top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

కన్నమ్మ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Kannamma' New Telugu Story


Written By M R V Sathyanarayana Murthy


రచన : M R V సత్యనారాయణ మూర్తి


పెనుగొండలో లింగాలవీధి లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద నుయ్యి ఉంది. దాని వెనుకే ఓ పది ఇళ్ళు ఉన్నాయి. ఎనిమిది పాకలు, రెండు పెంకుటిళ్ళు. వాటికి పక్కనే గున్నయ్య మాస్టారి బడి ఉంది. అది మాస్టారు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పేరు మీద నడుపుతున్న ప్రాథమిక పాఠశాల.


కొన్ని ఏళ్ళ క్రితం శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి అక్కడ.


తెల్లారిలేస్తే ఆ పది కుటుంబాలవారు ఆ నూతి దగ్గర సందడి చేస్తూ ఉంటారు. కొందరు నూతి లోంచి నీళ్ళు బకెట్లతో తోడుకుంటూ ఉంటారు. మరి కొందరు తమ పిల్లలకి అక్కడే స్నానాలు చేయిస్తూ ఉంటారు. కన్నమ్మ అక్కడకు రాగానే పిల్లలు అందరూ గోల గోలగా అరుస్తారు, తమకి స్నానం చేయించమని.


ఎందుకంటే కన్నమ్మ చిన్న పిల్లలకు స్నానం చేయించడంలో ఎక్సుపర్టు. చిన్నగా నవ్వుతూ అక్కడ ఉన్న పిల్లలకు ఎంతో ఓపికగా స్నానాలు చేయిస్తుంది కన్నమ్మ. ఆ పని అయ్యాకే తను మంచినీళ్ళు తోడుకుని ఇంటికి పట్టుకెల్తుంది.


కన్నమ్మ భర్త దుర్గారావు దుబాయిలో ఉంటాడు. అక్కడ తాపీ పని చేస్తున్నాడు. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి పెనుగొండ వచ్చి నెలరోజులు ఉండి వెళ్తాడు. పన్నెండేళ్ళ వారి వైవాహిక జీవితానికి గుర్తుగాముగ్గురు పిల్లలు కలిగారు. కన్నమ్మ, భర్త కన్నా రెండు అంగుళాలు పొడుగు ఉంటుంది.


దుర్గారావు తల్లి సింహాచలం ‘కోడలు పొడుగ్గా వుంటే నువ్వు పొట్టి బుడంకాయలా ఉంటావు. ఈ సంబంధం వద్దు’ అని చెప్పినా, అందంగా తెల్లగా ఉన్న కన్నమ్మని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు దుర్గారావు.


తమకు పుట్టబోయే పిల్లలు పొడుగ్గా, అందంగా ఉంటారని అతని ఆశ. అతని ఆశ నిరాశ కాలేదు. వాళ్లకి కలిగిన ముగ్గురు పిల్లలకీ కన్నమ్మ రంగే వచ్చింది, కను ముక్కూ తీరు బాగుంటుంది.


భర్త దుబాయి నుండి పంపిన డబ్బు జాగ్రత్తగా దాచి, ఈ మధ్యనే రెండెకరాలు పొలం కొంది కన్నమ్మ. ఒక పాలేరుని పెట్టుకుని తనే స్వంతంగా వ్యవసాయం చేస్తోంది. ఇంటి దగ్గరే ఒక గేదెని మేపుతూ పాలు కూడా అమ్ముతుంది. తమ పది కుటుంబాల వారికే కాకుండా, ఎవరికీ ఏ సాయం కావాల్సి వచ్చినా చేస్తుంది కన్నమ్మ.


కన్నమ్మ అంటే ముత్యాలుకి చాలా అభిమానం. ముత్యాలు కన్యకాపరమేశ్వరి గుడిలో పని చేస్తుంది. తెల్లవారఝామునే లేచి గుడి కి వెళ్లి, మండపం, మెట్లు శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గులు పెడుతుంది. చాలా శ్రద్ధగా పనిచేస్తుంది. గుడి పూజారులు నారాయణ మూర్తి, కామయ్య, గుమాస్తా సూర్యనారాయణ పంతులు ముత్యాలుని పనిమనిషిగా చూడరు.తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తారు.


