top of page
Writer's pictureNeeraja Prabhala

కంటి వెలుగు జ్యోతి

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KantiVeluguJyothi, #కంటివెలుగుజ్యోతి


'Kanti Velugu Jyothi' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 06/10/2024

'కంటి వెలుగు జ్యోతి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“కీర్తీ! నీవు మా చెల్లెలు ఉమ ఎప్పుడు వచ్చినా, తనను ఆప్యాయంగా పలకరించవు. తన కూతురు శిరిపై ప్రేమని చూపవు. వాళ్లంటే నీకెందుకంత చులకన?” అన్నాడు హేమంత్ తన భార్య కీర్తితో. 


 “అదేం లేదు. ఆమెని నేను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదగా చూస్తున్నానే!. ఇంకా ఆవిడే మీ అమ్మకి సపోర్టుగా ఉంటూ ‘గొడ్రాలు’ అని నన్ను హేళన చేస్తుంది. అత్త, ఆడపడుచులతో అనవసరంగా గొడవ ఎందుకని అవన్నీ నేను మనసులోనే దాచుకున్నా కానీ ఏనాడన్నా మీకు చెప్పానా ? చెప్పండి” అంది కీర్తి బాధాతప్త హృదయంతో హేమంత్ తో. 


అతను అది పట్టించుకోకుండా “ఛ! అదంతా నీ భావనే. ఉమ అలాంటిది కాదు. తన స్వభావం నాకు బాగా తెలుసు. తన పెళ్లి, మన పెళ్లి ఒక సంవత్సరంలోనే కదా జరిగింది. తనకు 8సంవత్సరముల శిరి. మనకు ఇంకా లేరు. ఆ ఈర్ష్య, అసూయలే నీ మనసులో ఉండి ఉమని, శిరిని దూరం పెడుతున్నావు. అది మంచి పధ్ధతి కాదు. నా ఒక్కగానొక్క చెల్లి ఉమ అంటే నాకు ప్రాణమని నీకు తెలుసు. ఇకనుంచైనా ఉమతో సఖ్యతగా ఉండు” అన్నాడు హేమంత్. 


“మన పెళ్లయి పదిసంవత్సరాలైనా మీ భార్యను అర్ధం చేసుకున్నది ఇదా!” గద్గదిక స్వరంతో అంది కీర్తి. 

 

ఇంకా ఆమె ఏదో చెప్పేలోగానే ఆఫీసుకి వెళ్లిపోయాడు హేమంత్. 


భర్త మాటలకు కీర్తి మనసంతా భారమైంది. స్వతహాగా హేమంత్ మంచివాడే కానీ అతనికి తల్లి అనసూయ మాటంటే వేదం. చెల్లి ఉమ అంటే ప్రాణం. వాళ్లు చెప్పే చెప్పుడు మాటల్ని అతను నమ్ముతాడు. అది అతని బలహీనత. దాన్ని ఆ తల్లీ, కూతుళ్లు అవకాశంగా తీసుకుని వాళ్ల మాటలను చెల్లించుకోవడమే కాక తనమీద గెలుపుగా భావిస్తూ తనని చులకన చేసి మనసులో సంతోషిస్తారు. ఈ విషయం తనకు పెళ్లైన క్రొత్తల్లోనే అర్ధమైంది. 

 

కీర్తికి పెళ్లయి పదిసంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగలేదని రోజూ అనసూయ సాధింపు. పెళ్లైన ఏడాదికి తనూ, హేమంత్ ఇద్దరూ వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి హేమంత్ లోనే లోపముంది. అతని వలన పిల్లలు పుట్టరు” అని హేమంత్ ముందే తేల్చి చెప్పింది. విన్న హేమంత్, కీర్తి చాలా కుంగిపోయారు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. డాక్టరు చెప్పింది విన్నాక తన కాళ్లక్రింద భూమి కదిలినట్లనిపించింది కీర్తికి. వెంటనే తనే తేరుకుని హేమంత్ ముఖంవైపు చూసింది కీర్తి. 


