top of page

కన్యాదానం

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #Kanyadanam, #కన్యాదానం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు



'Kanyadanam' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 02/11/2024

'కన్యాదానంతెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



“సీతా! ఒకసారి యిలా వస్తావా, భోజనం అయినా కూడా వంటిల్లు వదలవా” అని పిలిచాడు రాఘవయ్య.  


“వస్తున్నాను, అంట్లు బయటపడేస్తే, పనిమనిషి వచ్చి మనల్ని డిస్టర్బ్ చెయ్యదు, లేదంటే యిలా నడుం వాల్చితే చాలు, అమ్మా అంట్లు వేస్తావా అంటూ తయారు అవుతుంది” అంటూ వచ్చి భర్త కి ఎదురుగా వచ్చి కూర్చొని, “త్వరగా చెప్పండి ఏమిటి ఆ రహస్యం” అంది.


“ఏమీ లేదు, నాకు ఒక ఆలోచన వచ్చింది. నిన్న మూర్తి గారు సడన్ గా చనిపోయారు కదా, యింట్లో ఆయన భార్య కి లోకజ్ఞానం లేదు, దానితో హాస్పిటల్ కి కూడా తీసుకుని వెళ్లలేకపోయింది. భర్త బ్యాంకు ఎటిఎం కార్డు ఎలా వాడాలో తెలియదు ఆవిడకి, వున్న ఒక్క కూతురు వేరే దేశంలో ఉండటం తో ఆవిడ వచ్చే అంతవరకు శవం ని ఈ కరోనా టైములో ఉంచడం మంచిది కాదని ఎవ్వరో వాళ్ళ యింటి పేరు అతనిని బతిమిలాడి పని పూర్తి చేసారు.  అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది మన పరిస్థితి తలచుకుంటే” అన్నాడు.


“బాగానే వుంది మీ వరస, వంకాయ కారం కూర నాలుగు సారులు కలుపుకుని తిన్నప్పుడు లేని భయం భోజనం అయిన తరువాత గుర్తుకు వచ్చిందా, ఎలా జరగాలి అని వుంటే ఆలా జరుగుతుంది, బయపడి చేసేది ఏముంది చెప్పండి, కాసేపు నిద్రపోతే అన్నీ మర్చిపోతారు” అంటూ లేవబోయిన భార్య చెయ్యి పట్టుకుని ఆపి, “ఆగు, ఈ మాట విని నీ అభిప్రాయం చెప్పు” అన్నాడు రాఘవయ్య.


“మన పిల్లలు యిద్దరు పరాయి దేశం లో ఉద్యోగం చేసుకుంటూ వున్నారు. చివరికి తల్లిదండ్రులకి ఫోన్ చెయ్యాలి అంటే కూడా యింట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి, అంత బయపడుతో వుంటారు, మనం వెళ్ళి అక్కడ ఉందాం అనుకున్నా ఆరు నెలలు కంటే వుండలేము. ఈ వయసులో అక్కడ కార్డు తీసుకుని అక్కడ పోవడం అవసరమా చెప్పు, అందుకే మనం ఉంటున్న అయిదు గదుల యింటిలో రెండు గదులు అద్దెకు యిస్తే, వాళ్ళు మనకి సహాయంగా వుంటారు, డబ్బు కోసం పెద్దగా పట్టింపు లేదు కాబట్టి, మంచి వాళ్ళకి తక్కువ కైనా అద్దెకు యిద్దాం” అన్నాడు.


“మీరు అన్నది నిజమే కానీ, పిల్లలు మనల్ని చూడరు అని ఎలా అనుకుంటున్నారు” అంది.


“మనుషులు మారిపోయారు, పూర్వపు మనుషులు చాలా తక్కువ మంది మిగిలారు. మనలా, పిల్లలు తల్లిదండ్రులు దగ్గర ఎన్నాళ్ళు వున్నా ఆ తల్లిదండ్రులకి బాధ వుండదు, అదే తల్లిదండ్రులు తమదగ్గరే ఉండిపోతారు అంటే భయం, వీళ్ళ చాదస్తం వాళ్ళ యింట్లో భార్యతో గొడవ వస్తుంది అని, వీళ్ళకి అదే అవస్థ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తరువాత, అందుకే నువ్వు కొద్దిగా తెలివితేటలు తెచ్చుకుని అవసరం అయితే క్యాబ్ బుక్ చెయ్యడం, డాక్టర్ కి ఫోన్ చేసి అంబులెన్సు తెప్పించడం, ఎటిఎం నుంచి డబ్బులు తీయ్యడం నేర్చుకో, అప్పుడు నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగల ధైర్యం ఉండాలి” అన్నాడు.


