top of page
Writer's pictureDr. C S G Krishnamacharyulu

కష్టే ఫలి

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #కష్టేఫలి, #KashteFali, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Kashte Fali - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 24/12/2024 

కష్టే ఫలి - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కష్టే ఫలి. ఈ సూత్రాన్ని, శ్వేత మనసార నమ్మింది. మెడిసిన్ చదవాలంటే రాత్రి, పగలు శ్రమించాలని, అవసరమైతే, నిద్ర, తిండీ కూడా త్యాగం చెయ్యాలని సీనియర్లు చెప్పిన మాటలకు ఆమె బెదరలేదు. విజయవంతంగా ఎంబిబియస్ పూర్తి చేసిన, ఆమె యిప్పుడు పిజి నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది.


@@@ 


ప్రవేశ పరీక్షలంటే తల్లి దండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. పిల్లలు టైముకు తినరు సరిగా నిద్రపోరు, ఆరోగ్యాన్ని పట్టించుకోరని వారి ఆదుర్దా. అదే శ్వేత విషయంలో తల్లి ఆవేదన. 

"ఏం చదువులో ఏమో? తినడానికి వస్తావా? అక్కడికే తెమ్మంటావా? అక్కడ యిచ్చానంటే అంతే! నువ్వు తినేది లేదు, పెట్టేది లేదు. టిఫిన్, యెండిపోయి, చీమలు పట్టి, వేస్టవడం. మళ్ళీ నాకది శుభ్రం చేసే పనొకటి." అని శ్వేతని పిలుస్తూ విసుక్కుంది, ఆమె తల్లి గీత. 


" గీతా! దాన్ని యేమనకు. అదసలే టెన్షన్లో వుంది. పీజీ నీట్ పరీక్షా సెంటరు యెక్కడ యిస్తాడో అని కంగారుపడుతోంది." అని భార్యను మందలించాడు వెంకట్. 


" ఏమండీ, నేనన్న దాంట్లో యేమైనా తప్పుందా? అది తినలేదన్న బాధే గాని, అదంటే నాకేమైనా ద్వేషమా? అసలీ మెడిసిన్ చదువు వద్దని మొత్తుకున్నా. నా కూతురు కల, ఆశయం అంటూ, దానికి వత్తాసు పలికి ఈ బండ దాని నెత్తిన వేసారు. " అని గీత నిష్ఠూరమాడింది. 


 " అది యిష్టపడి, కష్ట పడుతోంది. విద్యార్ధిని డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంది. మనమింకొక మూడు సంవత్సరాలు సపోర్ట్ చేస్తే పెద్ద డాక్టరవుతుంది. " 


“ ఓస్! మూడేళ్ళే కదా అన్నట్ట్లు మాట్లాడుతారు.ఇప్పుడు పీజి అంటుంది. రేపు సూపర్ స్పెషియాలిటీ అంటుంది. అంటే ఇంకో ఆరేళ్ళు. హాస్పిటల్లో నిద్రాహారాలు లేకుండా పని, ప్రొఫెసర్ల బూతు పంచాంగాలు. ఇదంతా అవసరమా? దీనివల్ల యేం జరుగుతుందో తెలుసుకోండి. ఆపిల్ లాంటి పిల్ల, నేరేడు పండవుతోంది. సంపాదన, పెళ్ళి, పిల్లలు అన్నీ ఆలస్యమమవుతున్నాయి.”


 " దానికి చదువుకునే ఆసక్తి వుంది. చదవనిస్తే మనం గర్వించే డాక్టరవుతుంది." 


" మన గర్వం సరే. యిది పరీక్షా సెంటరెక్కడా అని చూస్తూంటే, సరైన వరుడెవ్వడా అని దాని కజిన్స్ వివాహ వేదికలు చూస్తున్నారు. ఇలా పెళ్ళి లేటయితే, పెళ్ళి మీద ఆసక్తి పోయి, పెళ్ళెందుకని అడిగినా ఆశ్చర్య పోనక్కరలేదు." 


 " నాన్నా! సెంటరు తెలిసింది. బెంగళూర్." అంటూ శ్వేత చిన్నగా అరిచింది.


" ఏమండీ! ఆ పరీక్ష పెట్టేవాడికి బుర్రుందా? ఉన్న వూళ్ళో కాకుండా ఎక్కడో యిస్తాడు. ఆడపిల్లలు ఒక్కరే హోటళ్ళలో ఎలా వుంటారు?" 


శ్వేత, తల్ల్లి మెడ చుట్టూ చేతులు వేసి," మా మంచి అమ్మ!" అంటూ కుడి చెంప మీద ముద్దు పెట్తింది. 


" చాల్లే దొంగ ప్రేమలు, నువ్వడిగావని వడా, పొంగల్ చేసాను. చల్లారిపోతే బాగుండవు" 


 “ఓకే” అంటూ, శ్వేత టిఫిన్ తీసుకుంది. గీత ప్రశాంతంగా నవ్వుతూ, కూతురుతో కబుర్లాడడం చూసి, "అమ్మయ్యా! ఈ రోజుకి తుఫాను వెలిసింది" అనుకున్నాడు శ్రీధర్.

 

 @@@


జనవరి 6 వ తారీకు, మధ్యాహ్నం 3.30 నుంచి యేడు గంటల వరకు పరీక్ష. ఒక గంట ముందుగా 

వెళ్ళి అక్కడే వుంటే ఆందోళన వుండదని భావించిన, వెంకట్, శ్వేత ను ముందే బయలుదేర దీసాడు. వాళ్ళు పరీక్షా కేంద్రానికి చేరేటప్పటికి, కొద్దిమంది, రోడ్డుమీద, గేట్ దగ్గర నిలబడి కనిపించారు. ఊరి బయట కావడం వల్ల పార్కింగు కు చోటు దొరికింది. 

సరిగ్గా రెండు గంటల వేళ, పత్రాల పరిశీలన ప్రారంభమైంది. మొదటగా వచ్చిన అమ్మాయి మెడలో బంగారు మంగళ సూత్రం వుంది. రూల్సు ప్రకారం నగలను అనుమతించేదిలేదని పరీక్షకులు చెప్పారు. 


 నాకు నిన్ననే పెళ్లయింది. మంగళ సూత్రం తీయలేనని ఆ అమ్మాయి ప్రాధేయపడింది. 

" మాదేం లేదమ్మా! రూల్సు ఒప్పుకోవు. దయచేసి తీసివేయండి" అని పరిశీలకులు నిర్ద్వందంగా చెప్పడంతో, గతిలేక ఆ అమ్మాయి మంగళ సూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని ప్రక్కనున్న భర్తకు యిచ్చింది. 


 ఇదంతా చూస్తున్న ఒక పెద్దాయన “హిందూమతాన్ని కాపాడతామనే పాలకులకి ఈ అమ్మాయి వేదన అర్ధంకాదా?” అని విసుక్కున్నాడు. 


“ మోసాలు, పేపర్ లీకులు పెద్దాళ్ళు చేస్తారు. మనలాంటి సామాన్యులనిలా కష్టాలకు గురి చేస్తారు” అన్నాడు మరొకాయన. 


తరువాత వచ్చిన అమ్మాయి, ఫోటో తేవడం మర్చిపోయింది. ఫోటో లేకుండా అనుమతించమని చెప్పడంతో ఆ అమ్మాయి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అక్కడకు దగ్గరలోనే ఒక ఫోటో స్టూడియో వుందని చెప్పడంతో ఆ అమ్మాయి బయటికి పరుగు తీసింది. తరువాత శ్వేత వంతు. అన్ని పత్రాలు సరిగా వుండడంతో, ఆమెను లోనికి అనుమతించారు. 


ఒక గంట తరువాత. గేట్ మూసేసారు. అదృష్టవశాత్తు, ఫోటోకోసం వెళ్ళిన అమ్మాయి చివరి నిమిషంలో వచ్చి లోనికి వెళ్ళింది. అది చూసి "అమ్మయ్య, ఆ బిడ్డ కథ సుఖాంతమైంది" అని వెంకట్ నిట్టూర్చాడు. 


పరీక్ష ప్రారంభమైంది. శ్వేత పరీక్ష ముగించుకుని వచ్చేదాక నిరీక్షణ. దీర్ఘ నిరీక్షణ! బయట రోడ్డు ప్రక్కన వున్నరెండు టీ కొట్లకు మంచి గిరాకీ దొరికింది. మూడు గంటల తర్వాత. శ్వేత వచ్చింది. "మంచి రాంకు వస్తుందిలే, భయం లేదు" అని చిరునవ్వుతో వెంకట్ కు చెప్పింది. 


 @@@


పరీక్షా ఫలితాలు ప్రకటించేవరకు, అభ్యర్ధులకు ఆటవిడుపే. చాలా కాలం తరువాత, శ్వేత కంటి నిండా నిద్రపోయింది. కడుపునిండా భోజనం చేసింది. సరిగ్గా పదిరోజుల తర్వాత, పరీక్షా ఫలితాలు ఆ వెంటనే కొద్దిరోజులకు కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యాయి. శ్వేత, ప్రభుత్వ కళాశాలలో సీటు రావాలని కోరుకుంది.ప్రభుత్వ కళాశాల్లో ఫీజుల భారం తక్కువ. అంతేగాక, పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు. ఆ కారణంగా, ఎన్నో రకాల కేసులను చూసే అవకాశం లభిస్తుంది. రెండు రౌండ్ల తర్వాత, శ్వేతకు కోరుకున్న సీటు లభించింది. శ్వేత ఆనందానికి అంతే లేదు. వెంకట్, గీతాల మనసులు తేలిక పడ్డాయి. 


వారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏం చదువులో ఏమో, ప్రాణాలు తీసుకోకుండా వుంటే అదే పది వేలు. దేవుడా చదువుకునే బిడ్డలకి మనో ధైర్యం ప్రసాదించు అని వారు ప్రార్ధించారు. రాత్రనక, పగలనక, తిండి తినీ తినక, సరిగా నిద్ర పోకుండా శ్వేత పడ్ద కష్టాన్నిమెచ్చి, దేవుడు కాస్త అదృష్టాన్ని తోడు పంపించడంతో, ఆమె తన లక్ష్యాన్ని సాధించింది. ఇన్ని రోజులుగా ఆమె అంతరంగంలో గూడు కట్టుకున్న భయాలు, ఆమె యెదుర్కొన్న ఒత్తిడులు, ఈ ఫలితంతో మాయమయ్యాయి. మరో మూడేళ్ళ పాటు కష్టపడే ఆత్మవిశ్వాసం ఆమెకు లభించింది.. 


 @@@@@ 


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

64 views0 comments

Comentários


bottom of page