస మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అతని నడివయస్సులో అతనికి

మంచి శుభ ముహూర్తాన సంతానం కలిగింది. 


పృథశ్రవస మహారాజు లేక లేక పుట్టిన ఆడ సంతానానికి మహర్షుల, జ్యోతిష్యుల ఆదేశానుసారం కామ అని పేరు పెట్టాడు. 


 కామ నామకరణ మహోత్సవానికి అనేకమంది రాజులు,సామంత రాజులు అతిథులుగా వచ్చారు. అందులో ప్రతిష్టాన పురానికి చెందిన మహా భౌముడు అతని భార్య సుపుష్ట కూడా వచ్చారు.వారితో పాటు వారి కుమారుడు ఆయుతానీకుడు కూడా వచ్చాడు.


అతను తన ఆటపాటల నైపుణ్యం తో అందరిని ఆనందింపచేసాడు. ఋగ్వేద మూలాలలోని గణిత శోభను అందరికి తెలియచేసాడు.ఋగ్వేదంలోని 10552 మంత్రముల మాటున ఉన్న గణిత శోభను తెలియచేసాడు. ఆయా మంత్రాల మాటున ఉన్న ఉదాత్తానుదాత్తాది స్వరాల మాటున ఉన్న గణిత తేజాన్ని అందరికి ఎరుక పరిచాడు. ఋక్కులలోని పదబంధ గణితాన్ని వివరించాడు. ఋక్కులు సూక్తాలుగ విభజించబడిన శాస్త్రీయ విధాన్నాన్ని వివరించాడు.


 పృథశ్రవసుడు కాల ధర్మానుసారం ధర్మార్థకామమోక్ష మార్గాలని అనుసరిస్తూ" కామ" ని పెంచి పెద్ద చేయసాగాడు.." కామ" నాటి ప్రతిభావంతులైన మహర్షులు,పండితులు పామరులు అందరి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది.


" కామ" అమలిన కామ సంచారిణి గ మంచి పేరు తెచ్చుకుంది. ధర్మం అయినా, అర్థం అయినా, కామమైన, మోక్షమైన అతి సర్వత్ర వర్జయేత్ అనే స్వభావం గల కామ మాటలను మహర్షులు సహితం ప్రశంసించేవారు.


 కామ ఋగ్వేదం లోని ఋక్కులు గురించి,10 మండలాల గురించి 1028 సూక్తముల గురించి మహర్షులతో ఎక్కువగా చర్చించేది. అగ్ని దేవునితో మొదలు పెట్టి అగ్ని దేవునితో ముగిసే ఋగ్వేదం మూలాలను గురించి కామ అనునిత్యం ఆలోచించేది. ఆత్మ చైతన్య స్వరూపమే అగ్ని. ఆ అగ్నే పరమాత్మను కలుస్తుంది అని కామ ఋగ్వేదం లోని అగ్ని గురించి చేసే చర్చలు మహా మహా మహర్షులను కూడ ఆలోచింపచేసేవి. ఈ అగ్ని ప్రయాణంలోనే అమలిన కామం ఉంటుందనే కామ మాటలను మహర్షులు, బ్రహ్మర్షులు సహితం ఆమోదించేవారు.


 కామ అంతఃపురంలో కంటే హాలికుల పొలాలో ఎక్కువగా సంచరించేది. శ్రమైక జీవన సిద్దాంతానికి అగ్ర పీఠం వేసేది. స్వేదం చిందేలా కష్టపడే పవిత్ర హృదయాలలో ప్రశాంతంగా జనించే కామమే నిజమైన కామం అనేది. కామ పథాన సంచరించి మోక్ష మార్గాన్ని చేరవచ్చనేది. కామిగాక మోక్ష కామి కాడు అన్న భావనలోని ఆంతర్యాన్ని అందంగా వివరించి చెప్పేది.


ధన మూలం ఇదం జగత్ అనేవారు తమ వంద శాతం జీవితంలో ఒక భాగం ధనం ఉన్నవారు రెండు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. రెండు భాగాల ధనం ఉన్నవారు మూడు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. మూడు భాగాల ధనం ఉన్నవారు నాలుగు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. వంద శాతానికి సరిపడ నాలుగు భాగాల ధనం ఉన్నవారు తమ చిత్తం వచ్చినట్లు ఆలోచిస్తారు. ఆ చిత్తం లో ఋగ్వేద దేవతలు లేకుంటే వారి ఆలోచనలు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అని కామ చెప్పే మాటలు పండిత పామరులందరిని ఆకర్షించేవి.


కామ ప్రతిష్టాన పురాన్ని పరిపాలించే ఆయుతానీకుని సుపరిపాలనను చారుల ద్వారా అనుక్షణం తెలుసుకునేది. కామ ఆయుతానీకుని పట్టాభిషేకానికి తలిదండ్రులతో సహా వెళ్ళింది. అక్కడ 

"కామ భావ విజయం" అనే నృత్యాన్ని ప్రదర్శించింది.


