#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #కన్నోళ్లుదేవుళ్ళు, #KannolluDevullu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 46
Kannollu Devullu - Somanna Gari Kavithalu Part 46 New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/03/2025
కన్నోళ్లు దేవుళ్ళు - సోమన్న గారి కవితలు పార్ట్ 46 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కన్నోళ్లు దేవుళ్ళు
----------------------------------------
అమ్మ చెప్పే మాట
నాన్న చూపే బాట
ఈ చిన్ని బ్రతుకులో
అగునోయ్! కంచుకోట
అమ్మ తీయని ఊట
మదిని దోచే పాట
జాలువారును ఇంట
శుభములు ఆమె నోట
నాన్న మమతల మూట
వారే లేని పూట
గడవదు క్షణమైనా
మనసున హైరానా
మహిలో కన్నవారు
మదిలో మిన్న వారు
వారికి సాటెవ్వరు!
ఎవరు లేనేలేరు!
కాసింత ప్రేమతో
పలకరిస్తే చాలు
ఘనమైన మనసుతో
ఆదరిస్తే మేలు
కన్నోళ్లు దేవుళ్ళు
తెరువు గుండె లోగిళ్ళు
జన్మ దాతలు వారు
మార్చుకో! నీ తీరు

మహా ఘనుడు దేవుడు
----------------------------------------
దేవుని నామంలో
ఉందెంతో భద్రత
ఆధ్యాత్మిక దారిలో
ఉండాలి జాగ్రత్త!
మహా ఘనుడు దేవుడు
భక్తులకు ప్రసన్నుడు
శ్రద్ధగా వేడితే
అవుతాడు రక్షకుడు
శుద్ధమైన హృదయము
దైవానికి నిలయము
చేయరాదు ఎన్నడు
చెడు పనులతో మలినము
భగవంతుని నామము
ధ్యానించుము సతతము
బ్రతుకుల్లో క్షేమము
వైదొలగును క్షామము

అమ్మ హెచ్చరికలు
----------------------------------------
చదవాలి శ్రద్ధగా
ఉండాలి బుద్ధిగా
విజ్ఞానమార్జించి
ఎదగాలి గొప్పగా
అందరితో ప్రేమగా
చిరునవ్వులు విరియగా
కలసిమెలసి వసుధలో
బ్రతకాలి హాయిగా
మహిలో దీపంగా
మదిలో ధైర్యంగా
సాహసాలు చేస్తూ
నిలవాలి విజేతగా
శ్రమలలో ఓర్పుగా
పనులలో నేర్పుగా
ఆపదలు గమనించి
సాగాలి తెలివిగా

ఏదీ శాశ్వతం!!
----------------------------------------
తరిగిపోవును ప్రాయము
చెదిరిపోవును అందము
స్థిరమైనవి జగతిలో
మంచియన్నది మాత్రము
వాడిపోవును పూవులు
ఆకు రాల్చును తరువులు
దాతృతత్వము మంచిది
కొండలాగ ఉండునది
మేఘాలు మాయమగును
మంచు పొగ సమసి పోవును
స్నేహబంధం గొప్పది
సృష్టిలో సాటిలేనిది
స్నేహమే శాశ్వతము
క్షమాగుణము బహు ఘనము
తెలుసుకొనుము సత్యాలు
అక్షర ఆణిముత్యాలు

సూక్తి ముక్తావళి
----------------------------------------
గురుదేవుల బోధలు
తొలగించును బాధలు
బ్రతుకున పాటిస్తే
బాగుపడును బ్రతుకులు
గుండెలోని చింతలు
చూడ చితిమంటలు
ఆదిలో ఆర్పితే
హాయి గుండు మనసులు
కన్నవారి మాటలు
భవితకవే బాటలు
అలకిస్తే గనుక
అగును పూలతోటలు
జీవితాన మిత్రులు
తరిగిపోని ఆస్తులు
ఆపద వేళల్లో
వెన్నంటే నీడలు
ఇంటిలోని పిల్లలు
గుబాళించు మల్లెలు
అమ్మలా లాలించు
సొగసులీను పల్లెలు
సదనంలో పెద్దలు
త్యాగానికి గురుతులు
గౌరవం చూపాలి
వారు పూజనీయులు
-గద్వాల సోమన్న
Comments