తను గిల్టీ ఫీలవుతున్నాడని అర్ధం చేసుకున్నదై ఇంటికి వెళ్లాక అతనికి ధైర్యం చెప్పి ఓదారుద్దామనుకుని ఆ డాక్టర్ వద్ద శెలవు తీసుకుని హేమంత్ తో ఇంటికి వచ్చింది కీర్తి. తమ గదిలోకి వెళ్లగానే భర్త ఒడిలో తల పెట్టుకుని ప్రేమగా అతనితో 

“చూడండి. ఇదేమంత పెద్ధ విషయమేంకాదు. సంతానం పొందేందుకు ఈ రోజుల్లో అనేక వైద్య పధ్ధతులు ఉన్నాయి. మనం మరలా డాక్టర్ ని కలిసి వాళ్లు చెప్పినట్లు చేస్తే మనకు పిల్లలు పుడతారు. ఇందాక డాక్టర్ చెప్పిన విషయం మర్చిపోండి” అని అతన్ని అనునయించిది ప్రేమగా కీర్తి. 

 

“నా వలనే కదా నీకు ఈసమస్య” బాధగా అన్న భర్త నోటిని తన చేతితో అడ్డుపెట్టింది అతనికి మరింత దగ్గరవుతూ. ప్రేమగా కీర్తిని దగ్గరకు తీసుకున్నాడు హేమంత్. 


తన భర్తలో లోపం ఉందని చెపితే అందరూ అతనిని హేళన చేస్తారని ఆ బాధని తనలోనే దాచుకుంది కీర్తి. తన తల్లిదండ్రులవద్ద కూడా ఆవిషయం ఏనాడు బయటపెట్టలేదు. 


అనసూయ తను అత్త అనే హోదాని ప్రతి సెకను గుర్తుచేసుకుంటూ కీర్తిని ఏదో విషయమై వంకలు పెడుతూ పిల్లల విషయమై ఆమెను అవమానిస్తూ ఉంటుంది. కీర్తికి ఆవిడ స్వభావం అర్ధమై ఆవిడ తీరింతే అనుకుని సర్దుకుపోసాగింది. రానురానూ ఆవిడ సాధింపులు ఎక్కువైనాయి. ఇది భర్తకు చెపుదామని ఎన్నోమార్లు ప్రయత్నించి చివరకు ధైర్యం చేసి చెప్పింది కీర్తి. హేమంత్ దాన్ని నమ్మలేదు సరికదా, తల్లిని వెనకేసుకొచ్చాడు. కొడుకు ముందు అనసూయ తన కోడలి మీద అంతులేని ప్రేమని చూపిస్తుంది. అతను బయటకు వెళ్లాక ఆవిడ నిజ స్వరూపం కీర్తి మీద ప్రదర్శిస్తుంది. నిజంగా ఆవిడ అసాధారణ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనుకుంటుంది కీర్తి తన మనసులో. 


 పిల్లలకోసం కీర్తి దంపతులు డాక్టర్ని కలిసి వాళ్లు చెప్పిన ఆధునిక పధ్ధతులని విన్నారు. వాటిని పాటిద్దామంటే హేమంత్ ససేమిరా ఇష్టపడలేదు. సంతానం దేవుని వరం. అది స్వతహాగానే కలగాలని అతని ఉద్దేశ్యం. కీర్తి అతనికి ఎంతో నచ్చ చెప్పినా హేమంత్ మొండితనం, మూర్ఖత్వం ముందు కీర్తి ఓడిపోయి ఆ విషయమై మిన్నకుండిపోయింది. పిల్లల కోసం కీర్తి దంపతులు తిరగని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. అయినా ఎందుకనో ఆ భగవంతుడు తమని కరుణించలేదని తమని తామే ఓదార్చుకున తమ మనసు దిటవు చేసుకున్నారు హేమంత్ దంపతులు. 


 హేమంత్ కీర్తిని ప్రేమగానే చూసుకుంటాడు. కానీ తల్లి, చెల్లెళ్ల ముందు మాత్రం వాళ్లే ఎక్కువన్నట్లు ఉంటాడు. కీర్తి ఆవిషయాన్ని ఎన్నోమార్లు తన భర్తతో చెప్పి అతని ప్రవర్తనని మార్చుకోమని హితవు చెప్పింది. భార్య మాటని అతను పెడచెవిన పెట్టి తన ప్రవర్తనని మార్చుకోలేదు సరికదా ఈరోజు ఉమ విషయమై ఇంకా తననే తప్పుపడుతున్నాడు. 


