top of page

కష్టే ఫలి

Writer: Lalitha SripathiLalitha Sripathi

#TeluguMoralStories, #నైతికకథలు, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #KashtePhali, #కష్టేఫలి


Kashte Phali - New Telugu Story Written By - Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 24/03/2025 

కష్టే ఫలి - తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఉన్నట్టుండి ఈ భాగాలూ పంచుకోవడమేంటి అన్నయ్యా!" అయోమయంగా అన్నాడు రామం.

"ఏం చెయ్యమంటావురా! నాకూ ఇష్టం లేదు కానీ .. ప్రసాద్ ఏదో వ్యాపారం పెడతాడుట, దానికోసం పాతిక లక్షలు కావాలన్నాడు, నేను ఎక్కడనుంచి తేను? ఇంట్లో మన పోర్షన్ అమ్మితే వస్తాయి అమ్మి ఇమ్మని ఒకటే గోల" కృష్ణారావు చెప్తుంటేనే అర్థమైంది రామానికి అది ఎవరన్నదీ.


కృష్ణారావు, రామారావు అన్నదమ్ములు. పెద్దవాడైన కృష్ణారావు, చదువు, ఉద్యోగం లేకుండా రికామీగా తిరగడం అలవాటయింది. పెళ్లి చేస్తే బాగుపడతాడనుకుంటే, ఒక పిల్లాడిని కని ఇంకో ఇద్దరి బాధ్యత చిరుద్యోగి అయిన రామం మీద పడేసి తిరుగుతుండేవాడు.

సంసారం రోడ్డు మీద పడకూడదని రామం కుటుంబ బాధ్యత తీసుకున్నాడు.


అదృష్టమో, దురదృష్టమో రామం భార్య శాంత కూడా రామంలాగానే నెమ్మదస్తురాలు.

కృష్ణ భార్య రుక్మిణి మంచిదే, బాధ్యతలేని భర్తతో, పిల్లల్తో మరిది మీద ఆధారం కనక తోటికోడలితో మంచిగానే ఉండేది.


శాంతకి పెళ్ళైన పదేళ్లకి ప్రవీణ్ పుట్టాడు. అందరూ రామం తండ్రి కట్టిన ఇంట్లోనే ఉండేవారు. తల్లి, తండ్రిని చివరివరకూ ఏ లోటూ లేకుండా చూసాడు రామం.


ఒక్క రూపాయి ఇంటిఖర్చుకి ఇవ్వకపోయినా, తన చేతిఖర్చుకి ఠంచనుగా తమ్ముడి దగ్గర తీసుకునేవాడు కృష్ణ. ఈ కుటుంబ బాధ్యతతో ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు రామం. ఇప్పుడు ఈ ప్రస్తావన విని హతాశుడయ్యాడు.


ప్రసాద్ ఫ్రెండ్ ఏదో హోటల్ పెడుతున్నాను అంటే, అందులో భాగం పెడదామని కృష్ణకి కలిగిన ఆలోచన ప్రసాద్ కి కూడా నచ్చింది.


ఇల్లు సగం అమ్మి, తన వాటా డబ్బులతో చిన్న ఫ్లాట్ కొని, కొంత హోటల్ వ్యాపారంలో పెడితే కోట్లు, కోట్లు సంపాదించచ్చు అని తండ్రి కొడుకుల ఆలోచన.

మనకి వ్యాపారం అచ్చిరాదు అని రుక్మిణి మొత్తుకున్నా ఇద్దరూ వినలేదు.


ఇన్నిరోజులనుంచి రామం ఇంత కుటుంబాన్ని ఎలా పోషించాడు అన్న ఆలోచన లేకుండా, ఉన్న ఒక్క ఇల్లు భాగాలూ చేసి అమ్ముదామంటే పిడుగు పడ్డట్టు అయింది రామం, శాంతలకి.

ఇప్పుడే ప్రవీణ్ పదోక్లాసుకి వచ్చాడు, అతని చదువు ఖర్చు అంతా ముందుంది.


ఇన్నిరోజులూ, ఆ చిన్న ఇంట్లో ఒక వాటా అద్దెకి ఇచ్చి, ఇంకో వాటాలో ఉండి అందరి ఖర్చులు వెళ్లదీస్తున్నారు. అసలే చిన్న ఇల్లు, ఒక వాటా అమ్మితే ఇంకో వాటా కొనడానికి బేరం వస్తుందో రాదో తెలీదు, అది ఉంచుకుని ఉపయోగం లేదని, మొత్తం ఇల్లు అమ్మి చెరి సగం తీసుకున్నారు.


రామం వాళ్ళు కూడా ఆ డబ్బులతో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుని, మిగిలిన డబ్బులతో రామం స్నేహితుడి సలహా మేరకు, ఊరి చివర ఒక రెండు ఎకరాల స్థలం కొని మామిడి తోట వేశారు.

వేరయిపోయాక ప్రసాద్ పెళ్ళికి, అతని కూతురు పుట్టినప్పుడు ఇలా ఏవో ముఖ్యమైనప్పుడు తప్ప అన్నదమ్ముల కుటుంబాలు కలవడం బాగా తగ్గిపోయింది.


