Kantamma Hotel Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
పాసింజర్ వస్తున్నట్లు మొదటి బెల్ వినిపించగానే స్టేషన్లోకి మనుషులు రావడం మొదలుపెట్టారు. అదొక కొండ ప్రాంతంలోని ఓ చిన్న రైల్వేస్టేషన్... ఒరిస్సా బోర్డర్లో ఉండటం వల్ల ఎక్కువగా ఏజెన్సీలో పనిచేసే టీచర్లు, నర్సులు, డాక్టర్లు, రెవెన్యూ ఉద్యోగస్తులు అక్కడ పాసింజర్ రైలు దిగి తమ ఉద్యోగాలకు వెళుతుంటారు.
రోజుకి రెండే రెండు రైళ్ళు...
ఉదయాన్నే ఎనిమిదిగంటల కొచ్చే రాయపూర్ పాసింజర్... మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకొకటి.
అలాగే విశాఖకు వెళ్ళడానికి రాత్రి ఆరు, తొమ్మిది గంటలకు వస్తాయి.
ఆ స్టేషన్ ఒక కొండవాలులో కట్టబడింది. స్టేషన్‌కి కొద్ది దూరంలో స్టేషన్ మాస్టర్, పోర్టర్ల
నివాస గృహాలు..
ఉదయం పాసింజర్ వచ్చే గంట ముందు నుంచి ఆ స్టేషన్లో అలికిడి మొదలువుతుంది.
రెండు పాసింజర్లు వెళ్ళిపోయేదాకా స్టేషనంతా సందడిగా ఉంటుంది. ఆతరువాత ఒక్కసారిగా నిశ్శబ్దంఆవరిస్తుంది.
ఆరోజు పాసింజర్‌కి లైన్ క్లియర్ కాగానే పెద్ద మాస్టారు సుబ్బారావు పరుగున వచ్చి పోర్టరు
జగదీష్‌తో “ బుకింగ్ విండో తీసావా? అని అడిగాడు.
“ లేదు మాస్టారూ! తమరొస్తారని ఎదురుచూస్తున్నాను” అన్నాడు.
“ భలేవాడివిరా నువ్వు! ఇవాళ అమ్మగారికి ఒంట్లో బాగులేకపోవడంతో వంటపని నేనే
చూసుకోవలసి వచ్చింది. అందుకే ఆలస్యం అయింది. అది సరే... కాంతం హోటల్‌కి వెళ్ళి వేడి వేడి ఇడ్లి పట్టుకురా... బండోస్తే మనకు మరి దొరకవు.. ఏమిటో.. ఈస్టేషన్‌కు వచ్చీ నాలుగేళ్ళవుతోంది...
ఒక్క రోజు కూడా ఆమె హోటల్ ఇడ్లీ తినకుండా ఉండలేదు.. ఏమాటకామాట చెప్పుకోవాలిరా... నేను చదువుకున్నప్పట్నుంచీ తింటున్నాను. కానీ మన స్టేషన్ కాంతమ్మ ఇడ్లీలంతా రుచి ఎక్కడా చూడలేదు.”అన్నాడు సుబ్బారావు.
“ తమరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం మాస్టారూ. అసలు ఆ ఇడ్లీ రుచికి ఆ శనగపలుకుల సెట్నీయే కారణం అని అందరూ అంటారు. అసలు మన స్టేషన్‌కి డివిజన్ లెవెల్లోపేరోచ్చిందంటే ఆకాంతమ్మే కారణం... విజీనగరం దగ్గర్నుంచి రాయఘడా దాకా ఎన్నోస్టేషన్‌లో ఇడ్లీలమ్ముతున్నాజనాలందరూ మన స్టేషన్‌లోని కాంతమ్మ ఇడ్లేలే తింటారు. మీకు తెలీదుగాని బాబూ ఇదివరకు అప్పారావని ఓచిన్న మేస్తారు అతనికి యప్పస్‌గా ఇడ్లిలివ్వలేదని బండి ఆగీ ఆగగానే బెల్లు కొట్టించేసేవాడు. దాంతో ఆమె బేరం పడిపోయింది.
కానీ రెండు రోజుల తరువాత జనాలు చైనులాగి బండి నాపి మరీ ఇడ్లీలు తినడం మొదలెట్టారు. గూడ్స్ డైవర్లెతే ఆ మేస్టారు సిగ్నలిచ్చినా ఆ ఇడ్లిలు తినేదాకా కదిలేవారు కాదు. ఒకరోజైతే పది మందొచ్చీ ఆ మాస్టర్ బాబుని, కొట్టబోయేరుకూడా...
