#TVLGayathri, #TVLగాయత్రి, #Kapari, #కాపరి, #TeluguStories, #తెలుగుకథలు

Kapari - New Telugu Story Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/01/2025
కాపరి - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
సెల్లుఫోన్ మోగింది
తిరిపాలు ఫోనది.
"చెప్పరా! " అన్నాడు గోవిందు.
"నే చెప్పినట్లు చెయ్యి! కాసింత డబ్బులెక్కువొస్తాయి! "
గోవిందు మొహం మాడిపోయింది.
"సర్లే! సర్లే! " అంటూ ఫోన్ పెట్టేశాడు.
మౌనంగా నానపెట్టిన వేరుశెనగ చెక్క తీసికెళ్ళి బకెట్లో కలుపుకుంటున్నాడు. సావిట్లో జనపనార పేనుకొంటున్నాడు గోవిందు తండ్రి ఆదెయ్య.
"ఏందప్పా! ఏడ్నుండి ఫోన్?" ఆదెయ్య సూటిగా గోవిందునే చూస్తూ అడిగాడు.
"ఏం లేదులే!" అంటూ బకెట్ తీసికొని గొడ్ల దగ్గరికి వెళ్ళాడు గోవిందు.
ఆదెయ్యకు కొడుకు మీద కోపంగా ఉంది.
'ఆ తిరిపాలుగాడితో కలిసి మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నాడో! .. '
జనపనార పేనుకుంటున్నవాడల్లా లేచి కొష్ఠంలోకి వచ్చాడు.
"చెప్పు! ఆ పుండాకోరు నీకేం చెప్పాడు? వాడితో మాట్లాడొద్దన్నానా! మళ్ళీ మన కోడెల్ని కాబేళాకు తొయ్యమంటున్నాడా?" ఆదెయ్య గొంతు ఉరిమింది. నిప్పులు చెరుగుతున్నదా చూపు.
"అబ్బే! .. లేదు! .. లేదు! .. ఊరికే! అయినా వాడిమాట నేనెందుకు వింటా?.. "
"హు!" అంటూ ఆదెయ్య మళ్ళీ వెనక్కు సావిట్లోకి వెళ్లి నారపేనుకోసాగాడు.
'తిరిపాలు మాట వింటే నాలుగు డబ్బులొస్తాయి! ఎకరాపొలంలో కూరగాయల సాగు. అప్ప, తను రెక్కలు ముక్కలు చేసుకుంటే బొటాబొటిగా సరిపోతుంది. పాలవ్యాపారం అంతంతమాత్రం! .. ఉన్న నాలుగు దేశవాళీ ఆవులు, మూడు పెయ్యలు, రెండు కోడెలు, మూడు బర్రెలు, మెయ్యటానికి తప్ప ఎందుకూ పనికిరాని నాలుగు కుర్ర దున్నలు. వీటన్నిటినీ మేపటానికి పాలమీద ఆదాయం సరిపోగా మిగిలేదెంత?
లూనా అమ్మేసి మంచి బైక్ కొనుక్కుందామని ఉంది.. నీళ్లు కారే పెంకుటిల్లు మీద స్లాబ్ వెయ్యాలని ఉంది.. మామ కూతురు నాగలక్ష్మికి, తనకూ పెళ్లయితే దానికింత బుట్టలో, కమ్మలో చేయించాలని ఉంది.. ఇంకా చాలా చాలా ఉంది.. ఏవీ డబ్బులు? గొడ్లకు పెట్టే తిండి రొక్కం జాస్తయింది. ఉత్తగడ్డి, కుడితి నీళ్లు పోస్తే అవి ఏమాత్రం పాలిస్తాయి?.. 'అందుకే తిరిపాలు సలహా విని, అప్పకు చెప్పకుండా ఆవులకు, బర్రెలకు ఎక్కువ పాలుపడటానికి హార్మోన్ మందులు వేస్తున్నాడు. ఇది పాల వ్యాపారులు అందరూ చేసే పనే! ..
పాతికేళ్ళ గోవిందుకు అది తప్పనిపించటం లేదు కానీ తిరిపాలు కోడెల్ని, దున్నపోతుల్ని కబేళాకు తొయ్యమంటే తప్పనిపించింది. పాపం! మూగజీవాలు.. ఆ మాత్రం సాకలేమా! అనిపించింది. అప్పతో మాత్రం పెద్ద యుద్ధమే జరిగిందప్పుడు.
"అదేమీకాదు! మీ యప్పకి తెలీకుండా పాలల్లో మందు కలుపు! అచ్చం పాలలాగే చిక్కగా ఉంటాయి! మందు, నే తెస్తా! "
తిరిపాలు సలహావిని దిగులుగా మొహం పెట్టాడు గోవిందు.
"పాలు తాగినోళ్లకేమన్నా అవుతే?"
"మన ఇంట్లో వాడతామా? అందరూ చేసేదే! కాసింత దైర్నం చెయ్యి! "
ఆలోచిస్తున్నాడు గోవిందు.