ప్రసాద్ వాటా పెట్టిన స్నేహితుడు వీళ్ళని మోసం చేసాడని, ప్రసాద్ మళ్ళీ ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడని బయట వాళ్ళ ద్వారా తెలిసినా, రామం సంగతి ఏమిటి అని అన్నని అడగలేదు, వాళ్ళూ ఏమీ చెప్పలేదు.


ప్రవీణ్, మంచి రాంక్ వచ్చినా, అందరిలా కంప్యూటర్స్ కాకుండా, సివిల్ ఇంజినీరింగ్ తీసుకుని చదివాడు. తర్వాత ఒక కన్స్ట్రక్షన్ కంపనీలో ఉద్యోగంలో చేరాడు.


రోజులు గడిచి రామం కూడా రిటైర్ అయ్యాడు. ప్రవీణ్ తాను చేస్తున్న కంపెనీ లో ఉద్యోగం మానేసాడు.


"ఎందుకు?" అన్న తండ్రితో "నాన్నా! నేను సివిల్ ఇంజినీరింగ్ చదివినది ఉద్యోగం చెయ్యడానికి కాదు, ఉద్యోగం చేసింది నేను ఇంటి నిర్మాణాల పనిలో అనుభవం సంపాదించడానికే.

మీరు ఒప్పుకుంటే, మన మామిడి తోట దగ్గర, సగం స్థలంలో ఇండిపెండెంట్ ఇళ్లు కట్టి అమ్మాలని నా ఉద్దేశ్యం" అన్నాడు.


"అలా విల్లాలు కట్టాలంటే ఎంత డబ్బు అవసరమో నీకు ఏమైనా ఐడియా ఉందా? వ్యాపారం అని ఉన్న డబ్బంతా పెట్టిన ప్రసాద్ పరిస్థితి చూసావుగా?" కొద్దిగా గట్టిగానే అన్నాడు రామం.

"నాన్నా! నేను దాదాపు అయిదేళ్ల నుంచి ఉద్యోగం చెయ్యడం ఆ నిర్మాణంలో లోటుపాట్లు తెలుసుకోవడానికే.


ఇప్పడు నేను, నా ఫ్రెండ్, బ్యాంకు లోన్ తీసుకుని కంపెనీ ఫ్లోట్ చేద్దామనుకుంటున్నాం. ఆ స్థలం మీపేరు మీద ఉంది కనుక, మిమ్మల్ని కూడా ఒక భాగస్తుడుగా ఉంచుతాం. ముందు ఒక అయిదు ఇళ్లు కడదాం, అవి బాగా అమ్ముడుపోతే ఇంకొన్ని" అన్నాడు ప్రవీణ్.


"ప్రవీణ్! సిరి తానొచ్చిన వచ్చును.. పద్యం నీకు చిన్నప్పుడు ఎప్పుడూ చెప్పేదాన్ని గుర్తు లేదా! లక్ష్మి చాలా చంచలం. ఎప్పుడు ఎలా వస్తుందో, ఎప్పుడు ఎలా పోతుందో తెలీదు, ఇప్పుడు ఉన్న ఉద్యోగం మానేసి, ఆ స్థలంలో ఇళ్ళు కడితే, ఏదైనా తేడా వస్తే మన పరిస్థితి ఏంటి?"

శాంత కొడుకుని సమాధానపర్చడానికి అంది.


"అవునమ్మా ! నువ్వు ఇంకొకటి కూడా చెప్పావు, లక్ష్మి కానీ, సరస్వతి కానీ, విలువ తెలిసి గౌరవిస్తే మన దగ్గర స్థిరంగా ఉంటారని కూడా చెప్పావు.


'కష్టే ఫలి' అని కష్టపడి పని చేస్తే, ఫలితం తప్పక ఉంటుందని, డబ్బు ఉన్నదని విర్రవీగకుండా, లేనివారిని చిన్నచూపు చూడకుండా, అందరికీ సాయపడితే, లక్ష్మి ఎక్కడికీ వెళ్ళదు అని కూడా చెప్పావు" నవ్వుతూ అన్నాడు ప్రవీణ్, తల్లిని ఒప్పిస్తూ.


కొడుకు పట్టుదల, కార్యదీక్ష తెలిసిన రామం కూడా నెమ్మదిగా ఒప్పుకున్నాడు. అలా 'శాంతారాం బిల్డర్స్' మొదలుపెట్టి మరో అయిదు సంవత్సరాలలో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్, ఫ్రెండ్ లహరి.


వ్యాపారంలో వాటాదారులు, జీవితంలో భాగస్వాములయ్యారు.


