కస్తూరి రంగ రంగా!! 11
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jan 18, 2023
- 6 min read
Updated: Jan 27, 2023

'Kasthuri Ranga Ranga Episode 11' Telugu Web Series
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
రంగా, వసంత్ లు పోలీస్ స్టేషన్ కి వెళతారు.
అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు ఏం జరిగిందో వాకబు చేస్తారు.
వసంత్ స్నేహితురాలు ప్రీతి అతనికి కాల్ చేస్తుంది.
ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 చదవండి.
వసంత్ దేశాయ్ డి. ఐ. జి. , కస్తూరిరంగా యస్. పి. టిఫిన్ తిని కారును సమీపించారు.
“సార్.... నేను నడుపుతాను... " అన్నాడు వసంత్.
"ఓకే!... "
ఇరువురూ కార్లో కూర్చున్నారు. వసంత్ కారును స్టార్ట్ చేసి రోడ్లో ప్రవేశించి ముందుకు సాగాడు.
రంగా సెల్ మ్రోగింది.
నెంబరు చూచి చిరునవ్వుతో చెవి వద్దకు చేర్చుకొన్నాడు.
"హలో!... "
“ఆ... ఎలావున్నారు?... "
"బాగున్నాను... నీ బావా అక్కా పిల్లలు !... "
"అంతా బాగున్నాము... "
"టిఫిన్ చేసి నేను, మన వసంత్ రేపల్లెకు బయలుదేరాము... "
"నన్ను అక్కడికి తీసుకొని వెళ్లరా!... "
"ఆరోజు త్వరలో రాబోతూవుంది. తప్పకుండా తీసుకొని వెళతాను. కొద్ది రోజులు ఓపిక పట్టాలి... ప్రియా!... " నవ్వాడు రంగా...
"ఆవూరి పేరు వినగానే మదిలో... ఎన్నో చేదు తీపి జ్ఞాపకాలు... విరక్తిగా నవ్వింది చిన్నీ. క్షణం తర్వాత...
"ఒకసారి చూడాలని వుంది.. " మెల్లగా చెప్పింది.
"అలాగే!... మరికొంత కాలం ఓపికపట్టు. అన్ని సమస్యలను పరిష్కరించి నిన్ను రేపల్లెకు తీసుకొని వస్తాను చిన్నీ.. " అనునయంగా చెప్పాడు కస్తూరిరంగా.
"సరే!... ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకోండి. వేళకు భోజనం చేయండి... " ఆ మాటల్లో ఎంతో ఆప్యాయత... అనురాగం...
"అలాగే!... చిన్నీ!... నాకు చెప్పిన మాటలను నీవు పాటించాలి. బావగారిని అక్క పిల్లలను అడిగినట్టు చెప్పు... "
"సరే!... "
"కట్ చేస్తున్నా చిన్నీ... "
"ఆ!.. జాగ్రత్త !... " చిన్నీ హెచ్చరిక....
"ఓకే రా!... " చిరునవ్వుతో చెప్పాడు కస్తూరి రంగ.
రంగా మనస్సులో... గర్భవతిగా వున్న చిన్నీ... ఆమె గర్భంలో వున్న బిడ్డను గురించిన తలపులు. ‘మరో ఆరుమాసాల్లో చిన్నీ బిడ్డను కంటుంది. నాలుగైదు నెలల లోపల తన ప్రయిమ్ రెస్పాన్సిబిలిటీస్ నన్నింటిని ముగించాలి. లీవులో కొంత కాలం చిన్నీ, బిడ్డలతో గడపాలి... ' అనుకొన్నాడు. మనస్సున మధురమైన అనుభూతి.
పెదవులపై చిరునవ్వు...
కారును నడుపుతున్న వసంత్ ఓరకంట రంగా ముఖంలోకి చూచాడు.
'బాస్... అమ్మగారితో మాట్లాడారుగా... అందుకే అనందంగా ఉన్నారు. అవును... ఆ మాట నిజమే!... మనకు కావలసిన స్త్రీ... అదీ మన అయిన... లేక కాబోయే జీవిత భాగస్వామితో జరిపే సంభాషణలో ఏదో థ్రిల్... ఎంతో ఆనందం... ' వసంత్ కస్తూరి రంగా ముఖంలోకి చూచాడు. అదే సమయానికి రంగా... వసంత్ ముఖంలోకి చూచాడు.
