కారణ జన్ముడు శ్రీ రామ చంద్రుడు
- Gadwala Somanna
- 22 hours ago
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KaranaJanmuduSriRamaChandrudu, #కారణజన్ముడుశ్రీ రామచంద్రుడు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 53
Karana Janmudu Sri Rama Chandrudu - Somanna Gari Kavithalu Part 53 - New Telugu Poem Written By Gadwala Somanna
Published In manatelugukathalu.com On 06/04/2025
కారణ జన్ముడు శ్రీ రామ చంద్రుడు - సోమన్న గారి కవితలు పార్ట్ 53 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కారణ జన్ముడు శ్రీ రామ చంద్రుడు
----------------------------------------
రామాయణ కావ్యానికి
కథానాయకుడు రాముడు
నిలువెత్తు ఆదర్శానికి
నిదర్శనమై నిలిచాడు
తన తండ్రి మాట కోసము
కానలకెళ్ళిన తనయుడు
"ఏకపత్నీ పురుషుడు"
ఆ "శ్రీరామ చంద్రుడు"
జానకమ్మ పతిదేవుడు
కౌసల్యమ్మ సుపుత్రుడు
రావణ సంహరకుడు
లక్ష్మణుని ప్రియ సోదరుడు
గుణంలోన శ్రీమంతుడు
జన్మతః సత్పురుషుడు
మంచితనానికి చిహ్నము
ఈ అయోధ్య రాముడు
సూర్య వంశాకాశాన
వెలుగొందిన భాస్కరుడు
సద్గుణాల్లో శ్రేష్టుడు
కారణ జన్ముడు రాముడు
మార్గదర్శి నేటి యువతకు
ఘన జానకీ రాముడు
దేవుడు వైష్ణవ భక్తులకు
మన కోదండ రాముడు

మేడమ్ మంచి మాటలు
----------------------------------------
నోటికి కళ్లెం వేస్తేనే
బంధాలన్నీ బాగుండేది
సాహస పనులు చేస్తేనే
చరిత్ర పుటల్లో మిగిలేది
మనసును నియంత్రిస్తేనే
ఏదైనా జయించ గలిగేది
ఏకాగ్రత సాధిస్తేనే
సమస్తం సాధ్యమయ్యేది
ప్రవర్తన మార్చుకుంటేనే
ప్రవర్తనలో మార్పువచ్చేది
మనోనిబ్బరముంటేనే
ఆశ్చర్య కార్యాలు జరుగేది
కన్నోళ్లను గౌరవిస్తేనే
భవిత బంగారమయ్యేది
పెద్దల మాటలు వింటేనే
అభివృద్ధిని సాధించేది

మన చేతుల్లో ఉంది!
----------------------------------------
కొండంత బాధలను
గుండెల్లో దాచుకొని
పనికిరాని తలపులను
అనుక్షణమూ మోసుకొని
లోకంలో బాధలన్ని
నీ ఒక్కనికే అంటావు
నెమ్మదిని కోల్పోయి
ఎందుకలా ఉంటావు!
గుండెలోని భారాన్ని
దించుకుంటే క్షేమము
లేకుంటే అనుక్షణము
అనుభవిస్తావు! నరకము
హృదయాన్ని తేలికగా
పదే పదే చేసుకో!
ఆనందంతో హాయిగా
జీవితాన్ని మలచుకో!
ఏదైనా మన మీదే
ఆధారపడి ఉంటుంది
అక్షర హితం అదే అదే
తెలుసుకో!బాగుంటుంది

చిన్నారి - చిరు ఉడుత
----------------------------------------
ఉడుత ఒకటి వచ్చింది
ఉసిరి చెట్టు ఎక్కింది
కాయలను కొరికి కొరికి
కడుపునిండా తినింది
ఉడుత గంతులేసింది
పాపతో ఆడింది
ఉసిరి కాయలిచ్చింది
ఊసులెన్నో చెప్పింది
స్నేహం శ్రేష్టమంది
ద్రోహం చేయకంది
నైతిక విలువలున్న
గొప్ప జీవితమంది
మెళుకువలు నేర్పింది
మొండితనం వద్దంది
మెచ్చుకొనే రీతిని
తేవాలంది ఖ్యాతిని
పాపాయి చిన్నగా
చిరు నవ్వు నవ్వింది
సరే సరే అంటూ
ఇంటిలోకి వెళ్ళింది

సంఘజీవి చిట్టి చీమ
----------------------------------------
చిట్టి చీమను చూసి
క్రమశిక్షణ నేర్చుకో!
దాని ముందు చూపుతో
పొదుపు విలువ తెలుసుకో!
సోమరితనం మానుకొని
చురుకుదనం చాటుకో!
పిరికితనం వదులుకొని
ధైర్యాన్ని నింపుకో!
చీమ చూడ బహు చిన్నది
తెలివిలో కడు మిన్నది
అది నేర్పే సత్యాలు
జీవితాని పాఠాలు
సంఘజీవి చిట్టి చీమ
స్వార్ధమసలు లేనిది
కలుపుగోలుతనంతో
సమైక్యత కోరునది

-గద్వాల సోమన్న
Comments