“ఎందుకండీ ఏదో ఉహించుకొని ఏదో అనుకుంటారు, ఎంతైనా మన పిల్లల కంటే ఎవ్వరు ఎక్కువ, మీరనుకున్నట్టు అద్దెకు రెండు గదులు యిద్దాం, మనం పిల్లలు దగ్గరికి వెళ్ళినప్పుడు యిల్లు కనిపెట్టుకుని వుంటారు” అంది.  


అనుకున్నట్టు గా రెండు గదులు శుభ్రం చేసి, గేటుకు అద్దెకు రెండు గదులు ఇవ్వబడును అని బోర్డు పెట్టేసాడు రాఘవయ్య.


బోర్డు పెట్టిన దగ్గర నుంచి చాలామంది వస్తున్నా,రాఘవయ్య కి వాళ్ళు నచ్చక ఏదో వంక చెప్పి పంపించేస్తున్నాడు. 


అందరూ తమ కంటే వయసు లో పెద్దవాళ్ళు, ‘వాళ్ళకి అద్దెకు యిస్తే వాళ్ళని కూడా మనం కనిపెట్టుకుని చూడాలి’ అన్నాడు భార్య సీత తో. ‘వేళ గాని సమయంలో వచ్చి మనల్ని యిబ్బంది పెడుతున్నారు, ఈ రోజు చూసి బోర్డు తీసి పడేస్తాను’ అన్నాడు కాఫీ తాగుతో.


సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక అమ్మాయి గేట్ తీసుకుని లోపలికి రావడం చూసిన రాఘవయ్య, ‘యిదిగో సీతా ఎవ్వరో వచ్చారు చూడు’ అన్నాడు.  ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ‘నమస్కారం బాబాయి గారు’ అంది. ‘నా పేరు దీప్తి, అద్దె యిల్లు కోసం చూస్తున్నాను, మీ యింట్లో ఖాళీ వుంది అని తెలిసి వచ్చాను’ అంది.


“మీతో పెద్దవాళ్ళు ఎవ్వరు రాలేదా” అన్నాడు రాఘవయ్య.


ఆ అమ్మాయి ఒక్కసారి గట్టిగ ఊపిరి తీసుకుని, “నాకు పెద్దవాళ్ళు వున్నారు అంటే వున్నారు, లేరంటే లేరు బాబాయ్ గారు. నాకు 13 సంవత్సరాల  ఏజ్ లో నా తల్లిదండ్రులు ఇద్దరు ఆక్సిడెంట్ లో చనిపోయారు. మా నాన్నకు ఆఫీస్ నుంచి వచ్చిన డబ్బుతో పాటు నన్ను మా మేనమామ వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్ళాడు, వాళ్ల యింట్లో ఎదిగిన పిల్లాడు ఉండటం తో మా అత్తయ్య నన్ను గవర్నమెంట్ హాస్టల్ లో చేర్పించింది.


మొదటి నుంచి నేను చదువులో మొదటి వరుస లో ఉండటం తో అన్నీ కాలేజీలలో ఉచితంగా నే చదువుకున్నాను. చదువు అయిన తరువాత ఆరు నెలలు క్రితం టీసీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది, అది తెలిసి మా మామయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయితే మా బావ పద్ధతి మీద అనుమానం గా వుండి, నేను విడగా యిల్లు తీసుకుని ఉండాలి అని అనుకున్నాను. అందుకే యిల్లు వెతుకుతున్నాను బాబాయి గారు.


చాలా చోట్ల వంటరి ఆడపిల్ల అనగానే మా బావ లాంటి వాళ్లే ఎదురు పడ్డారు. మీరిద్దరూ పార్వతి పరమేశ్వరులు లా వున్నారు. మీ యింట్లో అద్దెకు వుంటే నాకు రక్షణ ఉంటుంది అని బాబాయి గారు” అంది దీప్తి.


“అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లీ, కానీ మా యిల్లు అద్దెకు యిచ్చేది కేవలం డబ్బు కోసం కాదు, మేమా 70 లోకి వచ్చేసాము. పిల్లలు ఇతర దేశంలో వున్నారు. మాకు రక్షణ గా వుంటారు అనే ఆశ తో అద్దెకు యిద్దాము అని అనుకున్నాము, నిన్ను చూస్తే పెళ్లికావలిసిన ఆడపిల్లవి, అందులోను ఉద్యోగం కి వెళ్ళిపోతావు” అన్నాడు.


“మీరు ఆ సందేహం పెట్టుకోవద్దు, నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు లేని బాధ తెలుసు, మిమ్మల్ని నేను నా తల్లిదండ్రులు గా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నాకు మీ చేయూత యిస్తే చాలు” అంది దీప్తి. ఆమె మాటలు విన్న రాఘవయ్య భార్య వంక చూసాడు, 


అతని భార్య సీత , “ఇవ్వండి, ఒంటరిగా పాపం ఎక్కడ ఉంటుంది, మనకి ఆడపిల్ల లేదు, వున్న మగ పిల్లలు పెళ్లిళ్లు అయ్యి వేరే దేశంలో వున్నారు” అంది.


“సరేనమ్మా, మీ పిన్ని కూడా ఒప్పుకుంది, మంచి రోజు చూసుకుని నీకు వీలున్నప్పుడు రా”, అంటూ గేట్ కి కట్టిన బోర్డు తీసేసాడు.  


“చాలా సంతోషం బాబాయి గారు, అద్దె కూడా చెప్పండి, అడ్వాన్స్ యిస్తాను” అంది దీప్తి.  

ఆమె వంక చూసి, “నువ్వు ఈ పోర్షన్ కి అద్దె ఎంత ఉంటుంది అని అనుకుంటున్నావో, అంత అద్దె నీ పెళ్లి ఖర్చులకి ఈ బాబాయ్ పిన్ని యిచ్చిన బహుమతి అనుకుని దాచుకో తల్లీ”, అన్నాడు రాఘవయ్య.


ఆయన మాటలలోని ఆప్యాయత కి మనసులో ఆనందం తో రాఘవయ్య చెయ్యి పట్టుకుని, “మీ ఆరోగ్య బాధ్యత ఈ రోజు నుంచి నాదే బాబాయ్” అంది దీప్తి.


రోజులు గడుస్తున్న కొద్ది దీప్తి రాఘవయ్య గారికి, సీత కి సొంత కూతురు లాగ అయిపొయింది. ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత రాఘవయ్య గారిని వాకింగ్ కి తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేది. ఆ వృద్ధులని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం దగ్గర నుంచి అన్నీ తనే చూసుకోవడంతో రాఘవయ్య

సీత దంపతులకు తాము ఒంటరి వాళ్ళం కాదు, తమ దగ్గర తమకి దేముడు యిచ్చిన కూతురు వుంది అని మురిసిపోయారు. వారం వారం కొడుకులు దగ్గర నుంచి ఫోన్ రాకపోయినా హుషారుగానే వుంటున్నారు.


రోజులు గడుస్తున్నాయి, ఒక రోజు సాయంత్రం దీప్తి తనతో పాటు యింకో అబ్బాయి ని తీసుకుని వచ్చి రాఘవయ్యకి పరిచయం చేసింది. అతని పేరు ప్రణవ్ అని, అతను కూడా ఇంజనీర్ అని, మనవాళ్లే అని చెప్పింది.  దీప్తి చెప్తున్న విధం తో రాఘవయ్యకి విషయం అర్ధం అయ్యింది.


“అమ్మాయి దీప్తి, నువ్వు లోపలికి వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకుని రా అమ్మా” అని చెప్పి దీప్తి ని లోపలికి పంపి, “ఆ యిప్పుడు చెప్పు బాబూ ప్రణవ్, మీ ఇద్దరిది స్నేహమా అంతకంటే ఏమన్నా వుందా, మీ తల్లిదండ్రులు ఏం చేస్తువుంటారు” అని ఆడిగాడు.