ఆ నృత్యం లో సామాన్య కుటుంబంలో జన్మించిన వారు సహితం సాధన ద్వారా మోక్షం పొందవచ్చును అని తెలియ చేసే ఋగ్వేదం లోని ఋభుగణ వృత్తాంతాలు ఉన్నాయి. కామ నృత్యం అక్కడి వారినందరిని ఆకర్షించింది. ముఖ్యంగా తన నృత్యం లో కామ తీసుకున్న ఋభుగణ వృత్తాంతం ఆయుతానీకుని విపరీతంగా ఆకర్షించింది.


 ఆయుతానీకుడు పది వేల గోబృందాలతో గోపూజ చేయించడం, గోవులను గోపాలురను సంరక్షించడం వంటి అంశాలు కామను బాగా ఆకర్షించాయి. అలా కామ క్రమ క్రమంగా ఆయుతానీకుని మీద యిష్టాన్ని పెంచుకుంది.


కామ మహర్షుల, మహానుభావుల ఆశీర్వాదం తో పృథ్వీ తీర్థం ను ఏర్పాటు చేసింది. ఆ కొలను దగ్గర కామ ఋగ్వేద మంత్రాలతో అనేక పవిత్ర యాగాలను చేయించింది ఆ కొలను లో స్నానం చేసిన వారికి వెయ్యి గోదానాల ఫలితం వస్తుందని కామను ఇంద్రుడు ఆశీర్వదించాడు. అంతేగాక ఆ కొలనులో స్నానం చేసిన సమస్త జీవరాశికి అమలిన కామ సంచార సుగుణం అలవడుతుందని సమస్త దేవ గణం కామ ను ఆశ్వీర్వదించింది.


 కామ దేవతల ఆశీర్వాదం ఏ మేర ఫలిస్తుందో గమనించడానికి అన్నట్లు తన చెలికత్తెలలో అతి కామం ప్రదర్శించే నిర్లజ్జ, నిరుణ, నితి వంటి వారిని పృథ్వీ తీర్థం లో స్నానం చేయమంది. కామ మాటలను అనుసరించి వారు పృథ్వీ తీర్థం లో స్నానం చేసారు. అనంతరం వారు అమలిన కామ గుణాలతో ప్రకాశించారు. ఋగ్వేద ప్రచారం లో, హాలిక సమాజాభివృద్ధికి ప్రధాన పాత్ర వహించారు.


 పృథ్వీ తీర్థం ను నాశనం చేయాలని రాక్షసులు, గోహింసా పరులు ప్రయత్నించారు. అప్పుడు కామ కత్తి పట్టింది. గోహింసా పరుల కుత్తుకలను తెగ నరికింది. సమరంలో ఆమెకు ఇంద్రుడు,అత. ఆని అనుచరులు తోడుగా వచ్చారు. ఇది తెలిసి ఆయుతానీకుడు కూడా కామ కు తోడుగా యుద్ద రంగానికి వచ్చాడు. 


పృథ్వీ తీర్థం ను నాశనం చేద్దాం అనుకున్న గోహింసా పరులు, రాక్షసులు యుద్ద రంగంలో కాలికి బుద్ది చెప్పారు. కామను విజం వరించింది. పృథ్వీ తీర్థం లో ఇంద్రుడు, ఆయుతానీకుడు స్నానం చేసారు. గోదాన ప్రముఖులు గా కీర్తిని ఆర్జించారు. అప్పటినుండి వారి చేతుల మీదుగా అనేక గోదానాలు జరిగాయి.


ఆయుతానీకుని సహాయంతో కామ యజ్ఞం లను నిరసించే యతులకు తగిన బుద్ది చెప్పింది. తన రాజ్యంలో అనేక యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. కామ మనసును గ్రహించిన పృథశ్రవసుడు ఆయుతానీకుని అల్లునిగా చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఆయుతానీకుని తలిదండ్రులు సుపుష్ట మహా భౌముల దగ్గరకు పెళ్ళి పెద్దలను పంపాడు. వారు రైవత మన్వంతరం లోని దేవ గణం పృథుకం కు చెందిన పృథశ్రవసుని గతాన్నంత తెలుసుకున్నారు. పృథశ్రవసునికి ఇంద్రాదులు ఎలా సహకరిస్తారో కూడా తెలుసుకున్నారు. అంత తమ తనయుడు ఆయుతానీకుని మనసెరిగి కామని తమ కోడలిని చేసుకోవడానికి యిష్ట పడ్డారు. మంచి శుభ ముహూర్తాన కామ ఆయుతానీకుల వివాహం జరిగింది. వారి కుమారుడు అక్రోధనుడు.


  సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








Comments


bottom of page