అపుడు కాంతమ్మే వచ్చి వాళ్ళకి దండం పెట్టీ మాస్టార్ని ఏటీ అనొద్దని వేడుకుంటే అతన్ని వదిలేసారు...”అన్నాడు జగదీష్...
' అయినా కాంతమ్మ మేస్టర్లకి, డైవర్లందరికీ ఇడ్లీలు అడక్కుండానే పంపిస్తుంది కదరా...
మరి ఆ మేస్టారు ఎందుకు అలా చేసాడంటావ్?” అన్నాడు సుబ్బారావు...
“ ఏదో గ్రహచారం... ఎవరో మేస్టారు మీద కంప్లైంట్ చేస్తే డీసీయమ్ గారు వచ్చీ కాంతమ్మ ని
అడిగితే నేనపుడూ మాస్టారికీ ఫ్రీగా ఇడ్లిలివ్వలేదనీ, రోజూ డబ్బులు తీసుకుంటాననీ చెప్పి అతని
ఉద్యోగాన్ని కాపాడింది బాబూ... కాంతమ్మ చాలా నికార్సైన మనిషి... డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునే రకంకాదు” అన్నాడు...
ఇంతలో పాసింజర్ బండి జౌటైంది. పెద్దగా హారన్ కొడుతూ వచ్చి ప్లాట్‌ఫారం మీద ఆగింది.
బండి ఆగగానే జగదీష్ కేష్ బాగుతీసుకొని గార్డు పెట్టె దగ్గరికి వెళ్ళాడు. గార్డు కిందకు దిగి దాన్నందుకుని డబ్బాలో వేసి రసీదు మీద సంతకం చేసి ఇచ్చాడు..
ఆతరువాత అతను, జగదీష్ కలిసి కాంతం హోటల్ దగ్గరికి వెళ్ళారు.
హోటల్ అంటే అదేమీ పక్కా బిల్డింగేమీకాదు.. ఒక చిన్న పాక... తాటాకులతో కట్టింది. దాని
ఆ హాటల్ ఎప్పట్నుంచీ ఉందో ఎవ్వరికీ తెలియదు. 60 ఏళ్ళ క్రితం కాంతమ్మ తండ్రి సన్వాసి
విశాఖపట్నం దగ్గర పల్లెటూర్నించి ఇక్కడికి వచ్చీ టీ దుకాణం పెట్టేడనీ, అప్పట్లో ఈలైను
వేస్తుండే వారనీ, ఆ కూలి వాళ్ళకోసం అతను హోటల్ పెట్టాడనీ, రానురాను అది టిఫన్ హోటల్ గా మారిందనీ చాలామంది పాత స్టేషన్ మాస్టార్లు, డ్రైవర్లు, గార్డులు చెబుతుంటారు. ఆరోజు ఆ స్టేషన్ టీని “సన్యాసి టీ" అని చెప్పుకునేవారట. డైవర్ నుంచి గార్డులదాకా అందరూ అక్కడ టీ తాగి ఫ్లాస్కుల్లో పోయించి పట్టుకెళ్ళేవారట.
అప్పట్లో స్టీమ్ ఇంజన్‌తో బళ్ళు నడిచేవి... సన్యాసికి ఆ డైవర్లే పొయ్యి కోసం బోలడు
బొగ్గునిచ్చేవారట. అతనికి కాంతమ్మ ఒక్కర్తే కూతురు. మేనల్లుడు వెంకట్రావ్‌ని తెచ్చిపెద్దచేసి
కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తే, వాడు తాగేసి ఒక రోజు బండి కింద పడిపోయి చనిపోవడంతో వెంకట్రావ్ మంచం పట్టి చనిపోయాడు. కాంతమ్మకి ఒక కొడుకు సుందరం... అప్పట్నుంచీ కొడుకుని, తల్లినీ కనిపెట్టుకుని కాంతమ్మ ఆ హోటల్ని నడపడం మొదలుపెట్టింది. ఆమె చేతి మహత్యమో ఏమో ఆమె చేసే ఇడ్లీలు రుచిగా ఉండి అందరూ ఇష్టపడటంతో అనతికాలంలో ఆమె హోటల్‌కి మంచి పేరు వచ్చింది.
ఇంతలో రైల్వేలో రూల్స్ మారడంతో కాంటీన్ కి లైసెన్స్ కట్టాలని చెప్పడంతో ఆ మాస్టార్లే
ఆమె ఫీజు కట్టేసేవారు. కాలనీలో ఒక పాడుబడ్డ క్వార్టర్ ఉంటే దాన్నే బాగు చేయించుకొని ఆమె
అందులో ఉండేది.
ఉదయం ఆరుగంటలకు ఇడ్లీ పొయ్యి వెలిగిస్తుంది. కొడుకు సుందరం టీలు పెడతాడు.