ఒకరోజు ప్రసాద్ వచ్చి, ఉన్న ఉద్యోగం పోయి ఇబ్బందుల్లో ఉన్నానని, ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం ఇప్పించమని, అడిగితే "ఎక్కడో ఏమిటి అన్నయ్యా! నీకు అభ్యంతరం లేకపోతే మన కంపనీలోనే చేరు" అన్న ప్రవీణ్ ని చూసి ప్రసాద్ సంతోషపడితే, కొడుకు మంచి గుణాన్ని చూసి గర్వపడ్డారు శాంతారాములు.


“ప్రవీణ్! నేను అన్నానని అనుకోకు కానీ ప్రసాద్ కు డబ్బు ఎక్కువ అప్పచెప్పకు, మిగిలిన ఉద్యోగస్తులలాగానే చూడు, ప్రత్యేకత చూపించద్దు” రామం హితవు చెప్పాడు.

ముందు ఎంతో శ్రద్ధగా పనిచేసిన ప్రసాద్ ఆరునెలల్లో అసలు రంగు బయటపెట్టడం మొదలు పెట్టాడు.


కృష్ణారావు కూడా కంపెనీ మాదే అని వచ్చి కూర్చోవడం అందరి మీదా అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. ముందు ప్రవీణ్, పెద్దవాడు కదా అని పెదనాన్నని చూసీ చూడనట్లు వదిలేశాడు కానీ తర్వాత నెమ్మదిగా సెక్యూరిటీ కి అతన్ని లోపలికి పంపద్దు అని గట్టిగా చెప్పాడు.

అది తెలిసిన కృష్ణ రామం దగ్గరికి వచ్చి యాగీ చేశాడు.


“ఏదో మనది అనుకుని వెళ్లి పనులు చూస్తున్నాను. జీతంలేకపోతే పోయే గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా? అక్కడ అంతా గోల్మాల్ జరుగుతోంది, నేను బయటపెడతానని నీ కొడుకు నన్ను బయటికి తోసాడు” అన్నగారి మాటలకి ఒక్క మాట కూడా సమాధానంగా అనలేదు రామం.


ప్రసాద్ అయినా నమ్మకంగా ఉన్నాడా అని ప్రవీణ్ నిఘా పెడితే డబ్బు అందడంలేదని నిర్మాణానికి ఉన్న సిమెంట్, స్టీల్ లాంటివి బయటికి చేరవేస్తున్నాడని తెలిసింది.

ఆఫీసులో అందరిముందూ ఏమీ అనలేక ప్రసాద్ ఇంటికి వెళ్లాడు ప్రవీణ్.


“పెదనాన్నా, అన్నయ్యా మీరు ఉద్యోగాలు పోయి ఇబ్బందుల్లో ఉన్నారని బయట వేరే ఉద్యోగస్తుల బదులు మీరు ఉంటే నమ్మకంగా ఉంటుందని మిమ్మల్ని చేరదీశాను. మీరు నాకే ఎసరు పెడదామని చూస్తే ఎలా ఊరుకోవాలి. పెదనాన్న అక్కడి పనివారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ల ముందు నన్ను పనికిరానివాడిగా చిత్రీకరించడం ఎంతమటుకు సబబు?


పోనీ పెద్దవారు అని ఏమీ అనకుండా వదిలేసి మీరు ఆఫీస్ లోపలికి రాకుండా చేశాను.

అన్నయ్యా! ఆ రోజు ఉద్యోగం కోసం నా కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు.

కొన్నిరోజులు నమ్మకంగా ఉంటే నీకు ఇంకా మంచి పోస్ట్ ఇచ్చి జీతం ఎక్కువ ఇద్దామనుకున్నాను.

అలాంటిది అక్కడి సామాను దొంగతనంగా తరలించి అమ్ముకుంటున్నావు. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏమవుతుందో నీకు తెలుస్తోందా? కష్టపడకుండా ఫలితం రావాలని అనుకుంటే ఉన్నది కూడా పోతుంది.


నేను ఎంత కష్టపడితే ఇలా ఉన్నానో నీకు ఇప్పటికీ అర్ధమవలేదు. నిన్ను ఇక ఆ భగవంతుడు కూడా కాపాడలేడు”


కోపంగా అని వెళ్ళిపోతున్న ప్రవీణ్ ని చూసి “ఆ… వాడేదో వాగుతాడు. తెలివిగా ఉంటే అవకాశం వెదుక్కుంటూ వస్తుంది. మోసం చెయ్యాలంటే మనుషులు కరువా ఏంటి?” అనుకుంటూ

కష్ట పడకుండా ఫలితం కోసం గాలిలో మేడలు కట్టడం మొదలుపెట్టారు ఆ తండ్రీకొడుకులు.


“అలాగే మోసం చెయ్యండి ఈసారి మీరు జైల్లో కూర్చోడం ఖాయం. మీలాంటివాళ్ళని ఎవరూ బాగుచెయ్యలేరు. అందుకే నేను, అత్తయ్యగారు ఈ ఇంట్లోనించి వెళ్ళిపోయి మా బతుకు మేం బతుకుతాం” అంటూ బయటికి నడిచింది ప్రసాద్ భార్య అత్త రుక్మిణితో.


***

శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.




 
 
 

ความคิดเห็น


bottom of page