వసంత్ వెంటనే ముఖాన్ని స్ట్రెయిట్ గా రోడ్డువైపుకు త్రిప్పాడు.
"బాస్ మంచి మూడ్లో వున్నారు. తన మదిలో చాలా కాలంగా వున్న వారికి సంబంధించిన ప్రశ్నను ఇపుడు అడిగితే బాగుంటుంది... ' అనుకొన్నాడు వసంత్.
రంగా వైపుకు తిరిగి... "బాస్!... "
"ఆ... ఏంటి వసంత్ !... ".
"మీకు సంబంధించిన ఒక ప్రశ్న!... "
"అడుగు... ”
"కస్తూరి అనేది మీ సర్‌నేమా సార్... అదే... ఇంటి పేరా!... " అడిగాడు వసంత్.
రంగా వసంత్ ముఖంలోకి సీరియస్ గా చూచాడు.
వసంత్ క్షణం సేపు వారి ముఖంలోకి చూచి తలను రోడు స్ట్రెయిట్ చేశాడు.
"వసంత్!... "
"సార్!!... "
"నా ఇంటి పేరు కాదు...... "
"మరి... " మెల్లగా అడిగాడు వసంత్. క్షణం తర్వాత... "సార్... సారీ"..
"దేనికీ?... "
"నేను అడిగిన ప్రశ్నకు... "
"నీవు ఏమీ తప్పుగా అడగలేదే!... " చిరునవ్వుతో చెప్పాడు రంగ.
అంతవరకు ఎందుకు ఆడిగానా అనే భావనతో మదనపడుతున్న వసంత్ ముఖంలో వెలుగు.
"వసంత్!... "
"సార్!... "
"ఆ పేరు నా లవర్‌ది... నా లవర్ నాకు బహూకరించింది. !... "
చిరునవ్వుతో వసంత్ ముఖంలోకి చూచాడు రంగ.
వసంత్ ఆశ్చర్యంతో రంగా ముఖంలోకి చూచాడు.
"ఏం అలా చూస్తున్నావ్?... "
"సార్.. మీరు చెప్పిందీ!... "
"నిజం వసంత్!... "
"సార్!... " ఆశ్చర్యంతో....
"యస్. నిజం... నిజం... "
'ఇంతటితో ఈ టాపిక్ వదిలేస్తే బాగుంటుంది. కారణం అది వారి ఫియాన్సికి సంబంధించిన విషయం. ప్యూర్లీ పర్సనల్... వారి పర్సనల్ విషయాలు నాకెందుకు?... ఒరేయ్ వసంతూ... మౌనంగా రోడ్డును చూస్తూ బండిని తోలుకో.. అనుకొన్నాడు. మనస్సున వసంత్.
"వసంత్ !.. నీకు ఆ కథ వినాలని వుందా!... " చిరునవ్వుతో అడిగాడు కస్తూరి రంగ.
రంగా ప్రశ్నకు వసంత్ మనస్సులో... 'యస్' అంటే బాస్ ఏమంటాడో... 'నో' అంటే బాస్ ఏమనుకొంటాడో' అనే సందేహం... వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. మౌనం పాటించాడు.
కొన్ని క్షణాలు రంగా వసంత్ ముఖంలోకి నిశితంగా చూచాడు.
"వసంత్!.. ఏం... మౌనంగా మారిపోయావ్?... " నవ్వి... "ఫ్రెండ్ ఇప్పుడు నీవు నీ మనస్సులో ఏమనుకొంటున్నావో చెప్పనా?... " రంగా ముఖంలోకి చూచాడు వసంత్ దీనంగా....
"నేను 'యస్' అంటే బాస్ ఏమనుకొంటాడో!.. లేదా 'నో' అంటే ఏమనుకొంటాడో!... వారి ఆపేరు విషయం నాకెందుకు... మౌనం వుత్తమం.. అనుకొంటున్నావుగా... వసంత్ !... " నవ్వాడు కస్తూరిరంగ.