"పెద్దప్పా!" కేకపెట్టాడు ఆదెయ్య.
"ఏందప్పా?"
"బుల్లెమ్మి ఫోన్ చేసింది. బిన్నపోయిరా! చంటిదానికి జొరం. పెనిమిటి ఊరెళ్లిండంట!" కంగారుగా చెప్పాడు ఆదెయ్య.
"సరే అప్పా! "
చెల్లెలు ఉండేది గుత్తిలో. తొండపాడు నుండి గుత్తికి బస్సెక్కాడు గోవిందు.
అన్నను చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుంది బుల్లెమ్మి.
"పిల్లదానికి జొరం.. కడుపునొప్పి.. " అంటూ.
మేనకోడల్ని ఎత్తుకున్నాడు. ఒళ్ళు కాలిపోతా ఉంది. డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళారిద్దరూ. పిల్లను పరీక్ష చేసింది డాక్టరమ్మ.
"ఏం లేదు! . ఫుడ్ పాయిజన్. అంటే తినే దాట్లో కల్తీ! మందిస్తాను తగ్గిపోతుంది! "
ఇంటికొచ్చారిద్దరూ. రాత్రంతా పిల్లదాన్ని చూసుకొన్నారు. తెల్లారగట్లకి కాస్త జ్వరం తగ్గింది. ఆ సరికి బావ నారాయణ కూడా వచ్చాడు. పొలంలో పనుందని తొండపాడుకి బయలుదేరాడు గోవిందు.
ఊరుచేరి బస్టాండు బయటికి వచ్చేసరికి కూరగాయల బస్తాలు వేస్తూ తిరిపాలు కనిపించాడు.
"మీ యప్పకు తెలీకుండా మందుప్యాకెట్లు నీ కొష్ఠంలో చూరుమీద పెట్టా! చూసుకో! డబ్బులు తర్వాత తీసికొంటాలే" అంటూ చెప్పాడు.
"వద్దు! వద్దు! "అన్నాడు కంగారుగా గోవిందు.
"ఏయ్! ఊరకోరా! "చుట్టూ చూస్తూ గోవిందును వారించి బస్సుమీద సరుకెయ్యటానికి బస్సుపై కెక్కాడు తిరిపాలు.
అక్కడ ఏమీ అనలేక ఇల్లు చేరాడు గోవిందు.
"ఆ దరిద్రుడు నీకోసం వచ్చెళ్లాడు! .. నీ కేందిరా నూరిపోసేది?"
ఆదెయ్య ఇంకా కోపంగానే ఉన్నాడు.
"నీ పేరు గోవిందని మా యప్ప పేరు ఎందుకు పెట్టానో తెలుసా! మా యప్పలాగా, నాలాగా గొడ్లను కాచుకొంటావని! ఆ పుండాకోరుతో నీ ఇచ్ఛకాలేందిరా?.. గొడ్లని కబేళాకు తోలే కసాయితో నీకు మంతనాలేందిరా?.. "
తలవంచుకొని రాయిలాగా నిల్చున్నాడు గోవిందు.
జ్వరంతో, కడుపునొప్పితో మూలుగుతున్న మేనకోడలు మల్లిక మొహం అతడి కళ్ళముందు కదలాడుతోంది.
కొష్ఠంలోకి వెళ్ళాడు. చూరుపైన ఉన్న మందుల పొట్లాలు తీశాడు. తిరిపాలుకి ఫోన్ చేశాడు.
"నా కేమీ వద్దులే! మందు పొట్లాలు తీసికొనిఫో! " అంటూ తిరిపాలుకు తిరిగిమాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు.
గొడ్ల దగ్గరికెళ్ళి ఒక్కొక్కదాని వీపు నిమురుతూ నీళ్లు పెట్టాడు.
ఇంట్లోకి వెళ్లి గొడ్లకిచ్చే హార్మోన్ల ఇంజెక్షన్ సీసాలు చెత్తలో పారేశాడు.
ఆదెయ్య దగ్గరికి వచ్చాడు. ఆదెయ్య కంచంలో చద్దికూడు ఒంపుతున్నాడు.
పక్కన చతికిలబడి తండ్రిచెయ్యి పట్టుకున్నాడు గోవిందు.
అతడి మనసిప్పుడు నిర్మలంగా ఉంది.
"అప్పా! జేజెలాగా నీలాగా గొడ్లని కాచుకుంటాలే! కూడు బెట్టు"
ఆదెయ్య కొడుకు మొహంలోకి చూశాడు. కొడుకు మొహంలోని నిజాయితీని గమనించాడు. కొడుకు భుజం పట్టుకొని దగ్గరికి తీసికొని పళ్లెంలోని చద్దికూడు ముద్దతీసి కొడుకు నోటికందించాడు.
కొష్ఠంలో పశువులు తిన్న గడ్డిని తీరిగ్గా నెమరేసు కుంటున్నాయి.
(సమాప్తం )
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments