top of page
Writer's picturePenumaka Vasantha

కాస్త ఓర్పు ప్లీజ్.. !



'Kastha Orpu Please' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 03/08/2024

'కాస్త ఓర్పు ప్లీజ్..!' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



"తన కోపమే తన శత్రువు" అని పిల్లలకు పద్యాలు చెపుతున్న సౌమ్యతో నరహరి "ఒక మంచి సంస్థలో జాబ్ వచ్చింది. వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకొని రేపు ఆఫీసు కి రమ్మన్నారు. జాబ్స్ రావటం లేదని మొన్న సర్టిఫికెట్స్ కాల్చేసాను కదా ఛా.. ! అవి కనుక ఉండుంటే జాబ్ వచ్చేసేదే.. !" అని విసుక్కుంటూ సోఫాలో కూర్చున్నాడు నరహరి.


 "అదేనండి నేను మీకు చెప్పేది. కొంచం ఓర్పుగా ఉండుంటే ఆ సర్టిఫికేట్లుతో జాబ్ తెచ్చుకునే వాళ్ళు. ఎందుకు మీకంత కోపం?” అంది సౌమ్య. 


" పిల్లలు ‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దగా చదువుతుంటే ‘ఆపండి గోల’ అన్న హరితో "ఎందుకు వాళ్ళని..  విసుక్కుంటారు. ఇప్పటికైనా కాస్త ఓర్పుగా ఉండటం నేర్చుకోండి" అంది సౌమ్య. 


మరుసటి రోజు "ఏమండీ! ఇక ఆ సాడ్ ఫేస్ పెట్టకుండా రెడీ అయి ఆఫీసు కెళ్లండి" అన్నది సౌమ్య. 


"సర్టిఫికెట్స్ లేవు కదే.. !"


"ఇవిగో తీసికుని వెళ్ళి జాయిన్ అవ్వండి. "

 

 "ఎక్కడివి ఇవన్నీ?" ఆశ్చర్యపోతున్న హరితో సౌమ్య "మీ కోపం సంగతి తెలియదా? అసలు మీ పేరు నరహరి కాకుండా నరసింహం అని పెట్టాల్సింది మీకు. ఎపుడూ ధుమదుమ లాడుతుంటారు. ఒరిజినల్స్ నా దగ్గర 

పెట్టుకుని జెరాక్సులు బీరువాలో పెట్టాను. "

 

 "అవునా! చాలా థాంక్స్ సోము" అని వాటిని తీసుకున్నాడు. 


 "మళ్ళీ వీటిని నాకు తెచ్చివ్వండి”. 


 మీరు తగలెట్టటానికి మళ్ళీ వీటికి జెరాక్స్ తీయించాలిగా" 

అన్న సౌమ్యతో "ఇంక అలా చేయనులే" కోపంగా అన్నాడు హరి.


 

 "అబ్బా ఛా! ఇలా ఎన్ని సార్లు చెప్పారు తమరూ.. ! ఇది నూట రెండవసారి" అంది కోపంగా సౌమ్య. 


"సర్లే కానీ.. !" 

రెడీ అయి ఆఫీసు కెళ్ళాడు హరి. 


 ఆ సాయంత్రం జాబ్ వచ్చిందని ఆనందంగా చెప్పాడు నరహరి. అమ్మయ్య మన కష్టాలు గట్టెక్కినాయని ఆ రోజు సినిమాకు వెళ్ళారు. 

 

 ఒక వారం రోజులు గడిచాయి. ఆ రోజు ఇంటికి వస్తూనే, హరి "ఏం ఉద్యోగమో? విసుగొస్తుంది. అంతా నేనే చెయ్యాలని

మా సెక్షన్ హెడ్ ఒకటే గోల. చెయ్యలేక పోతున్నా. అందరూ నన్ను ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళే. అసలు ఈ ఉద్యోగం మానేసి మనూరు వెళ్దాం. ఏదో వ్యవసాయం చేసుకుంటూ అక్కడ బతకొచ్చు" అన్నాడు చిరాగ్గా హరి. 


"అక్కడ మీ నాన్నతో మీ అన్నయ్యతో గొడవ అయ్యే కదా మనం ఇక్కడికి వచ్చాము. పంటలు పండటం లేదు, వర్షాలు లేవు. ఉద్యోగం చేస్తే నెలకు ఎంతో కొంత ఆదాయం 

వస్తుందని వచ్చాము. ఒకే వారమే కదా.. మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యింది" అని ఎలాగో నచ్చచెప్పింది సౌమ్య హరికి


ఇంతలో సౌమ్య కొడుకు బాబీ వచ్చి "నాన్నా.. ! ఈ స్కూల్ వద్దూ ఇంకో స్కూల్లో జాయిన్ అవుతాను. 

ఇక్కడ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు" అని ఏడుస్తూ అన్నాడు. 

 

"మొన్ననేగా స్కూల్ లో జాయిన్ అయ్యావు. అపుడే ఇంకో స్కూల్ ఏంటి? ఫీజులు అన్నీ కట్టేసాం. వెళ్లు ఆ స్కూలుకే నోరుమూసుకుని" అంటూ బాబీనీ కేకలేసాడు హరి. 


"యధా తండ్రి తథా పుత్ర. ఏమండీ.. ! బాబీనీ తిడుతున్నారు, మీరు చేస్తున్న పని ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. మీరు మాటిమాటికి ఆఫీసు మారితే ఇలాగే వుంటుంది. ఇక్కడ కొన్నాళ్ళు వర్క్ నేర్చుకోండి. కొత్తవాడివని వర్క్ మీకు ఎక్కువ ఇస్తూ వుండవచ్చు కదా!" అంది సౌమ్య. 


'సౌమ్య చెప్పింది కరెక్టే, కానీ దాని మాటను ఒప్పుకుంటే, దాని దగ్గర చులకన అవుతాను’ అనుకున్నాడు హరి మనసులో. 


"నీకేమి తెలియదు నువ్వూరుకో? ప్రతిదానికి నన్ను ఖండి చటమే తప్ప నీకేమి పనిలేదు. నువ్వేదో గొప్పదానివైనట్లు, వూరికే సలహాలు ఇవ్వకు. ఇక్కడ నిన్నెవరు బోడి సలహాలు 

ఇమ్మని అడగలా? " అంటూ కోపంగా అక్కడినుండి లేచి వెళ్ళాడు హరి. 

 

'మొండివాడు రాజు కన్నా బలవంతుడు. చచ్చినా ఈయనకు ఇక సలహాలు ఇవ్వననుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది సౌమ్య. 


హరి ఉద్యోగాలు మారుతూనే వున్నాడు. సౌమ్య సలహాలు ఇవ్వటం మానుకుంది. హరితో తన జీవితం నిప్పుల్లో నడవటం లాంటిది. ప్రతి క్షణము కత్తి మీద సామే. 


 రైల్వే జాబ్ కు సౌమ్య అప్లై చేసినపుడు "నాకే రాలేదు నీకు వస్తుందా? వూరికే, అప్లికేషన్స్ కు డబ్బులు తగలెయ్యకు. 

అయినా ఎవరు చేసే పనివాళ్ళు చేస్తే మంచిది. నువ్వు ఉద్యోగం చేసి వూరేగకుండా ఇంటి పట్టున వుండి మాకు

నాల్గు మెతుకులు ఉడకేస్తే మంచిదని" ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు హరి. 


రైల్వే జాబ్ కు కోచింగ్ తీసుకుని గట్టిగా కృషి చేసింది సౌమ్య. రైల్వేలో జాబ్ వచ్చింది. అది ఆనందంగా హరితో పంచుకుందామనుకుంటే ఇదివరకు హరి అన్న మాటలు గుర్తొచ్చి ఈ విషయం ఇపుడే హరికి చెప్పకూడ దనుకుంది. 

 

ఇంకో నెలలోపు వెళ్ళి హైదరాబాద్ లో జాయిన్  అవ్వాలి. సౌమ్య అన్నయ్య శ్రీను, "వెళ్ళి జాయిన్ అవ్వు. నీ ఉద్యోగంతో పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు. నేను హైదరాబాద్ లోనే ఉన్నా కాబట్టి నీకు ఏం కావాలన్నా చూస్తా”నని హామీ ఇచ్చాడు. 


ఆ ధైర్యంతో పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ట్రెయిన్ ఎక్కింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన హరికి, సౌమ్య కనపడలేదు. గుడికి వెళ్ళింటుందిలే.. ! అనుకున్నాడు. 

కానీ పిల్లలు కూడ ఇంకా స్కూల్ నుండి రాలేదు. 

ఎక్కడో డౌట్ గా ఉండి సౌమ్య సెల్ కు ఫోన్ చేశాడు. 

స్విఛుడాఫ్ వచ్చింది. పక్కవాళ్ళను అడుగుదామంటే వాళ్ళు ఊరెళ్ళారు. 


సరేలే వస్తుందిలే అని వెయిట్ చేసాడు. రాత్రి తొమ్మిదయినా రాలేదు. బెడ్రూంలోకి చూసాడు అక్కడ బల్ల మీద పేపర్ కనిపించింది. ఏంటని తీసి చూసాడు హరి. 


