కాస్త యోచించు!
- Gadwala Somanna
- Apr 8
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KasthaYochinchu, #కాస్తయోచించు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 54
Kastha Yochinchu - Somanna Gari Kavithalu Part 54 - New Telugu Poem Written By Gadwala Somanna
Published In manatelugukathalu.com On 08/04/2025
కాస్త యోచించు! - సోమన్న గారి కవితలు పార్ట్ 54 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కాస్త యోచించు!
----------------------------------------
కోపంలో సమాధానం
ఆనందంలో వాగ్దానం
ఆలోచించి ఇవ్వాలోయ్!
లేకపోతే ఇబ్బందులోయ్!
పెద్దవారి వ్యవహారాల్లో
అనవసరమైన విషయాల్లో
జోక్యం చేసుకోరాదోయ్!
మనశ్శాంతి కోల్పోరాదోయ్!
పొరుగువారి రహస్యాల్లో
చూడ చక్కని కాపురాల్లో
ఎప్పుడు వేలు పెట్టరాదోయ్!
నిప్పులు కూడా పోయరాదోయ్
ప్రక్కవారి సంతోషాల్లో
వారి వారి జీవితాల్లో
నీళ్లు కుమ్మరించరాదోయ్
ప్రవేశించరాదోయ్

అందాల చంద్రుడు
----------------------------------------
రాత్రి పూట వస్తాడు
కాంతులీను చంద్రుడు
వెన్నెల కురిపిస్తాడు
ముద్దులొలుకు చంద్రుడు
అమ్మ జోలపాటకు
వత్తాసు పలుకుతాడు
మేఘమాలల చాటున
దోబూచలాడుతాడు
బలే బలే చంద్రుడు
కలువలకు బాంధవుడు
పౌర్ణమి వేళల్లో
పరిపూర్ణుడవుతాడు
అందమైన చంద్రుడు
అందరికీ మిత్రుడు
అందనంత దూరాన
కనువిందు చేస్తాడు

హృదయ పూర్వక కృతజ్ఞతలు
----------------------------------------
దాహం తీర్చే చెరువులకు
ప్రాణం పోసే తరువులకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు
జ్ఞానం పంచే గురువులకు
న్యాయం కోరే మనుషులకు
సాయం చేసే చేతులకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు
మార్గం చూపే పెద్దలకు
బాధలు బాపే మిత్రులకు
కొరతలు తీర్చే మాన్యులకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు
ఆదరించే ఆప్తులకు
వెలుగులు ఒసగే భానునికి
వెన్నెలనిచ్చే చంద్రునికి
హృదయ పూర్వక కృతజ్ఞతలు
తావులు రువ్వే పూవులకు
ఉద్యమించే వీరులకు
జన్మనిచ్చిన కన్నోళ్లకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు
అన్నం పెట్టే రైతులకు

గురువు హితవు
----------------------------------------
చదువుకుంటే మేలు
వృద్ధి చెందిన చాలు
బ్రతుకు సుఖమయమగును
జన్మ సార్థకమగును
దురాలవాట్లు వద్దు
సద్గుణాలే ముద్దు
ఆదిలో త్రుంచితే
బ్రతుకులో మంచిదే
క్రమశిక్షణ ముఖ్యము
అవసరమే లౌక్యము
కష్టపడే తత్వము
కలిగియున్న లాభము
ఆర్జిస్తే జ్ఞానము
చేసుకున్న ధ్యానము
ఎంతైనా మంచిది
హానికరం కానిది

చిన్నారి -చిట్టి చిలుకమ్మ
----------------------------------------
చిట్టి చిలుకమ్మ వచ్చింది
చెట్టు కొమ్మపై వాలింది
ప్రేమనంతా రంగరించి
తీపి పలుకులే పలికింది
పాపకెంతో నచ్చింది
అమ్మకు చూపి మురిసింది
చెప్పరాని ఆనందంతో
కేరింతలే కొట్టింది
చిలుకమ్మ చిన్నగా నవ్వి
పాపతో చెలిమి చేసింది
పువ్వులు కొన్ని రువ్వి రువ్వి
గుండెలో హాయిని నింపింది
చాలా సేపు గడిపింది
టాటా చెప్పి ఎగిరింది
అమ్మ పాపను తీసుకొని
ఇంటిలోనికి వెళ్ళింది

-గద్వాల సోమన్న
Comments