 ‘గొడ్రాలు’ అని అత్తగారు, ఆడపడుచు వేసే నిందని తను భరించగూడదు. ఇంక ఈ విషయమై తను ఊరుకోగూడదు అని మనసులో స్ధిరంగా నిర్ణయించుకుని ఆ సాయంత్రం భర్త రాకకోసం ఎదురుచూస్తోంది కీర్తి. 


హేమంత్ ఆఫీసునుంచి రాగానే అతనికి కాఫీ, స్నాక్సు ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక కీర్తి మాట్లాడటం మొదలుపెట్టింది. 


“చూడండి. ఉదయం మీ చెల్లి విషయంలో నన్ను తప్పుబట్టారు. అంతేకాదు ఇన్నేళ్లూ మీ అమ్మగారు నన్ను ‘గొడ్రాలు’ అని నిందిస్తూ, అత్త హోదాలో ప్రతిరోజూ నన్ను బాధపెడుతున్నా నేను చాలాసార్లు మీకు చెప్పాను గుర్తుదా? మీరు ఆవిడనే వెనకేసుకొచ్చి నా మాటలని ఏనాడూ నమ్మలేదు. సంతాన లోపం మీలో ఉందని డాక్టర్లు చెప్పినా ఆ నిందని నామీదే మోపుకుని మీపై ప్రేమతో ఇన్నేళ్లూ భరించాను అది మీకేనాడన్నా అర్ధమైందా? లేదే! మీ అమ్మ, చెల్లితో చేరి మీరు కూడా ప్రతివిషయంలో నన్నే ఆక్షేపిస్తున్నారు. తల్లి, చెల్లి అంటే ప్రేమ ఉండడం తప్పు లేదండి కానీ భార్య మీద ఇంకా ఎక్కువ ప్రేమని చూపాలి. ఎందుకంటే తన వాళ్లందరినీ వదిలి పెళ్లి పేరుతో మీ భార్యగా, మీ కష్టాలు, బాధలు పంచుకుంటూ మీకు తోడునీడగా ఉంటూ కడదాకా మీకు సంతోషాన్ని ఇచ్చేది తనేనండి. 


గుప్పెడంత భర్త గుండెల్లో చిటికెడు ప్రేమని ఆశిస్తుంది భార్య. భర్త కుటుంబమే తన కుటుంబంగా భావించి క్రొవ్వొత్తిలా కరిగిపోతుంది. అటువంటి భార్యని గుండెల్లో పెట్టుకుని ప్రేమాభిమానాలతో‌, ప్రాణంగా చూసుకోవాలి. మీలో మార్పు కోసం నేను ఇన్నేళ్లూ ఎదురుచూశాను. మీ అమ్మ, చెల్లి స్వభావాలు ఎలా ఉన్నా నాకనవసరం. మీరు మీ ప్రవర్తనని మార్చుకోండి. మనకి ఉన్నదొకటే జీవితం. ఇప్పటికైనా మీరు నాపై ప్రేమానురాగాలు చూపుతూ అందరిముందూ ముఖ్యంగా మీ అమ్మా, చెల్లి ముందు నన్ను గౌరవించడం చేయండి. అప్పుడు వాళ్లెవరూ నన్ను అనే సాహసం చేయరు. క్రమేపి వాళ్లప్రవర్తనలో మార్పు వస్తుంది. రాకపోతే అది వాళ్ల ఖర్మ. నాకు మీరు, మీ ప్రేమ ముఖ్యమండి” అంది బాధగా కీర్తి. 


అంతా విన్న హేమంత్ కు గుడ్డిగా ఇన్నేళ్లు మూసుకుని పోయిన తన కనులు తెరుచుకున్నట్లై జ్ఞానోదయమైంది. తన తప్పులు తెలుసుకున్నవాడై “ కీర్తి! మై డియర్! నన్ను క్షమించు ప్లీజ్. ఇంక నుంచి నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా. అంతేకాదు మనం రేపే ఏదైనా అనాధాశ్రయానికి వెళ్లి ఒక పాపను దత్తత తీసుకుందాం సరేనా! ” అన్నాడు పశ్చాత్తాప హృదయంతో హేమంత్. 


 భర్తలోని ఈ మార్పుకోసమే తను ఇన్నేళ్లూ ఓర్పుతో ఎదురుచూసింది కీర్తి. ఆనందంగా భర్త దగ్గరకు చేరి “ఇదేనండి. మీలో ఈ మార్పుకోసం నేను ఇన్నేళ్లు ఎదురుచూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం రేపే అనాధాశ్రమానికి వెళ్లి ఒక పాపను మనింటికి తీసుకొచ్చుకుని తనని ప్రాణంగా పెంచుకుదామండి “ అంది కీర్తి. 


భార్యని ప్రేమగా తన కౌగిలిలోకి తీసుకుని తన గుండెలకు సుతిమెత్తగా హత్తుకున్నాడు హేమంత్. 


 తెల్లారాక ఇంట్లో పనులు ముగించుకుని కీర్తి తన భర్తతో అనాధాశ్రమానికి వెళ్లి ఒక పాపని చూసి తనను దత్తత తీసుకుంటామని ఆశ్రమ అధికారులను కోరారు. వాళ్లు చెప్పిన ఫార్మాలిటీస్ ని పూర్తి చేసి ఆ పాపతో తమ ఇంటికి వచ్చారు హేమంత్ దంపతులు. 


 నిశ్చేష్టురాలై చూస్తూ ఆవిడ ధోరణిలో “ఆ పాప ఏకులమో?ఎవరికి పుట్టిందో? కులగోత్రాలేంటో? అయినా ఇదేం ఖర్మ?” అంటూ సాధిస్తూ ఇదంతా కీర్తి వలనే జరిగింది అంటూ మొదలు పెట్టింది అనసూయ. 


ఇంక హేమంత్ క్షణం ఆలశ్యం చేయలేదు. తమ పెళ్లైనాక తమకు డాక్టర్ చెప్పిన విషయం, సంతాన లోపం తనలోనే కానీ కీర్తిదేం లేదనీ. అయినా ఇన్నేళ్లూ ఆ నిందని తను మోసి, మీచేత నానా మాటలు, అవమానాలు పడిందని, ఇంకనుండి మీ స్వభావం మార్చుకుని మంచిగా ఉండండి. అప్పుడు మేము‌, మాతో పాటు నా కూతురు అదే నీ మనవరాలు కూడా సంతోషిస్తుంది” అన్నాడు హేమంత్. 


కొడుకు చెప్పింది విన్నాక అనసూయ మనసు సిగ్గుతో చితికిపోయింది. ఇన్నేళ్లు తను కోడల్ని ఎంత బాధపెట్టిందీ? ఎంత అవమానించిందీ? మనసుకు అర్థమైంది. 


“నన్ను క్షమించు కీర్తీ!”అని కీర్తిని దగ్గరకు తీసుకుని ఆమె చేతిలోని చంటిపాపని ముద్దాడింది అనసూయ. 


“మనలో మనకు క్షమాపణలు ఎందుకత్తయ్యా?” అంటూ నవ్వింది కీర్తి. 


“హమ్మయ్య! అత్తాకోడళ్లు ఒకటయ్యారు. ఈ సంతోష సమయంలో వేడివేడిగా పకోడీలు తినాలనుంది. చేసిపెట్టు కీర్తీ. ” అన్నాడు హేమంత్. 


 వెంటనే వంటగదిలోకి వెళ్లి కాసేపటికి వేడివేడి పకోడీలు చేసి తెచ్చింది కీర్తి. ముగ్గురు వాటిని తింటూ పాపని ముద్దాడుతూ నవ్వుతూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. పాప రావడంతో ఆ ఇంటికి, తమ జీవితాలలోను వెలుగు వచ్చిందని సంతోషపడ్డారు హేమంత్ దంపతులు. ఆ పాపకి “జ్యోతి “ అని పేరు పెట్టుకొని ప్రాణంగా పెంచుకుంటున్నారు హేమంత్ దంపతులు. 


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








45 views1 comment

1 Comment


చాలా బాగుంది..మంచి సందేశం

Like
bottom of page