"ఏమండీ నాకు రైల్వేలో జాబ్ వచ్చింది. రేపు జాయిన్ అవ్వాలి. మీకు చెప్తే మీరు నన్ను జాబ్ చేయనివ్వరని చెప్పలేదు. అంతకు మించి ఏమి లేదు. 


మన పిల్లల భవిష్యత్ కోసం నేను జాబ్ చేయాలని

నిశ్చయించుకున్నాను. మీరు ఏదన్నా జాబ్ చూసుకుని ఇక్కడకు వస్తె బావుంటుంది. అది ఇక్కడకు వచ్చేది లేనిది మీ ఇష్టం. మీకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో పడివుండటం మీకిష్టం. 


కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేను జాబ్ చేయటం తప్పనిసరి. మీ ఉద్యోగం తుమ్మితే వూడిపోయే ముక్కులాంటింది. అలాంటి టెన్షన్ లైఫ్ ఇప్పటి వరకు గడిపాను. ఇక నా వల్ల కాదు బై. "


 'ఎంత పొగరు దీనికి? ఉద్యోగం చూసుకుని నన్నొదిలి వెళ్తుందా? ఎన్నాళ్ళు మగ అండ లేకుండా వుంటుందో? చూస్తా’ననుకున్నాడు. 


తర్వాత వాళ్ల వూరు వెళ్లి అమ్మానాన్నలకు చెప్పాడు. 

“కోడలు మంచి పని చేసింది. నాకు చెప్పిందిలే.. !' అన్నాడు రామయ్య.


ఇంతలోకి లోపలి నుండి వచ్చిన హరి అమ్మ దేవమ్మ "అయినా ఆడది ఇంట్లో వుండక.. ఉద్యోగం చేయటం ఏంటో? అసలు వాడికీ చెప్పకుండా పోవటం ఏంటి?" అన్నది. 


 అమ్మ వైపు మెచ్చుకోలుగా చూసాడు హరి. 


"ముందు నువ్వు నోరుముయ్యి, మనమ్మాయి ఉద్యోగం చేయవచ్చు కోడలు చేయకూడదు. నీ దరిద్రపు బుద్దె వాడికీ వచ్చింది. నీ కొడుకుకు బుద్ధి స్థిరంగా వుండదు. ఆరునెలలకు ఒకసారి ఉద్యోగం మారతాడు. కాసేపు ఉద్యోగం 

అంటాడు, కాసేపు వ్యవసాయం అంటాడు. నువ్వు ఇంకా వాడిని వెనకేసుకు వచ్చావంటే.. ! నిన్ను చంపుతా”నన్నాడు భార్యను రామయ్య. 


 “నువ్వు హైదరాబాద్ లో ఏదన్నా జాబ్ చూసుకో, లేదా నువ్వు చేసే ఉద్యోగం చేయి. ఆ అమ్మాయిని, మగాడిలా కాక ఒక భర్తగా అండగా ఉండి చూసుకో”


“వాడేందుకు వెళ్తాడు? కొన్నాళ్ళు ఆగి ఇక్కడకు కోడలు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వస్తుంది.. !" అంది దేవమ్మ. 


"మీ అమ్మ మాటలు విని అపని చేయకు. అన్నం వుడికిందా లేదా? అని అన్నం మొత్తం పట్టుకుని చూడక్కర్లా? సౌమ్య బుద్దిమంతురాలు. నువ్వు వెళితే అక్కడికి నెత్తిన పెట్టుకుని చూస్తుంది. కోడల్ని ఉద్యోగం మాని ఇంటికి రా.. ! అని గొడవ చేయకు. కాస్త ఓర్పు, అలవాటు చేసుకుంటే బాగుపడతావు. 


ఉద్యోగాలు చేయటానికి ఆడ ఏంటి మగ ఏంటి. ? ఇంకేదన్నా కోడలు దగ్గరికి వెళ్లి గొడవ చేసావంటే వున్న ఆస్తి నీకు కాకుండా సౌమ్యకు, పిల్లలకు రాస్తాను ఏమనుకుంటున్నావో? అసలు నువ్వు మంచి ఉద్యోగం చేసి ఏడిస్తే.. సౌమ్య ఉద్యోగం ఎందుకు చేస్తుంది?” అని బయటికి వెళ్ళాడు రామయ్య కోపంగా/


 చేసేదిలేక హైదరాబాద్లో ఉద్యోగం చూసుకోవటానికి, సిద్ధం అయ్యాడు నరహరి. 


సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


73 views0 comments

Comments


bottom of page