ముత్యాలు ఒకరోజు రాత్రి రెండు గంటలకే లేచి గేటు తీసుకుని లోపలకు వెళ్ళింది. ఆశ్చర్యంగా గుడి మండపం మీద శివ పార్వతులు పరివారంతో కొలువుతీరి ఉండడం కనిపించింది. విపరీతమైన భావోద్వేగానికి లోనై కళ్ళు తిరిగి పడిపోయింది. ఐదు గంటలకు గుడి తలుపులు తీయడానికి వచ్చిన కామయ్య గారు ముత్యాలు గుడి మండపం ముందు పడి ఉండడం చూసి, బావి దగ్గరకు వెళ్లి చేదతో నీళ్ళు తోడి, ఆ నీళ్ళు ఆమె ముఖంమీద చిలకరించగా, నెమ్మదిగా కళ్ళు తెరిచింది.


పూజారిగారిని చూసింది గానీ ఏమీ మాట్లాడలేక పోయింది. తోటమాలి అప్పలస్వామిని తోడిచ్చి ముత్యాలుని ఇంటికి పంపించారు కామయ్య. అలా ఇంటికి వచ్చిన ముత్యాలు మూడురోజులు జ్వర తీవ్రతలో ఉండిపోతే కన్నమ్మ దగ్గరుండి ఆమెకి సేవలు చేసింది. శివాలయంలో రాత్రి వేళ గజ్జెల చప్పుళ్ళు వినిపించాయని అప్పుడప్పుడు ఆ పక్క వీదివాళ్ళు చెప్పడం కొందరు వారి మాటలు లెక్కచెయ్యకపోవడం జరిగింది.


కానీ ముత్యాలుకి జరిగిన అనుభవంతో జనం, గుడిలో దేవుడు కొలువైఉన్నాడని గాడంగా విశ్వసించారు.


మూడురోజులూ పొలం కూడా వెళ్ళకుండా ముత్యాలుని కనిపెట్టుకుని ఉంది సేవలు చేసింది కన్నమ్మ.


అర్ధరాత్రివేళ ముత్యాలు నిద్దట్లో లేచి ‘శివయ్యా.. నన్ను మన్నించు సామీ, అమ్మా పార్వతమ్మా.. నన్ను కాపాడు తల్లీ’ అంటూ పలవరించేది. కన్నమ్మ ఆమెకి ధైర్యం చెప్పేది. కన్న కూతురు కంటే ఎక్కువగా తనని చూసినందుకు కన్నమ్మ పట్ల ముత్యాలుకి చాలా అభిమానం ఏర్పడింది.


కన్నమ్మ భర్త దూరంగా ఉండడం, ఆమె వంటరిగా ఉండడం చూసిన కొంతమంది ఆమెని లోబరుచుకోవాలని ప్రయత్నం చేసి విఫలులయ్యారు. తన తోటి రైతులు ‘రాత్రిళ్ళు ఒక్క దానివీ ఎలా వుంటున్నావే కన్నమ్మా, ఎవరినైనా తోడు ఉంచుకోకూడదూ?’ అని అంటే నవ్వేసి వెళ్ళిపోయేది.

వాళ్ళతో వాదించేది కాదు. ఒకసారి గేదేకి పాలు తీస్తుంటే, పక్క చేను రైతు వచ్చి చనువుగా భుజం మీద చెయ్యి వేసి అదో రకంగా నవ్వాడు.

‘పాలు తియ్యడం అవనీ అన్నా, నీతో మాట్లాడతాను’అంది శాంతంగా కన్నమ్మ.

‘అన్నా’ అన్న సంబోధనకే సగం చచ్చాడు అతను. పాలు తీసి, ఆ గిన్నెతో బయటకు వచ్చింది కన్నమ్మ. పడమటి సూరీడి కిరణాలు ఆమె మొహం మీద పడి బంగారు రంగుతో మెరిసిపోతోంది కన్నమ్మ.


‘అన్నా, నువ్వు ఇక్కడ వున్నావ్. వదినమ్మ ఇంటి దగ్గర ఒక్కత్తే ఉంది కదా. ఆమె చెయ్యి ఎవడైనా పట్టుకుంటే నువ్వు ఏం చేస్తావ్?’ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. ఆ మాటలకు తల కొట్టేసినట్టయ్యింది అతనికి. కన్నమ్మకి సమాధానం చెప్పలేక తలదించుకుని తన చేనులో ఉన్న పాక వైపు నడిచాడు.