ఉదయం పదితోసరి, మళ్ళీ సాయంత్రం ఐదునుంచి ఏడుదాకా...
ఇలా హాయిగా సాగిపోతున్న అమె జీవితంలో ఒక పెద్ద ఉపద్రవం మన్మధరావ్ రూపంలో
వచ్చి పడింది.
అప్పట్లో రైల్వేబోర్డువారు చిన్న చిన్న స్టేషన్‌లో పాకలో నడిపే హాటలన్నింటినీ తీసివేసి
కాంటీన్లకి లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ఈస్టేషన్ కాంట్రాక్ట్ మన్మధరావనే ఒక
వ్యక్తికి వచ్చింది..
ఒక రోజు అతను పాసింజర్లో ఆ స్టేషన్‌కి వచ్చి పెద్ద మాస్టారు సుబ్బారావుని కలిసి తనకు
రైల్వే ఇచ్చిన కేంటీన్ లైసెన్స్‌ని చూపించాడు...
సుబ్బారావు దాన్ని చూసి ఈ లైసెన్స్ కాపీ నాకూ వచ్చింది. కేంటీన్‌కి చిన్న బిల్దింగ్ అవసరం
దాన్ని కట్టిన తరువాత నువ్వు కేంటీన్ని పెడుదువు గాని” అని చెప్పాడు.
మన్మధరావు ఆమాటలకు ఖంగుతిని" మాస్టారు గారూ... ఈ లైసెన్స్ రావడానికి నాకు యాభై వేలు
ఖర్చయింది. బిల్లింగ్ కట్టేదాకా నేను ఆగలేను... పైగా ఈ లైసెన్స్ ఒక్క సంవత్సరమే.. మళ్ళీ సంవత్సరం తరువాత వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఈవారంలోనే నేను కేంటిన్ ప్రారంభిస్తాను. ఇంకో విషయం... ఇక్కడ కాంతమ్మ అనే ఆవిడ ప్లాట్ఫారం మీద హోటల్ పెట్టి టిఫన్లు, టీలు అమ్ముతోందట... అదింక రేపట్నుంచీ కుదరదు. మీరే ఆమెకు చెప్పి ఆ హాటల్ని ఖాళీ చేయించండి” అన్నాడు...
ఆమెదేం పెద్ద హోటల్ కాదు. ఏదో పేదావిడ, వృద్దురాలు... మీరు ఈ మూల పెట్టుకోండి,
ఆవిడ మీకు అడ్డురాదు... ఆవిడ పొట్టనెందుకొట్టడం' అని చెప్పాడు.
ఆ మాటలకు మన్మధరావు రెచ్చిపోయి “మాస్టారూ... మీరంతా అమె ఇచ్చే ఇడ్గీలకు కక్కుర్తి
పడి ఆమెకు సహాయం చేస్తున్నారు. నేను వేల రూపాయలు పోసి లైసెన్స్ పాడుకున్నాను. ఆ హోటల్ని ఆమె మూసెయ్యవలసిందే... అదే కాక ఈస్టేషన్లో ఎవ్వరూ తినుబండారాలుగానీ, టీలుగానీ అమ్మరాదు. ఏదీ కావాలన్నా నా కేంటీన్‌కే రావాలి. లేకపోతే నేను డీసియమ్‌కి, డీఆర్‌ఎమ్‌కి ఫిర్యాదు చేస్తాను” అని వార్నింగిచ్చాడు..
ఆ మర్నాడు సుబ్బారావు కాంతమ్మని పిలిచి జరిగిన విషయమంతా చెప్పడంతో కాంతమ్మ
కంటనీరు పెట్టుకొని “బాబూ మీరు విచారించకండి... ఏదీ స్వంతం కాదు. నా హాటల్‌కి మూసేసే
కాలం వచ్చేసినట్టుంది. పుట్టినప్పట్నుంచీ నాది చెడ్డ జాతకమే.. అంతా దేవుడిదయ" అంది...
సుబ్బారావు మాస్టర్, జగదీష్ కాంతమ్మని ఓదార్చేరు. స్టేషన్‌కి దూరంగా, కాలనీ లో ఒక
తాటాకులతో పాకవేసి అందులోకి సామాన్లను మార్చి హోటల్ని అక్కడ ప్రారంభించేరు...
అనుకున్నట్లు గానే వారం తరువాత మన్నధరావ్ కేంటీన్ ప్రారంభమైంది.
ఈవిషయం తెలిసి డ్రైవర్లు, గార్డులు, పోలీసులు అంతా విచారించేరు. కానీ సుబ్బారావు
మాస్టారు వారితో “మీరేమీ గాబరా పడకండి. నేను ప్రతీరోజూ ఓ పదినిముషాలు బండిని ఎక్కువసేపు ఆపుతాను. కాంతమ్మ హోటల్ మన కాలనీలో పెట్టింది. అక్కడికి వెళ్ళితే మీకు ఇడ్లీలు దొరుకుతాయి.