'ఈ మహానుభావుడికి ఈ విద్యలోనూ పాండిత్యం వుందన్నమాట... నిజాన్ని వాదన అవమానానికి దారితీస్తుంది. ' మనస్సులో ఒప్పుకోవడం మంచిది. అనుకుంటూ...
"యస్ సార్!... మీరు చెప్పింది నిజం... అయినా మీ... ఆ వివరాలు నాకెందుకు సార్!... " విరక్తిగా నవ్వాడు వసంత్.
"అడిగావు కదా!... ఇంతలోకే మనస్సు ఎందుకు మార్చుకొన్నావు వసంత్!... నీవు నన్ను తప్పుగా ఏమీ అడగలేదే?... ఎందుకు ఆ భయం!... వుద్దేశ మార్పు?... "
"అది ప్యూర్లీ మీ పర్సనల్ విషయం కదా సార్!.. ”
"అవును... మంచి విషయాలను నీలాంటి మిత్రుడితో షేర్ చేసుకోవడంలో నాకు ఆనందం. వసంత్ !.. వినేవుంటావు... ప్రతి మగవాడి అభివృద్ధి వెనుక ఓ స్త్రీమూర్తి దాగి వుటుందని... ఆ గొప్ప పవిత్రమూర్తియే... నా కస్తూరి... ఆమె అనే ఆ మహెూన్నత శక్తి... ప్రేమమూర్తి నాకు పదహారు సంవత్సరాలముందు నా జీవితంలో ప్రవేశించి వుండకపోతే... ఈనాడు నీముందు ఈ రంగా ఈ స్థితిలో వుండేవాడు కాదు... నా కథను ఫ్రీగా వున్నపుడు చెబుతాను వసంత్... ఎంతో ప్రశాంతంగా రోడ్డు ప్రక్కని పచ్చని పైరుల పొలాలను చూస్తూ చెప్పాడు రంగ... వసంత్ మౌనంగా తల ఆడించాడు. కారు రేపల్లెలో ప్రవేశించింది.
కస్తూరిరంగా ఆదేశం ప్రకారం... వసంత్ కారును సయ్యద్ సార్ ఇంటిముందు ఆపాడు. ఇరువురూ కారు దిగారు.
మూడు అంకణాల వసారా. వాకిట ఆగిన కారు సవ్వడిని విని సయ్యద్ వసారా తలుపు తెరచుకొని బయటికి వచ్చి వీధి వైపుకు చూచాడు.
రంగా, వసంత్ వారిని సమీపించారు.
వయస్సు...
జీవనపథంలో ఎన్నో ఒడుదుడుకులు...
అరవై సంవత్సరాల పైన మనిషికి ఎంతో మార్పును కలిగిస్తాయి. ఆనవాళ్లను మార్చేస్తాయి.. అవి రెండు... ఒకటి కుటుంబ పరిస్థితులు... రెండవది... కన్న సంతతి కల్పించే పరిస్థితులు...
పాతికేళ్ల వయస్సులో సయ్యద్ సార్... పహిల్మాన్.. కొంతమంది పిల్లలకు కసరత్... ఫీట్లు నేర్పేవాడు. వృత్తిరీత్యా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. క్రమంగా బి. ఏ. ; యం. ఏ. పాసై హైస్కూలు హైయర్ గ్రేడ్ ఉపాధ్యాయుడుగా స్వశక్తితో ఎదిగిన మంచి మనిషి.
రంగాకు చిన్ననాటి గురువు... గురువును గుర్తించాడు రంగ... సయ్యద్ సార్ ను సమీపించి చేతులు జోడించాడు... నేటి రంగా వాలకాన్ని సయ్యద్ సార్ గుర్తించలేని స్థితి...
ఇంటికి ఒక ప్రక్కన వున్న నులకమంచాన్ని రంగా వాల్చాడు. సయ్యద్ సార్ ఆశ్చర్యంతో రంగా ముఖంలోకి చూచాడు. చేతులు జోడించాడు.
"సార్!... నేను పుట్టి పెరిగింది ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోనే!... కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలి" ప్రీతితో చెప్పాడు రంగా.
కళ్ల అద్దాలను సర్దుకొంటూ సయ్యద్ సార్ మంచం పై కూర్చున్నాడు. వారి ప్రక్కనే కస్తూరిరంగ కూర్చొని వూర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్... హైవేలో జరిగిన బ్లాస్ట్ లను... గతించిన వారి వివరాలను తత్వాలను వారినుండి తెలుసుకొన్నాడు.
ఆ దుస్సంఘటనలకు కారణం దుర్గాదేవి పెద్ద కుమారుడు భూషణ్ కుమార్ అతని తొత్తు తన బావమరిది ఖాజా అతని వర్గం... తన పెద్దకొడుకు ఇర్ఫాన్ అని తనకు తెలిసిన విషయాలను వివరంగా చెప్పి... ఖాజా తన్ను బంధించి గోనెసంచిలో మూటకట్టి మూసీనదిలో పారేయించిన సంఘటన... మూగచాన్ తన్ను రక్షించి విజయవాడ బస్సు ఎక్కించిన విషయం... సయ్యద్ సార్ రంగాకు సవివరంగా వివరించాడు.
రంగా మంచం పైనుంచి లేచాడు.
"సార్... బ్రహ్మయ్యగారి ఇంటిదాకా నాతో రాగలరా!... " అడిగాడు రంగా.
మంచానికి ఆనించిన చేతికర్రను చేతికి తీసుకొన్నాడు సయ్యద్.
"పదండి సార్!... " అన్నాడు.
ముగ్గురూ కార్లో కూర్చున్నారు.
రెండు నిముషాల్లో బ్రహ్మయ్యగారి కాలిపోయిన ఇంటి ముందుకు చేరారు. కారు దిగారు.
కారు వాకిట ఆగిన శబ్దం విని బ్రహ్మయ్యగారి ప్రక్క ఇంటి పుండరీకయ్య.... భార్య కవిత బయటికి వచ్చారు. ఆ ముగ్గురినీ సమీపించారు.
రంగాకు నమస్కరించాడు పుండరీకయ్య....
"సార్!... మీకు తెలుగు తెలుసా!... "
తెల్లగా ఆరు అడుగుల ఎత్తు... అయస్కాంతంలాంటి చూపు... తొంభై కేజీల బరువు... కసరత్తు చేసే బాడీ... క్రింది నుండి పై వరకు క్రమబద్ధంగా వున్న అన్ని శరీర భాగాలను చూచిన పుండరీకయ్య గారికి రంగా... నార్తు ఇండియన్ అనే భావన కలిగింది. అందుకే ఆ ప్రశ్న వేశారు.
రంగా ప్రతి నమస్కారం చేసి....
"సార్!... నేను పదహారణాల ఆంధ్రుడిని!... " నవ్వాడు.
"చాలా సంతోషం సార్!... నా మిత్రుడు బ్రహ్మయ్య వారి మనవడు శాలివాహన... ఈ సయ్యద్ సార్ చిన్న కొడుకు యస్. ఐ. సుల్తాన్, భార్య ఆడబిడ్డ దారుణంగా బాంబుల ప్రయోగంతో చంపబడ్డారు. మీరు గొప్పవారు... చేతిలో పవర్ వున్నవారు... సార్!... కాలిపోయిందనుకొనే ధర్మాన్ని బ్రతికించండి సార్!.. అసలు నేరస్థులను పట్టుకొని కఠినంగా శిక్షించి గతించిన వారి ఆత్మలకు శాంతిని కలిగించండి సార్!.. " ఆవేశంగా చెప్పి రంగా చేతులు పట్టుకొన్నాడు పుండరీకయ్య...
పుండరీకయ్య కళ్లల్లో కన్నీరు.
"సార్!... ఆ ద్రోహులనుపట్టుకొని మీరు తప్పక శిక్షించాలి సార్!... నా పెద్ద కొడుకు ఇర్ఫాన్.. నా బావమరిది ఖాజా పంపగా బాంబే పారిపోయాడు. మీరు ఖాజాను పట్టుకొని మీ ట్రీట్మెంటు వాడికి ఇస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి. " తన మనోభిప్రాయాన్ని చెప్పాడు సయ్యద్ సార్.
తల ఆడిస్తూ... సావధానంగా యిరువురూ చెప్పిన విషయాలను విన్నాడు రంగా.
వసంత్ వారు చెప్పిన వ్యక్తుల పేర్లను నోట్ చేసుకొన్నాడు.
రంగా బ్రహ్మయ్యగారి భాగం ముందునుండి ప్రక్కనున్న (సగభాగం) గోపాలయ్యగారి భాగం వైపుకు నడిచారు.
"ఈస్థలం ఎవరిది?... " అడిగాడు కస్తూరి రంగా.
"ఇది బ్రహ్మయ్యగారి అన్న గోపాలయ్యగారిది సార్... "
"వారికి ఎంతమంది సంతానం?.... "
"వివాహం అయిన చాలా కాలానికి ఒక ఆడబిడ్డ కలిగింది... "
"గోపాలయ్యగారు ఉన్నారా!... "
"లేదు సార్!... గతించారు. "
"వారి అమ్మాయి?... "
"అమెరికాలో చదువుతోంది... " పుండరీకయ్య జవాబు.
"అమెరికాలోనా!... "
"అవును సార్!... "
"ఏం చదువుతోంది?... "
"ఆ విషయం మాకు తెలియదు సార్!.. "
"ఎవరికి తెలుసు?... ".
"అడ్వకేట్ కృష్ణమూర్తి విజయవాడ... వారి మేనత్త దుర్గాదేవి, బావలు భూషణ్ కుమార్.. శ్యామ్ కుమార్... వారికి తెలుసు సార్!... ".
"వారుండేది ఎక్కడ సార్?... " రంగా ప్రశ్న.
"కృష్ణమూర్తి వుండేది విజయవాడ... మిగిలినవారంతా వుండేది హైదరాబాద్ సార్!... "
"సార్!... "
"అడగండి సార్!... "
"దుర్గాదేవి... భూషణ్ కుమార్... శ్యామ్ కుమార్ అందరూ కలిసే వుంటున్నారా!... వారి ఇల్లు హైదరాబాద్ లో ఎక్కడ?.. ".
"అంతా కలిసే వుంటారు సార్. వారికేం తక్కువ సార్!... ఆ నగరంలో వారికి నాలుగైదు భవంతులు వున్నాయట సార్... దుర్గమ్మ భర్త నాగేంద్రరావు ఆ కాలంలో లిక్కర్ ఏజంట్ సార్. బాగా సంపాదించారని ప్రసిద్ది. " చిరునవ్వుతో చెప్పాడు పుండరీకయ్య.
"సయ్యద్ సార్!... " అతని ముఖంలోకి చూచి పిలిచాడు రంగ.
"సార్!... "
"మీ బావమరిది పేరు?... ".
"ఖాజా సార్!... "
"వారు ఏం వ్యాపారాలు చేస్తుంటారు?... "
"వాడు నీచుడు సార్!... అన్నిరకాల వ్యాపారాలు కాలానుగుణంగా చేస్తూవుంటాడు. "
"వారి వయస్సు?... "
"యాభై పై మాట... "
"వివాహం!... "
"ఒకటి కాదు సార్... మూడు... "
"పిల్లలు ఎంతమంది?... "
"నాకు తెలీదు సార్!... "
"వారి విలాసం?... "
"పంజాగుట్ట.. "
"సయ్యద్ సార్!... పుండరీకయ్య సార్ !... నాకు కావాల్సిన అనేక విషయాలు వివరంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. " వసంత్ వైపుచూచి...
“వసంత్... బయలుదేరుదాం!... " అన్నాడు కస్తూరి రంగ.
"అలాగే సర్!... "
వసంత్ తన సెల్లో కస్తూరి రంగ ఇతరులతో చేసిన ప్రతి సంభాషణను రికార్డు చేశాడు.
రంగా... వసంత్ వారికి నమస్కరించి కారు ఎక్కారు.
సయ్యద్ సార్, పుండరీకయ్య సార్ చేతులు పైకెత్తి బై చెప్పారు.
వసంత్ కారును కదిలించాడు.
***
-----------------------------------------------------------------------------------------
ఇంకా వుంది...
-----------------------------------------------------------------------------------------
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comments