ఇంకోసారి సూరిగాడు వచ్చాడు ఆమె దగ్గరికి. సూరిగాడు గాలికి తిరుగుతూ ఉంటాడు. తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోయారు. మేనమామ పెంచి పెద్ద చేసాడు. ఇటీవలే ఆయనా చనిపోయాడు.పెళ్ళీ పెటాకులు లేకుండా ఊరిమీద పడి తిరుగుతూ ఉంటాడు. వాడు చెయ్యని చండాలం పనులు లేవు. తాడి బాబ్జి గారి కొబ్బరి తోటలో కొబ్బరికాయలు దొంగతనంగా తీస్తూ పట్టుబడ్డాడు. బాబ్జీ గారు చీవాట్లు పెట్టి పంపించారు.


ఇంకొకళ్ళు అయితే చెట్టుకు కట్టి దేహశుద్ధి చేసేవారు. చెరుకువాడ లో బ్రాహ్మలు దొడ్లో అంటగిన్నెలు వేసుకుంటే, రాత్రివేళ వాటిని దొంగిలించి, పాలస్ టాకీసు ఎదురుగా ఉన్న కాలవరేవులో వాటిని శుభ్రంగా తోమి తణుకు పట్టుకువెల్లి అమ్మేసి వచ్చాడు. ఒక రోజు తాగిన మైకంలో ఈ విషయం చెప్పగానే, బ్రాహ్మలు తణుకు వెళ్లి ఆ ఇత్తడి కోట్లో ఉన్న తమ గిన్నెలు వెనక్కి తెచ్చుకున్నారు. అంతటి చండాలుడు సూరిగాడు.


“కన్నమ్మా, నిన్ను చూస్తే జాలేస్తోంది. మీ వాడలో నిన్ను మించిన అందగత్తె లేదు. ఏమిటో మీ ఆయన దుబాయిలో, నువ్వు ఇక్కడ ఒంటరిగా పాలూ , చేలూ అంటూ టైం వేస్ట్ చేస్తున్నావ్. నేనో మాట చెబుతాను వింటావా? చెట్టుమీద పండు ఉందనుకో. దోరగా ఉన్నప్పుడే కోసుకుని తినాలి. తర్వాత తిందాం అనుకుంటే అది వాడి పోతుంది. మన సరదాలు, కోర్కెలు వయసులో ఉన్నప్పుడే తీర్చుకోవాలి. వయసు అయిపోయాకా ఆ సరదా పుట్టినా ఏం లాభం?


నా మాట విను. నీ మీద మనసు పడిన ఓ పెద్దాయన నీకు ఒక ఎకరం పొలం ఇద్దామనుకుంటున్నారు.నువ్వు ఒక్కసారి ఆయన దగ్గరకు వస్తే చాలు. నువ్వు రెండు ఎకరాలు సంపాదించదానికి పదేళ్ళు పట్టింది. ఇప్పుడు చూడు నువ్వు ‘ఊ’ అంటే ఎకరం పొలం వస్తుంది. ముందు ముందు బోల్డు బంగారం కూడా ఇస్తానన్నారు. నువ్వు రెడీగా వుంటే చీకటి పడ్డాక నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. సరేనా?” అన్నాడు సూరిగాడు వంకర నవ్వు నవ్వుతూ.


అప్పుడు కన్నమ్మ గేదేకి గడ్డి వేస్తోంది. శాంతంగా సూరిగాడికేసి చూసింది.


“అన్నా, నేను అన్నం తింటున్నాను. ఇది కాదు” అంది గడ్డికేసి చూపిస్తూ. అందులోంచి ఒక గడ్డిపరక తీసి చేత్తో పట్టుకుని ‘నువ్వు చెప్పిన ఎకరం పొలం దీనితో సమానం. ఇంకెప్పుడూ, ఎవరి దగ్గరకు ఇటువంటి చండాలం రాయబారాలు తీసుకెళ్ళకు. కాలో,చెయ్యో తీసేస్తారు. అందరూ నాలా ఉండరు. కూలి పని చేసుకుని బతుకు. దాంట్లో ఒక గౌరవం ఉంటుంది. ఇటువంటి పనులు చేసి తినే తిండి అశుద్ధంతో సమానం అని తెలుసుకో. వెళ్ళు” అంది.


ఆమె మాటలకు తల తిరిగిపోయిన సూరిగాడు వడి వడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అవమానభారంతో.


కన్నమ్మ నిప్పు అని చాలామందికి తెలిసినా కొంతమంది పనికిమాలిన వాళ్ళు అప్పుడప్పుడు ఆమెని ప్రలోభపరచడానికి ప్రయత్నం చేసి ఆమె దగ్గర తలదించుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా సమస్య వస్తే కన్నమ్మ కంగారుపడిపోదు, అల్లరి పడదు. నిదానంగా దానిని పరిష్కరించుకుంటుంది. అదీ ఆమె లోని విజ్ఞత.


కన్నమ్మ ప్రతి రెండు ఏళ్ళకు తన పుట్టిల్లు శ్రీకాకుళం జిల్లా లోని కొండపల్లె వెళ్తుంది. తల్లినీ, తండ్రినీ చూసివస్తుంది. తిరిగి పెనుగొండ వచ్చేటప్పుడు అక్కడి అడివిలో దొరికే వనమూలికలు తెచ్చుకుంటుంది. ఆ మూలికలతో తేలు కుట్టినవాళ్ళకు, జెర్రి కుట్టినవాళ్ళకు వైద్యం చేస్తుంది.


ఒకసారి బజార్లోని షావుకారి గారి ఇంటికి ఆయన మేనకోడలు హైదరాబాద్ నుంచి వచ్చింది. షావుకారి గారిది పెద్ద పెంకుటిల్లు. బాత్రూం ఇంటికి కొచెం దూరంగా ఉంటుంది. ఆ రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. రాత్రి తొమ్మిది గంటలయ్యింది. కరెంటు పోయింది. బేటరీ లైట్ పట్టుకుని బాత్రూం కి వెళ్లి వస్తున్న హైదరాబాద్ అమ్మాయిని తేలు కుట్టింది.


ఆమె బాధతో కేక వెయ్యగానే షావుకారి గారి భార్య గబా గబా వచ్చింది. తేలుకుట్టిన సంగతి తెలుసుకుని బేటరీలైట్ వెలుగులో తేలుని చూసి, పక్కనేవున్న పచ్చడి బండతో దానిని చంపేసింది. ఊళ్ళో ఉన్న ఆర్.ఎం.పి.ముంగి నాగేశ్వరరావు సాయంత్రమే ఊరికి వెళ్ళడం షావుకారు చూసారు. చీకట్లో వంతెన దాటి డాక్టర్ రాజు గారి హాస్పిటల్ కి వెళ్ళడం కష్టం. అప్పుడు గుర్తుకు వచ్చింది కన్నమ్మ.


వెంటనే మేనకోడలుని తీసుకుని బేటరీ లైట్ వెలుగులో లింగాలవీధి లోని కన్నమ్మ ఇంటికి వెళ్ళారు షావుకారు. ‘కన్నమ్మా కన్నమ్మా’ అని గట్టిగా పిలిచారు షావుకారు.


నిద్దట్లో ఉన్న కన్నమ్మ లేచి తలుపు తీసి బయటకు వచ్చింది. ఎదురుగా షావుకారు.


‘ఏంటి బాబూ, సీకట్లో వచ్చారు?”అడిగింది కన్నమ్మ.


“ఈ అమ్మాయి మా మేనకోడలు. హైదరాబాద్ నుంచి వచ్చింది. బాత్రూం కెళ్ళి వస్తుంటే తేలు కుట్టింది. కొంచెం చూడు” అన్నారు షావుకారు. ఆ అమ్మాయి బాధతో విల విల లాడి పోతోంది.


కన్నమ్మ లోపల్నించి చాప తెచ్చి అరుగు మీద వేసింది. బేటరీ లైట్ వెలుగులో ఆ అమ్మాయి పాదం మీద గాటు చూసింది కన్నమ్మ. వాళ్ళు ఇద్దర్నీ చాప మీద కూర్చోమని చెప్పి లోపలకి వెళ్లి కొండ వేరు తీసుకువచ్చి తేలు కాటువేసిన చోట నెమ్మదిగా తగిలించి నోటితో నెమ్మదిగా ఊదుతూ ఏదో గొణిగింది కన్నమ్మ. రెండు నిముషాలకు ఆ అమ్మాయికి కొంత ‘ఊరట’ కలిగింది.


కాలు కొంచం ఝాడించమని, “తగ్గిపోతాదమ్మా. కంగారు పడకు” అని లోపలకు వెళ్ళింది కన్నమ్మ. ఒక కొప్పి తీసి సాన మీద అరగదీసి ఆ గంధం తీసుకువచ్చింది. తన చీర చెంగుతో ఆ అమ్మాయి పాదం అంతా శుభ్రంగా తుడిచింది. ఆ గంధం ఆ అమ్మాయి పాదం మీద తేలు కాటు వేసిన చుట్టూరా రాస్తూ ‘ఏం చదువుతున్నావమ్మా?’ అని అడిగింది.


‘డిగ్రీ రెండవ సంవత్సరం’ అంది ఆ అమ్మాయి.


గంధం రాస్తూనే ‘సైన్సా ,సోషలా?’ అడిగింది కన్నమ్మ.


ఆ పరిస్తితి లో కూడా ఆ అమ్మాయికి నవ్వు వచ్చింది. అది చూసి కన్నమ్మ కూడా నవ్వింది.


“సైన్సు అంటే బి.ఎస్.సి. సోషల్ అంటే బి.ఏ.అని మా తమ్ముడు సేప్పాడు. అందుకని అడిగా” అంది కన్నమ్మ.


ఆమె జనరల్ నాలెడ్జి కి ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి. వెంటనే ‘బి.ఎస్.సి.’ అంది.


“ఓహో.. ఈ చదువు అయిపోతే మాస్టరీ ఉద్యోగం వత్తాదా అమ్మా?” అడిగింది కన్నమ్మ.


“వెంటనే రాదు. డిగ్రీ అయ్యాక బి.ఇ.డి. చదవాలి. అప్పుడు టీచర్ ఉద్యోగం వస్తుంది.”


“అయితే బి.ఇ.డి. చదివేసి మా ఊరిలోని బడికే టీచరమ్మగా వచ్చేయండి. మీ మావయ్యగారి ఇంట్లో వుండి ఉద్యోగం చేసుకోవచ్చు.” నవ్వుతూ అంది కన్నమ్మ.


“గవర్నమెంటు అలా ఒప్పుకోదు. వాళ్ళు పంపిన ఊరికే వెళ్లి ఉద్యోగం చెయ్యాలి. కొన్నాళ్ళు పోయాక మనం గవర్నమెంట్ కి దరఖాస్తు పెట్టుకోవాలి ఫలానా ఊరు కావాలని. అక్కడ ఖాళీ ఉంటె వాళ్ళు అక్కడికి పంపుతారు” ఓపికగా సమాధానం చెప్పింది ఆ అమ్మాయి.


“ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ కాలు?” అడిగింది కన్నమ్మ.


కాలు ఒకసారి ఝాడించి ‘తగ్గిపోయింది’ అంది ఆనందంగా ఆ అమ్మాయి. తన మేనకోడల్ని మాటల్లో పెట్టి ఆమె మనసుని కాలు బాధ నుంచి మళ్ళించిందని గ్రహించాడు షావుకారు.


“వస్తాము, కన్నమ్మా! నువ్వు ఈ ఊరిలో ఉండడం మా అందరి అదృష్టం. అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎంతో సహాయం చేస్తున్నావు” అన్నాడు షావుకారు.


“ఎంత మాట బాబుగారూ. నేను పెద్దగా చేసింది ఏముంది బాబూ. నాకు తెలిసింది చేసాను. అది మా పెద్దోళ్ళు మాకిచ్చిన వారసత్వం. అంతే బాబూ” అంది వినయంగా .

షావుకార్ మేనకోడల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు.