అని చెప్పడంతో మర్నాటి నుంచి రైల్వే స్టాఫ్అంతా ఆమె హోటల్‌కే వెళ్ళి టిఫిన్ తింటూ ఉండటంతో మన్మధరావ్‌కి ఈవిషయం తెలిసి మళ్ళీ మాస్టారుతో తగువు పెట్టుకున్నాడు.
ఈసారి సుబ్బారావు గారు అతనికి గట్టిగా సమాధానం ఇచ్చారు...” టిఫిన్ ఎక్కడ తినడమనేది
తినేవాళ్ళ ఇష్టం.. నీ ఇష్టం వచ్చినవాళ్ళతో చెప్పుకో” అని అతనికి చెప్పాడు..
రానురాను జనాలకు కాంతమ్మ హోటల్ కాలనీ లో ఉన్నవిషయం తెలిసిపోయి, మొత్తం అక్కడికే వెళ్ళిపోతుండటంతో ఒకరోజు మన్మధరావు నలుగురు మనుషుల్ని తాగించి ఆమె హోటల్ మీదకు పంపించాడు. కానీ అక్కడి కాలనీ వాళ్ళు వాళ్ళకి దేహశుద్ధిచేసి పోలీసులకి అప్పచెప్పడంతో మన్మధరావ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు.
అనతికాలంలోనే మన్మధరావు కేంటీన్లో తయారుచేసిన టిఫిన్లు రుచిగాలేక ఎవ్వరూ తినడం
మానేశారు. మన్మధరావు తరచు పట్నం వెళ్ళిపోతుండటంతో ఆ కేంటిన్లో టిఫిన్ దొరికేదికాదు.
కొన్నిరోజుల తరువాత అందులో పనిచేసే ఇద్దరు కురవాళ్ళకు జీతాలివ్వకపోవటంతో వాళ్ళు
చెప్పకుండా వెళ్ళిపోవడంతో కేంటీన్ని చూసే నాధుడే లేకపోయాడు. దానికి తోడు మన్మధరావు ఆ వూళ్ళో చాలామంది దగ్గర అప్పులుచేసి పారిపోయాడన్న వార్త ఒక్కసారిగా గుప్తుమనడంతో ఇక అది శాశ్వతంగా మూతపడింది.
అలాంటి సమయంలో ఒకరోజు మన్మధరావు కోసం పోలీసులొచ్చారు. సుబ్బారావుగారిని కలిసి
“సార్... ఈ మన్మధరావ్ చాలా మోసగాడు. చీటీలపేర వాళ్ళ స్వంత ఊళ్ళో లక్షలు కాజేసి ఇక్కడి
కొచ్చేసాడు” అంటూ అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు.
అలా మళ్ళీ కాంతమ్మకి మంచిరోజులొచ్చాయి. కాంతమ్మ హోటల్ మళ్ళీ ప్లాట్‌ఫారమ్
మీదకు మారింది. మళ్ళీ ప్రతీరోజూ అక్కడ సందడి మొదలైంది.
రోజూ ఉదయాన్నే తెల్లటిపొగలు కక్కుతున్న ఇడ్లీ, వేడి టీలు దొరకడం మళ్ళీ మొదలైంది.
ఆ తరువాత డీసియమ్‌కి చెప్పి ఆమెకే కేంటిన్ కాంట్రాక్ట్ ఇప్పించాడు సుబ్బారావు.
ఆ రోజు పాసింజర్ బండికి లైన్‌క్లియర్ అయింది. కాంతమ్మ వేడి ఇడ్లీలను, టీని పట్టుకొని
స్టేషన్‌కి వచ్చింది. అపుడు సుబ్బారావ్, జగదీష్ డ్యూటీలో ఉన్నారు.
“ మాస్టారు గారూ! తమరి దయవల్లే నేను మళ్ళీ మనిషినయ్యాను. ఆరోజు తమరు ధైర్యం
చెప్పి నన్ను నిలబెట్టారు. లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోదును. ఆ దేవుడే మీరూపంలో వచ్చేడు" అంది దండం పెడుతూ...
“కాంతమ్మ! మంచి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు” అన్నాడు సుబ్బారావు.
ఇంతలో హారన్ కొట్టుకుంటూ బండి వచ్చి ప్లాట్‌ఫారం మీద ఆగింది...
స్టేషన్‌ల్లో జనాల అలజడి మొదలైంది.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి >
> సంకల్పం
> గమనం
> మృగాళ్లు
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments