( "ఎద మీటిన రాగాలు" పుస్తకం పై సమీక్ష)
---- పతివాడ నాస్తిక్
'Kasivarapu hrudayantharangalu' - Review By Pathiwada Nasthik
'కాశీవరపు హృదయాంతరంగాలు' సమీక్ష
రచన: పతివాడ నాస్తిక్
కవిత్వం అంతరాంతరాల్లో అలుముకున్న కారుచీకట్లను పారదరిమి ప్రకాశవంతమైన వెలుగు కిరణాన్ని ప్రసరింపజేయాలి. అసంకల్పితంగా గూడు కట్టుకున్న నిరాశా నిస్పృహల్ని బతుకు పొలిమేరల్లోంచి తన్ని తగిలేసి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయాలి. కుంచించుకుపోతోన్న మనుష్యుల మస్తిష్కపు మొక్కల్ని సారవంతమైన ఆలోచనల ఎరువులతో నింపి సస్యశ్యామలం గావించాలి..
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కవిత్వం"ఎద మీటిన రాగాలు"సరిగ్గా అలాంటి స్ఫూర్తివంతమైన ఆలోచనల వైపు పాఠకుడ్ని ప్రేరేపించి , జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది. అనేకానేక వ్యాకులతలతో మసకలు కమ్మిన మనస్సును ప్రక్షాళన గావిస్తుంది.
అంతేకాదు, ధారాళమైన ఆయన భాషా చాతుర్యం, విస్తారమైన ఆయన శబ్ద సంపద , పద్యం పద్యానికీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఆఖట్టుకుంటుంది!
ఆయన మొదటి కవిత "అగస్త్య భ్రాత" లో
"అతని చిరునవ్వు దొంతర....
నా గుండె లోలోతున గతం పెట్టిన గాట్లపై
వీచిన శీతల తెమ్మెర లేపనం.... "అంటారు.
"జీవితం చివరి అంచు నుంచి....!" అన్న కవితలో
"హంస ఎగిరిపోయే సమయం
ఆసన్నమయ్యే కొద్దీ
శేష క్రియల పరిసమాప్తికి
వేగిరం సత్వరమవుతుంది"
అంటూ చాలా చక్కని పదాల్ని పేరుస్తారు.
"దారి కాచిన ప్రమాదం". అన్న కవితలో
"బయట మంచు తునకలు
గుండెల్లో నిప్పు కణికలు....
"సెలయేటి తుంపరుల్లా ఆలోచనా పరంపరలు
దేహపర్యంతం భీతావహ స్వేద బిందువులు..."
"ఎండిన కొమ్ములపై గుడ్లగూబ
కనుక్రుడ్లు మిటకరిస్తున్న దృశ్యగతం...
"ఎక్కడి నుంచో దౌర్జన్యం పర్జన్యమై
పాంచ జన్యం పూరించిన ధ్వని నిర్ఝాతం."ఇలా ఆయన కవితల నిండా అద్భుతమైన శబ్ద విన్యాసాలు మన కనులకు విందు చేస్తాయి.
అవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు గొప్ప ప్రయోజనకరమైన అర్థాలను స్పురింపజేసే అందమైన వాక్యాలు.
ఆయనలో కవిత్వం ఏ క్షణాల్లో అంకురిస్తుందో కూడా "దృశ్యోపదృశ్యాలు"అన్న కవితలో వివరిస్తారు -
"పిల్ల తెమ్మెరలు మెల్లమెల్లగా ఆకుల సందుల్లోంచి
ఏపుగా ఎదిగిన పచ్చి గడ్డిని కదుల్చుకుంటూ నన్ను తాకినప్పుడు
నాలోని కవిత్వపు స్పృహ స్పర్శిస్తుంది"
" పెన్నేటి ప్రక్కన ఎత్తువారిగా వరస నిల్చిన
ఇసుక తిన్నెల సుందర రూప విన్యాసం స్పురణకు వచ్చినప్పుడు
నిద్రాణంగా ఉన్న నాలోని కవిత్వం కనురెప్ప కదుల్చుతుంది"
అయితే ఇలాంటి సాంప్రదాయక శబ్దాలతో మాత్రమే కాదు, చక్కని మాండలికంలో కూడా గొప్ప ప్రయోజనాత్మకమైన కవితలు రాశారు
"యాందిరా యిదీ ?" అన్న కవితలో గొప్ప మత సామరస్యాన్ని బోధిస్తారు
"యాలగాని యాల
ఎవరన్నా మనింటికొచ్చే
కడ్పుసూసి ఆదరా బాదరా
బువ్వెట్టి కడ్పు సల్లబర్చినాం!
ఎండ పొద్దున దోవన పోయేటోళ్ళు
పోతాపోతా మనింటి వారపాక నీడకొచ్చే
మంచి నీళ్లకు బదులు మజ్జిగిచ్చి
సతాయించుకోమన్నాం!
మన పక్కింటోన్కి
ఏదో జబ్బొచ్చి ఆసుపత్రికి పోను
తిప్పలు పడ్తాంటే
నడిరేయ్యేనా బండి కట్టి సాయం చేసినాం!
దర్గానో చర్చో గుడో కట్టుకుంటామంటే
తనామనా యని సూసుకోకుండా
సందాలిచ్చి పోత్సయించినాం!
ఇన్ని మంచి గునాలున్నోల్లం
ఇరిగింటోంతో సమచ్చలొచ్చే
ఒద్దికతో సర్దుక పోలేకుండాం!
పొరుగు కులమోన్ని కల్పుకొని
సావాసం చేయలేకున్నాం!"
ఎంత గొప్ప మత సామరస్యం ఉంది ఈ కవితలో!
అలాగే , పొలం గట్ల దగ్గర ఒకరి భూమిని ఒకరు లాక్కోవటాన్నీ , ఒకరి కల్లందొడ్డిని మరొకరు కలుపుకోవటాన్నీ "మంచిది కాదన్నా"అన్న కవితలో -
"ఇబ్బుడే సెబుతాండ ఇనుకోన్నా!
నువ్వీపని సేయడం తప్పన్నా!"అంటూ...
"పొరుగింటోని పెళ్ళాం సక్కగుందని
కన్నేయడం దురుమార్గమన్నా!
ఎనకింటోన్ని వేధించి ఏడిపించి
ఎల్లగొట్టడం న్యాయం కాదన్నా!
న్యాయం కోసం దగ్గరకొచ్చినోన్ని
నిండా ముంచడం ధర్మం కాదన్నా!....
నీ పద్ధతి మార్చుకోకుంటే నీకే ప్రమాదం అన్నా!
ముందే చెబుతున్నానని ఏమనుకోవద్దన్నా!" అంటూ హెచ్చరిస్తారు.
ఈయన వృత్తిరీత్యా ఒక రైతు. అందునా రాయలసీమ లాంటి దుర్భరమైన కరువు జిల్లాలో రైతు. అందువల్లనే సేద్యం గురించీ , దానిలోని సాదకబాధకాల గురించీ , సాగునీళ్ళు లేక అక్కడి రైతులు నిత్యం పడే యమ యాతనల గురించీ ఆయనకు క్షుణ్ణంగా బోధపడింది.
అందుకే "కరువు దావానలం" లాంటి గొప్ప కవిత రాయగలిగారు.
"ఒకనాడు అన్నార్తులకు ఆకలి తీర్చి
సేదదీర్చిన పుడమి తల్లి.
రత్నరాశులు విపణిలో అమ్మిన రత్నగర్భ .
నేడు సస్యం సుదూరాలకు తరిగిపోతున్న వైచిత్రిక.
క్షామం నిక్షేపంగా కనుచూపు మేర
విస్తరిస్తున్న దృశ్యమాలిక.
అదేమి చిత్రమోగాని ప్రకృతి కూడ
సీమపై కరుణ చూపదుగాక చూపదు .
నైరుతి రుతుపవనాలు
సీమ భూభాగం దాటాకగాని వర్షింప నిష్టపడవు .
ఆకాశం నిప్పుల వర్షాన్ని
వడపోతగా కురుస్తుంది.
నేలతల్లి ఒళ్ళు పగిలి
నెర్రెలు పర్రెలుగా చీలుతుంది.
చెట్లుచేమలు మలమలా మాడి
చీకట్లో భూతాలవుతాయి.
తేమ భూగర్భంలోకింకి పోయి
పాతాళ బిలం చేరుతుంది.
పశుగ్రాసం అందక పశువులు
కబేలా వధ్యస్థలకి తరలి పోతుంటాయి .
కూలినాలివాండ్లు పనులు దొరక్క
కాందిశీకులై దెశ్శోమంటూ
దేశాలు పట్టుకుని వలస పోతారు .
రైతన్నల చూపులు
నింగికేసి నిశ్చల స్థితిలో నిల్చిపోతాయి .
మేఘాలు దూది పింజల్లా దోబూచులాడుతూ
నాన్ స్టాప్ బస్సుల్లా ఎటో వెళ్ళిపోతాయి. .....
జనం వర్షాలులేక పస్తులతో చస్తున్నా
నోటికి అందని కడుపు నిండని
వాగ్దానాలు ప్రణాళికలు మస్తుగున్నాయి
కృష్ణనీరు తీరాంధ్ర భూముల్ని పావనం చేస్తుంది
పెన్ననీరు నెల్లూరు సీమను సౌభాగ్యం చేస్తుంది
సీమకు మాత్రం కన్నీరు పుష్కలంగా మిగిలింది"
ఎంత గుండె మండితే గాని, ఎంత హృదయ విదారమైన బాధను అనుభవిస్తే గాని ఇంత శక్తివంతమైన కవిత ఉత్పన్నం కాదు!
అందుకే , "మానవతా వాదాన్ని కూడా అధిగమించి సమస్త ప్రాణి సమానత్వ వాదిగా పరిణతి చెందాల్సివుంది" అంటూ నిర్ధారిస్తారీయన.
సహజంగా వ్యవసాయదారుడు కావడం వలన అనేక రకాలైన నేలల గురించి ఈయనకు బాగా తెలుసు. "ఏటిపై నీటి ప్రాజెక్టు" అన్న కవితలో , "ఎండమావుల కింద తొండలు గుడ్లు పెట్టే ఊసర క్షేత్రాలు
పొరగ్గంటల గరుకుభూములు
ఇసుకతెరప నేలలు ఎర్రమెట్ట పొలాలు
పొరంబోకు స్థలాలు చౌటి పర్రలు
బరకచేన్లు బీడుమళ్ళు నల్లరేగళ్ళు బంజర్లు"
ఇలా, వివిధ రకాల భూముల్ని ప్రస్తావిస్తూ, జలాశయం నిర్మాణమైతే ఈ భూములన్నీ సస్యశ్యామలమౌతాయని ఓవంక హర్షం వెలిబుచ్ఛుతూనే, మరోవంక
"ఊరూ గూడూ వదలి
పొలంపొట్రా పోగొట్టుకొని
ఆత్మీయతలు అల్లుకున్న సొంత ప్రాంతాలను విడిచి పెనవేసుకున్న అనుభవాలు అనుభూతులు
మమతలు మమకారాలు సమస్తముమూ
జలాశయంలో మునిగి
ఊరూవాడా పిల్లాజల్లా అంతా
బోకులుబొచ్చలు నెత్తికెత్తుకొని
గొడ్లూగోదా తోలుకొని
కాందిశీకులై "పోలో"మంటూ
పరాయి దేశాలకు పయనమై
మానాభిమానాలు మంటగలసి
పరాయి జనం మధ్య బతికేస్తున్న"
దుర్భర దురవస్థను ఎండ కడతారు.
ఇంకా ఈ పుస్తకంలో.... పచ్చ పచ్చని స్నేహ పరిమళాలున్నాయి. కడుపు చేత పట్టుకొని, "ఆకలి సాహస విన్యాసాలు" చేసే దొమ్మరి జీవుల కడగండ్లూ ఉన్నాయి. బతుకు భయం దేహపర్యంతం ప్రాకి మరణోన్ముఖం అయిన మనిషికి ఎవరో తాత్వికుడు ఎదుటపడి బతుకు మంత్రమేదో చెవిలో ఊది గృహోన్ముఖం పట్టించిన శుభపరిణామాలు కూడా ఉన్నాయి.
నిజంగా ఇవన్నీ ఆయన ఎద ప్రియంగా మీటిన రాగాలుగానే మనకు కనిపిస్తాయి.
ఈ సంపుటికి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు ముందుమాట రాశారు. మరో ప్రముఖ కవి డా,, రాధేయ గారు రెండవ ముందు మాట రాయగా, మూడో ముందుమాటలో మరో ప్రముఖ కవీ , కథా రచయితా ఎమ్వీ రామిరెడ్డి గారు, ఈ కవితా సంపుటి సృష్టికర్త కాశీవరపు వెంకటసుబ్బయ్య గారిని చాలా లోతుగా అధ్యయనం చేసి "కవిత్వంలో నిలువీతలు కొట్టడానికి ఆయన తనను తాను సిద్ధం చేసుకున్నారంటూ చక్కని కితాబిచ్చారు.
మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇంత హృద్యంగా కవిత్వీకరించిన ఈ పుస్తకం పదిమందీ చదవాలని నేను కూడా ఆకాంక్షిస్తూ....
సాహితీ మిత్రుడు
-పతివాడ నాస్తిక్.
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Podcast Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
Comments