*****

వినాయక చవితి వచ్చిందంటే కన్నమ్మ ఇల్లు సందడిగా ఉంటుంది. పొలం దగ్గర నుండి మట్టి తెచ్చి చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు చేసేది. యలమర్తి వారి ఫాన్సీ కొట్టునుంది రంగు రంగుల కాగితాలు కొని తెచ్చేది. ఒక అడుగు పొడవు ఉండే మూడు కొబ్బరిపుల్లలను తీసుకుని వాటికి దారం చుట్టి గట్టిగా కట్టి, పసుపు,నీలం, ఎరుపు రంగుల కాగితాలతో గొడుగులా చేసి, కొబ్బరి పుల్లలు పైన అందంగా అమర్చేది.


చవితి ముందు రోజునే తన ఇంటి అరుగుమీద వినాయకుడి బొమ్మలు పెట్టి, ఎవరు అడిగితె వారికి బొమ్మలు ఉచితంగా ఇచ్చేది. గోంగూర తూము సెంటర్ లో వినాయకుడి బొమ్మలు అమ్మే రామారావు ఓ సారి కన్నమ్మ ఇంటికి వచ్చి ఓ యాభై వినాయకుడి బొమ్మలు ఖరీదుకి తయారుచేసి ఇమ్మని అడిగాడు.


“బాబూ, డబ్బు కోసం నేను దేవుడి బొమ్మలు అమ్మటం లేదు. మీకు కావాలంటే మీ పూజకు ఓ బొమ్మ తీసుకు వెళ్ళండి. డబ్బులు అక్కరలేదు”అని చిరునవ్వుతో చెప్పింది కన్నమ్మ.వినాయకుడి బొమ్మ తీసుకుని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు రామారావు.


అట్లతద్ది వచ్చిందంటే పిల్లలతో పోటీపది మరీ ఆటలు ఆడేది కన్నమ్మ. తెల్లారగట్ల నాలుగు గంటలకు లేచి స్నానం చేసి గోంగూర పచ్చడి, ఆవకాయతో నాలుగు మేద్దలు తిని ‘అట్లతద్దోయ్ ..ఆరట్లు , ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపిల్లలతో కలిసి లింగాలవీది అంటా తిరుగుతూ గంతులు వేసేది.


వాళ్ళతో కలసి ఆనందంగా దాగుడుమూతలు ఆడేది, ఒప్పుల కుప్ప తిరిగేది. ఉదయం ఏడుగంటలకే లింగాలవీది మొగలో ఉన్న పెద్ద రావిచెట్టుకి తన ఇంటిపక్కనే ఉన్న కొట్టాని రాజుతో ఉయ్యాల కట్టించేది.


తమ వాడలో ఉన్న ఆడపిల్లలు అందర్నీ ఉయ్యాల ఎక్కించి ఊపేది. సాయంకాలం అమ్మవారి గుడికి వెళ్ళే ముత్తైదువలు కూడా రావిచెట్టు దగ్గర ఆగి ఉయ్యాల ఊగి, కన్నమ్మతో కబుర్లాడి గుడికి వెళ్లి పూజలు చేసేవారు.


కన్నమ్మ భర్త దుర్గారావు దుబాయ్ నుండి ఇంటికి వచ్చేసాడు. కన్నమ్మ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దబ్బాయ్ ఈశ్వర్ డిప్యూటీ తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నబ్బాయ్ సుదీర్ బ్యాంకు ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కూతురు కనకదుర్గ బి.ఏ.బి.ఇడి. చేసి ఇరగవరం హై స్కూల్ లో టీచర్ గా చేస్తోంది. ఈశ్వర్ ఆకివీడు లో, సుదీర్ జంగారెడ్డిగూడెం లో ఉద్యోగాలు చేస్తున్నారు.


డెబ్భై ఐదేళ్ళ వయసులో ముక్కోటి ఏకాదశి నాడు అనాయాస మరణం పొందింది కన్నమ్మ. ఆమె అంత్యక్రియలకు వచ్చిన జనాన్ని చూసి ఆమె పిల్లలు ఆశ్చర్యపోయారు. తల్లి పట్ల పెనుగొండ ప్రజలకున్న అభిమానం చూసి ఎంతగానో ఆనందపడ్డారు.


ప్రతి వినాయక చవితికి, అట్లతద్ది కి పెనుగొండ ప్రజలు కన్నమ్మను గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

***శుభం***


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


39 views0 comments

Comments


bottom of page