“మీరు సరిగ్గానే గ్రహించారు సార్, నేను దీప్తి అంటే ఇష్టపడ్డాను, తనుకూడా తన జీవితం గురించి వివరంగా చెప్పింది. మీరే ఆమెకి తల్లిదండ్రులు అని, మీ మాట తనకి వేదం అని చెప్పి, ముందుగా మా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మిమ్మల్ని కలవడం కోసం వచ్చాను.  మీరు అనుమతించి మా వివాహం జరిపించండి” అని అన్నాడు.


“బాగానే వుంది ప్రణవ్, నేను దీప్తి తో మాట్లాడి నా నిర్ణయం చెప్పాలి నీకు, మీ యిద్దరి ప్రేమ స్వచ్ఛమైనది అయితే నేను వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడుతాను” అన్నాడు రాఘవయ్య.  కాఫీ తీసుకుని వచ్చిన దీప్తి కి బై చెప్పి వెళ్ళిపోయాడు ప్రణవ్. 


“దీప్తి.. ప్రణవ్ తల్లిదండ్రులని నువ్వు కలిసావు కదా, అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారు” అని ఆడిగాడు రాఘవయ్య.


“ప్రణవ్ వాళ్ళ తల్లిదండ్రులతో నా గురించి వివరంగా చెప్పి అయిదు సంవత్సరాలనుండి మీదగ్గర నేను పెరుగుతున్నాను అని చెప్పగానే, ప్రణవ్ తల్లిదండ్రులు కూడా మీలాగా దయార్థహృదయులు. దానితో వాళ్ళ అంగీకారం తీసుకుని నన్ను సంప్రదించి తన నిర్ణయం చెప్పాడు.


నాకు కూడా మంచి సంబంధం అనిపించింది, అయితే అనుభవం కలిగిన మీరు వాళ్ళ తల్లిదండ్రుల తో మాట్లాడి మీకు నచ్చితేనే నేను ఈ పెళ్ళికి ముందుకు వెళ్తాను” అంది దీప్తి. 


“సంతోషం తల్లి, మా మీద అంత గౌరవం ఉంచినందుకు, మంచి రోజు చూడు సీతా, అబ్బాయి కి తెలియచేద్దాం, ఆరోజు వాళ్ళ యింటికి వస్తాము అని” అన్నాడు భార్య తో రాఘవయ్య.


అనుకున్న విధంగా ప్రణవ్ వాళ్ళ ఇంటికి సీత,రాఘవయ్య దంపతులు వెళ్లారు. యిల్లు చాలా పెద్దది, గొప్పింటి సంబంధం అనుకుంటూ కారు దిగారు. అప్పటికే వీళ్ళకోసం ఎదురు చూస్తున్న ప్రణవ్ తల్లిదండ్రులు ఎదురు వచ్చి, ఆప్యాయంగా లోపలికి తీసుకుని వెళ్లారు. మాటలలో ప్రణవ్ ఒక్కడే కొడుకు అని, ఆడపిల్లలు లేకపోవడం వలన, మా కాబోయే కోడలిని కన్న బిడ్డ లా చూసుకుంటామని చెప్పారు.


రాఘవయ్య గారు కూడా దీప్తి తన యింటికి ఎలా వచ్చింది, ఆమె కుటుంబ పరిస్థితి ఏమిటో వివరంగా తెలిపాడు.  


“ఈ విషయం మా ప్రణవ్ చెప్పాడు, ఈ కాలంలో మీ లాంటి పుణ్యమూర్తులు వున్నారు అంటే మా దీప్తి చేసుకున్న పుణ్యం.  పెళ్ళికి కావలిసిన అన్నీ ఆరెంజ్మెంట్స్ నేను చూసుకుంటాను, మీరు బాధ్యత కన్యాదానం చెయ్యడమే” అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి.   


“పెద్దవాడిగా ఒక్కసారి దీప్తి ని అడగాలి, ఈ పెళ్లి తన మేనమామ ఆధ్వర్యంలో జరగాలి అనుకుంటే అలాగే చేద్దాం” అన్నాడు.


“నా తల్లిదండ్రులు మీరు వుండగా నాకు మేనమామ తో పని ఏమిటి, ఆ సంబంధం ఎప్పుడోనో తెగిపోయింది, మీరే దగ్గర ఉండి నా వివాహం జరిపించాలి బాబాయ్”, అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పెద్ద మొత్తం డబ్బు తీసి పిన్ని చేతులో పెట్టి, “పెళ్ళికి ఈ డబ్బు వాడండి పిన్ని” అంది. 


అది చూసి రాఘవయ్య దీప్తి తో  “నువ్వు మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా అనుకుంటే ఆడబ్బు నీ పిన్ని నుంచి తీసేసుకో, నీకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అన్నయ్యలు వున్నారు, నేను వున్నాను, కూతురి పెళ్లి చెయ్యగలను” అన్నాడు.


పెళ్లి వైభవం గా జరిగింది. అసలు ఘట్టం మొదలైంది. “మిమ్మల్ని వదిలి నేను అత్తగారి ఇంటికి వెళ్ళలేను, మీరు కూడా నాతో వచ్చేయండి బాబాయ్ గారు” అంది దీప్తి.  


“తప్పు తల్లి, మేము అక్కడకి ఎలా వచ్చి ఉండగలము, ఏదో అదృష్టం తో యిన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు, నాకు కన్యాదానం ఫలితం దక్కేడట్లు చేసావు, యిది చాలు, నువ్వు ఆనందంగా మీ అత్తవారింటికి వెళ్ళు, ఒకే ఊరు కాబట్టి మనం కలుస్తోవుండవచ్చు” అన్నాడు.


యిల్లు ఖాళీ చేసి భర్త యింటికి వెళ్లిన దీప్తి ప్రతి ఆదివారం వచ్చి రాఘవయ్య గారికి కావలిసిన అన్ని పనులు చూసి వెళ్ళేది. ఏమైందో ఆతరువాత నెలకు ఒకసారి, ఆ తరువాత ఫోన్లో మాట్లాడటం చేసేది.


రాఘవయ్య, సీత లకు ఒక్కసారిగా ఒంటరి తనం మీదకి దూకినట్టు అయ్యింది, కొడుకులు దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకొని కొడుకుకి ఫోన్ చేసాడు. 


“వస్తే బాగానే వుంటుంది కాని మీ మనవడికి ఎగ్జామ్స్ టైము, వాడి చదువు కి యిబ్బంది ఏమో అని భయం గా వుంది” అన్నాడు. “వాడి చదువు అయిన తరువాత మేమే మీ దగ్గరికి వస్తాము” అనటం తో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు రాఘవయ్య.


“పోనిలేద్దురు, మీకు నేను నాకు మీరు” అంది సీత. 


“నిజమే, ఎంత మంది వున్న చివరికి మిగిలేది మొగుడు పెళ్ళామే” అన్నాడు నిట్టూరుస్తూ.

ఆరోజు ఆదివారం, ఉదయం దీప్తి ఫోన్ చేసి “సోమవారం ఉదయం మేము శ్రీశైలం వెళ్తున్నాము, మీరు పిన్ని వస్తారా” అని అడిగింది రాఘవయ్యని. 


“అలాగే అమ్మా మేము రెడీగా వుంటాము, మీరు వచ్చి పికప్ చేసుకోండి” అన్నాడు. 


“అంతదూరం మీరు కారులో కూర్చోగలరా” అంది సీత. 


“నిజమే కూర్చోలేను, కాని అమ్మాయి తో, అల్లుడుతో రెండు రోజులు కలిసి వుంటాము అనే ధైర్యం అంతే” అన్నాడు.   


రాత్రి త్వరగా భోజనం చేసి నిద్రపోయిన రాఘవయ్య అర్దరాత్రి కి గుండె నొప్పి రావడం తో కంగారు పడిన సీత దీప్తికి ఫోన్ చేసింది. ఎంతసేపటికి ఫోన్ తీయ్యకపోవడం తో వీధిలోకి వచ్చి పక్క యింటి వాళ్ళ సహాయం అడిగి యింటికి వచ్చింది.


వాళ్ళ సహాయంతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు. రాఘవయ్యకి సృహ పోవడం తో వెంటనే చికిత్స మొదలుపెట్టిన డాక్టర్స్ తెల్లవారితే సృహ రావచ్చు, ఏమైనా జాగ్రత్తగా ఉండాలి అనటం తో సీతకి గుండెల్లో దడ మొదలైంది, ముందుగా కొడుకులకి ఫోన్ చేద్దాం అని బయటకు వచ్చిన సీతకి కంగారు గా లోపలికి వస్తున్నా దీప్తి, దీప్తి భర్త, మామగారు రావడం చూసి వాళ్ళదగ్గరకు వెళ్లి విషయం చెప్పింది.


“పిన్ని, మేము వచ్చేసాం, బాబాయ్ కి ఏమి కాదు, మామయ్యగారికి యిక్కడ డాక్టర్స్ బాగా పరిచయం” అంటూ రాఘవయ్య వున్న ఐసీయూ గది దగ్గరికి వచ్చారు. అయితే ఐసీయూ అవ్వడం తో వీళ్ళని లోనికి రానివ్వలేదు. ప్రణవ్ తండ్రి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక రూమ్ సంపాదించాడు. 


అందులోనే అందరు కూర్చొని డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. రాఘవయ్య కి తెల్లారి అయినా సృహ రాలేదు, పరిస్థితి బాగుండలేదు అని గ్రహించిన దీప్తి రాఘవయ్య గారి పిల్లలకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు బయలుదేరి వస్తాము అనడంతో, సీత కి ఆ విషయం చెప్పి కూర్చుని వుంది.

ఐసీయూ ముందు పచారులు చేస్తున్న ప్రణవ్ ని చూసి నర్స్ “మీరు డాక్టర్స్ వచ్చే లోపు ఒకసారి వెళ్లి చూసి రండి, పాపం ఉదయం నుంచి యిలా తిరుగుతో వున్నారు” అని చెప్పింది. 


 “ఆయన కూతురు ని పంపుతాను” అని దీప్తి ని లోపలికి పంపించాడు. 


దీప్తి రాఘవయ్య గారిని చూసి చెయ్యి వేసి బాబాయ్ అని పిలిచింది. విచిత్రం రాఘవయ్య కళ్ళు తెరిచి చూసాడు కూతురుని ఆనందంగా.


“ప్రమాదం తప్పింది, యింకో రెండు రోజులు చూసి యింటికి పంపుతాము” అన్నాడు డాక్టర్.  ఆ విషయం సీత కొడుకులకి ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళు కూడా ‘అమ్మయ్య, గండం గడిచింది, మాకు యిక్కడ ఫ్లైట్ టికెట్స్ దొరకడం లేదు, ఎలా రావాలా అని ఆలోచిస్తున్నాము, ఈ వారం లో వస్తాము, హాస్పిటల్ వాళ్ళకి చెప్పి మాతో మాట్లాడించు, బిల్లు కట్టేస్తాము’ అన్నారు.


హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాఘవయ్య ని వీల్ చైర్ లో నర్స్, వెనుక ప్రణవ్, దీప్తి, దీప్తి మామగారు, సీత కారు దగ్గరికి చేరుకున్నారు, మగతగా వెనక సీట్ లో పడుకున్న రాఘవయ్య గారికి కారు చిన్న కుదుపుతో ఆగడం చూసి కళ్ళు తెరిచాడు. 


‘అదేమిటి మా ఇంటికి కాకుండా వియ్యంకుడి ఇంటికి తీసుకుని వచ్చారు’ అనుకుంటూ వుండగానే ప్రణవ్ దీప్తి రాఘవయ్య గారిని మెల్లగా దింపి లోపలికి తీసుకుని వస్తోవుండగా, ప్రణవ్ తల్లి రాఘవయ్య కి దిష్టి తీసింది. 


లోపలికి వచ్చి మంచం మీద కూర్చున్న రాఘవయ్య కళ్ళు తుడుచుకుంటూ, “మన యింటిలో దింపాలిసింది దీప్తి” అన్నాడు, 


ఆ మాట విని ప్రణవ్ తండ్రి రాఘవయ్య గారి పక్కన కూర్చొని, “ఈ రోజునుంచి ఈ ఇల్లే మీ యిల్లు, యిహ మీరు మీ అమ్మాయి తో ఇక్కడే వుంటారు” అన్నాడు.


టీవీ లో నుంచి కన్యాదాన ఫలితం గురించి చాగంటి గారి ఉపన్యాసం వస్తోంది.


                                       శుభం


***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













46 views0 comments

Comments


bottom of page